అమ్మ పిలుస్తోంది! రా నాన్న!
- Malla Karunya Kumar

- Nov 5
- 6 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #అమ్మపిలుస్తోందిరానాన్న, #AmmaPilusthondiRaNanna, #HorrorStoriesInTelugu

Amma Pilusthondi Ra Nanna - New Telugu Story Written By - Malla Karunya Kumar Published In manatelugukathalu.com On 05/11/2025
అమ్మ పిలుస్తోంది! రా నాన్న! - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
"ఈ ప్రకృతే ఓ స్తంభిని!. మనిషి మాట్లాడే ప్రతి మాట, మదిలో నెమరేసుకున్న ఊసులన్నీ తన లయ లయల్లో స్తంభిస్తుంది!. అచ్చం నువ్వు వాడే ఈ కెమెరా పరికరం లా!. ఆ ప్రేతం తన నకారపు శక్తుల ద్వారా ఒకప్పటి తన మాటలు ప్రకృతి నుండి గ్రహించి నీకు వినిపిస్తుంది!.. వినిపిస్తుంది!.. " చెవులు చిల్లులు పడేలా వినిపించడం తో, ఊకొడుతూ ఉలిక్కిపడి లేచాను.
నిశబ్దపు నిశిని ఆలింగనం చేసుకున్న ఆ రాత్రి వేళలో, ఎదురుగా వున్న టీవీ లో మాంత్రికుడు తన ముందు నిలబడి వున్న వ్యక్తి తో చెప్తున్నాడు. నేను బస్సు ఎక్కి సరిగ్గా గంట సమయం అయ్యింది. గంట ముందే ఆ సినిమా వేసాడు బస్సు వాడు, అసలే నాకు భూతం, ప్రేతం అంటే భయం.. మొదటి పది నిముషాలు చూసి భయంతో కళ్ళు మూసుకున్నాను. అలా నిద్ర పట్టేసింది, కానీ కలత నిద్రలో ఏవేవో దెయ్యాల లోకాలు తిరుగుతూ ఇలా ఉలిక్కి పడి లేవడం అయ్యింది.
అనుకోకుండా నా చూపు పక్కకు తిరిగింది!. గాలిని చీల్చుకుంటూ బస్సు ముందుకు కదులుతుంది. ఏదో దెయ్యం అరిచినట్టు గాలి కిటికీలో నుండి లోపలికి చొచ్చుకుంటూ వచ్చి శబ్దం చేస్తుంది. బయట అంతా చీకటి, దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ లు కొన్ని వెలుగుతూ ఆరుతూ వున్నాయి ప్రేతం అవహించినట్టుగా!, భయంతో నా ముఖం పక్కకు తిప్పుకున్నాను.
పెద్దనాన్న కొడుకు పెళ్లి వారం రోజులు ముందు ఉండాల్సిన నేను రెండు రోజులు వున్నాయి అనగా సెలవు తీసుకొని బయలుదేరాను. జనరల్ మేనేజర్ గా నాకు చాలా బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటినీ చక్కబెట్టు కొని, నా డ్యూటీ నాలుగు రోజులకు వేరే వాళ్లకు అప్పగించి వచ్చే సరికి ఆలస్యం అయ్యింది. నేను మా ఊరు నుండి పట్నం వచ్చి సరిగ్గా పది సంవత్సరాలు గడిచాయి. అమ్మ నా చిన్నప్పుడే కాలం చేసింది. నాన్న నా బాధ్యత చూసుకున్నారు. అనారోగ్య సమస్యలు కారణంగా అతను కూడా తనువు చాలించారు. తర్వాత నేను పట్నం దారి పట్టాను. అక్కడే ఉద్యోగం సంపాదించి మంచి పొజిషన్ లో స్థిర పడ్డాను. నాకు సంబంధించిన ఆస్తుల్ని పెద్ద నాన్న వాళ్ళు చూస్తున్నారు.
చాలా సార్లు ఊరికి రమ్మని మరీ మరీ అడిగే వాళ్ళు. కానీ, నేనే వినిపించుకోలేదు. ఇప్పుడు పెళ్లి అనే సరికి రాక తప్పలేదు ఇలా ఆలోచనలు చేస్తూ మళ్ళీ నిద్ర లోకి జారుకున్నాను. ఒక్క కుదుపుతో మళ్ళీ తేరుకొని నా మొబైల్ తీసి చూసాను. ఒంటి గంట సమయం కావస్తుంది నేను బస్ ఎక్కి ఆరుగంటలు గడిచిపోయాయని గడిచిన సమయం తెలుపుతుంది. మా ఊరు దగ్గర లో వున్నానని నిర్ధారించుకొని వేగంగా కాండక్టర్ దగ్గరకు వెళ్ళాను.
"గుర్తుంది! మీ ఊరు రానే వచ్చింది. రండి, రండి, " అని నేనే మాట్లాడకుండానే నా వైపు చూసి, బస్ ఆపించాడు.
గబగబా నా లగేజ్ తో నడుస్తూ బస్ దిగాను. మెల్లగా ముందుకు సాగింది బస్.
చుట్టూ చీకటిగా వుంది సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ లైట్ వెలిగింది. నిశితంగా పరిశీలించిన తర్వాత తెలిసింది అది స్ట్రీట్ లైట్ అని, పక్కనే ప్రయాణికుల విశ్రాంతి భవనం అని రాసి వుంది. అది చూసి, ', ఒకప్పుడు ఇక్కడ ఈ భవనం లేదు?. ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారన్నమాట!. ' అని నాలో అనుకుంటూ, ఆ భవనం వైపుకు అడుగులు వేసాను. నా లగేజ్ పక్కన పెడుతూ నా మొబైల్ తీసాను. కానీ సిగ్నల్ లేదు. నిట్టూర్చుతూ అక్కడే కూర్చొన్నాను.
సరిగ్గా అదే సమయానికి దూరం నుండి కుక్కలు, నక్కలు ఒక్కసారే అరిచినట్టు గా అరుపులు వినిపిస్తున్నాయి!. నా గుండె అదిరింది!. పక్కనే వున్న బ్యాగ్ లో నీళ్ల సీసా తీసుకొని రెండు గుటకలు తాగే సరికి,
పక్కనే ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించడం తో ఒక్కసారిగా ఉలిక్కి పడి చూసాను!.
ఒక పాప ఏడుస్తూ పక్కనే కూర్చొంది!.
'ఈ సమయంలో ఈ పాప ఇక్కడ ఏం చేస్తుంది?. కొంప తీసి తప్పిపోయి వచ్చిందా?. లేక ఎవరైనా కిడ్నాప్ చేస్తే, వాళ్ల నుండి తప్పించుకొని ఇక్కడకు వచ్చిందా?. లేకపోతే అలిగి ఇంటి నుండి ఇక్కడ కు వచ్చిందా?. ఏమై ఉంటుంది?. ' నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటూ,
"ఏ పాప, ఎవరు నువ్వు?. ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావు?. " అడిగాను.
సమాధానం చెప్పకుండా ఏడుస్తూ వుంది.
"ఆపు, ముందు నేను అడిగినదానికి సమాధానం చెప్పు. " గట్టిగా అరిచాను.
తన ఏడుపు ఆపి నా వైపు చూసింది. చెమర్చిన కళ్ళు తో ఆమె ముఖం కళా విహీనంగా వుంది.
"ఎవరు నువ్వు?. నీ పేరేమిటి?. మీ ఇల్లు ఎక్కడ?. నువ్వు ఈ సమయంలో ఇక్కడ వుండడానికి కారణం ఏమిటి?. " అడిగాను.
నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నా వైపే చూస్తూ వుంది. ఆమె చిత్రంగా చూడటం నేను గమనిస్తూనే ఉన్నాను. బహుశా నన్ను చూసి భయపడి సమాధానం చెప్పడం లేదు అనుకొని, "మరేం ఫరవాలేదు. నేను నిన్నే మీ చేయను. నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను. అసలు విషయం ఏమిటో నువ్వు చెప్తే కదా నాకు తెలిసేది. " పాపను దగ్గరకు తీసుకొని, ఓదార్చుతూ అడిగాను.
గట్టిగా ఏడుస్తూ నన్ను హత్తుకుంది.
"చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తావు?. నేను వున్నాను కదా. " మళ్ళీ భరోసా కలిపిస్తూ అన్నాను.
"అమ్మ పిలుస్తుంది రా నాన్న!. " అని అంది ఆ పాప.
"ఊ!" అంటూ ఉలిక్కి పడి పాప వైపు చూసాను.
ఆ పాప లేచి నిలబడి తన కళ్ళు తుడుచుకుంటూ, "రా నాన్న, అమ్మ పిలుస్తుంది!. " అని అంటూ నా చేయి పట్టుకొని లాగుతూ అంది.
ఆమె మాటలు, ఆమె చేష్టలు, ఆ సమయం లో ఆమె అక్కడ వుండడం ఇవన్నీ చూసిన తర్వాత నాకు సీన్ మొత్తం అర్దం అయ్యింది. ఆ పాప ఎవరో పిచ్చిదని నేను నిర్ధారణకు వచ్చాను. నాలో కలిగిన భయానికి ధైర్యం చెప్పి, ముందు ఆ పిచ్చి పాపను నొప్పించకుండా అక్కడ నుండి తప్పించుకోవాలని, అలా తప్పించుకోవాలి అంటే ముందు ఆమెను నమ్మించాలని అనుకొని మెల్లగా ఆమె వెనుక నడిచాను.
"నాన్న వస్తున్నాడు!, నాన్న వస్తున్నాడు. " అని తెగ ఆనంద పడుతూ ముందు నడుస్తుంది.
నేను ఆమె నుండి ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన తో నడుస్తూ వున్నాను. ఏవేవో శబ్దాలు దారి పొడవునా వినిపిస్తూ వున్నాయి. ఆ దారి అంతా నిశి అలముకుంది.. కానీ నేను అవేమీ పట్టించుకోకుండా, ఆలోచిస్తూ నడుస్తున్నాను, కానీ ఏ ఉపాయం తట్టడం లేదు ఆ పాప నుండి తప్పించుకోవడానికి..
"నాన్న!. " అన్న పిలుపుతో ఉలిక్కి పడి ఆలోచన నుండి బయటకు వచ్చాను.
చీకటిలో ఆమె కనిపించడం లేదు. కానీ ఆమె స్వరం వినిపిస్తుంది స్పష్టంగా!.
"ఇదుగో అమ్మ ఇక్కడే వుంది. చూడు, నిన్ను చూస్తూ వుంది. " అని చెప్పింది పాప.
వెంటనే నా మొబైల్ తీసి, లైట్ ఆన్ చేసాను.
ఒక్కసారిగా నా గుండెలో వేగం పెరిగింది. చెమటలు పట్టాయి!. కళ్ళు బైర్లు కమ్మాయి!!!.. భయం తో వెనక్కి అడుగులు వేసాను!. ఎదురుగా ఐదు అడుగుల సమాధి వుంది. ఊపిరి లో తేడా ప్రారంభం అయ్యింది. లైట్ పక్కన తిప్పి చూసాను, ఆ పాప కూడా కనిపించడం లేదు!. కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. ప్రాణం వున్న ప్రాణం లేని జీవిలా నిలబడి పోయాను.
సరిగ్గా అదే సమయానికి అటు నుండి ఏదో వెహికల్ వస్తున్నట్టు శబ్దం వినిపించడం తో ఆ షాక్ నుండి తేరుకుని, వేగంగా అక్కడ నుండి పరుగు తీసి దూరం లో వున్న వెహికల్ ఆపే ప్రయత్నం చేశాను.
సరిగ్గా నా దగ్గరకు వచ్చి ఆగింది ఆ వెహికల్..
"ఏంటి సుందరన్న!. ఇక్కడ వున్నావు? వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు?. " డ్రైవింగ్ సీట్లో వున్న హరి నన్ను చూసి ఆశ్చర్యపోతూ, ఆనందం తో అడిగాడు.
"ఆ!.. హరి!" ఒక్కక్షణం ఆగి, స్థిమిత పడుతూ, "మీకు ముందు సమాచారం ఇవ్వలేక పోయాను రా, ఇక్కడకు వచ్చిన తర్వాత ఫోన్ చేద్దామని చూస్తే సిగ్నల్ లేదు. నడుచుకుంటూ బయలుదేరాను. "
"హో అలాగా! సరే, రా లోపలికి. " అని హరి పిలవడం తో, గబగబా నడుస్తూ అటువైపుకు చేరి, డోర్ తెరుస్తూ లోపలికి చేరుకున్నాను.
"అదే సరే, ఆ లోపల నుండి వస్తున్నావు. అటువైపు ఎందుకు వెళ్ళావు?. " హరి ముఖంలో ఏదో తెలియని కంగారు కనిపిస్తుంది.
"ఏమో?. తెలియకుండా అటు వెళ్ళిపోయాను!. వెహికల్ వస్తున్న శబ్ధం విని ఇటు వైపుకు వచ్చాను. చూసే సరికి నువ్వు ఉన్నావు!. "
"థాంక్ గాడ్!. " అని నిట్టూర్చాడు.
"అరేయ్ ఏమైంది రా, ఎందుకు నీ మాటల్లో అంత కంగారు!. అక్కడ సమాధి వుంది!. దాని దగ్గరకు కూడా వెళ్ళాను!. అయితే ఏమిటి?. " ధైర్య వంతుడిలా బిల్డప్ ఇస్తూ అన్నాను.
"చాలా మందికి ముచ్చెమటలు పట్టించిన ప్లేస్ అది. దెబ్బకు రాత్రి ఇటు వైపుకు రావడానికి భయపడతారు. ఇంతకీ అక్కడ వున్నది ఎవరో తెలుసా?. "
"ఎవరు?. "
"మల్లి!"
