top of page
Original.png

అమ్మ - అత్త

#CharDhamYathra, #అమ్మఅత్త, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

     అమ్మ - అత్త (ఇద్దరూ ఒకటి కాదా??? కాలేరా???) 

                           

Amma Attha - New Telugu Story Written By Pulletikurthi Nagesh 

Published In manatelugukathalu.com On 17/12/2025

అమ్మ - అత్తతెలుగు కథ

రచన: పుల్లేటికుర్తి నగేష్ 


అమ్మంటే అందరికీ చాలా ఇష్టం. 

అమ్మ కొడుకుని అర్థం చేసుకున్నట్లుగా ఎవరు అర్థం చేసుకోలేరు. 

చిన్నప్పుడు “అమ్మా! నువ్వు చాలా మంచిదానివి!”

అంటే చాలా బాగా, అందంగా నవ్వి ఏదో ఒకటి తినడానికి చేతిలో పెడుతుంది. 


మనం 14, 15 వున్నపుడు “మా అమ్మ చాలా మంచిది!” అని అంటే, “ఏ సినిమా కి వెళ్తావు, ఎవరితో వెళ్తున్నావు” అంటూ.. ఇంద అని నాన్నకి తెలియకుండా డబ్బులు ఇస్తుంది. 


అదే డిగ్రీ చదువుతున్నప్పుడు ‘మా అమ్మ మరీ మంచిది’ అంటే, 

“చెప్పు.. ఎవరా అమ్మాయి? బాగుంటుందా?”

అని నవ్వుతూ అడుగుతుంది. 


పెళ్లి అయి 35 – 40లలో వున్నప్పుడు, “నువ్వే చాలా మంచిదానివి” అని అంటే.. 

“చెప్పానా!!! ఆ సంబంధం మనకి వద్దురా బాబూ అని అంటే, 

అమ్మాయి బాగుందని నువ్వే ఎగిరి పడ్డావు.. 

నా మాట విన్నావా” అని విసుక్కుంటుంది. 

తరువాత 60 లలో “అమ్మ, నువ్వు చాలా మంచిదానివి” అని అంటే.. 

“నో. నేను ఎక్కడా సంతకాలు పెట్టను.. ఆస్తి పంపకాలు అన్నీ నా తర్వాతే..” అంటుంది. 


కొడుకు అన్న ఒకే మాటని ఇంత బాగా, ఇన్ని విధాలుగా సందర్భాన్ని బట్టి అర్థం చేసుకునే అమ్మలు, ఇంత మంచి అమ్మలు, మంచి అత్తగార్లు గా ఎందుకు కాలేక పోతున్నారు అన్నది నా మిలియన్ డాలర్ ల ప్రశ్న???!!!


ఈ సమాజం లో అందరూ మంచి అమ్మలే! కానీ ఈ చెడ్డ అత్తలు, దుర్మార్గమైన అత్తలు ఎక్కడి నుండి వస్తున్నారు? వీళ్ళు ఏలియన్స్, గ్రహాంతర వాసులు కాదు కదా!!!


పాతిక సంవత్సరాలు ప్రేమగా పెంచి పెద్ద చేసి మనిషిని, మగాడిని చేసిన కొడుకుని కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి రాత్రికి రాత్రే కొంగున కట్టేసుకుని, నాకు దూరం చేస్తుందేమో అని అనుకుంటూ.. గంగ చంద్రముఖి లా మారినట్లు, అమ్మ, అత్తగా మారుతుందా?


నేను ఎప్పటి లానే, దేవుడిని, “ఇంత ‘మంచి’, ‘గొప్ప’ అమ్మలని సృష్టించిన నువ్వు చెడ్డ అత్తలుగా ఎందుకు మారనిస్తున్నావ్” అని అడిగా. 


“ఏమయ్యా! నీకు ఉదయం 4 గంటలకే మెలకువ వస్తుంటే, పేపర్లో, పాల పాకెట్ లో వేసుకోవాలి గాని, నా దగ్గర పంచాయతీ లెందుకు పెడుతున్నావు” అని అంటూ.. అలవాటుగా ఎప్పటి లానే చిన్న నవ్వు నవ్వి.. కుడి చెయ్యి పైకి ఎత్తుతుంటే, ‘నీకే ముందు ముందు అర్థం అవుతుందిలే’, అని చెప్పి, ఎక్కడ మాయం అయిపోతాడో అని భయం వేసి, ఠక్కున సాష్టాంగ ప్రణామం చేసి, “నీకు పుణ్యం వుంటుంది స్వామీ, అన్నీ ముందు ముందు నీకే అర్థం అవుతాయి అని మాత్రం అనకు, నీ నవ్వు చూస్తే నాకు భయం వేస్తుంది, అన్నీ ‘నా’ జీవితం లోనే, నేనే అనుభవించి అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఇచ్చిన ఈ చిన్న జీవితం చాలదు స్వామీ!” అన్నా, .. 


