అమ్మ బంగారు గాజులు
- Nallabati Raghavendra Rao

- 5 hours ago
- 10 min read

Amma Bangaru Gajulu | Telugu Emotional Story | Nallabati Raghavendra Rao
అమ్మ బంగారు గాజులు | తెలుగు భావోద్వేగ కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు
Published in manatelugukathalu.com on 13/06/2026
అమ్మ ప్రేమకు విలువ కట్టలేం.మన జీవితంలో సంపదలు, సుఖాలు, ఆశలు ఎన్నో వస్తుంటాయి. కానీ తల్లి ప్రేమ, ఆశీర్వాదం, అనురాగం వాటన్నింటికంటే గొప్పవి. త్వరగా ధనవంతుడు కావాలనే ఆశతో తల్లి బంగారు గాజులను దొంగిలించిన ఒక యువకుడు, తన మనసాక్షి వెంటాడటంతో ఎలా మారిపోయాడో చెప్పే ఈ హృదయస్పర్శి కథ ప్రతి ఒక్కరికి జీవిత పాఠం నేర్పుతుంది.
సకలగుణానందం అర కిలోమీటర్ దూరంలో ఉన్న తన స్నేహితుడు అభిరామ్ ఇంటికి పరుగెడుతూ వెళుతున్నాడు. వాతావరణం చలిగా ఉన్నా బట్టలన్నీ తడిచిపోయి, ముఖం నుండి చెమట బిందువులు కిందకి కారిపోతున్నాయి. ఒక పెద్ద అగ్నిగోళం తనను వెనుక తరుముకుంటూ వస్తున్నట్టు కంగారు పడుతూ, ఆయాసపడుతూ పరుగు పెడుతున్నాడు.
అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన అభిరామ్, తన కోసం వచ్చిన తన ప్రాణమిత్రుడు సకలగుణానందాన్ని చూచి కంగారు పడిపోయి, "ఏరా, మీ అమ్మకు ఒంట్లో బాగోలేదా?" అంటూ ఎదురెళ్లి అడిగాడు.
"అమ్మకు బాగానే ఉంది కానీ, మోటారు బండి రాత్రి నుండి పని చేయడం లేదు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేసాను.
ముందు కొంచెం మంచి నీళ్లు ఇవ్వరా," అంటూ గాబరాగా అడిగాడు. మిత్రుడు ఇచ్చిన మంచి నీళ్లు తాగి ప్రశాంతపడి..
"నేను నిన్న చేసిన వెధవ తప్పుడు పనికి ఈ కల వచ్చిందంటావా?" అంటూ సకలగుణానందం తన మిత్రుడిని ప్రశ్నించాడు.
"అదా సంగతి.. అందుకనా ఈ కంగారు? ఏడ్చావు కానీ, అసలు ఆ కల ఏమని వచ్చిందిరా?" అంటూ ఆత్రుతగా అడిగాడు అభిరామ్, పకపక నవ్వుతూ.
"అభిరామ్.. నేను యమలోకములో పెద్ద రాతిదిమ్మ మీద వెల్లకిల్లా పడుకున్నాను. నలుగురు యమభటులు నా కాళ్లు చేతులు కదలకుండా పట్టేసుకున్నారు. దూరంనుండి యమధర్మరాజు ఏదో చెబుతుంటే, ఒక బలమైన యమ కింకరుడు అతిబలమైన పెద్ద రంపపు పళ్ళకత్తి తెచ్చి నన్ను అడ్డంగా కోసేస్తున్నాడు. 'బాబోయ్ బాబోయ్..' అంటున్నా వినిపించుకోవడం లేదు. మరో యమకింకరుడు ఆ కోసిన భాగంలో కారం లాంటిది తోసేస్తున్నాడు. ఆ తర్వాత..." సకలగుణానందం ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు.
"ఆపరా బాబు ఆపు. వింటుంటేనే భయమేస్తుంది. నువ్వు ఎలా అనుభవించావో. అమ్మో అమ్మో. సరే ఏది ఏమైనా, నిన్న నువ్వు చేసిన వెధవ పనికి ఇప్పుడు నీకు వచ్చిన కలకు అసలు సంబంధం లేదు.
