top of page
Original.png

ఆకాశవాణి — ఆ మధుర స్వరాలు


“రేడియో ఆన్ చేస్తే… ఒక ఇల్లు కాదు, ఒక కాలం మోగేది!”
“రేడియో ఆన్ చేస్తే… ఒక ఇల్లు కాదు, ఒక కాలం మోగేది!”

Akasavani Aa Madhura Swaralu - Special Article | Dr. Krishna Kumar Vepepakomma - డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ 

ఆకాశవాణి — ఆ మధుర స్వరాలు |  ప్రత్యేక వ్యాసం | డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ

Published in manatelugukathalu.com on 25/03/2026


కాలంలో కొద్దిగా వెనక్కి ప్రయాణిస్తే… నిజంగా టైమ్‌ మెషీన్‌ ఉంటే స్వరాలతో నిండిన ఓ లోకం మన కళ్ల ముందే మెదులుతుంది. అదే—1970ల దశకం, రేడియో రాజ్యం.

అప్పట్లో టెలివిజన్ లేదు, మొబైల్ లేదు, ఇంటర్నెట్ లేదు. రేడియోనే ప్రతి ఇంటి రాజు… మారాజు.


ప్రతి రోజూ ఆకాశవాణి రేడియో కార్యక్రమాలు…“బహుజన హితాయ, బహుజన సుఖాయ”—ఆ నినాదంతో సమాచారం, వినోదం, సంగీతం అందించిన ఆకాశవాణి ఇప్పటికీ మధుర జ్ఞాపకాలలో ప్రతిధ్వనిస్తుంది. పెద్ద పెట్టెలా కనిపించే మర్ఫీ, బుష్ రేడియోలు—ఆ చిన్న ప్రపంచం. ఒకసారి ఆన్ చేస్తే… ఇంట్లోనే కాదు, గల్లీ మొత్తం దద్దరిల్లేది.


అప్పట్లో రేడియో ప్రతి కుటుంబంలో ఒక మనసు నింపే దోస్త్. బాల్యంతో ముడివడిన ఓ ప్రత్యేక బంధం. ప్రజలకు సేవలు అందించడమే కాక చైతన్యవంతులను చేయడం లక్ష్యం. తెలుగు రాష్ట్రాల గృహాల్లో అది ‘మాటల మామ’, ‘పాటల పిన్ని’. పెద్ద పెట్టెలా కనిపించే ఆ మర్ఫీ, బుష్ రేడియోలే – మా లోకం, మా ప్రపంచం!


ఉదయం ఆరు గంటలకు ‘సూక్తి ముక్తావళి’తో ఆకాశవాణి మేలుకొలుపు.తర్వాత వినిపించేది చెవులకు మధురిమనిచ్చే, ఆకర్షణీయమైన వార్తలు—

‘ఆకాశవాణి సంప్రతి వార్తాః సృయంతాం. ప్రవాచకో బలదేవానంద సాగరః…’

అది వినగానే మనకో పండిత సభలో కూర్చున్నట్టనిపించేది. అర్థం అయినా కాకపోయినా, ఆ భాషలో ఒక మైమరపించే శోభ ఉండేది. వాక్య నిర్మాణం కవిత్వంలా, చెవులకు హాయిని, మనసుకు ఆనందాన్ని ఇచ్చేది.


ఆ రోజుల్లో తిరుమలశెట్టి శ్రీరాములు నంబర్ వన్ న్యూస్ రీడర్. ఆయన కంఠం నా చెవిలో ఇంకా మార్మొగుతోనే ఉంది. ఇక ఏడిద గోపాలారావు, అద్దంకి మన్నార్ — వంటి మహా మహులు న్యూస్ రీడర్లు ఎందరో!! వారి పలుకుల్లో శైలీ, మాధుర్యం, సంస్కారం. మాటల్లో చెప్పలేని మధురానుభూతి.


ఆ రోజుల్లో విజ్ఞాన గని రేడియోనే!!


పదకొండు మొదలైతే… చిన్నక్క ఏకాంబరాల… ముచ్చట్లు.                

‘చిత్రసీమ’ మొదలవగానే కడప, హైదరాబాద్, విజయవాడ స్టేషన్లు మార్చి–మార్చి… టిక్కు–టిక్కు మంటూ తిప్పుతూ, పాటల మధురిమలను ఆస్వాదించే వాళ్లం.

రోజువారీ దినచర్యలా, మనసులో చెరగని ముద్ర వేసిన అలనాటి నేస్తం – రేడియో సిలోన్. లక్షలాది భారతీయ హిందీ పాటల ప్రేమికులను ముగ్దుల్ని చేసింది.


సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే రేడియో శ్రీలంక ప్రసారాలు… ప్రముఖ వ్యాఖ్యాత – మీనాక్షి పొన్నుదురై, శ్రావ్యమైన కంఠంతో…“వణక్కమ్‌… ఐంద్ మణి ముప్ఫది నిమిడం… ఇది శ్రీలంక బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్, ఆసియా సేవ విభాగం…”అంటుంటే… బ్రదర్…ఆమె మాటల మధురిమలు శంకరభారణంలోని శంకరశాస్త్రీ సంగీతంలా మనసుకు ఆకట్టుకునేవి. రేడియో శ్రీలంక లక్షలాది హిందీ పాటల అభిమానుల జ్ఞాపకాల్లో చెక్కుకుపోయిన మధుర నేస్తం.