స్వామి నావైపు అదోలా చూస్తూ.. “నేను దండ కడియం సర్ధు కోవడానికి చెయ్యెత్తా, నిన్ను ఆశీర్వదించి, మాయం అవడానికి కాదు, నీకు కొంచెం తొందర ఎక్కువేం.. దేనికీ ఆగలేవు కదా.. అయినా అందరికీ పుణ్యాన్ని ప్రసాదించే నాకే పుణ్యం వస్తుంది అని ఆశ పెడుతున్నావే..” అని నవ్వి, “సర్లే నీలాంటి ఇంకో అభాగ్యుడికి ఆ పుణ్యం ఉపయోగ పడుతుంది, వుండనీ లే” అన్నాడు. 


“అయితే విను, నేను ఆడవారి నందరిని మంచిగానే, కుటుంబం లో అందరినీ సమానం గా ప్రేమని పంచడం వాళ్ళ జన్మ సిద్ధ వరం అన్నట్లు సృష్టించాను; వీళ్ళే కొంచెం అధిక ప్రేమతో, అభద్రతా భావంతో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబం లోకి కొత్తగా వచ్చిన ఈ కోడళ్లను ఇబ్బంది పెడుతున్నారు. 


మనం పడిన కష్టాలు మన పగవాడికి కూడా రాకూడదే.. అని అందరం అనుకుంటాం కదా, అలాంటిది మన ఇంటికి, 20-25 సంవత్సరాల అనుబంధాలని ప్రక్కన పెట్టి వచ్చిన అమ్మాయికి ఏ కష్టం లేకుండా, అదీ.. మన వలన అస్సలు రాకుండా చూసుకోవాలే అనే ఒక చిన్న పాయంట్ మిస్ అవకుండా వుంటే, అంతా బాగుంటారు కదా! 


మన ఇంటి అమ్మాయిలు, వాళ్ళ అత్తారింటిలో సుఖంగా వుండాలని, అత్త వలన వాళ్ళకి ఏ సమస్యలు లేకుండా వుండాలని ఎప్పుడూ నన్ను ప్రార్ధిస్తూ వుంటారే, అదే విధంగా మీరు కూడా వుండాలి కదా.. “ఇతరులు చేసే ఏ పనుల వలన మనం బాధకు గురి అవుతామో, అవే పనులు మనం ఇతరులకు చేయకూడదు” అనే ఇంగిత జ్ఞానం ఉండఖ్ఖర్లా?” అని అంటూ.. 


“ఇలా దగ్గరకు రా.. ఇక్కడ నీకో చిన్న దేవ రహస్యం చెప్తా విను” అన్నాడు. 


నేను మనం ఎప్పుడూ సినిమాల్లో చూసే మాదిరిగా, అరచేయిని నోటికి అడ్డు పెట్టుకుని, వినయం గా కొంచెం వంగుని “చెప్పు స్వామి” అన్నా. 


“అంత యాక్షన్ వద్దులే, విను చాలు.. 

నిజానికి ఇప్పుడు కొత్తగా కోడళ్ళు అయిన వారు, అవుతున్న వారు అస్సలు భయపడనక్కర లేదు. ఎందుకంటే ఇప్పుడు అత్తల పోస్ట్ కి ప్రమోషన్ తో వస్తున్నవారు, ప్రమోషన్ కోసం చూస్తున్నవారు, నిజానికి 90 దశకాల్లో, నాకు ఎలాంటి అత్త వస్తుందో అని భయపడిన కోడళ్లే. వారిలో ఆ భయాన్ని నేను పూర్తిగా పోగొట్టలేదు, అలానే వుంచా.. “భయం” అప్పుడు రాబోయే అత్తల గురించి.. ఇప్పుడు రాబోయే కోడళ్ళ గురించి అంతే తేడా. 


అప్పటి కోడళ్లే, ఇప్పుడు అత్తలుగా మారు తున్నారు కదా. వాళ్ళ పోస్ట్ లు మారినా, వారిలో ఒరిజినల్ గా వున్న భయం పోలేదు, మారలేదు.. ఇది నేను చేసిన తాత్కాలిక అరేంజ్మెంట్ మాత్రమే. 


