top of page
Original.png

డబుల్ ధమాకా - జంధ్యాల పౌర్ణమి మరియు రాఖీ


జంధ్యాల పౌర్ణమి సందర్భంగా నూతన యజ్ఞోపవీతం ధరించే తెలుగు వ్యక్తి మరియు రాఖీ కడుతున్న సోదరి

Doubledhamaka-Jandhyala Pournami and Rakhi- Telugu Article | Nayana kasthuri

డబుల్ ధమాకా - జంధ్యాల పౌర్ణమి మరియు రాఖీ తెలుగు  కుటుంబ వ్యాసం | నయన కస్తూరి

Published in manatelugukathalu.com on 21/08/2026


మన పండుగలు కేవలం ఆనందాన్ని పంచే సందర్భాలు మాత్రమే కాదు.. తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను గుర్తుచేసే పవిత్రమైన సందర్భాలు కూడా. అలాంటి విశిష్టమైన పర్వదినాల్లో శ్రావణ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున దేశవ్యాప్తంగా రాఖీ పండుగను అన్నాచెల్లెళ్ల ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకుంటే, ఇదే పర్వదినాన్ని కొన్ని సంప్రదాయాల్లో జంధ్యాల పౌర్ణమిగా కూడా భావిస్తారు.

ఉపనయనం చేసుకున్న వారు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఈ పర్వదినానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారం. కాలానుగుణంగా మరుగున పడుతున్న ఇలాంటి సాంప్రదాయ విషయాలను గుర్తుచేస్తూ, యజ్ఞోపవీతం ప్రాముఖ్యత, జంధ్యం మార్చుకునే సందర్భాలు, నూతన యజ్ఞోపవీత ధారణ విధానం, జంధ్యాల పౌర్ణమి విశిష్టతతో పాటు రాఖీ పండుగలోని అన్నాచెల్లెళ్ల అనురాగాన్ని ఈ వ్యాసం పరిచయం చేస్తుంది.


మన దైనందిన జీవనంలోని పరుగులాటలో, ఈ పోటీ ప్రపంచంలోని అర్థం లేని అతి వేగంలో పడి, మన సంస్కృతికి అద్దం పట్టే ఎన్నో అనాదిగా ఆచరణలో ఉన్న సంప్రదాయాలను మరచిపోతున్నాం. ఇలా క్రమంగా మరుగున పడుతున్న సాంప్రదాయాల్లో 'నూతన యజ్ఞోపవీత ధారణ' ఒకటి అని చెప్పుకోవచ్చును. ఇది ఉపనయనం జరిగి, యజ్ఞోపవీతం ధరించే వారందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం.


"అయ్యో! అవును కదా! అయితే ఎప్పుడు యజ్ఞోపవీతము మార్చుకోవాలి?" అనే ఆలోచనలో పడ్డారా? కంగారు పడకండి. మీకు మరుగున పడిన మంచి విషయాలు గుర్తు చేసి, మన సంస్కృతిని, సంప్రదాయాలను సుసంపన్నం చేసుకునే గురుతరమైన బాధ్యత చేపట్టటమే ఈ వ్యాసం రాసిన ఉద్దేశ్యం.


‘యజ్ఞోపవీతము’ వ్యవహారిక నామము 'జంధ్యము'. ప్రతి శ్రావణ పౌర్ణమి నాడు మన దేశంలో ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలంతా ఏ పేరుతో పిలుచుకున్నా 'రాఖీ' పండుగను అన్నాచెల్లెళ్లందరూ ఆప్యాయానురాగాలతో జరుపుకుంటారు కదా? చెల్లెళ్లు ఉద్యోగాలు చేస్తూ వేరే వూర్లలో ఉన్నా, పెళ్లిళ్లయి భర్తలతో వేరే ఊర్లలో కాపురాలు చేస్తున్నా ఎంతో ఆప్యాయంగా అన్నదమ్ముల దగ్గరకు వచ్చి, హారతులిచ్చి, ప్రేమతో స్వీట్లు తినిపించి, రాఖీలు కడతారు. అంతే ప్రేమతో అన్నదమ్ములిచ్చిన కానుకలను స్వీకరించి, ఆ రోజంతా ఆనందంగా గడిపి తమతమ ఇళ్లకు వెళతారు. ఈ రాఖీ పండుగనే మన తెలుగు వాళ్ళు అభిమానంగా అన్నాచెల్లెళ్ల పండుగ అని కూడా పిలుచుకుంటారు.


