మంచివాడు
- Mohana Krishna Tata

- Nov 8
- 3 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #Manchivadu, #మంచివాడు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Manchivadu - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 08/11/2025
మంచివాడు - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది బావగారు.. ! మా అబ్బాయికీ ఇష్టమే.. ఇక తాంబూలాలు మార్చుకోవడమే ఆలస్యం"
"తాంబూలాలు మార్చుకోవడం, కిళ్ళీ వేసుకోవడం తర్వాత.. కొంచం ఆగండి" అంది దివ్య.
"అదేంటి.. ఇంతవరకు నెమ్మదిగా కూర్చున్న ఈ అమ్మాయి.. ఇలా మాట్లాడుతుందేంటి?" అనుకున్నారు అక్కడ అంతా.
"మీకు తాళి కట్టాలని నా చేతులు తెగ ఉబలాట పడిపోతున్నాయి దివ్య"
"పడతాయి.. పడతాయి.. ! ముందు అసలు మీ చేతులు ఊగకుండ ఉంచుతారా చూస్తాను.. నీ వల్ల కాదు.. పెళ్ళిచూపులకి తాగి వచ్చిన నీకు నేను కావాలా?"
"మా అబ్బాయి పెద్ద బిజినెస్ పర్సన్.. రోజూ పార్టీస్ లో తాగడం కామన్.. " అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి.
"తాగే అలవాటు ఉందంటే, ఇంకా చాలా ఉండే ఉంటాయే" అంది దివ్య.
"వీకెండ్ పబ్స్ కి ఫ్రెండ్స్ తో వెళ్తాను. సిగరెట్ పొగను రింగులు వదలడంలో నన్ను మించినవాడు లేడు.. తెలుసా?" అన్నాడు గొప్పగా పెళ్ళికొడుకు.
"నాకు మందు తాగేవారు, పొగతాగేవారు అస్సలు నచ్చరు.. ఎంతడబ్బున్నా సరే.. మీరు ఇక వెళ్లిపోవచ్చు" అంది దివ్య.
అలా అనడంతో.. అంతా వెళ్ళిపోయారు.
"ఏమిటిది దివ్యా.. ! ఇలా చేసావేంటి? అబ్బాయికి బోలెడంత ఆస్తి ఉంది.. ఎంత మంచి సంబంధం"
"ఏమిటి నాన్న.. ! అబ్బాయికి ఎంత ఆస్తి ఉందా అనే చూస్తున్నారు.. మంచివాడా లేదా అని చూడాలి కదా"
"డబ్బే కదా తల్లీ ఈరోజుల్లో ముఖ్యం.. అది ఉంటె ఏదైనా చెయ్యొచ్చు.. హ్యాపీగా ఉండొచ్చు కదా"
"డబ్బున్నవారంతా సుఖంగా ఉన్నారా? డబ్బున్నవారికి కష్టాలు ఉండవా? ఆ జంటలు విడిపోవట్లేదా?"
"అయితే ఏమంటావు చెప్పు.. నీకు నచ్చని పని నేనెందుకు చేస్తాను"
"డబ్బున్నవారు చాలామంది.. ఎప్పుడైనా చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశం ఎక్కువ ఉంది.. అహం ఎక్కువ ఉంటుంది. బిజినెస్ చేసేవాడు పెళ్ళాన్ని ఎంత ప్రేమించగలడు? ఎప్పుడూ డబ్బు అనే లోకంలోనే ఉంటాడు. తాగే అలవాటు ఉన్నవాడు.. తాగి యాక్సిడెంట్ చేస్తే, నా జీవితం ఇక నరకమే.. జీవితాంతం ఏడవాలి.
తాగి నన్ను తీసుకుని వెళ్ళి ఏ ఫ్లై ఓవర్ మీంచో పడేస్తే.. ? తాగి యాక్సిడెంట్ చేస్తే? సిగరెట్ తో నా వొళ్లంతా వాతలు పెడితే? తాగి ఇంటికొచ్చి.. మత్తులో నన్ను కొడితే.. కోపం వచ్చి, వంటింట్లో కత్తిపీటతో ఒక వేటు వేస్తే, నా జీవితం ఏమవుతుంది? మీరూ నాతో పాటు జీవితాంతం ఏడవాలి.. అందరూ అలా ఉంటారనీ కాదు"
"అయితే ఏమంటావు?
"డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, దేవుడంటే భక్తి, కష్టపడే గుణం, చెడు అలవాట్లు లేకుండా మంచివాడైతే చాలు"
"ఒకప్పుడు ఊరికి ఎక్కడో ఒక్కటి ఉండేది మందు షాప్. ఇప్పుడు వీధికి ఒకటి ఉంటోంది.. మందు ఎక్కడైనా దొరుకుతున్నాది. ఆయుష్షు పెంచే మందులు కంటే, కిక్ ఇచ్చే మందుల షాపులే ఎక్కువ మనకి. షుగర్, బీపీ జంట జబ్బుల కాంబినేషన్ లాగ మందుతో పాటు సిగరెట్ కాంబినేషన్ కామన్ అయిపోయింది. ఇలాంటి వాతావరణంలో మందు అస్సలు తాగకుండా, సిగరెట్ స్పెల్లింగ్ కూడా తెలియని వాడు ఎక్కడ దొరుకుతారు? అలాంటి మంచివాడు ఎక్కడ దొరుకుతాడు?"
"మీరు ఉన్నారుగా నాన్న.. ! మీలాంటి మంచివాడిని వెతికి పెట్టండి"
కొన్ని రోజుల తర్వాత..
"అమ్మాయిని చూసుకోడానికి అబ్బాయి వస్తున్నాడు. ఎప్పుడూ టేబుల్ పైన అలంకరించే ఆ స్వీట్స్ అవి రెడీ చెయ్యండి" అంటూ దివ్య ఇంట హడావిడి.
"దివ్యా.. ! నీకు సందేహం అవసరం లేదు.. అబ్బాయి చాలా మంచివాడు. అన్నీ వాకబు చేసాను. కావాలంటే నువ్వు చెక్ చేసుకో"
"అబ్బాయికి ఒక సొంతిల్లు ఉంది. చిన్న ఉద్యోగం.. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు.. ఈ సంబంధం నాకు ఇష్టమే నాన్న"
పెళ్ళి సింపుల్ గా జరిగింది. దివ్య అత్తారింటికి వెళ్ళింది. ఒకరోజు భర్త ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, రాత్రి బెడ్ రూమ్ లో భర్త ఒంటినుంచి మందు, సిగరెట్ వాసన గమనించింది. ఏడుస్తూ వెళ్లి హాల్ లో కూర్చుంది..
"ఏమిటి దివ్యా.. ! బాధ పడుతున్నావు? ఒంట్లో బాగోలేదా? మందు ఇవ్వనా?" అడిగాడు భర్త దీపక్.
"మీరు తాగిందే కాక, నాకూ మందు ఇస్తారా? నేను మోసపోయానండి.. ! మీరు కూడా అందరిలాగే మందు తాగి ఇంటికి వచ్చారు. నాకు మందు తాగేవారంటే అసలు ఇష్టం ఉండదని మీకు పెళ్ళిచూపులలోనే చెప్పాను కదా. మీరేమో ఇప్పుడు ఇంటికి ఇలా వచ్చారు. దీనికన్నా.. వంటింట్లో ఉన్న కొత్త కత్తితో నన్ను ఒక్క పోటుతో చంపేయండి"
"నీ గురించి మీ నాన్న ముందే చెప్పారు. నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు. కాఫీ ఒక్కటే తాగుతాను.. అంతే! నాలాంటి సామాన్యుడిని ఏరి కోరి పెళ్ళి చేసుకున్న నువ్వు నా దేవత.. నిన్ను బాధపెడతానా?"
"నేనంటే ఎంత ప్రేమండీ.. !"
"అసలు జరిగింది ఏమిటంటే, నా బెస్ట్ ఫ్రెండ్ కి మందు అలవాటు ఉంది. వాడికి కంపెనీ ఇవ్వడం కోసం, బార్ కి వెళ్తాను.. నేను కూల్ డ్రింక్ మాత్రమే తాగుతాను. అక్కడ నుంచి రావడం చేత, నీకు నా గురించి అలా అనిపించి ఉంటుంది"
"మందు, కూల్ డ్రింక్, కాఫీ, దగ్గర దగ్గర ఒకే రంగులో ఉంటాయి.. ఎప్పుడైనా తాగాలనిపిస్తేనో? అదే నా భయమంతా" అంది దివ్య కళ్ళు తుడుచుకుంటూ.
"మా నాన్న తాగి, డ్రైవ్ చెయ్యడం తో యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడే అనుకున్నా.. జీవితంలో మందు జోలికి వెళ్ళకూడదని.. సిగరెట్ పొగకి దూరంగా ఉండాలని"
"మీరు ఎంత మంచివారో అర్ధమైంది. ఇందాకల నేను చెప్పిన కత్తి సీన్ క్యాన్సల్ చెయ్యండి" అని నవ్వుతూ అంది దివ్య.
"సరే.. " అంటూ దివ్యను దగ్గరకు తీసుకున్నాడు దీపక్
***********
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ




Comments