'Akupaccha Santhakam' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
Published In manatelugukathalu.com on 09/09/2024
'ఆకుపచ్చ సంతకం' తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“ఆదియ్యా.. ఓ ఆదియ్యా” గట్టిగా పిలిచాడు యాదగిరి. ఆదియ్య భార్య గంగమ్మ బయటకు వచ్చింది.
“ఏంది యాదగిరి అన్నా, పొద్దున్నే ఇట్టా వచ్చావ్?” అడిగింది గంగమ్మ.
“రాత్రి నాలుగు లారీల ఇసుక వచ్చింది. అది, రెడ్డి గారి ఇంట్లోకి చేరేయాల. ఆదియ్య పనిలోకి వస్తాడేమోనని వచ్చినా” అన్నాడు యాదగిరి. ఆ మాట వినగానే, గంగమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది.
“అన్నా, నీలాంటి మంచి మనిసి మాకు నాలుగు డబ్బులు వచ్చే మార్గం చూపించినా, అది అందుకుని బాగుపడే యోగం మాకు లేదు. ఆదియ్య పొద్దున్నే నీళ్ళ బకెట్ పట్టుకుని బయటకు పోనాడు. నిన్న రామాపురం వెళ్ళే దారిలో మొక్కలు పాతాడు. ఆటికి నీళ్ళు పోయాలని వెళ్ళాడు. అతని కష్టం కుటుంబానికి ఉపయోగం పడటం లేదు అన్నా” బాధగా అంది గంగమ్మ.
“ఈడికి ఈ మొక్కల పిచ్చి ఏమిటి అమ్మీ?” అన్నాడు యాదగిరి.
“ఏం సెప్పమంటావు అన్నా? పగలూ, రేత్రి మొక్కలు గురించే ఆలోచిత్తాడు. కడుపున బిడ్డలగురించి కూడా పట్టించుకోడు. తను కట్టపడి సంపాదించిన డబ్బులు అన్నీ నేలపాలు చేత్తన్నాడు.
‘ఎందుకయ్యా ఇట్టా సేత్తన్నావు?’ అంటే, ‘మొక్కలు లేకపోతే మంచి గాలి ఉండదు, వర్షాలు ఉండవు. అప్పుడు మనిషి బతికే దారే ఉండదు’, అని మెట్ట వేదాంతం చెబుతాడు. పైగా ‘నా సంపాదనలో సగం మీకే ఇత్తున్నాగా’, అంటాడు. మీరు అందరూ ఆడికి నాలుగు మంచి మాటలు చెప్పండన్నా. ముందు కుటుంబం చూసుకో. అవన్నీ చేయడానికి గవర్నమెంట్ ఉండాది, అని బుద్ధి చెప్పండన్నా” చేతులు రెండూ జోడించి యాదగిరితో అంది గంగమ్మ.
ఆమె మాటలకి దీర్ఘంగా నిట్టూర్చి “ఆ ముచ్చటా అయినాది సెల్లమ్మా. నీకు ఇవన్నీ వద్దురా అని సెప్పినాం. ఉహూ.. వినలేదు. ‘అందరం ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటే, సమాజం ఎలా ముందుకు వెళ్తాది?’ అని అన్నాడు. ఇప్పుడు మనం మొక్కలు పెంచకపోతే, రేపు మన పిల్లలు శానా కట్టాలు పడతారని, ఏవేవో ఉదాహరణలు సెప్పినాడు. మాకు చిరాకేసి ఊరుకున్నాం. సరే నే వెళ్తాను. నా పనికి ఇంకో మనిషిని చూసుకోవాలిగా” అని వెళ్ళిపోయాడు యాదగిరి.
ఆదియ్య ఓ బకెట్, అందులో ఓ ప్లాస్టిక్ మగ్ పెట్టుకుని శివపురం పక్కన ఉన్న రామాపురం వెళ్ళాడు. రోడ్ పక్కనే పాతిన మొక్కల్ని చూసి ‘అయ్యయ్యో ఎండ దెబ్బ తగిలిన సిన్న పిల్లాడిలా ఎలా తల వేళాడేసిందో’ అని బాధపడి కొద్ది దూరంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లి బకెట్ నిండా నీళ్ళు తీసుకువచ్చి, మగ్గుతో జాగ్రత్తగా మొక్కలకు పోసాడు.
నిన్ననే అతను ఏభై మొక్కలు దారి పక్కనే పాతాడు. రెండుగంటలు అలా కష్టపడి మొక్కలకు నీళ్ళు పోసి, తర్వాత తను ఓ మగ్గుడు నీళ్ళు తాగాడు. అప్పుడు అతనికి సంతృప్తి కలిగింది. నెత్తికి కట్టుకున్న తువ్వాలు తీసి మొహం తుడుచుకున్నాడు. నెమ్మదిగా సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వచ్చాడు. గంగమ్మ అతన్ని చూసి రుస రుసలాడింది.
