top of page
Original.png

అమృత ధార శతకము - పార్ట్ 1

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #AmruthaDharaSathakamu, #అమృతధారశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Amrutha Dhara Sathakamu - Part 1 - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 19/01/2026

అమృత ధార శతకము - పార్ట్ 1 - తెలుగు శతకము

రచన : సుదర్శన రావు పోచంపల్లి


(1)తలువడే తల్లన్న తలువ నే తలువడు

తలువ లేకను తాను మెలగు వాడు

తాబుట్ట పడ లేదె తనకు ఆమె మదినే

తనివి బొందుచు నింక తగుల ముండ

చూడదా నీమోము జూపులు జూడగ

కానువారు వెడగా కనగ నింక

ప్రేమతో నామె పాలివ్వదే ముదముతొ

నిమిష మైనను నిన్ను నిడువలేదు


అట్టి తల్లి నింక అటమట బెట్టక

ఆమె నెంతొ ప్రేమ అనగ జూడ

ఆమె దీవ నెంతొ అగునిక పున్నెము

అనగ నాదు మాట అమృత ధార


(2) పనులు నాకేమంటు పనికి సంకోచించ

కలుగ బోవున కాలు కదుపకున్న

నీకన్న బనిజేయ నిలువ బూనును కదా

కుడువ గానక యెంతొ కుమెలివాడు

చూడగా వాడింక చూపును చేతన

చూచు వారల కృప చూడగోరు

చాలగా నీమదేచం బోవు చందము

ఇక యెరుంగుమువాని ఇడుము లెంతొ

కనుక వినుడు నీవు కలిగిన మనిషిని

లేని వాని బతుకు లేశ మైన

కలుగ సుఖము గాదు కఠినము జూపగ

అనగ నాదు మాట అమృత ధార


(3)నీకేమి పనులున్న నీరస పడకను

ఇతరుల సాయము ఇకను గోరి

మదిలోన ధైర్యము మానుకో దలువక

అందరి తోడుగ అలస టంటు

పనులను జేయగ ఫలితము దక్కద

చూచు వారకికను చులుక నేల

ప్రేమతో నీకింక ప్రేమ పడే రింక

కదులు చుండు పనన్న కష్టమనక


చెప్పు మాట లెపుడు చెవినను ఉంచుక

నీకు నీవె ఇకను నీ డ నుండి

చేత నైన పనులు చేయగ సుఖమగు

అనగ నాదు మాట అమృత ధార


(4)శివుడును నలువయు శ్రియపతి యైనను

ఖలుడును ఎదురుగ కాన నతడు

ప్రియమగు వచనము ప్రియముగ పలుకగ

కదలడు మెదలడు కాస్త నైన

దైవము తనకును దీవెన లొసగగ

మదినింక నిలిచిన మంకు వీడ

నెరుగడు మనమున నెపుడును మంకుతొ


దేవుడు యొసగిన దీవ ననడు

అట్టి వాని కింక అననిక రాదన

బుద్ధి యెపుడు ఎవరు బుద్ధి సెప్ప

వినని వాడు గాన విడుచుట మేలగు

అనగ నాదు మాట అమృత ధార


(5)కులములు మతములు కుదురని మనువిక

తగదని అనగను తల్లి తండ్రి

మనసులు కలసిన మనువిక తగునని

తనయులు అనుచును తమకు మనసు

నచ్చిన కన్నెయె నయమని చెప్పుచు

పట్టును వీడరు పట్టు బట్టి

అటువంటి తనయుల అలమట బెట్టక

వివహము సేయుట విధిగ దలువ


మనసు కుదుట పడగ మరియాద జూపుచు

తల్లి తండ్రు లందు తగిన ప్రేమ

తనయు లపుడు జూప తనరగు సుఖమన

అనగ నాదు మాట అమృత ధార


(6)నవ్వుచు నుండెడి నగవుల బతుకన

జీవిత మింకను జీవ నదియె

నవ్వని మనుషుల నలుగురు గానక


జంతువు బోలిన జనము అనుచు

వింతగ జూతురు వినయము వీడుచు

నవ్వన సుఖమగు నవ్వ నెపుడు

మాడుపు ముఖమన మానుచు నుండగ

మనసిక పదిలము మనిషి కింక


నవ్వు మనిషి కెపుడు నయమగు రోగము

మోద మెపుడు కనగ మోము నందు

బతుకు సుఖము అగుచు బలపడు చుండిక

అనగ నాదు మాట అమృత ధార


(7)వైద్యుడు గనపడ వ్యాధిని జెపుచును

బాపడు గనపడ బాగు అడిగి

పంతులు గనపడ పద్దెము అడుగుచు

పనివాడు గనపడ పనులు జేయు

మనుచును ఉందురు మనుషులు ఎపుడును

తమనిక ఎవరైన తగులు కొనగ

తప్పించు కొనుచును తప్పుక తిరుగేటి

మనుషుల భావన మనన యంతె

కాన మనుషు లెపుడు కలసియు మెలసియు

మంచి మనసు తోడ మంచి యడిగి

సేమ మింక గోర సేమము అగునన

అనగ నాదు మాట అమృత ధార


(8)సరిపోవు సదనంబె సదనము సదనము

సరిపోవు తిండియె సరియు సరియు

సరిపోవు బట్టయె సరిపడు సరిపడు

సరిపోవు వయసన సరిగ సరిగ

సరిపడు మనసేను సరియన సరియగు

సరియన్న సరసమె సరియు సరియు

సరియగు గురువేను సరియగు చదువన

సరిగను జెప్పును సమసు శంక

సరస మెపుడు తగదు సరితూగ లేకయు

సరస నుండ తగదు సరస మింక

సతత క్రోధి తోడ సరసము ఎపుడును

అనగ నాడు మాట అమృత ధార


(9)మనసుతొ సరితూగు మనసుయు మనసన

వయసుతొ పనులగు వయసు వయసు

బీదకు బిచ్చము బాధతొ అనకను

ప్రేమతొ బెట్టెడి ప్రేమ ప్రేమ

తల్లికి సేవను తనయులు తనయులు

తనయుల ప్రేమను తల్లి తల్లి

ఇహపర సుఖములు ఇహమునె కలుగగ

పరమను మనసిక పట్టు బట్టు.

భక్తు మనసు ఇకను భయమగు చుండగ

దాన ధరమ జేయు దాత అనగ

భయము వీడి మనసు భద్రము అగునిక

అనగ నాదు మాట అమృత ధార


(10)ముట్టగ తగడని ముట్టక దూరము

పెట్టగ మనిషిని పెట్ట నేల

కట్టడి సేయుట కలనైన కనకుండు

నీసాటి మనిషని నీవు యెరుగు

తినుపంట తినుతేనె తినుటయు జేయవ

పశువును ముట్టక పాలు యేల

త్రాగను నీవిక తాకను వచ్చున

నీదగు కులములొ నీటు గలద

కనుక మాన వుండ కనుమిక కులమును

మరిచి పోవు గుణము మనిషి యుండ

మేలు అగును జూడు మేధిని యందున

అనగ నాదు మాట అమృత ధార


(11)తగవులు తగవిక తనయుల తోడను

తగవిక తగవులు తల్లి తండ్రి

తోడను తనయుల తోడున నుండగ

తగునిక ప్రేమయె తగవు పగలు

మనుషులు ద్వేషపు మనసులు వదులగ

కలుగును సుఖమన కలుగ నుండు

కనులన రెండుయు కలసియు చూడగ

కనపడు ఒకటిగ కనెడి రూపు

కనగ నుండ నదియె కనులకు తగగను

మనిషి ద్వేష భావ మనగ నేల

కలసి మెలసి యుండ కలుగద సుఖమిక

అనగ నాదు మాట అమృత ధార


(12)తల్లియు చెల్లెలు తనకును తోడగు

ఇల్లాలు కనపడ ఇతర దృక్కు

పడగను మనసులొ పగయును ద్వేషము

కలుగుట మనిషికి కనగ నుండ

ఇతరుల పడతుల ఇతడును చూచుచు

నుండగ వారికి నుండు కంటు

మనుషులు అందరు మమకార గుణమును

గలిగిన పగలిక గలుగ కుండు

మమత తోడ మనిషి మనుగడ సాగిన

ఎదురు లేదు ఇకను ఎచట గూడ

మనిషి ఎపుడు మంచి మనసుతొ నుండగ

అనగ నాదు మాట అమృత ధార


(13)సేద్యపు పనియన సేమము అనుచును

నేలను దున్నెడి నేర్పు బొంది

పగలును రేయియు పనులను జేయుచు

నింగికి నేలకు నింక మ్రొక్కి

కర్షకు డెపుడును కదలక నుండును

పొలమును వీడక పొలము నందె

అరకాడె కదనిక అన్నము బెట్టెడి

అగుపడు దేవుడు అనగ నుండు

కనుక రైతె ఎపుడు కనపడు రాజన

రైతు లేక నికను రాజ్య మేది

అనెడి మాట వినగ అగునిక తనివన

అనగ నాదు మాట అమృత ధార


(14)ముడుపులు గట్టుచు ముదముగ దేవుని

కొడుకుల గోరుచు కొలువ గుడికి

అరుగుచు నుందురు అనుచర గణముతొ

ముక్కంటి ఫలముతొ ముందు నిలిచి

మొక్కులు దీర్చుచు మొక్కులు మొక్కియు

కొబ్బరి ముక్కను కొసిరి కొసిరి

పిల్లల కీయరు పిసరంత నైనను

దక్కున పున్నెము దరుమ మనక

కాన మనిషి నిధను కానగ నుండగ

దాన దరుమ మనగ దాత గాగ

కొడుకు లికను లేని కొదువయు దీరద

అనగ నాదు మాట అమృత ధార


(15)సంక్రాంతి పండుగ సందడి గనగను

పిల్లల పెద్దల పిలిచి పిలిచి

మగువలు ప్రేమగు మనసున నింపుక

అందరు స్నానము ఆచ రించ

పాలతొ జేసిన పాయస మనుచును

ఇచ్చెద రింకను ఇఛ్చ గొనగ

హలభూతి పండుగ హరుసము తోడను

జరుపుక నుందురు జనము గనగ

పంట పశువు లదను పండుగ అనగను

భోగి మంట కనగ భోగ మనుచు

బాల బాలి కలకు బాళియు యననగు

అనగ నాదు మాట అమృత ధార.


(16) సరిపోను వసతుండు సదనమె సదనము

వల్లభ జేసేటి వంట వంట

ప్రియురాలు పలుకులు ప్రీతియె ప్రీతన

వేదన గాపాడు వెజ్జు వెజ్జు

తల్లిని సేవించు తనయుడు తనయుడు

కులములు వలదను కులము కులము

కమతము జేసేటి కాపులు కాపులు

సొగసరి దొడిగేటి సొమ్ము సొమ్ము

జనము కలిసి మెలసి జగమున నుండగ

పనులు సాగు చుండు పదిల మగుచు

కలత లేక జనులు కనబడ సుఖమగు

అనగ నాదు మాట అమృత ధార


(17)మధుకర గ్రోలేటి మధువుయె మధువగు

గుణమున మేలను గుణము గుణము

ప్రేమతొ పెంచేటి ప్రేమలు ప్రేమలు

మేలగు బనులింక మేలు మేలు

బతుకున కలిసుండు బతుకులు బతుకులు

మనిషన ప్రేముండు మనిషి మనిషి

బాగుగ పేరొందు భాషయె భాషన

ఫలమన తీపుండు ఫలము ఫలము

వినగ జనము నెపుడు వినయము జూపగ

జనులు మెచ్చ నుంద్రు జగము నందు

పశువు పక్షు లందు పగలేవి చూడగ

అనగ నాదు మాట అమృత ధార


(18) చిన్నపుడె శిశువు చిదిమేయు మనుషుల

దరికిని రానీక దరిమి కొట్ట

వారికి తెలిచొచ్చు వారివి తప్పులు

శిశువన రేపటి శ్రేష్టు లనగ

భార్యను అటులనె బాధించు మగలను

సరసకు రానీక సాగ నంప

జనముకు మేలగు జగమున కనగను

మనుషులు తెలివితొ మసలు కొంద్రు

అటుల మనిషి తీరు అరుదుగ గనపడ

అంటు వ్యాధి అనగ అంటు కొనును

కాన మేలు మెలపు కలిగియు యుండగ

అనగ నాదు మాట అమృత ధార


(19)మట్టెలు పుస్తెలున్ మాయము జేసిరి

గాజులు బొట్టుయు గాన రైరి

తలలోన పూవులు తురుముట మానిరి

కుంతల పొడువును కురుచ జేసి

చీరలు గట్టుట చీదర అనుచును

భామలు నేడును బాధ లేక

కొత్తగు పోకడ కోరుచు నుండిరి

నెరజాణ మారగ నేమి వింత

మారు కాల మనగ మగువల ప్రీతగు

తడవు తడవు మారు తీరు గనుచు

కలికి మారు చుండు కనగను నేడన

అనగ నాదు మాట అమృత ధార


(20) ప్రకృతందు వనరుల పంచుక తినలేక

వికృతపు చేష్టల విషపు బుద్ధి

కలతల తోడను కడతేర్చ బూనుట

మానవ మృగముల మనసు మనస

కలిగిన కూడును కలిసియు తినలేక

కయ్యాల జాడలు కాన నేల

పగలతొ మనిషేమి పదవుల సాధించు

కలతలు లేకున్న కలుగు సుఖము

విషపు బుద్ధి మాని వినయము తోనుండి

మంచి గుణము గలిగి మనిషి యుండ

జగము నందు సుఖము జనమింక బొందద

అనగ నాదు మాట అమృత ధార


(21)మార్గము నడిచేటి మానవు డొకడును

ఆపత్తు గలుగగ ఆదు కోను

మనసేల రాదొకొ మనుషుల యందున

మానవ మృగముల మనసు జూచి

దయ్యాలు భూతా లె దయనీయ స్థితి జేరె

పరితాప మెంతయు పట్ట కుండ

కలుగదు మనిషికి కరుగదు హృదయము

పగలును ద్వేషాలె పట్టు నంటు

సాటి మనిషి కెపుడు సాయము జేయగ

జనము మెచ్చ నుంద్రు జగము నందు

మనిషి జూపు ప్రేమ మరువరు కలనైన

అనగ నాదు మాట అమృత ధార


(22)కుడువకు అరియింట కుడువక మేలగు

తలువకు పరనారి తలువ కీడు

ఎంచకు తప్పులు ఎరిగిన పెద్దల

ఇతరుల గోరకు ఇడుము లైన

కసురకు పిల్లల కసురను బోవకు

కలనైన మరువకు కన్న తల్లి

తగవుల తలదూర్చ తగదిక తప్పగు

మంచను మాటలు మరువ కుండు

తెలిసి తెలువ బోక తెలివింక గలుగుచు

మంద మతియు గాక మసలు కొమ్ము

కలుగు మేలు యింక కలతలు లేకుండ

అనగ నాదు మాట అమృత ధార.


(23)హలభూతి జేసెడు హలికుడె హలికుడు

ఫలసాయ మమ్మగ ఫలమె ఫలము

విరబూయు పూవులె విరులును విరులన

కుటిలపు కుంతలె కురులు కురులు

మధుపంబు లందించు మధువన మధువగు

ప్రియురాలు వడ్డించ ప్రియము ప్రియము

గాయని బాడేటి గానమె గానము

దానము జేసేటి దాత దాత

పగలు రేయి కష్ట పడెడును వాడును

దాన దరుమ ములతొ దాత అవగ

అట్టి మాన వుండె అగునిక పెంపరి

అనగ నాదు మాట అమృత ధార


(24)పొలుపుగ మాటాడు పొలతియె పొలతన

మురిపెము చేకూర్చు ముగుద ముగుద

పడతిని మురిపించు పురుషుడె పురుషుడు

పల్లవి గలిగిన పాటె పాట

బాధలు లేకుంటె భాగ్యమె భాగ్యము

ఫలముల నందించు పంటె పంట

ధార్మికుడు ఒసగు దానమె దానము

సంతోష పరుచేటి సంతు సంతు.

మనుషు లెపుడు మంచి మనసుతొ నుండుచు

ఎవరి మాట వినిడు ఎరుగ కున్న

తనదె దారె నడువ తనకును మేలగు

అనగ నాదు మాట అమృత ధార.


(25)హరిగంధ తరగదు అరగను దీయగ

పరిమళ మింతను పట్టి చూడ

సుగుణుడు డెపుడును సుతరాము కరగడు

ఎవ్వడు ఏమన ఎపుడు గూడ

చందన గంధము చల్లగ ఉన్నటు

ఉత్తము డెపుడును ఉండు శమము

అరచేయి సూర్యుని అడ్డుగ పెట్టగ

తరుగదు వెలుగులు తపను నందు

వెతలు జెందు చున్న వెనుకకు జరుగడు

బుద్ధి మంతు డెపుడు బుడమి నందు

కంచు కనక విధము శుంఠలు సుగుణులు

అనగ నాదు మాట అమృత ధార.


(26)మనిషిది ఎపుడును మలినపు దేహమె

అంతర బాహ్యము అనగ వేరు

అభిషేక మొనరించ అగునింక బాహ్యమె

దేహము లోపల దేరు కొనదు

ఆత్మలొ శుద్ధియె అలరారు శుద్ధగు

మనసులొ మలినాలు మంచి గాదు

మంచను మనసుతొ మనుషులు ఉండగ ఆత్మయు శుద్దిగ అగును జూడ

కాన మాన వుండు కనికర భావము

తోడ నుండ నికను తొలుగు చెడుపు

మంచి మనసు తోనె మంచియు జరుగిక

అనగ నాదు మాట అమృత ధార.


(27)కాషాయ బట్టలు కట్టెడు వారన

మోసాలు జేసేటి మోస గాండ్రు

బవిరిగ గడ్డము బలమగు తిలకము

అంగరఖగ్రికి దాక నుండు

జులపాలు బెంచియు జడలును గట్టగ

వేషాలు ఎన్నియొ వేసి వచ్చి

అపకార మెరుగని అనవద్య శీలుని

చెంతన జేరియు చెప్పు సోది


నమ్మ కున్న మేలు నయవంచ నులనింక

మోస కాండ్రు వారె మోస పుచ్చ

కనుక వారి జాడ కనగను వలదిక

అనగ నాదు మాట అమృత ధార


(28)పెద్దలు మేమని పెద్దగ మాటాడ

సామాన్య జనమింక సాహ సించు

అవకాశ మొచ్చిన ఆపను లేరింక

పలుకగ లేరను పలుకు లేల

తనవారు పరవారు తరగతి విడదీసి

వారితొ కలహాల వాదు లేల

అందరు మనవారు అనగను సరిపడు

తక్కువ చూపన తనర దింక

మనుషి ఎపుడు మంచి మనసుతొ నున్నను

పెద్ద చిన్న పొరపు పెరుగ దింక

తగవు లింక నెపుడు తలపున రాబోదు

అనగ నాదు మాట అమృత ధార.


(29)మెరుపులు గలవన్ని మెరుగగు బంగరు

కాదని దెలియగ కలత లేల

భ్రమలిక పడకను భ్రంశము జెందక

ద్రుఢమగు మనసుతొ ధ్రువము జెందు

అటులనె తలువుము అగుపడు మనుషులు

అందరి బుద్ధిలొ అంద మింక

తెలియక నమ్మిన తెలువగ నీవును

తెలివిడి మెలుగగ తెలుసు నిజము

మనిషి చరిత జూసి మసలుట మేలగు

ఉప్పు కప్పు రంబు ఉండ నవియు

కనగ రుచులు వేరు కనబడు చుండవ

అనగ నాదు మాట అమృత ధార


(30)నింగిని జూడగ నీలిగ నుండగ

వెలుగుల రేడుతొ వెలుగు జిమ్ము

మనిషికి బతుకిక మబ్బుతొ నుండగ

భాగ్యము గలుగను బతుకు వెలుగె

కష్టము సుఖముయు కనగను రెండును

తిమిరము వెలుగుల తీరు గాద

చదువన వెలుగగు చదువక చీకటి

మనిషికి తెలియగ మనసు మారు

కాంతి తిమిర మింక కానగ మనసుకు

కలిమి లేమి తీరు కలుగు విధము

భయము వీడి మనిషి బతుకగ సుఖమగు

అనగ నాదు మాట అమృత ధార.


(31)కూటిలొ రాయిని కూడను తీయక

ఏటిలొ రాయిని ఏల నెత్తు

చదువగ నోపక చదువును జెప్పుట

కుదురున మనిషికి కుదురు టేల

పనియన నోపక పనులను జేయున

బలపము పట్టగ బలము లేక

పలకను బట్టెడు పలుకులు తగునెటు

భీరుడు జూపెడు బింక మింక

లేని వాడు బెట్టు లేహము అనదగు

చేత గాని బనుల చేతు ననగ

నమ్మ రెవరు నేటు నగవుతొ నుంటును

అనగ నాదు మాట అమృత ధార.


(32)కానని అమృతంబు గానిన విధమున

తీయని రుచియని తెలుపు చుంద్రు

అంగజు గనకను అందము దెలుపుచు

అతిచర గనకను అంగు దెలుపు

మెచ్చుల చెట్టును మేలగు పూవుల

పరిమళ మనుచును పలుకు చుంద్రు

కనకను గనినట్టు కవులను బోలుచు

చెప్పుచు ఉందురు జెప్పు వారు

జనము వింత యనగ జగమున నుందురు

తెలువ బోక నింక తెలిసి నటుల

పలుకు చుంటు నుంద్రు ప్రజలతొ నుంటును

అనగ నాదు మాట అమృత ధార.


(33)పలుకుల తల్లిని పరిపరి విధముల

ములుకులు గుచ్చెడి పలుకు బలుక

తెలుగగు నేలయు తెలియగ నింకను

వెలవెల బోవగ వెతల నంది

భాషామ తల్లియు బాధను పడగను

దంభము దమకిక దగదు అనుచు

ఇతరుల భాషగు ఇంగ్లీషు తమకిక

అన్నము బెట్టును అనుచు నుంద్రు

తల్లి భాష తగక తలకొరి వికనని

అన్య భాష నికను అంద మంటు

నేటి జనము మదిలొ నేరము దలువరు

అనగ నాదు మాట అమృత ధార


(34)అగ్గిది రవ్విక అతిగను చిన్నది

అయినను మంటలు అంటు కొనగ

ఎల్లలు లేకయు ఎగబాకు నంతటన్

వటవృక్ష రీతిన వ్యాప్తి జెందు

చదువులు మనసిడి చదువగ విద్దెయు

వ్యాప్తియు జెందద వ్యాపకమన

దీపము అంటగ దీపము వెలుగుచు

వెలుగులు జిందుచు వెలుగు నింక

అగ్గి మర్రి రెండు అంతట పాకెడు

చంద ముగను నింక చదువు నేర్వ

చదువు గూడ పైన చదలును అంటద

అనగ నాదు మాట అమృత ధార


(35)వంటలొ ఉప్పేయ వంటలు రుచిగుండు

పాలలొ ఉప్పేయ పాలు విరుగు

నీళ్ళలొ తేనేయ నీళ్ళేమి జెడిపోవు

తేనెలొ నీళ్ళన తేనె జెడును

చెడువాని స్నేహము చెడునిక సతతము

గుణవంతు స్నేహము గుణము చెడదు

గంధపు చెట్టన గంధము తరుగదు

పాములు అల్లుక పాక పైకి

కనుక తగిన విధము గనుచును తగురీతి

అవస రంబు తీరు అనుచు మెలుగ

గుణము చెడదు ఎపుడు గురుతును ఉండును

అనగ నాదు మాట అమృత ధార.


(36)కరుపూర మింకను కాలుతు నైనను

పరిమళ మందించు పరువ మందు

పూవులు అటులనె పూదేనె అందించు

తేటులు గ్రోలగ తెరపి లేక

పశువులు అటులనె పనిజేయ నుండును

ముసలివి అగుచును మునుగు వరకు

మనిషను వాడును మరువక పనులట్లె

చేయను కీర్తింక చెప్ప బూన

జగము నందు గనగ జనముయు సతతము

పనులు జేయ నుండు పరువు నిలువ

ప్రకృతి ధరుమ మెరుగ ప్రజలును సుఖపడు

అనగ నాదు మాట అమృత ధార


(37)కదలని చెట్టైన కాయలు పండులు

మనకును అందించు మంచి రుచితొ

పూవుల మొక్కలు పూవులు పూయుచు

వాసన లందించు వాటి నుండి

తేటులు అందించు తేనెలు తియ్యగ

భసకము లింటికి భద్రమనగ

విశ్వాస మనగను వృకరాతి దేనిక

ప్రకృతిలొ మనకేది ప్రజల కీయ

కాన మనుషు లంత కాలము తీరుగ

పనులు జేయు చుండ పథక తోడ

జనము బాగు పడును జగమున జూడగ

అనగ నాదు మాట అమృత ధార


(38)కళ్ళును చెవులును కాళ్ళును చేతులు

కాయము నందున కాన నుండ

దేహము మనసుతొ దెలిపెడి బనులను

కాదన కుండను కదులు చుండు

ప్రకృతిని అందరు ప్రజలును గూడుచు

అవయవ మోలెనె అన్ని పనులు

చేదన కుండను చేయగ నుండగ

పరవశ మొందద ప్రకృతి గూడ

మనుషు లింక మంచి మనసుతొ నుండగ

అపుడె జగము ప్రోది అగుచు ఉండు

జగడ మనగ కనరు జనముయు నిరతము

అనగ నాదు మాట అమృత ధార.


(39)మానులు బెంచను మనిషికి శుభమన

ఎండకు దాపన ఎరుగ నగమె

హాలికు డింకను హలభూతి జేయుచు

చెట్టుకు దాపున చేరు చుండు

తీయని ఫలముల తినగను ఇచ్చెడి

విటపియె కనగను విపుల యందు

చెట్టులు బెంచగ చేరును పక్షులు

అదియును పున్నెమె అనగ నింక

పుడమి కాను పనగ పుడమిన మనిషికి

కలుగ జేయు నెంతొ కలిమి గూడ

కనుక చెట్టు బెంచ కలుగును శుభములు

అనగ నాదు మాట అమృత ధార.


(40)ప్రాపును గనలేని ప్రాయిడి కనువగు

అవకాశ మిచ్చిన అదియె మేలు

లావుగ విందన లాభము యేమగు

కూటికి లేనట్టి కూటి పేద

కనగను వారికి కరుణతొ విందన

ఆకలి బాధతొ ఆర గించు

చదువులు జెప్పించ చదువను బాగగు

పేదల బతుకున పెన్నిధోలె

బీద వారి నికను బీదని దలువరు

మనుషు లందు మంచి మనుషు లవగ

నీది కీర్తి బెరుగు నీకును తృప్తగు

అనగ నాదు మాట అమృత ధార


(41)కుడిచిన యింటనె కుదురును అనుకొంటు

కన్నము వేయగ కనును ఖలుడు

కూడును మెక్కగ కుక్కయు ఎపుడును

విశ్వాస మొదలదు వినయ మనగ

జంతువు నడతను జనముయు జూడగ

వింతయు అననగు విపుల యందు

మందుడు ఎందుకొ మలినపు బుద్ధితొ

వంచన నెపుడును వదలు కోడు

నిగ్గ డింక గుక్క నిజమగు భేదము

అనగ వింత గాదు అదియె నేటు

శ్వాన మెపుడు స్వామి శ్వాసయె అననుండు

అనగ నాదు మాట అమృత ధార


(42)పలుకుల యందున పలుకులు చణకులె

చూపుల యందున చూపు తూపు

నడకల యందున నయగార మొలకించు

జలజారి మోముది జలక మాడ

కుముదిని అనుకొని కుముదేశు జూచును

వగలను బోయెడి వనిత గనగ

మిలమిల మెరిసేటి మీనపు కనులును

చూడగ చక్కని చూప రామె

అట్టి అంద గత్తె అవనిన నుండుట

లేఖ లింక జూడ లేశ మైన

ఈర్ష పడుచు నుంద్రు ఈవిడ యందున

అనగ నాదు మాట అమృత ధార


(43)తనదగు తప్పును తనకును దెలియదు

తనదగు వీపుయు తనకు కనగ

తగునని తెలువగ తలపుయు తగదిక

తనదియె మతమిక తనది యనగ

తనకిక నెవరును తనరగ జెప్పిన

తగులదు మదికిని తనిక వినగ

అద్దము మాదిరి అనగను గురువులు

జెప్పెడి మాటయు జెడుపు యేల

కనుక ఆప్తు లెపుడు కనగను మంచియె

చెబుతు రింక తలువ చెడుపు గాదు

నమ్ము వారి మాట నమ్మను దగునిక

అనగ నాదు మాట అమృత ధార.


(44)ముదుసలి వయసున ముగుదలు గనబడ

మనసిక నిలువదు మనిషి కసలు

వయసున అనగను వనితలు గూడను

మనసిడి వత్తురు మదను హాళి

తరుగదు ఎపుడును తనువున కోరిక

ప్రకృతి వరమది ప్రబలు నెపుడును

తాపము నాపను తాతకు గూడను

తరమిక గాదన తలపు చూలి


మనసు నందు నిలువ మనసిక ఆగున

ముదుక డైన మనసు ముదుర తగదు

అనుచు అంగ భవుని ఆశ్రయ మొందద

అనగ నాదు మాట అమృత ధార


(45)కాలము మనిషికి కనబడ కున్నను

కాలపు విలువలు కాన నుండు

కాలమె ప్రకృతి కాధారము అనగను

కాలపు లెక్కలె కాల మహిమ

పుట్టుట గిట్టుట పుడమిన గనలేము

లెక్కలు మాత్రము లేశ మనగ

మరువము ఎప్పుడు మనసున గూడను

కాలము లేకను కలుగ దేది

కాల మందె జీవి కాయువు లెక్కన

కాల మనక యున్న కాల మాగ

బోవ దెపుడు నెరుగ బోవగ నుండిన

అనగ నాదు మాట అమృత ధార


(46)కళ్ళెము పట్టక కంఖాణి నడువదు

ప్రగ్రహ ఝళిపించ పరుగు దీయు

ములుకోల పట్టగ ముందుకు నడుచును

నాగలి గట్టిన నాగ టెద్దు

బెత్తము బట్టగ బెదురుచు జదువును

మొండిగ నుండేటి మొండి వాడు

ముద్దుతొ మురియుచు ముద్దుగ బాలలు

పలకన దిద్దర పలక నిండ

ఎవరి కేది విధమొ ఎరుగుచు నుండగ

పనులు సరిగ నడచు పదిల మనగ

కోప మన్న నెచట కోరను దగదింక

అనగ నాదు మాట అమృత ధార.


(47) మగడును జనిపోవ మగువను ముండన

మరియాద కాదిక మనుషు లకును

మొదటనె బాధతొ మొగమును దాచగ

విధవగ జూచెడు విధము తప్పు

మగువయు చనిపోగ మగవాని నేమంద్రు

ఇంగిత జ్ఞానము ఇంత లేక

సంస్కార మింతయు సరిగను లేకయు

మానవు లధముల మాట లనగ


పుస్తె బొట్టు గాజు పూర్తిగ దీసెడు

భావ మెవరు జెప్పె భామ యేడ్వ

సరస జేర కుండు సంస్కార మదియేల

అనగ నాదు మాట అమృత ధార


(48)పసివారి చేతను పనిజేయ తలపెట్ట

పసివారి బతుకులు పాడు గావ

పెరుగని వయసున పెళ్ళియు జేయుట

పెద్దల బుద్ధేల పెంపు గాదు

పసికూన బట్టుక పరిణయ మన్నను

వారికె దెలువదు వారి వయసు

పెళ్ళితొ వారేమి పేరును దెత్తురు

తగదింక పసివారి తంతు తగదు

పుస్తె మట్టె నల్ల పూసలు దొడిగియు

మగడు వీడు అంటు మాణ వకుని

తల్లి తండ్రి జూ ప తగునేల తేకువ

అనగ నాదు మాట అమృత ధార


(49)తాళియు మట్టెలు తగవిక గాజని

తరుణిక తీయగ తగదు నెపుడు

మగడును జనిపోవ మరలను పెళ్ళియు

తగదను వారికి తగిన బుద్ధి

చెప్పుచు మనసిడి చేయగ సుఖపడు

మగవారు సతిబోవ మరల మరల

మనువను మరియాద మగవారి కేలగు

పతియును సతియును పాటి గాద

తెలివి లేని నాడు తెలుపగ నేడును

సంప్ర దాయ మంటు సలుప నేల

అతివ మనసు నెరుగ అగునిక శుభమన

అనగ నాదు మాట అమృత ధార


(50)సంస్కార చదువుల సంగతి కనగను

అనుకృతి లేదిక అదియె నేటు

చదువుయు గలిగిన చదువుయు లేకను

నెరతన మెంతయు నెచట బోదు

సంస్కార మనగను సంపతి అనదగు

సంస్కార హీనులు చదువ నేమి

బుర్రలొ ఉండెడు బుద్ధెటు బోవును

వంశపు వరసిగ వదల కుండు

వంశ మందు ఉండె వరసయు మారున

చదువు పెక్కు విధము చదువ గాను

విత్తు ఒకటి వేయ విటపియు మారున

అనగ నాదు మాట అమృత ధార


(51)తాతల నాటివి తాటాకు పత్రము

నేటికి విలువిక నెరుగు చుండ

వెనుకటి కాలమె వెలగల కాలము

విలువగు చరితపు విషయ మందు

లిఖితపు పత్రము లింకను దొరుకగ

మనకును యెంతయొ మహిమ యనగ

పూర్వపు చరితము పూర్తిగ దెలువగ

మూడుయు గ్రంథాల మూల మబ్బ

భార తంబు నింక భగవంతు ఇతిహాస

కౌస లేయు చరిత కాన గలుగ

మూడు గ్రంథ సార మూలము దెలిసొచ్చె

అనగ నాదు మాట అమృత ధార


(52)పెరుగుతు పెరుగుతు పెద్దది అవగను

తరువులు మనకిచ్చు తనర ఫలము

పెయ్యలు అటులనె పెరుగుచు పెద్దయి

అరకలు గట్టగ అక్క రొచ్చు

మొదవులు గేదెలు మొదలగు పశువులు

పాలను ఇచ్చుచు పాటు పడును

తనయుల బెంచగ తగురీతి వర్ధిల్ల

తల్లికి తండ్రికి తనరు ప్రేమ

సాద నుండ నింక సాయము జేసెడి

పశువు మాను లనగ పనికి రాగ

పుత్రు లటులె బూన పుడమియు మెరువద

అనగ నాదు మాట అమృత ధార


(53)పయనంబు జేయగ పంచాంగ మికయేల

వారాలు తిథులును వర్జ మనగ

కానున్న దేదియు కాకను మానున

అందరు మనవోలె అటుల జేయ

సాల్వము నంతయు సాగున బనులింక

బండ్లును రావింక బయట దిరుగ

పెండిలి రోజంటె పెట్టెద రెపుడునొ

నిత్తెము పంచాగ నియమ మేల

పనికి రోజు జూడ పంచాగ మనగను

పనులు ఎపుడు జరుగు పయన మెపుడు

చాంద సమని యంద్రు చాలద ఎగతాళి

అనగ నాదు మాట అమృత ధార


(54)బలుపగు మాటలె బలహీన పరుచగ

సవినయ మాటలు సరిగ నుండు

అతితెలి వింకను అగను జూపంగను

మతిలేని మనిషని మట్టు గుంద్రు

నలుగురి ముందర నగుబాటు గాకను

తెలివితొ మెలుగగ తెలుసు కొంద్రు

నీవును గూడను నిజమగు మనిషని

వినగను అందరు వినయు డంద్రు

అర్థ హీన మాట అనగను హీనత

మేలు మాట అనగ మేలు గాద

చెడ్డ మాట ఎపుడు చెడుపును దెచ్చును

అనగ నాదు మాట అమృత ధార.

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page