అమ్మ కల
- Malla Karunya Kumar

- 15 minutes ago
- 5 min read
#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #అమ్మ కల, #Amma Kala, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Amma Kala - New Telugu Story Written By Malla Karunya Kumar
Published In manatelugukathalu.com On 10/11/2025
అమ్మ కల - తెలుగు కథ
రచన: మళ్ళ కారుణ్య కుమార్
"నవీన్ బాబు!." గట్టిగా కేక వేశాడు వనమాలి.
తుళ్ళి పడుతూ, తడబడుతూ, తన చేతిలో ఉన్న సిగరెట్‌ను నేలకు విసిరి, కాళ్ళ కింద వేసి నలుపుతూ, "పెద్దయ్య నువ్వా!." కంగారు పడుతూ, "ఇదంతా రిలాక్స్ కోసం." తడబడుతూ సమాధానం ఇచ్చాడు నవీన్.
"ఎప్పటి నుండి ఈ అలవాటు బాబు?. అమ్మకు తెలిస్తే!." బాధాతప్తమైన స్వరంతో అన్నాడు వనమాలి.
"తెలియదు, నువ్వే తెలియకుండా చూసుకోవాలి." ఇంకా అక్కడే ఉంటే వనమాలి ఇంకా ఏమంటాడో అని అక్కడ నుండి వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. వెనక్కి తిరిగే సరికి నవీన్ తల్లి శాంతమ్మ ఎదురుగా ఉంది. నవీన్ గుండె వేగం పెరిగింది, "అమ్మ! అది, అది." ఏం మాట్లాడాలో తెలియక నీళ్ళు నములుతున్నాడు.
"శాంతమ్మ ఇదేనా కలెక్టర్ అవ్వడం అంటే" ఆ కొట్టులో ఉన్న రంగడు వెటకారంగా నవ్వుతూ అన్నాడు. ఎప్పుడూ తన కొడుకును కలెక్టర్ చేస్తాను అని శాంతమ్మ చెప్పే మాటలు గుర్తుకు వచ్చి.
సందర్భం తన నోటికి తాళం వేసింది. లోలోపల కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. కానీ ఒక మాట తూలితే అక్కడ జరిగే పరిణామం శాంతమ్మకు అవగతం అయ్యింది. అనవసర వాగ్వాదం ఎందుకు అని తనకు తాను నచ్చజెప్పుకొని విసురుగా చూస్తూ అక్కడ నుండి ముందుకు కదిలింది.
తల్లి కోపం నవీన్‌కు అర్థం అయ్యింది. "అమ్మకు ఏమని సమాధానం చెప్పాలి." అని సందిగ్ధ పడుతూ అక్కడ నుండి పరుగుతీశాడు.
కొడుకును ఆ పరిస్థితిలో ఎప్పుడూ చూస్తానని అనుకోలేదు శాంతమ్మ. నవీన్ ప్రవర్తన ఆమెలో గుబులు రేపింది. ఇంటికి చేరుకుని కొడుకు గురించి ఆలోచిస్తూ అక్కడే కుర్చీలో కూలబడింది.
ఆలోచనలో ఉన్న తల్లిని చూస్తూ, "అమ్మా!, ఇది నేను రిలాక్స్ కోసం తాగాను!. అంతే తప్పించి నాకు ఏ వ్యసనం లేదు." తల్లికి సంజాయిషీ ఇచ్చాడు నవీన్ తడబడుతున్న గొంతుతో.
కొడుకు మాటలకు ఆలోచనలో నుండి బయట పడింది, "ఇలానే మొదలయ్యి వదలలేనంత వ్యసనంగా మారుతుంది. ఇదే చివరి తప్పుగా భావించి ఆ వ్యసనాన్ని వదిలేయి. నీ లక్ష్యం ఒకటే అయివుండాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి. నా కోరిక కూడా అదే." ఎప్పుడూ చెప్పే విషయమే మళ్ళీ గుర్తు చేసింది.
తల్లి నుండి ఈ మాట విని విని అలసిపోయాడు నవీన్, తల్లి మాటలకు సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి ఉన్నాడు.
కొడుకు నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, కొడుకు వైపు చూసి, "ఏమైంది నవీన్, ఆ వ్యసనాన్ని నువ్వు వదలలేకపోతున్నావా?. దాని గురించే ఆలోచిస్తున్నావా?." అడిగింది శాంతి.
"కాదమ్మా!."
"మరి?."
"నీతో ఒక విషయం చెప్పాలి!."
"ఏమిటో చెప్పు?." ఏ మాట చెప్తాడో అని తన మనస్సు సంశయంలో ఉంది.
"ఈ ప్రిపరేషన్ నా వల్ల కాదమ్మా, నేను కొనసాగించలేను. ఇప్పటికే మూడు సంవత్సరాలు వృథాగా పోయాయి. నా స్నేహితులు అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. నేను మాత్రం ఇలానే ఉండి పోయాను. విజయం సాధించలేక పోతున్నాను. ఉన్నత చదువు చదివి, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. చివరికి ప్రిపరేషన్ అంటూ ఒత్తిడికి గురై ఇలా అయిపోయాను." నవీన్ మాటల్లో అసహనం, నిరాసక్తత స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నవీన్ నుండి ఇలాంటి మాటలు ఇంతకు ముందు వినని శాంతమ్మ. ఈ మాటలు విని జీర్ణించుకోలేక స్తబ్దుగా చూస్తూ ఉండి పోయింది.
"నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి?." తల్లి వైపు చూస్తూ అన్నాడు.
ఏమిటన్నట్టు కొడుకు వైపు చూసింది ఆశ్చర్యంతో!.
"నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె నాకు దూరం అయ్యింది. కారణం ఏమిటో తెలుసా నాకు ఉద్యోగం లేదని. నేను ఇంకా ఉద్యోగం లేకుండా ఉండిపోవడానికి కారణం నువ్వే, నన్ను ఈ ఫీల్డ్‌లోనే సెటిల్ అవ్వాలని నువ్వు ప్రతిక్షణం చెప్పావు. నేను దాన్నే అనుసరించాను!. అయినా సెటిల్ అవ్వాలంటే ఐఏఎస్ మాత్రమే అవ్వాలా, ప్రైవేటు రంగంలో కూడా ప్రతిభ చూపిస్తే స్థిర పడవచ్చు. నీ కలలు నా ద్వారా తీర్చుకోవడానికి చూస్తున్నావు, నా మీద ఒత్తిడి పెడుతున్నావు." లోలోపల ఉన్న మాటల్ని బయట పెట్టాడు.
కొడుకు మాటలకు ఆమె మౌనం వహించింది. ఆమె కళ్ళు చెమర్చాయి. కొడుకు నుండి ఇలాంటి మాటలు వినిపిస్తాయని ఆమె ఎన్నడూ ఊహించలేదు!.
కొంత సమయం తర్వాత తనకు తాను సముదాయించుకొని, "నవీన్! ముందు నేను నిన్ను అడిగాను కదా, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతావా అని?. అప్పుడు నువ్వే కదా ప్రిపేర్ అవుతానని బదులిచ్చావు!."
"అప్పుడు అన్నాను. తర్వాత నాకు నా పరిస్థితి అర్థం అయ్యింది. ఇక నేను సివిల్స్ సాధించలేను. నేనే వేరే రంగంలో స్థిరపడతాను. ఈ మాట ఎప్పటి నుండో నీకు చెప్పాలని చూస్తున్నాను." చివరి మాటగా చెప్పాడు.
నవీన్ నిర్ణయం విని ఆమెలో కోపం, అసహనం పెరిగి పోయాయి. ఒక్కసారిగా తను కూర్చున్న స్థలం నుండి లేచి, "ఈ మాటలు నాకు అనవసరం. నేను నిన్ను కలెక్టర్‌గా చూడాలనుకున్నాను. నువ్వు కలెక్టర్ అయితే నాకు అదే చాలు. నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు." కోపంతో చివరి మాటగా చెప్తూ అక్కడ నుండి ముందుకు కదలబోయింది.
"నీ పంతమే నీది... నా మాట నీకు పట్టదా?. నా ఇష్టం నీకు పట్టదా? నాకు స్వేచ్ఛ లేదా?." గట్టిగా అరిచాడు నవీన్.
కొడుకు నుండి ఇలాంటి ప్రతిఘటన తాను ఎప్పుడూ ఎదుర్కోలేదు. కొడుకును ఈ విధంగా చూసి ఆమె నిశ్చేష్టురాలై ఉండి పోయింది.
నవీన్ కోపంతో అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు.
కొడుకు మాటలు తన మస్తిష్కంలో తాండవం చేస్తున్నాయి. వాటి గురించే ఆలోచిస్తూ అక్కడే కూలబడింది.
