ప్రగతిని పండించేందుకు…
- Srinivasa Rao Pingali

- 6 days ago
- 1 min read
ప్రగతిని పండించేందుకు, తెలుగు కవిత, సామాజిక కవిత, ప్రేరణాత్మక తెలుగు కవిత, సమాజ సేవ, శ్రమ విలువ, కృషి, ప్రగతి, ఆలోచనాత్మక కవిత, తెలుగు సాహిత్యం

Pragathini Pandinchenduku - Telugu Poem | Srinivasa Rao Pingali
ప్రగతిని పండించేందుకు... - తెలుగు కవిత | శ్రీనివాస రావు పింగళి
Published in manatelugukathalu.com on 07/07/2026
సమస్యల నుంచి పారిపోకుండా సమాజ అభివృద్ధి కోసం శ్రమించాల్సిన అవసరాన్ని చాటిచెప్పే ఆలోచనాత్మక తెలుగు కవిత "ప్రగతిని పండించేందుకు…". శ్రీనివాస రావు పింగళి రచన.
ఒక్కసారిగా సముద్రాన్ని
తోడిపారేయాలనిపించింది
సమస్యల బారినుండి
బయటపడదామని
జనసంద్రానికి దూరంగా
సముద్రానికి దగ్గరగా వస్తే
ఒకటే హోరు...
చెవులు చిల్లులు పడేంత
బిగ్గరగా హోరు...
మిగిలున్న కాస్త ప్రశాంతతనూ
భగ్నం చేస్తూ హోరు...
ఒక్కసారిగా సముద్రాన్ని
తోడిపారేయాలనిపించింది
తోడిపారబోస్తున్న కొద్దీ
అలల జోరుతో బాటు
శబ్దపు హోరు కూడా పెరిగిపోతోంది
నాలోనూ పంతం పెరిగిపోయింది
ఒక్కసారిగా లంఘించి
సముద్రంలోకి పరుగు తీశాను
ఉప్పటి నీరు నోట్లోకొచ్చింది
అప్పుడు అర్థం అయింది
తాను కేవలం సముద్రం కాదనీ...
జనజీవన సమస్యల పరిష్కారం కోసం
ఎందరో చిందించిన స్వేదబిందు జలధియని...
తక్షణమే తన హోరును, జోరును
హృదయం నిండా నింపుకుని
జనసంద్రంలోకి కదిలాను
స్వేదం చిందించి శ్రమించేందుకు...
కృషి సేద్యంతో ప్రగతిని పండించేందుకు...
======================================

Amma Navvindi - Telugu Poem | Srinivasa Rao Pingali
అమ్మ నవ్వింది - తెలుగు కవిత | శ్రీనివాస రావు పింగళి
Published in manatelugukathalu.com on 29/06/2026
నేను పుట్టగానే కేర్ మని ఏడ్చాను
అమ్మ నవ్వింది
ఎందుకు నవ్వావమ్మా...
చూపులతో అడిగాను
ఇంకెప్పుడూ నిన్నేడవనివ్వను కన్నా...
ఇకనుంచీ నా నవ్వులు నీవి
నీ కన్నీళ్లు నావి...
తనూ చూపులతోనే జవాబు చెప్పింది
అమ్మను హత్తుకుపోయాను మౌనంగా
ఆగిన కన్నీళ్లతో
***

రచయిత పరిచయం: శ్రీనివాస రావు పింగళి
పేరు : శ్రీనివాస రావు పింగళి
తల్లిదండ్రులు : అలివేలుమంగమ్మ, సుబ్బారావు
ఉద్యోగం : ఏ.పి.యస్ ఆర్టీసీ కండక్టర్
చదువు : డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్
ఇతర రచనలు : ఆంధ్రభూమి వీక్లీలో అనేక కవితలు, తెలుగు వెలుగు మాసపత్రికలో "భలే పెళ్లిపెద్ద" హాస్య కథ, స్వాతి వీక్లీలో "వర్మ ఫ్రమ్ బర్మా" హాస్య కథ ప్రచురింపబడినవి.
ప్రస్తుత నివాసం : గుంటూరు






Comments