అగ్గినిప్పు లాంటి నిజం

Agginippu Laanti Nijam | Telugu Comedy Story | Nallabati Raghavendra Rao
అగ్గినిప్పు లాంటి నిజం | తెలుగు హాస్య కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు
Published in manatelugukathalu.com on 29/09/2026
“అగ్గినిప్పు లాంటి నిజం” ఒక చక్కని హాస్య వ్యంగ్య సామాజిక కథ. రచయిత జగన్మోహనం తన కథకు బహుమతి రావడంతో ఎంతో ఆనందిస్తాడు. రచయితల మధ్య పరస్పర పఠనం, రచనకు గౌరవం, స్వీయ విమర్శ అవసరం వంటి అంశాలను సరదాగా ఆలోచింపజేసే విధంగా చెప్పిన కథ ఇది.
జగన్మోహనం రచయిత. ఐదు సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా ఎన్నో కథలు రాసిన రచయిత. అతను రాసిన 50 కథలలో పది కథలకు చిన్నాచితకా బహుమతులు కూడా గెలుచుకున్నాడు.
అలా జగన్మోహనం కొందరు ఘనాపాటీలైన రచయితల దృష్టిలో పడ్డాడు కూడా. అలా సాహితీ రంగంలో కొనసాగుతున్నటువంటి రచయితలు ఎవరో తెలుసుకోవాలని జగన్మోహనం ఒకసారి ప్రయత్నించి, ఒక ప్రముఖ రచయిత దగ్గరకు వెళ్లి వాళ్లందరి పేర్లు, అడ్రస్లు, బయోడేటాలు పూర్తిగా తెలుసుకొని వాళ్లందరినీ తన దృష్టిలో పెట్టుకున్నాడు.
అందరిలోనూ కలిసిపోతూ జగన్మోహన్ కథలు రాస్తూ ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.
అతని భార్య పేరు జగన్మాత. పెళ్లి చూపుల్లో జగన్మాత అనే ఆ అమ్మాయి పేరు విని, ఆ అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాడు జగన్మోహనం. ఎందుకంటే ప్రాస బాగా కుదిరిందని, పదిమంది 'ఆహా ఓహో' అంటారని అదో ఆనందం అతనికి. అలా జగన్మాతతో పెళ్లయిన తర్వాత ఓ పది సంవత్సరాలు సంసార బండి బాగానే లాగించాడు.
ఇద్దరు చిన్న పిల్లలు స్కూల్‌కి వెళుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. అదంతా అతని కుటుంబ స్టోరీ విషయం.
అసలు ఏమిటంటే... జగన్మోహనం ఒక ప్రఖ్యాత వెబ్ మ్యాగజైన్ వారు నిర్వహించబోతున్నటువంటి కథల పోటీ యాడ్ చూశాడు. అది తెలుగుమిత్ర డాట్ కామ్ వారి ప్రకటన.
వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో కథల పోటీ నిర్వహిస్తూ ప్రథమ బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 5,000, ఇంకా 2,000, ఒక వెయ్యి బహుమతులు కొన్ని చొప్పున ప్రకటించారు. ఆ ప్రకటన చూసిన జగన్మోహనం ఎగిరి గంతేశాడు.
గంతులేస్తూ ఎగిరి ఆనందించాడు. 'కనీసం 10,000 బహుమతి రాకపోయినా 5,000 రూపాయల బహుమతి వచ్చినా సరిపెట్టుకుందాం...' అన్న ఆనందంతో, ఉత్సాహంతో జగన్మోహనం ఒక మంచి శుభ సమయాన ఒక మంచి కథ రాసి ఆ వెబ్‌సైట్ వారికి పోస్ట్ చేశాడు.
అంతా బాగానే ఉంది. ఒక వారం, 15 రోజుల్లో ఆ వెబ్‌సైట్ వారు బహుమతులు ప్రకటించారు.
జగన్మోహనానికి ద్వితీయ ప్రైజ్ అయినటువంటి 5,000 రూపాయల బహుమతి తగిలింది.
దాంతో అతను ఆనందం పట్టలేక బెలూన్‌లా ఉబ్బితబ్బిబ్బైపోయాడు. 'ఆహా ఓహో' అన్నాడు. భార్యను పిలిచి రకరకాల పిండివంటలు వండమని ఆర్డర్ వేశాడు. ఆమె అంతా విని, "ఓయబ్బో ఓరబ్బో" అనుకుంటూ లోపలికి వెళ్లి అతను చెప్పినట్టే చేసింది.
సరే, ఒక శుభముహూర్తాన ఆ వెబ్‌సైట్ వారు ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ సభకి జగన్మోహనం ప్రయాణమయ్యాడు. అంతకుముందే ఆ వెబ్‌సైట్ వారు అలా బహుమతులు వచ్చిన వారి కథలన్నీ తమ వెబ్‌సైట్‌లో ప్రచురించి ఉన్నారు.
అందుచేత జగన్మోహనం తన కథను చాలామంది చదివి ఉంటారని అభిప్రాయపడి ఆనందించాడు. వారందరితో ఆనందంగా ముచ్చటించి తన కథ యొక్క గొప్పతనం తెలియజెప్పుకోవచ్చు అన్న ఆనందంతో భార్యతో సహా ఆ సభా ప్రాంగణంలోకి ప్రవేశించాడు.
ఆ తర్వాత మహా ఘనాపాటీలైనటువంటి రచయితలు, రచయిత్రులు అందరూ అక్కడికి రావడం అతనికి చాలా ఆనందం కలిగించింది. వాళ్లతో కరచాలనం చేసి, తాను పరిచయం చేసుకొని, వాళ్లందరితో పాటు తను కూడా తనకు వచ్చిన బహుమతి అందుకుని సన్మానంలో కూడా పాల్గొని వాళ్లందరితో కలిసి ఫోటోలు దిగి ఊరుకున్నాడా... ఊరుకోలేదు.
జగన్మోహనం కార్యక్రమం అంతా అయిపోయాక అక్కడ ఉన్న రచయితలు, రచయిత్రులను ఒక్కొక్కరినీ కలుసుకొని, "నేను చాలా గొప్ప కథ రాశాను. మీరు చదివారా... మీరు చదివారా?" అంటూ ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అడిగాడు. అందరూ తమ పేర్లు కూడా చెప్పి అతనితో పరిచయం చేసుకుని, "చదవలేదండి" అన్నారు.
మళ్లీ అరగంట పోయాక ఇంకొక రౌండ్ వేసి జగన్మోహనం ప్రతివారి దగ్గరకు మళ్లీ వెళ్లి, "నా కథ 'అగ్గినిప్పు లాంటి నిజం' వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది... చదివారా?" అంటూ అడిగాడు. వాళ్లు "అలాగా అండి... సరేనండి, చూడలేదండి, చూస్తామండి," అన్నారు.
అలా వాళ్లు అనడంతో జగన్మోహనం కాస్తంత నీరసపడి తన భార్య జగన్మాతతో కలిసి ఇంటికి వచ్చేసాడు.
ఇంటికి వచ్చినటువంటి జగన్మోహనం అక్కడ ఉన్న పెద్ద టవల్ తీసుకొని నెత్తికి కట్టు కింద కట్టుకున్నాడు.
"ఏమిటండీ ఇది... ఇలా నీరసంగా కూర్చున్నారు? ఏంటి? అయ్యో రామా!" అంటూ అడిగింది జగన్మాత. వెంటనే లోపలికి వెళ్లి ప్లేట్లో రకరకాల ఫలహారం తెచ్చి "తినండి" అని ముందు పెట్టింది.
కోపంగా... "ఛెస్! నేను ఇవి తినను," అన్నాడు.
"ఎప్పుడూ బయట నుంచి వచ్చాక నేను పెట్టేవన్నీ శుభ్రంగా తిని మంచినీళ్లు ఫుల్లుగా తాగేవారు కదా! అదేమిటి పాపం? అయ్యో పాపం తినండి," అంది.
"అది కాదు, మనం సభకు వెళ్లామా? అక్కడ 100 మంది రచయితలు, రచయిత్రులు వచ్చారా? అందరినీ అడిగాను, ఒక్కరు కూడా నా కథ చదవలేదట.
అంటే ఆ లెక్కన నా కథ ఎవరూ చదవనప్పుడు నాకు అవమానమే! 5,000 రూపాయలు ప్రైజ్ ఇచ్చారు... మహా ఆనందం. చిన్న సైజు సన్మానం చేశారు... మహా సంతోషం. అంత కష్టపడి రాసి బహుమతి గెలుచుకున్న నా కథ ఎవరూ చదవకపోతే నేను ఎందుకు? ఇక నేను కథలు రాయలేను. ఛీ ఛీ!" అంటూ జగన్మోహనం భార్య ముఖం మీద తుంపర్లు పడేలా అన్నాడు.