కానీ ఇప్పుడు కొత్తగా అత్తలు అయిన, అవుతున్న, అమ్మలందరూ వీలైనంత త్వరగా, తప్పనిసరిగా మారాలి. బహుశా ఈ తరంతో.. ఈ అత్త – కోడళ్ళ.. Tom and Jerry షో అయిపోతుందని అనుకుంటా అన్నాడు.. నా మొహం వైపు కొంచెం విసుగ్గా చూస్తూ, ప్రతి మాటకి అంతాగా ఆశ్చర్య పోకులే Tom and Jerry నేను కూడా చూస్తాను” అన్నాడు. 


“ఆహా స్వామీ..” అంటూ ఏదో అనబోతుంటే.. 


“ఏమండీ.. ఈ రోజు వాకింగ్ లేదా?” అని మా ఆవిడ నిద్రలేపితే మెళుకువ వచ్చింది. 


రోజూ ఏదో ఒక సందర్భం లో.. “ఏమండీ! మనకి ఎలాంటి కోడళ్ళు వస్తారో” అనే మా ఆవిడ మొహం లో ఆ చిన్న భయం, 1996 లో పెళ్ళైన కొత్తలో మా ఇంట్లోకి వస్తున్నప్పుడు ‘అత్త ఎలాంటిదో’ అన్న భయం ఒకటేనని ఇప్పుడు తెలిసింది. 


ఏది ఏమైనా దేవుడు భలే ఫిట్టింగ్ పెట్టాడులె, ఎంతైనా దేవుడు, దేవుడే! గొప్పోడు! ఎప్పటికీ గొప్పోడే! అనుకున్నా. 

కానీ నాకు ఎందుకో సడన్ గా రామ్ గోపాల్ వర్మ గుర్తొచాడు. ఎప్పుడూ మనసుతోనే కాదు, అప్పుడప్పుడు మెదడు తో కూడా ఆలోచించాలి అని అంటున్నట్టున్నాడు, లాజిక్ లకి గురువు కదా. చూద్దాం ముందు ముందు ఏం జరగ బోతుందో. ప్రతీ సారి దేవుడిని అడిగే బదులు, ఈ సారి RGV ని అడిగితే బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలే గాని, అందరం RGV ఫోటోని ఇంటిలో పెట్టుకోమూ??? 


నాకు చిన్నప్పటి నుండి RGV ఒక Obsession. శివ సినిమాలో చైన్ లాగి తిరగబడే సీన్ నుండి, క్షణక్షణం లో ట్రైన్ పై నుండి డబ్బుల బాగ్ ని పారేస్తానని విలన్ ని భయపెట్టే హీరో వరకు, తాను రాసిన “నా ఇష్టం” పుస్తకం లో.. నేను నా గురించి రాసుకొని, ఇంకొకడికి అంకితం ఇవ్వడం ఏంటి??? అని స్వంతనికే అంకితం ఇచ్చుకునేంత Clarity, Guts వున్న ఏకైక వ్యక్తిని మనం, కను చూపు మేర లో తుపాకి పట్టుకొని వెతికినా దొరకరు. 


నా ఉద్దేశ్యం మనలో చాలామంది ఎలా బ్రతకాలి అనుకుంటారో.. అలా బ్రతికే వ్యక్తి RGV. 


సరే మనం ఈ RGV అని పిలుచు కొనే ఆ ‘జీవి’ గురించి ఇంకో సారి మాట్లాడు కుందాం. ఇంతకీ మీకు విషయం అర్థం అయింది కదా??? సినిమా భాషలో చెప్పాలంటే, నటన వచ్చిన వాడు, ఏ పాత్ర వేసిన అందులో ఒదిగిపోతాడు. అలాగే ప్రేమించడం తెలిసిన వ్యక్తి ఎవరినైనా ప్రేమించాలి, వీలైతే, వీలైనంత సమానంగా ప్రేమించాలి, అది కూతురైనా.. కోడలయినా.. కొడుకైన.. అల్లుడైనా.. ప్రాస కోసం, ఫ్లో కోసం అన్నాను గాని, అల్లుడిని అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు లెండి, భయంతో వచ్చిన భక్తికి గౌరవం తగిలించి మరీ.. ఈ అల్లుడు అనబడే Special status కలిగిన వాడి సంగతి ఇంకో సారి చూద్దాం. 


పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

ree

పేరు: పుల్లేటికుర్తి నగేశ్ 

వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం. 

వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్ 

పుట్టిన ఊరు;;;;  శ్రీకాకుళం 

bottom of page