top of page

నో టికెట్ ప్లీజ్!



'No Ticket Please' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 24/12/2023

'నో టికెట్ ప్లీజ్' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఏమిటే మధు! నన్ను ఉదయాన్నే నిద్ర లేపేసావు.. కొంతసేపు పడుకోని.. ఈ రోజు సండే కదా.. "


"లేదండీ.. లేవల్సిందే.. నిన్న ఏం చెప్పారో గుర్తుచేసుకోండి.. ?"


***

"మధు! ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ చేసారు తెలుసా? ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ యే.. "


"అయితే ఏం చెయ్యమంటారు?"


“డబ్బులు ఆదా చెయ్యాలంటే, మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మధు! ఇన్నాళ్ళు రైతుబజార్ దూరం అని, పక్కనున్న సూపర్ మార్కెట్ నుంచి కూరలు అవీ, ఎక్కువ రేట్ పెట్టి కొన్నావు. ఇప్పుడు అలా కాదు.. నువ్వు సండే ఉదయాన్నే, అలా బస్సు ఎక్కి.. దర్జాగా.. ఫ్రీ గా.. రైతుబజార్ కు వెళ్లి.. ఫ్రెష్ గా కూరలు కొనేసి తెస్తావు. కావాలంటే, ఉదయం నేను టిఫిన్ చేస్తాను ఇద్దరికీ..” 


***


“గుర్తొచ్చిందా.. ? నిద్ర లేవండి ఇంక.. లేచి ఇంట్లో పనులు చూడండి.. నాకు కాఫీ పెట్టి ఇస్తే, నేను అలా, రైతుబజార్ కు వెళ్లి ఫ్రెష్ గా వస్తాను. ఒకవేళ రావడానికి లేట్ అయితే, పనిమనిషి కి అంట్లు వేసేసి.. టిఫిన్ చేసేయండి”. 


“ఎందుకు లేట్ అవుతుంది.. ?”


“బస్సు కదా మరి.. తర్వాత.. దగ్గరే అని మా అమ్మ ఇంటికి వెళ్ళాలనిపిస్తే, వెళ్ళాలి కదా.. మునుపు ఆటో కి రెండు వందలు ఇవ్వలేక వెళ్ళలేదు.. ఫోన్ లో మాట్లాడుకుంటూ, సరిపెట్టుకున్నాను. ఇప్పుడు బస్సు ఫ్రీ యే కదా..” 


"ఇదిగో మధు కాఫీ.. "


"బానే పెట్టారే కాఫీ.. నేను వెళ్లొస్తాను.. చెప్పినవి గుర్తున్నాయి కదా! చేసేయండి.. బై.. " అని మధు వెళ్ళింది.


‘ఇప్పుడు నాకు ఉంటుంది.. టిఫిన్ చెయ్యాలి.. ఇంకేమి పనులు చెయ్యాలో మరి.. ఆ ఫ్రీ బస్సు ఏదో మగాళ్ళకి ఇచ్చి ఉంటే.. నా సామి రంగ.. సూపర్ గా ఉండేది.. ప్రతి హాలిడే.. ఇక జాలీ డే..’ 


****


మధుతో సుధాకర్ కు పెళ్లై రెండు సంవత్సరాలు అయింది. ఇద్దరి పెళ్ళిచూపులు చాలా గమ్మతైన ఒప్పందంతో జరిగాయి. పెళ్ళిచూపులకి, సుధాకర్ ఆ రోజు రెడీ అయి అమ్మ తో బయల్దేరాడు. ఆ ముందు రోజు, కొడుకు జాతకం చూపించి.. పెళ్ళి యోగం గురించి ఒక స్వామిజీ ని అడిగింది జానకమ్మ. ఆ స్వామిజీ కాస్త స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి. 


"జానకమ్మా! మీ అబ్బాయి జాతకం బాగుంది.. కానీ పెళ్ళి విషయం లోనే, గ్రహాలు అంతగా అనుకూలించడం లేదు. ఉన్నది చెప్పెస్తాను మరి.. "


"మీకంతా తెలుసు స్వామిజీ.. ఉన్నదే చెప్పండి.. ఏమైనా దోషం ఉందా?"


"అలాంటిదే.. మీ అబ్బాయి కోసం నెక్స్ట్ చూసే పెళ్ళిచూపుల లో అమ్మాయిని ఓకే చెయ్యండి. లేకపోతే, ఇప్పట్లో మీ అబ్బాయికి పెళ్ళియోగం లేదు. ఆ తర్వాత చేసుకున్నా.. పెద్దగా ప్రయోజనం ఉండదు.. ఈ విషయం మీ అబ్బాయి కి గట్టిగా చెప్పు.. "


"అలాగే స్వామిజీ.. మీరు చెప్పినట్టే చేస్తాను. మళ్ళీ.. పెళ్ళి శుభలేఖ తో మిమల్ని కలుస్తాను!"


"శుభమస్తు.. !"


"ఒరేయ్ సుద్దు! నేను చెప్పింది వినరా.. "


"నన్ను సుద్దు అనొద్దని ఎన్ని సార్లు చెప్పాను.. "


"పోనిలేరా సుద్దా!"


"వద్దులే తల్లీ.. సుద్దు నే బెటర్.. చెప్పు ఏమిటి?"


"మన స్వామిజీ నీ జాతకం చూసి, ఎలాగైనా ఈ సంబంధం ఓకే చెయ్యమన్నారు.. లేకపోతే, నీకు పెళ్ళి కష్టమని చెప్పారు. కాబట్టి.. అమ్మాయితో జాగ్రతగా మాట్లాడి.. అన్నింటికీ ఒప్పుకో.. అర్ధమైందా.. ?"


"అలాగే లే.. ఏం చేస్తాం?"


పెళ్ళి చూపులలో.. అమ్మాయి తో విడిగా మాట్లాడడానికి.. ఇద్దరూ అలా బాల్కనీ లోకి వెళ్లారు.. 


"నేను మీకు నచ్చానా?" అడిగింది పెళ్ళికూతురు మధు.


("అమ్మాయి ఎలా ఉన్నా.. ఒప్పుకోవాలి.. తప్పదుగా!" మనసులో అనుకున్నాడు సుధాకర్)


"నచ్చారు.. "మరి నేనో.. " ఆత్రంగా అడిగాడు సుధాకర్ 


"నచ్చారు.. కానీ పెళ్ళయ్యాక నాకు పూర్తి స్వేఛ్చ ఇవ్వాలి.. నాకు ఏది ఇష్టమైతే, అదే చేస్తాను.. "


"అంతేగా! అంతేగా!.. ఓకే"


****


ఏమిటీ.. మా ఆవిడ వెళ్లి రెండు గంటలు అయ్యింది.. ఇంకా రాలేదు.. ఫోన్ చేద్దాం.. 



"హలో మధు! ఎక్కడున్నావు.. వస్తున్నావా?"


"ఇంకా లేదండి.. మా అమ్మ చాలా రోజులు నుంచి ఇక్కడ గుళ్ళు అన్నీ తిరగాలనుకుందిట. ఇప్పుడు ఫ్రీ గా తిరిగే అవకాశం వచ్చిందాయే! నన్ను తోడు రమ్మంటేను, వెళ్తున్నాను. నాకూ.. పుణ్యం వస్తుందిగా. మళ్ళీ ఇలా తిరిగే అవకాశం వస్తుందో లేదో నని ఇప్పుడే వెళ్తున్నాము. ఇప్పుడు నేను ఇంటికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం లో ఉన్నాను. నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుందేమో.. మీరు వంట వండేసి తినేయండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ కుడా ఉన్నారు పక్క వీధి లోనే.. మా అమ్మ ఫ్రీ బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత.. నేనూ మా ఫ్రెండ్స్ అలా షాపింగ్ కు వెళ్తాము. 


మా ఫ్రెండ్ రాధ కి ఫేస్ క్రీమ్ అయిపోయిందంటా.. ఎక్కడో యాభై శాతం డిస్కౌంట్.. అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత, ఉల్లిపాయలు.. ఎక్కడో బాగా చీప్ అంట.. తర్వాత.. మా ఫ్రెండ్స్ కొంత మంది సేఫ్టీ పిన్స్ కోసం, ఇంకొకరు నెయిల్ పాలిష్.. చాలా పెద్ద లిస్టు చెప్పారు లెండి.. ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ ఉంటే, అక్కడకు వెళ్లి కొనుక్కుని వచ్చేస్తాను లెండి ఇంటికి. ఎక్కడో, చీరల మీద ఇరవై శాతం డిస్కౌంట్ అంట. అన్నీ చూసుకుని వస్తాను.. మీరు కంగారు పడకండి. 


రాత్రి టైం ఎనిమిది.. కాలింగ్ బెల్ మోగింది.. 


"అదేంటి మధు!.. అలా ఉన్నావు?.. ఎవరితోనైనా గొడవ పడ్డావా.. ?" 

"లేదండి.. సాయంత్రం ఫ్రీ బస్సు లో చాలా రష్ గా ఉంది.. బస్సు దిగేసరికి.. ఇలా చీర చిరిగి, ఆ బస్సు లో నిల్చొని ఒళ్లంతా హూనం అయ్యిందండి.. "


"ఇదిగోండి రైతుబజార్ లో కూరలు.. "

"సంతోషించాములే.. వంద మిగులుస్తావని పంపిస్తే.. , అదేంటి ఆ.. ప్యాకెట్.. ?"

"చీరలండి.. వెయ్యి కి ఒకటి.. డిస్కౌంట్ బాగా ఇచ్చాడు.. "

"ఇంకా.. "

"మీకు బజార్ లో రెండు లుంగీలు కొన్నాను.. "

"అయ్యో.. లుంగీ కి డ్యామేజ్‌ ఉంది మధు.. "

"రేపు మళ్ళీ వెళ్లి.. మార్చేస్తాను లెండి.. బస్సు ఫ్రీ యే కదా!"


"అదేంటే.. నీ మెడలో మంగళసూత్రం ఏది.. ?'

"అయ్యో.. ! అయ్యో.. ! పోయిందండి.. "

"ఎవడో కొట్టేసుంటాడు.. "


"వంద మిగులుతుందని, నిన్ను రైతుబజార్ కు పంపించాను చూడు.. నన్ను నేను తిట్టుకోవాలి" అని తల పట్టుకున్నాడు సుధాకర్.. 


*******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ




85 views1 comment
bottom of page