ఆవిడ ముఖం అలా తుడుచుకుని... "అయ్యో పాపం! ఎంత బాధగా ఉన్నారు మీరు!" అంటూ లోపలికి వెళ్లి రెండు స్టీల్ ప్లేట్ల నిండా రకరకాల ఫలహారాలు పట్టుకొచ్చి మళ్లీ పెట్టి "తినండి" అంది.
"ఛెస్! నేను తినను. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మన కథ ఒక్కడు కూడా చదవలేదు అంటే ఎంత అవమానమో ఆలోచించు. వంద మందిలో ఒకరు కూడా చదవలేదు," అంటూ ముడిచిపెట్టుకుని ఏమీ తినకుండా అలా బాసింపట్టు వేసుకొని కూర్చున్నాడు.
"అయ్యో పాపం... చాలా బాధల్లో ఉన్నారండి మీరు," అంటూ జగన్మాత భర్త పక్కకు వచ్చి కూర్చుని, "ఏమండీ" అంది.
"హూ" అన్నాడు చిరాగ్గా.
"ఏమండీ" అంది మళ్లీ.
"ఎన్నిసార్లు అంటావు 'ఏమండీ' అని? చెప్పు," అన్నాడు జగన్మోహనం మహా చిరాకుగా.
"మరి మీ కథ ఒక్కరు కూడా చదవలేదా అండి? అయ్యో పాపం," అంది నీరసంగా.
"అవును, ఒక్కరు కూడా చదవలేదు. అదే నా బాధ. చదివి ఉంటే ఇంత బాధ ఉండకపోను.
కనీసం ఒకరిద్దరు చదివినా ఓ మాదిరిగా ఉండేది... బాగులేదన్నా... ఆహా అన్నా... సరిపెట్టుకుందును."
"అయ్యో పాపం," అంది మళ్లీ జగన్మాత.
"ఏమండీ..." అంది మళ్లీ.
"చెప్పు... ఏమండీ ఏమండీ అని అస్తమానం అలా గోకేస్తావేందుకు?" అన్నాడు.
"మరి మీ కథ అక్కడికి వచ్చిన వందమంది రచయితలు, ఏ ఒక్క రచయిత కానీ, రచయిత్రి కానీ చదవలేదు అంటున్నారు కదా."
"అవును, ఎన్నిసార్లు చెప్పాలి నీకు?" అన్నాడు జగన్మోహనం.
"సరే, ఇప్పుడు మీకు చాలామంది రచయితలు, రచయిత్రులు పరిచయమయ్యారు కదా! వాళ్లందరూ సీనియర్లు.
వాళ్లందరి బయోడేటాలు కూడా మీకు తెలుసు కదా! వాళ్లు 10, 15 సంవత్సరాల నుంచి కథలు రాస్తున్నారు కదా! మీరు వాళ్లలో ఏ ఒక్కరి కథ అయినా ఎప్పుడైనా చదివారా... చదివారా? పోనీ ఇప్పుడు ఈ 'తెలుగుమిత్ర డాట్ కామ్' వారు ప్రచురించిన కథలు... అందులో ఒకటైనా మీరు వాళ్లవి చదివారా?"
"లేదు, ఎందుకు చదవాలి? అసలు నేనెందుకు చదవాలి? నేనే ఓ పెద్ద రచయితను."
"అయ్యో పాపం! నేను ఏమనుకుంటున్నాను అంటే... వాళ్ల కథలేవీ మీరు చదవనప్పుడు మీ కథ వాళ్లు ఎలా చదువుతారు అనుకుంటున్నానండి," అంటూ అక్కడ జగన్మోహనం తినకుండా వదిలేసిన ఫలహారాల స్టీల్ ప్లేట్లన్నీ పట్టుకుంటూ లోపలికి వెళ్లిపోయింది.
జగన్మోహనం బుర్ర గిర్రున తిరిగినట్లు అనిపించి తల అలా పైకి ఎత్తాడు. ఇంకాస్త పైకి ఎత్తాడు... అలా పైకెత్తి స్లాబ్ సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయాడు.
భార్య లోపలకు వెళుతూ అన్న మాటలు అతని చెవుల్లో గొంగళి పురుగులు తిరుగుతున్నట్టు తిరుగుతున్నాయి.
మరి జగన్మోహనమా మజాకా!
తన కథ అందరూ చదవాలట... తను మాత్రం ఎవరి కథలూ చదవడట!
సమాప్తం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు











Comments