అప్పుడు ప్రతి కుటుంబం ఓ పెద్ద సైన్యంలా ఉండేది. ఇంట్లో ఏడెనిమిది మంది ఉండడం సాధారణం. శని–ఆదివారాల్లో రేడియో ముందు సందడి—బంధుమిత్రుల రాక—అదే ఒక చిన్న పండుగ. నవ్వులు, చప్పుళ్లు, పాటలు… హృదయాల్లో నిండిపోయే ఉల్లాసం. అందుకే నిర్లిప్తత, ఒంటరితనం అన్న భావనలు అరుదే. మనసుకు హాయినిచ్చే ఆ క్షణాలే మంచి ఆరోగ్యానికి పునాది.


‘జనరంజని’ కార్యక్రమం ఎన్నో హిట్ తెలుగు పాటలను ప్రసారం చేసింది….               ‘రాగాల పల్లకిలో’, ‘కన్నె పిల్లవని’, ‘మా ఇంటిలోనా’, ‘విధాత తలపున’ లాంటి పాటలు ప్రజల మనసులో చెరగని ముద్ర వేసాయి!


మధ్య మధ్యలో ప్రకటనలు…

— ఏమి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?

ఆ ఏమీ లేదు…మా ఇంటి పై కప్పు మీద ఏ రేకు వేద్దామా అని!

దానిలో ఆలోచించేది ఏముంది రామయ్య…

నాగార్జున సిమెంట్ రేకు వేస్తే సరి!!

అన్నట్లు ఎంతో వినసొంపుగా ఉండేవి…


రేడియో సిలోన్‌లో ‘బినాకా గీత్‌మాలా’ కోసం బుధవారం ఎదురుచూపులు… అదో తృప్తి.

ఆదివారం వచ్చింది అంటే… మధ్యాహ్నం 3 గంటలకు సంక్షిప్త శబ్ద చిత్రం. 3 గంటల సినిమాని గంటకు కుదించేవారు. ఆ సమయానికి చిన్నా, పెద్దా అందరూ రేడియో దగ్గరకు చేరి పోయే వాళ్లం. మధ్యలో చిరుతిళ్లు తింటూ ఎంతో ఆనందంతో ఎంజాయ్ చేసే వాళ్లం.


‘రంగుల రాట్నం’, ‘మూగ మనసులు’, ‘ఆత్మబంధువు’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘సాక్షి’ లాంటి చిత్రాల ప్రసారాలు… ఆ సినిమాలలోని డైలాగ్‌లు వినడానికి మనసుకు ఎంతో హాయిగా ఉండేది.


అప్పటి పాటల్లో భావం, స్వరం, మాధుర్యం కలిసివుండేవి. నేటి పాటల్లో శబ్దం ఎక్కువ, భావం తక్కువ. డీజే బీట్‌లు ఉత్సాహాన్ని రగిలిస్తాయి; కానీ హృదయాన్ని తాకే మాధుర్యం అరుదు. ఒకటి శరీరాన్ని కదిలిస్తే, మరొకటి మనసుకే స్పర్శనిస్తుంది.

ఇప్పుడు చిన్న కుటుంబాలు, వేగంగా పరిగెత్తే డిజిటల్ జీవితం ఆనందాన్వేషణకు కొత్త దారులను చూపిస్తోంది. లాఫింగ్ క్లబ్‌లు, పబ్‌లు, మిమిక్రీలు, చిన్న ఆటలు… కొద్దిక్షణాలైనా నవ్వుకునే కారణాలను మనుషులు వెతుకుతున్నారు. నవ్వుపై దృష్టి పెట్టి, చిన్న హాస్య ప్రదర్శనలతో మనసును తేలికపర్చే ప్రయత్నాలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి.


కాలం దూసుకుపోయినా, మనసు మాత్రం పాత రేడియో స్వరాల దగ్గరే ఆగిపోయినట్టుంటుంది. ఆ రోజులు మరువలేనివి—మనసును మెల్లగా తాకే మధుర జ్ఞాపకాలు. డిజిటల్ శబ్దాల మధ్య ఆ పాత స్మృతులే చిన్న ఉపశమనం.

సమయం మారినా, ఆ జ్ఞాపకాల హాయీ మాత్రం అలాగే ఉంటుంది. ఆ జ్ఞాపకాలే వేరు… ఆ సంతోషమే వేరు.


ఆ రోజులు ఎప్పటికీ మరువలేనివి… మన జీవితంలో ఒక అనిర్వచనీయ ఆనందం, మధుర జ్ఞాపకాలు; మనసుకు హాయినిచ్చే స్మృతి.

ఆ జ్ఞాపకాలే వేరప్పా!!!  ఆ సంతోషమే వేరప్పా!!!


డా. కృష్ణకుమార్ వేపకొమ్మ


***

డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్కారం,

నేను డా. వేపకొమ్మ కృష్ణకుమార్, జువాలజీ లో డాక్టరేట్ పొందిన విశ్రాంతి ప్రొఫెసర్; మాజీ ప్రిన్సిపల్. విద్యారంగంలో 30 సంవత్సరాల పైగా అనుభవం కలిగి, పుస్తక రచయిత, పరిశోధక, విద్యా నిపుణుడిగా సేవలందించాను. ప్రస్తుతం పలు ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా సామాజిక, విద్యా, సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాను.

మీ సంస్థలో నా అనుభవాన్ని ఉపయోగించి గుణాత్మక, ఆసక్తికర వ్యాసాలు అందించగలనని తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది.

డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ

ప్రొఫెసర్ & ప్రిన్సిపాల్ (రిటైర్డ్)

వార్తాపత్రిక కాలమిస్ట్

రాజీవ్ నగర్, హైదరాబాద్

#KrishnaKumarVepakomma #వేపకొమ్మకృష్ణకుమార్, akashavani telugu, radio nostalgia india, old radio memories, radio ceylon songs, 70s india life telugu


2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Very exciting past memories

Like
Replying to

Thank you very much for your feed back sir..

Like
bottom of page