అదే పర్వదినం 'జంధ్యాల పౌర్ణమి' అని కూడా పిలవబడుతుందనీ, ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారులకు కాని, గృహస్తులకు కాని ఆ పర్వదినాన పాత యజ్ఞోపవీతం విసర్జించి, నూతన యజ్ఞోపవీతము ధరించాలని ఎంతమందికి గుర్తుంది అంటారు?

హిందూమతంలోని కొన్ని వర్గాలలో మగవారికి ఏ అనుష్ఠానం చేయడానికైనా, వివాహం చేసుకోవడానికైనా అర్హత నిచ్చేది యజ్ఞోపవీత ధారణే! అందుకని వేదపండితుల ద్వారా ఉపనయనం చేసుకున్న మగవారంతా ‘యజ్ఞోపవీతము’ అంటే జంధ్యం ధరించి తీరాలి, సంధ్యావందనం చేసుకుని తీరాలి అనేది తరతరాల సంప్రదాయం.


ఒకసారి జంధ్యం ధరించిన తర్వాత కొన్ని సందర్భాలలో జంధ్యం మార్చుకుంటూ ఉండాలి. జందెపు పోగు తెగినప్పుడూ, జాతాశౌచ, మృతాశౌచములు ముగిసిన తరువాత, శవమును తాకినప్పుడూ నూతన యజ్ఞోపవీతాన్ని స్నానాంతరం ఆచమనం చేసి, సంకల్పం చెప్పుకుని ధరించాలి.

అలాంటి సందర్భాలలోనే కాకుండా, పవిత్రమైన 'శ్రావణ పౌర్ణమి' రోజున 'జంధ్యాల పౌర్ణమి' పండగ సందర్భముగా పాత యజ్ఞోపవీతం వర్జించి నూతన యజ్ఞోపవీతం ధరించాలి. స్నానాదులు కావించి, ఆచమనం చేసి, సంకల్పం చెప్పుకుని, చివరగా:


"మమ శ్రౌత, స్మార్త నిత్య కర్మానుష్ఠాన, మంత్రానుష్ఠాన యోగ్యతా ఫల సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే!"


అని చెప్పి జంధ్యానికి మూడు చోట్ల పసుపు, కుంకుమ రాసి, సర్వ దేవతలను తలుచుకుంటూ ఈ క్రింది శ్లోకమును...

భూరగ్నించ పృథువీం భువో వాయుంచ అంతరిక్ష స్వరాదిత్యంచ దివో భూర్బువస్వశ్చంద్రమాంచ దిశశ్చ


“యజ్ఞోపవీతం పరమం పవిత్రంప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రంయజ్ఞోపవీతం బలమస్తు తేజః”


అని పఠించుకుంటూ, జంధ్యమును రెండు చేతుల వ్రేళ్ళకు తగిలించి దండ వలె ఎత్తి పట్టుకుని, కుడి చేతిలో పూర్తిగా దూర్చి కుడి భుజము నుండి శిరస్సు పై నుంచి ఎడమ భుజము మీదకు వేసుకోవాలి.

పాత జంధ్యం, కొత్త జంధ్యం కలిపి కుడి అరచేతిలో ఉంచుకుని గాయత్రి మంత్రం పది సార్లు జపం చేయాలి. పాత జంధ్యాన్ని కింద నుంచి పాదాలకు తగలకుండా తీసివేసి:


"యజ్ఞోపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మల దూషితమ్ |ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థంజీర్ణోపవీతం విసృజామి తేజః ||"


అని చెప్పుకుని ఎవరు త్రొక్కని చోట వదిలి వేయాలి.

ఇలా ఎంతో విశిష్టత కలిగిన యజ్ఞోపవీతం యొక్క విశిష్టతను మరువకుండా వచ్చే 'జంధ్యాల పౌర్ణమి' పండుగను 'రాఖీ' పండుగతో పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకుని, నిత్యం సంధ్యావందనం గావించుకుంటూ దీర్ఘాయురారోగ్యాలను పొందగలరు.


***

నయన కస్తూరి గారి కొన్ని ఇతర రచనలు:



నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


నయన కస్తూరి

రచయిత పరిచయం: నయన కస్తూరి

నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్  హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక  విషయాలు  రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page