అమ్మకు బాకీ
- Sudarsana Rao Pochampalli

- May 8
- 4 min read

Ammaku Bakee - Telugu Family Story | Sudarsana Rao Pochampally
అమ్మకు బాకీ - తెలుగు కుటుంబ కథ | సుదర్శన రావు పోచంపల్లి
Published In manatelugukathalu.com On 08/05/2026
ఎంతో ప్రేమతో ఒక బిడ్డను, ఒక కొడుకును కంటుంది విజయశ్రీ. తండ్రి పేరు విభాకర్. బిడ్డ పేరు సింధుజ, కొడుకు పేరు స్వభువు.
తల్లిదండ్రులు అంత స్థితిమంతులు కాకపోయినా, అంతంత మాత్రమే బతుకుకు ఢోకా లేకుండా సంసారాన్ని నడుపుతారు.
బిడ్డ మొదటిదైనా, కొడుకు తరువాతైనా ఇద్దరినీ ఎంతో ప్రేమతో పెంచి, మంచి చదువు చెప్పించేందుకు ప్రయత్నిస్తారు.
బిడ్డ పెద్దది కావడం వలన పదో తరగతి, కొడుకు ఎనిమిదో తరగతి చదువుతుంటారు.
బిడ్డ (సింధుజ) కు డబ్బులు ఖర్చు పెట్టడం అంతగా తెలియదు. కొడుకు (స్వభువు) మాత్రం స్నేహితుల ప్రభావంతో ఖర్చు చేయడం నేర్చి, అప్పుడప్పుడు తల్లిని అడిగి తీసుకుంటాడు.
ఒకసారి స్నేహితులతో ప్రయాణం చేయగా డబ్బులు అవసరమని తల్లి దగ్గర 100/- రూపాయలు అడిగి ప్రయాణానికి సిద్ధమవుతాడు. "అమ్మా! నీవు ఇచ్చిన ఈ నూరు రూపాయలు ఖర్చు అవ్వకపోతే నీకు తిరిగి ఇచ్చేస్తాను" అని అంటాడు.
త్రోవలో నదిలో ఆడుకుంటూ ఉండగా అమ్మ ఇచ్చిన 100/- రూపాయలు నదిలో కొట్టుకుపోతాయి.
ఇంటికి వెళ్తే అమ్మ నమ్మక తిడుతుందనే భయంతో స్నేహితులకు చెప్పకుండా నదిలో దూకుతాడు. అతనికి ఈత రాదు. అయినా కొంచెం లోతుకు వెళ్లి వెతుకుతాడు. కానీ వర్షం మొదలై స్వభువు ఒడ్డుకు చేరకుండా, వర్షపు ప్రవాహం అతన్ని కొట్టుకుపోయేంత తీవ్రంగా మారుతుంది . వెంట ఉన్న స్నేహితులు గాలించినా ఫలితం దక్కక, తీవ్రమైన నదిలో స్వభువు కొట్టుకుపోయాడని తల్లికి, తండ్రికి చెప్పి ఏడుస్తారు.
తల్లి, తండ్రి, అక్క దిగ్భ్రాంతితో ఈ విషయం విని ఓదార్చే దిక్కు కూడా లేక చాలా విలపిస్తారు. అయినా ఆశ వదులుకోక ముగ్గురు ఎంతో దూరంలో ఉన్న నది వైపు ప్రయాణించి అక్కడి వారితో తమ బాధను తెలుపుతారు. అక్కడి వారు, "అయ్యా! ఈ నది చాలా లోతైనది, పైగా వర్షం మొదలవడంతో మీ బాలుని ఆచూకీ దొరకడం కష్టమే" అని చెబుతారు.
ముగ్గురూ ఏడ్చి ఏడ్చి చేసేది లేక ఇంటికి చేరి కంటిలో కన్నీరు కూడా లేకుండా కుమిలిపోతారు. ఇది చూసి ఇంటి పక్కవారు, చుట్టాలు, స్నేహితులు వచ్చి వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేసి, నీరసంగా ఉన్న వారికి తినిపించే ప్రయత్నం చేస్తారు. కన్నతల్లి మాత్రం శోకంతో పడిపోతుంది. తండ్రి, అక్క కూడా ఏమీ పాలుపోక దిక్కులు చూస్తుంటారు. వాళ్ళు మామూలు స్థితికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. ఇక స్వభువు నదిలో కొట్టుకుపోయి తెల్లవార్లూ జాగరణతో ఇంకా ఇంకా ముందుకు పోయి సాయంత్రానికి ఒక ఒడ్డుకు చేరుతాడు. కానీ అతని అదృష్టం ఏమిటంటే కేవలం ప్రాణాలు నిలబడటమే.
అలా విహారానికి వచ్చిన ఒక జంటకు అతను కనిపిస్తాడు. వారి పేర్లు వాసుదేవ, సౌధామిని. ఇద్దరూ బాగా చదువుకున్నవారు, కానీ వారికి సంతానం లేదు. దొరికిన అబ్బాయిని తమ వెంట తీసుకువెళ్లి ప్రేమతో చూసుకుంటారు.
ఆ దంపతులు ఇద్దరూ స్వభువును ప్రేమతో చూసుకుంటూ, "పిల్లలు కలుగని మాకు భగవంతుడే నీ రూపంలో పంపాడు కావచ్చు" అనుకుంటూ, "నాయనా! మా దగ్గర ఉండి మంచి చదువులు నేర్చుకో. మాకూ సుఖము, నీకూ ఆనందమే" అని అంటారు.
దయతో తనను దగ్గరకు తీసిన ఆ దంపతులను అమ్మా, నాన్నా అనుకుంటూ వారితోనే ఉంటాడు.
వారికి సంతోషం కలిగిస్తూ తనూ వారింటి మనిషిగా మెలుగుతాడు. వారి సహాయంతో పైచదువులు చదివి కలెక్టర్ ఉద్యోగం సాధిస్తాడు.
ఇక్కడ అక్క కూడా ఎం.ఏ. వరకు చదువుకుని మంచి అబ్బాయితో వివాహం జరిగి ఇద్దరు అబ్బాయిలను కంటుంది.
తనను పెంచుకున్న తల్లిదండ్రులు తనకు పెళ్లి చేద్దామని చూస్తుంటారు. వారికి మాత్రం స్వభువు చెప్పేది ఏమిటంటే, "మీరు చూసిన అమ్మాయిని నేను ఇష్టపడతాను, కానీ ఆ అమ్మాయిని నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు మెచ్చితేనే చేసుకుంటాను" అని.
"మీరు ఆ అమ్మాయితో కలిసి మా ఊరికి వచ్చి, నా తల్లిదండ్రులకు చూపిస్తే నేను సిద్ధమే" అంటాడు.
ఆ మాటకు సిద్ధమై ఆ అమ్మాయిని తీసుకుని స్వభువు ఉండే ఊరికి వెళ్తారు.
ఒక కారులో స్వభువును సాదుకున్న తల్లి, తండ్రి, తను మరియు పెళ్లికి సిద్ధమైన అమ్మాయితో 100 కిలోమీటర్లు ప్రయాణించి ఊరికి చేరుతారు.
ఇంటికి వెళ్లగానే తల్లి, తండ్రి, అక్క, బావ మరియు ఇద్దరు పిల్లలు ఉంటారు.
కారు దిగగానే మొదటగా తల్లికి, తరువాత తండ్రికి, పిమ్మట అక్కకు, బావకు దండం పెడతాడు. పిల్లలను రెండు చేతులతో అదుముకుని తల్లి దగ్గరకు వెళ్లి, "అమ్మా! ఇదిగో నీ రూపాయి" అని తల్లి చేతిలో పెడతాడు.
"నాయనా! నీకు వంద రూపాయలు ఇచ్చి, నీవు రాని రోజుకు వందసార్లు నేను ఏడ్చిన విలువకు నీవు నీ జీవితాంతం కష్టపడినా నా బాకీ తీర్చలేవు. నీవు లేని బాధ ఎన్ని కోట్లు ఇచ్చినా తీర్చగలదా చెప్పు కొడుకా! నేను, మీ నాన్న, అక్క పొందిన దుఃఖం ఏ తీరుగా చెల్లిస్తావు తండ్రీ? నీకు పునర్జన్మనిచ్చిన ఈ తల్లిదండ్రులను అడుగు, వారికి పిల్లలు లేని బాధ ఎంతనో తెలుసుకో" అని తల్లి అంటుంది.
కొడుకులు పుట్టిన మాతకు
కొడుకా తెలుసుకో కొడుకులు కొంపల లేకన్
అడుగులు పడవిక నడువను
జడుపుతో మంచము పైనే జలుబని పండున్.
"నాకు చెల్లింపనే మాట మరిచి చిరకాలము నాతో ఉంటే నాకు అదే నీవిచ్చే బాకీ" అని అంటుంది.
