అమ్మా నాన్నా! నన్ను చంపకండి

Amma Nanaa! Nannu Champakandi - Telugu Emotional Story | Naga Suneetha Pokala
అమ్మా నాన్నా! నన్ను చంపకండి - తెలుగు భావోద్వేగ కథ | నాగ సునీత పోకల
Published in manatelugukathalu.com on 29/09/2026
‘అమ్మా నాన్నా! నన్ను చంపకండి’ అనేది పుట్టకముందే ప్రాణం కోల్పోతున్న ఆడ శిశువు ఆవేదనను ఆత్మకథ రూపంలో చెప్పే హృదయవిదారక తెలుగు కథ.ఆడపిల్ల పుట్టడం భారమనే భావన, లింగ వివక్ష, భ్రూణహత్య వంటి సామాజిక సమస్యలను ఈ కథ ప్రశ్నిస్తుంది.
హాయ్ అమ్మా! ఎవరా అని ఆలోచించొద్దు. నేనే అమ్మా! నువ్వు నీ గర్భంలో జాగ్రత్తగా దాచుకుంటూ, ప్రతి క్షణం నన్ను కాపాడుతున్న నీ కంటి వెలుగును. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని చాలా ఆరాటంగా ఉందమ్మా. నువ్వు నా మీద ఏ దిగులూ పెట్టుకోకు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను.
ఈ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది కదమ్మా? ఎప్పుడెప్పుడు ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తానా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను. దానికి ఇంకా 6 నెలలు టైమ్ ఉంది.
పర్వాలేదులే, అంతవరకు నీ ప్రశాంతమైన గర్భంలో నీ జోలపాటలు వింటూ నిద్రపోతాను.
చెప్పడం మర్చిపోయాను... మంచిగా తినమ్మా! “నువ్వెంత మంచిగా తింటే నేనంత బలంగా ఉంటానంట.”
మొన్న డాక్టర్‌గారు నీకు చెప్తుంటే విన్నాను. బాగా నిద్రపో, విశ్రాంతి తీసుకో, ఫ్రూట్స్ బాగా తిను, పాలు తాగు. అప్పుడే కదా నేను ఆరోగ్యంగా ఉండేది!
ఆ నిండు జాబిల్లిని చూడమ్మా! ఎంత బాగుందో! నేను కూడా అంతే అందంగా పుడతాను కదా? ఇంతకీ నాకు ఏ పేరు పెడతావమ్మా? వద్దులే, నేను నాన్నను అడుగుతాను.
నాన్నైతే మంచి పేరు పెడతాడు. “నువ్వేం బాధపడకమ్మా! నేను పుట్టిన తర్వాత నీకు ఇంటి పనుల్లో సాయం చేస్తాను.”
నాన్నమ్మా, ఏంటి అలా దిగులుగా ఉన్నావు? నువ్వేం దిగులుపడొద్దు. నిన్ను నవ్వించడానికి త్వరలో నేను రాబోతున్నాను.
అయ్యో! ఏంటి తాతా, ఒక్కడివే బిక్కమొహం వేసుకుని కూర్చొని ఉన్నావు? ఏం బాధపడకు. నీ ఒంటరితనాన్నంతా దూరం నేను చేస్తానుగా.
అక్కా, బొమ్మల కోసం కొట్లాడుకుంటున్నారా? ఎంత ఆడుకోవాలో వాటితో అంతా ఇప్పుడే ఆడేసుకోండి. ఎందుకంటే నేను పుట్టాక అవన్నీ నావే కదా!
రేయ్ అన్నయ్యా! ఏం చేస్తున్నావురా? అమ్మో! నాన్న జేబులో డబ్బులు తీసుకుంటున్నావా? జేబు దొంగ! నేనొచ్చాక చెప్తా నీ సంగతి. ఆగు!
ఆ మాటల్లోనే నాన్న వచ్చేశాడు. నాన్న చేతిలో ఏమిటబ్బా అది? ఓ పానీపూరీ! దాన్ని చూస్తేనే నోరూరుతుంది.
నాన్నా, నేను పుట్టాక నా కోసం ప్రతిరోజూ తేవాలి సరేనా! నేనింత మాట్లాడుతుంటే ఒక్కరూ పట్టించుకోరే! పుట్టాక మాత్రం అలా కాదు... ఇంటిని మొత్తం సందడి సందడిగా మార్చేస్తాను.
ఏంటి నాన్నా! ఈరోజు కొంచెం దిగాలుగా ఉన్నావు? ఒంట్లో బాగా లేదా? అడుగమ్మా నాన్నకి ఏమైందో.
“ఏమైందండి? అలా ఉన్నారు. కంపెనీలో ఏదైనా సమస్య?”
“అలాంటిదేదైనా అయితే ఎలాగోలా సాల్వ్ చేసుకోవచ్చు. కానీ, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డే కదా సమస్య.”
“ఏమైందండి మన బిడ్డకు?”
“హా, దానికేమీ కాలేదు. బానే ఉంది. ఈసారి కూడా అమ్మాయేనంట. మొన్న మనం చేయించిన లింగ నిర్ధారణ పరీక్షలో తేలింది.”
“అబ్బా! ఈసారి కూడా పాపేనా? ఇప్పుడేం చేద్దామండి?”
“ఏం చేస్తాము? అబార్షనే చేయించాలి. ఛా! అంతా మన ఖర్మ.”
వీరి గుసగుస మాటలను విన్న నాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది.
అసలిది కలా? నిజమా? మా నాన్నేనా ఇలా మాట్లాడేది? అమ్మేంటి అలా ఒప్పేసుకుంది? మీరు నన్ను ఆటపట్టిస్తున్నారు కదా! కానీ ఇది ఆట కాదు, నిజం అని తెలియడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు.
నా కలల ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్టనిపించింది.
అమ్మా నాన్నా ఏమో ప్రశాంతంగా నిద్రపోతున్నారు... నాకు ప్రశాంతత లేకుండా చేసి.
నిజంగా నన్ను చంపేస్తారా? ఆడపిల్ల అయితే ఏమి, మనిషి కాదా? తల్లిదండ్రుల మూర్ఖత్వాలకు నా ఎంత మంది స్నేహితులు చనిపోయి ఉంటారో! ఒకవేళ వాళ్లు పుట్టి ఉంటే ఎంత మంది కలెక్టర్లు, ఎంత మంది పోలీసులు, ఎంత మంది డాక్టర్లయి ఈ సమాజానికి సేవ చేసేవారో! నేను వారిలా కాకూడదు, వారిలా నేను ఈ ప్రపంచాన్ని చూడకముందే చావకూడదు. నేను ఈ ప్రపంచాన్ని చూడాలి. ఈ సమాజానికి నేనెంతో చూపించాలి.
కానీ ఎలా? సొంత తల్లిదండ్రులే నన్ను చంపాలని పన్నాగాలు పన్నుతున్నారే! వీరి కబంధ హస్తాల నుంచి నేనెలా తప్పించుకోవాలి?
ఇలా ఆలోచిస్తూ ఉండగా తెల్లారింది. రోజూ ఉన్న ఉత్సాహం నాలో ఈరోజు లేదు. రోజూ ఎంతో సరదాగా లేచే నేను అసలు నిద్రనే పోలేదు.
రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్లంతా ఎర్రబడ్డాయి. కానీ నా ఆర్తనాదాలు మా అమ్మ మనసును కానీ, నాన్న మనసును కానీ తాకలేదు.
మొదటిసారి మా అమ్మానాన్నలు నాకు క్రూర మృగాల్లా కనిపించారు. కంట్లో ధార ఆగడం లేదు. ఏడ్చి ఏడ్చి గొంతెండిపోయింది. కానీ నా బాధ వారి మనసును కరిగించలేదనుకుంటాను.
నన్ను చంపించడానికి ఉదయమే బయలుదేరారు, సిటీలో పేరుమోసిన ఓ పెద్ద హాస్పిటల్‌కి.
హాస్పిటల్ చాలా విశాలంగా ఉంది. నాకు మాత్రం అది యమలోకంలా అనిపించింది. అమ్మ ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే, నా ఆయుష్షు కొవ్వొత్తిలా తరిగిపోతున్నట్టనిపించింది నాకు.
గుండెల నిండా భయం... తట్టుకోలేకపోతున్నాను.
హాస్పిటల్ లోపలికి వెళ్లాం. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను.
నా తల్లిదండ్రులే ఇలా ఉన్నారని అనుకున్నాను, తీరా చూస్తే సమాజం అంతా ఇలానే ఉంది! ఎంతో మంది తల్లులు ఆడపిల్ల అని తెలియగానే ఆదిలోనే చంపేయడానికి వందల్లో కాదు, వేలల్లో వచ్చారక్కడికి. ఇది చూసి నాకు నోట మాట రాలేదు.
ఇక్కడ ఇన్ని అన్యాయ అక్రమ పాపాలు జరుగుతుంటే చట్టం ఏం చేస్తుంది? కళ్లకు గంతలు కట్టుకుందా? అధికారులు ఏమయ్యారు? నిద్రపోతున్నారా? అంతేలే! చట్టం కళ్లు తెరిచినా, అధికారులు నిద్ర లేచినా లంచమనే మత్తుమందుతో వారిని పడుకోబెడతారు. ఛీ! సమాజం ఎంత నీచానికి దిగజారింది!
