'Antharalu' - New Telugu Story Written By Akella Suryanarayana Murthy
Published In manatelugukathalu.com On 17/10/2023
'అంతరాలు' తెలుగు కథ
రచన: ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సుమారు ఇరవైనాలుగు గంటల విమానప్రయాణం తర్వాత ఎయిర్ పోర్టు నుండి మా ఊరికి సరాసరి రెంటల్ కారు తీసుకుని బయలుదేరాము నేనూ, నా భార్య రేవతి, పిల్లలిద్దరు. రెండు గంటల ప్రయాణం..
దాదాపు పన్నెండేళ్ళు గడిచిపోయాయి. అమెరికాలో ఎమ్మెస్ చేయడం, అక్కడే ఉద్యోగం, ఇండియా వచ్చి పెళ్లిచేసుకుని రేవతిని తీసుకుని అమెరికా వచ్చేయడం, ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టడం.. ఈ పుష్కరకాలం లో ఒకటి రెండు సార్లు ఇండియాకి మేము రావడం, అమ్మానాన్న, అత్తగారు మామగారు నాలుగైదు సార్లు వంతులవారీగా వచ్చి వెళ్లడం జరిగింది.. ఈ లోగా బంధువులు, స్నేహితుల ఇళ్ళలో శుభకార్యాలు జరిగినా, మరోటి జరిగినా, వాట్సాప్ లోనో, ఫేస్ టైమ్ లోనో అభినందనలు, పలకరింపులు, పరామర్శలు, ఓదార్పులు అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి.
కాకపోతే అంతరంతరాలలో ఏదో వెలితి.. కారు ముందుకు, ఆలోచనలు వెనక్కి సాగిపోతున్నాయి. డ్రైవరు పక్క సీట్లో చింటూ, నా పక్కన విండో వైపు అక్షర కూచుని ఆసక్తిగా బైటికి చూస్తున్నారు.. మరోవైపు రేవతి కునికిపాట్లు పడుతోంది.. వైబ్రేషన్ లో ఫోన్ కదిలింది.. నాన్నగారు చేస్తున్నారు.. బైటకి చూసి మరో అరగంటలో ఊరు చేరుకుంటామని చెప్పాను.. అందరూ మా కోసం ఎదురుచూస్తున్నారట.. మా తరంలో జరగబోతున్న ఆఖరి పెళ్లి. నా కన్నా పదేళ్ళ చిన్నవాడు పెళ్ళికొడుకు, మా మేనమామ కొడుకు వాడు, బాంక్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు..
మా ఊళ్లోనే దూరపుబంధువుల అమ్మాయి పెళ్లికూతురు, వరసకి నాకు పిన్ని కూతురు.. ఈ సారి కదలక తప్పలేదు.. రెండు కుటుంబాలు ఒకే ఊరు కావడంతో అక్కడే పెళ్లి.. ఎక్కడెక్కడి చుట్టాలు, స్నేహితులు తరలివస్తున్నారని అమ్మ చెప్పింది.. పరుగులు పెట్టే యాంత్రిక జీవితంలోంచి, ప్రకృతి ఒడిలో సేద తీరడం కోసం సెలవులు, పర్మిషన్లు తీసుకుని బయలుదేరాం. ఊరి పొలిమేరలో ‘.. గ్రామానికి స్వాగతం’ అని కనపడింది..
ఒక్కసారిగా ఒళ్ళు ఝల్లుమంది.. ‘ పిల్లలూ.. మా ఊరిదే.. ’ ఎందుకో తెలియదు గాని గొంతు వణికింది.. పిల్లలు మరింత ఉత్సాహంగా ‘హేయ్’ అని అరుస్తూ కారు విండోలు దింపి చూస్తున్నారు.. రేవతి కూడా మత్తు వదిలినట్టుగా చూస్తోంది..
‘నాన్నగారు.. మామయ్య వాళ్ళింటి దగ్గరకే రమ్మంటారా’ మా కారు చిన్నచెరువు గట్టు దాటుతుంటే ఫోన్ చేసి అడిగాను..
‘కాదురా, అన్నట్టు నీకు తెలియదుగా.. పోయినేడాది మనవాళ్ళంతా కలిసి చింతామణి గణపతి గుడి వీధిలో కళ్యాణమండపం కట్టారుగా.. దాని పక్కనే మన విడిదిల్లు.. అందరం అక్కడే వున్నాము.. ’ అన్నారు నాన్నగారు..
‘సరేనండి.. అక్కడికే వస్తాము.. ’ అని నేననబోతుంటే ‘నీకు గుర్తుందో లేదో.. నేనొస్తున్నానుండు.. ’ అంటూ నా జవాబు కోసం ఎదురుచూడకుండా ఫోన్ పెట్టేశారాయన..
‘మీకు తెలుసుగా.. మళ్ళీ మామయ్య గారికెందుకు శ్రమ.. ’ అంది రేవతి..
నిజానికీవూరొచ్చి చాలా సంవత్సరాలయింది.. నాన్నగారి ఉద్యోగరీత్యా ప్రస్తుత ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఊళ్ళన్నీ తిరగడంతో హైస్కూల్ చదువుల్లోనే రావడం ఆగిపోయింది.. బంధు ప్రీతితో అక్కా బావగారు మాత్రమే తరుచు వస్తుంటారు.. కారు బ్రేక్ పడడంతో ఉలికిపడి చూశాను..
నాన్నగారితో పాటు నాలుగు బైకుల మీద వచ్చారు మా వాళ్ళు.. పిల్లలిద్దరు టక్కున దిగిపోయి నాన్నగారి బండిమీద సర్దుకు కూచున్నారు.. నన్నూ రేవతిని చేతులూపుతునే పలకరించారందరు.. ముందు పరివారం దారి చూపిస్తుండగా చక్రవర్తి రధంలా మా కారు బయలుదేరింది.. విడిదిల్లు ముందు కారు లోంచి దిగీ దిగగానే ఎక్కడో లోపల పెళ్ళికి సిద్ధమవుతున్నవారంతా పొలోమంటూ వచ్చి మమ్మల్ని చుట్టుముట్టారు..
‘ఏరా సూర్యం బావున్నావా.. ’
‘ఎన్నాళ్ళైందిరా బావా నిన్ను చూసి’
‘అమెరికాలోనే పెద్ద ఇల్లు కొన్నావట.. పెద్దమ్మ చెప్పిందిరా’
‘హలో అన్నయ్యా ‘
‘ఏరా తమ్ముడు.. బాగా సంపాదిస్తున్నావుట.. మీ అక్కయ్య చెప్పింది.. ’
‘సూరిబాబుగారు.. బాగున్నారా.. ’
ఎన్నో వరసలు, మరెన్నో పిలుపులు.. పెద్దా చిన్నా పలకరింపుల ఆత్మీయతలకి కళ్ళు చెమ్మగిల్లుతుంటే, ఎవరు ఎవరో తెలియకుండా అయిపోతుంటే, మాటలు దొరకక తలాడిస్తూ పులకరింతల వర్షంలో తడిసిముద్దవుతున్నాము నేనూ రేవతి..
వరుడి కాశీయాత్ర ఘట్టానికి ఏర్పాట్లు జరుగుతుంటే మామయ్య, అమ్మ, అక్కయ్య మిగిలినవాళ్ళంతా కళ్యాణమండపంలో ఉన్నారని నాన్నగారు చెప్పారు.. విడిదింట్లో ఉన్న రెండు ఏసీ రూములలో ఒకటి మా కోసం కేటాయించారు, ఇక్కడ వాతావరణానికి తట్టుకోలేమని..
తమ బాక్ పాక్ లో తెచ్చిన అమెరికా చాకోలెట్లు అక్కడున్న పిల్లలకి పంచిపెడుతున్నారు చింటూ, అక్షర పాప.. నాన్నగారి దగ్గర కూచుని కబుర్లు చెబుతున్నారు పిల్లలిద్దరు..
వారానికి రెండుసార్లో మూడుసార్లో మొబైల్ ద్వారానో, ల్యాప్టాప్ లో మాట్లాడుకుంటున్నా, తాతగారి ఒళ్లో పాప, భుజం మీద తలవాల్చి చింటూ కబుర్లు చెబుతుంటే, నాన్న కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు.. ఆ దృశ్యం చూస్తూ అలాగే నిలబడిపోయాను..
‘మీరు త్వరగా స్నానం చేసి రెడీ అయి వస్తే, పిల్లలు నేనూ తయారవుతాము.. ’ అంటూ రేవతి గుర్తుచేయడంతో ముందుకి కదిలాను..
మేము ఫ్రెష్ అయ్యేసరికి టిఫిన్లు, కాఫీలు, పాలు రూమ్ లోకే తెప్పించారు నాన్నగారు.. ఈ లోగా అక్కా బావగారు హడావుడిగా వచ్చి పలకరించి వెళ్ళిపోయారు.. మిగతా బంధువులు, ఊళ్ళో చిన్ననాటి స్నేహితులు మాకోసం వచ్చి వెడుతూనే వున్నారు.. చుట్టూ మందీ మార్బలంతో నెమ్మదిగా కళ్యాణమండపం లోకి ప్రవేశించాము మేము..
‘సూర్యం తెలుసుగా.. సుభద్రక్కయ్య కొడుకు.. ఈ పెళ్లి కోసం అమెరికా నుండి వచ్చాడు.. వాళ్ళావిడ రేవతి.. బావగారి చేతులు అటుయిటూ పట్టుకుని నడుస్తున్నారే ఆ ఇద్దరు తెల్ల పిల్లలు.. సూర్యం పిల్లలు.. ’ మమ్మల్ని చూపిస్తూ పక్కన కూచున్న పెద్దావిడతో గొప్పగా చెబుతోంది మా పిన్ని..
‘చూడముచ్చటగా ఉన్నారు కుటుంబం’ అందావిడ..
వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కరించి వచ్చాను.. ముందు వరసలో వేసిన కుర్చీలలో అమ్మ కూచుని జరిగే తతంగం చూస్తోంది.. అమ్మకి అటు ఇటు నేనూ రేవతి కూచున్నాము.. క్షేమ సమాచారాలు, ప్రయాణ వివరాలు పూర్తయ్యాక, అమ్మా రేవతి కబుర్లలో పడ్డారు.. నేను లేచి వెళ్ళి పెళ్లి పందిరిలో ఒక్కొక్కరిని కలిసి పలకరించి వచ్చాను.. మామయ్య అత్తయ్య చాలా ఆనందపడ్డారు..
‘ఈ వంకనేనా నువ్వు రావడం, మేము చూడడం, మనం కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందిరా సూర్యం’ అంటూ నవ్వుతూనే కళ్ల నీళ్ళు పెట్టుకోబోయాడు మామయ్య..
నా కళ్ళు చెమ్మగిల్లడం తెలుస్తోంది.. కాశీయాత్ర సన్నివేశం చూడముచ్చటగా ఉంది.. ఐపాడ్ లో ఫోటోలు తీసుకున్నాను.. మధ్యాహ్నం భోజనాలలో చెణుకులు, ఛలోక్తులు, వెక్కిరింతలు, వేళాకోళాలు.. విస్తరిలో పదార్ధాలే వడ్డిస్తున్నారో, పరిహాసాలే ఆడుకుంటున్నారో.. కళ్ళముందు కాలం కదిలిపోతోంది.. భుక్తాయాసంతో కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని, అదయ్యాక అల్పాహారాలు తీసుకుని, సాయంత్రం చల్లపాటి వేళ ఎదురుకోళ్ళకి బయలుదేరాము.. ఈ సారి పూర్తి సంప్రదాయ వస్త్ర ధారణతో వుంది మా కుటుంబం..
ఇరువైపుల బంధువులే కావడంతో కాసేపు అటు, మరి కాసేపు ఇటూ చేరి హడావుడి చేశాము నేనూ రేవతి.. పెద్దవాళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు.. యువతరం మాతో చేరింది.. ఆ ముచ్చట పూర్తయ్యాక, అర్ధరాత్రి ముహూర్తం కావడంతో ముందుగానే ‘సంగీత్’ కోసం ఏర్పాట్లు చేశారు.. మా బాబాయి కొడుకు సరదా సరదా వ్యాఖ్యానాలు చేస్తున్నాడు.. మరో మామయ్య కూతురు వాడితో గొంతు కలిపింది.
పాటలే పాడామా, గంతులే వేశామా.. ఎటు చూసినా కోలాహలం.. ఎటు చూసినా సంబరం.. గుండెల్లోంచి ఉత్సాహం పొంగుకొస్తున్నా ప్రయాణ బడలిక, జెట్ లాగ్ అలసట తెలుస్తోంది.. అలుపు తీర్చుకోవడం కోసం అమ్మ పక్కన కూచున్నాను.. పెద్దల వంతు పూర్తయ్యాక పిల్లలని పిలిచారు.. చిట్టి పొట్టి చిన్నారులంతా తమ తమ ప్రతిభలని వెలికి తీశారు.. దాదాపుగా అందరూ అయిపోయినట్టే అనుకుంటుండగా మా కజిన్ అనౌన్స్మెంట్ వినిపించింది..
‘ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు.. అమెరికన్ బేబీస్..’
చప్పున చూశాను.. పిల్లలిద్దరూ సిద్ధంగా ఉన్నారు..
‘రాక్ డాన్సా.. పాప్ సాంగా.. ’ అన్నారెవరో..
అందరి నవ్వులు వినిపించాయి.. మా అమ్మాయి వాళ్ళమ్మతో ఏదో చెబుతోంది.. రేవతి ‘పర్వాలేదన్నట్టు’ నచ్చ చెప్పింది.. ఈలోగా మా అబ్బాయి చింటూ వేదికని అలకరించాడు.. మైక్ సరి చూసుకుంటుంటే ఎవరో నవ్వారు..
‘.. వ్యాసం వశిష్ట నప్తారం.. ’ నెమ్మదిగా ప్రారంభించాడు వాడు.
‘అద్భుతం.. విష్ణుసహస్రనామం’ అన్నాడు మామయ్య.
కొన్ని శ్లోకాలయ్యాక నాకేసి చూశాడు చింటూ..
’వేరేది చెప్పు’ అన్నట్టు సైగ చేశాను..
రామాయణం సుందరకాండ లో కొన్నిశ్లోకాలు, ఆదిశంకరుల వారు ‘కనకధార’..
సుమారు అరగంట గడిచింది.. ఇంకా చెప్పమంటారా అన్నట్టు చూశాడు వాడు.. చాలు అని చెప్పి పిలిచాను..
అందరికీ నమస్కరిస్తూ వచ్చి నాన్నగారి ఒళ్ళో కూచున్నాడు.. నన్నూ రేవతిని చూస్తూ చప్పట్లు కొట్టారందరు.. స్టేజి తనదే అన్నట్టు పరిగెట్టింది అక్షర..
రేవతి కూడా వెళ్ళి మొబైల్ లో ‘భో శంభో’ పాట ప్రారంబించింది.. పాటకి తగ్గ వేగంతో నృత్యం చేసింది. అది పూర్తికాగానే ‘కృష్ణం కలయ సఖి సుందరం’ మొదలెట్టింది.. ‘భోజనాలకి’ పిలుపులు రావడంతో అక్షర నిరుత్సాహంగా చూసి వేదిక దిగింది.. చప్పట్లు అభినందనలు..
‘రూమ్ కెళ్ళగానే పిల్లలకి దిష్టి తీసేయి’ అని అమ్మ, అక్కయ్యా రేవతిని దగ్గరగా పిలిచి చెబుతుంటే నేనూ నాన్నగారు ముఖాలు చూసుకున్నాము..
పిల్లలిద్దరిని రూమ్ లోనే పడుకోబెట్టి నేనూ రేవతి కళ్యాణమండపం చేరుకున్నాము.. మేము ఊరి విశేషాలు మిగతా విషయాలు తెలుసుకుంటుంటే, మా వాళ్ళు అమెరికా విశేషాలు, మా ఉద్యోగాలు, పిల్లల చదువులు విని మురిసిపోతున్నారు.. సప్తపది అవుతుంటే మేమిద్దరం రూమ్ కి వచ్చేశాం.. తెల్లవారుఝామునే అప్పగింతలు కూడా పూర్తి అయ్యాయట..
నాలుగు రోజులు ఊర్లోనే సందడి సందడిగా గడిచిపోయాయి.. వచ్చేస్తుంటే మామయ్య మా అందరికీ బట్టలు పెట్టాడు.. ‘ఏ మాత్రం వీలు చిక్కినా, ఇండియాకి వచ్చినప్పుడు, మన ఊరికి కూడా రారా.. పెద్దవాళ్ళమైపోతున్నామురా.. మా తరం వెనక్కి వెడుతోంది.. ఇప్పుడంతా మీ తరమే.. నా మనవలు నీ పిల్లలు రాబోయే తరాలురా.. ఈ మూడింటి మధ్య అంతరాలు లేకుండా చూసుకోవాల్సింది మీరేరా.. ’ అనబోతుండగా గొంతు జీరబోయింది మామయ్యకి..
అత్తయ్య కళ్ళలో అదోలాంటి దిగులు..
‘అలాగే మామయ్య.. తప్పకుండా.. ’ అంటూ ఆ దంపతులకి నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాము మేము నలుగురం.. పిల్లలని ముద్దులతో ముంచెత్తారు. మిగతా బంధువులు జాగ్రత్తలు చెబుతున్నారు.. వీడ్కోలు తీసుకుని బయలుదేరాము..
ఏదో తెలియని బరువు గుండెల నిండా.. నాలుగు రోజులు అక్కా వాళ్ళింట్లో, అమ్మా నాన్నగారితో పదిరోజులు, రేవతి పుట్టింట్లో మరో పదిరోజులు గడిచిపోయాయి.. అమెరికా దేశానికి తిరుగుప్రయాణం.. వద్దని చెప్పినా ఎయిర్ పోర్టు దాకా అందరూ వచ్చారు.. విమానంలో కూర్చోగానే పిల్లలు నిద్రలోకి జారుకున్నారు.. రేవతి నా కళ్లలోకి చూస్తూ భుజం మీద తలవచ్చింది.. ఎన్నో చెప్పాలనుకున్నా మాటలు లేని మౌనం మిగిలింది..
‘మూడు తరాల మధ్య అంతరాలు లేకుండా చూసుకోవాల్సింది మీరేరా’ అన్న మామయ్య మాటలు గుర్తుకొస్తున్నాయి..
వేల మైళ్ళ దూరాన్ని దగ్గర చేస్తున్నట్టు విమానం గాల్లోకి లేచింది.. !!
అన్నట్టు మా ఊరి పేరు.. మీకూ తెలుసుగా.. !
***
ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
రచయిత పరిచయం: ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి
Profile:
విద్యార్హతలు : M.COM, PGD IRPM
ఉద్యోగం : సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సొసైటి లో ఆఫీసు సూపరింటెండెంట్ గా 31 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఫిబ్రవరి 2023 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను.
అభిరుచులు :
కధలు, కవితలు, నాటికలు,ఇతర రచనలు వివిధ పత్రికలలో ప్రచురణ పొందాయి.
రేడియో, దూరదర్శన్ లలో నాటికలు, నాటకాలలో రచన,నటనలు, ఇతర కార్యక్రమాలలో వ్యాఖ్యాన రచనలు, ప్రైవేట్ టీవీ చానల్స్ లో,సింగిల్ ఎపిసోడ్లు, డైలీ సీరియల్స్ వందల భాగాల కోసం మాటలు రాయడం జరిగింది.
2015 లో రాజమండ్రిలో నిర్వహించిన నంది అవార్డ్ నాటకాల పోటీలలో నంది అవార్డ్ పొందడం.
స్టేజ్, రేడియో, టివి లలో నటన, వ్యాఖ్యానం చేశాను.
రచించి వ్యాఖ్యానం చేసిన భక్తి గీతాల ఆడియో సీడీలు ఎనిమిది వరకు విడుదల అయ్యాయి.
పలు కవితలకి అవార్డులు అందుకున్నాను. కవితా,కధా సమ్మేళనాలలో తరుచూ పాల్గొంటాను.
వందల సంఖ్యలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు.
S.h. Prashad
ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి అనే మిత్రుడు వుండేవారు. బహుభాషావేత్త, కవి, తాత్వికుడు. సన్యసించి స్వామీ రామానంద గా హిమాలయాల్లో స్థిరపడి, 2002 లో శివైక్యం చెందారు. ఆ మిత్రుడిని, స్వామిని గుర్తుచేశారు
Lalitha Sripathi
హాయిగా ఉంది కథ