top of page
Original.png

అంతా భ్రాంతియేనా!?

అంతా భ్రాంతియేనా, అన్నపూర్ణ సోమయాజులు, తెలుగు కథ, కారు కల, కుటుంబ కథ, తల్లికొడుకు అనుబంధం, భావోద్వేగ కథ, మహిళా మనస్తత్వం, తెలుగు సాహిత్యం, కుటుంబ విలువలు, జీవిత సత్యాలు, ఆధునిక కుటుంబ కథలు, మనసును తాకే కథ

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అంతా భ్రాంతియేనా!?' కథలో అమ్ముడుపోబోతున్న కారు పక్కన నిలబడి బాధతో ఉన్న మధ్యతరగతి గృహిణి – "అంతా భ్రాంతియేనా!?" కథ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అంతా భ్రాంతియేనా!?' కథలో అమ్ముడుపోబోతున్న కారు పక్కన నిలబడి బాధతో ఉన్న మధ్యతరగతి గృహిణి – "అంతా భ్రాంతియేనా!?" కథ దృశ్యం.

Antha Bhranthiyena - Telugu Emotional Family Story | Annapurna Somayajulu

అంతా భ్రాంతియేనా!?తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | అన్నపూర్ణ సోమయాజులు

Published in manatelugukathalu.com on 23/06/2026


మధ్యతరగతి జీవితాల్లో కొన్ని కలలు చిన్నవిగా కనిపించినా, వాటి వెనుక ఎన్నో సంవత్సరాల కోరికలు, త్యాగాలు, భావోద్వేగాలు దాగి ఉంటాయి. అలాంటి ఒక సాధారణ కారు, అనసూయ జీవితంలో ఒక అసాధారణ ఆనందానికి ప్రతీకగా మారుతుంది. కానీ కాలం మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు, ఆ ఆనందం కూడా భ్రాంతేనా అనే ప్రశ్నను ఈ కథ మన ముందుంచుతుంది. హాస్యం, భావోద్వేగం, జీవిత సత్యం కలగలిపిన అద్భుతమైన కథ.


“కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడీచానా” పాట వింటూ, హుషారుగా వంటపని చేసుకుంటోంది అనసూయ. 


"కారు అమ్మేస్తున్నాం అమ్మా."


ఒక్కసారిగా ఉలిక్కిపడింది రాఘవ మాటలకి. 

వెనక్కి తిరిగి అర్థం కానట్టు అడిగింది, ”ఏమన్నావూ?” అనీ.


“అదే, కారు అమ్మేయమంటున్నారు నాన్న,” మళ్ళీ చెప్పాడు రాఘవ.


"ఎందుకురా?" కలవరంగా అడిగింది కొడుకుని.


తన కలలన్నీ పేకమేడలైనట్లూ, అగాధంలోకి జారిపోతున్నట్లూ అనిపించింది.

"నాలుగైదేళ్ళు ఉందామనుకుంటున్నానమ్మా యూఎస్ లో. 

నాన్నకీ నీకూ డ్రైవింగ్ రాదు. నాలుగు రోజులకోసారైనా తీయకపోతే కారు పాడైపోతుంది. 

డ్రైవర్లని పిలవడం, కారు తీయించడం ఇవన్నీ నావల్ల కాదు, అమ్మేయ్. ఇండియా వచ్చాక కొందువుగానీ అంటున్నారు నాన్న," అన్నాడు.


"ఓహో, నువ్వూ మీ నాన్న అంతా నిర్ణయించేసుకుని, ఇప్పుడు చెప్తున్నారన్నమాట నాతో," నిస్పృహ గొంతులో.


నిన్నమొన్నటివరకూ సిటీబస్సుల్లో తిరిగిన మనిషే,

గత సంవత్సర కాలంగానే ఈ వైభోగం.

ఐతేనేం, పాతికేళ్ల కష్టాన్నీ ఈ సంవత్సర సుఖమూ మరిపించేసింది.

ఇది శాశ్వతమన్న భ్రాంతిలో ముంచేసింది.


తను ఆ ఊహాప్రపంచంలో ఆదమరచి, సేదదీరేలోపే..

మెత్తని సుత్తితో నెత్తిమీద కొట్టినట్లు ఈ మార్పు.

అనసూయకి చిన్నప్పటినుండీ ఒక కోరిక.


పడవంత కారులో, నల్ల కళ్ళజోడు పెట్టుకుని, కుక్క, డ్రైవరూ ఇత్యాది హంగులతో దర్జాగా, పండంటి కాపురం సినిమాలో జమునలా తిరగాలని.

యద్దనపూడి సులోచనారాణి నవలలు తెగ చదివేసి,  కార్లూ, ద్రాక్ష తోటలూ… ఇలా కలలు కనేది. 


కానీ, పుస్తకం మూసేసిన మరుక్షణం, మధ్యతరగతి జీవితాలింతే అని, చచ్చినట్టు  వాస్తవంలో ఒదిగిపోయింది. 

తండ్రి చూపించినవాడి చిటికెన వేలు పట్టుకుని కాపురానికి వచ్చేసింది.


‘చోటున్నంతవరకే కాళ్ళు జాపుకోవాల’ని చిన్నతనం నుంచీ వింటూ పెరగడంతో, తన కోరిక మనసులోనే దాచేసుకుంది గానీ, భర్తనేనాడూ అలవిమాలిన ఆశలు తీర్చమని ఆరడి పెట్టలేదు.

కానీ, మనసులో కారు మీద భ్రాంతి మాత్రం చావలేదు. 


ఇప్పుడు, పిల్లలు ప్రయోజకులయ్యారు కదా అని, మెల్లగా కొడుకు దగ్గర బయటపెట్టింది, “మనం కూడా కారు కొనుక్కుందాం రాఘవా. మన బంధువులందరికీ ఉంది కారు. మనకే లేదు.”


వెంటనే అందుకున్నాడు సుబ్బారావు…

“అందరికీ ఉందని కొనుక్కోరు, మనకవసరమైతే కొనుక్కోవాలి. ఇపుడంత అవసరమేమొచ్చిందీ?” 


“కొంటే అవసరాలు అవే వస్తాయి. ఇన్నాళ్లూ అంటే మీ ఒక్కరి సంపాదనే. పిల్లల చదువులూ, ఖర్చులూ. అందుకే నేనూ అడగలేదు. ఇపుడు వాడూ ఉద్యోగం చేస్తున్నాడు కదా. కొనుక్కుందాం,” ఆశగా అడిగింది అనసూయ.


“పోనీలే నాన్నా. అమ్మ ముచ్చట పడుతోంది కదా. కొందాం. లోన్ తీసుకుంటా” అన్నాడు రాఘవ. 


తల్లీ కొడుకూ ఏకమవడంతో అయిష్టంగానే ఒప్పుకున్నాడు సుబ్బారావు.

“పోనీలే. నేను తిప్పలేకపోయినా, నీ కొడుకు తిప్పుతాడులే కారులో,” అంటూ తనదైన శైలిలో మాట విసిరాడు.


కారు కొనుక్కోబోతున్నామన్న ఆనందంలో భర్త ఎత్తిపొడుపులు పట్టించుకునే స్థితిలో లేదు అనసూయ.


ఆఫీసులో వెహికల్ లోన్ అప్లై చేయడం, శాంక్షన్ కావడం, ఇలా ఆ తర్వాత పనులు చకచకా జరిగిపోయాయి.


పడవంత కాకపోయినా ఓ మాదిరిగా పెద్దకారే కొన్నారు. ఓ కుక్కా, నల్ల కళ్ళజోడు కూడా అమరాయి.


భర్త డ్రైవింగ్లో ప్రావీణ్యత సంపాదించని కారణంగా, ఎక్కడికి వెళ్ళాలన్నా, రకరకాల యాప్ ల ద్వారా డ్రైవర్లు సిద్ధంగా ఉండేవారు.

శని ఆదివారాల్లో ఐతే రాఘవే తిప్పేవాడు ఎక్కడికెళ్ళాలన్నా.

ఇహ అనసూయకు పట్టపగ్గాలు లేకపోయాయి. 


జమునలా కాదు, జమునకు జేజమ్మలా ఫీలైపోయింది.

అంతకుముందు, దగ్గర బంధువుల ఇళ్ళల్లో ఫంక్షన్లకి కూడా, “ఏం వెడతాంలేద్దూ” అంటూ బద్దకించే మనిషి, కారు కొన్నాక, వేలు విడిచిన బంధువుల ఇళ్ళలో కార్యక్రమాలకు కూడా బయలుదేరేది.


కారులోనుంచీ కాలు కింద పెట్టకుండా కలలలో తేలిపోతున్న అనసూయకి, రాఘవ మాటలు అశనిపాతంలా తగిలాయి. 


“అమ్మేద్దామని నిర్ణయించేసుకున్నారా?” దిగులుగా అడిగింది కొడుకుని. 


“నాదేం లేదమ్మా. నాన్న, ‘నావల్ల కాదు కారుకి కాపలా కాయడం’ అంటున్నారు,” తల్లి వంక బాధగా చూస్తూ చెప్పాడు రాఘవ.


“రెండు రోజులకోసారైనా కారు తీయకపోతే పాడైపోతుంది అనసూయా. నాకు రాదు. మాటిమాటికీ వేలు తగలేసి డ్రైవర్లను పిలవలేం కదా. అర్థం చేసుకోకపోతే ఎలా?” విసుగ్గా అన్నాడు సుబ్బారావు.


“డ్రైవర్ని పిలవడం ఎందుకూ? మీరే డ్రైవ్ చేయొచ్చు కదా? కాస్త మెరుగుపరచుకుని. నాకోసం ఆమాత్రం చేయలేరూ?” కోపంగా చూసింది అనసూయ.


“నాకు డ్రైవింగ్ ఇష్టం లేదు. ఇపుడు నీకోసం ఈ కొత్త కొత్త అలవాట్లను నేను చేసుకోలేను. నావల్ల కాదు,” తెగేసి చెప్పేశాడు సుబ్బారావు.


“ఏమన్నారూ?! నాకోసం నేర్చుకోలేరా?! వంట చేయడం నాకూ ఇష్టం లేదు. అని మొండికేసి వదిలేసానా? ముద్దపప్పు తప్ప మరొకటి చేయలేని నేను, పనస పొట్టు ఆవపెట్టి చెయ్యి, బొప్పాయి తురిమి పులుసు, బెల్లం వేసి చెయ్యి, బొబ్బట్లు చెయ్యి, బూరెలు చెయ్యి అంటే, మీకోసం నేర్చుకుని చేస్తున్నానా? లేదా? మరి నా కోసం మీరెందుకు డ్రైవింగ్ నేర్చుకోలేదూ?” ఆవేశం, ఆక్రోశం కలగలిసిన గొంతుతో అడిగింది అనసూయ.


“అమ్మ మరీ బాధపడుతోందిగా నాన్నా, పోనీ నాలుగైదు లక్షల్లో చిన్న కారేదైనా కొందామా? ఉంటుంది చేతిలో మీకు కూడా” అన్నాడు రాఘవ. 


వింటున్న అనసూయ మనసులో మళ్ళీ చిన్న ఆశ.

“చిన్నదైనా పెద్దదైనా అదే ఇబ్బంది రాఘవా. వాకిట్లో కవరేసుంచితే, ఎలుకలు నానా నాశనం చేస్తాయి. రోజూ డ్రైవర్లను పిలవడం, కారు తీయించడం, ఈ చాకిరీ అంతా నావల్ల కాదు. 


మీ అమ్మ అలాగే అంటుంది.  నాలుగొందలు పడేస్తే కాబ్ లో వెళ్ళిరావచ్చు ఎక్కడికైనా.  నాలుగు లక్షల కారే అక్కర్లేదు”  అన్నాడు విసుగ్గా సుబ్బారావు.

“నాలుగు రూపాయలు పెట్టి RTC బస్సులో కూడా వెళ్ళిరావచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కారులో పుట్టానా? కారులో పోతానా??” విసురుగా అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది అనసూయ.


“అంత బాధ పడకమ్మా. బస్సుల్లో తిరగొద్దు నువ్వు. కాబ్ లలోనే తిరుగు. సరేనా. ఇండియా రాగానే కొనుక్కుందాం గా,” వెనకాలే వస్తూ అనునయంగా అన్నాడు రాఘవ.


“అప్పటికి నేను బతికుంటే, చూద్దాం. చాల్లేరా, మీ నాన్న వాత పెట్టడం, నువ్వు వెన్న పూయడం. అద్దెకారు సొంతకారవుతుందా?! ఐనా నాపిచ్చిగానీ, అమెరికా జీవితానికి అలవాటు పడినవాడికి, అమ్మ దగ్గరకు రావాలనిపిస్తుందా మళ్ళీ. మిమ్మల్ని అనడమెందుకులే…. నా అదృష్టం ఇంతే.” నిష్టూరంగా అంటూ లోపలికెళ్ళిపోయింది అనసూయ.


పక్క ఇంటి టీవీలోనుంచీ విషాదంగా పాట వినపడుతోంది:

“అంతా భ్రాంతియేనా…జీవితానా వెలుగింతేనా…ఆశా నిరాశేనా… మిగిలిందీ కాబ్సేనా…”


                 —- సమాప్తం —-

 

***

అన్నపూర్ణ సోమయాజులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: అన్నపూర్ణ సోమయాజులు

పేరు : అన్నపూర్ణ సోమయాజులు. వెంపటి.

W/o. V.s. somayajulu.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

nicely written! reflects the emotions of many middle class families

Like
bottom of page