top of page
Original.png

ఆకలి రుచి ఎరుగదు


ఆకలి రుచి ఎరుగదు – ఇతరుల అభిరుచిని గుర్తించి ఆతిథ్యం అందిస్తున్న దృశ్యం

Akali Ruchi Erugadu - Telugu Inspirational Article | Padma Raghunath

ఆకలి రుచి ఎరుగదు తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | పద్మా రఘునాథ్

Published in manatelugukathalu.com on 20/08/2026


‘ఆకలి రుచి ఎరుగదు’ అనే మాట కేవలం భోజనం గురించే కాదు; మన నిత్య జీవితంలో మనుషుల అవసరాలు, అభిరుచులు, ఆసక్తులకు కూడా వర్తిస్తుంది. బాగా ఆకలితో ఉన్నవారికి రుచికంటే కడుపు నింపుకోవడమే ముఖ్యమైనట్లే, అవసరంలో ఉన్నవారికి అందే సహాయం చిన్నదైనా ఎంతో విలువైనదిగా అనిపిస్తుంది. అదే సమయంలో అవసరం లేని వ్యక్తికి ఎంత మంచి సహాయం చేసినా దాని విలువ తెలియకపోవచ్చు. అందుకే ఇతరుల అవసరాలను, అభిరుచులను, ఇష్టాయిష్టాలను గుర్తించి మనం స్పందించినప్పుడే మన సహాయం, ఆతిథ్యం, కానుకలు నిజమైన సంతోషాన్ని కలిగిస్తాయి.


ఆకలి రుచి ఎరుగదు. ఈ మాట చాలావరకు నిజమే అనిపిస్తుంది. నిజమే కూడాను. బాగా ఆకలి తో ఉన్నవారికి ఏమిపెట్టినా కడుపు శాంతించటం కోసం వారు దానిని స్వీకరిస్తారు. అంత ఆకలి మీద ఉండటం వలన వారు దాని లోని గుణగణాలను, రుచులను ఏ మాత్రం పరిశీలించే స్థితిలో ఉండరు. ఒకవేళ ఉన్నా, ఆ అవకాశం అన్నివేళలా దొరకక పోవచ్చును. 


అంతే కాకుండగా బాగా ఆకలి మీద ఉన్నవారికి పంచ భక్ష్య పరమాన్నాలతో కూడా పనిలేదు. తొందరగా ఏది వీలయితే అది గ్రహించి వారి కడుపు నింపుకుని ఆకలి బాధనుండి విముక్తి అవ్వటానికి త్వర పడుతుంటారు. 


దీన్ని ఇంకో విధంగా పరిశీలిస్తే, ఆకలి లేకపోయినా కూడా రుచి ఎరగదు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆకలి లేనివారికి ఏది పెట్టినా ఒకే లాగా ఉండి రుచించదు. వారికి పరమాన్నం పెట్టినా కూడా సహించదు. ఎందుకంటే వారికి అసలు తినాలనే అనిపించనపుడు ఏమి వండి పెట్టినా, పదార్ధాలు రుచి గా అనిపించవు. వాటిలో వారికి ఏ విధమైన ఆసక్తి ఉండదన్నమాట. ఈ కారణం వలన వారికి ఆ భోజనం తృప్తిగా కూడా అనిపించక పోవచ్చు. 


ఇదే పరిస్థితిని మన నిత్య జీవితం లో కూడా అనేక మార్లు, అనేక సందర్భాలలో గమనిస్తూ ఉంటాము. చాలా అవసరం లో ఉన్నవారు, వారికి ఎవరు సహాయం అందించినా, ఎలాంటి సహాయమయినా సంకోచించకుండగా తీసుకునే పరిస్థితికి లోనయి ఉంటారు. 


వారికి ఆ సహాయం లోని లోటు పాటులను పరిశీలించి, వెలిబుచ్చే అవకాశం ఉండక పోవచ్చును. అలాగే అవసరం లేని వారికి సహాయం అందించినా దానికి వారివద్దనుండి ఏ విధమైన ప్రతిస్పందన ఉండక దాని విలువ లోపిస్తుంది. కొన్ని పరిస్థితులలో వారు దానిని గుర్తించక పోవచ్చును కూడా. అందుకే మన పెద్ద వారు ఆకలెరిగి అన్నం పెట్టుట, పాత్రత నెరిగి దానం చేయుట అని చెప్తుంటారు.


దీనికి వెనుక ఉన్న అంతరార్ధం పరిశీలిస్తే, అభిరుచి లేదా ఆసక్తి లోపించినా కూడా ఈ "రుచి ఎరుగక పోవటం" అనేది జరగచ్చు అని తెలుస్తోంది. ఈ ‘రుచి' కుడా ఎవరికైనా వారి వారి అభిరుచిని బట్టి ఉంటుందని చెప్పాలి. అందరికి ఒకటే ‘రుచి' ఏమాత్రం ‘రుచి’ అనిపించుకోదు సుమండీ!