చివరికి అమ్మ వంతు వచ్చింది. అమ్మా నాన్న ఇద్దరూ డాక్టర్ రూమ్‌లోకి వెళ్లారు.
రూమ్‌లో ఏసీ ఉన్నా, డాక్టర్ ఏం చెబుతారోనన్న భయంతో నా ఒళ్లంతా చెమటలు పట్టాయి.
చివరికి డాక్టర్ యాభై వేల రూపాయలకు అబార్షన్ చేయడానికి ఒప్పుకున్నారు. అంతే, నా ప్రాణాలు గాల్లో తేలుతున్నట్టనిపించింది.
ఛీ! వెధవ డాక్టర్! ప్రాణం పోయాల్సింది పోయి 50,000 డబ్బులకు సొల్లు కార్చి, జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నన్ను చంపేస్తున్నాడు. ఈ పాపం ఊరికే పోదు... అంతకంతకు అనుభవిస్తావు! నాదే కాదు, ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న నా స్నేహితులందరిదీ ఇదే మాట. వీరిదే కాదు, ప్రాణం పోయినా జీవితం మీద ఆశ చావని, చనిపోయిన నా స్నేహితులందరిదీ కూడా!
అమ్మా! నన్ను చంపేయొద్దమ్మా. నాకు పుట్టాలని ఉంది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలని ఉంది. నీ గోరుముద్దలు తినాలని ఉంది. నీ ఒడిలో నిద్రపోవాలని ఉంది.
నాన్నా! నాకు ఒక్క అవకాశం ఇవ్వు నాన్నా. నీకు పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాను. నువ్వు తలదించుకునే పనులు అస్సలు చేయను. నీ చెయ్యి పట్టుకుని చిన్ని చిన్ని అడుగులు వేయాలనుంది.
అమ్మా నాన్నా! నేను నానమ్మ, తాతయ్య చెప్పే కథలు వినాలి.
వారితో ఆడుకోవాలి. నా తోబుట్టువులతో గొడవపడాలి. నా ఈ కలలన్నింటినీ ఆవిరి చేయొద్దండి. నాన్నా! నన్ను భారంగా చూడొద్దు. దయచేసి నన్ను బతకనివ్వండి.
నా ఈ రోదనంతా ఆ కఠిన హృదయాలకు తాకలేదు.
చివరికి అమ్మ అబార్షన్ రూమ్‌కి వెళ్లింది. డాక్టర్ ఓ టాబ్లెట్ ఇచ్చి వేసుకోమన్నారు.
నేను ఎంత చెప్తున్నా వినకుండా ఆ టాబ్లెట్ వేసుకుంది. ఆ టాబ్లెట్ వచ్చి సరాసరి నా గొంతులో పడింది.
నా గొంతు చిన్నది కదా, ఆ టాబ్లెట్ నా గొంతులో ఇరుక్కుంది. గొంతంతా చేదు, నొప్పిగా ఉంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. ఆ బాధను భరించడం నా వల్ల కావట్లేదు.
ఆ టాబ్లెట్ నా గొంతులోనే కరిగిపోయింది. ఇప్పుడు అది నా శరీరం మీద ప్రభావం చూపడం మొదలెట్టింది.
ఒక్కసారిగా నా నరాలన్నింటినీ తుంచివేసింది. నా గుండె గదులన్నీ పగిలాయి, అవయవాలన్నీ ఒకదానితో ఒకటి విడిపోయాయి, కళ్లు ఉబ్బాయి.
చందమామంత అందంగా ఉన్న నేను చూడలేనంత అందవిహీనంగా మారాను. సజీవంగా ప్రపంచాన్ని చూడాల్సిన నేను నిర్జీవమై ప్రపంచంలోకొచ్చి అమ్మ ఒడిలో కాకుండా చెత్తకుప్ప ఒడిలో వాలాను.
“నాలా ఎవరికీ కాకూడదని కోరుకుంటూ ఇక సెలవు.”
“అది మీ చేతుల్లోనే ఉంది.”
“ప్రతి తల్లిదండ్రులకు నా విన్నపం ఇదే... 'ఆడ' శిశువును కడుపులోనే సమాధి చేసి, వారిని చెత్తకుప్పలో విడవకండి.”
ఇట్లు,
లోకం చూడని ఓ చిన్నారి.
***
నాగ సునీత పోకల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం: నాగ సునీత పోకల







Comments