ఇదంతా చూసి నిర్ఘాంతపోయిన వారు, "ఏమిటి? ఎవరు నీవు? వీళ్లెవరు?" అని ఆశ్చర్యంగా అడుగుతారు.
"అమ్మా! వీళ్లిద్దరూ నాకు మీ తరువాత తల్లిదండ్రులు. అమ్మా! నీ వంద రూపాయలు చూసైనా నన్ను గుర్తుపట్టలేదా? నేను స్వభువును. 20 ఏళ్ల క్రితం నీటిలో కొట్టుకుపోయిన వాణ్ణి. నన్ను బతికించి నాకు ఆశ్రయమిచ్చిన వారు వీళ్లిద్దరు. ఇక ఈ అమ్మాయి మీరు ఇష్టపడితే నా భార్య. ఇప్పుడైనా గుర్తించారా అమ్మా నాన్నా నేను ఎవరినో? వీరి పుణ్యమా అని నన్ను చదివించి కలెక్టర్ పోస్టుకు సిద్ధము చేసినారు" అంటాడు.
అప్పుడు తల్లి, తండ్రి వాళ్లిద్దరికీ నమస్కారము చేస్తూ, "మా బాబు కాదు, మన బాబును ఇంత చదివించి మంచి పోస్టుకు సిద్ధపరిచారు, మీకు ఎనలేని వందనాలు" అంటారు.
"బాబూ! నాకు 100 రూపాయలు మర్చిపోకుండా ఇచ్చావు, మరి ఈ 20 ఏళ్ల కన్నీటికి ఏమి ఇస్తావు? పోయిన మనిషి మళ్ళీ రావడమంటే ఇదేనేమో. అక్కకు, బావకు, పిల్లలకు నీ మదిలో నిలుపుకో. పండుగంటే ఈ దినమంత పండుగ మేము చూడలేదు, వినలేదు."
"అమ్మా, నాన్నా, అక్కా, బావా! మీ ఆశీర్వాదాలతో నాకు మరో జన్మనిచ్చిన ఈ తల్లిదండ్రులు చూపిన ఈ అమ్మాయిని మీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను" అంటాడు.
"లక్ష్మి మన ఇంటికి వచ్చినట్టుంది. అయినా నీకు మరో జన్మనిచ్చిన తల్లిదండ్రులను అడిగి చేసుకో. మాకు ఏమీ అభ్యంతరం లేదు" అంటారు.
"అందరూ మెచ్చిన కన్యా! రావమ్మా, కాబోయే మామకు, అత్తగారికి, ఆడపడుచుకు, బావకు ఆశీర్వాదాలు తీసుకో" అని అమ్మాయిని అంటారు.
ఇరువురి అంగీకారముతో స్వభువుకు, శ్రియకు పెళ్లి కుదురుతుంది.
స్వభువుకు ఉద్యోగం రాగానే వేరే రాష్ట్రంలో ఉంటూ ఇటు తల్లిదండ్రులను, అటు మరో జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకుంటూ ఆనందంగా ఉంటారు.
అత్తయు మామయు వదినయు
కొత్తగా వచ్చిన ఆయనను కోరగా పిల్లల్
సత్తువ గొలిపెడి మామయు
అత్తయు అందరు కలిసియు అరుగగ పెళ్ళే –
అందరినీ పిలుస్తూ కాబోయే శ్రియ పెద్దలందరికీ నమస్కారం చేసి, పిల్లలను ముద్దాడి తన పెళ్లికి రావాలని తానే పిలుస్తుంది. భర్త కాబోయే స్వభువుకు స్వాగతం పలుకుతూ, "అందరూ వస్తేనే మనమిరువురము వివాహ మంటపానికి చేరుతాము" అని అంటుంది.
“ఇద్దరు అత్తలు, ఇద్దరు మామలు కలిసి దీవించగా మా అమ్మయు నాన్నయు చెందే ఉత్సాహం చెప్పనలవి కాదు.
ఇది ఒక నూతన వివాహం అనబడును. తక్కిన విషయాలు మా అమ్మ నాన్నలతో సంప్రదించి ఏర్పాట్లు చేయగలము. కనుక మీరందరూ తయారై మన ఊరికి వెళ్దాము.
అన్నయ్యా! చెల్లెలు పిలుస్తున్నది అనుకోకుండా నా పెళ్లికి వచ్చి అక్షింతలు వేయండి. ఇది నా విన్నపము.”
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.






Comments