అందాల మేఘమాల
- Gadwala Somanna
- Jul 30
- 2 min read
Updated: Jul 31
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AndalaMeghamala, #అందాలమేఘమాల, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 101
Andala Meghamala - Somanna Gari Kavithalu Part 101 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 30/07/2025
అందాల మేఘమాల - సోమన్న గారి కవితలు పార్ట్ 101 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అందాల మేఘమాల
----------------------------------------
కదిలి కదిలి పోతుంది
మేఘమాల నింగిలోన
ఆనందం నింపుతుంది
అమితంగా గుండెలోన
తారకలను మోసుకొని
పల్లకిలా మారుతుంది
ఒడిని పాన్పు చేసుకొని
తల్లిలా లాలిస్తుంది
నీలాల మేఘమాల
నింగి తల్లి ముద్దు బాల
నలుమూలల తిరుగుతుంది
వర్షం మేసుకొస్తుంది
తెల్ల మంచు స్ఫటికాల
సముదాయం మేఘమాల
గాలిలో తేలే నీటి
బిందువులే మేఘమాల
కాళిదాసు రచించిన
'మేఘసందేశం' ఘనము
కవీంద్రుల కావ్యాల్లో
ప్రసిద్ధి చెందెను భువిలో
లేకుంటే మేఘాలు
ఇంకెక్కడివి వర్షాలు
మానవాళికి మాత్రము
బహు ప్రయోజనకారులు

ఉండిపో లోకంలో
------------------------
మల్లెపూల మాలగా
ఎల్లరి మదిని గుర్తుగా
ఉండిపో లోకంలో
పల్లెసీమ సాక్షిగా
జీవితాన గొప్పగా
మనసంతా తృప్తిగా
ఉండిపో లోకంలో
అందరితో ప్రేమగా
సాధనలో ఓర్పుగా
పదిమందికి మెప్పుగా
ఉండిపో లోకంలో
అన్నిటిలో నేర్పుగా
గుణంలోన మేటిగా
తెలివిలోన సాటిగా
ఉండిపో లోకంలో
పోటీలో ధీటుగా
మాటలోన మృదువుగా
ఖర్చులోన పొదుపుగా
ఉండిపో లోకంలో
వినయంతో అదుపుగా
ఆపదలో మేలుగా
అవసరాన వీలుగా
ఉండిపో లోకంలో
సేవలోన ముందుగా
అభాగ్యులకు అండగా
వీలైతే కొండగా
ఉండిపో లోకంలో
ఆశ్రయ దుర్గంగా
తీర్పులో న్యాయంగా
విజయమే ధ్యేయంగా
ఉండిపో లోకంలో
నలుగురికి సాయంగా

ఉండాలోయ్!(2)
---------------------------------------
పాలలోని తెలుపులా
పూలలోని తావిలా
ఉండాలోయ్! జగతిలో
మాలలోని సొగసులా
తోటలోని మల్లెలా
నోటిలోని మాటలా
ఉండాలోయ్! బ్రతుకులో
కోటలోని రాజులా
తరువులోని ఫలంలా
చెరువులోని జలంలా
ఉండాలోయ్! వసుధలో
గురువులోని తెలివిలా
పంటనిచ్చు పొలంలా
పొలం దున్ను హలంలా
ఉండాలోయ్! ఉర్విలో
నిగ్గు తేల్చు కలంలా

ఉంటే అందము
--------------------------------------
చెట్టుకు ఆకులు
పక్షికి ఈకలు
ఉంటే అందము
మనిషికి విలువలు
కొలనుకు కలువలు
చెరువుకు జలములు
ఉంటే అందము
గృహమున పిల్లలు
నింగిని చుక్కలు
భువిలో మొక్కలు
ఉంటే అందము
గంధపు చెక్కలు
పొలమున పైరులు
మనసున మమతలు
ఉంటే అందము
మేనుకు వలువలు
జడలో పూవులు
మేడలో మాలలు
ఉంటే అందము
బడిలో బాలలు
ఎగిరే పక్షులు
ప్రాకే తీగలు
ఉంటే అందము
పారే యేరులు
కంటికి రెప్పలు
నోటికి పెదవులు
ఉంటే అందము
కాళ్లకు చెప్పులు
ఉత్తమ చేతలు
ఉన్నత తలపులు
ఉంటే అందము
ఇహమున ఇంతులు

ఉందోయి! ఉండాలని
--------------------------------------
రవికిరణం కాంతినై
పదిమందికి శాంతినై
ఉందోయి! ఉండాలని
సొగసుల పూబంతినై
దేశానికి ఖ్యాతినై
విశ్వశాంతి గీతినై
ఉందోయి! ఉండాలని
బ్రతుకుల్లో జ్యోతినై
అభాగ్యులకు కోటనై
ఓదార్చే పాటనై
ఉందోయి! ఉండాలని
జీవజలపు ఊటనై
నీడనిచ్చు తరువునై
గొంతు తడుపు చెరువునై
ఉందోయి! ఉండాలని
జ్ఞానమిచ్చు గురువునై
నడిపించే నేతనై
కథలు చెప్పు తాతనై
ఉందోయి! ఉండాలని
కడుపు నింపు రైతునై
పొలం దున్ను హలమునై
అనాథలకు బలమునై
ఉందోయి! ఉండాలని
కవీంద్రుల కలమునై
-గద్వాల సోమన్న
Comments