top of page
Original.png

ఆకలి

#Akali, #ఆకలి, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

ree

Akali - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 06/12/2025

ఆకలి - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

 శ్రీరామ్ కి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో మేనమామ సుందరయ్య తీసుకుని వచ్చి తన దగ్గర పెట్టుకుని పెంచాడు. అయితే దురదృష్టం వెంటాడుతూ వుండటంతో శ్రీరామ్ కి చదువు అబ్బలేదు సరికదా చెడుసహవాసాలు అలవాటు అయ్యాయి. శ్రీరామ్ మేనత్తకి ‘శ్రీరామ్ తన పిల్లలని కూడా చెడకొడతాడేమో.. అందులో తనకి ఆడపిల్ల వుండటం’ తో రోజూ భర్తతో తగాదా పెట్టుకుని, శ్రీరామ్ ని మన ఇంటినుంచి పంపించేయండి అనేది.


“చూడు.. వాడు మా అక్కయ్య కొడుకు. యింకో రెండేళ్లు అయితే 17 ఏళ్ళు వస్తాయి. ఎక్కడో అక్కడ ఉద్యోగం లో పెడ్తాను. చూస్తో చూస్తో వాడిని వదిలేయలేము కదా. యిదే మీ తమ్ముడు అయితే కడుపులో పెట్టుకుని కాపాడవా.. కొద్దిగా ఓపిక పట్టు” అన్నాడు భార్యతో సుందరయ్య. 


“చూడండి, యింట్లో ఎదుగుతున్న ఆడపిల్ల వుంది. ఇటువంటి జులాయిని యింట్లో పెట్టుకోవడం మంచిది కాదు. ఏదైనా అయితే మనమిద్దరం ఏడుస్తూ కూర్చోవాలి” అంది. 


ఒకరోజు సుందరయ్య ఆఫీస్ లో ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. “మీ మేనల్లుడుట. సినిమా హాలు లో బ్లాక్ లో టికెట్స్ అమ్ముతున్నాడు. స్టేషన్ కి పట్టుకొని వచ్చాము, ఒకసారి వచ్చి అతను మీ మేనల్లుడేనా చూసి చెప్పండి” అన్నాడు. 


కంగారుగా పోలీస్ స్టేషన్ కి తనతో పాటు ఇన్స్పెక్టర్ గారికి తెలిసిన తన స్నేహితుడిని తీసుకుని వెళ్ళాడు. అక్కడ గోడకు ఆనుకుని పిచ్చ చూపులు చూస్తున్న మేనల్లుడు ని చూసి కోపంతో పోలీస్ ఇన్స్పెక్టర్ తో, “వీడిని బాగు చెయ్యడం నాకు శక్తికి మించిన పని, మీరు కేసు బుక్ చేసి జైలుకి పంపండి” అన్నాడు సుందరయ్య. 


“మామయ్య, నాకు బుద్ది వచ్చింది, యింక ఇటువంటి పనులు చెయ్యను. నన్ను నమ్మండి, ఏదైనా ఉద్యోగం చూసుకుని బుద్దిగా వుంటాను” అని ఏడవటం మొదలుపెట్టాడు శ్రీరామ్. 


ఇన్స్పెక్టర్ గారు, అతని స్నేహితుడు, సుందరయ్య గారు వేరే రూంలోకి వెళ్లి మాట్లాడుకుని, “సరే మా ఫ్రెండ్ చెప్పాడు అని ఈ సారికి వదిలేస్తాను. వాడికి పనిలేక ఈ వెధవ పనులు చేస్తున్నాడు, నాకు తెలిసిన హోటల్ లో సర్వర్ గా పెడ్తాను. మీకు అభ్యంతరం లేకపోతేనే.. దానితో నాలుగు రూపాయలు సంపాదించటం తెలుస్తుంది” అన్నాడు. 


ఆ ఊరులోనే వున్న శాంతినివాస్ హోటల్ లో సర్వర్ గా చేరాడు శ్రీరామ్. మేనల్లుడు ఈ ఉద్యోగం చెయ్యటం సుందరయ్య కి యిష్టం లేకపోయినా శ్రీరామ్ లో మార్పు వస్తే చాలు అనుకున్నాడు. 


హోటల్ లో సర్వర్ గా చేరటం వలన హోటల్ వాళ్లే సర్వర్లు అందరికి ఒక పెద్ద హాల్ లో ఉండటానికి సదుపాయం కలిపించారు. శ్రీరామ్ కూడా హోటల్ లోనే వుంటాను అంటే సుందరయ్య గారు “ఎందుకురా మన ఇంట్లోనే వుండు” అన్నాడు. 


అప్పుడు సుందరయ్య గారి భార్య కలిపించుకుని “అతను హోటల్  పని చేస్తున్నాడు, టైమింగ్స్ ఎలా వుంటాయో తెలియదు, రోజూ యింత దూరం నుంచి టైముకి హోటల్ కి వెళ్లలేకపోతే ఉద్యోగం లో మాట వస్తుంది. అక్కడే వుండు శ్రీరామ్, సెలవు రోజున వచ్చి మీ మామయ్యకి కనిపించు” అనటంతో శ్రీరామ్ హోటల్ కి సామానుతో సహా వెళ్ళిపోయాడు. 


“సర్వర్ అంటే నీలాగా ఆక్టివ్ గా ఉండాలి, కస్టమర్స్ నీ అణుకువ మెచ్చుకున్నారు” అన్నాడు నెల జీతం యిస్తో హోటల్ యజమాని. 


“అంతా మీ దయ సార్” అని డ్యూటీలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్. 


ఒకరోజున సుందరయ్య గారు వచ్చి శ్రీరామ్ తో చెప్పారు, తనకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని. “అందుకనే వచ్చే వారం ఈ ఊరు వదిలి వెళ్లిపోతున్నాము, నువ్వు జాగ్రత్తగా పనిచేస్తో నువ్వే ఒక హోటల్ పెట్టుకోవాలి అని నా దీవెనలు” అని శ్రీరామ్ చేతిలో ఒక అయిదు వందల నోటు పెట్టి వెళ్ళిపోయాడు. 


తిండికి, ఉండటానికి లోటులేదు. వారం లో రెండు సారులు డబల్ డ్యూటీ చెయ్యడంతో కొద్దిగా జీతం కూడా ఎక్కువే వస్తోంది శ్రీరాంకి.

 

అదే హోటల్ లో కూరగాయలు కట్ చేసే సునీత తో పరిచయం పెరిగింది శ్రీరామ్ కి. సెలవు రోజున యిద్దరూ కలిసి సినిమాలు కి వెళ్లడం, పార్క్ కి వెళ్లడంతో ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. అంతా గమనిస్తున్న హోటల్ యజమాని “మీ పెద్ద వాళ్ళని తీసుకుని రా. మాట్లాడి మీ వివాహం చేయిస్తాను” అన్నాడు.

 

“పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు సార్, వుంటే హోటలు లోనే ఎందుకు ఉండిపోతాను, మీరే మాకు పెద్దవాళ్ళు. మీరే మా పెళ్ళి చేయించండి” అన్నాడు శ్రీరామ్. 


శ్రీరామ్ ని ఉద్యోగం లో పెట్టిన ఇన్స్పెక్టర్ గారికి విషయం చెప్పాడు హోటల్ యజమాని. అతను శ్రీరామ్ ని పిలిచి “మీ మామయ్యగారు ఉండాలిగా. ఆయన కి తెలియచేయడం మంచిది” అన్నాడు. 


“సార్. నేను చేస్తున్నది సర్వర్ ఉద్యోగం, మా మామయ్యగారు తన కూతురినిచ్చి పెళ్లి చెయ్యడు కదా. యింకా ఆయనకు ఈ విషయం చెప్పి బాధ పెట్టడం కంటే చెప్పకుండా వుండటమే మంచిది” అన్నాడు శ్రీరామ్. 


పెళ్లి జరిపించిన హోటల్ యజమాని ఆ రోజు ఉదయం పదిగంటల వరకు హోటల్ కి వచ్చిన వాళ్ళకి టిఫిన్ ఉచితంగా పెట్టాడు. 


రోజులు వేగంగా గడుస్తున్నాయి. రెండు సంవత్సరాలు అయినా సంతానం లేకపోవడంతో డాక్టర్ కి చూపించుకున్న శ్రీరామ్ దంపతులకు సంతానం కలగడం కష్టం అని తెలిసి విచారం తో క్రుంగి పోయారు. 


ఉదయం హోటల్ తలుపులు తీసి పనులు చేసుకుంటున్న వర్కర్స్ కి పిడుగులాంటి వార్త, తమ యజమాని ఉదయం హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అని. 


అమెరికాలో వున్న కొడుకు వచ్చి తండ్రికి చెయ్యాలిసిన కార్యక్రమాలు చేసాడు. యజమాని చనిపోయిన రోజున మూత పడిన హోటల్ యిహ తెరవలేదు. యజమాని కొడుకు అమెరికా తిరిగి వెళ్ళిపోతో హోటల్ లో పనిచేసిన వాళ్ళకి ఒక నెల జీతం యిచ్చి “మీరు యిహ వేరే పని చూసుకోండి. యింక హోటల్ తెరవము” అని చెప్పాడు. 


ఇన్నాళ్ళు హోటల్ లోనే వున్న ఉద్యోగులు యిప్పుడు ఎక్కడ ఉండాలి, ఎలా వేరే ఉద్యోగం సంపాదించాలి అని దిగులుపడ్డారు. 


శ్రీరామ్ భార్యతో సహా రైల్వేస్టేషన్ కి వెళ్లి అక్కడే వుండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. 

“యిహ ఈ ఊర్లో వుండి లాభం లేదు. పట్నం వెళదాం. అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి. ఏదో ఉద్యోగం దొరుకుతుంది” అన్నాడు భార్యతో. 


ఒకరోజున హైదరాబాద్ చేరుకున్నారు. బాగా అడివిలా పెరిగిన పెద్ద ఖాళీ స్థలం లో శుభ్రం చేసుకుని గుడిసె వేసుకుని ఉద్యోగం కోసం వెతకడం మొదలుపెట్టారు. 


ఎన్ని హోటళ్లు చుట్టూ తిరిగినా గిన్నెలు కడగటం, టేబుల్ తుడవటం లాంటి ఉద్యోగాలు తప్పా సర్వర్ ఉద్యోగం దొరకడం కష్టంగా వుంది. భార్య ని కొంతమంది యింటి వాళ్ళు అంట్లు తోమడానికి పిలిచినా వెళ్లాడానికి యిష్టం లేక పంపించలేదు. 


ఒకరోజున ఉద్యోగం వేటలో బయలుదేరిన శ్రీరామ్ కి అతనిలా ఉద్యోగం కోసం వచ్చిన అతను “ఈ ఉద్యోగం మనకి రాదు కాని, పదా భోజనంకి వెళ్దాం” అన్నాడు. 


“నా దగ్గర అంత డబ్బులు లేవు, ఇంటికి వెళ్లి తింటాను” అన్న శ్రీరామ్ ని చూసి “భలే వాడివే భోజనం కి డబ్బులు ఎందుకు” అంటూ చెయ్యి పట్టుకుని కొంత దూరం తీసుకుని వెళ్లి ఒక ఫంక్షన్ హల్ ముందు ఆగి, “మనం యిక్కడే భోజనం చేస్తాము ఈ రోజు” అన్నాడు. 


“నాకు వీళ్ళు ఎవ్వరో తెలియదు, నేను రాను” అన్నాడు శ్రీరామ్. 

“నాకు మాత్రం తెలుసా, ఈ హైదరాబాద్ లో మనలాంటి వాళ్ళు యిలా భోజనం చేసి హాయిగా వుంటున్నారు. పదా ఆకలి దంచేస్తోంది” అంటూ లోపలికి స్టైల్ గా వెళ్ళాడు శ్రీరామ్ తో. 


స్టేజ్ మీదకి వెళ్లి పెళ్ళికొడుకు పెళ్లికూతురు మీద అక్షింతలు వేసి చక్కగా భోజనం హాలు లోకి వెళ్లి తను ఒక ప్లేట్ తీసుకుని శ్రీరామ్ కి ఒక్కటి యిచ్చాడు. భోజనం హాలు కిటకిటలాడుతోంది. లైన్ లో నిలబడి ప్లేట్స్ చేతిలో పట్టుకుని నుంచున్న వాళ్ళని చూపించి “ఈ జనం లో మనలాంటి వాళ్ళు చాలా మంది వుంటారు. ఎవ్వరు పలకరించిన మాట్లాడకుండా పెద్ద వాళ్ళ సరసన నుంచుని భోజనం చేసి వచ్చేయ్యాలి. 


నేను మూడు నెలల నుంచి తింటున్నాను. ఉద్యోగం కంటే యిదే బాగుంది” అన్నాడు నవ్వుతూ ఆ కొత్త స్నేహితుడు.

 

భోజనం చేసి బయటకు వచ్చి “అబ్బా, ఎంత బాగుందో భోజనం, ఎప్పుడో నేను హోటల్ లో పని చేసినప్పుడు ఒకసారి తిన్నాను” అన్నాడు శ్రీరామ్. 


“సరే రోజూ నన్ను కలువు, యిద్దరం ఉద్యోగం వచ్చేవరకు యిదే పని” అని వెళ్ళిపోయాడు. 


పాన్ నములుకుంటో ఇంటికి చేరిన భర్తని చూసి “ఉద్యోగం దొరికిందా హుషారుగా వున్నారు” అంది శ్రీరామ్ భార్య. 

“నువ్వు భోజనం చెయ్యి, తరువాత చెప్తా” అని చాప మీద పడుకున్నాడు. 


శ్రీరామ్ చెప్పింది విని “అలా పిలవని పేరంటం కి వెళ్లి భోజనం చెయ్యడం తప్పుకదా” అంది. 


“కష్టపడతాను ఉద్యోగం ఇవ్వండి అంటే ఇవ్వని ఈ మనుషులు వున్నప్పుడు మనం యిలా భోజనం చెయ్యడం తప్పులేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నవాళ్ళకి మనలాంటి వాళ్ళు భోజనం చేసి వెళ్తే పెద్ద లెక్కలోకి రాదులే. ఒక విధంగా మనం వాళ్ళకి పుణ్యం యిస్తున్నాము” అన్నాడు నవ్వుతూ. 


రెండో రోజు ఇస్త్రీ చొక్కా ప్యాంటు వేసుకుంటున్న భర్త శ్రీరామ్ తో “వుండు, నేను మంచి చీర కట్టుకుని వస్తాను. భర్తని అనుసరించటమే భార్య ధర్మం” అంది. 


అది చావు భోజనమా, పెళ్లి భోజనమా అనేది చూడకుండా టెంట్ వేసిన ప్రతీ చోటకి భోజనం సమయంకి వెళ్లి జనంలో కలిసిపోయి భోజనం చేసి వస్తున్నారు శ్రీరామ్ దంపతులు. ఎక్కడైనా కూలి పని దొరికితే వెళ్లి ఆ డబ్బు పై ఖర్చులకి వాడుకుంటున్నారు. 


ఆ రోజు యధావిధిగా భార్యభర్తలు చక్కగా తయారై చిక్కడపల్లి లో టెంట్ వేసి హడావుడి ఉండటం చూసి లోపలికి వెళ్లారు. అప్పుడే భోజనాలకి కూర్చుంటున్న వాళ్ళతో పాటు కూర్చొని అరటిఆకు మీద నీళ్లు చల్లుకుని ఎప్పుడు వడ్డిస్తారా అని చూస్తున్నారు. వడ్డన మొదలైంది. విస్తరిలో గారెల నుంచి రకరకాల పదార్ధాలు పడుతున్నాయి. రాత్రికి భోజనం చెయ్యకపోవడం వలన ఆకలిగా వున్న శ్రీరామ్ వేసినవి వేసినట్టు తినడం మొదలుపెట్టాడు. దూరం నుంచి వీళ్ళని గమనిస్తున్న ఒక ఆయన వచ్చి “మీరు ఎవ్వరి తాలూకా, ఎప్పుడు చూడలేదు ఈ తొమ్మిది రోజుల నుంచి” అన్నాడు. 


అలవాటు ప్రకారం “మేము పెండ్లికొడుకు వైపు వాళ్ళం అండి” అన్నాడు శ్రీరామ్. 


ఆమాట విన్న ఆయన అసలే వయసు మీద ఉన్నాడేమో “పెళ్లి ఏమిటిరా? యిది మా మామయ్యగారు పోయిన సందర్బంగా పెడుతున్న భోజనం, ముందు విస్తరి ముందు నుంచి లేవండి, సిగ్గులేదా యిలా వచ్చి భోజనం చెయ్యాడానికి” అంటూ శ్రీరామ్ దంపతుల ముందు వున్న విస్తరులు లాగి క్రింద పడేసాడు. 


శ్రీరామ్ కి సిగ్గుతో లేచి నుంచుని “క్షమించండి. ఆకలి దహించి వేస్తోవుంది. అందుకే యిలా వచ్చాము” అన్నాడు. 


ఇంతలో కేటరింగ్ యజమాని ఈ గొడవ చూసి “పోనీలెండి, మీ మామయ్యగారే ఈ రూపంలో వచ్చారు అనుకోండి. వాళ్ళని భోజనం దగ్గర నుంచి లేపడం మంచిది కాదు” అన్నాడు. 


“నీకేం నువ్వు చెప్తావు. బిల్లు కట్టేది మేముగా” అన్నాడాయన. 

కేటరింగ్ యజమాని కృష్ణ శాస్త్రి గారు “పర్వాలేదు, వాళ్ళిద్దరి భోజనం కి డబ్బులు తీసుకోను లేండి” అన్నా వినకుండా శ్రీరామ్ దంపతులను గేట్ బయటకు నెట్టేసాడు.


పుట్టింది మంచి కుటుంబంలో అయినా సరైన చదువు చదువుకోక చివరికి ఆకలితో దొంగలా భోజనం చేసినందుకు సిగ్గుతో తలవంచుకుని చేతులు కడుగుకుంటున్న శ్రీరామ్ భుజం మీద చెయ్యి పడటంతో వెనక్కి తిరిగి చూస్తే కేటరింగ్ యజమాని కృష్ణ శాస్త్రి రెండు కవర్లు శ్రీరామ్ కి యిచ్చి “ఆలా వెళ్లి భోజనం చెయ్యండి. ఏదైనా పనిచేసుకుని మీ ఆహరం మీరు సంపాదించుకోవడంలో గౌరవం ఉంది. యిలా తెలియని భోజనాలు చెయ్యడం ఎప్పటికైనా అవమానమే” అన్నాడు. 


“సార్, మేము యిద్దరం హోటల్ లో పనిచేసిన వాళ్ళమే. మా దురదృష్టం.. హోటల్ యజమాని వృద్ధాప్యం తో చనిపోవడంతో మాకు ఎక్కడా ఉద్యోగం దొరకక యిలా బ్రతుకుతున్నాము. మాకు ఉద్యోగం లేదని ఆకలికి తెలియదు కదా సార్” అన్నాడు ఏడుస్తూ. 


“మీరు హోటల్ లో పని చేసారా, సరే ఉద్యోగం నేను యిస్తాను, ఈ కార్డులో వున్న అడ్రస్ కి సాయంత్రం రండి” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణ శాస్త్రి. 


లక్షలు ఖర్చు చేసి మన గొప్పతనం చూపించుకోవాడానికి భోజనాలు పెడుతూవుంటాం. వచ్చిన వాళ్ళు తినేసి వంకలు పెట్టే వాళ్లే ఎక్కువ. ఒక పదిమంది ఇటువంటి ఆకలితో అలమటిస్తో సిగ్గు వదిలి భోజనం కోసం వస్తే వాళ్ళని గుర్తించినా చూసి చూడనట్టు వదిలేయండి. అలా అని యిదే వృత్తిగా పెట్టుకుని జీవించే వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు శ్రీరామ్ కి జరిగిన అవమానం జరుగుతుంది. 


కష్టపడి సంపాదించిన ఆహారం అమృతం లాంటిది. 

                  

 శుభం 


 జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.







30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating

@saipraveenajeedigunta8361

• 7 hours ago

Good moral

Like
bottom of page