"మల్లి!" అంటూ ఉలిక్కి పడ్డాను.
"అవును ఆ మల్లె నీకు తెలుసు కదా. ఆమె భర్త పోయిన తర్వాత మళ్ళీ మన ఊరిలో స్థిర పడింది. "
"అవును, ఆమె చనిపోయిందా?" ఆశ్చర్యపోతూ అడిగాను.
"చనిపోయిందా అంటే చనిపోవాల్సి వచ్చింది. దానికి ఒక కారణం వుంది. "
"ఏమిటది?. "
"భర్త చనిపోయిన చాలా రోజుల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఆమెకు ఒక కూతురు కూడా పుట్టింది. అందరూ ఆ కూతురుకి తండ్రి ఎవరని అడిగే వారు. ఆమె తప్పు చేసిందని ఎవరూ ఆమెను దగ్గరకు రానిచ్చే వారు కాదు. కొందరేమో నిన్ను మోసం చేసినవాడు ఎవడు చెప్పు, వాడితో నీ పెళ్లి చేస్తాం, నీకు ఏ బాధ ఉండదని ఆమెకు సహాయం చేయడానికి చూసే వాళ్ళు, కానీ ఆమె నోరు విప్పే ది కాదు, నిజం చెప్పేది కాదు. అవమానాలు భరిస్తూ ఇక్కడే ఉండేది, కూతురు కూడా ఇక్కడే ఉండేది. మంచి చాలాకి పిల్ల. పాపం, ఏమైందో ఏమో ఒకరోజు ఇందాక నువ్వు వున్న ప్లేస్ లోనే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అది ఆత్మహత్య? ప్రమాదమా? అని ఎవరికీ కూడా అంతు చిక్క లేదు. అలా వాళ్లను అక్కడే దగ్గర లో వున్న స్థలం లో సమాధి చేశారు. ఆ స్థలం కూడా వాళ్ళదే. అప్పటి నుండి వాళ్ళు దెయ్యాలు అయి తిరుగుతూ వున్నారని చాలా మంది ద్వారా వినడం జరిగింది. వాళ్ళ జీవితాల్ని ఆ దరిద్రుడు ఎవడో కానీ నాశనం చేశాడు. " హరి చెప్పడం ఆపి నా వైపు చూసాడు.
నా వళ్ళంతా వణుకుతుంది, శరీరం చెమటలు తో నిండి పోయి వుంది.
"ఏమిటి అన్నా! కథ మొత్తం విని నీ ధైర్యం ఆవిరయిందా?. భయపడకు నేను పక్కనే వున్నాను కదా. " నవ్వుతూ అంటున్నాడు హరి.
కానీ నాలో కలిగిన ఈ స్తబ్దత కు కారణం నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మల్లి మీద మోజు పడి, ఆమె వంచించి, ఆమె మీద మొహం తీరిపోయిన తర్వాత, ఆమెను ఒంటరిని చేసి, నా స్వార్థానికి నేను వెళ్లిపోయాను. నేను చేసిన తప్పుకు శిక్ష ఆమె అనుభవించి. ఇలా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది అని అనుకుంటూ నాలో నేనే కుమిలిపోతూ వున్నాను. అనుకోకుండా నా చూపు సైడ్ మిర్రర్ వైపు తిరిగింది. పరుగుతీస్తున్న ఓ తెల్లని రూపం కనిపిస్తూ వుంది. కారు వెంటపడుతూ, స్పష్టంగా కనిపిస్తూ వుంది.
ఎదురుగా ఎవరో అడ్డు వచ్చినట్లు అయ్యింది. గట్టిగా అరుస్తూ సడెన్ బ్రేక్ వేశాడు హరి. ఒక్కసారిగా మేము వెల్తున్న కారు గాల్లోకి తేలింది. గుర్తించే లోపలే రెండు పల్టీలు కొట్టి ఆగింది.
తెలుసుకునే లోపలే గాయాలు అయ్యాయి, తలకు దెబ్బ తగిలి సగం సగం మత్తు ఆవరిస్తుంది.
" సుందర్ అన్నయ్య, చెయ్యి ఇవ్వు!" బయట నుండి అరుస్తూ వున్నాడు హరి,
"అమ్మ పిలుస్తుంది రా నాన్న!. " గట్టిగా నన్ను హత్తుకుంది ఆ పాప. ఆమె రూపం స్పష్టంగా కనిపిస్తూ వుంది. మెల్లగా నా కళ్ళు మూతబడుతున్నాయి. ప్రేమ పేరుతో ఆమెను వంచించి వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష అని సుత మెత్తగా విషయం బోధ పడింది.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.




Comments