అంటే అది వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందన్న మాట. ఉప్పు, కారం దండిగా ఉంటె ఒకరికి అది రుచి. అవి తక్కువగా ఉంటె ఇంకొకరికి అసలైన రుచి. అలాగే తీపిగా ఉంటె కొందరికి ఏ మాత్రం సహించదు. అది తక్కువయితే ఇంకొకరికి హితవుగా ఉండదు మరి. 


ఇలా రకరకాలు అన్నమాట. ఉదాహరణకి, తీపి అసలు ఇష్టం లేనివారికి ఎంత మంచి మధుర పదార్ధాలు వండి పెట్టినా వారు దాన్నిఏ మాత్రం ఆసక్తి చూపకుండగా, అయిష్టంగా స్వీకరించటం చేస్తూ ఉంటారు. అలాగే అవి ప్రీతి పాత్ర మైన వారికి అవి ఎంతో రుచి కరంగా ఉండి చాల సంతోషంగా తినటం జరుగుతుంది. 


వాటి గురించి ఆసక్తి తో వారు రక రకాల ప్రశ్నలు వేయటం, అవి తృప్తిగా ఆరగించటం చేస్తారు. దానితో పెట్టిన వారికి ఉల్లాసంగా ఉండి మరల మరల వారిని ఆహ్వానించే మనస్సు తో ఉంటారు.


కొన్ని సందర్భాలలో మనం ఎవరినయినా విందుకి పిలిచినపుడు వచ్చే వారి అభిరుచులను మరచి, అసంకల్పితంగానే మనకు నచ్చిన, ఇష్టమైన వంటకాలు ఎంతో కష్ట పడి చేసేసి, ఎదుటి వారివద్దనుండి మెప్పులు, మెచ్చుకోలు ఊహించుకుని, అవి రాని పక్షం లో నిరాశ చెందటం లేదా కొన్ని సందర్భాలలో వారిమీద కినుక వహించే అవకాశం ఉందండోయ్! 

ఇది ఎలాగంటే, తీపి ఇష్టం లేని వారికి బోల్డు మధుర పదార్ధాలు వడ్డించటం, చప్పగా తినే వారికి ఉప్పు కారాలు దండిగా వేసి వడ్డించటం లాంటిది అన్నమాట. అందుకే తినే వారి అభిరుచిని దృష్టి లో పెట్టుకుని మనం వంట వడ్డనలను చేయగలిగితే అది ఇరువురికి సంతోషకరమైన కలయికగా మారి మరింత స్నేహభావం, అప్యాయతలు పెంపొందే అవకాశం ఉంటుంది.


ఇలాగే ఎవరికైనా మనం కానుకలు ఇచ్చేటపుడు కూడా వారి వారి అభిరుచులను దృష్టిలో పెట్టుకుని అవి అందించినట్లయితే అది పుచ్చుకునే వారికి ప్రీతి పాత్రంగా ఉండి, వారు సంతోషం గా ఆ వస్తువను స్వీకరిస్తారు. లేకపోతే "ఆ, ఏదో మొక్కుబడికి ఇచ్చేరు లెద్దురూ" అని అనుకునే ప్రమాదం ఉండి, ఆ భావన మనకు తగిలి, మన మనస్సు చివుక్కుమనే పరిస్థితి కలుగుతుంది సుమా! 


పైగా మన ఇంటికి వచ్చిన అతిధుల అభిరుచిని గుర్తెరిగి మనం ప్రవర్తించినట్లయితే, వారికి అది ఎంతో తృప్తి నిచ్చి మన మీద గౌరవం మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది.


కనుక మనం ఎవరికోసమయిన ఏ పని చేసినా ఈ ‘అభిరుచి’ అనే పదార్ధం జోడించి నట్లయితే "ఆకలి కూడా రుచి ఎరుగవచ్చు, ఆకలి లేకపోయినా కూడా రుచి ఎరుగవచ్చు" అనేది సంభవిస్తుంది అని చెప్పవచ్చు! 


*** 

పద్మా రఘునాథ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: పద్మా రఘునాథ్

నా పేరు పద్మా రఘునాథ్ . అపుడపుడు కవితలు, వ్యాసాలు  రాస్తూ ఉంటాను. అనంత సాహీతీ వేదికలో చాలా కవితలు ప్రచురింప బడ్డాయి ! 

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

aakali ruchi erugadu ane saameta ki ardham chakkagaa cheppaaru. nice article

Like
bottom of page