top of page
Writer's pictureSathyanarayana Murthy M R V

ముత్యాల గొడుగు



'Muthyala Godugu' New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'ముత్యాల గొడుగు' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఒకే న్యూస్ క్లిప్పింగ్ ని అర్ధరాత్రి పన్నెండింటి వరకూ చూపిస్తూ విసిగించే ‘అబ్బో’ న్యూస్ చానల్ లా, ప్రొద్దుట నుండీ విడవకుండా కురుస్తోంది వర్షం. అది చూసి ముకుందరావు, పవన్ కళ్యాన్ సినిమా కి మొదటి ఆట కి టికెట్ దొరికిన కుర్రాడిలా ఆనందపడ్డాడు.


ఎందుకంటే అతని భార్య సత్య భామ ఉదయం గుడికి వెళ్దాం అంది. ఈ వర్షం వలన గుడికి వెళ్ళే ప్రోగ్రాం కి ‘డుమ్మా’ కొట్టొచ్చని అతని ఆశ. ఈరోజు ముకుందరావు, సత్యభామల ముప్పయ్యవ పెళ్లిరోజు.


ఉదయం ఆరుగంటలకే కొడుకూ, కూతురూ ముందుగా తల్లికి ‘శుభాకాంక్షలు’ చెప్పి ఆ తర్వాత ముకుందరావు కి చెప్పారు.


‘ఈరోజు అది చెయ్యి, ఇది చెయ్య’ అని అమ్మని ఇబ్బంది పెట్టొద్ద’ని, ‘నీకేం కావలిస్తే అవి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకో’మని కూతురు సుప్రజా తండ్రికి ఫోన్ లోనే వార్నింగ్ ఇచ్చింది.


ఆరుగంటల నుండీ ఏడు గంటలవరకూ, సత్యభామ అక్కలూ, చెల్లెళ్ళూ ఆమెకి విషెస్ చెబుతూనే ఉన్నారు. ఏడు గంటలైనా ‘కాఫీ’ గొంతులో పడకపోవడం వలన ముకుందరావు పళ్ళు ‘టైపు’ కొట్టేస్తున్నాయి. చిన్నప్పటి నుండీ ముకుందరావు ఆకలికి ఆగలేడు.


ఆ విషయం కోడలు సత్యభామ కి చెప్పి, ‘మా ముకుందాన్ని జాగ్రత్తగా చూసుకో’ అని కూడా చెప్పింది ముకుందరావు తల్లి జానకమ్మ.


కొంతకాలం అతన్ని బాగానే చూసుకుంది సత్యభామ. తర్వాత అతన్ని పట్టించుకోవడం తగ్గించింది.


సత్యభామ ‘ఫోన్ ఖుషీ యాత్ర’ ఇప్పుడప్పుడే తెమిలేలా లేదన్న విషయం, ‘బందరు లడ్డు తియ్యగా ఉంటుందన్న పరమ సత్యం’ లా బోధపడి, వంటింట్లోకి వెళ్లి కాఫీ తయారు చేసాడు ముకుందరావు. ముందుగా తానో కప్పు కాఫీ తాగి, సంతృప్తి పడి, భార్యకో కప్పు కాఫీ ఇచ్చాడు.


ఎందుకంటే, కాఫీ సరిగా లేకపోతే, ‘ఏ ఒక్కటే సరిగా చెయ్యరు. మీ అమ్మ మీకు సరిగా ఏం నేర్పలేదు’ అని విసుక్కుంటుంది. స్వర్గాన ఉన్న తల్లిని తిట్టించండం అతనికి ఇష్టం లేదు. అందుకే కాఫీ అయినా, టీ అయినా తాను చేయవలసిన ‘పరిస్థితి’ ఏర్పడినప్పుడు, దానిని తాను చూసి, బాగుంటేనే భార్యకి ఇస్తాడు. అది అతనికి చాలా సార్లు అనుభవం అయ్యింది

సత్య భామ, కాఫీ ఓ గుక్క తాగి ‘బాగుంది’ అన్నట్టు భర్త కేసి చూసి ఓ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూసి చాలా ఆనందపడ్డాడు ముకుందరావు. పెళ్లి చూపులలో ‘ఆ నవ్వు చూసే’ బోల్తాపడి ఆమెతో పెళ్ళికి సిద్ధమయాడు ముకుందరావు.


‘ఒరేయ్ ముకుందం, పిల్ల కొంచెం ‘గర్విష్టి’ లా ఉందిరా. నువ్వు అసలే నోట్లో నాలుక లేని వాడివి. ఆ పిల్లతో వేగలేవు’ అని జానకమ్మ అన్నా, వినకుండా సత్య భామ మెళ్ళో, మూడు ముళ్ళూ వేసాడు ముకుందరావు.


