'Anandaniki Aru Suthralu' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 28/02/2024
'ఆనందానికి ఆరు సూత్రాలు' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"రంగయ్య బావా!..... నమస్కారం...." చేతులు జోడించాడు నవ్వుతూ నారాయణమూర్తి.
చేతిలోని దినపత్రికను క్రిందికి దించి నేరుగా చూచాడు రంగయ్య. వారికి ఒక ఆడ, మగ పిల్లలు. సిటీలోని హాస్టల్లో వుంటూ చదువుతున్నారు. అమ్మాయి శాంతి పదవతరగతి. అబ్బాయి రఘు ఎనిమిదవ క్లాసు. శలవు రోజుల్లో ఇంటికి వస్తారు. తల్లితండ్రి మాటలను జవదాటరు. ఎదురుగా తన బావమరిది అమెరికా వాసి, సైంటిస్ట్ నారాయణమూర్తి. అతని చెల్లెలు గౌతమి రంగయ్య గారి అర్థాంగి.
"రారా నారాయణా!... ఎప్పుడు వచ్చావు అమెరికా నుండి?" సింహద్వారం వైపు చూచి....
"గౌతమీ!.... మీ సోదరులు వేం చేశారు. రా!..." బిగ్గరగా పిలిచాడు రంగయ్య.
రంగయ్య భూస్వామి. తాతతండ్రులు అర్జించిన ఆస్తిపాస్థులు గొప్పగానే వున్నాయి. అతను పంచను ఎగ్గట్టి కండువాను తలకు చుట్టి అరకపట్టి (నాగలితో) చేలను దున్నుతాడు. వ్యవసాయానికి సంబంధించి అన్నిపనులూ ఇద్దరు పాలేర్లు వున్నా తనూ శ్రమిస్తాడు. కారణం ’ఆరోగ్యమే మహాభాగ్య’ అని నమ్మిన మహామనిషి. వయస్సు యాభై సంవత్సరాలు. అర్థాంగి గౌతమికి వారికి ఎనిమిది సంవత్సరాలు వ్యత్యాసం. జీవితాన్ని చాలా క్రమబద్ధంగా నడిపే మనిషి రంగయ్య.
నారాయణ వారి ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. అతని వయస్సు నలభై ఐదు.
గౌతమి వరండాలోనికి వచ్చింది.
తమ్ముణ్ణి చూచి......
"ఏరా నారాయణా!... అంతా కుశలమే కదా!.... ఊర్లో అమ్మా నాన్నా, ఆ దేశంలో నీ భార్య పిల్లలూ క్షేమమే కదా!....." ఆప్యాయంగా పలకరించింది గౌతమి.
"గౌతమీ!.... అంతా కుశలమే అమ్మా!" జవాబు.
"అవును ఏం అన్నా!..... చాలా తగ్గిపోయావు? ఏమిటి కారణం?" నారాయణను పరిశీలనగా చూస్తూ అడిగింది గౌతమి.
విరక్తిగా నవ్వాడు నారాయణ.
"వయస్సు అవుతూ వుంది కదమ్మా!" విరక్తిగా చెప్పాడు నారాయణ.
"అమెరికాలో వున్నావు. సైంటిస్ట్ వి. డాలర్ల రూపంలో మంచి జీతం. సొంత ఇల్లుని కట్టుకొన్నానని ఫోన్ చేశావు. అన్నీ గొప్పగా వుండి నీవు ఎందుకురా ఇలా తగ్గిపోయావు. నా ఊహలో, నీవు ఏదో సమస్యలో బాధపడుతున్నట్లుగా అనిపిస్తూ వుందిరా!" సాలోచనగా అన్నాడు రంగయ్య.
"బావా!.... మీ ఊహ సరైనదే. మీ సోదరి శ్యామలకు పాశ్చాత్య నాగరీకత వ్యామోహం. మరి నాకు మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలంటే ఎంతో అభిమానం, గౌరవం. దానికి తాను పూర్తి వ్యతిరేకం. ఆమె ఆ తత్త్వం నాకు ఎంతో ఆవేదనను కలిగిస్తూ వుంది బావా!" విచారంగా చెప్పాడు నారాయణ.
రంగయ్య నిట్టూర్చాడు.
"అంగట్లో అన్నీ వున్నాయి. కానీ అల్లుడి నోట్లో శని వుంది’ అన్న సామెతలా ఉంది నీ జీవితం" విచారంగా చెప్పాడు రంగయ్య.
"మీ మాట యదార్థమే బావా!.... ఇద్దరు పిల్లలు గౌతమ్, అమ్మాయి పరిమళ. తల్లిని గౌరవించినట్లు నన్ను గౌరవించరు. నా మాటలను లెక్క చేయరు. తల్లి మాట వారికి వేదవాక్కు బావా!..." దీనంగా చెప్పాడు నారాయణ.
"అన్నయ్యా!.... అమెరికాను వదలి మన దేశానికి తిరిగి రాకూడదా!.... ఇక్కడికి వచ్చారంటే వారి తత్త్వంలో మన ఈ పరిసరాల ప్రభావంతో మార్పు కలుగవచ్చుగా!... అందరం ఒకే ప్రాంతంలో వున్నట్లు వుంటుందిగా!... అది నీకు ఆనందమేగా!..." అభిమానపూర్వకంగా అడిగింది గౌతమి.
"అమ్మా!.... ఆ ప్రయత్నాన్ని చేశాను. ఆ తల్లి బిడ్డలకు భారత్‍కు రావడం ఇష్టం లేదు. వారికి ఆ దేశం, వుంటున్న ప్రాంతం, బాగా నచ్చింది. కానీ నాకు మన ఈ దేశం అన్నా, మన ప్రాంతం అన్నా, మన మనుషులు తీరు అంటే ఎంతో ఇష్టం. ఆ దేశంలో వారి మధ్య నా పరిస్థితి ’వడ్లతోటే తట్ట ఎండాల్సినట్లుగా వుంది. దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ మనశ్శాంతి లేకుండా చేశాడు" విచారంగా చెప్పాడు నారాయణమూర్తి.
"కొందరికి మన స్వదేశం కన్నా అమెరికా, బ్రిటన్ అంటే ఎంతో మోజు. నీవారి పరిస్థితీ అలాగే వుంది. నీ మాటలను బట్టి!...." సాలోచనగా చెప్పాడు రంగయ్య. కొన్ని క్షణాల తర్వాత.... "సరే!..... విచారించకురా!.... ప్రతి సమస్యకూ కాలం పరిష్కారాన్ని చూపుతుంది. విచారంతో కృంగిపోయి శరీర ఆరోగ్యాన్ని నాశనం చేసికోకుండా, దైవాన్ని నమ్మి నీ కష్టాలను ఆ పరంధాయునికి విన్నవించుకొంటే.... వారు తప్పక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. లేచి రండి, టిఫిన్ చేద్దురుగాని" అనునయంగా చెప్పింది గౌతమి.
రంగయ్య నారాయణమూర్తి కుర్చీలనుండి లేచి ఇంట్లోకి నడిచారు. డైనింగ్ టేబుల్‍ను సమీపించారు.
గౌతమి, వేడివేడి ఇడ్లీలు, అల్లంచెట్ని (పచ్చడి), కొబ్బరి చట్నీలను రెండు ప్లేట్లలో వుంచి, భర్త, అన్నగార్ల ముందు వుంచింది.
ఇరువురూ ఆనందంగా ఆరగించారు.
"బావా!...."
"ఏంటి నారాయణ!"
"టిఫిన్ అయిన తరువాత మీ ప్రోగ్రాం ఏమిటి?..."
"అలా చేలల్లోకి వెళ్ళి పైరుకు సరిపడా నీళ్లు వున్నాయా లేక నీరు నింపాలా, కలుపు మొక్కలు ఏమైనా ఎదిగాయా చూచుకొనేదానికి వెళతాను. నీవూ నాతో వస్తావా?...." అడిగాడు రంగయ్య.
"అది ఎంతో ప్రశాంతమైన వాతావరణం కదా బావా!....తప్పకుండా వస్తాను." ఆనందంగా చెప్పాడు నారాయణమూర్తి.
ఇరువురూ చేతులు బేసిన్‍లో కడుక్కున్నారు.
గౌతమి ఇరువురికీ కాఫీ గ్లాసులను అందించింది. బావామరుదులు కాఫీ త్రాగి, గౌతమికి చెప్పి, చేల వైపుకు బయలుదేరారు.
*
అరగంటలో వారిరువురూ రంగయ్య పది ఎకరాల పంటభూమిని సమీపించారు. ఆ పదిఎకరాలు రెండుకార్లు పండుతాయి. మంచినీటి వసతి కల ప్రాంతం. భూమి మధ్యలో ఒక వేపచెట్టు, దాని చుట్టూ గుండ్రటి ఆకారంలో అరుగు, అరుగు పై నిలబడితే వారి భూమి నాలుగు వైపులా చూచుకోవచ్చు. ప్రతిరోజు సాయంత్రం ఐదుగంటలకు అక్కడికి వచ్చి తన భూమి చుట్టూ ఒక ప్రదిక్షణం చేసి, ఆ అరుగుమీద కూర్చొని, ఒక గంటసేపు దైవాన్ని ధ్యానించడం రంగయ్య అలవాటు. ఒకవైపు నుంచి నేరుగా ఆ అడుగువరకూ రోడ్డు ఉంది. హద్దులమీద వారి తండ్రి బసవయ్యగారు నాటిన తాటిముట్టెలు ఇప్పుడు తాటి చెట్లుగా బాగా ఎదిగి, ఋతుధర్మ ప్రకారం ఆడచెట్లు తాటికాయలను కాస్తాయి. ఇప్పుడు ఆడచెట్లు కాయలతో వున్నాయి. చేలల్లో నీరు పెడుతున్న పాలేరు పాండు వీరిని చూచి పరుగున వారిని సమీపించాడు.
నారాయణకు తాటికాయలను చూడగానే ముంజెలు తినాలని నోరూరింది. తన బాల్యం గుర్తుకొచ్చింది.
"దండాలు బాబుగారూ!...." చేతులు జోడించాడు పాండు.
"పాండూ బాగున్నావా!... నేను గుర్తున్నానా!..." చిరునవ్వుతో అడిగాడు నారాయణమూర్తి.
"అయ్యగారూ!.... మిమ్మల్ని నేను ఎట్టా మరిచిపోయానండే. మీరు మా అయ్యగారి బామ్మర్ది కదా!..." నవ్వుతూ చెప్పాడు పాండు.
"రేయ్!..... పాండూ!...."
"బామ్మరది గారి చూపు ఎక్కడుందో నీకు తెలుసా!...." అడిగాడు రంగయ్య.
"వారి మనసులో ఏముందో నాకేం తెలుసయ్యా!..." విచారంగా చెప్పాడు పాండు.
రంగయ్య వేలితో తాటిచెట్లను చూపించాడు.
"ఓ.... తాటికాయలా!...." నవ్వుతూ అన్నాడు పాండు.
"అవును పాండూ! ముంజలను తినాలని వుంది!...." ప్రాధేయపూర్వకంగా చెప్పాడు నారాయణమూర్తి.
"ఓస్ అంతేకదా!... మీరు అరుగుమీద కూసోండి సామీ... నేను చెట్టు ఎక్కి ఒక గెలను తీసుకొస్తా..." వేగంగా పాండు తాటిచెట్ల వైపుకు నడిచాడు.
అరగంట లోపల ఒక తాటి గెలతో అరుగున సమీపించాడు.
దాదాపు ఇరవై కాయలున్నాయి ఆ గెలలో.
కత్తితో కోసి తాటికాయలను నారాయణకు, రంగయ్యకు అందించాడు పాండు.
ఇరువురూ తలా ఐదు కాయలలోని ముంజలను బొటనవేలితో తీసుకొన్నారు. పాండూ మిగతా కాయలను చివ్వి ముంజలను తీసి తాటి ఆకు మూగంలో వేసి కట్టాడు.
"అయ్యా!.... ఇంటికి తీసుకెళ్ళండి. అమ్మగారికి ఇవ్వండి" ప్రీతిగా చెప్పాడు.
"అలాగే పాండూ!..." అన్నాడు రంగయ్య.
పాండూ తన పనికి వెళ్ళిపోయాడు.
"బావా!.... ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం పైరుగాలి ఆ అమెరికాలో ఎంత డబ్బు ఖర్చుపెట్టినా దొరకదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్వగా ఉంది బావా!.... నీవు చాలా అదృష్టవంతుడివి." అభిమానపూర్వక అభినందనలను తెలియజేశాడు నారాయణమూర్తి.
"ఆ..... నారాయణా!... ప్రాప్తాప్రాప్తాలు దైవాదీనం. మన తల వ్రాతను వ్రాసి ఆ సర్వేశ్వరుడు మనలను ఈ భూమి మీదకు పంపాడు. మన జీవితం, మనలలాట లిఖిత ప్రకారమే సాగుతుంది. నీకు ఆ సర్వేశ్వరులు నిర్దేశించింది అమెరికా. నాకు ఏర్పరచింది పల్లెటూరు. ప్రతి ఒక్కరూ జీవితంలో నేర్చుకొనవలసింది, మనకు వున్నా దానితో సంతృప్తి చెందడం. అత్యాసకు దూరంగా వుండటం. నారాయణా!... ఏదో ఆ కాలంలో బియ్యేదాకా చదివించాడు మా నాన్నగారు. వారు నాకు నేర్పిన విషయాలను నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను. మనకు లేనిదాన్ని గురించి ఎప్పుడూ విచారపడకూడదు. వున్నాదాంతో తృప్తి చెందాలి. మన చుట్టూ వున్నవారిని అభిమానించాలి. నేను నా జీవితగమనంలో పాటించేవి ఆరు సూత్రాలు.
ఒకటి:- దైవం మీద నమ్మకం. ఇరవై నాలుగు గంటలలో కనీసం ఒక అరగంట ఆ దైవాన్ని ధ్యానించడం నాకు నచ్చిన పేరుతో, ఆ జగత్ రక్షకులను శతకోటి నామాలు. అది నీకూ తెలిసిన విషయమే!....
రెండు:- సదా సత్యాన్ని పలకడం. అబద్ధాన్ని నీ మాటల్లో దరికి చేరనీయకుండా వుండడం. అటువంటి వారి సాంగత్యాన్ని (అబద్ధాలు చెప్పేవారి) వదలడం. ధర్మాన్ని ద్వేషించకూడదు పాటించడం (కర్తవ్యాన్ని) గిట్టని వారిని అభిమానించడం.
మూడు :- క్రమం తప్పకుండా ఉదయాన్నే ఐదుగంటలకు లేచి వ్యాయామం చేయడం, జాగింగ్, ఆసనాలు, ప్రాణాయామం, క్రమబద్ధంగా చేయడం.
నాలుగు :- ఆహార విషయంలో ’మితం’ అన్నది చాలా ముఖ్యం. రుచిగా వుందని అతిగా భోజనం చేయడం అనారోగ్యానికి దారి తీస్తుంది. శరీరంలోని రకరకాల వ్యాధుల మూలం మన ఆహారపు అలవాట్లు. ఉత్తమమైనది శాకాహారం.
ఐదు :- నీకు వున్నంతలో పేదవారికి నీ ఆశ్రయితులకు దానం చేస్తూ సర్వేశ్వరార్పణమస్తు, అనుకొంటూ చిరునవ్వుతో హృదయపూర్వకంగా చేయడం. మనం చేసే దానం, ప్రతిఫలాపేక్షారహితంగా వుండాలి.
ఆరు:- మనకంటే పెద్దలను, పసిపిల్లలను, గురువులను, బంధుమిత్రులను, ప్రేమతో అభిమానించడం, గౌరవించడం. మనకు కీడు చేసినవారికి మనం చేయగలిగిన మేలు చేయడం.... సుమతీ శతకకర్త యోగి వేమన వ్రాశారు. ’అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి (గొప్పవాడు) సుమతీ!....
దీన్ని నీవు నీ బాల్యంలో చదివి వుంటావు."
చెప్పడం ఆపి రంగయ్య నారాయణమూర్తి ముఖంలోకి చిరునవ్వుతో చూచాడు.
నారాయణమూర్తి విచారంగా రంగయ్య ముఖంలోకి చూచాడు.
"నారాయణా!.... సూక్తులను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకూడదు. మన పెద్దలు వారి భావితరాల వారు, గొప్పవారుగా ధర్మబద్ధులుగా నీతి నిజాయితీలతో బ్రతకాలని మన కోసం ఎన్నో గ్రంథాలు వ్రాశారు. చదివినదాన్ని, విన్నదాన్ని పాటించటం మన జీవితం ప్రశాంతంగా సాగేదాని అతి ముఖ్యం. నా తండ్రి... నా గురువులు, నేను చదివి నేర్చుకొన్న వాటిని నాకు నచ్చిన వాటిని పాటిస్తూ నా జీవితాన్ని సాగిస్తున్నాను. నీవు నాకంటే గొప్పవాడివి. ఎన్నో విషయాలు తెలిసినవాడివి. నీకు నేను చెప్పేటంతటి వాడిని కాను. కానీ..... నీ మనోవేదనను అర్థం చేసుకొన్నా. ఏదో నాకు తోచిన ’ఆనందానికి ఆరు సూత్రాలు, నేను పాటించేవాటిని నీకు చెప్పాను. తప్పుగా అనుకోకు. నేను చెప్పింది నీ మంచికోరి, ఆలోచించుకో బావా నారాయణమూర్తి" చిరునవ్వుతో చెప్పాడు రంగయ్య.
నారాయణమూర్తి కళ్ళు చెమ్మగిల్లాయి.
"బావా!.... మీరు చెప్పిన విషయాలను బట్టి.... నాకు నా కర్తవ్యం బోధపడింది. నేనెవరు?.... నిమిత్తమాత్రుణ్ణి. నా ధర్మాన్ని నేను పాటించాలి. భార్య కాని, పిల్లలు కాని, నేను వారికి చేయవలసింది చేయడమే నావంతు. మీరు చెప్పిన ఆరుసూత్రాలను పాటించి నాకు ఆనందాన్ని నేనే కల్పించుకొంటాను. ఒక్కమాటలో చెప్పాలంటే మీరు నా కళ్ళు తెరిపించారు. నా కర్తవ్యాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు బావా!.... ధన్యవాదాలు..." ఎంతో వినయంగా చేతులు జోడించాడు నారాయణమూర్తి....
"సరే! పద.... మీ చెల్లెలు మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది" నవ్వుతూ అన్నారు రంగయ్య.
కన్నీటిని తుడుచుకొని, పాండూ కట్టిన తాటిముంజల ముంగాని చిరునవ్వుతో తీసుకొన్నాడు నారాయణమూర్తి.
ఇరువురూ ఇంటివైపుకు బయలుదేరారు.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments