'Agandi' New Telugu Story Written By Padmavathi Divakarla
'ఆగండి' తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
పెళ్ళిపందిరి చాలా సందడిగా, హడావుడిగా ఉంది. పెళ్ళికి విచ్చేసిన జనంతో ఆ కళ్యాణ మంటపమంతా కళకళలాడుతోంది. ఇన్నాళ్ళూ పెళ్ళికాని ప్రసాదులా మిగిలిపోయిన సుబ్బారావుకి, గొంతెమ్మ కోరికలతో ముదిరిపోయిన సుబ్బలక్ష్మికి త్వరలో ముడి పడబోతోంది. ఏ అవాంతరాలూ లేకుండా నిర్విఘ్నంగా పెళ్ళి జరిగిపోవాలని వాళ్ళిద్దరూ మనసులోనే దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.
ఎట్టకేలకు వాళ్ళిద్దరూ ఓ ఇంటివాళ్ళు అవబోతున్నందుకు సంతోషించిన ఇరుపక్కల చుట్టాలు, పక్కాలు నూతన దంపతులకి అక్షింతలు వెయ్యడానికి తయారుగా ఉన్నారు. సుబ్బారావు ఇన్నాళ్ళకి తమ జనజీవన స్రవంతిలో కలవబోతున్నందుకు అతని స్నేహితులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. పెళ్ళి ముహూర్తం సమీపించింది. సుబ్బారావు సుబ్బలక్ష్మి మెడలో తాళి కట్టబోతున్నాడు. ఇంకో క్షణంలో తాళి కట్టబోతాడనగా అప్పుడు జరిగింది ఎవ్వరూ ఎదురుచూడని, ఎదురు చూడకూడని సంఘటన.
"ఆగండి!...అగండి!!..." అని గట్టిగా వినిపించడంతో అందరూ ఒక్కసారి మాన్పడిపోయారు.
ఈ హఠాత్పరిణామానికి ఒక్కక్షణం అ మంటపమంతా నిశ్శబ్దం ఆవరించింది. కొత్త దంపతులమీద అక్షింతలు వెయ్యడానికి రెడీగా ఉన్న పెద్దలందరూ నిశ్చేష్టులయ్యారు. పురోహితుడి నోట మంత్రాలు రావడం ఆగిపోయి నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయింది. బాజాభజంత్రీవాళ్ళ చేతులు పని చెయ్యడం మానేసాయి. పనీ పాటా లేని అసూయాపరులు కొంతమంది చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. ఎవరో మంత్రించినట్లు అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఎవరు 'ఆగండి!' అన్నారో తెలియక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
మొగపెళ్ళివారివంక ఆడపెళ్ళివారు చూస్తే, ఆడపెళ్ళివారివంక మగపెళ్ళివారు అనుమానంగా చూడసాగారు. ఏమి జరిగిందో తెలియక ఆడపెళ్ళివారు బెంగపెట్టుకున్నారు. మగపెళ్ళివారి సంగతీ డిటో! డిటో!! ఈ పెళ్ళి ఆగిపోతే సుబ్బారావు మళ్ళీ పెళ్ళికాని ప్రసాద్గానే మిగిలిపోతాడన్నది వాళ్ళ చింత మరి! అలాగే సుబ్బలక్ష్మికి మళ్ళీ పెళ్ళి పందిరి ఎక్కే యోగం ఉందోలేదోనని ఆమె తరఫు వాళ్ళు తెగ బెంగ పెట్టేసుకున్నారు.
పెళ్ళికి వచ్చిన ఆహూతులైతే ఒక వేళ ఈ పెళ్ళి ఆగిపోతే తాము ఇచ్చిన బహుమతులు తిరిగి తీసుకెళ్ళగలమో లేదోనని మనసులోనే మధన పడసాగారు. సరిగ్గా అప్పుడే జరిగిందా సంఘటన. హడావుడిగా అక్కడికి దూసుకొచ్చిన ఓ వ్యక్తి, అక్కడే ఓ కుర్చీమీద పెట్టిన తన వీడియో కెమెరా చేతులోకి తీసుకొని మంటపం వద్దకు పరుగెట్టాడు.
"క్షమించండి! హఠాత్తుగా వాష్ రూంకి వెళ్ళవలసి వచ్చింది. అందుకే ఆగమని అన్నాను." అని అందరికీ సంజాయిషీ ఇచ్చి, పెళ్ళికొడుకుని ఉద్దేశించి 'ఆఁ...ఇప్పుడు కట్టండి తాళి! ఇద్దరూ ఇటు చూసి కొద్దిగా నవ్వండి!" అన్నాడు ఆ వీడియోగ్రాఫర్.
అప్పుడు అందరికీ విషయం పూర్తిగా అర్థమై తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. సుబ్బారావుకి, సుబ్బలక్ష్మికీ ప్రాణం లేచివచ్చి ఒకరి మొహలోకరు సంతోషంగా చూసుకున్నారు.
***
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments