ముందు ప్రేమలు... ఆపై ఆస్తులు..!
- Kukatlapalli Polayya

- Jun 22
- 13 min read
తల్లిదండ్రుల ప్రేమ, ఆస్తి మరియు అనుబంధాలు, కుటుంబ విలువలు, మానవత్వం, సంస్కారం, ప్రేరణాత్మక కవిత, భావోద్వేగ తెలుగు కవిత, parenting poem Telugu, parents and children relationship, family values Telugu, emotional Telugu poem

Mundu Premalu apai Asthulu - Telugu Poem | Polayya Kavi
ముందు ప్రేమలు... ఆపై ఆస్తులు..! - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 06/06/2026
నేటి సమాజంలో ఆస్తుల కోసం అనుబంధాలు దూరమవుతున్న సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రి, వారికి సంపదతో పాటు సంస్కారం, మానవత్వం, కృతజ్ఞత విలువలను కూడా నేర్పించాలి. "ముందు ప్రేమలు... ఆపై ఆస్తులు..!" అనే ఈ కవిత ప్రేమ, అనుబంధం, ఆత్మగౌరవం మరియు జీవిత సత్యాలను అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.
ఓ తల్లిదండ్రులారా...!
మీ బిడ్డలు ఎవరెస్ట్ శిఖరమంత
ఎత్తుకు ఎదగాలని కలలు కనండి...!
కానీ...వినయమే వారి విలాసం
విధేయతే వారి విజయం కావాలని నేర్పండి..!
వారు విశ్వ విద్యాలయాల
వెలుగులు దాటి
విదేశాల వైభవ వీధుల్లో విహరిస్తూ
విమానాల రెక్కలపై
విహంగాలై ఎగరాలని కోరుకోండి...!
కానీ...ఎంత ఎత్తుకు ఎదిగినా
తమను మోసిన
భుజాలను మరవకుండా...
ఎంత దూరం వెళ్లినా
తమకోసం ఎదురుచూసే
కన్నులను విస్మరించకుండా...
హృదయాలను తీర్చిదిద్దండి..!
వారు అందమైన అనుబంధాలతో
ఆనంద నిలయాలలో
పిల్లా పాపల కేరింతల మధ్య
చల్లని జీవితాలు గడపాలని కోరుకోండి...!
కానీ...భార్యాభర్తల ప్రేమలో
తల్లిదండ్రుల స్థానాన్ని చెరిపేయరాదని
కొత్తబంధాల కోసం పాతమూలాలను
నరికేయరాదని చెప్పండి..!
కాదంటే ముసలితనపు మౌనగదుల్లో
జ్ఞాపకాలే జోలపాటలౌతాయి...
ఆశలు ఆవేదనలు కన్నీటి కవితలౌతాయి..!
మీరు కష్టపడి ఆర్జించిన
ఆస్తుల్ని పిల్లలకు ప్రేమతో పంచండి...!
కానీ...మీరు పంపకాల్లో విడి పోకండి..
మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి..
అన్నీ ఇచ్చి అనాధలుగా మిగలకండి..!
పిల్లలపై ప్రేమ ఉండాలి...పరాధీనత కాదు..
ఆప్యాయతుండాలి..ఆత్మన్యూనత కాదు..
అనురాగముండాలి..అంధవిశ్వాసం కాదు..!
పిల్లల జీవితాల్లో జోక్యం చేసుకోవద్దు...
ఆరని అపార్థాల...మారని మనస్పర్థల
మంటల్లో మనశ్శాంతిని దహించుకోవద్దు..!
కాలం మారితే...
ప్రేమలు పలుచబడితే...
అనుబంధాలు
ఆస్తుల ముందు ఓడిపోతే...
ఒక్కసారి ఈ జీవిత సత్యాన్ని...
ఈ జీవిత పరమార్థాన్ని గుర్తుచేసుకోండి...!
"అనుబంధం...
"ఆత్మీయత...అంతా ఒక బూటకమని..
"ఆత్మతృప్తికై మనుషులు
"ఆడుకునే నాటకమని వింతనాటకమని..!
కరిగే కొవ్వొత్తి కన్నీరు
ఏ కంటికి కనపడదని...
చితిమంటల చిటపటలు
ఏ స్వార్థపు చెవులకు వినపడవని...!
అందుకే...
ఓ అమాయకపు తల్లిదండ్రులారా...
ముందు పంచండి ప్రేమానురాగాల్ని..
ముందే నాటండి మానవత్వపు విలువల్ని..
అస్తమించే ముందు పంచండి...ఆస్తుల్ని..!
ఎందుకంటే...
ఆస్తి నిలబెట్టేది
నీవు నిర్మించిన నీ గృహాన్ని...
ప్రేమ నిలబెట్టేది
నీ జీవిత సుందర మందిరాన్ని...!
=======================================

Jeevam Leni jadabandhalenduku..? - Telugu Poem | Polayya Kavi
జీవం లేని జడబంధాలెందుకు..? - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 06/06/2026
జీవం లేని
జడబంధాలెందుకు..?
జీవిత జ్యోతిని చీకటిపొరల్లోకి నెట్టే
జారుడుబండ అనుబంధాలెందుకు..?
బంధాలంటే…
భగవంతుడు భూమిపై
కురిపించే ప్రేమానురాగాల
ఆప్యాయతల పుష్పవర్షాలు…
రక్త సంబంధాలు…
రాగ రంజిత సంబంధాలు…
రమ్యమైన స్నేహ సేతువులు…
వివాహ వేదమంత్రాలతో
వెలసిన విశ్వాసపు పూలవనాలు…
కాని…ప్రేమ లేని బంధాలు
ప్రాణంలేని ప్రతిమలే…
మూగబోయిన వీణలే…
పరిమళాన్ని కోల్పోయిన
పారిజాత కుసుమాలే…
అవి…గాలివానలో
రెపరెలాడే దీపాలే…
నీటి మీది వ్రాతలే…
ఇసుక తిన్నెలపై
కట్టిన ఇంద్రభవనాలే…
కొన్ని బంధాలు మాత్రం…
మల్లెపందిరిని ముద్దాడే
తియ్యని తీగలౌతాయి…
మనసు కలశంలో
మమతామృతాన్ని నింపుతాయి…
కొన్ని హృదయాలు
హిమగిరి శిఖరాలవోలె
నిష్కల్మషంగా నిలుస్తాయి…
స్వచ్ఛమైన సరస్సులవోలె
సాంత్వనను పంచుతాయి…
ప్రాణానికి ప్రాణమై
కాలానికి కంచుకోటలై
కాంక్రీట్ కట్టడాలవోలె
కలకాలముంటాయి…
కొందరు మాత్రం…
కొండంత సహాయమందించినా
గోరంతగనే భావిస్తారు…
“ఇంతేనా సహాయమంటూ
"ఇంకా ఇంకా కావాలంటూ
"ఆశల పల్లకిలో ఊరేగుతారు…
వారికి కృతజ్ఞత కన్నా కోరికలే మిన్న…
కరుణ కన్నా....ఆశలు కాంక్షలే మిన్న…
వారు చేసిన మేలును
చిటికెలో చీకట్లో కలిపేస్తారు…
చేతికందించిన చందమామను
సైతం చిన్నచూపు చూస్తారు…
విశ్వాసంలేని మనుషులు
విషపు విత్తనాలవంటివారు…
వారి మాటలు మధువులా మొదలై
కర్మమర్మ కత్తులుగా ముగుస్తాయి…
మేలు మరిచే మనుషులు
చెట్టు తొక్కను కొరికి చెట్టును
కూల్చే చెద పురుగులవంటివారు…
అట్టి వారితో
ఎంత అంతరముంటే…
అంత ఆత్మకు శాంతి…
ఎంత దూరముంటే
అంత సుఖం అంత ప్రశాంతత.
అందుకే మిత్రమా…
జీవం లేని బంధాల కన్నా
ఓదార్పునిచ్చే ఒంటరితనమే మిన్న…
నాటకీయ అనుబంధాల కన్నా
నిరాశ నిశ్శబ్దం కన్నా మౌనవ్రతమే మిన్న.
ఆ నవ్వులో నరకముంది..!
కొొందరికి
చుట్టూ చప్పట్ల చంద్రహారాలే…
కొొందరికి
అడుగడుగునా
అసూయా ద్వేషాల అగ్నిగుండాలే…
కొొందరి స్పర్శలో
రాయి రత్నమై రవళిల్లుతుంది…
కొొందరి సహవాసంలో
పూలతీగ కూడా
పామై పడగ విప్పుతుంది…
అదే కదా అదృష్టం…
అనురాగాన్ని
ఆకాశమంత ఎత్తే అదృష్టం…
ఇదే కదా దురదృష్టం…
నమ్మకాన్నే
నిప్పుకుండలో నెట్టే దురదృష్టం…
కొొందరి మనసు
మంచుకొండల మధ్య
జాలువారే జలపాతం…
కొొందరి హృదయం
ముసుగేసుకున్న ముళ్లకోట…
బుగ్గపై భక్తి ముద్దులు పెడతారు…
వెనకనుంచి
విషపు బాణాలు విసురుతారు…
వీరు తేనె పూసిన త్రిశూలాలు…
వీరు నవ్వు నిండిన నిప్పుగోళాలు…
కౌగిలిలో కత్తులు
కప్పుకునే కపట కళాకారులు…
కలిసిన ప్రతి క్షణానికీ
గోతులు తవ్వే గూఢచారులు…
ముందు మల్లెల మాటలు మురిపిస్తాయి…
వెనుక మర్మ ఛేద ముళ్లు గుచ్చుతాయి…
వీరి పెదవులపై పరిమళపు పూలవాన…
వీరి హృదిలోపగల పాతాళాగ్ని జ్వాల…
వీరి చిరునవ్వు
చీకటికి చందనం...
పూసిన మాయముసుగు…
వీరి స్నేహం
సుడిగుండంలో సాగించే స్వర్ణ నౌక…
విశ్వాసాన్ని విషమిచ్చే
విరూప నాగులు వీరు…
ఉపకారాన్ని ఉరితాడుగా
మార్చే ఉక్కు హృదయులు వీరు…
కృతజ్ఞతనే గింజ మొలకెత్తని
కాంక్రీట్ కడుపుల కఠిన ప్రతిమలు వీరు…
అందుకే మిత్రమా…
ప్రతి నవ్వు నందనవనం కాదు…
కొన్ని నవ్వులు నిశ్శబ్ద ద్వారాలు…
కొన్ని కౌగిలులు కాలసర్పాల కాట్లు…
కొన్ని స్నేహాలు
స్మశానంలో వికసించిన పూలు…
“నవ్వు వెనుక
"నిగూఢ నరకం దాగినప్పుడు…
"నమ్మకం" కూడా
"నిశ్శబ్దంగా రక్తమోడుతుంది…”
ఆవగింజంత ఆశ...!
జీవితానికి...ఆశ ప్రాణం
ఎండలో చల్లని నీడలా...
చీకటిలో వెలిగే చిరుదీపంలా...
అలసిన మనసుకు అమృతధారలా...
నిరాశల నింగిలో మెరిసే ధ్రువతారలా...
ఓటముల ఒడ్డున ఒదిగే ఓదార్పులా...
తుఫాన్ల మధ్య నిలిచే ధైర్యదీపంలా...
ముళ్లబాటలో విరిసిన మందారంలా...
ఎడారిలో పొంగిన చెలిమి సెలయేరులా...
చెదిరిన కలలకు చిగురించే కొత్త రెక్కలా...
పడిపోయిన అడుగులకు
పునర్జన్మ నిచ్చేది...ఆశ...
చెమ్మగిల్లిన కనులకు
వెలుగుదారి చూపేది...ఆశ...
చీకటి గర్భంలో ఉదయాన్ని
మోసు కొచ్చేది ఆశ..॥
అధిరోహించిన వారైనా...
ఘోర పరాజయాల
గాయాలు మోసిన వారైనా...
వారి హృదయాల్లో నిత్యం
జ్వలించేది ఆశాదీపమే..॥
విత్తనం భూమిని
చీల్చుకొని మొలకెత్తేది...ఆశతో...
పక్షి రెక్కలను విప్పి
ఆకాశాన్ని తాకేది...ఆశతో...
నది వంకరలు తిరుగుతూ
సముద్రాన్ని చేరేది...ఆశతో..॥
ఆశ ఉన్న చోట...
అడుగులకు అలసట ఉండదు...
ఆశ ఉన్న చోట...
కన్నీటికి శాశ్వత నివాసం ఉండదు...
ఆశ ఉన్న చోట...
ఓటమికి చివరి మాట ఉండదు..॥
అందుకే...ఆశ అంటే
కాదు కేవలం ఒక భావన...
అది మనిషిని
నిలబెట్టే మహోన్నత సాధన...
ఆశ అంటే కాదు
మనసులో మెరిసే ఒక కల...
అది జీవిత రథాన్ని
నడిపించే విజయ బలం..॥
ఆశను హృదయంలో
నాటుకున్నవాడికి
ప్రతి ఆటంకం ఒక కొత్త పాఠం...
ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం...
ప్రతి అడుగు ఒక కొత్త అవకాశం..॥
అందుకే...ఆశను
కోల్పోకు మిత్రమా...
అది ఆత్మకు ఆధారం...
అది జీవితానికి జ్యోతి...
అది విజయానికి తొలి సోపానం..॥

Manavatha Dwaralu - Telugu Poem | Polayya Kavi
మానవతా ద్వారాలు - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 22/05/2026
మనిషి జీవితాన్ని అందంగా మార్చేది సంపద కాదు…మనసులోని ప్రేమ, కరుణ, మానవత్వం.
“మానవతా ద్వారాలు” కవిత, మనిషి మనిషిని ప్రేమగా చూడగలిగితే ప్రపంచం ఎంత అందంగా మారుతుందో హృదయానికి హత్తుకునే పదాలతో చెబుతుంది.
పిల్లల నవ్వుల్లో దేవాలయ దీపాలు…అనాథల కన్నీళ్లలో ఆశాకిరణాలు…ప్రతి హృదయంలో దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తుచేసే అద్భుత కవిత.
1.
పిల్లలను దీవించి చూడు...
వారి నవ్వుల్లో దేవాలయ
దీపాలు వెలుగుతాయి.
బంగారు భవిష్యత్తు
పూలతోటలా పరిమళిస్తుంది.
తల్లిదండ్రులను పూజించి చూడు…
వారి ఆశీర్వాదం
అమృత వర్షమై కురుస్తుంది.
జీవిత మార్గం సుగమ
సువర్ణ రేఖలా మారుతుంది.
పెద్దలను గౌరవించి చూడు…
అనుభవం నీకు
దిక్సూచిగా నిలుస్తుంది,
అజ్ఞాన చీకట్లను
జ్ఞాన వెలుగు తొలగిస్తుంది.
2.
ఇరుగుపొరుగును ప్రేమించి చూడు…
మనసుల మధ్య
స్నేహ వంతెనలు కడతాయి.
కలతల గోడలు
కరిగి మమతలు పూస్తాయి.
వృద్ధులను ప్రేమగా పలకరించి చూడు…
కాలం వంగిన ఆత్మల్లో
కృతజ్ఞత పువ్వులు వికసిస్తాయి.
నిశ్శబ్దం కూడా సంగీతంగా మారుతుంది.
అనాథలను ఆదరించి చూడు…
వారి కన్నీటి మబ్బులు
ఆశాకిరణాలుగా మారతాయి,
జీవితం వారికి
కొత్త ఉదయంగా పుడుతుంది.
3.
శత్రువులకు
అమృతహస్తం అందించి చూడు…
వైరం కరిగి మైత్రి వెన్నెల వెలుగౌతుంది,
రగిలే హృదయం
శాంతి మందిరంగా మారుతుంది.
అభాగ్యుల ఆకలి తీర్చి చూడు…
ఒక అన్నపు ముద్దకు
ఆకాశమే తృప్తి పొందుతుంది,
పేదరికం పరాజయ గీతం పాడుతుంది.
బాటసారుల దాహం తీర్చి చూడు…
ఒక నీటి చుక్కలో
జీవన సముద్రం నిండిపోతుంది.
మానవత్వం పరిమళిస్తుంది.
4.
నీడలేని వారికి నీడనిచ్చి చూడు…
నీ దయచెట్టు విశ్వానికి ఆవాసమౌతుంది.
సూర్యుడు కూడా క్షమగా చూస్తాడు.
నిరాశలో కృంగిన వారిని ఓదార్చి చూడు…
నీ మాటే వారికి ఆశాకిరణమౌతుంది.
చిమ్మ చీకటి చిరునవ్వుగా మారుతుంది.
పరమాత్మను భక్తితో ప్రార్థించి చూడు…
నీ అంతరంగం
ఆకాశమంత విశాలమౌతుంది,
ఆత్మ శాంతిసుధా
సముద్రంలో మునిగిపోతుంది.
నిర్మలమైన నిష్కల్మషమైన
ప్రతి చూపు - నిత్య సత్య సుందరం.
తెరచిన ప్రతి హృదయం -
మానవత్వానికి ఒక దివ్య దైవ మందిరం.
=================================

Amma O Amma - Telugu Poem | Polayya Kavi
అమ్మా..! ఓ అమ్మా..!! - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 17/05/2026
తల్లి ప్రేమను మాటల్లో పూర్తిగా చెప్పడం అసాధ్యం.
అమ్మ ఓర్పు, త్యాగం, మమత, అనురాగాన్ని ప్రకృతితో పోల్చుతూ పోలయ్య కవి గారు రాసిన ఈ కవిత ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది.
అమ్మా...ఓ అమ్మా..!
నీ ప్రేమెంత పరిమళమో
ఎవరికి తెలుసు..?
ప్రభాత పవనంలో
పరిమళించే ఆ
పుష్పసుగంధానికి తప్ప...
అమ్మా...ఓ అమ్మా..!
నీ మనసెంత లోతైనదో
ఎవరికి తెలుసు..?
అలలు ఎగిసిపడే
అంతులేని ఆ సాగరానికి తప్ప…
అమ్మా...ఓ అమ్మా..!
నీ పిలుపులోని పసితనం
ఎంత కమ్మనిదో
నీ పలుకుల్లోని పరవశం
ఎంత తియ్యనిదో
ఎవరికి తెలుసు..?
కొమ్మల్లో కూసే ఆ
కోయిలమ్మ గానానికి తప్ప…
అమ్మా...ఓ అమ్మా..!
నీ త్యాగమెంత ఘనమైనదో
ఎవరికి తెలుసు..?
తాను కరిగి లోకానికి
వెలుగునిచ్చే ఆ దీపశిఖకు తప్ప…
అమ్మా...ఓ అమ్మా..!
నీ ఓర్పెంత విశాలమో
నీ సహనమెంత శాశ్వతమో
ఎవరికి తెలుసు..?
అన్నిటినీ భరించే ఆ నేలతల్లికి తప్ప…
అమ్మా...ఓ అమ్మా..!
నీ అనురాగమెంత అమృతమో
నీ ఆరాధనెంత అపురూపమో
ఎవరికి తెలుసు..?
సృష్టికి శ్వాసనిచ్చిన ఆ బ్రహ్మకు తప్ప…
అమ్మా...ఓ అమ్మా..!
నీ వుంటే...
ఇల్లంతా మమతల హారమే...
నీవు నవ్వితే...
జీవితమంతా వసంత విహారమే...
నీవు లేకుంటే...
గుండె గర్భంలో గాఢాంధ కారమే…
అందుకే
అమ్మంటే...ఒక పదం కాదు…
అది ప్రాణానికి పరమార్థం…
అమ్మంటే...ఒక పదం కాదు...
అది అనంత ప్రేమకు ఆది అక్షరం..!

మందు గ్లాసుల…
మరణ మృదంగం..?
మొన్న సరదాగా మొదలైంది…
నిన్న చెలిలా చెంతకు చేరింది…
నేడు అలవాటై అల్లుకుంది…
రేపు వ్యసనమై వేధిస్తుంది...
ఎల్లుండి మొండి వ్యాధియై…
ఊపిరిమీద ఉచ్చు బిగిస్తుంది…
అది మద్యమైయినా…
అది మత్తు పదార్థమైనా…
అది ధూమపానమైనా…
గుట్కైనా…గంజాయైనా…డ్రగ్సైనా…
మొదట మత్తు…మైకం…
మనసును మురిపిస్తాయి…
మెల్లగా మోహంలో ముంచేస్తాయి...
ఆపై మృత్యువును ముద్దాడమంటాయి…
ఒక్క గ్లాసు…ఒక్కోసారి
ఉత్సాహం కాదు...ఉరితాడు…
ఒక్క పెగ్గు…ఒక్కోసారి
స్టైల్ కాదు...శవపేటిక…
ఒక్క చిటికెడు మత్తు…ఒక్కోసారి
సరదా కాదు...సమాధికి చిరునామా…
గ్లాసులో కనిపించేది
మందే కావచ్చు…కానీ…
అందులో కరిగేది ఆరోగ్యం…
అందులో మునిగేది ఆస్తిపాస్తులు…
కుటుంబ గౌరవ మర్యాదలు…
కన్నీరు కార్చేది కుమిలే కుటుంబం…
అందులో సమాధి అయ్యేది
అందరి ముందరి అందమైన జీవితం…
ఓ మందుబాబుల్లారా…!
“మందు విందు పొందు” అంటూ
మత్తులో మునిగి పోకండి…
మందు గ్లాసులో మత్తు మైకం కాదు...
"మృత్యువు" దాగిఉందని మరువకండి…
మందుకు బానిసలు కాకండి…
మౌనంగా మత్తుకు బలైపోకండి…
అప్పుల అగ్నిగుండంలో
అందమైన కుటుంబాలను
ఆహుతి చేయకండి…
అకాల మరణాలతో ఆనందకర
జీవితాలను అంతం చేయకండి...
భగవంతుడు
వరంగా ప్రసాదించిన
ఈ బంగారు బ్రతుకును…
మత్తుమంటల్లో కాల్చి మసిచేయకండి
సంతోషపు సుగంధపరిమళాలతో
నింపి ఈ జన్మను సార్థకం చేసుకోండి…
పలికండి మత్తుకు స్వస్తి...
ఆపై ఆరోగ్యమే మీకు తరగని ఆస్తి...
=================================

Ashtaisvaryalante - Telugu Poem | Polayya Kavi
అష్టైశ్వర్యాలంటే…! - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 08/05/2026
అష్టైశ్వర్యాలంటే…?
అకౌంట్లలో అంకెలుగా
పేరుకుపోయే
కోట్లకొద్ది కరెన్సీ కాదు…!
బీరువాల్లో బందీఐన
బంగారు ఆభరణాలు కాదు…
పట్టు వస్త్రాల పండుగ కాదు…
ఆకాశాన్ని అంటిన
ఆస్తులు అంతస్తులు
మేడలు మిద్దెలు కాదు…
విలాసాలవంతమైన విల్లాలు,.
ఖరీదైన కార్లు కాదు…!
మరి…అష్టైశ్వర్యాలంటే…?
అలసిన అడుగులతో
భర్త ఇల్లు చేరిన వేళ…
తలుపు తట్టగానే
తనువంతా చిరునవ్వై
తలుపు తీసే జీవిత సహచరి…!
తండ్రి మాటలో
తీపిని విని…
తల్లి చూపులో
దీవెనను చదివే పిల్లలు…!
దూరమైనా దూరం కాని…
భారం అయినా
భారంగా అనిపించని…
బంధాల బంగారు బాటలో
తోడుగా నిలిచే బంధువులు…!
కష్టాల కడలిలో
కరిగిపోని కొండల్లా…
కన్నీటి క్షణాల్లో
కనురెప్పై నిలిచే
హితులు ప్రాణ స్నేహితులు…!
మందుల సీసాలు
ముట్టనివ్వని ఆరోగ్యం…
మంచం పట్టనివ్వని
మానసిక స్థైర్యం …!
నిప్పులా కాల్చేఅప్పుల
అగ్నిగుండం లేని జీవితం…!
చీకు చింతలు చేరని
చల్లని వెన్నెల వెలుగుల జీవనం…!
చివరి శ్వాస వరకూ
చిరునవ్వే చిరునామాగా…
మంచాన పడక…
మనసుని మాడ్చే వ్యధ లేక…
మాయమైపోయే మహద్భాగ్యం…!
ఇవే నిజమైన
ఇంటి ఇంద్రధనుస్సులు…
ఇవే అసలైన
జీవిత అష్టైశ్వర్యాలు…!
అందరూ ఆనందంగా ఉండాలి…
అందులో మనం ఉండాలి…
అన్నదే మనసు మంత్రం కావాలి…
“సర్వేజనా సుఖినోభవంతు"…!
====================
అంతరంగ భాష

అంతరంగ భాష...
అంతరాత్మ ఘోష..!
జీవితమనే జలధిలో
ఎన్ని అలలెదురైనా…
ఎన్ని తుఫాన్లు తాకినా…
మునిగింది శరీరమే కాని
నా మనసెప్పుడూ మునగలేదు…!
ఆకలికి అలమటించిన రోజులు…
అవమానాలను భరించిన రాత్రులు…
మోసాలతో ముక్కలైన నమ్మకాలు…
నష్టాలతో నలిగిన నడకలు…
నిరాశల...నిట్టూర్పుల...
నిప్పుల్లో నిత్యం కాలిన కలలు...
ప్రేమ పేరుతో విసిరిన పూలతూటాలు…
భగ్నమైన బంగారు భవిష్యత్ బాటలు…!
అణచివేతల అగాధాలల్ని...
వివక్షతల విషవాయువుల్ని…
ముసుగేసిన మిత్రద్రోహుల్ని...
శత్రువుల కుట్రల కుతంత్రాల్ని...
చిరునవ్వులతో ఛేదించి ఎన్నో
ముళ్ళదారుల్ని దాటిన నాకు
ఆత్మగౌరవమే అక్షరమైంది...
ఆ అక్షరమే ఆయుధమైంది...
నా జీవితంలో
వినోదాలకన్నా విషాదాలే మిన్న
విజయాలకన్నా అపజయాలే మిన్న
హితుల స్నేహితుల
శ్రేయోభిలాషులకన్నా
హింసించేవారే మిన్న...
ప్రేమించే వారి కన్నా
వేధించే వారే
వెన్నుపోటు పొడిచే వారే మిన్న...
అభిమానుల కన్నా
అసూయాపరులే మిన్న...
ఐనా…ఈ వెన్నెముక విరగి పోలేదు...
ఈ మొండి మనసు వంగి పోలేదు …
ఈ కలంలో సిరా తరిగి పోలేదు...
కత్తుల్లాంటి...పూలగుత్తుల్లాంటి...
కొవ్వొత్తుల్లాంటి కవితల్ని కంటూనే ఉంది
ఆకర్షణ…వికర్షణ…
ఘర్షణ…సంఘర్షణ…
అనుభూతి…అనుభవం…
అన్నీ ఏకమై ఎదలో గూడుకట్టిన వేళ కన్నీటిచుక్కలే కలంలో సిరాగ మారాయి
గుండె గర్భంలో
గర్జించిన నిశ్శబ్దమే గేయమై పొంగింది…
ఆవేదన ఆర్తనాదమే అక్షరమై వెలిగింది…!
కలమే నా శ్వాసయై…
కవిత్వమే నా ప్రాణమై…
పదాలే నా పాదముద్రలై...
భావాలే నా బ్రతుకు బాటలై...
నా అంతరంగ
భాషకు…అంతులేని
నా అంతరాత్మ ఘోషకు…
నా ఆవేదనకు…నా ఆక్రందనకు…
నా కవితలే సజీవ సాక్ష్యాలు…
ఒక్క కాలానికే కనిపించే సంతకాలు...
పాఠకులకు వినిపించే విజయ గీతికలు.
=========================

Jai Pathala Bhairavi - Telugu Poem | Polayya Kavi
జై పాతాళ భైరవి…! - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 24/04/2026
జై పాతాళ భైరవి…!
నరుడా…ఏమిరా నీ కోరిక…?
తల్లీ…కష్టాల కత్తులపై
నా పాదాలు రక్తమోడుతున్నాయి
కన్నీళ్లు నైవేద్యమై జారుతున్నాయి
ఉద్యోగం ఊడిపోగా
ఇంటిలో పొయ్యి చల్లారిపోయింది…
అప్పుల పాము కసిగా కాటేస్తోంది...
ఊపిరి అణగదొక్కిన
బండరాయిలా ఉంది నా చీకటి జీవితం...
మరణమొక్కటే శరణ్యంగా కనిపిస్తోంది…
తల్లీ…అర్జంటుగా
ఒక "లక్ష రూపాయలు" కావాలి…
అంతేనా డింభకా…?
లక్ష కాదు…"కోటిరూపాయలిస్తా"…
తీసుకో…! ఒక్క క్షణంలోనే
ఖాతాలోకి వరదలా
చేరిన "కోటి రూపాయలు"
కళ్లలో మెరుపులై మెరుస్తుండగా
ఇది కలనా… నిజమా…
అన్న సందేహం కరిగిపోయింది…
ఔను ఇది నిజంరా నీ తల్లి వరం రా…
నీ నమ్మకానికి దక్కిన ప్రతిఫలం రా…
అని నవ్వి తల్లి మాయమైపోయింది…
జై పాతాళ భైరవి…!
నరుడా మళ్ళీ ఏమిరా నీ కోరిక..?
చిన్న…గ్యాస్ బండ…కావాలి తల్లీ...
సారిరా డింభకా…!
కోటి వరాలైనా ఇస్తానురా…కానీ
ఆ గ్యాస్ బండ ఒక్కటి అడక్కురా...
ఎందుకు తల్లీ…?
పశ్చిమాసియాలో భీకరమైన
యుద్ధాగ్ని రగులుతోందిరా...
అగ్ర రాజ్యాలు ఉగ్రరూపం దాల్చేరా
అణుబాంబుల ఆట ఆరంభమాయేరా...
గ్యాస్ బండలు ఇప్పుడు
వంట కోసం కాదురా…డింభకా...అవి
ప్రళయానికి విలయానికి ఆయుధాలురా..
అందుకే ప్రపంచాన్ని
బాంబుల భయంతో బంధించే
హిట్లర్ నెతన్యాహును
యుద్ధ తుగ్లక్ ట్రంప్ ను
అడుగరా....డింభకా...అంటూ
మిస్సైల్స్ పొగలో మాయమైపోయింది…
అయ్యో నా వరం హర్మూజ్
జలసంధిలో ఆయిల్ నౌకలా
చిక్కుకు పోయింది
జై పాతాళ భైరవి…! జై పాతాళ భైరవి…!
అని ఎంతగా అరచినా
వరాలిచ్చే నా తల్లి కనకదుర్గ
కనిపించదాయే కరుణించదాయె...!
ఓ యుద్ధ మదాంధుడా…!
నీ యుద్ద విమానాల బాంబులమోతతో
భూమి గుండెల్లో భూకంపం పుట్టె కదరా
వంటకు కావాల్సిన గ్యాస్ బండ
ప్రళయ విలయ జ్వాలగా మారె గదరా…
ఒక్కసారిచూడు పిల్లల కన్నీటి సముద్రాన్ని
అగ్గిలో బుగ్గైన అమాయకుల జీవితాలను
ప్రపంచాన నిండిన నిట్టూర్పుల శ్వాసలను.
ఇకనైనా ఆపరా...
నీ రాక్షస క్రీడను...
చేయకురా రక్తస్నానం...!
చేయకురా
శవాలపై శివతాండవం...!
వ్రాయకురా...
మానవత్వానికి మరణశాసనం...!
=================================

Sukhaduhkhala Mukha Pusthakam - Telugu Poem | Polayya Kavi
సుఖ దుఃఖాల ముఖ పుస్తకం - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 18/04/2026
సోషల్ మీడియా…👉 ఆనందాల వేదికా?👉 లేక బాధల అగాధమా?
ఈ కవిత ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుంది.
ముఖ పుస్తకం…
ముళ్ల బాటలో పూల పరిమళం...
పూల తోటలో దాగిన ముళ్ల కాటు…
ముఖ పుస్తకం…
విజ్ఞాన గని వెలుగులో
విషాదాల ప్రతిధ్వని...
వినిపించే లోకం…
ముఖ పుస్తకం…
సుఖదుఃఖాల సముద్రం...
అలలపై నవ్వులు…
లోతుల్లో నిశ్శబ్దపు కేకలు…
ముఖ పుస్తకం…
వినోదాల విహారయాత్రలా మొదలై
బూతు మాటల శవయాత్రగా
ముగిసే ముళ్ళ దారి…
ముఖ పుస్తకంలో...
లైకుల పూలహారాలు మెరుస్తాయి
కామెంట్ల కత్తులు
గుండెను గుచ్చుతాయి…
ముఖ పుస్తకంలో...
అభిమానుల హర్షధ్వానాలు...
ఆగంతకుల గూఢనజరాలు…
గద్దల్లా నీ ప్రతి అడుగును
గమనించే…అదృశ్య నేత్రాలు...
ముఖ పుస్తకం…
మంచి చెడుల సంగమం...
అనంత సమాచారానికి
సింహద్వారం…మాయాగర్భం...
కొందరికి జ్ఞానదీపం...
కొందరికి శాపం...
ఇంకొందరికి నరక కూపం…
ముఖ పుస్తకంలో
మిత్రులతో మాటలు
మాయని మమతలే...
అపరిచితులతో...అపార్థాలతో
ఘాటైన మాటలతో భీకర యుద్ధాలే...
ఒక చిన్న అపార్థం...
మనశ్శాంతిని మట్టిలో కలిపేస్తుంది…
ముఖ పుస్తకంలో…
విడిచి పెట్టలేని సరదా ఉంది...
తుడిచిపెట్టలేని బురదా ఉంది…
ముఖ పుస్తకంలో...
24/7 మునిగి తేలడం...మూర్ఖత్వమే...
మితిమీరని వినియోగం విజ్ఞతే స్థితప్రజ్ఞతే.
ముఖ పుస్తకం…
ముద్దులతో ముంచేత్తే మాయలేడి...
అతిగా ఆశిస్తే...
అంతరంగాన్ని దహించే అగ్నికుండం…
అందుకే…
అప్రమత్తతే నీకు శ్రీరామరక్ష...
అజాగ్రత్తే నీకు కఠిన కారాగార శిక్ష…
👉 మీకు ఈ కవిత నచ్చిందా? SHARE చేసి ఆలోచింపజేయండి 🙏
================================

Asthaminchani Jnanabhaskarudu Dr. B. R. Ambedkar - Telugu Poem | Polayya Kavi
అస్తమించని జ్ఞానభాస్కరుడు డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 14/04/2026
సమానత్వం కోసం పోరాడిన మహామేధావి…అణగారిన వర్గాలకు వెలుగునిచ్చిన జ్ఞానసూర్యుడు…
B. R. Ambedkar జీవితం, ఆశయాలుఈ కవితలో ప్రతిధ్వనిస్తాయి.
మహర్ గగనాన మెరిసిన ధృవతార
రాళ్ళలో రత్నం మట్టిలో మాణిక్యం
అజ్ఞానపు గంజాయి వనాన వెలసిన
అక్షర తులసి, ఆశల వేకువ.
బడుగుల గుండెల్లో కొలువైన దైవం
చీకటి దారుల్లో వెలిగే జ్ఞానదీపం
అంబేద్కర్ ఆశయం ఆకాశమంత
అణగారిన వర్గాలకు కొండంత అండ
వీధిబడిలో తగిలే అవమానాల సెగలెన్నో
అవి సూర్యున్ని ఆపలేని మేఘమాలికలే
విదేశీ విశ్వవిద్యాలయాల్లో విద్యనార్జించే
హక్కుల్ని అక్షరబద్ధం చేసి రక్షణ కల్పించే
నిద్రాణమైన మేధస్సులకు మేల్కొలుపు
బావిలోని కప్పలకు ఒక బాటసారి
మూగగొంతులకు స్వరమిచ్చిన ఓ కోయిల
పూరి గుడిసెలో పుట్టిన బహుజన బిడ్డలను పులులుగా మార్చిన మేధావి
మనిషిని మనిషిగా చూడని మనువాదాన్ని
మేధాశక్తితో మట్టుపెట్టిన ధీరుడు వీరుడు
ఉర్రూతలూగించిన ఉద్యమ కెరటం
కుల నిర్మూలనకు కంకణబద్ధుడు
అంటరానితనమనే విషవృక్షాన్ని
కూకటివేళ్లతో సహా పెకలించిన గొడ్డలి
అడుగునున్న బడుగులకు... అణగారిన వర్గాలకు,
హక్కులిచ్చిన...జ్ఞానదాత
తన రక్తాన్ని సిరాగా మలిచి
దేశ సౌభాగ్యానికి రక్షణ కవచంలా
రాజ్యాంగాన్నిచ్చిన...
రాజ్యాంగ నిర్మాత...
ఓ మహామేధావి
ఓ జ్ఞానసూర్యుడా
మీ అడుగుజాడలే
మాకు అమృత మార్గాలు
మీ స్మరణే మాకు ఓ ప్రేరణ
మీ ఆశయ సాధనే మా లక్ష్యం
ఓ భారత రత్నమా... ఓ అమర జీవి అంబేద్కర్
మీ దివ్య చరణాలకివే మా అక్షర నీరాజనాలు, వేలవేల వందనాలు...
👉 అంబేద్కర్ ఆశయాలలో మీకు ఎక్కువగా నచ్చింది ఏమిటి? కామెంట్ చేయండి!
===============================
కుల వివక్ష ఒక శిలువ శిక్ష..?

కులం పేరుతో మనిషి మనిషిని తక్కువగా చూడడం…ఇది సమాజానికి పెద్ద శాపం.
ఈ కవితలో కుల వివక్షపై గట్టి నిరసన,సమానత్వం కోసం ఒక పిలుపు వినిపిస్తుంది.
కుల వివక్ష ఒక శిలువ శిక్ష..?
కులం ఒక రక్కసి...
కులం ఒక జాడ్యం...
కులం ఒక కుడ్యం...
కులం ఒక మౌఢ్యం...!
కులం ఒక కుళ్ళు...
కులం ఒక ముల్లు...
కులం మత్తు మందు...
కులం కొందరికి విందు...!
కులం ఒక విషం...
కులం ఒక విషవృక్షం...
కులం ఒక రావణకాష్టం...
కులం కొందరికి కులదైవం...!
కులం ఒక గజ్జి కుక్క...
కులం ఒక అంటువ్యాధి...
కులం ఒక మండే కుంపటి...
కులం ఆరక రగిలే ఒక అగ్నిగుండం..!
కులం ఒక కాలసర్పం...
కులం ఒక కరోనా వైరస్...
కులం ఒక పిడుగుల వర్షం...
కులం ఒక నాలుగు పడగల నాగరాజు.!
కులం చాపకింద నీరే...
వద్దు వద్దు కులం వద్దు...
కుల నిర్మూలనే ముద్దు...
వద్దు కులం పేర కుమ్ములాటలు...!
కులం ఒక శిలువ శిక్ష...
వద్దు వద్దు కులవివక్ష...
కులం ఒక జాతికి శాపం
కులంతో ఒక జాతి సర్వనాశనం..!
వద్దు వద్దు అస్పృశ్యత...
వద్దు వద్దు అంటరానితనం...
వద్దు వద్దు కులదురాచారం...
వద్దు వద్దు కుల దురహంకారం...!
కులాన్ని
ముళ్ళకిరీటంలా
ధరించినవాడు...!
ఆకాశంలో
నక్షత్రాలన్ని
అవమానాలను
భరించినవాడు...!
నేడు భారతావనిలో
"కులం ఒక కుళ్ళని...
దాన్ని కడగడానికి
చాలవు "కడలిలోని నీళ్ళని...!
పలికిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్
భావిభారత నవసమాజ నిర్మాతలైన
యువశక్తి కిచ్చే సందేశం ఒక్కటే...!
తక్షణమే కులాన్ని రద్దు చేయాలని..
ఆరని కుల కుంపటిని ఆర్పాలని...
కుల నిర్మూలన చట్టం తేవాలని...
కులాంతర వివాహాలు పెరగాలని...!
ప్రేమ...శాంతి...సహనం...
స్వేచ్ఛా....స్వాతంత్య్రం....
సమానత్వం...సౌభ్రాతృత్వం...
పునాది రాళ్ళుగా...కులరహిత
నవసమాజ నిర్మాణం జరగాలని...!
=====================================

Mahathma Jyothirao Phuleku Joharlu - Telugu Poem | Polayya Kavi
మహాత్మ… జ్యోతిరావు ఫూలేకు జోహార్లు - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 11/04/2026
సమాజంలో సమానత్వం కోసం, విద్య హక్కు కోసంఒంటరిగా పోరాడిన మహానుభావుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే.
ఈ కవిత ఆయన సేవలను, ఆయన ఆలోచనలను, ఆయన ధైర్యాన్ని స్మరించుకుంటూ రాసిన నివాళి.
ఇది కేవలం కవిత కాదు…ఒక మహనీయునికి అర్పించిన గౌరవ వందనం.
ప్రపంచమంతా
అజ్ఞానాంధకారంలో
మునిగివున్నవేళ...
సమాజంలోని అనేక
రుగ్మతలపై... స్పందించాడు.
శూద్రులు, అగ్రవర్ణ స్త్రీలు
విద్యకు అర్హులు కారన్న
మనువాద సిద్ధాంతానికి
వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి
52 పాఠశాలలు నెలకొల్పి
స్త్రీలకు విద్యను అందించాడు.
నాడు మతం పేర, కులం పేర
ప్రజల్లో నరనరాన పేరుకుపోయిన
మూఢాచారాల్ని, అంధవిశ్వాసాల్ని
చీల్చిచండాడి, మీసం మెలిపెట్టి
శాశ్వతంగా సంకెళ్ళతో బంధించాడు.
తన జీవితమంతా
అగ్రవర్ణ బ్రాహ్మణులు
పెంచి పోషించే వర్ణవ్యవస్థను
విషసర్పం కాటుకు బలైపోయే
శూద్ర బహుజన హక్కుల కోసం
సమాజంలో సమానత్వం కోసం
స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం
ఒంటరిగానే పోరాడి పోరాడి
తన రక్తాన్ని స్వేదంగా చిందించాడు.
అందుకే మహాత్ముడయ్యాడు.
నేడు కోట్లాదిమంది బడుగు, బలహీన
వర్గాల ప్రజల గుండెల్లో... కొండల్లో,
కోనేటి రాయుడిలా కొలువై ఉన్నాడు.
ఓ మహాత్మా!
మీ సత్సంకల్పాలకు...
మీ ధైర్యసాహసాలకు...
మీ ముందు చూపుకు...
మీ కసికీ... కార్యదక్షతకు...
మీ కృషికి... కృతనిశ్చయానికి...
మీ వినూత్నమైన, విశిష్టమైన
ఆలోచనలకు, ఆశయాల సాధనకు
మీ శూరత్వానికి, మీ వీరత్వానికి...
మేమంతా సెల్యూట్ చేస్తున్నాం.
ఓ మహాత్మా...
జ్యోతిరావు ఫూలే, మీకివే మా జోహార్లు.
(మహాత్మా జ్యోతిరావు ఫూలే
జయంతి సందర్భంగా కవిత.)
==================================

Chinna Raye Kadaani Chinna Chupela - Telugu Poem | Polayya Kavi
చిన్నరాయే కదాని చిన్నచూపేల..? - తెలుగు కవిత | పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 09/04/2026
చిన్న రాయే కదాని చిన్నచూపు ఏల?
ఓ మిత్రమా!చిన్న రాళ్లే కదానిచిన్నచూపు చూడకు.
కాలం చెక్కితే, రేపుఅవే కళాఖండాలవుతాయి.
గర్భగుడిలో మనం మొక్కేసుందర దేవతా శిల్పాలవుతాయి.
ఈ రత్నాల, వజ్ర వైడూర్యాల,మణి మాణిక్యాల మెరుపులునిద్రించేది భూగర్భంలోనే కదా!
ఓ మిత్రమా!
చిన్న మొక్కేకదాని పీకేయకు.
ఎవరికెరుక?
రేపు మహావృక్షం కావచ్చు
పచ్చని ఆకులతో చల్లని నీడనివ్వవచ్చు
కమ్మని ఫలాలతో కడుపులు నింపవచ్చు!
ఓ మిత్రమా!
చిన్న రాయే కదాని చిలిపిగా విసరకు.
అదినిశ్చల జలంలో పడినా
అందమైన అద్దంపై పడినా
నీ ప్రతిబింబమే ఛిద్రమై
నిన్ను నీవే కోల్పోతావు!
ఓ మిత్రమా!
చిన్న రాయే కదాని ఆకాశం వైపు విసరకు.
అది తిరిగి పడేదెక్కడ? నీపైనే కదా!
ఆపై పగిలేదేమిటి? నీ తలనే కదా!
ఓ మిత్రమా!
అద్దాల మేడలో నివసిస్తూ రాళ్లు విసరడం మానుకో.
అవి శత్రువులకు తగలకముందే పగిలి ముక్కలయ్యేదేమిటి?
అందమైన, సుందరమైన అద్దాల మేడే కదా!
అందుకే మిత్రమా,
రాతిగుండెల రాక్షసుడివై ఎన్నిరంగు రాళ్లు ధరించి లాభమేమి?
వెన్నలా కరిగే కరుణతో,
పూలలా పరిమళించే ప్రేమతో
మనసున్న మనిషిగా జీవించు.
మంచితనం, మానవత్వమే మనిషికి ఆభరణమని కలనైనా మరువకు!
రచన: కవి రత్న, సాహిత్య ధీర, సహస్ర కవి భూషణ్: పోలయ్య

రచయిత పరిచయం: కూకట్లపల్లి పోలయ్య కవి
జన్మస్థలం :
కందివారి పల్లె : గ్రామం
మార్కాపురం : మునిసిపాలిటీ
ప్రకాశం : జిల్లా ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రం.
తండ్రి పేరు. : కీ.శే.కూకట్లపల్లి ప్రకాశరావు
తల్లి పేరు : శ్రీమతి కూకట్లపల్లి భాగ్యమ్మ
భార్య పేరు : శ్రీమతి పోతిరెడ్డి సుధారాణి
సంతానం :ముగ్గురు
పెద్ద కూతురు : ప్రతిభా లావణ్య
చిన్న కూతురు : లక్ష్మీ సౌజన్య
కుమారుడు : వంశీ కృష్ణ
పొందిన డిగ్రీలు : M .Com, LLB, CAIIB,
విద్యాభ్యాసం:
ప్రాథమిక విద్య - ప్రకాశం జిల్లా - తర్లుపాడులో
కాలేజీ చదువు - 1973 -78లో...
Intermediate, B.Com
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కళాశాల...మార్కాపురంలో...
ఉన్నత విద్య - 1978 - 80లో...
M .Com, LLB, CAIIB,
వాణిజ్య శాస్త్రంలో పట్టా...
నాగార్జునవిశ్వవిద్యాలయం...
గుంటూరులో...
ఉద్యోగవివరాలు:
1981 డిశంబర్ లో...
ఆంధ్రాబ్యాంకులో...ఉద్యోగం..
33 సంవత్సరాల...సుదీర్ఘ ప్రయాణం...
1995 జూన్ లో....హైదరాబాద్ లో...
సీనియర్ బ్రాంచి మేనేజర్ గా పదవీ విరమణ...
ప్రవృత్తి: వచన కవితారచన
పుస్తకపఠనం, కవితాగానం...నటన
వ్రాసిన వచన కవితా రచనల సంఖ్య:
...రమారమి 5000 వచన కవితలు
...దినపత్రికల్లో ప్రింట్ ఐన కవితలు:
...దాదాపుగా 4600 (75 పత్రికల్లో)
...250 పద్య కవితలు (ద్విశతకం)
... అన్న పోలన్న సుభాషితం
...విన్న మీకు శుభోదయం అన్న
...మధురమైన మకుటంతో
...130 కరోనా కవితలు
స్వీయరచనలు :
(1) ముద్రిత రచనలు : 7
1. కవితా కిరణాలు
2. సుభాషితాలు - సూర్యకిరణాలు(ద్విశతకం)
"అన్న పోలన్న సుభాషితం
"విన్న మీకు శుభోదయం"..
"అన్నమకుటంతో
3. కంప్యూటర్ యుగంలో కాకి
4. జయించడానికే నీవు జన్మించావు
5. స్వామి వివేకానందలా ఆలోచించు
రామకృష్ణ పరమహంసలా జీవించు
6. Secret of Success.
7. అభిషిక్తుని అమృత వాక్కులు.
అముద్రితాలు :
ఇట్లు ప్రేమతో నాన్న ఆశతో అమ్మ
మరో15 పుస్తకాలు...
పొందిన సన్మానాలు/ సత్కారాలు :
1. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్
2. సీనియర్ సిటిజన్స్ వెల్ ఫేర్ సొసైటీ
3. కవన కిరణాలు ముంబై
4. ఉదయం సాహితీ వేదిక
5. తెలుగు సాహిత్య సమితి
6. ఆరికపుడి పూర్ణ చంద్రారావు ఫౌండేషన్
7. సైమన్ ఫౌండేషన్
8. మేడిది సుబ్బయ్య ట్రస్ట్
9. మహర్షి వాల్మీకి సాంస్కృతిక
సేవా సంస్థ
10. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్
ప్రశంసాపత్రాలు...
అందించిన ప్రముఖ సంస్థలు
1. తెలుగు వెలుగు సాహితీ వేదిక
2. కవన కిరణాలు
3. ఉదయ సాహితీ వేదిక
4 పున్నమి పత్రిక...
5..ఏ.కె తెలుగుమీడియా ముంబై...
(ఆంధ్రరత్న అవార్డు)
6. కర్నాటక తెలుగు రచయితల సంఘం...
7. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్
8. ఆరికపుడి పూర్ణచంద్రారావు ఫౌండేషన్
9. సైమన్ ఫౌండేషన్
10. మహర్షి వాల్మీకి
సాంస్కృతిక సేవా సంస్థ
11. తెలుగు సాహిత్య సమితి12. సీనియర్ సిటిజన్ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్
13. శ్రీ శ్రీ కళావేదిక
14. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్
సత్కరించిన ప్రముఖ వ్యక్తులు/కవులు
1. ఉదయ సాహితీ వేదిక పురస్కారం
(ప్రముఖ కవి రచయిత)
నందిని సిధారెడ్డి గారిచే సన్మానం
2. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్ పురస్కారం
(హాస్య బ్రహ్మ) శ్రీ గౌరీ శంకర్
(సినీ గేయ రచయిత) మౌనశ్రీ మల్లిక్ గార్లచే సన్మానం
3. కవన కిరణాలు సాహితీ వేదిక పురస్కారం
(ప్రముఖ కవి రచయిత) నందిని సిధారెడ్డి
(సినీ గేయ రచయిత) మౌనశ్రీ మల్లిక్
(ప్రముఖ విశ్లేషకులు)
నాళేశ్వరం శంకరం గార్లచే సన్మానం
4.ఆరికపుడి పూర్ణచంద్రారావు
ఫౌండేషన్ పురస్కారం
లయన్ శ్రీ విజయకుమార్ గారిచే సన్మానం
5. సైమన్ ఫౌండేషన్ పురస్కారం
(మాజీ సిబిఐ జేడీ )
లక్ష్మీనారాయణ గారిచే సన్మానం
6. మహర్షి వాల్మీకి సాంస్కృతిక
సేవా సంస్థ పురస్కారం
హిమాలయ శివసాయి గురూజీ గారిచే సన్మానం
7.సీనియర్ సిటిజన్
ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్
పురస్కారం
(హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి)
శ్రీ చంద్రయ్య గారిచే సన్మానం
8. మేడిది సుబ్బయ్య ట్రస్ట్ పురస్కారం
(ప్రముఖ గజల్ రచయిత)
కళారత్న బిక్కికృష్ణ గారిచే సన్మానం
9. తెలుగు సాహిత్య సమితి మరియు
ఆరు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన
మాతృ భాషాదినోత్సవ పురస్కారం
శ్రీ నందినీ సిధారెడ్డి గారిచే సన్మానం
10. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్
అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి
పండిట్ గారిచే సన్మానం...
ప్రముఖుల చేతులమీదుగా
సన్మానాలు సత్కారాలు...
1. నందిని సిధారెడ్డి (ప్రముఖ కవి రచయిత)
2. చంద్రయ్య హైకోర్టు (ప్రధాన న్యాయమూర్తి)
3. మౌనశ్రీ మల్లిక్ (సినీ గేయ రచయిత)
4. నాళేశ్వరం శంకరం ( ప్రముఖ విశ్లేషకులు)
5. లక్ష్మీనారాయణ(మాజీ సిబిఐ జేడీ )
6. కళారత్న బిక్కి కృష్ణ (ప్రముఖ గజల్ రచయిత)
7. హిమాలయ శివసాయి గురూజీచే సన్మానం
8. మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాజగోపాల్ గారు
ప్రస్తుతనివాసం & చిరునామా :
పోలయ్య కవి కూకట్లపల్లి
మేనేజర్ ఆంధ్రా బ్యాంకు (రిటైర్డ్)
ప్లాట్ నె.201
శ్రీ సాయిదత్తా అపార్ట్మెంటు.
గుమ్మకొండ కాలనీ
గౌతం మోడల్ స్కూల్ వెనుక
అత్తాపూర్ హైదర్ గూడ
రంగారెడ్డి జిల్లా
హైదరాబాద్ -500048
క్లుప్తంగా...నా గురించి...
మనసులోమాటగా, నా పేరు కూకట్లపల్లి పోలయ్య, కలం పేరు,పోలయ్య కవి కూకట్లపల్లి. ప్రస్తుత నివాసం...అత్తాపూర్ హైదరాబాద్ లో...పదవీవిరమణ జూన్ 2015లో. ఆంధ్రా బ్యాంక్ నుండి అధికారిగా...
ఐతే ఎన్నో ఏళ్ళ తర్వాత చిక్కిన ఒక చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విహారయాత్రలు చేసి వీలైనన్ని కొత్తప్రదేశాలను దర్శించాలన్న ఆలోచనలో వున్న ఉన్న నేను కరోనాకాలంలో ఇంట్లోనే బంధీనైపోవడంతో... నా ఊహలకు రెక్కలొచ్చాయి...అనేక నా కవితలు వెలుగు చూశాయి
క్లుప్తంగా... నాసాహితీ సేవ
1975 నుండి 2026 వరకు రమారమి - 51 సంవత్సరాల సాహితీ ప్రయాణం. వృత్తిరీత్యా బ్యాంకు అధికారిగా వుంటూ
ప్రవృత్తిరీత్యా కవితలు అల్లడం...నా హాబీ.అనేకానేక సామాజిక అంశాలమీద, సమాజంలోనిఅనేక సమస్యల మీద, మానవ సంబంధాలమీద,
5000 పైగా వచన కవితలు
రచించడంతో పాటు 4600 కవితలు
75 పాత్రికలలో ప్రచురితం
250 వేమనవంటి కవితా పద్యాలు...
130 కరోనా కవితలు...
200 సూక్తులు...
కొత్తగా వ్రాయడం జరిగింది...
నిన్నటి మొన్నటివరకు కారుచీకట్లో
ఉన్న నా కవితలన్ని అనేకమంది సహృదయులైన సంపాదకుల
ఆదరణతో ప్రోత్సాహంతో గత
6 సంవత్సరాలలో సుమారుగా
75 దినపత్రికల్లో
4600 కవితల పైచిలుకు ప్రచురించబడినాయి..




Comments