'Antha Mana Manchike' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 24/12/2023
'అంతా మన మంచికే' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
ప్రతి మనిషి, తమ జీవితంలో ఏదో ఒక దైవాన్ని ఇష్టపడుతూ, ప్రార్ధిస్తూ ఉంటాడు. ఏ పని ప్రారంభించినా, ఆ పని విజయవంతం కావాలని కోరుకునేవారే ఆందరూను.
ఆ పనిలో విజయం సాధిస్తే మాత్రం తమ ఘనకార్యంగాను, లేకపోతే ‘అంతా దేవుడి దయ, ఏం చేస్తాం.. తలరాతలో లేదు’ అంటూ దేవుడిని నిందించేవాళ్ళు కోకొల్లలు.
ఇంకొంతమంది దేవుడు ఎప్పుడూ ధనికులకే మంచి జీవితం ఇస్తాడు, ధనం ఉన్నా కూడా వారికే ఏ నష్టం కల్గించడు. పైగా ఎలాంటి కష్టాలు పెట్టించడు. అన్నీ పేదవారికే చుట్టేస్తాడు. తినడానికి తిండేలేని పేదలకు కూడా కష్టాలు తప్పించలేకపోతున్నాడని దేవుడిని తిట్టుకునేవారు ఉన్నారు.
గొప్పగొప్ప గమ్యాలను గుండెల్లో దాచుకుని, పరిస్థితులు అనుకూలించక సర్ధుకుపోతూ బతుకు ఈడుస్తున్న వారు ఎక్కువ మందే ఉన్నారు.
రాము అచ్చం అలాంటి కోవకు చెందినవాడే.
ప్రస్తుతం తన పని ప్రతిరోజూ వీధులు ఊడ్చటం.
అలా ఒకరోజు వీధులు ఊడుస్తూ.. విసుగెత్తి ఒక గుడి దగ్గర ఉన్న దేవుడి విగ్రహాన్ని చూసి,
"నిత్యం పూజలు ఆందుకుంటావు నీకేం? దర్జాగా ఉంటావు.
నా పరిస్థితి చూడు ఎంత కష్టమో..! నీకు సత్తా ఉంటే ఒకే ఒక్క రోజు నా స్థానంలో నువ్వు, నీ స్థానంలో నేను ఉందాం. నీ పనిని నేను చేస్తా, నా పనిని నువ్వు చేయ్. ఏమంటావ్" అని దేవుడిని మామూలుగా అడిగాడు.
అంతే!
దేవుడు రాము మాటలకు కరుణించి
"సరే అలాగే కానీ.. ! ఎవరు ఏమన్నా.. ఏం చేస్తున్నా.. ఎట్టి పరిస్థితుల్లోను స్పందించకూడదు, నోరు మెదపకూడదు " అని షరతు పెట్టాడు దేవుడు.
"సరే" అన్నాడు రాము.
తెల్లారేసరికి దేవుడి స్థానంలో రాము కూర్చున్నాడు. రాముని చూసేవాళ్ళకి దేవుడి రూపంలోనే కనపడేలా దేవుడు మహిమ ఇచ్చాడు.
కొంతసేపటికి ఒక ధనిక భక్తుడు వచ్చి
"దేవా.. ! నేను ఒక కొత్త బిజినెస్ పెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించి నన్ను కరుణించు స్వామి" అని దణ్ణం పెట్టాడు.
అతని జేబులోని పర్సు కింద పడింది.
అది ఆ ధనికుడు చూసుకోకుండా వెళ్ళిపోయాడు.
"ఒరేయ్ నీ పర్సు కిందపడింది చూసుకో" అనాలనుకున్నాడు దేవుడి స్థానంలో ఉన్న రాము. కానీ దేవుడి మాటలు గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయాడు.
ఇంతలో అక్కడికి ఓ పేదవాడు వచ్చి
"దేవుడా నేను ఒక పేదవాడిని. నా దగ్గర ఒక రూపాయి మాత్రమే ఉంది. దానిని నీకు కానుకగా ఇస్తున్నాను.
నా మీద దయ చూపు తండ్రి" అని మోకరిల్లాడు.
అతనికి ఆ పర్సు కనపడింది.
"స్వామి.. ఇలా దయచూపారా తండ్రి" అని ఆ పర్సు తీసుకుని వెళ్ళిపోతాడు పేదవాడు.
‘ఒరేయ్ దొంగ..’ అని అరుద్దామనుకున్నాడు. కానీ... దేవుడి మాటలు గుర్తు వచ్చి ఆగిపోయాడు.
ఆ తర్వాత ఓ నావికుడు వచ్చి
"ఈరోజు మధ్యాహ్నం నాకు సముద్ర ప్రయాణం ఉంది. చల్లగా దీవించు స్వామి " అన్నాడు.
ఇంతలో అక్కడికి పర్సు పొగొట్టుకున్న ధనికుడు పోలీసులుతో వచ్చి
"నా తర్వాత వచ్చింది ఇతడే. కాబట్టి నా పర్సు దొంగిలించింది ఇతడే. అరెస్ట్ చేయండి" అంటాడు.
పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తుండగా
ఈ అన్యాయాన్ని చూడలేని దేవుడు స్థానంలో ఉన్న రాము
"ఆగండ్రా.. ఇతడు నిర్ధోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సుని తీసుకెళ్ళాడు" అని అన్నాడు.
దేవుడే స్వయంగా చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదవాడిని జైల్లో పెట్టారు పోలీసులు.
సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి స్థానంలో నుండి దిగేశాడు.
వీధులు ఊడ్చి వస్తున్న దేవుడితో
"దేవా ఈరోజు ఎంత మంచి పని చేశానో తెలుసా..?” అన్నాడు.
"ఏం చేశావయ్యా" దేవుడు అడిగాడు ఆత్రతగా.
"ఒక నిర్దోషిని శిక్ష నుండి తప్పించి అసలైన దోషికి శిక్ష పడేలా చేశాను" అన్నాడు.
"హుమ్... ఎంత పని చేశావయ్యా.. ! అసలు స్పందించకని చెప్పానా.. ! ఎందుకలా చేశావ్.. ?” నిట్టూర్చుతూ అన్నాడు దేవుడు.
"అదేంటి స్వామి, నన్ను మెచ్చుకుంటావు అనుకుంటే ఇలా చీవాట్లు పెడుతున్నారు " అడిగాడు రాము బాధగా.
"ధనికులు పాపాత్ములు. వారికి ధనం భిన్న రూపాల్లో వస్తుంది. ఎంత వచ్చినా ఎవరికీ దానం చేయరు. వాడి డబ్బు పేదవాడికి వస్తే అతడికి ఉపయోగపడుతుంది. అతడి కుటుంబం కొన్ని రోజులు ఆకలి బాధ నుండి తప్పించుకునేవారు అని నేనే ఇదంతా చేయించాను. అది కాక ఆ నావికుడు సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు రాత్రి సముద్రంలో ఆకస్మిక తుఫాను ఉంది.
అతడి పడవ మునిగిపోతుంది. అందరూ చనిపోతారు. అతడు అరెస్ట్ అయి ఉంటే ప్రాణాలతో బతికేవాడు.
ఇప్పుడు చూడు పేదవాడు జైల్లో ఉన్నాడు. ధనికుడు యధావిధిగా దోచుకుంటున్నాడు. నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.
పైగా దేవుడికి పేదవారంటే గిట్టదు వారికి కష్టాలు పెడతాడు, ఆదుకోడు అని నిట్టూర్చుతావు. నీతోటి పేదోడికి సహాయం అందించకుండా జైలుపాలు చేశావు " అన్నాడు.
అప్పుడు రాముకి అర్థం అయింది, దేవుడి ప్రణాళిక ఎవరికి అర్థం కాదని.
కష్టంలా అనిపించేది వాస్తవానికి మేలు చేయవచ్చు. తప్పులా అనిపించేది ఒప్పై ఉండవచ్చు. “ఆయన ఆలోచనలు, లోతుగా అర్థం చేసుకుని మన్నించమని ప్రార్ధించాడు రాము.
"ఇకనైనా నీకు నచ్చిన బతుకు నీవు బతుకు. దేవుడిని ఎప్పుడూ తప్పుబట్టకు. అంతా మన మంచికే అని అనుకుని చక్కగా జీవించు, మంచే జరుగుతుంది అని మాయమయ్యాడు దేవుడు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments