top of page
Original_edited.jpg

అనుబంధమా నీ దారెటు?

  • Writer: Malla Karunya Kumar
    Malla Karunya Kumar
  • Nov 8
  • 5 min read

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #అనుబంధమానీదారెటు, #AnubandhamaNeeDaretu, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Anubandhama Nee Daretu - New Telugu Story Written By - Malla Karunya Kumar Published In manatelugukathalu.com On 08/11/2025

అనుబంధమా నీ దారెటు? - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


మూడవ సారి ఫోన్ రింగ్ కావడంతో దాన్ని అందుకుంటూ చూసాడు రిషి. తన తండ్రి పరమేశం నుండి కాల్ వస్తుంది.

 ‘నాన్న ఎప్పుడూ ఒకసారి చేసి ఆపేస్తారు. కానీ ఇప్పుడు ఇంతలా చేస్తున్నారు అంటే, ఏదో అత్యవసరం అయి వుంటుంది!’ అని తనలో అనుకుంటూ తిరిగి కాల్ చేశాడు.


 తండ్రి ఫోన్ ఎత్తగానే — “నాన్న! ఏమైంది? ఇన్ని సార్లు ఫోన్ చేసారు?”


 “రిషి!...” ఎప్పుడూ లేని విధంగా తండ్రి గొంతులో వణుకు.


 “నాన్న! ఏమైంది? మీరు బాగానే వున్నారు కదా?” రిషి స్వరంలో కంగారు.


 “నేను బాగానే వున్నాను రా, కానీ…”


 “కానీ?”


 “నీ అమ్మకే యాక్సిడెంట్ అయ్యింది. త్రుటిలో ప్రమాదం తప్పింది,” బాధాతప్తమైన స్వరంతో చెప్పాడు.


“ఆమె నాకు ఎప్పటికీ అమ్మ కాదు. మీకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, చాలా ఏళ్లుగా చెబ్తూనే వున్నాను. ఇప్పుడు ఆమె బాగానే వుంది కదా? మరి ఈ విషయం నాకు ఎందుకు చెబుతున్నారు?” అసహనంగా అన్నాడు.


“రేయ్! ఆమె నిన్ను చూడాలని తపిస్తుంది. నువ్వు ఒకసారి రా, కాదనకు. ఈ తండ్రి మాట మీద గౌరవం వుంటే వస్తావు.” వేరే మార్గం లేకుండా వాత్సల్యంతో బంధించాడు పరమేశం.


“నాన్న, అది కాదు… ఇక్కడ నాకు ఖాళీ లేదు,” ఏదో చెప్పబోయాడు రిషి, వెళ్లడం ఇష్టం లేక.


“లేదు! నువ్వు మరేం చెప్పకు. నువ్వు వస్తున్నావు అంతే.”తండ్రికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు, కానీ అప్పటికే కాల్ కట్ అయ్యింది.


అసహనంతో ఫోన్ పక్కన పెట్టేసి, ఎదురుగా టేబుల్ మీదున్న సిగరెట్ తీసి వెలిగించి నాలుగు పీల్చులు పీల్చి గుప్పున పొగ వదిలాడు.


ఆ పొగలో అస్పష్టమైన రూపం ఏదో దర్శనం ఇచ్చి ప్రశ్నలు కురిపించడం మొదలుపెట్టింది.

“నీకు అమ్మ ప్రేమను దూరం చేసిన, ఆమె దగ్గరకు నువ్వు వెళ్తావా ఇప్పుడు?”


మౌనంగా నిలబడి తీవ్రంగా సిగరెట్ తాగడం ప్రారంభించాడు.పొగ ఎక్కువ కావడంతో ఆ రూపం తీవ్ర రూపం దాల్చుతుంది. రిషి మదిని ఛిద్రం చేస్తూ, “వద్దు! నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దు. ఆమె నీ నాన్నను ప్రేమించిన కారణంగానే నీ అమ్మ నీకు దూరమైంది. ఒత్తిడిని భరించలేక ఈ పొగాకు బానిస అయ్యావు. నీ స్వేచ్ఛకు అడ్డంకి అయిన, నీ ఆనందానికి అవరోధమైన ఆమె దగ్గరకు వెళ్లవద్దు!” పదేపదే అరుస్తూ గగ్గోలు పెడుతుంది ఆ రూపం.


ఒక్కసారిగా అరుస్తూ చేయి విదిలించుకుని ఆలోచనల నుండి బయటకు వచ్చాడు రిషి. కాలుతున్న సిగరెట్ చురక తగలడంతో జ్ఞాపకం చేరింది.


కొంత సమయం ఆలోచించిన తర్వాత, “నేను ఆమె కోసం వెళ్లకపోయినా, నాన్న కోసం వెళ్ళాలి. నాన్న మాటను జవదాటలేను,” అని అనుకుంటూ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు రిషి.

ఒకరోజు ప్రయాణం తర్వాత తండ్రి చెప్పిన హాస్పిటల్‌కి చేరుకున్నాడు. అప్పటికి పరమేశం దిగులుతో రూం బయట కూర్చుని ఉన్నాడు. తండ్రిని చూసి గబగబా వెళ్లి, “నాన్న!” అని పిలిచాడు.


 ఒక్కసారిగా తుళ్లిపడుతూ పక్కకు తిరిగి చూసాడు పరమేశం. “రేయ్ రిషి వచ్చావా! నాకు తెలుసు నువ్వు వస్తావని!” అని అంటూ గట్టిగా కొడుకును హత్తుకున్నాడు.


“రిషి! నేను చాలా భయపడ్డాను. ఆ క్షణం నా గుండె ఆగినంత పనయ్యింది. మళ్లీ ఆమెను ఇలా చూస్తాను అనుకోలేదు,” బాధపడుతూ అన్నాడు పరమేశం.


‘ఎందుకు నాన్న! ఆమె మీద మీకు అంత ప్రేమ! ఆమె అనుకున్నంత మంచిది కాదు. మీకు చెప్పినా అర్థం కాదు…’ తనలో అనుకుంటూ తండ్రిని ఓదార్చాడు రిషి.


“సరే, ఇప్పటికే ఆలస్యమైంది,” ఉబికి వస్తున్న తన కన్నీళ్లను తుడుచుకుంటూ, “నీ అమ్మ దగ్గరకు వెళ్దాం పదా,” అని రిషి చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు.


రోహిణి విశ్రాంతి తీసుకుంటున్న గది లోపలికి తీసుకువెళ్ళి, “రోహిణి! ఇదిగో నీ పుత్రరత్నం వచ్చాడు. వీడి కోసమే కదా నువ్వు పరితపిస్తున్నది. ఇదిగో మాట్లాడు,” అని రిషిని ఆమెకు చూపించాడు పరమేశం.


మెల్లగా తన గొంతు సవరించుకుని, “రిషి వచ్చావా? నిన్ను చూడకుండా వెళ్ళిపోతానేమో అనిపించి నాకు చాలా భయంగా వేసింది,” కన్నీరు జారవిడుస్తూ అంది ఆమె. ఆమె మాటలు వినిపించుకోకుండా పక్కకు తిరిగి చూస్తున్నాడు రిషి. 


సరిగ్గా అప్పుడే ఫోన్ రావడంతో, “నాన్న, అర్జెంట్ కాల్,” అని చెప్పి బయటకు నడిచాడు.


“హమ్మయ్య! సరైన సమయంలో ఫోన్ వచ్చింది. లేకపోతే ఈమె వగలమారి ప్రేమను చూడలేకపోయేవాడిని,” అని తనలో అనుకున్నాడు.


మాట్లాడడం పూర్తయి వెనక్కి తిరిగి చూసేసరికి ఒక వ్యక్తి రిషి ఎదురుగా నిలబడి ఉన్నాడు.


“నన్ను గుర్తుపట్టావా?” అని అడిగాడు ఆ వ్యక్తి.


“మాష్టారు! మిమ్మల్ని ఎలా మరిచిపోతాను! ఎలా ఉన్నారు? చాలా రోజులకు మిమ్మల్ని చూడటం అయ్యింది,” ఆనందంతో అన్నాడు రిషి.


“నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వే బాగోలేవు. నీ ప్రవర్తన సరిగా లేదు.”


“మాష్టారు!”


 “రిషి, సూటిగా ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను.”


 ఆశ్చర్యంతో చూస్తున్నాడు రిషి.


 “నీ అమ్మ కాని అమ్మను ఎందుకు దూరం పెడుతున్నావు?”


 “ఆమె అంటే నాకు నచ్చదు. ఆమె నా జీవితంలోకి రావడంతో నేను నా జీవితం కోల్పోయాను.”

 “ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న జీవితం ఆమె ఇచ్చినదే!” “మాష్టారు?”


 “అవును రిషి! నువ్వు ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో నేను నీ దగ్గరకు వచ్చేవాడిని గుర్తుందా? నీకు అవసరమైన డబ్బులు నీ నాన్న పంపించారు అని నేను ఇస్తున్నాను. నిజానికి అప్పుడే నీ నాన్న కొత్త ఉద్యోగంలో స్థిరపడుతున్న సమయం. కొన్ని కారణాల వల్ల నీ నాన్న ముందు ఉద్యోగం కోల్పోయాడు. ఆ సమయంలో నీ అమ్మ కాని అమ్మే నీ నాన్నకు తోడుగా, నీ చదువు ఆగకుండా ఆర్థిక సహాయంగా ఉంది.


 ఆ సమయం లో ఆమె నీలా ఆలోచించి ఉంటే, నువ్వు ఈ స్థితిలో ఉండే వాడివి కాదు. అసలు నీ నాన్నతో ఆమె పెళ్లి ముందే జరగాల్సింది. కానీ నీ తాత ఇచ్చిన మాటకు నీ నాన్న బంధీ అయ్యాడు. తర్వాత నీ అమ్మ యాక్సిడెంట్‌లో మరణించింది.


నీ నాన్న రెండోసారి వివాహం చేసుకోవడానికి కారణం నువ్వే! నీకు తల్లి ప్రేమ దూరం కాకూడదని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా నిన్ను మాత్రమే బిడ్డగా భావించి పిల్లలు కనలేదు. అంతే కాదు, నువ్వు ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు నీ పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం కూడా ఆమెే. ఇప్పుడు చెప్పు — ఆమెకు అమ్మ స్థానం లో ఉండడానికి అర్హత లేదా?


రిషి! ఇప్పుడు ఆమెకు ఎన్ని మందులు వేసినా లాభం లేదు. ఇప్పుడు ఆమెకు కావలసింది నీ ప్రేమ — అవును, నీ ప్రేమే ఆమెకు అమృతం. ఆమె జీవితం నీ చేతుల్లో ఉంది. మనిషి దూరమైన తర్వాత బాధపడడం లాభం లేదు రిషి… మేలుకో!” అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు మాష్టారు.


ఎందుకో తెలియదు, రిషి కాళ్లు వణికుతున్నాయి! ఒక్కసారిగా తన బాల్యం నుండి ఇప్పటి వరకు వెనక్కి మళ్లిన జ్ఞాపకాలు అన్ని తన మనస్సు పుటలపై కదిలాయి. కళ్ళు చెమర్చాయి, హృదయ లయ వేగం పెరిగింది. తెలియని ఆత్మన్యూనత భావం. దిక్కులు పెక్కటిల్లేలా ఓ స్వరం తన చెవిలో — “ఇకనైనా ఆమెను గుర్తించు. నీ కోసం ఇన్ని త్యాగాలు చేసిన ఆమె కోసం నీ మొండి వైఖరిని త్యాగం చేయలేవా?” అని ప్రశ్నించింది.


మెల్లగా రిషి లోని నిషి ఛాయలు తొలగిపోతున్నాయి. అయిష్టపు మేఘాలు చెదిరిపోతున్నాయి.

“పరమేశం! ఇప్పుడు సమయం వచ్చింది. తప్పకుండా అతను ఆమెను అమ్మగా అంగీకరిస్తాడు. అమ్మ ప్రేమకు లొంగని బిడ్డ ఎక్కడైనా ఉంటాడా? ఇన్నాళ్లు ఆమె అతని ప్రేమ కోసం తపస్సు చేసింది, భగీరథ ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆమె కోరిక నెరవేరే సమయం వచ్చింది,” పరమేశం భుజం తడుతూ అన్నాడు మాష్టారు కృష్ణ.


రిషి ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు. ఎవరో భుజం మీద చేయి వేసినట్టు అనిపించడంతో వెనక్కి తిరిగి చూసాడు. ఎదురుగా నాన్నమ్మ లక్ష్మమ్మ ఉంది.


“నాన్నమ్మ!” అంటూ ఒక్క క్షణం ఆగి, “చూసావా నాన్నమ్మ, నా పరిస్థితి ఇప్పుడు ఏమి చేయాలో తెలియడం లేదు. సందిగ్ధంలో ఉన్నాను. చిన్నప్పటి నుండి నాకెప్పుడూ సలహాలు ఇచ్చేదానివి కదా! ఇప్పుడు కూడా ఏదైనా సలహా ఇచ్చి నన్ను ఈ సందిగ్ధం నుండి బయటపడేయి,” అని ప్రాధేయపడ్డాడు రిషి.


రిషి మాటలకు మౌనం దాల్చింది లక్ష్మమ్మ.“నాన్నమ్మ! ఎందుకు ఏమి మాట్లాడవు?” ఆమెను కుదుపుతూ అడిగాడు రిషి.


 “రిషి! నిజానికి నేను పెద్ద పాపం చేశాను రా…”


 “నాన్నమ్మ! ఏమిటి నువ్వు అంటున్నది?”


 “అవును రిషి! రోహిణి మీద కారణం లేని ద్వేషం పెంచుకుని, ఆమె ఉద్యోగం చేయడం నచ్చక, ఆమె తెలివితేటలకు ఈర్ష్య పడి, ఆమెను నిన్ను దూరం చేశాను. ఆమెకు ఎన్నో హింసలు పెట్టాను. నీకు ఆమె గురించి లేనిపోని మాటలు చెప్పి నీ మనస్సు విరిగేలా చేశాను. కానీ ఆమె నన్ను ఎప్పుడూ అత్తగా కాకుండా అమ్మగానే భావించి, నా కోపాన్ని, ద్వేషాన్ని భరించింది. నన్ను కంటికి రెప్పలా చూసుకుంది. ఈ రోజు నేను ఇలా ఉండడానికి కారణం ఆమెే. చివరికి ఆమె ప్రేమ ముందు నేను కూడా తలదించాను రా! ఇన్నాళ్లు నీకు అమ్మ ప్రేమను దూరం చేశాను. నన్ను క్షమించు రిషి… నీ అమ్మ దగ్గరకు వెళ్ళి మాట్లాడు,” బాధతో చెప్పింది లక్ష్మమ్మ.


నాన్నమ్మ మాటలకు నిశ్చేష్టుడై నిలబడి పోయాడు రిషి. అంతకు ముందు నాన్నమ్మ అంటే ఎంతో ప్రేమ. కానీ ఆ ప్రేమ మొత్తం ఆవిరై, ఆమెపై కోపం పెరిగిపోయింది. “సొంత వాళ్లపై ఈర్ష్య, ద్వేషం పెంచుకుని, వారి మధ్య చిచ్చు పెట్టి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు బంధాలు, అనుబంధాలు అర్థం అయ్యే సరికి కుటుంబాలు నాశనం అవుతాయి.


ఓర్వలేని తనం, పెద్దరికం అనే అజమాయిషీతో అనుబంధాలకు తూట్లు పొడుస్తున్నారు. మంచి మనసుల్ని విరిచేసి మనుషుల్లో విషం నింపుతున్నారు! ఇలాంటి వారు ఎన్ని కుటుంబాల్లో దాపురించారో? ఈమె మాటలు విని అమ్మ ప్రేమకు దూరమయ్యాను. ఆమె ఎన్ని సార్లు నా దగ్గరకు వచ్చినా తిరస్కరించాను. ఇకనైనా అమ్మ ప్రేమను పొందాలి!” అని అనుకుంటూ అక్కడినుండి పరుగుతీశాడు రిషి — వెల్లివిరిసిన అనుబంధంతో.


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page