అక్షరాల నిజం! నిజం!
- Gadwala Somanna

- Oct 23
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AksharalaNijamNijam, #అక్షరాలనిజంనిజం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 135
Aksharala Nijam Nijam - Somanna Gari Kavithalu Part 135 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 23/10/2025
అక్షరాల నిజం! నిజం! - సోమన్న గారి కవితలు పార్ట్ 135 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అక్షరాల నిజం! నిజం!
-------------------------------------------
వికసించిన పూవులు
పరిమళమే పంచును
జ్ఞానవంతుల పెదవులు
తెలివిని వెదజల్లును
పచ్చని వృక్షాలే
కనువిందు చేస్తాయి
ప్రేమలొలుకు మనసులే
బంధాలు నిలుపుతాయి
ప్రతి దానికి సమయము
ఉంటుంది వాస్తవము
జారవిడచకూడదు
వస్తే అవకాశము
విలువైనది కాలము
అమూల్యం జీవితము
పోతే తిరిగిరాదు
శ్రేష్టమైన స్నేహము

ఉంటేనే!!
------------------------------
సంతోష హృదయమే
చిరునవ్వుల వదనమే
ఉంటేనే జీవితము
అదే కదా స్వర్గము
బ్రతుకుల్లో నెమ్మది
ఉంటేనే మంచిది
ఘోషించే సాగరము
కాకూడదు అనిశము
జీవితాన మిత్రులు
ప్రేమించే మనుషులు
ఉంటేనే లాభము
ఆపదలో ఆప్తులు
కష్టించే తత్వము
క్షమించే హృదయము
జీవితాన ఉదయము
భవిత అగును పదిలము

అమ్మ అక్షర సత్యాలు
------------------------------------
బహు గొప్పది స్నేహము
చేయరాదు ద్రోహము
వెన్నుపోటు ఎన్నడు
పొడవరాదు తమ్ముడు
దైవానికి హేయులు
అవనిలో కృతఘ్నలు
సాయపడిన వారికి
హానిచేయు వ్యక్తులు
అవకాశవాదులతో
ఇచ్చకపు మాటలతో
అత్యంత ప్రమాదము
ఇల మాయగాళ్ళతో
ముఖ్యం పరిశీలన
మిక్కిలి అవగాహన
మంచిది జీవితాన
ఎదిగేందుకు నిచ్చెన

పెద్ద మనిషి పలుకులు
-----------------------------------------
పెడచెవిని పెడుతారు
హితబోధను మూర్ఖులు
సదా వాదిస్తారు
ఇల వితండవాదులు
కొండెగాళ్ళ మాటలు
చేయును మిత్రభేదము
పనికిరాని మనుషులు
రేపుతారు కలహము
ఎవని కడుపు వానికి
తొందర పెడుతుందోయ్!
మనవి కాని వాటికి
అర్రులు చాచరాదోయ్!
మితిలేని కోరికలు
పోగొట్టును శాంతము
అధికమైతే గనుక
చేయించును చెడు పనులు

తల్లి పసిడి పలుకులు
-------------------------------------------------
మేలుకు ప్రతిగా కీడు
కలనైనా చేయొద్దు
అగును బ్రతుకు వల్లకాడు
కృతఙ్ఞతలు వీడొద్దు
పెంచుకోకు విరోధము
ప్రగతికది అవరోధము
తెలుసుకో నిజానిజాలు
గొప్పది మైత్రి బంధము
క్షమాగుణం కడు శ్రేష్టము
సమైక్యతకు సోపానము
శత్రుత్వమే నశించి
వర్ధిల్లుతుంది దేశము
అడిగితే నీ సాయము
త్రోసిపుచ్చకు నేస్తము
విరోధులకు సైతమూ
చేసేస్తే సముచితము
-గద్వాల సోమన్న




Comments