top of page
Original.png

అమృత ధార శతకము - పార్ట్ 2

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #AmruthaDharaSathakamu, #అమృతధారశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Amrutha Dhara Sathakamu - Part 2 - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 19/01/2026

అమృత ధార శతకము - పార్ట్ 2 - తెలుగు శతకము

రచన : సుదర్శన రావు పోచంపల్లి



55)మతములు మూడన ద్వైతమద్వైతము

వైశిష్ట ద్వైతము వైపున నన

దేవుడు జీవుడు దెలియగ వేరని

ద్వైతులు అనగను ద్వైత మతము

భేదము రెంటిన భేదము లేదన

ప్రకృతన దేవుడు ప్రకృతె జీవి

వైషిష్ట ద్వైతులు వైషిష్ట మనెదరు

మతములు మూడైన మనుషు లొకటె

మతము నడుమ హితము మరువక యున్నను

మతము మంచి దనుచు మంది చేర

హితమె మతము అనుచు హితకారి జెప్పును

అనగ నాదు మాట అమృత ధార.


(56)సుతులును తలితండ్రి సుఖముగ ఉంచను

వారిది కీర్తియు వనధి మించు

బాధ్యత వారిది బలముగ ఐనను

మనసిడి సేవించ మంచి దంద్రు

ఇరుగుయు పొరుగుయు ఇతరులు జూచుచు

వారును గూడను వారి వారి

తలితండ్రి సేవించ తగినట్టు ఉందురు

కానగ అందరు కడకు మంచె

కాన తల్లి తండ్రి కాదరు వగుచును

ముసలి తనము నందు ముందు యుండి

మర్రి ఊడ లట్ట్లు మసలను మేలగు

అనగ నాదు మాట అమృత ధార


(57) నిధియంటు కొందరు నిధిలాంటి పిల్లల

బలినీయ జూడగ బదులు తమకె

చెరసాల ఊచలు చేరగ లెక్కించ

అవకాశ మగునింక అదియె నిధన

జెష్టను పేరొచ్చు జెరసాల నుండగ

విడుదల ఐనను విషపు చూపె

నలుగురు జూసియు నగుచును ఉందురు

బతుకింక నీచుని బలియె ననగ

అదిక ఆశ ఎపుడు అనగను చేటగు

కలిగి నంత దిన్న కలుగు సుఖము

కోరి వలలొ జిక్క కొంపయు మునుగద

అనగ నాదు మాట అమృత ధార


(58)ముదుసలి తనమున ముసురును కష్టాలు

మతిమరు పింకను మనిషి కంటు

చెవులును వినరాక చెవుడును రాగను

పళ్ళును ఊడుచు పంటి నొప్పి

కళ్ళతొ జూడను కనబడ కుండును

మోకాలు నొప్పితొ మోద మింక

కనుమరు గగుచుండు కనగను బాధగు

వళ్ళంత నొప్పితొ వగచు చుండ

ముసలి తనము యింక ముదురుచు ఉన్నను

మనిషి బతుకు తుదకు మరణ దారె

కాన వారి యందు కనికర మనమేలు

అనగ నాదు మాట అమృత ధార


(59)పీయూష మన్నను పీల్చిన తలిపాలె

అందల మన్నను అమ్మ ఒడియె

భాషయు అన్నను బాగుగ పలికిన

అమ్మనె జెప్పిన అమృత భాష

తొమ్మిది నెలలుగ తోరపు బొజ్జలొ

ఆకాశ వీధన అదియె నింక

అమ్మది కడుపుయె ఆకాశ వీధన

లోకము మంతయు లోన నుండె

అమ్మ జీవి కింక అమృతపు భాండము

అమ్మ లేక జీవి అవని లేదు

అమ్మ ఒడియె నికను అగునన చదురుయె

అనగ నాదు మాట అమృత ధార


(60) తాటాకు చప్పుడు తాతల బెదిరింపు

ఎవరును భయపడ ఎరుగ రింక

పనివాని అలుకలు పసివారి ఏడ్పులు

కోరిక దీర్చంగ కోలు కొనును

అరచేత భానుకు అడ్డుగ బెట్టిన

ఆగున ఎండింక ఆగ కుండ

కుదురుగ ఒకచొట కూర్చొని చదివిన

మనసెక్క బోవున మనసు ఇడక

విశ్వ మంత జూడ విశ్వాస ముండగ

పనులు జరుగు చుండు పదులు వేలు

అదురు బెదురు లేక ఆశయు వీడంగ

అనగ నాదు మాట అమృత ధార


(61)చేతిన కర్రయె చెప్పగ పదితీర్లు

పనికొచ్చు నెపుడును పగలు రేయి

పక్షులు కుక్కలు పగవాడు పాములు

పశువులు బురదయు పర్ణసి ఇక

చీకుయు వార్ధక్య చీకటి నందున

అదియెను కర్రన అక్క రొచ్చు

లోకాన మనిషియు లోకువ గాకుండ

అందరి కక్కర అనగ మేలు

పగలు రేయి మనిషి పనులందు ద్యాసతొ

పదుగు రికని పాటు పడగ నుండ

సార్థ కంబు బతుకు సారము అదియేను

అనగ నాదు మాట అమృత ధార


(62)లేశము మందాక్ష లేకను వ్యాపారి

సరసము ధరలంటు సరకు లమ్మ

కలుషిత మునుజేసి కలతింత లేకను

నలుగురి ముందర న్యాయ మనుచు

వ్యాపారి జేసెడు వ్యాపక మదియెను

బిడియము లేకను బిరుసు మాట

లంచము లిచ్చుచు లంచము దేమని

రెట్టింపు ప్రాప్తికి రేగు చుండు

అట్టి వాని వీనిS అందరి ముందర

చెట్టు గట్టి వేసి చెంప దెబ్బ

వేయ బుద్ధి వచ్చు వేగము వారికి

అనగ నాదు మాట అమృత ధార

.

(63)ఇద్దరు తలపైన ఇముడగ నుండను

శంకరు కింతయు శంక లేక

ముల్లోక మందున ముచ్చట దేవుడు

వంకర కనులుండి వరము లీయు

ముద్దుగ ఇద్దరు ముదమగు భార్యలు

ఏవురు సంతాన ఎరుగ నుండు

భక్తుల పాలిటి భగవంతు డనగను

దేవుల దేవుడు దెలుప నింక

ఆది దేవు గొలువ ఆలయ మందున

లింగ రూప మున్న లింగ డతడు

కోరి కలను దీర్చు కోరగ భక్తులు

అనగ నాదు మాట అమృత ధార


(64)ఆకాశ వీధిన అడరుచు సూర్యుడు

అశ్వము లేడును అనగ గట్టి

అరదము నడుపగ అరుణుని నియమించి

తీరిక లేకను తిరుగు నింగి

పాముల వలెనున్న పగ్గాలు ఇంకను

ఇంకను ఒకటన ఇరుసు చక్ర

ఆలంబ ననకుండ ఆకస మందున

భానుడు దిరుగును భగ్గు మంటు

జగము నందు జీవి జననము కారణ

మనగ సూర్య దేవ మహిమ వలన

కాన రవికి పూజ కావించ మేలగు

అనగ నాదు మాట అమృత ధార


(65)అగవుయు నిండుండె అంతము అంతట

వెలుగులు లేకను వెతలు జెంద

జగమున విలవిల జనముయు యుండగ

రవియును కైరవి రాత్రి పగలు

వెలుగుల నిచ్చుచు వెతలను బాపగ

కనబడు దేవులు కరుణ జూపె

అనుచును జనమిక అంశుని చంద్రుని

ఆరాధ ననగను అదియె మేలు

తిమిర మందు వారు తిరుగుచు ఉండగ

జనము జీవు లెంతొ జగము నందు

భయము లేక యుంద్రు భక్తిని జూపుచు

అనగ నాదు మాట అమృత ధార


(66)సుకుమార పుష్పము సుదతుల కిష్టము

కుటిలపు కుంతల కుబ్జ కందు

మల్లెలు గూడను మగువల కిష్టము

పూబోడి కెపుడును పూల నంద

మగువల కింకను మందార పూలన

అమితము ప్రీతియు అగుచు నుండు

బంతులు చేమంతి బాగుగ ప్రీతియె

అలరులు పొదలిక అంగ నందు

అంగ నకును ప్రీతి అగునన అలరులు

ఆమె కోర నింక ఆగ కుండ

పూల నంద జేయ పూబోడి శ్లాఘించు

అనగ నాదు మాట అమృత ధార


(67)పెండిలి యందున పెద్దగ రొదబెట్ట

బంధువు లందరు బదరు పడుచు

అటనుండి గదులుచు అరుగుదు రింటికి

కదలుచు పోదురు కలత జెంది

వవ్చిన చుట్టాన్ని వదలగ నింకను

పెండిలి జూసేటి పెద్ద లెవరు

నూతన జంటను నూరేళ్ళు వర్ధిల్ల

దీవన లిచ్చెడి దిష్ణు వెవరు

సడులు అధిక మగుట సంహతి గాదింక

కర్ణ గూబ చెడుపు కలుగు వరకు

చింత చేయ తగదు చివరకు మదినందు

అనగ నాదు మాట అమృత ధార


(68)తాగుడు జూదము తమలము భోగిని

తగదని దెలిసియు తగ్గ డింక

ధనముయు యశముయు దరుగగ నుండిన

చెడుపని ఎందరొ చెప్ప వినడు

పెడచెవి బెట్టుచు పెద్దల మాటను

వినబోవ కుండును వినగ మంకె

ఇంటను బయటను ఇడుములు పడుచును

గుణమును మానడు గునుసు నింక

కల్లు సార త్రాగ కలుగద చెడుపిక

మత్తు యందె ఎపుడు మనసు బెట్ట

మనిషి బతుకు ఇకను మాలిన్య మనగను

అనగ నాదు మాట అమృత ధార


(69)మగువరొ నీయెడ మనసును నిలుపుచు

అమ్మను నాన్నను ఆలి నింక

కానక నుంటిని కనులును గప్పగ

సోకులు బోవను సొమ్ము అడుగ

దాచిన నారాణి దగ్గరి సొమ్ములు

దోచియు తెస్తిని దొంగ లాగ

నీయంద చందము నీయొంటి సొంపులు

భ్రమసియు పోతిని భార్య గనక

పాప కూప మనెడు పాడియు నెంచక

వార కాంత వలలొ వాజి వోలె

చిక్కి తంటు తుదకు చింతిల ఫలమేమి

అనగ నాదు మాట అమృత ధార


(70)పడతులె ఎపుడును పనులను జేయుచు

బయటను ఇంటను బడలి కనక

మగవారు జేయరు మగువకు సాయము

మనదేశ మర్యాద మగువ కేన

పరదేశ మందున పడతులు పతులును

సమముగ పనులను సరిగ జేయ

మనచోటె దొరలుగ మగవారు ఉండుట

మగువల కింకను మనసు విరుగు

కాన పురుషు లెపుడు కల్పించు కొనుచును

సతికి సాయ పడగ సమము గుండు

ఆలి మగల యందు అరమరి గనకుండ

అనగ నాదు మాట అమృత ధార


(71)చిలిపిగ పలికేటి చిలుకలె చిలుకలు

ముదముగ మాటాడ ముదమె ముదము

విసుగులు లేనట్టి విడిమట్టె విడిమట్టు

బతుకున సుఖమగు బతుకె బతుకు

పొలుపుగ బండేటి పొలముయె పొలమన

పండగ తీపుండు ఫలమె ఫలము

పరిమళ మిచ్చేటి ప్రసవమె ప్రసవము

కులమన కలిసుండు కులమె కులము

బతుకు నందు మనిషి బలముయు చేకూర

అన్ని దెలిసి యున్న అగును సుఖము

ఏమి దెలువ కున్న ఎదుగను లేడిక

అనగ నాదు మాట అమృత ధార


(72)మగనాలు మగనికి మనసిడి వంటలు

రుచిగను జేసిన రుచియు జూసి

ఆక్కల వాడకు అరుగడు ముందిక

ఆలియె బెట్టగ అమృత మంటు

ప్రీతని అన్నము ప్రీతిగ మెక్కును

అదియెను అతివల అనువు వంట

పొలతిక వంటలు పొందిక జేసిన

పతులును మెచ్చరు పరుల వంట

సతియు పతియు కలిసి సరసము తోడను

మెలగు చుండ నింక మేలు గలుగ

వారు ఇకను ఎపుడు వదలరు ప్రేమను

అనగ నాదు మాట అమృత ధార


(73)ఒంటరి బతుకులు ఒనగూర్చు ఇడుములు -

తోడుగ లేకను తోచ కుండు

విడిమట్టు బతుకులె వినగను కనగను

కలతలు కలిగిన కలసి పోయి

ఆనంద సందోహ అనగను నుందురు

అదియెను వారికి అయెడు ప్రీతి

ఒకరికి ఒకరుగ ఒప్పుగ సాయము

చేసుక బతికేటి చేష్ట యనగ

ఉమ్మ డిబతు కులును ఉండుట మేలగు

సరస విరస మైన సర్దు కొనుచు

జీవి తంబు సాగు జీవన మార్గాన

అనగ నాదు మాట అమృత ధార


(74)ఆడయును మగయును అనగను ప్రకృతి

పుట్టుక మూలంబు పుడమి నందు

రెండును లేకను రేగదు జీవము

జగమందు మరియాద జగము దెలియ

విద్యుత్తు పుట్టుక విధమన నదియేను

రాపిడి లేకను రాదు జీవి

అదియెను సృష్టియన అవనిన జరుగ

వినగను మనిషికి వింత యనగ

పుడమి నందు విత్తు పుట్టగ జూడమ

గంధ వతిన జరుగు ఘర్ష ణదియె

సూక్ష్మ ఘర్ష నెంతె సూక్ష్మ మనగనింక

అనగ నాదు మాట అమృత ధార


(75)తెలగాణ యందున తెలుగను భాషయె

తెలుపగ నుండగ తేట భాష

ఇక్కడి జనమిక ఇష్టము అనగను

ప్రక్రియల ధికము పఠన జేయ

అందుండు మధురిమ అనగను నెంతనొ

మధుకర మొసగెడి మధుర భాష

ఎక్కడ సాటియు ఎరుగను లేమిక

తెలువగ నదియెను తెలుగు భాష

తెలుగు రాక నున్న తెలుగోడు గాడన

దేశ భాష లందు దెలుగు లెస్స

అనెడు నాను డింక అనలేము రాష్ట్రాన

అనగ నాదు మాట అమృత ధార


(76)జీవుల కన్నింటి జీవన కాలము

అనగను భిన్నంగ అగుప డంగ

మనిషికి నూరేండ్లు మనసున ఆనంద

మైనను సుఖమేది మైకొ నుండ

సంపూర్ణ గాకుండ సమయును ఎందరొ

అదియెను బాధన అంద రందు

మరణపు భయమింక మనిషిని మెదలించ

తుదిదాక బతుకుట తుదకు అరటె

కాన మనిషి ఎపుడు కాదగు పనులకు

వెరువ తగదు మదిని వెతలు గలుగు

ఆత్మ స్థైర్య మెపుడు ఆపును బాధలు

అనగ నాదు మాట అమృత ధార


(77)మనఊరు మనరాష్ట్ర మనదేశ మనుచును

అందరు మనవారె అనగ నింక

మనఖండ భూమండ లమనను మనవేను

మనమను మాటయె మనుజు లందు

ప్రేమలు మరియాద పెరుగుచు నుండగ

తగవేల ఇంకను తగదు తగదు

జగమున అందరు జనులును సమమన

కయ్యాలు ఇంకను కాన దగదు

ప్రకృతి ధరుమ మెపుడు పాటించు చున్నను

వికృత చేష్ట లింక వినుట యందు

ఉండ బోవు కనగ ఉర్విని ఎపుడును

అనగ నాదు మాట అమృత ధార


(78) పగలుయు రాత్రియు పవనము ఘర్మము

నీరుయు నిప్పుయు నిశ్చ లందు

ఆడయు మగయును ఆయువు మరణము

మంచియు చెడ్డయు మనిషి యందు

కోపము ప్రేమయు కోరిక నైరాశ్య

లాభము హానము లావు బక్క

ఒకటికి ఒకటియు ఒనరగ వ్యతిరేక

మనగను యుండును మనిషి గనగ

కాలు చేయి కనులు కనగను రెండేసి

లోక జీవు లందు లోప మనక

అదియె సృష్టి వింత అనగను యుండును

అనగ నాదు మాట అమృత ధార



(79)సంసార మెపుడును సఖ్యత గలిగుండ

సాఫీగ సాగును సబబు యనగ

ఆలియు మగడును అలకలు లేకుండ

కూరిమి గలిగియు కూడి యుండ

అదియెను చక్కని అనబడు సంసృతి

తనయులు తనయలు తగిన రీతి

తల్లికి తండ్రికి తగినట్టు ఉండగ

ఎదురును లేదింక ఎరుగ సుఖము

కలుగు కీర్తి మంచి కాపుర మనగను

వెలుగు జిందు చుండు వెతలు లేక

ఆలు మగలు బిడ్డ అణకువ మేలన

అనగ నాదు మాట అమృత ధార


(80)నరకము అనలేదు నరునకు వేరుగ

ఇలలోన బొందెడి ఇడుము లేను

ధరుణము అనగను ధరలోన గలిగెడు

సుఖములు అనబడు సూత్ర మదియె

ఎవరును ఎన్నియు ఎరుగగ జెప్పిన

మనిషికి బతుకందు మనసె జెప్పు

పాపము పున్నెము పాలిక బడకుండ

మంచియు అనునదె మనిషి దెలియ

కనుక మనిషి ఎపుడు కల్మష బుద్ధన

కలుగ కుండ యుండ కలుగు మేలు

అదియె పాప పుణ్య అనబడు మార్గము

అనగ నాదు మాట అమృత ధార


(81)కళలన ఉండును కనగను జగమున

ప్రకృతిన వింతది ప్రకృతి జీవి

కుండును కనగను కువలయ మంతట

నెమిలిది నాట్యము నెరుగ వింత

పగడాలు ముత్యాలు పట్టువి బట్టలు

ఎందును లేదిక ఎరుగ మనిషి

కోకిల పాటయు కోలాట మింకను

సంగీత సాహిత్య సార మందు

ఎచట లేవు కళలు ఎరుగను పుడమిన

చేతి పనులు అన్ని చేయ కళలె

కళలు లేక మనిషి కనలేము ఎక్కడ

అనగ నాదు మాట అమృత ధార


(82)చర్విత చర్వణ చరితము అనగను

మేఘము వర్షించి మేధి నందు

అక్కడ అక్కడ అంతయు కురిసియు

బావులు చెరువులు బాగ నిండ

నదులును బారుచు నభసము జేరును

భానుని ఎండిక బాగ పీల్వ

మబ్బును జేరును మరలను నీరుయు

కరుగుచు క్రిందికి కారు ననగ

సవిత జేయు పనియు సతతము అంతనె

మేఘ ముయును మనకు మేలు జేయ

కాల మహిమ అనగ కానగ నుండును

అనగ నాదు మాట అమృత ధార


(83)కాటికి కాల్జాపి కాంతను జూచుచు

కంతుని వలనను కలిగె బుద్ధి

మనువాడ వత్తువ మగువరొ యనుచును

చెంతకు బిలిచియు చేయి బట్ట

ముగుదయు వెంటనె ముసలోడి జూచుచు

చెంపను చరుచును ఛెళ్ళు నొకటి

రసపిచ్చి ఇంకను రయమున తగ్గుచు

ముసలోడు వెంటనె మూర్ఛ బోవు

తేరు కోగ నింక తెలివియు రాగను

తాత బుద్ధి వచ్చి తాను ఎపుడు

మగువ తలువ బోడు మనసున నింకను

అనగ నాదు మాట అమృత ధార


(84)రాముడు కృష్ణుడు రాజులు అయినను

ప్రజలను మేలను ప్రబువు లనగ

మనుషుల కెపుడును మరువని దేవులు

యుగములు యుగములు యువక పెద్ద

అనకను సతతము ఆరాధ నననగ

జనమిక తలుతురు జగము నందు

త్రేతాయు గమునను తెలుపగ రాముడు

దలువగ గృష్ణుడు ద్వాప రందు

ప్రజల మేలు కోరె ప్రభువులె దేవులు

మంచి గుణము కలుగి మనము యింక

కృష్ణ రాము తలువ కృపతోన జూతురు

అనగ నాదు మాట అమృత ధార


(85)తొమ్మిది నెలలుగ తోరయు లేకను

అమ్మయె అపుడింక ఆదు కొనుచు

పుట్టగ నీవును పులకించి పోయెను

నిన్నేను జూచుచు నిదుర బుచ్చు

బుడిబుడి అడుగుల బుడ్డవు ఉండగ

కేలూత యొసగుచు కేరు నింక

పెద్దగ జేసియు పెంచిన తల్లిని

అద్దము మాదిరి ఆదు కొనగ

అమ్మ దీవ నెపుడు అందును నీకిక

దేహ మిచ్చి నట్టి దేవ తనగ

సతత మింక శుభము సుతినికి సేవన

అనగ నాదు మాట అమృత ధార


(86)జననము ఇచ్చియు జనకుడు కొడుకుల

భుజముపై మోసియు బుజ్జ గించి

బడికిని నిత్యము బంపును బడలిక

అనకను మదిలోన అవగ తృప్తి

పోషణ జేయుచు పొంగును మదినిక

తనయుడు వృద్ధిన తపను వోలె

పుత్రుడు దుష్టుడు పుట్టగ తండ్రికి

కలిగెడి బాధయె కనగ జాలి

తండ్రి బడెడి తపన తనయుల కొరకని

తనయు లెరిగి వారు తల్లి తండ్రి

సంత సించ మెలుగ సవ్యము విడిమట్టు

అనగ నాదు మాట అమృత ధార


(87)కోట్లుగ ఆస్థులు కొరలుచు గూడను

బీదకు కడుపుకు బెట్ట లేని

పిసినారి అంటును పిలువగ సిగ్గిక

లేకను ఉండుచు లేశ మైన

బిచ్చము బెట్టని బీదయె అతడన

ఇంకను జూచును ఇతరు లాస్థి

పొందుట కొరకును పొంచియు ఉండియు

లోకము నందున లోకు వవగ

ధనము మనిషి నింక దరుమము జెడుపగ

ధనము లేక యున్న దరుమ మెపుడు

చెడక యుండు మనిషి చేష్టల యందున

అనగ నాదు మాట అమృత ధార


(88)చిడిముడి పడుచును చీదర జెందుచు

మనుషులు ఎపుడును మార కుండ

సతతము ఇతరుల సంతోష మెరుగక

ఎప్పుడు ఏడ్వగ ఎంబ ననగ

చూచెడి వారును చూపులు జూడక

ఉండగ నుందురు ఉసురు మనుచు

ఎపుడును ఆహ్లద ఎరిగియు ఉన్నను

అందరు సంతస అనగ నుండ

కనగ నెపుడు ఇంట కల్యాణ మనగను

తనివి గలుగు నింక తనరు చుండ

తేలి కగును మనసు తెలియగ నెపుడును

అనగ నాదు మాట అమృత ధార


(89)అధికారి సతతము అదవద జెందుచు

పనివారి పట్లను పసయు లేక

ఆవేశ మొందుచు ఆదేశ మీయగ

కోపిష్టి వీనికి కోప మెంతొ

అనుకొను చుందురు అధికారి చాటున

అనువుగ మాటాడ అపుడు వారు

అధికారి సుగుణుడు అనుచును తలతురు

అదియెను అధికారి అసలు తీరు

పనులు జేయు వారి పగలను బెంచక

తగిన రీతి మెలుగ తమకె కీర్తి

ఉఛ్చ నీచ మనక ఉండుట తగునింక

అనగ నాదు మాట అమృత ధార


(90)అమ్మకు అందము అనరిక అవనిన

ఎవరును కనగను ఎపుడు గూడ

తనయుల అందము తల్లులు దలువరు

చూడంగనాసము చూపు నెంతొ

తనరుగ లేకున్న తగినటు తీపియె

ఎవరెటు లున్నను ఎరుగు చుంటు

చూచుట తగదిక చూడ్కిల యందున

అందరు అదమని అనుట మేలు

అంద మనగ నుండు అందరి నందున

మనసు అంద మనగ మనిషి కుండ

ముఖపు అంద మనగ ముఖ్యము గాదిక

అనగ నాదు మాట అమృత ధార


(91)ఫలముల నిండిన పాదప పైనను

రాళ్ళను గొట్టుచు రాల ఫలము

ఏరుక తిందురు ఎరుగగ పిల్లలు

కలిగిన ఇంటికి కన్న మేసి

దోచుక తిందురు దొంగలు కొందరు

ప్రేమతొ ఉండెడి ప్రేయ సందు

చిడిముడి పడుచును చీకాకు జూపుచు

పెనిమిటి ఎపుడును ప్రేమ గనడు

ఏది లేక యున్న ఎవ్వరి జోలికి

పోక యుంద్రు దెలియ పోరు లేదు

లోక మందు జూడ లోకువ ప్రేమన

అనగ నాదు మాట అమృత ధార


(92)మేధిని త్రవ్వగ మేలగు మట్టియు

మేధను త్రచ్చగ మేలు తలపు

మట్టిన ఉండును మణులును కనగను

పుట్టును మదిలోన పుడమి యంత

ఉండెడి వెన్నోను ఉపయోగ మెన్నియొ

అందుకె అందురు అల్ల రెరిగె

పిల్లల బుర్రలొ పిడికెడు మట్టని

మేధిని మేధయు మేలె హరికి

మట్టి లోన ఉండు మహిమలు ఎన్నోను

పట్టి చూడ యందు పనికి వచ్చు

ధాతు లెన్నొ అందు దాగియు ఉండేను

అనగ నాదు మాట అమృత ధార


(93)ఆకలి లేకను అన్నము దినుటయు

పరుగిడ లేకను పందె మనగ

అందము లేకయు ఆభరణ మనుట

ధనముయు లేకయు దాన మనుట

భక్తియు లేకను భజనలు సేయుట

భరణము లేకను బాని సనగ

మాటలు లేకను మరియా దనుటయును

చేటగు నెప్పుడు చేదు నిజము

కాని పనిని తలువ కాబోదు విజయము

చేత నయిన బనులె చేవ నిచ్చు

ఊర కుండ మేలు ఉసురుయు తగ్గును

అనగ నాదు మాట అమృత ధార


(94)పనిముట్టు లేకయు పనులింక జరుగవు

తిండియు లేకను తిరుగ లేరు

మందులు లేకను మానదు రోగము

పన్నస లేకను పంట లేల

ఎరువులు లేకను ఎదుగదు చేనిక

జ్ఞానము లేకను జ్ఞాని అనరు

లోకము దెలియక లౌకికు డనబోరు

స్థలమిక లేకను సదన మేల

ఏది లోప మైన ఎరుగగ పనిగాదు

మూల గూర్చొ నుండ మూట రాదు

బతుకు దెరువు కొరకు బలమైన పనియేను

అనగ నాదు మాట అమృత ధార


(95)కడుపుబ్బ నవ్వించు కవితలె కవితలు

పదుగురు మెచ్చేటి పాటె పాట

రక్తిని గట్టించు రచనలె రచనలు

కనగానె అందము కలికె కలికి

రయమున పరుగెత్తు రత్యము రత్యము

జిలుగుయు జిందేటి జిలుగు జిలుగు

కలువల బోలిన కనులె కనులనగ

పదవిన ఉన్నతె పదవి పదవి

పనులు ఏవి జేయ పట్టుతొ ఉండుచు

ఫలిత మందు వరకు పాటు బడగ

మంచి ఫలిత మొచ్చు మనసుకు తృప్తన

అనగ నాదు మాట అమృత ధార


(96) ఎవడవు నీవని ఎరుగగ అడిగిన

తెలుపుము ముదముతొ తెలుగు వాడి

ననుచును జెప్పుము నలుగురి ముందర

నాయమ్మ తెలుగుయు నాది తెలుగు

నాయూరు నారాష్ట్ర నాదంత తెలుగని

నసుగక జెప్పుము న్యాయ మగును

తల్లిది భాషేదొ తనయుల కదియని

తెలుగేను మాదని తెలుపు చుండు

మధుర వాక్కు లనగ మధురము తెలుగేను

మాత్రు భాష గాన మరువ కెపుడు

అదియె గరువ మనగ అగునిక హర్షము

అనగ నాదు మాట అమృత ధార


(97) పసివారి నవ్వులు పదహారు వన్నెల

బంగారు వలెనుండు బదులు లేదు

ముసలోరి నవ్వులు ముసిముసి గుండగ

మనకును నవ్వొచ్చు మనసు నందు

పసివారు ముసలోరు పగలింటి దొరలాగ

తూరుపు పడమర తూగు తుంద్రు

వారింట నుండిన వారాశి యంతన

ఆనంద మెంతయొ అగుచు నుండు

కాన కలసి మెలసి కాపుర మనగను

బాల వృద్ధు లింక బలము మనకు

వారి తోనె మనకు వచ్చును సుఖమింక

అనగ నాదు మాట అమృత ధార


(98) బతుకమ్మ పండుగ బహుమంచి పండుగ

పూలను పూజించు పూవు బోండ్లు

ఒకచోట గూడియు ఒనరించు పండుగ

అతివల పండుగ అనగ నదియె

రంగుల పూలను రమణులు బేర్చియు

బతుకమ్మ అనుచును బాజ మ్రోగ

చప్పట్లు కొడుతును చదివేటి పాటలు

అందరు జూడగ అంద మనగ

గౌరి గంగ కడకు గౌరవ మనగను

పంపు తీరు జూచు పండు గదియె

ఎనిమి దొకటి దినము ఎరిగెడు పండుగ

అనగ నాదు మాట అమృత ధార


(99)జంభారి చెంతను జంకక నిలుచొని

శ్వానము దినుచుండు శల్య మొకటి

మందాక్ష మనగను మనసున బెట్టక

తినుచుండు ఎముకను తిప్పి తిప్పి

మందుడు గూడను మంకుతొ నింకను

వదలుచు సిగ్గును వర్లు చుండు

పెద్దల వద్దన పెంచుచు శబ్ధము

జనముయు ప్రక్కకు జరుగు చుండ

కుటిల నీతి పరుడు కూడను అటులనె

వంచ ననగ సేయు వదల కుండ

నీతి యెంత జెప్ప నిమిషము వినకను

అనగ నాదు మాట అమృత ధార


(100)భగవాను దెలిపెను భగవంతు గీతలొ

మనుషుల ధరుమము మనుగ డందు

వ్యాసుడు జెప్పగ వ్రాసెను గణపతి

పుట్టుట గిట్టుట పుడమి యందు

పుత్రుల బొందగ పున్నామ నరకము

బాపుట యెట్లనొ బాగ దెలియ

మానవు లందరు మహనీయు మాటలు

మనసిడి వినగను మంచి జర్గు

జగము నందు జనులు జగనాథు సూచన

కనగ వినగ నుండ కలుగు జయము

అదియె జూడ నింక అద్భుత మననగ

అనగ నాదు మాట అమృత ధార


(101)నమ్మక మీదనే నరుడును బతుకును

నమ్మిక లేకున్న నవ్వు బతుకు

తిన్నను పన్నను తిరుగుచు ఉండిన

నమ్మిక మనునదె నయము యింక

తనతండ్రి తనతల్లి తనకును దెలియదు

అమ్మయె జెప్పగ నమ్ము నదియె

ఆ అమ్మ గూడయు అసలమ్మ అనియేల

తెలియగ నుండును తెలియ తనకు

ఉచిత నుచిత జూచి ఉండుట మేలగు

నమ్మి కందు గూడ నయన శ్రవణ

రెంటి పనియు నుండు రేయును పగలును

అనగ నాదు మాట అమృత ధార


(102)భగవంతు డనువాడు బయటకు రాలేడు

నరుడిని ఆత్మలొ నణగి యుండు

గుడులను గట్టిన గుడిచుట్టు దిరిగిన

పటమును ఇంటిన పదిల పరుచ

కనలేము దేవుని కనులతొ నెపుడును

దేవుడు గనపడ దేవు డేల

మేధియె వైకుంఠ మేనుయె కైలాస

మనుచును మ్రొక్కుట మనిషి పనియె

ఆత్మ నవత రించి అతడును ఉండగ

అక్క డిక్క డేల అతిగ దిరుగ

అన్ని చోట్ల ఉండు అక్షరుండు కనగ

అనగ నాదు మాట అమృత ధార


(103)కలిగున్న వారని కథలను జెప్పుచు

పనివారి చేతను పనులు జేయ

నియమిచు కొనుచును నియమము లేకుండ

మనిషోలె జూడక మసలు వారు

తామేది దిననది తగునని బెట్టక

మిగిలిన వాటినె మీకు అనుచు

మరియాద లేకుండ మరివేరు కంచాన

బెట్టుచు ఉందురు పెద్ద వారు

పనులు జేయు వారు పగలును రాత్రియు

కష్ట పడుతు జేయ కాదు అనరు

అట్టి వారి కింక అడుగను లేదంద్రు

అనగ నాదు మాట అమృత ధార


(104) బాల్యము మనిషికి బహుమంచి ఈడన

తిరిగియు రాదింక తిప్ప లదియె

ఆటలు పాటలు అల్లరి చేష్టలు

పిల్లలు గారింక పిడుగు లనెడి

పెద్దల బెదిరింపు పెడచెవి బెట్టెడు

కాలము అదియేను కాన నుండ

ఆనాటి భావాలు అన్నియు మరుగాయె

బాధ్యత లనెడియు బతుకు లాయె

అమ్మ లయ్య లపుడు అనునయ పూర్వక

ప్రేమ లిడెడు పెంపు ప్రేమ లేవి

వయసు మీద పడగ వదలవు చిక్కులు

అనగ నాదు మాట అమృత ధార


(105)అలనాడు రాజులు అందర్ని పీడించి

పన్నులు వేసిరి ప్రజల మీద

ప్రభువుల రాజ్యము ప్రజలును కాదన

ప్రజలకె ప్రబుతని పాటు పడగ

రాజులు పోయిరి రాజ్యాలు బాయెను

వారిని మించిన వారు వచ్చి

పన్నుల పైనను పన్నులు వేయుచు

ప్రజలను దోచేటి ప్రభువు లైరి

తుంట దీసి వేసి తూగును మొద్దని

వారి నొదులు కోగ వారి కన్న

ఘనులు వచ్చి రింక ఘనతలు జేయను

అనగ నాదు మాట అమృత ధార


(106)ప్రేమను భావన పెద్దది పుడమిన

కౄరపు జంతువు కౄరు డైన

అవనిలొ ప్రేమను అందరు ఎరిగియు

పక్షియు అయినను పశువు లైన

ప్రేమయు లేకుండ పెరుగను లేవింక

హరియైన కరియైన హయము అయిన

జాతులు ఏవైన జగమున ప్రేమకె

స్థానము ఇచ్చియు సాకు సంతు

ప్రేమ వింత యనగ ప్రేమించు వారలె

తెలుపు చుంద్రు జనము తెలియ గాను

ప్రేమ లేక జీవి పెరుగుట లేకుండు

అనగ నాదు మాట అమృత ధార


(107)చెట్టుకు ప్రేముండు చెప్పనుండ కనగను

కొబ్బరి చెట్టుయె కొరలు ప్రేమ

అదియెటు లన్నను అందరు దెలియగ

ఆకాశ వీధిని అంట గోరి

పైపైకి జేరుచు పైదాక బెరిగియు

తనసంతు గాపాడ తాప త్రయము

కాయకు మొదటన కాపాడు విధమన

కవచము పీచుయు కనగ నుండు

లోన నీళ్ళు నిండి లోపము గాకుండ

ఎత్తు పైన నుండి ఎగిరి పడగ

విత్తు కేమి గాని విధముయు అనగను

అనగ నాదు మాట అమృత ధార


(108)సంగీత మన్నను సంగీత ప్రియులును

రచనలు అన్నను రచయి తెరుగు

సాహిత్య మన్నను సాహిత్య ప్రియులును

ఆటలు అన్నను ఆట గాండ్రు

గానము అన్నను గానము వినువారు

భజనలు అన్నను భక్తి పరులు

అనగను లోకము అగుపడు విధములు

ప్రకృతి ధరుమమన ప్రబలు చుండ

మనుషు లందు రుచులు మనసును బోలియు

కనగ నుండు ఎపుడు కనుల జూడ

అదియె మనుషు లందు అగుపడు భేదము

అనగ నాదు మాట అమృత ధార  


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page