ఎనిమిది గంటలకు సత్యభామ ‘ఫోన్ మాట్లాడటం’ అనే బృహత్తర కార్యక్రమాన్ని ముగించి కిటికీ లోంచి చూసింది. చాలా చిన్న జల్లులా పడుతోంది వాన. తల పైకెత్తి ఆకాశం కేసి చూసింది. కౌసికుడి చూపు పడి, మాడిపోయిన కొంగ లా, తను మాడిపోతానేమోనని ‘వరుణుడు’ వడివడి గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


వాన ఆగిపోయింది, సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. సత్య భామ పెదవులపై దరహాస కుసుమం విరిసింది.


“ఏవండోయ్, వర్షం తగ్గింది. నేను స్నానానికి వెళ్తున్నాను. మీరు కూడా రెండో బాత్రూం లో స్నానం చేసి రండి. తలకి షాంపూ పెట్టుకోండి చక్కగా. ఇద్దరం గుడికి వెళ్దాం” అని గట్టిగా చెప్పింది సత్యభామ.


‘రేపు ఆదివారమైనా సరే, స్కూల్ కి రావాల్సిందే, ఎగస్ట్రా క్లాసు ఉంది’ అని హుకుం జారీ చేసిన టీచర్ కేసి చూసి, డీలా పడిన ఏడో తరగతి కుర్రాడిలా చిరాకు పడ్డాడు ముకుంద రావు.


ముక్కుతూ, మూల్గుతూ నడిచే భీమవరం పాసింజర్ రైలు లా, కాళ్ళీడ్చుకుంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు ముకుందరావు. తొమ్మిది గంటలకు ఇద్దరి స్నానాలు, పూజలూ అయ్యాయి. జీడిపప్పు, కిస్ మిస్ లతో ముకుందరావు కి ఇష్టమైన ‘సేమ్యా పాయసం’ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి, వంటింట్లో కి వచ్చిన సత్యభామ ‘కెవ్వున’ కేక వేసింది.


‘ఏమైంది ?’ అంటూ కంగారుగా వచ్చాడు ముకుందరావు.


కుడి చెయ్యి పట్టుకొని బాధపడుతోంది సత్యభామ.


”స్టవ్ దగ్గర బొద్దింక కనపడింది. దాన్ని అదిలిద్దామని కుడి చేత్తో ‘హుష్’ అని అన్నాను. పొరపాటున చెయ్యి స్టవ్ కి తగిలింది” అంది సత్యభామ.


‘అయ్యయ్యో’ అని బాధ పడ్డాడు ముకుందరావు. ఆమెని నెమ్మదిగా తీసుకుని వచ్చి హాలులో సోఫా లో కూర్చో పెట్టి ఫ్యాన్ వేసాడు. ఆమె ‘సలహా’ మీదే తడిగుడ్డ తీసుకువచ్చి కుడిచేతికి చుట్టాడు. జండూ బాం రాస్తానంటే ‘వద్దంది ‘ సత్యభామ భర్తతో.


బయట ఎండ చుర చుర లాడుతోంది. ’నీకిలా అయ్యింది కదా, గుడి ప్రోగ్రాం మానేద్దాం ‘ అన్నాడు ముకుందరావు బాధ నటిస్తూ.


ఎడం చేత్తో తన రెండు చెంపలూ సున్నితంగా తాకింది సత్యభామ.


“అపచారం.. అపచారం. ఈరోజు గుడికి నడిచి వస్తానని మొక్కుకున్నాను. అయినా గుడి ఎంత దూరం.. అర కిలో మీటరేగా. పదండి “అని సోఫా లోంచి లేచి, తడిగుడ్డ టీ పాయ్ మీద పెట్టింది.

“బయట ఎండ ఎక్కువగా ఉంది సత్యా.. ” నసుగుతూ అన్నాడు ముకుందరావు. భర్త కేసి చూసి చిరునవ్వు నవ్వింది సత్యభామ.


“మీకు స్నాతకం నాడు మావాళ్ళు ఇచ్చిన గొడుగు ఉందిగా.. అది తీసుకు రండి “ అంది సత్యభామ.


“అంత పాత గొడుగా ?” ఆశ్చర్యంగా అడిగాడు ముకుందరావు.


“భలేవారే. అది సింగపూర్ నుండి మా పిన్ని కొడుకు మిథున్ పంపాడు. చాలా ఖరీదైనది, మంచి క్వాలిటీ ఉన్నదీ. అయినా మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు మా చెల్లాయి కిరణ్మయి దాన్ని సరి చేసింది. నాకు చెయ్యి నొప్పి కాబట్టి మిమ్మల్ని బతిమాలవలసి వస్తోంది” బుంగ మూతి పెట్టింది సత్యభామ.


భార్యని ఏమనలేక బెడ్ రూమ్ లోకి వెళ్లి, బీరువా వెనక ఉన్న గొడుగు తీసుకువచ్చాడు ముకుందరావు.


ఇంటికి తాళం వేసి బయటకు వచ్చారు ఇద్దరూ.


“నాకు చెయ్యి నొప్పిగా ఉంది. మీరే గొడుగు వెయ్యండి. నెమ్మదిగా నడుచుకుంటూ గుడికి వెళ్దాం” తాపీగా అంది సత్యభామ.


గొడుగు తెరిచిన ముకుంద రావు ఆశ్చర్యపోయాడు. గొడుగు చివర్ల నుండి దండల్లా ముత్యాలు వేలాడుతున్నాయి. గొడుగు పైన రంగు రంగుల పూలు కుట్టి ఉన్నాయి. రాఘవేంద్ర రావు సినిమాలో హీరో, హీరోయిన్ ల ఊటీ సాంగ్ కోసం తయారు చేసిన గొడుగులా, చాలా అందంగా ఉంది.


“ఈ గొడుగు లో మనం ఇద్దరం గుడికి వెళ్ళడం బాగుండదేమో సత్యా.. ” సిగ్గుగా అన్నాడు ముకుంద రావు.


“ఏం, నేను కాకుండా, మీ ఆఫీస్ స్టెనో ‘పంకజం’ తో కలిసి వెళ్తే బాగుంటుందా?” వెటకారంగా అడిగింది సత్యభామ.


పరిస్థితి ఇంకోలా మారే ప్రమాదం పసిగట్టాడు ముకుందరావు. ఇష్టం లేకుండా యజమానితో కలిసి పార్క్ కు వెళ్తున్న కుక్కపిల్ల లా, ఒకే గొడుగు కింద భార్య తో కలిసి నడుస్తున్నాడు ముకుందరావు.


శివపురం లోని మునసబు గారి వీధిలో నడుస్తున్న వాళ్ళు ఇద్దర్నీ చూసి నవ్వుతున్నారు కొంతమంది.


బ్యాంకు ఆఫీసర్ సుబ్బారావు గారి అమ్మాయి దీప్తి బయటకు వచ్చి వారితో కలిసి ‘సెల్ఫీ’ దిగింది.

అది చూసి మరికొంతమంది ఆడపిల్లలు వచ్చి సెల్ఫీలు దిగారు.


ప్రతీదీ ఫేస్బుక్ లో పెట్టే ‘వరుణ్’ వాళ్ళని ఫాలో అయ్యి వీడియో తీసి అప్లోడ్ చేసాడు.


డిగ్రీ కాలేజీ కి వెళ్ళే ఆడపిల్లలు సత్యభామ, ముకుంద రావు లను అనుసరిస్తూ నడుస్తున్నారు.

సత్యభామ పెళ్లి కూతురిలా నెమ్మదిగా నడుస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ముకుంద రావు మాత్రం, నడి రోడ్డు మీద ‘ఫాంట్ జారిపోయిన’ పిల్లాడిలా సిగ్గుతో చితికి పోతూ, ఆమెకి ముత్యాల గొడుగు పడుతూ నడుస్తున్నాడు. వాళ్ళు వీధి దాటి మెయిన్ బజార్ కి రావడానికి ఇరవై నిముషాలు పట్టింది. ఈలోగా నలభై మంది ఫోటోలు తీసారు వాళ్ళు ఇద్దర్నీ.


మెయిన్ రోడ్ లోని గాంధీ బొమ్మల సెంటర్ దగ్గరకు వచ్చేసరికి, ఓ మోటార్ సైకిల్ వచ్చి వారి పక్కనే ఆగింది. ఒక యువకుడు, ఒక యువతి దిగారు మోటార్ సైకిల్ మీద నుంచి. అమ్మాయి చేతిలో మైక్ ఉంది. అబ్బాయి భుజాన కెమెరా ఉంది.


“హాయ్.. మేము ‘ జాయ్ జాయ్’ టి. వి. నుండి వస్తున్నాము. ఇప్పుడే మీ గురించి పేస్ బుక్ లో చూసాము. చెప్పండి సర్. మీరు ఇలా నడుచుకుంటూ ‘బెజవాడ’ వరకూ.. ?” అడిగింది యాంకర్. అబ్బాయి కెమెరా ఆన్ చేసాడు.


ఆ ప్రశ్నకి కంగారు పడిపోయాడు ముకుంద రావు. “లేదండి. కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వరకే” అన్నాడు.


యాంకర్ అమ్మాయి సత్యభామతో సెల్ఫీ దిగి, ఆమె బుగ్గ గిల్లింది సుతారంగా. ‘మీరు చాలా క్యూట్ గా ఉన్నారు’ అంది నవ్వుతూ. ఆమె పొగడ్తకు ఆనందపడింది సత్యభామ.


“మేడం, విశాల నేత్రాలు నవలలో, ధనుర్దాసు, హేమాంబ జంటలా మీ జంట చూడ ముచ్చటగా ఉంది. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని సినిమా లో హీరోయిన్ గా నటించమంటే ఒప్పుకుంటారా?” అడిగింది యాంకర్ అమ్మాయి.


‘తప్పకుండా’ అంది సత్యభామ హొయలు పోతూ. ఈ మధ్యనే డైటింగ్ చేసి, స్లిమ్ గా తయారయ్యింది సత్యభామ.


యాంకర్ అమ్మాయి ముకుందరావు కేసి తిరిగింది. ”నిజంగా మీరు గ్రేట్ సర్. భార్య, ఎండకి కందిపోకుండా ‘ముత్యాల గొడుగు ‘ లో తీసుకు వెళ్తున్న మీరు ప్రేమికులు అందరికీ ఆదర్శం సర్. మీ పేరు?” అడిగింది ఆ అమ్మాయి.


‘ముకుంద రావు’ అన్నాడు నవ్వు మొహానికి అతికించుకుని.


పది నిముషాలు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వచ్చినంత వేగంగానూ వెళ్లి పోయారు ఇద్దరూ. దారిలో చాలా మంది వారిని ఫోటోలు తీసుకున్నారు. నెమ్మదిగా నడుచుకుంటూ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికివచ్చారు సత్యభామ, ముకుంద రావు.


గుడి బయట తమిళనాడు నుంచి, కర్నాటక నుంచి రెండు టూరిస్ట్ బస్సులు వచ్చాయి. ముత్యాల గొడుగు లో వస్తున్న వీళ్ళని చూసి యాత్రీకులు ఆశ్చర్య పోయారు.


‘ఏమైనా, మొక్కా.. ఇలా వస్తున్నారు?’ అడిగారు ఒకరిద్దరు.


‘లేదండి ఇవాళ మా ముప్ఫయ్యవ పెళ్లి రోజు. అందుకే ఇలా వచ్చాం’ అంది సత్యభామ హొయలు పోతూ.


యాత్రీకులు చాలా మంది వాళ్ళతో సెల్ఫీలు దిగారు. బెంగళూరు నుండి వచ్చిన యువ జంట, ముకుంద రావు ని రిక్వెస్ట్ చేసి, ముత్యాల గొడుగు తీసుకుని ఆ యువజంట అందులో ఉండి ఫోటో లు, వీడియో తీసుకున్నారు.


ఒక పావుగంట గడిచాక సత్యభామ, ముకుంద రావు గుడిలోకి వెళ్లి, అమ్మవారికి పూజ చేయించుకుని, యధాప్రకారంగా, ‘ముత్యాల గొడుగు’ నీడలో నడుచుకుంటూ ఇంటికి వచ్చారు.

ముకుందరావు మరదలు ‘తిలోత్తమ’ సంక్రాంతికి వచ్చినప్పుడు, గొడుగు రిపేర్ చేయడంతో పాటు అక్క గారి ‘బుర్ర’ కూడా రిపేర్ చేసి, ‘ముత్యాల గొడుగు’ నీడన పాదయాత్రకు ప్లాన్ చేసిందని, ‘జాయ్.. జాయ్’ టి. వి. వాళ్ళని, వీళ్ళ దగ్గరకు పంపిందని గానీ ముకుందరావు కి తెలీదు.


టివి. లో, పేస్ బుక్ లో ‘ముత్యాల గొడుగు’ యాత్ర చూసిన ముకుందరావు మిత్రులు, మగ జాతి పరువు తీసావని ‘వాట్స్ అప్ ‘లో ముక్క చివాట్లు పెడుతూ పోస్టింగు లు పెట్టారు.


మహిళా సంఘాల నుండి, తన ఫ్రెండ్స్ నుండి వస్తున్న అభినందనలు అందుకుంటూ మురిసిపోతోంది సత్యభామ.

******

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.



67 views1 comment

1 Comment


Sarada Veluri

Story variety ga vundi.kottha ga vundi .

Like
bottom of page