“యాదగిరి అన్న వచ్చాడు నిన్ను పనికి తీసికేల్దామని. నువ్వు లోకాన్ని ఉద్ధరించడానికి పోయావు. పనికి వెళ్తే రెండు వందలు చేతికి వచ్చేవి. పిల్లలకు ఏదైనా తినుబండారాలు చేసిపెట్టేదాన్ని. అంతా నా ఖర్మ” అంది.
ఆదియ్య జవాబు చెప్పకుండా స్నానం చేసి వచ్చాడు. టీ కలిపి ఇచ్చింది గంగమ్మ. అతను మౌనంగా తాగుతున్నాడు. నీరసంగా ఉన్న భర్తని చూసి బాధపడింది గంగమ్మ.
“చూడయ్యా, ‘ఇంట గెలిచి రచ్చ గెలవమని’ పెద్దలు అన్నారు. అలా మొక్కలకి, మానులకి ఖర్చు చెయ్యకుండా ఆ డబ్బులు నాచేతికియ్యి. పిల్లల చదువులకి దాస్తాను” అంది నెమ్మదిగా.
టీ తాగి గ్లాసు కింద పెట్టాడు ఆదియ్య. “మన పిల్లాడికి ఎనిమిదేళ్ళు, పిల్లకి ఏడేళ్ళు. ఇంకా హై స్కూల్ చదువులకి కూడా రాలేదు. వాళ్ళకి నేను లోటు చేయను. నువ్వు బెంగ పెట్టుకోకు” అన్నాడు.
మళ్ళీ సైకిల్ ఎక్కి టీచర్స్ కాలనికి వెళ్ళాడు. ప్రతి ఇంటిముందు తను ఏడాది కితం నాటిన మొక్కలు పెరిగి పెద్దవి అవడం చూసి ఆనందపడ్డాడు.
నాలుగు వీధులలోని మొక్కలకు నీళ్ళు పోసి ఇంటికి వచ్చాడు. గంగమ్మ భోజనం వడ్డించింది. ఇద్దరూ భోజనాలు చేసారు. ఆదియ్య అరుగు మీద కూర్చుని రామ్మూర్తి మాస్టారు ఇచ్చిన ‘పర్యావరణం – పరిరక్షణ’ పుస్తకం చదివి, కాసేపు అక్కడే నడుం వాల్చాడు.
సాయంత్రం రచ్చబండ దగ్గర కూర్చున్నాడు ఆదియ్య. రైతులు వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నారు. రామ్మూర్తి మాస్టారు కూడా అక్కడ ఉన్నారు. పత్రికా విలేకరి వెంకట్రామయ్య మోపెడ్ మీద వెళ్తుంటే రైతు రాఘవయ్య ఆపాడు. “ఏమిటి సారూ, మా ఊరువచ్చినారు?” అని అడిగాడు.
“మీ గ్రామ సర్పంచ్ గారు ఈ ఏడాదిలో మీ గ్రామ అభివృద్ధికి చేసిన పనులు చెబుతానంటే వచ్చాను. రాసుకున్నాను. ఇంటికి వెళ్తున్నాను” అన్నాడు వెంకట్రామయ్య. రాఘవయ్య పెద్దగా నవ్వాడు.
“అవన్నీ గవర్నమెంట్ డబ్బుతో చేసిన పనులు. అందులో ఆయన స్వంతం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు” అన్నాడు రాఘవయ్య. రామ్మూర్తి మాస్టారు చిన్నగా నవ్వారు ఆ మాటలకు.
మాస్టారు, విలేకరి కేసి తిరిగి “సొంత లాభం కొంత మానుకుని, పొరుగువాడికి సాయ పడవోయ్, అని గురజాడ వారు చెప్పినట్టు సమాజం కోసం కష్టపడుతున్న వ్యక్తి ఈ ఆదియ్య” అని ఆదియ్యని చూపించారు.
“ఆదియ్య కూలిపని చేసి జీవిస్తున్నాడు. అతను చిన్న వాడే, కానీ అతని హృదయం ఆకాశమంత విశాలం. తన కూలి డబ్బుల్లో సగం కుటుంబానికి ఉపయోగిస్తాడు. మిగతా డబ్బులతో మొక్కలు కొని, వాటిని నాటి శ్రద్ధగా పెంచి పెద్ద చేస్తున్నాడు. ఇటు రామాపురం వెళ్ళే దారిలో, అటు అయితంపూడి వెళ్ళే దారిలో, దేవ గ్రామం వెళ్ళే దారిలో మొక్కలు నాటి పెంచాడు.
ఏ ఊరిలో అయినా కొత్తగా కాలనీ ఏర్పడితే, అక్కడకు వెళ్లి వారి ఇళ్ళ ముందు మొక్కలు నాటి పెంచుతున్నాడు. మా టీచర్సు కాలనీలో పూల మొక్కలు, పళ్ళ మొక్కలు కూడా నాటాడు. అవి పెరిగి పెద్దవి అయ్యాయి. గంగని భూమి మీదకు తెచ్చిన భగీరధుడిలా, పర్యావరణ పరి రక్షణ కోసం శ్రమిస్తున్నాడు మా ఆదియ్య” గర్వంగా చెప్పాడు మాస్టారు.
“సారూ, మా ఆదియ్యకి ఉన్నవి మూడు నిక్కర్లు, మూడు చొక్కాలు. కనీసం మంచి బట్టలు కూడా కొనుక్కోకుండా పదిమంది మంచి కోసం తన డబ్బు ఖర్చుపెడుతున్న ఆదియ్య, మా శివపురం ‘స్వాతిముత్యం’ సారూ” అన్నాడు రాఘవయ్య.
వెంకట్రామయ్య వారి మాటలకి ఆశ్చర్యపోయాడు. తన ఫోనులో, ఆదియ్య ఫోటో తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడే ‘శివపురం స్వాతిముత్యం ఆదియ్య’ అన్న పేరుతో పేపర్లో పెద్ద వార్త,
ఆదియ్య ఫోటో వచ్చాయి. రామ్మూర్తి మాస్టారు పేపర్ పట్టుకువచ్చి ఆదియ్యకి చూపించారు.
ఆదియ్య, మాస్టారికి దణ్ణం పెట్టి “మీరు నాలుగు మంచి మాటలు చెప్పారు. నేను వాటిని పాటిస్తున్నాను. నాకు ప్రచారం ఎందుకు సారూ?” అని అన్నాడు వినయంగా.
“ఇది ప్రచారం కాదు. నిన్ను చూసి మరో నలుగురు ముందుకు వచ్చి పర్యావరణం కోసం శ్రమిస్తారని, సమాజానికి ఉపయోగపడతారని. దాని వలన మరిన్ని గ్రామాలు బాగుపడతాయని” అన్నారు మాస్టారు.
పాలకొల్లు రోటరీ క్లబ్ వారు ఆదియ్య న్యూస్ చూసారు. వెంటనే శివపురం వచ్చి ఆదియ్యని కలిసి, వచ్చే ఆదివారం తమ క్లబ్ గవర్నర్ వస్తున్నారని మీరు తప్పకుండా రావాలని చెప్పారు. రామ్మూర్తి మాస్టారి బలవంతం మీద ఒప్పుకున్నాడు ఆదియ్య. ఆదివారం నాడు మాస్టారు, ఆదియ్య పాలకొల్లు రోటరీ క్లబ్ వారి మీటింగ్ కి వెళ్ళారు. క్లబ్ అధ్యక్షుడు గోపాలకృష్ణ, ఆదియ్య పర్యావరణ పరిరక్షణ కోసం పడుతున్న శ్రమని వివరించి, క్లబ్ గవర్నర్ చేత సన్మానం చేయించారు. క్లబ్ తరుపున పదివేల రూపాయలు ఇచ్చాడు. గవర్నర్ తానో ఐదువేలు ఇచ్చారు.
మర్నాడు ఉదయమే కడియం నర్సరీకి వెళ్లి ఆ డబ్బులతో మొక్కలు కొని పట్టుకొచ్చి కంతేరు వెళ్ళే దారిలో నాటాడు. నెల రోజులు వాటికి క్రమం తప్పకుండా నీళ్ళు పోసి పెంచాడు. గంగమ్మ, ఆదియ్యతో వాదించడం మానుకుంది. అతను చేసే పనులు మౌనంగా చూస్తోంది. రోటరీ క్లబ్ వారు ఇచ్చిన పదిహేను వేల రూపాయలు మొక్కల కోసం ఖర్చు పెట్టిన మానవత్వం ఉన్న మనిషి ఆదియ్య, అని మరో న్యూస్ పత్రికలలో వచ్చింది. భర్తకి మంచి పేరు వస్తోందని ఆనందపడింది గంగమ్మ.
జిల్లా కలెక్టర్ ఆ న్యూస్ చూసి చాలా ఆనందించాడు. ఒకరోజు ప్రత్యేకంగా ఆదియ్య ఇంటికి వచ్చి అభినందించి వెళ్ళారు. రిపబ్లిక్ దినోత్సవం నాడు జిల్లా కేంద్రానికి ఆదియ్యని పిలిచి, అశేష జన సమక్షంలో సత్కరించి, ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. “పర్యావరణ పరిరక్షణలో జనం, ఆదియ్యని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని” కలెక్టర్ హితవు పలికారు. ‘”సమాజాభివృద్ధి పత్రం మీద, ఆదియ్య ఒక ‘ఆకుపచ్చని సంతకం” అని కలెక్టర్ కితాబు ఇచ్చారు.
****
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments