top of page
Original.png

అనుభవం

3 hours ago
9 min read

అనుభవం తెలుగు కథలో తండ్రి చెయ్యి పట్టుకున్న భయపడిన బాలుడు, అంత్యక్రియల టెంట్ వద్ద ప్రశాంతంగా నిలబడి ఉన్న దృశ్యం.

Anubhavam - Telugu Emotional Story | P. Gopalakrishna

అనుభవం - తెలుగు భావోద్వేగ కథ | P. గోపాలకృష్ణ

Published in manatelugukathalu.com on 09/09/2026


“అనుభవం” కథలో పార్థు అనే బాలుడి జీవితంలో చోటుచేసుకున్న ఒక సంఘటన, అతని మనసులో ఎంతటి భయాన్ని నాటిందో, ఆ భయం ఎన్నో ఏళ్ల పాటు ఎలా వెంటాడిందో రచయిత P. గోపాలకృష్ణ సున్నితమైన హాస్యంతో, సహజమైన సంభాషణలతో చిత్రించారు. తల్లిదండ్రుల అనుబంధం, బాల్యపు అమాయకత్వం, మరణం పట్ల మనలో ఉండే అపార్థాలు, చివరికి నిజం తెలిసినప్పుడు కలిగే ఉపశమనం—ఈ కథలోని ప్రధాన అంశాలు. “అనుభవం” తెలుగు కథ పాఠకుడిని నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ, జీవితాన్ని మరింత ప్రశాంతంగా చూడాలనే సందేశాన్ని అందిస్తుంది.


“ఒరేయ్ పార్థూ, మా ఫ్రెండ్ కోటేశానికి ఆరోగ్యం బాగోలేదుట, ఒకసారి వెళ్ళొద్దామా”


నాన్న అంతలాగా పిలిచి అడిగితే ఎలా కాదంటాను? “సరే వెళదాం పదండి” అంటూ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ చెప్పులు తొడుక్కున్నాను.


“కోటేశం చాలా మంచివాడురా” గుమ్మం మెట్లు దిగుతూ చెప్పారు నాన్న.


నిజానికి నాకు అక్కడికి వెళ్లాలని లేదు. కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు కానీ, ఎందుకో హాస్పిటల్ కి వెళ్తే నాకు బర్న్స్ వార్డ్, ఆక్సిడెంట్స్ వార్డ్, హెచ్ఐవి పేషెంట్స్ ఉండే వార్డ్ లు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి.


"ఆరో తరగతి చదువుతున్న వాడివి ఎంత చురుగ్గా ఉండాలి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. పెద్దవాళ్లలాగా ప్రవర్తించకపోతే చక్కగా నీ వయసుకు తగినట్లు ప్రవర్తించొచ్చు కదా!"


నిజమే, నాకు కూడా అలాగే ఉంటుంది. కానీ తెలీకుండానే పెద్దరికం వచ్చినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తు కోసం ఇప్పటినుండే ఏవేవో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాను నేను.


"ఇక్కడ బస్ దిగి అయిదు నిమిషాలు నడిస్తే మనం లోపలికి వెళ్లిపోవచ్చు. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది. చూసుకుని దాటాలి ఆగు" అంటూ నాన్న నా చెయ్యి పట్టుకొని, జాగ్రత్తగా రోడ్డు దాటించారు.


ఎందుకో తెలీకుండానే నాకు నవ్వు వచ్చింది.


“ఎందుకురా నవ్వుతున్నావు” అడిగారు.


“మీరు నన్ను చెయ్యి పట్టుకుని నడిపించినట్లు లేదు. నేనే మిమ్మల్ని రోడ్డు దాటించినట్లు అనిపించింది” నిజాయతీగా అన్నాను.


నాన్న మనస్ఫూర్తిగా నవ్వేసి “పద” అంటూ ముందుకు నడిచారు.


ఎలాగో కష్టం మీద నాన్నగారి మిత్రుడు కోటేశం ఉన్న వార్డ్ దగ్గర అతని కోసం అడిగాము.


"నిన్న మధ్యాహ్నం అతణ్ణి డిశ్చార్జ్ చేశారు" అంటూ వార్డ్ దగ్గర ఉన్న ఒకావిడ... హెడ్ నర్స్ అట... ఆమె చెప్తే సరే అని వెనుదిరిగి మళ్ళీ రోడ్డు మీదికి వచ్చాము.


“వైజాగ్ సిటీ ఈ మధ్య చాలా తొందరగా పెరుగుతోంది. మా చిన్నతనంలో ఇక్కడ ఏమీ ఉండేది కాదు. సాయంత్రం ఏడు గంటలు దాటితే రోడ్డు మీద ఒంటరిగా తిరగడానికి భయం వేసేది” నాన్న చెప్తూనే ఉన్నారు.


అప్పటికే ఉదయం పదకొండు గంటలు దాటిపోయిందేమో, కడుపులో ఎలుకలు పరుగులు తీస్తున్నాయి. రోడ్డుకి అవతలి పక్కన ఉన్న అయ్యంగార్ హోటల్ లోంచి సాంబార్ వాసన గుప్పుమంటూ ఆకలిని మరింత పెంచుతోంది. అదేంటో ఇంట్లో అమ్మ చేసిన సాంబార్ కూడా ఇంత గుప్పుమని వాసన రాదు. నా అవస్థ నాన్నగారికి అర్థమైంది. చెప్పకుండా మన అవసరాలు అర్థం చేసుకోగలిగేవారే కదా అమ్మా నాన్నా.

“టిఫిన్ చేసి, ఇవాళ కోటేశం ఇంటికి వెళదాం.


తిరిగి రాత్రి ఇంటికి వెళ్లిపోవచ్చు. ఎలాగూ వైజాగ్ వచ్చాం కదా, ఇంకో అరగంట ప్రయాణం చేసి వాళ్లింటికి వెళ్లొచ్చేద్దాం”


నాన్నగారు ఏదో ఒకటి మాట్లాడి నన్ను మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ, నిజానికి ఆయన నిర్ణయం హాస్పిటల్ లోనే తీసుకున్నారని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను.


టేబుల్ దగ్గరికి యూనిఫార్మ్ వేసుకొని, టోపీ పెట్టుకున్న సర్వర్ వచ్చి “టిఫిన్ ఏం తీసుకురమ్మంటారు సార్” అడిగాడు నాన్నగారిని.


“వేడిగా ఏముంది టిఫిన్” అందరిలాగే అడిగాడు.


అంటే మనం ఇప్పుడు సాంబార్ వేసుకొని ఇడ్లీ తినమా? అని అడగాలనిపించింది. సర్వర్ చకచకా ఒక పాతికో, ముప్పైయ్యో ఐటెమ్స్ పేర్లు తడుముకోకుండా చెప్పాడు.


“ఓరినీ పిండం పిచ్చి కుక్కలు తినా, ఎవడో అప్పులవాడు తరుముకొచ్చినట్లు అలా లిస్ట్ చెప్తావేంట్రా” అని గట్టిగా అరవాలనిపించింది.


కానీ అతను వయసులో పెద్దవాడు కావడం వలన నేను నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని కూర్చున్నాను.


అన్నీ తెలిసిన నాన్నకి మనకి ఏం కావాలో తెలీదా? “రెండు ప్లేట్ ఇడ్లీ తీసుకుని రా. సాంబార్ కూడా వేసుకొని రా” చెప్పారు.


సాంబార్ ఇడ్లీ రావడంతో సరాసరిగా ఆ వాసన గుప్పుమని ముక్కుని సోకిందేమో, దూరం నుండి వచ్చినంత ఆహ్లాదకరంగా అనిపించలేదు. మౌనంగా స్పూన్ తో చిన్నగా తీసుకొని సాంబార్ ని ఆస్వాదిస్తూ ఒక ఇడ్లీ తినగలిగాను.


రెండో ఇడ్లీ తినడం నా వలన కావడం లేదు. “నువ్వెంత తినగలవో అంతే తిను”. నాన్న హెచ్చరించడంతో, హమ్మయ్యా అని గుండెల నిండా గాలి పీల్చుకొని, “ఇంకెప్పుడు సాంబార్ ఇడ్లీ తినాలని అనుకోకూడదు. ఒకవేళ తినాలనిపించినా, ఏ అయ్యంగార్ హోటల్ ముందో కాసేపు నిలబడి, బాగా వాసన పీల్చుకొని, సంతృప్తి పడాలి అంతే” అనుకున్నాను.


సరిగా పన్నెండున్నర సమయానికి నాన్నగారి మిత్రుడు కోటేశం ఇంటికి చేరుకున్నాం మేము. ఇంటి ముందు ఒక టెంట్ వేసి, కొన్ని కుర్చీలు కూడా వేసి ఉన్నాయి. నాకేమీ అర్థం కాలేదు కానీ, 'కోటేశం చనిపోయాడురా పార్థూ' అన్న నాన్నగారి మాటలు ఉలిక్కిపడేలా చేశాయి.


చనిపోయిన వాళ్ళని ఎప్పుడు చూసిందీ లేదు, నా వయసు కానీ నా మనసు కానీ అంత పరిణతి సాధించందీ లేదు. మనసులో భయం మొదలై, తెలీకుండానే నాన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. టెంట్ లో ఒక మూలగా ఒక పెద్ద బాక్స్ లో శవం ఉందిట. చాలామందే బంధువులు అక్కడకి వచ్చి ఏడుస్తూ ఉంటే, ఇందాక తిన్న సాంబార్ ఇడ్లీ, గొంతులోంచి బయట పడిపోతాను అంటూ మారాం చేయసాగింది.


“నువ్విక్కడే కూర్చో నాన్నా, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను” అన్నారు నాన్న.


"అలా బాక్స్ లో ఎందుకు పెట్టారు?" అడిగాను నాన్నగారిని.


కోటేశం క్రిస్టియన్ మతం తీసుకున్నాడుట నాలుగేళ్ల కిందట. వాళ్ళ మతాచారం ప్రకారం అలా బాక్స్ లో పెట్టి ఖననం చేస్తారు. నాన్నగారి మొహంలో గంభీరత చూసి ఇంకేమీ మాట్లాడదల్చుకోలేదు.


“హిందువులైతే శ్మశానానికి తీసుకొని వెళ్ళి కాల్చేస్తారు”, నాన్నగారు చెప్పిన ఈ ఆఖరి మాటలకి నా ప్రాణాలు అక్కడే పోయాయేమో.


అమ్మో, నన్ను కూడా అలా కాల్చేస్తే ఒళ్ళంతా బొబ్బలెక్కిపోదూ, బహుశా అందుకే ఈ కోటేశం గారు ముందు జాగ్రత్తగా క్రైస్తవంలోకి వెళ్లిపోయాడేమో. ఏదైనా తెలివైన వాడిలా ఉన్నాడు... ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఎవరో భుజంమీద చెయ్యేసి, “ఏ ఊరు బాబూ నీది, ఎవరితో వచ్చావు?” అడిగింది ఆ చెయ్యి యొక్క యజమాని కంఠం.


“అక్కడ నిలబడ్డ ఆయన మా నాన్నగారు. వారి మిత్రుడు చనిపోయారని చూడడానికి తీసుకొచ్చారు” చెప్పాను.


“అంతే బాబూ, ఈ లోకానికి ఎందుకు వస్తామో తెలీదు. ఎందుకు పోతామో తెలీదు. ఎన్నాళ్ళున్నామన్నది ముఖ్యం కాదు, ఏం చేశాము అనేది ముఖ్యం”...


అతని మొహంలోకి చూశాను. ఎవ్వరి మొహంలోనూ చూడని ప్రశాంతత.


“జీవితాన్ని ప్రశాంతంగా పరిపూర్ణంగా అనుభవించు బాబూ, కాలం అనేది ఇట్టే వచ్చి అట్టే కరిగిపోతుంది, మొన్నటివరకు నీలాగే చిన్నపిల్లడిలాగా ఆడుకుంటూ బళ్ళోకి వెళ్ళి చదువుకునేవాణ్ణి. చూడు ఇప్పుడెలా అయిపోయానో”...


నిజమే అతని చేతుల మీద చర్మం ముడుతలు పడి ఉంది. కళ్ళు లోతుగా ఉన్నాయి. కానీ మొహంలో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.


“ఒరేయ్ పార్థూ, ఇలా రా,”


నాన్న ఆ బాక్స్ దగ్గర నిలబడి అరిచి మరీ పిలిచారు. నాకు గుండె ఆగినంత పనైంది. కొంపదీసి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారేమో అని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాను. ఎవరెవరో వస్తున్నారు. పెద్ద శిలువ పట్టుకొని, తెల్ల కోట్ తొడుక్కున్న ఒకాయన వచ్చారు. ఫాదర్ అట. దళసరి అద్దాలున్న కళ్ళజోడు సవరించుకుని తన చేతిలో ఉన్న బైబిల్ చదవడానికి పేజీలు తిరగేయసాగారు. నేను నాన్నగారి దగ్గరకి వెళ్ళాను.


“నా స్నేహితుడు కోటేశం. దణ్ణం పెట్టుకో, ఆఖరిసారి” అంటూ చెప్పడంతో అతని మొహం కేసి చూసిన నేను ఒక్కసారిగా అదిరిపడ్డాను.


ఇందాక టెంట్ లో కనిపించిన ప్రశాంతమైన మొహం గల ఆయనే... అంతే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్లు పడుకున్నారు. చూస్తూ ఉండగానే ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. ఒక నమస్కారం చేసి, టెంట్ లో కూర్చొన్న వాళ్ళందరిలో ఇందాక నన్ను పలకరించిన ఆయన్ని చూడాలని అనుకున్నాను. కానీ ఆయన ఎక్కడా కనపడలేదు. దాంతో ఒళ్ళంతా ఒక్కసారి నిస్సత్తువ ఆవహించింది. కడుపులో సాంబార్ ఇడ్లీ, మెలికలు తిరుగుతూ బయట పడబోతూ ఉంటే, పరుగు పరుగున టెంట్ కి బాగా దూరంగా వచ్చి, “ఇంకా ఆగలేను” అని మారాం చేస్తున్న ఆ పదార్థాన్ని రోడ్డు పక్కనే వదిలేసి, పక్కన నాకోసమే అన్నట్లు నిలబడిన వీధి కుళాయి నీళ్ళతో నోరూ, మొహమూ కడుక్కొని తిరిగి టెంట్ దగ్గరకి వచ్చేశాను.


“ఏమైందిరా, బాగోలేదా? శవాన్ని చూసావు కదా, అదీ మొదటిసారి భయమేయడం సహజమేరా పార్థూ!”


“నాన్నగారూ, ఒకటి అడగనా?” నాన్నగారి మొహంలోకి చూశాను.


“అడుగురా పార్థూ,” ప్లాట్ఫాం మీద విజయనగరం బస్ ఆగి ఉంటే ఎక్కమని చెప్పారు.


కండక్టర్ వెనకాల సీట్ లో కూర్చొన్నాను కిటికీ పక్కనే. “ఏదో అడుగుతాను అన్నావు” అన్నారు నాన్నగారు.


“ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారా?”


నా ప్రశ్న విని ఇదేం ప్రశ్న అని నా వైపు చూసినట్లు అనిపించింది. నాకు కూడా నా ప్రశ్న అర్థం లేనిది అనిపించింది కూడా.


“ఎందుకురా అలా అడిగావు? కొంపదీసి మా కోటేశం మళ్ళీ నీకు కనిపించి పలకరిస్తాడేమో అని భయమేసిందా?”


నాన్న ప్రశ్న వేశారో, నా ప్రశ్నకి జవాబు చెప్పారో అర్థం చేసుకోలేకపోయాను. “చిన్నపిల్లాడివి కదా! శవాన్ని చూసి భయపడినట్లున్నావు. అసలు నువ్వు ఊహించుకున్నవి ఎప్పుడూ జరగవు”, చెప్పారు.


నా ప్రశ్నకి ఆయన సమాధానం సరైనది కాదు అని నాకు అర్థమైంది. మౌనంగా కూర్చొన్నాను. బస్ పరుగులు తీస్తూ జూ పార్క్ దాటింది. “ఇంకోసారి మనం జూ చూద్దాం రా పార్థూ” అన్నారు నాన్న.


ఇంకా ఆ విషయం మాట్లాడకుండా ఇంటికి వచ్చేసి, తలస్నానం చేసి, బట్టలు మార్చుకుని కూర్చున్నాను. హోటల్ లో తిన్న సాంబార్ ఇడ్లీ బయటికి వచ్చేసాక ఎందుకో ఒళ్ళంతా కొంచెం వేడెక్కి, జ్వరం వచ్చినట్లు అనిపించింది. కోటేశం చనిపోయిన విషయం, నేను భయపడిన విషయం అమ్మతో చెప్పినట్లున్నారు నాన్న. అమ్మ నాన్నగారిని కోప్పడుతోంది.


అదేంటో అమ్మ చెప్పిన ఏ విషయాన్నీ నాన్న కాదు అనరు. అసలు ఆమె ముందు గట్టిగా మాట్లాడడం కూడా చూడలేదు నేనైతే. “చిన్నపిల్లాణ్ణి ఎక్కడికి తీసుకెళ్లవచ్చో ఎక్కడికి తీసుకెళ్లకూడదో మీకు బొత్తిగా తెలియలేదేమో, ఇప్పుడా ఫ్రెండ్ ని వాడికి చూపించకపోతే వచ్చిన నష్టమేముంది?” అమ్మ తనలో తానే గొణుక్కుంటూ నా పక్కనే కూర్చుంది.


“నేను బాగానే ఉన్నాను” అంటూ అమ్మకి చెప్పాను కానీ నా జ్ఞాపకాల్లో ఇంకా ఆ టెంట్ లో చూసిన మనిషి తాలూకు ఆకారం అలాగే ఉండిపోయింది.


రాత్రి ఎప్పుడు పడుకున్నానో తెలియదు. కానీ కొంతసేపటికి మళ్ళీ అదే ఆకారం... ఒక చెయ్యి నా తల మీద వేసి, “కాలం తొందరగా కరిగిపోతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మనిషి పరిపూర్ణమైన జ్ఞానం పొందుతాడు.”


ఆ చెయ్యి చల్లగా ఉంది. గట్టిగా ఒక కట్టెలాగా ఉంది. నల్లగా మాడిపోయినట్లు, అక్కడక్కడా తెల్లగా బూడిద అంటుకున్నట్లుంది ఆ చేతికి. ముఖం ముడుతలు పడిపోయి, కళ్ళు ముక్కు ఉండే ప్రదేశం గుంటలు పడి ఉంది. అయినప్పటికీ ఆ మొహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశాంతమైన చిరునవ్వు ఆ మొహం మీద ఉందేమో, అంత దగ్గర నుండి చూసినప్పటికీ, వెన్నులోంచి వణుకు పుట్టింది. ఒళ్ళంతా చెమటలు కారిపోసాగాయి. అతని మొహం నా మొహానికి చాలా దగ్గరగా ఉన్నట్లుంది.


“కెవ్వు...” మని అరుస్తూ లేచాను హటాత్తుగా. గది అంతా చీకటిగా ఉంది. ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. చేత్తో తడిమితే గట్టిగా, చల్లగా తగులుతోంది. బహుశా నేను కూడా చచ్చిపోయానేమో, అందుకే నన్ను కూడా బాక్స్ లో పెట్టి నేలలో కప్పేసారేమో... ఈ ఆలోచనే వెన్నులోంచి చలి పుట్టించింది.


“అమ్మా...” అని అరిచాను. నా అరుపు నాకే సరిగా వినపడ్డం లేదు. ఎక్కడో చిన్న లైట్ వెలిగినట్లు అనిపించింది.


బహుశా నన్ను కాల్చేస్తారేమో! ఎక్కడో అగ్గిపుల్ల కాలిన వాసన... “అమ్మా...” ఈ సారి బిగ్గరగానే అరిచాను.


“పార్థు భయపడినట్లున్నాడు. కరెంట్ పోయింది. లైట్ వెలిగించి తేవడానికి వెళ్ళాను నేను. కాసేపు వాణ్ణి చూసుకోవచ్చుగా... మొద్దు నిద్రా మీరునూ, పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలీదు. వాడు ఎలా భయపడిపోతున్నాడో చూడండి.”


అప్పటికే ఒంటిమీద చొక్కా చెమటతో తడిసిపోయింది. “పరవాలేదు నాన్నా... కరెంట్ పోతే లైట్ వెలిగించి వచ్చానురా, ఇదిగో ఈ నీళ్ళు తాగు” అంటూ అమ్మ కూర్చోపెట్టి గ్లాసుతో నీళ్లిచ్చింది.


అమ్మని గట్టిగా పట్టుకుని కూర్చున్నాను. పాపం అమ్మ. ఉదయం అంతా విశ్రాంతి లేకుండా పని చేసుకునే అమ్మ, అర్థరాత్రి లేచి భయపడిన నన్ను పడుకోమని చెప్పింది. అమ్మానాన్నల మధ్యలో పడుకున్నాను. కానీ నిద్ర పట్టలేదు. నాన్నగారు మాత్రం ఎప్పటిలా సంతృప్తిగా గురక పెడుతూ నిద్రపోతున్నారు.


ఉదయం ఎప్పటిలాగే అయిదు గంటలకి నిద్రలేచాను. అప్పటికే అమ్మ నిద్రలేచిందేమో గదులు ఒక్కోటి ఊడుస్తోంది.


“అమ్మా, మనుషులు చచ్చిపోయాక తిరిగి బతికి వస్తారా? చనిపోయిన వాళ్ళని కాల్చేస్తే మరి వాళ్ళకి ఒళ్ళంతా మంటలు పుట్టదా? అప్పుడు వాళ్ళు ఏడవడం లాంటివి ఉండవా?” అడిగాను.


“ఒరేయ్ పార్ధూ, ఉదయం లేచిన వెంటనే దేవుడి శ్లోకాలు చదువుకొని, దేవుడికి దణ్ణం పెట్టుకొని అప్పుడు మిగిలిన పనులు చేసుకోవాలని ఎన్నిసార్లు చెప్పానురా నీకు.”


ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ఉద్దేశం అమ్మకి లేనట్లుంది. కాసేపు అమ్మ సమాధానం కోసం ఎదురు చూసి, నా రొటీన్ లో పడిపోయి, నేను ఏం అడగాలనుకున్నానో, ఏం అడిగానో మరిచిపోయాను.


కొన్నాళ్ళ తరువాత బహుశా పదో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా ఈ విషయం అమ్మతో చెప్పాను. “ఛ... నీ మొహం, అదంతా నీ భ్రమ... చనిపోయినవాళ్ళు ఎలా బ్రతికి వస్తారు? చనిపోయాక ఆత్మ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ శరీరానికి ఎలాంటి స్పర్శ, లేదా ఎలాంటి కదలిక ఉండదు. ఒక కర్రలాగానో, ఒక రాయి లాగానో ఉంటుంది అంతే”... ఇంతకు మించి అమ్మకి చెప్పడం ఇష్టం లేదన్నట్లుగా టాపిక్ మార్చేసింది.


“ఒరేయ్ పార్థూ, హాస్టల్ లో జాగ్రత్త నాన్నా” కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది అమ్మ.


ఈ అయిదారేళ్లల్లో నిద్రలేని రాత్రులు, పీడ కలలతో భయపడిన రాత్రులు ఎన్ని గడిపానో నాకు గుర్తులేదు కానీ, అమ్మకి అవన్నీ చక్కగా జ్ఞాపకం ఉన్నాయి. విజయనగరం కోట దగ్గర ఉన్న దర్గాలో అప్పటికి ఎన్నిసార్లు మెడలో తాయెత్తు కట్టించిందో! ఎన్నిసార్లు పైడితల్లి అమ్మవారికి మొక్కుకుందో నాకోసం లెక్కే లేదు. నేను హాస్టల్ కి వెళ్తున్నాను అనేసరికి అమ్మ బెంగ పెట్టుకుంది, నేనేమైపోతానో అని. సూట్ కేస్ లో అందరూ దేవుళ్ల ఫోటోలు, ఆంజనేయస్వామి వారి సింధూరం పెట్టాను. “పడుకునేముందు రోజూ ఆంజనేయ దండకం చదువుకొని బొట్టు పెట్టుకో...” కదులుతున్న బస్ వెనకాలే నడిచింది అమ్మ.


నేను ధైర్యంగానే ఉంటాను, నువ్వు జాగ్రత్త అంటూ అమ్మకి చెప్పి కూర్చున్నాను. బస్ స్పీడ్ అందుకుంది. “వైజాగ్ టికెట్ ఇవ్వండి” అంటూ కండక్టర్ ని అడుగుతున్న గొంతు వినేసరికి ఉలిక్కిపడ్డాను.


ఎక్కడో విన్నట్లుంది ఈ గొంతు. చాలా రోజుల తరువాత మళ్ళీ వినపడింది. ఒక్కసారిగా కండక్టర్ వైపు తిరిగి చూశాను. అక్కడ ఎవరూ కనపడలేదు. అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. బస్ దిగేవాళ్ళని గమనించడం మొదలుపెట్టాను. కానీ నాకు ఎవరూ కనపడలేదు. బస్ చివరికి ద్వారకా బస్ స్టేషన్ దగ్గర ఆగింది. ఒక్కొక్కరుగా బస్ దిగిపోయారు. అందరికంటే ఆఖరిగా దిగినప్పుడు చుట్టూ కలయచూశాను. ఎవరూ కనపడలేదు. కాలేజీకి వెళ్ళడం, అక్కడినుండి హాస్టల్ కి వెళ్ళి, నాకు ఇచ్చిన రూమ్ లో మిగిలిన వాళ్ళని కలిసి మాట్లాడడం, బట్టలు సర్దుకోవడంతో ఆ విషయం మరిచిపోయాను.


హాస్టల్ లో చేరిన కొత్తలో బాగానే చూసుకుంటారు.


కొన్ని రోజులయ్యాకా మనకి నిజమైన నరకం అంటే కనిపిస్తుంది, ఒకరిద్దరు సీనియర్లు చెప్తూ ఉంటే, ఇంటికి దూరంగా వచ్చేసి తప్పుచేశానేమో అనిపించింది. కాలేజీ చదువుల్లో పడి గత అనుభవాలను, పీడకలను చాలావరకు మరిచిపోయాను. రెండ్రోజులు బాగానే గడిచాయి. ఒకరోజు రాత్రి ఫ్రెండ్స్ రూంలో ఏదో హారర్ టాపిక్ మాట్లాడుతున్నారు. వినడం ఇష్టం లేక చదువుతున్న బుక్ పక్కన పడేసి, కళ్ళు మూసుకుని ఆంజనేయ దండకం చదువుకుంటూ పడుకున్నా.


ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. పక్కనే బెడ్ మీద ఎవరో పడుకున్నారని అనిపించి కళ్ళు తెరిచి చూశాను. బయట వెన్నెల కిటికీలోంచి నా బెడ్ మీద పడుతోంది. ఎవరో కిటికీ బయట ఉన్నట్లు అనిపించి భయమేసింది. రూంలో మిగిలిన ఇద్దరూ అప్పుడే పడుకున్నారేమో గురక శబ్దం వినిపిస్తోంది. కిటికీలోంచి లోపలికి వచ్చినట్లుంది ఆ ఆకారం.


తలమీద చెయ్యేసి, “కాలం వృధా చేయకు పార్థూ, నువ్వు బాగా ఎదిగితే నీ చుట్టూ పదిమంది తిరుగుతారు. లేదంటే నీ వాళ్ళే నిన్నొదిలేస్తారు.”


చల్లని ఆ చెయ్యి, బాగా బరువుగా అనిపించసాగింది. చేయి తోసేద్దామని గట్టిగా విదిలించా, పక్కన పడుకున్నవాడి మొహం మీద తగిలిందేమో, “అమ్మో, చచ్చాను”... అంటూ ఒక్క గావు కేక పెట్టి లేచి కూర్చున్నాడు. నేను పక్కకి తిరిగి ఏమీ తెలియనట్లు పడుకున్నాను. పాపం వాడూ చేసేదేం లేక పడుకున్నాడు సైలెంట్ గా.


అడపాదడపా పీడ కల రావడం, అందులో ప్రశాంతంగా ఉన్న కోటేశం గారి ముఖం కనపడడం, ఏదో చెప్పడం, నేను రెండు మూడు రోజులు తీవ్రంగా ఆలోచించి ఆ తర్వాత మరచిపోవడం మామూలైపోయింది. ఇలాంటి అనుభవాల మధ్య ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాను ఆంధ్రా యూనివర్సిటీలో. టెలికాం డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది, అదీ మన ఊళ్లోనే అని అమ్మానాన్నలకి చెప్తే వాళ్ళ కళ్ళల్లో సంతృప్తి, సంతోషానికి హద్దుల్లేవు.


“మిమ్మల్ని ఒకటి అడగనా నాన్నగారూ,” ఒకరోజు ఉదయాన్నే అడిగాను.


“ఏంట్రా అది?” అడిగారు.


“ఇంతకీ చనిపోయినవాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? మీ ఫ్రెండ్ కోటేశం గారు నా వెంట పడ్డారెందుకు? ఇప్పటికీ కలల్లో కనిపిస్తారు. అప్పుడప్పుడు ఎవరితోనూ మాట్లాడుతూ తన గొంతు వినిపిస్తారు. ఆ గొంతు ఎలా ఉంటుందంటే, ఆ రోజు నేను టెంట్ లో కూర్చొన్నప్పుడు నాతో మాట్లాడిన ఆయన గొంతులా ఉంటుంది. మీ ఫ్రెండ్ మొహం చాలా ప్రశాంతంగా ఆ బాక్స్ లో ఉన్నప్పుడు ఎలా ఉందో, అలాగే కనిపిస్తోంది. ఇంతకీ చనిపోయినవాళ్ళు తిరిగి మళ్ళీ వస్తారా అలాగా?”


నా ప్రశ్నకి సమాధానం ఎప్పటిలాగే దొరకలేదు. నాన్నగారు నవ్వేసి, “వచ్చే ఆదివారం మనం వైజాగ్ వెళ్ళొద్దాం. కోటేశం ఇంటికి” చాలా కూల్ గా చెప్పిన ఆ సమాధానానికి నాకు భయమేసింది.


“మనకి ఏమైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేసుకోవాలి, లేదంటే అవి కోటేశం నిన్ను భయపెట్టినట్లే నీ వెంటే తిరుగుతాయి” చెప్పారు నాన్న.


“చాల్లెండి, వాణ్ణి ఇంకా ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేరు”, నాన్నగారి మీద విసుక్కుంది అమ్మ.


ఆదివారం ఉదయాన్నే వైజాగ్ బయల్దేరమని తొందర పెట్టారు నాన్న. ఇద్దరం కలిసి నా బైక్ మీద వెళ్దాం అన్నాను. చక్కగా బస్ లో వెళదాం అన్నారు. అమ్మని కూడా బయల్దేరదీశారు. సాధారణంగా ఎక్కడికీ కదలని అమ్మ ఏం జరగబోతోందో చూద్దామని కుతూహలంగా బయల్దేరినట్లుంది. పదకొండు గంటలకి విశాఖ బస్ కాంప్లెక్స్ లో దిగి ఆటోలో కోటేశం గారింటికి చేరుకున్నాం.


కోటేశం గారి భార్య బాగా వయసు మీద పడిపోయినట్లు అయిపోయారు. నాన్నగారిని చూడడంతోనే, “అన్నయ్యగారూ బాగున్నారా” అంటూ గౌరవంగా అభిమానంగా పలకరించారు.


కొద్ది క్షణాల్లోనే అమ్మ కూడా ఆవిడతో బాగా కలిసిపోయింది.

గోడమీద కోటేశం గారి నిలువెత్తు చిత్రపటం... దాన్ని చూసేసరికి ఆనాటి జ్ఞాపకాలు ఒక్కసారి మెదడులో గిర్రున తిరగసాగాయి.


“అవునూ, ఏడీ మీ మరిదిగారు, వాళ్ళవిడని పిల్లల్ని తీసుకొస్తానని మాటిచ్చాడు నాకు. ద్వారకానగర్ ఇక్కడికేమీ దూరం కూడా కాదు కదమ్మా” అన్నారు నాన్నగారు.


పది నిమిషాల్లో ఇంటిముందు ఆటో ఆగిన శబ్దమయింది. ఆటోలో దిగిన వాళ్ళల్లో ఉన్నాయన్ని చూసి అదిరిపడ్డాను. కొంచెం భయమేసి, అమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాను. సాక్షాత్తూ కోటేశం గారే వచ్చినట్లు అనిపించింది. “ఆ రోజు టెంట్ లో నాతో మాట్లాడింది ఈయనే” అమ్మతో చెప్పాను.


“కోటేశంకి వీడు తమ్ముడు. ఇద్దరూ కవలలు. వీడి పేరు రాఘవరావు.” పరిచయం చేశారు నాన్నగారు.


నాకు అంతా అయోమయంగా అనిపించింది.


“మా అబ్బాయి పార్థు. కోటేశం చనిపోయినప్పుడు వీడితో నువ్వు మాట్లాడావుట. నువ్వు వాడూ అచ్చంగా ఒకేలాగా ఉండడంతో వీడు కోటేశమే వచ్చి పలకరించాడని భయపడ్డాడు. ఆ భయం ఇప్పటిదాకా వాడి మనసులోనే ఉండిపోయింది.” నాన్నగారు నవ్వుతూ ఉంటే, “కోటేశం తమ్ముడు రాఘవ అనే వ్యక్తి ఉన్నాడని నాకెందుకు చెప్పలేదు అప్పుడే?” నెమ్మదిగా అడిగాను నాన్నగారిని.


నాన్నగారు చిన్నగా నవ్వేసి ఊరుకున్నారు. నా ప్రశ్నకి నన్నే జవాబు చెప్పుకోమన్నట్లు.


“ఇది మా అమ్మాయి లత. మొన్నే ఎంబీఏ పూర్తి చేసింది” అన్నారు రాఘవరావు గారు.


అమ్మాయి చూడముచ్చటగా ఉంది. “మీ స్నేహం, దూరపు బంధుత్వం ఈ అమ్మాయిని మన ఇంటి కోడల్ని చేస్తే ఎంత బాగుంటుంది” నాన్నగారితో నెమ్మదిగా చెప్పింది అమ్మ.


“నిజమే అమ్మాయి చాలా చక్కగా ఉంది. నీ అభిప్రాయం ఏంటి?” అన్నట్లు చూశారు నాన్న.



“మరి రాఘవరావు గారు ఇంకెప్పుడు నన్ను భయపెట్టను అంటే, ఈ అమ్మాయిని చేసుకోవడం నాకూ ఇష్టమే” అన్నాను. అప్పటికే నా సంగతి తెలిసిన లత నా అనుభవం తెలిసి పకపకా నవ్వేసింది.


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ P. గోపాలకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

P. గోపాలకృష్ణ

రచయిత పరిచయం: P. గోపాలకృష్ణ

ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna/profile

యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page