ఆ విషయం పక్కన పెట్టు. ఇప్పుడు బంగారం అమ్మి తెచ్చిన ఆ 2 లక్షలు నీ అకౌంట్లో సేఫ్ గా ఉన్నట్టే కదా. అవి నీ దగ్గరే ఉంచు. నేను శివంగి రామ్మూర్తిగారితో మాట్లాడతాను. చెప్పాను కదా, ఆయన చేస్తున్న బిజినెస్ లో ఆయనను నమ్మి నేనైతే పది లక్షలు పెట్టాను, సంవత్సరంలో 20 లక్షలు వచ్చింది. కనీసం నువ్వు 2 లక్షలు పెట్టకపోతే ఆయన ఒప్పుకోడని నీకు చెప్పాను. నీ దగ్గర ఒక్క రూపాయి లేదన్నావు, పోనీ నీ తరుపున నేను పెడదామంటే సమయానికి నా దగ్గర కూడా లేదు. నువ్వు ఎక్కడా ఆ డబ్బు చూసుకోలేనని నాకు చెప్పి, చివరికి నీ ఇంట్లోనే డబ్బుకోసం ఆ వెధవ పని చేశావు. రాత్రంతా అదే తలుచుకుంటూ పడుకున్నట్టున్నావు, అందుకనే ఈ పిచ్చి కల వచ్చింది.
అసలు విషయం ఏమిటంటే, సడన్ గా శివంగి రామ్మూర్తి గారు నిన్న రాత్రి మినిస్టర్ గారిని కలవడానికి ఢిల్లీ వెళ్లవలసి వచ్చింది. వచ్చిన వెంటనే వెళ్లి కలుద్దాం. మంచి ముహూర్తం సమయంలోనే ఆయన ఎవరి దగ్గరైనా అమౌంట్ తీసుకుంటాడు. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. ఎక్కడా ఈ విషయం చెప్పకూడదు సుమా, చెబితే నీకు నాకు కూడా ప్రమాదం," అన్నాడు అభిరామ్.
"ఇదిగో ఒరే అభిరామ్, మనం పెట్టుబడి పెట్టబోతున్న ఆయన చేసే ఆ వ్యాపారం ఏమిటో ఎన్నిసార్లు అడిగినా చెప్పవేమిటి?" విచిత్రంగా ముఖం పెట్టి ప్రశ్నించాడు సకలగుణానందం.
"నాకు కూడా తెలియదురా బాబు నిజం, నీ మీద ఒట్టు.
అవన్నీ పెద్దవాళ్ల వ్యవహారాలు మనకెందుకు? మనం ఏ మాత్రం కష్టపడకుండా మన డబ్బు సంవత్సరంలో డబల్ అవుతుందా లేదా అంతే.. అంతవరకే మనం ఆలోచించాలి. పైగా ఆయన నాకు దూరపు బంధువు, నమ్మబలికిన వాడు," అంటూ స్నేహితుడు సకలగుణానందానికి ధైర్యం చెప్పి ఇంటికి పంపించేశాడు అభిరామ్.
**
రాత్రి అయింది. మంచంమీద వాలిపోయాడు సకలగుణానందం. చూపు ఈ పక్కకు తిప్పాడు. గోడకు అందమైన ఆయిల్ పెయింట్ సీనరీ. ఎత్తయిన మంచు పర్వతం మీద సేదతీరుతున్న అందమైన ప్రేమికుల జంట. ఆ జంటను చూస్తూ మైమరచిపోయాడు సకలగుణానందం.
పుట్టింటికి కాన్పు కోసం వెళ్లిన తన భార్య ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చేసరికి, పెద్ద వడ్డీకి అప్పు చేసైనా సరే రెండు లక్షల రూపాయలతో 'ఇంట్లోకి కావలసిన ఏసి, 72 ఇంచెస్ టీవీ, త్రిబుల్ డోర్ ఫ్రిడ్జ్, 75,000 రూపాయలు ఖరీదైన మలేషియన్ త్రిబుల్ బెడ్ కాట్' అన్నీ సిద్ధం చేసి ఉంచేయాలి.
ఆ తర్వాత దూరంగా ఉన్న అద్దాల బీరువాలో అతని దృష్టి పడింది. ఫ్యామిలీ డాక్టర్ గారు 3 నెలల క్రితం తన తల్లి కోసం మరో పెద్ద డాక్టర్ని కలవాలని ఇచ్చిన కేస్ ఫైల్ ఓపెన్ చేయకుండా అలాగే ఉంది. అందుకోసం రెండు లక్షల రూపాయలు అవుతుంది మరి.
గబగబా పైకి లేచి అద్దాల బీరువాకి తాళం వేసేశాడు, ఆ తర్వాత ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు.
రాత్రి 12 గంటలకు మళ్లీ ఓ భయంకరమైన కల రావడం మొదలు పెట్టింది.
'సకలగుణానందం ఊరు బయట రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. అతని వెనుక నుండి పెద్ద బుల్డోజర్ వచ్చి అతనిని ఒక లోయలోకి తోసేసింది. లోయలో పడి పైకి లేవలేకపోతున్న అతని దగ్గరికి ఐదేళ్ల క్రితం చనిపోయిన అతని తండ్రి వచ్చాడు. అతని చేతిలో పెద్ద గుణపం ఉంది. ఆ ఆయుధంతో తన పొట్టలో లెక్కలేనన్ని సార్లు పొడిచేస్తున్నాడు తన తండ్రి. "నాన్న నాన్న.." అంటున్నా కనీసం కనికరించడం లేదు. అంతేకాదు, అతని తండ్రి పోలికలో ఉన్న మరో వంద మంది ఆ లోయలోకి వచ్చేసారు. అందరి చేతుల్లో భయంకర బలమైన ఆయుధాలు. అందరూ తనను పొడిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.'
"నాన్నా.." అని గట్టిగా అరిచి మంచం మీద నుండి కిందకు పడ్డాడు సకలగుణానందం. పక్క గదిలో మడత మంచం మీద పడుకున్న అతని తల్లి సరస్వతమ్మ లేచి బయటకు వచ్చి, "ఏం జరిగిందిరా బాబు?" అంటూ అడిగింది. భయపడిపోయిన సకలగుణానందం నేల మీద పడి దొర్లేస్తున్నాడు. అతని తల్లి కొంచెం మంచి నీళ్లు అందించింది.
"పాడు కల ఏదైనా వచ్చిందా? కంగారు పడకు," అంటూ దేవుని దగ్గర బొట్టు తెచ్చి పెట్టి మంచం మీద పడుకోబెట్టి తన గదిలోకి వెళ్లిపోయింది.
ఆ రాత్రి మళ్లీ నిద్ర పట్టని సకలగుణానందం తెల్లవారేసరికి వీధిలో పరుగు లంకించుకొని స్నేహితుడు అభిరామ్ ఇంటికి వెళ్లిపోయాడు. జరిగిన కలంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.
"అభిరామ్.. మనం సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్దాంరా, ఈ కల అర్థం ఏమిటో ఆయననే అడుగుదాం. నేను చచ్చిపోతానేమో అన్నంత భయంగా ఉందిరా," అంటూ కొంచెం దూరంలో ఉన్న సిద్ధాంతి రామంపంతులు గారి దగ్గరికి బలవంతంగా తీసుకువెళ్లాడు అభిరామ్ ని. అంతా విన్న సిద్ధాంతి రామంపంతులు గారు ఫక్కున నవ్వాడు.
"స్వప్న శాస్త్రం ఒకటి ఉంది అబ్బాయిలు. కానీ మనకు వచ్చిన ప్రతి కల జీవితంతో అన్వయించుకుంటే బ్రతకలేమురా నాయనా. మొన్న ఆ మధ్య నాకు ఏనుగు మీద ఊరేగుతున్నట్టు కల వచ్చింది. సంవత్సరం నుండి చూస్తున్నాను ఏనుగు లేదు, ఎలక పిల్ల లేదు. నేను చెప్పేది ఏమిటంటే.. ఈ విషయంలో పూజలు పునస్కారాలు ఏమీ వద్దు కానీ, మనం ఎవరిపట్లయినా తప్పుడుగా ప్రవర్తిస్తుంటే అది గ్రహించి మానసికంగా కొంచెం మారగలిగితే.. మారితే కాస్త ఉపశమనం కలగవచ్చు. ఈ సకలగుణానందగాడి పేరు గోత్రం నాకు తెలుసు గనుక, గుడిలో ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు ప్రార్థిస్తానులే. వెళ్లండి," అంటూ పంపించేశాడు రామంపంతులు గారు.
"ఒరేయ్ సకలగుణానందం. నువ్వు ప్రతి నిమిషం నన్ను ఇలా ఏడిపించుకు తినేటట్లయితే నువ్వు అసలు ఈ బిజినెస్ లోనే చేరవద్దు. నువ్వు ఇప్పుడే కోటీశ్వరుడు అయిపోయినట్టు ఫీల్ అయిపోయి, అందరినీ నీ అదుపు ఆజ్ఞలో పెట్టేసుకున్నట్టు భ్రమలో పడిపోయి ప్రతిరోజు పడుకుంటున్నావు. అందుకనే ఇలాంటి వెధవ కలలు నీకు వస్తున్నాయి అనుకుంటున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ డబ్బు నీ దగ్గరే ఉంది కనుక బాగా ఆలోచించుకోరా బాబు. ఇది అసలే డేంజర్ వ్యవహారం," అంటూ తన మటుకు తాను వెళ్లిపోయాడు అభిరామ్.
తాను వెళ్లిపోయాడు అభిరామ్..
సకలగుణానందం మళ్ళీ తన ఇంటి దారి పట్టాడు నీరసంగా.
*
రెండు రోజులు గడిచింది.
తను పెట్టుబడి పెట్టబోయే కొత్త వ్యాపారానికి మంచి ముహూర్తపు రోజు, ఎల్లుండే అని మిత్రుడు అభిరామ్ చెప్పడంతో..
ఆ రాత్రి కూడా మంచం మీద పడుకుని మధురమైన పగటికలలు కనడం మొదలుపెట్టాడు తన బంగారపు భవిష్యత్తు జీవితం గురించి సకలగుణానందం ఎప్పటిలాగే.
సరిగ్గా 12 గంటలకు మళ్లీ భయంకరమైన కల రావడం మొదలు పెట్టింది. ఈసారి సకలగుణానందాన్ని ఒక బంతిలా చేసి పిశాచాలు తెల్లవారులు బంతి ఆట ఆడుకుంటున్నాయి.
మొత్తానికి తెల్లవారింది.
సకలగుణానందం గుండె లబ్ డబ్.. అంటూ కొట్టుకోవడం లేదు, డాం డాం అని బాంబులు పేలిపోతున్నట్టు కొట్టుకుంటుంది.
సకలగుణానందం ఎవరితో మాట్లాడకుండా జేబులో కొంత డబ్బు కుక్కుకొని పరుగు పరుగున ఊరి బయటకు వెళ్లిపోయాడు. మంత్ర తంత్రాలలో పేరు పొందిన పకీరుతాతకు ఈ నాలుగు రోజుల్లో జరిగింది చెప్పాడు. చాలాసేపు ఆలోచించాడు పకీరుతాత.
"గురూ.. నువ్వు త్వరలో చచ్చిపోతావని కర్ణ పిశాచి చెప్తుందిరా. రేపు తిధులన్నీ సమకూరుతాయి. నీ జాతకాన్ని అష్టదిగ్బంధనం చేయాలి. ఖర్చు 2 లక్షలు కంపల్సరీగా అవుతుంది. ఆలోచించుకుని డబ్బు పట్టుకురా పో," అంటూ తన క్షుద్రపూజలో నిమగ్నమైపోయాడు పకీరుతాత.
**
ఏడుస్తూ నీరసంగా ఇంటికి వచ్చేసాడు సకలగుణానందం.
అతని తల్లి తన కొడుకు ఏదో పని మీద బయటకు వెళ్ళాడు వచ్చేస్తాడులే.. అనుకొని ఎప్పటిలా గుడికి వెళ్ళింది.
సకలగుణానందం ఆలోచనలో పడ్డాడు.
శివంగి రామ్మూర్తితో వ్యాపారం కోసం తన మిత్రుడు 2 లక్షలు అడిగాడు. ఆ డబ్బు తన దగ్గర లేకపోవడంతో 2 లక్షల కోసం తన ఇంటిలో తనే దొంగ పని చేయవలసి వచ్చింది.. ఆ తప్పిదమే, ఆ వెధవ పనే, ఆ పాపపు పని ఆలోచనే ఇలా భయంకర కలల రూపంలో కట్టి కుడుపుతుందేమో!
తన దగ్గర బంగారం అమ్మగా వచ్చిన రెండు లక్షల రూపాయలు శివంగి రామ్మూర్తి గారి బిజినెస్ లో పెట్టకుండా ఆ మాంత్రికుడికి ఇచ్చేసి తన ప్రాణం రక్షించుకుంటే..... అమ్మో.. ఆ తర్వాత మళ్లీ ఇలాంటి కలలు రావు అన్న గ్యారెంటీ ఏమిటి?
పోనీ రామంపంతులు సిద్ధాంతి గారు చెప్పినట్టు తను నాలుగు రోజుల క్రితం చేసిన వెధవ పనిని సరిదిద్దుకుంటే సరిపోతుందేమో!?
ఒక నిర్ణయానికి వచ్చిన సకలగుణానందం నాలుగు రోజుల క్రితం తన ఇంటిలోనే తను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునే దిశగా తన ఫోన్ అకౌంటులో ఉన్న 2 లక్షలతో దూరపు టౌనులో ఉన్న గోల్డ్ మార్కెట్ కి వెళ్లి, తను తన వ్యాపారం కోసం తన ఇంట్లోనే దొంగిలించి అమ్మేసిన అమ్మ గాజులు మళ్లీ కొనేసి రాత్రికి వచ్చి, అమ్మ పెట్టింది కొంచెం తిని పడుకున్నాడు.
ఆ రాత్రి ఎలాంటి పాడు భయంకరమైన కల రాలేదు సకలగుణానందంకి. కానీ ఒక బంగారం లాంటి కల వచ్చింది.
"ఆ కలలో.. హంసలు పయనించే సరోవరంలో తను హంసల గుంపుల మధ్యలో హంస తూలికాతల్పం మీద పడుకున్నట్టు. నెమళ్లు తమ అందమైన పించాలతో చల్లగా విసురుతున్నట్టు."
''ఆ కలలో.. హంసలు పయనించే సరోవరంలో తను హంసల గుంపులు మధ్యలో హంస తూలికాతల్పం మీద పడుకున్నట్టు. నెమళ్లు తమ అందమైన పించాలతో చల్ల గా విసురుతున్నట్టు.''
అబ్బా ఎంత అందమైన కల!
తెల్లవారింది. అమ్మ అప్పటికే లేచి తలారా స్నానం చేసి ప్రసాదం చేసి దేవునికి పూజ చేస్తుంది. తను నిద్రలేస్తే తన నోటిలో పెట్టి తనను ప్రేమతో దీవించడానికి.
సకలగుణానందం తన దినచర్యలన్నీ పూర్తి చేసుకుని దేవుని మందిరంలోకి వచ్చాడు. అమ్మ పక్కనే కూర్చున్నాడు.
సరస్వతమ్మ దేవుని దగ్గర కుంకుమ తీసి కొడుకుకు బొట్టుపెట్టి అక్షంతలు వేసి దీవించి, దేవుని ప్రసాదం గోరుముద్దలుగా చేసి తన కొడుక్కి తినిపించింది. ప్రేమగా అతని నుదుటి మీద ముద్దాడింది.
అతని నుదుటి మీద ముద్దాడింది.
అమ్మ ప్రేమాభిమానాలకు చలించిపోయాడు సకలగుణానందం. "అమ్మ.. నేను తప్పు చేశానమ్మ. డబ్బు సంపాదించడం కోసం, గొప్పవాడిని కావడం కోసం పక్కదారి పట్టాలని నిర్ణయించుకుని 2 లక్షల రూపాయల కోసం నాలుగు రోజుల క్రితం నీ బీరువాలో ఉన్న నీ రెండు బంగారు గాజులు దొంగిలించి అమ్మేసిన మూర్ఖుడిని, దుర్మార్గుడిని అమ్మ నేను. కానీ.. అప్పటి నుండి భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నానమ్మా.
అయితే ఈ రోజు నుండి నిజాయితీగా కొత్త జీవితంతో బ్రతకాలని తీర్మానించుకున్నాను. ఇనపపెట్టెలో నువ్వు పెట్టిన చోటే భద్రంగా ఉంచేసిన ఆ బంగారు గాజులు వేసుకుని నువ్వు ఇల్లంతా తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించుకున్నానమ్మా. నా ఆశ తీర్చమ్మ.." అని అమ్మ కాళ్లు పట్టుకొని అందామనుకున్నాడు.. కానీ సిగ్గుతో బిక్కచచ్చిపోయి అనలేకపోయాడు. ప్రేమగా ఆమె చేతులకు గాజులు తొడిగి ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. 'నీ పాదాలకు నమస్కారం తల్లి..' అని పాదాలు పట్టుకుని అనలేకపోయాడు.
"పిచ్చి వెధవ.. నువ్వు ఏ పని చేసినా అది తప్పు కాదురా. తప్పుగా ఉండకూడదనే నీకు సకలగుణానందం అనే పేరు పెట్టాను," అని ఆమె అన్నట్టుగా అనిపించింది సకలగుణానందంకి.
"ఈ వయసులో ఇప్పుడు నాకెందుకురా ఈ బంగారు గాజులు? అందుకనే ఇనపెట్టెలో పెట్టేసాను. సరే, నాకు మనవడు పుడతాడు కదా, ఈ రెండు గాజులతో పిల్లాడికి గొలుసు, మురుగులు చేయిద్దాంలే," అంది ఆనందంగా సరస్వతమ్మ.
"అమ్మా, ఈ మాయప్రపంచం, మాయా ఆశ జీవితం నా కొద్దు. నిద్రలేని భయంకరమైన పీడ కలల రాత్రులు అసలు వద్దమ్మా. ఈ రోజు నుండి అమ్మ ప్రేమతో బ్రతకాలని ఆశపడుతున్నాను. కోట్లు ధనం నాకు వద్దు. అమ్మ చేతి గోరుముద్దల ప్రేమ ధనం నాకు చాలమ్మా.
అమ్మా.. నన్ను ఇంకొక్కసారి నుదుటి మీద ముద్దు పెట్టుకోవా?" అమ్మ ముఖంలోకి ప్రేమగా చూస్తూ అడిగాడు సకలగుణానందం.
రెండు లక్షలు ఎలాగైనా అప్పుచేసి తాళంకప్ప తీసి అద్దాల బీరువాలో ఉన్న కేసు ఫైలు పట్టుకుని పెద్ద డాక్టర్ దగ్గరికి తల్లిని ఈరోజు సాయంత్రమే తీసుకువెళ్లాలని దృఢంగా మనసులో నిశ్చయించుకున్నాడు.
"ఆమాయకుడా.. నీ గురించి నాకు తెలియదా? తప్పుగా ప్రవర్తించే చాలామంది కుర్రవాళ్లు ఉన్న ఈ సమాజంలో, తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడే నీలాంటి వాళ్లు కూడా అక్కడక్కడ ఉన్నారురా. నీకు సమాజంలో అలా గుర్తింపు రాకపోయినా పర్వాలేదు కానీ ఇలా మంచి బుద్ధులతోనే బ్రతుకు నాయనా.." అంటూ మనసులోనే అనుకుంటూ కొడుకును దగ్గరగా తీసుకుని ఆనందంగా ముద్దాడి మనసారా దీవించింది సరస్వతమ్మ.
అమ్మ తనను ముద్దు పెట్టుకుని మనసారా దీవించినందుకు సకలగుణానందం పట్టపుటేనుగు మీద ఊరేగుతున్న అనుభూతికి, స్వర్ణ సింహాసనం మీద కూర్చున్న భ్రాంతికి, హిమాలయాల్లో విహరిస్తున్న ఆనందానికి లోనయ్యాడు.
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు









Comments