"కలెక్టర్ అంటే మాటలా!. మంచి శిక్షణ ఉండాలి. శిక్షణకు తగ్గట్టు శ్రమ కూడా ఉండాలి. ఆర్థికంగా మన పరిస్థితి కూడా బాగుండాలి. మేమే చాలా సతమతం అవుతున్నాం. నువ్వు ఎలా తట్టుకోగలవు?." కొందరు తనకు తెలిసిన వాళ్ళు ఆడిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.
"తలకు మించిన తలపాగా చుట్టకూడదు అమ్మాయి. నీ కోరికలకు రెక్కలు తొడక్కు. దేనికైనా ఒక స్థాయి ఉంటుంది. పూట గడవడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావన్నది నాకు తెలుసు. నీ ఆలోచన విరమించుకుంటే నీకు మంచిది. నీ కొడుకును మంచి ఉద్యోగంలో చేర్పించు అంతా బాగుంటుంది." తెలిసిన వాళ్ళ సలహా అన్నీ గుర్తుకు వస్తున్నాయి.
ధారాపాతంగా వస్తున్న తన కన్నీళ్లను తుడుచుకుంటూ, 'ఎలా చెప్పను?. దర్పం కోసం, కలెక్టర్ తల్లిగా చెలామణి అవ్వాలని కోరిక కోసం కాదు నా ఈ తాపత్రయం. ఎవరికి చెప్పినా లాభం లేదు.' అని అనుకుంటూ, 'ఎవరి మీద బలవంతంగా నేను నా ఆలోచనల్ని రుద్దాలని అనుకోవడం లేదు. నవీన్‌కు ఇష్టం వచ్చిన రంగంలో స్థిర పడమని చెప్తాను. వాడి సంతోషమే కదా నాకు కావాల్సింది.' అని తనకు తాను సర్ది చెప్పుకొని ఒక నిర్ణయంకు వచ్చింది.
********
'ఛా!, అమ్మకు ఎలా చెప్తే అర్థం అవుతుంది?. ఎందుకు ఇలా మొండి పట్టు పడుతుంది!. నేను చెప్పేది కూడా అమ్మ అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది!. పోనీ చెప్పకుండా వెళ్ళిపోదాం అంటే ఆమె మాట్లాడకుండా నేను ఉండలేను. ఆమెను వదిలేసి వెళ్ళిపోవడం నా వలన కాదు.' గ్రామం బయట చెట్టు కింద కూర్చొని లోలోపల సతమతం అవుతున్నాడు నవీన్.
"ఏంటి బాబు!, నీలో నువ్వే బాధపడుతున్నావు?." అంటూ నవీన్ పక్కన వచ్చి కూర్చున్నాడు వనమాలి.
"బాబాయి!, నువ్వైనా అమ్మకు చెప్పవచ్చు కదా నా గురించి. నేను వేరే రంగంలో స్థిర పడతానని. ఈ ఒత్తిడి నేను భరించలేను అని."
నవ్వుతూ, "బాబు! శాంతమ్మకు ఒక అలవాటు ఉంది. ఎదుటి వ్యక్తుల శక్తికి మించి ఆమె ఏ పని అప్పజెప్పదు."
"అర్థం అయ్యింది. నువ్వు అమ్మ పార్టీ కదా. అందుకే ఇలా మాట్లాడుతున్నావు."
"అమ్మ ఎన్నో కష్టాలు చూసింది బాబు. నువ్వు కూడా ఎన్నో కష్టాలు పడ్డావు. దాదాపు ఇక్కడ, చుట్టూ పక్కల ఉన్న వ్యక్తుల కష్టాలు నీకు తెలుసు. నీలాంటి వారు కలెక్టర్ అయితే వాళ్ల కష్టాలు కొంతైనా తీరుతాయని, సాధారణ ప్రజల గురించి ఆలోచన చేసి వాళ్లకు మంచి చేయగలుగుతావని అమ్మ ఉద్దేశ్యం."
"ఇప్పటికే చాలా మంది కలెక్టర్లు ఉన్నారు. వాళ్ల పని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు కదా. నేను వెళ్ళి ప్రత్యేకంగా చేయాల్సింది ఏముంది?."
"నిజమే!, కానీ నువ్వు కలెక్టర్ కావాలన్నది శాంతమ్మ కల."
"నీకు కూడా నా బాధ అర్థం కావడం లేదు పెద్దయ్య."
"విశాలాక్షి పురం గురించి నీకు తెలుసా!." విషయాన్ని మరల్చుతూ అడిగాడు వనమాలి.
"ఆ తెలుసు!, థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కదా అక్కడ!. దాని కారణంగా చాలా మంది తీవ్రమైన అనారోగ్యాలు పాలై. ఆ చుట్టు పక్కల ప్రాంతాలు వదిలేసి వెళ్ళిపోయారు."
"ఆ ఊరు మనదే బాబు, ఆ పవర్ ప్లాంట్ కారణంగా ఉత్పన్నం అయ్యే విష రసాయనాల కారణంగా చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. మీ నాన్న కూడా ఊపిరితిత్తుల అనారోగ్యం కారణంగా మరణించారు. చర్యలు తీసుకోండి, మా జీవనానికి ఆసరా చూడండని ప్రయత్నం చేసి, చేసి ఓడిపోయి చివరికి మేము కూడా ఆ ప్రాంతం వదిలి ఇక్కడకు వచ్చేశాం. ఆ ప్రాంతం ఒకప్పుడు పచ్చని పొలాలతో ఉండేది. కానీ అధికారులు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా ఆ నేల పనికి రాదని, అక్కడ పవర్ ప్లాంట్ స్థాపించడానికి అనువైనదని అక్కడ పవర్ ప్లాంట్ నిర్మించారు. అందరికీ ఇల్లు, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, చివరికి రిక్త హస్తాలు చూపించారు. దాంతో చాలా మంది బ్రతుకు కోల్పోయి వలస బాట పట్టారు. మీ అమ్మ తాపత్రయం ఒకటే బాబు, కష్టం తెలిసిన వ్యక్తి సిస్టమ్‌లో ఉంటే అన్యాయం, అవినీతి ఉండవని. ప్రజలకు మంచి జరుగుతుందని ఆమె తాపత్రయం. అందుకే నిన్ను కలెక్టర్ అవ్వు అని శాంతమ్మ ప్రతి నిత్యం చెప్తుంది. ఈ ఊరు విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను కానీ చెప్పక తప్పలేదు. ఇక ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. తల్లితండ్రుల కోరికలు తీర్చే బాధ్యత పిల్లలకు కూడా ఉంటుంది కదా, అవి గొంతమ్మ కోరికలు కానప్పుడు వెనకడుగు వేయడం ఎందుకు?." అని చివరి మాటగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు వనమాలి.
"అధికారి అవ్వాలంటే ముందుగా ఈ సమాజాన్ని నిశితంగా పరిశీలించాలి!. ప్రతి సమస్య క్షుణ్ణంగా చూడాలి, దానికి పరిష్కారం వెతకాలి. మనుషుల్లో ముఖ్యమైంది మానవత్వం దాన్ని వెలికి తీయాలి. రోజు రోజుకు మనిషి దిగజారి మృగం అయిపోతున్నాడు. ఎందుకంటే మనిషికి ఆభరణం మానవత్వం కదా, వ్యక్తిత్వం కదా!. దాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్టే!." నవీన్‌తో మాట్లాడినప్పుడు ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పేది శాంతమ్మ.
ఈ విషయాలన్నీ నవీన్‌కు గుర్తుకు వస్తున్నాయి.
"ఈ విషయాలు నీకు ఎలా తెలుసు అమ్మా!. నువ్వు ఏమైనా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యావా?." ఆ సందర్భంలోనే అడిగాడు నవీన్.
"ఎదురైన అనుభవాలు, చూసిన సంఘటనలు, కనిపిస్తున్న అవినీతి, మృగాళ్లుగా మారుతున్న మనుషులు వీళ్ళందరినీ చూస్తే సమాజమంటే ఏంటో అవగతం అవుతుంది. అధికారి అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది.
దర్పం, జీతం, వసతుల కోసం కాదు ఈ దేశం బాగుపడాలని, మనుషుల్లో మంచి మేల్కొల్పాలని అధికారి చూడాలి." అమ్మ మాటలు ఘంటాపథంగా తన మదిలో మారు మ్రోగుతున్నాయి.
తన కర్తవ్యం ఏమిటో బోధ పడిన అర్జునుడిలా కార్యోన్ముఖుడై లేచాడు నవీన్ తనలో ఉన్న అసహనం, నిరాసక్తత అనే పద్మవ్యూహం ఛేదిస్తూ. అమ్మ కల నెరవేర్చడానికి సిద్ధం అయ్యాడు నవీన్.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.



Comments