'Adivaram Adavallaku Selavu' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 18/03/2024
'ఆదివారం ఆడవాళ్ళకు సెలవు' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"భాగ్యం! భాగ్యం! ఎక్కడున్నావే! ఒకసారి ఇలా రా!"
"వంటింట్లో పనిలో ఉన్నాను.. చెప్పండి ఏమిటి?"
"ఆదివారం స్పెషల్ వంటకం చేస్తావా? దాని కోసం సరుకులు తెచ్చుకుంటావని పిలిచాను.. "
"ఏవండీ.. ! అన్ని పనులు నేనే చెయ్యలా?"
"చెయ్యాలి! అన్నీ చెయ్యాలి.. నేను ఆఫీస్ కు వెళ్ళట్లేదు మరి.. "
"ఉదయం వెళ్లి సాయంత్రం వస్తారు.. దర్జాగా.. ఫ్యాన్ కింద కూర్చొని చేసే పనీ.. ఒక పనేనా.. ? నేను చూడండి.. ఇంట్లో పని.. బయట పని.. అన్నీ చేసుకోవాలి.. ఎండైన, వానైనా.. బయటకు వెళ్ళాలి కదా!.. "
"మగాడ్ని.. సంపాదించి తేవడం నా వంతు.. ఇల్లు అంతా చూసుకోవడం ఆడదానిగా నీ వంతు"
"అదేమిటండి!.. మాకు రోజు రోజుకు పనులు ఎక్కువ అయిపోతున్నాయి.. కొంచం హెల్ప్ చెయ్యండి!"
"లేదు భాగ్యం!.. నేను ఎంత అలసిపోయి ఇంటికి వస్తున్నానో తెలుసా?.. కాళ్ళు నొప్పులు.. వొళ్ళు నొప్పులు.. "
"మాకూ ఉంటాయండి నొప్పులు.. !" అంది భాగ్యం.
"ఇంట్లోనే కదా! మీరు తిరగడం.. మీకేంటి కష్టం" అని గట్టిగా అడిగాడు భర్త.
"అలా అనకండి.. సరుకుల కోసం బయటకు వెళ్ళాలి.. బయట పనులు కుడా ఎక్కువే ఉంటాయండి! ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోయే రోజులు ఎప్పుడు వస్తాయో?.. "
"బ్రహ్మంగారి పుస్తకం చూసి చేబుతానులే.. అప్పటి దాక తప్పదు మరి.. చెయ్యాలి" అని వెటకారం చేసాడు భ.
రోజూ.. భాగ్యం ఉదయాన్నే నిద్ర లేచి.. ఇంట్లో భర్త కు వంట చేసి.. ఆఫీస్ కు బాక్స్ ఇవ్వాలి. భర్త ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత.. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి.. పనిమనిషిని పెట్టుకునే అంత వెసులు బాటు లేదు ఇంట్లో. తర్వాత బయటకు వెళ్లి సామాన్లు తెచ్చుకోవాలి.. అన్నీ చేసుకోవాలి పాపం.. ఎండైనా.. వానైనా.. వొంట్లో బాగోలేకపోయినా సరే!..
"కాలింగ్ బెల్ మోగింది.. ఎవరో వచ్చినట్టున్నారు.. " అనుకుని తలుపు తీయడానికి వెళ్ళింది భాగ్యం.
"కాంతం! నువ్వా! ఎలా ఉన్నావు.. ?"
"ఏదో.. ఇలా ఉన్నానే.. "
కాంతం.. అదే కాలనీ లో ఉండే భాగ్యం స్నేహితురాలు
"ఏమిటే విషయాలు?.. చేతికి ఏమైందే.. ?" అడిగింది భాగ్యం.
"మొన్న వంట చేస్తున్నప్పుడు కాలింది.. " చెప్పింది కాంతం.
"మరి రెస్ట్ తీసుకోవచ్చుగా.. ?"
"ఇంట్లో పని ఎవరు చేస్తారు?.. అసలే మా ఆయన కు చాలా కోపం.. టైం కి అన్నీ చేసి పెట్టాలి.. " అంది కాంతం.
"మీ ఆయన ఇంటి పనిలో నీకు సహాయం చేస్తారా.. ?"
"లేదు భాగ్యం.. అన్నీ నేనే చూసుకోవాలి.. "
"ఇక్కడా.. అదే పరిస్థితి కాంతం"
"నీకూ.. నాకూ కాదే.. అందరి ఆడవారి పరిస్థితి ఇంతే.. ! మనమందరం మీటింగ్ పెట్టుకోవాలే!.. కాలనీ మీటింగ్.. ఈ ఆదివారం అందరం కలుద్దాం.. "
"ఆదివారం వద్దే!.. ఆ రోజే అన్ని రోజుల కన్నా.. ఎక్కువ పనుంటుంది.. మొగుళ్ళు ఇంట్లో ఉంటారు కదా!. అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతూనే ఉంటారు.. "
"పోనిలే! శనివారం పెట్టుకుందాం.. అయితే అందరికీ కబురు చేస్తాను.. "
"అలాగే.. " అని చెప్పి వెళ్ళింది కాంతం
"అనుకున్న ప్రకారం.. శనివారం అందరూ కలిసారు. ఆడవారందరూ తమ తమ కష్టాలు చెప్పుకున్నారు. అందరిదీ.. ఇదే సమస్య.. మగవారికైనా.. ఆదివారం, పండుగలకి సెలవుంది.. కానీ మనికి మాత్రం అప్పుడే పని ఎక్కువ ఉంటుంది.. అస్సలు తీరిక ఉండదు. మనకీ ఒక రోజు సెలవు కావాలి కదా !" అని అందరూ చర్చించుకున్నారు..
"అందరూ.. ఇకమీదట.. ఆదివారం సెలవు కావాలని.. భర్తలను అడుగుదాం.. "
"ఒప్పుకోరు.. తిడతారు.. " అని అందరూ అన్నారు.
"మరి వంట, ఇంటిపనులు ఎవరు చేస్తారు.. ఆ రోజు?"
"మగవారు చెయ్యాలి.. సంసారంలో వారు కుడా సగ భాగమే కదా!.. ఒక్క రోజు చెయ్యలేరా?"
"అడిగి చూద్దాం!" అని నిర్ణయించుకున్నారు అంతా.. మళ్లీ వచ్చే శనివారం కల్లుదాం అని అందరూ వెళ్ళిపోయారు..
ఇంటికి వచ్చి భాగ్యం.. భర్తతో..
"ఏమండీ! మిమల్ని ఒక విషయం అడగాలి.. "
"చెప్పు భాగ్యం.. "
"నాకు ఆదివారం సెలవు కావాలండీ.. ప్రతి ఆదివారం.. అందరు ఆడవారు తీసుకుంటున్నారు"
"ఎందుకో.. ?"
"రెస్ట్ కోసం అండి.. " అంది భాగ్యం.
"కుదరదంతే!.. మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు?" అని తిట్టాడు భర్త.
అందరింట్లో.. సుమారు ఇదే పరిస్థితి నడిచింది..
శనివారం మీటింగ్ లో అందరూ ఇదే మాట చెప్పారు.. మొగుళ్ళు ఒప్పుకోవట్లేదని..
"అయితే ఒక చట్టం తీసుకువద్దాం.. "
"చట్టమా.. ?" అని ఆశ్చర్యంగా అడిగారు అందరూ..
మనకి బోలెడు సంఘాలు ఉన్నాయి.. వాళ్ళ సహాయం తో ఉద్యమాలు చేద్దాం.. వాళ్ళు మనకు సపోర్ట్ ఇస్తారు. నాకు తెలిసి.. మహిళల అందరికీ ఇదే సమస్య ఉంటుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా మన లాంటి అక్కాచెల్లెళ్ళ కష్టాలు చూసి స్పందిస్తారు.. అందరూ వెళ్లి ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నారు. ఉద్యమాలు చాలా రోజులు నడిచాయి. రోజు రోజుకూ ఎందరో ఆడవాళ్ళు ఉద్యమాల్లో చేరుతున్నారు. మొత్తం రాష్ట్రాన్నే ఒక ఊపు ఊపింది.. ఈ ఉద్యమం. ఈ వార్త ముఖ్యమంత్రి దాకా వెళ్ళింది.
"మన ఆడబిడ్డలు ఇంత కష్టపడుతున్నారా? ఈ రాష్టంలో.. ! ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఆదివారం నుంచి.. ప్రతీ ఆదివారం.. మన రాష్ట్రంలో ఉన్న మహిళల అందరికీ ఇంటిపని నుంచి సెలవు ప్రకటిస్తున్నాను. ఆర్డర్ పాస్ చేస్తున్నాను.. అందరూ మద్దతు ఇవ్వాలి.. " అని ఆర్డర్ పాస్ చేసారు ముఖ్యమంత్రి గారు
"ఆ రోజు మరి ఇంటి పని ఎవరు చేస్తారు సార్.. ?" అడిగారు మంత్రులు..
"ఆ ఆర్డర్ లో ఇది కూడా కలపండి.. అవకాశముంటే.. పనివాళ్ళ చేత.. లేకపోతే.. ఇంట్లో మగవారు చేసుకోవొచ్చు.. ఎక్కడా ఆడవారి ప్రేమేయం లేకుండా.. !"
అది ఎన్నికలు దగ్గర పడే సమయం కాబట్టి.. ఆడవారి బిల్ వెంటనే పాస్ అయిపోయింది. మగవారంతా వంటింట్లో.. గరిటలు పట్టుకుని వంటలు మొదలుపెట్టారు. వంట పుస్తకాలకు డిమాండ్ బాగా పెరిగింది. వంటల కోసం కోచింగ్ సెంటర్లు కూడా స్టార్ట్ చేసారు కొంత మంది..
ఆడవారంతా.. ఆదివారం కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉండే రోజులు వచ్చేసాయి..
ఒక ఆదివారం భాగ్యం.. భర్త తో..
"ఏవండీ! కొంచం కాఫీ ఇస్తారా..? గొంతు తడి ఆరిపోతోంది.. !"
**************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments