అంతరంగ అభిలాష
- Gadwala Somanna

- Oct 9, 2025
- 2 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AntharangaAbhilasha, #అంతరంగఅభిలాష, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 129
Antharanga Abhilasha - Somanna Gari Kavithalu Part 129 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 09/10/2025
అంతరంగ అభిలాష - సోమన్న గారి కవితలు పార్ట్ 129 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
అంతరంగ అభిలాష
-------------------------------------------
అక్షరాల గగనంలో
నక్షత్రాలై వెలుగుతాం
అక్షయమైన జ్ఞానముకై
తక్షణమే శ్రమిస్తాం
అక్షరాల కాగడాలై
అజ్ఞానం తొలగిస్తాం
విజ్ఞానపు వీధుల్లో
పక్షులై విహరిస్తాం
శ్రద్ధగా చదువుకుంటాం
బుద్దిగా నడుచుకుంటాం
వృద్ధులకు సాయంచేసి
వృద్ధిలోకి వచ్చేస్తాం
అక్షరాల్ని నమ్ముతాం
వృక్షాలై ఎదిగేస్తాం
పక్షపాతం వదిలేసి
అక్షి రీతి పనిచేస్తాం

సదుపదేశము దిద్దును జీవితము
-----------------------------------------------------
కన్నోళ్ల సదుపదేశము
వారు చూపు అనురాగము
జీవితాన తొలిరాగము
చూపుతుంది సన్మార్గము
కన్నవారి హెచ్చరికలు
మున్ముందు జాగ్రత్తలు
హద్దు దాటకుంటేనే
చక్కబడును జీవితాలు
బాగు కోరి గద్దింపులు
బిడ్డలకు వడ్డింపులు
ఉజ్వల భవిత పునాదులు
వేస్తారు తల్లిదండ్రులు
కన్నవారి హితబోధ
పెడచెవిని పెట్టరాదు
పిదప అంతులేని బాధ
కొనితెచ్చుకోరాదు

పాలపిట్ట, జమ్మిచెట్టు దసరా కానుకలు
-------------------------------------------------------
విజయ దశమి పర్వదినము
విజయోత్సవ శుభదినము
ఇంటిల్లిపాదికిలలో
పంచిపెట్టును సంబరము
'అజ్ఞాత వాసము' చెర
వీడిన మహత్తర వేళ
ఎద ఎదలో యేరులా
పారిన ఆనందహేల
కష్టాల కొలిమిలోన
నష్టాల బాటలోన
పయనించే వ్యక్తులకు
దసరా స్ఫూర్తి మనసులకు
మనసులోని మలినాలు
కడుగుకున్న గొప్పదనము
అదే కదా అసలు సిసలు
విజయ దశమి మహోత్సవము

నీతిమంతులు లేవాలి!
-----------------------------------------
ప్రసరించే కిరణంలా
తలపై కిరీటంలా
ఉంటారు నీతిమంతులు
గర్జించే సింహంలా
సంధించిన బాణంలా
పదునైన ఆయుధంలా
ఉంటారు నీతిమంతులు
గట్టి విక్రమార్కునిలా
నీతిమంతుల తలమీదకు
వచ్చును ఆశీర్వాదములు
వారి కష్టార్జితమే
భువిని జీవదాయకమే
నీతిమంతులై బ్రతకాలి
అవినీతిని తరమాలి
సరికొత్త ప్రపంచాన్ని
నిర్మాణము చేయాలి

చెట్లు ప్రగతికి మెట్లు
---------------------------------
"భువిని పచ్చదనం పెంచేవి
తీయని ఫలాలు పంచేవి
పరోపకారులు తరువులే
పక్షులకు ఆశ్రయ పురములే
స్వచ్ఛ వాయువుల ప్రదాతలు
ఆరోగ్యానికి కారకులు
భువిలో చూడగా వృక్షాలే
త్యాగానికి ఘన సాక్ష్యాలే
పుడమి తల్లి సోయగాలకు
సస్యశ్యామలం చేయుటకు
'పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు'
పరిరక్షణ మానితే పాట్లు
కరువు కాటకాలు తరిమేవి
వానలు మహిని కురిపించేవి
తల్లిలాంటి వృక్ష రాజములు
మెండుగా చేయును మేలులు
ఎన్నో రకాల వృక్షజాతులు
వాటి సముదాయమే అడవులు
చూడు చూడు 'అంజూరపు చెట్టు'
ఆరోగ్యానికి తొలిమెట్టు
మొక్కలు విరివిగా నాటాలి
చెట్లను అవనిలో పెంచాలి
బాధ్యతగా భావించాలి
సంఘీభావమే తెలపాలి
-గద్వాల సోమన్న




Comments