'Appaginthalu' written by Bodapati Ramesh
రచన : బోడపాటి రమేష్
“అమ్మాయ్ సుశీలా! తలుపెవరో కొడుతున్నారు చూడమ్మా” అన్నాడు పూజ చేసుకుంటున్న రాఘవరావు.
“ఆ వెళ్తున్నా . ఎప్పుడూ ఎవరో ఒకరు రావటం! తలుపు తీయలేక చస్తున్నాను. క్షణం తీరిక ఉండదు “ సణుగుతూ వెళ్ళి తలుపు తీసింది సుశీల.
“రాఘవరావుగారున్నారా అమ్మా” అన్నాడు లోపలికి వస్తున్న ఆగంతకుడు.
“ఉన్నారు లోపలికి రండి. నాన్నా! నీ కోసం ఎవరో వచ్చారు.”
“పరంధామయ్య వచ్చాడని చెప్పు, ఏలూరు నుంచి వస్తున్నాను.”
పట్టు పంచలో మెరిసిపోతూ తన వద్దకు వస్తున్న వ్యక్తిని చూస్తూనే,
“రాఘవరావు గారు తమరేనాండి”అంటూ నమస్కారం పెట్టాడు పరంధామయ్య.
´ “కూర్చోండి. నుంచునే మాట్లాడుతున్నారు. అమ్మాయ్ సుశీలా! కాసిని మంచి నీళ్ళు
తీసుకురా”
లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి.
“మీ అమ్మాయా?”
“అవునండి. మా రెండో అమ్మాయి. పెద్దమ్మాయిని ఘనంగా కట్నం ఇచ్చి నాలుగేళ్ల
కిందటే పెళ్లి చేశాను. అల్లుడిది మంచి ఉద్యోగం . ఇది రెండోది.”
“చాలా సంతోషమండి. ఇక నేను వచ్చిన పని చెపుతాను. మా అమ్మాయి పెళ్ళికి
ఉంది. పేరు శ్రీదేవి. నా పెళ్ళయిన కొత్తల్లో శ్రీదేవి సినిమాలు బాగా చూసేవాణ్ణి . అందుకని
మా అమ్మాయికి ఆపేరు పెట్టాను.”
“ఏమోయ్. ఇట్రా ఒకసారి. మన అబ్బాయి కోసం వచ్చారు” గట్టిగా కేక పెట్టాడు
రాఘవరావు.
“మా అమ్మాయి వయసు...”
“ఏమోయ్ ఇటు రావేం . గొంతు చించుకుని అరుస్తున్నా వినబడటం లేదా” ఈ సారి
స్వరం పెంచాడు రాఘవరావు.
“ఎందుకండి గావుకేకలు. నెమ్మదిగా పిలిస్తే రానూ” విసవిసా నడుస్తూ వీళ్ళ గదిలోకి
వచ్చింది సుభద్ర, ఈయన గృహిణి..
“ఈయన పరంధామయ్యగారని ఏలూరు నుండి వచ్చారు, మన రవికి , వాళ్ళ
అమ్మాయి శ్రీదేవిని అడగటానికి.”
“మరి చెప్పరేం! కూర్చోండి అన్నయ్యగారూ. అమ్మాయి సుశీలా.. కాసిని మంచి నీళ్ళు
తీసుకురా. ఆ చేత్తోనే ఒక కప్పు కాఫీ కూడా తీసుకురా. ఇంతకీ అమ్మాయి ఎరుపా,
నల్లటమ్మాయయితే మాటలనవసరం . మా అబ్బాయి పచ్చని పసిమి. మంచి పొడుగు.”.
ఇంతలో మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చి లోపలికి వెళ్లిపోయింది సుశీల.
కాఫీ కనుచూపు మేరలో లేదు. మంచి నీళ్ళే మహా ప్రసాదం అనుకుని గటగటా
తాగేశాడు, పరంధామయ్య.
“సుబ్బూ కాస్త నువ్వు తగ్గుతావా . నన్ను మాట్లాడ ......”
“ఓసీ నీ ఇల్లు బంగారం గాను పాలు స్టౌవ్ మీద పెట్టి ఎక్కడికి పోయావే. అబ్బబ్బ ఒక్క
క్షణం స్థిమితంగా ఉండనివ్వరు” అనుకుంటూ నిష్క్రమించింది సుభద్ర.
గాలివాన తెరిపిచ్చినట్లయింది, అక్కడ కూర్చున్నవాళ్లకు.
“ఇదండీ మా సుభద్ర వరస. ఎప్పుడు ఏదో ఒకటి సణుగుతూనే ఉంటుంది. అసలు
మాట్లాడటమే తనకు వ్యాయామం. అమ్మాయి వివరాలు చెప్పండి.”
“ నాకున్నది ఒక్కటే కూతురు.పేరు శ్రీదేవి అని చెప్పాను కదా! అబ్బా.. ఆ శ్రీదేవి
ఉంది చూశారు.. భలేగా వేసేది, ఈమధ్య రావటం లేదు కానీ” మగతలోకి వెళ్లిపోయాడు
పరంధామయ్య.
“చూడండి. శ్రీదేవికి పెళ్లయింది. పిల్లలు కూడా పుట్టారు. మీ అమ్మాయికి ఇంకా
పెళ్ళే అవలేదు. నాకవతల చాలా పనులున్నాయి విషయం తొందరగా చెప్పండి”.
“నన్ను ఖంగారు పెట్టకండి అమ్మాయి వయసు ఇదివరకే చెప్పాను కదా. టెన్త్ తో
చదువాపేసింది. చదువులో కొంచెం మందం. కానీ పనీపాటలు బాగా తెలిసిన పిల్ల. వంట,
కుట్టు నేర్చుకుంది సంగీతం పాడుతుంది. టి.వి.లు సినిమాలు అంటే చెవి కోసుకుంటుంది.
తిండి కూడా అక్కర్లేదు. మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారని తెలిసి వచ్చాను. ఇంతకీ
అబ్బాయి ఏం చేస్తున్నాడు?”
“ఏం చమత్కారమండి? అబ్బాయి ఏంచేస్తున్నాడో తెలుసుకోకుండానే వచ్చారా.
మా అబ్బాయికి ఫలానా ఆఫీసులో లో ఉద్యోగం. జీతం మగవాడు కాబట్టి చెప్పకూడదు.
అయినా పైన బాగానే వస్తుంది.”
“అవును లెండి అవి లేకపోతే ఈరోజుల్లో బతకటం చాలా కష్టం. అబ్బాయి ఏం
చదివాడు? "
””అబ్బాయి వయసు 28 నడుస్తోంది. వాడి పెద్ద చెల్లెలు పెళ్లయ్యేదాకా తను పెళ్లి
చేసుకోనని భీష్మించుక్కూర్చున్నాడు. అందువల్ల కొంచెం ఆలస్యమయింది. మా
పెద్దమ్మాయి పెళ్ళయి నాలుగేళ్లయింది కదా అని మీరనుమానపడొచ్చు. పెళ్ళయిన
చెల్లెలు ఎప్పుడూ పురిట్లోనే ఉంటుంది. నన్నయినా కాస్త సుఖంగా ఉండనివ్వండి అంటాడు.
ఏమిటోనండి ఈ కాలం పిల్లలు ఒక పట్టాన అర్ధం కారు. ఇంతకీ అమ్మాయికి మీరు ఎంతవరకు
పెట్టదల్చుకున్నారు. అదేదో ముందుగానే తేల్చుకుంటే పిల్లని తర్వాత చూడవచ్చు.”
‘ఈయనెవరో అసాధ్యుడి లాగా ఉన్నాడు. ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా
ఉంది వ్యవహారం. ఇంతవరకు అమ్మాయి, అబ్బాయి ఒకళ్లనొకళ్లు చూసుకోలేదు. అప్పుడే
డబ్బు ప్రసక్తి’ అనుకుంటూ
“అయ్యా నేను ఇంత అని ముందుగా చెప్పను. అబ్బాయిని బట్టి ఉంటుంది”
అంటూ ఒక అంకె చెప్పాడు.
“అబ్బే ఎంత మాత్రం కుదరదండి. మీరింకా వెనకటి రోజుల్లోనే ఉన్నారు. ఈరోజుల్లో
టెన్త్ తప్పినవాడే చెవులు మెలేసి మీరు చెప్పిన దాని కంటే ఎక్కువ పుచ్చుకుంటున్నారు.
మరి డిగ్రీ చదివిన మా వాడు మీరు చెప్పిన అంకెకు రాడండి. ఎవరయినా వింటే సిగ్గుచేటు”
అంటూ లోపలికి వెళ్లిపోయాడు.
లోపలికి వెళ్ళిన మనిషి ఎంతకీ తిరిగి రావటంలేదు. తను ఉండాలో వెళ్ళాలో
పరంధామయ్యకు అర్ధం కాలేదు. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. రోజులు
మారుతున్నా ఆడపిల్ల తండ్రికి అగచాట్లు తప్పటం లేదు.
రాఘవరావు వచ్చాడు ఏవో కాగితాలు పుచ్చుకుని, దుమ్ము దులుపుతూ ”అబ్బా
ఎప్పట్నుంచో ఉంచాను. ఎంత దుమ్ము పట్టినాయో. కాస్త మీ కుర్చీ దగ్గరకి జరుపుకోండి.
ఇవి ఎల్.కే.జి. రసీదులు , ఇవి యూ.కే.జి. వి ....ఇవి ఇంటర్ వి.”
ఇలా చూపిస్తూనే ఉన్నాడు. పరంధామయ్యకు విషయం అంతు పట్టటం లేదు.
తానొచ్చినా పనికి వీటికి సంబంధం ఏమిటి?
అతని ఆలోచనల్ని చదివేసినట్టుగా
“ఇవన్నీ మీకెందుకు చూపిస్తున్నాననే అనుమానం రావచ్చు. ఇంకా చాలా
రసీదులు, రసీదుల్లేని డొనేషన్లు ఉన్నాయి. ఇంతకీ ఎందుకు చూపించానంటే.....”
“వద్దు మహానుభావా విషయం అర్ధమయింది. మీ అబ్బాయి చదువుకు ఖర్చు
పెట్టిందంతా వసూలు చేసుకుందామనుకుంటున్నారు. మరి నేనూ ఖర్చు పెట్టాను.
పెళ్ళిచూపులకి ఎప్పుడొస్తారో చెపితే ఆ ఏర్పాట్లలో ఉంటాను.”
“నిదానం పరంధామయ్యగారూ! మనం ఇచ్చిపుచ్చుకోటాల గురించి ఒక మాట
అనుకుంటే పెళ్ళిచూపులదేముంది. ఇదయినా ఎందుకు అడుగుతున్నానంటే, పెళ్ళయిన
తర్వాత మా అబ్బాయి మమ్మల్ని చూస్తాడని చెప్పలేం కదా. ఈ కాలం పిల్లలు. అందుకని
వాడిమీద పెట్టిన సొమ్ము రాబట్టుకుంటే తరువాత ఏమయినా అంత
బాధుండదు. ఏమంటారు?”
“మీరంతా విపులంగా అరటిపండు వలిచినంత స్పష్టంగా చెప్పిన తర్వాత
నేనేమంటాను. ఏదో మీ కుటుంబం మంచిదని ఆశ పడి వచ్చాను. ఆ తర్వాత మీ దయ.
పైవాడి కటాక్షం. అంటూ తన ఆడ్రస్ ఇచ్చి వెళ్లిపోయాడు, పరంధామయ్య.
‘శ్రీదేవి’ కబుర్లకు పడిపోతాననుకున్నాడు పిచ్చి మానవుడు’ అని నవ్వుకున్నాడు
రాఘవరావు.
మొదట్లో చెల్లెలు పెళ్లయ్యెదాకా తన పెళ్లి వద్దని గునిసినా తండ్రి బలవంతం మీద
పెళ్లి చూపులకి ఒప్పుకున్నాడు, రవి. రాఘవరావు దంపతులు, రవి, సుశీల ,పెద్ద కూతురు
రమ ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి అమ్మాయిని చూడటానికి వెళ్లారు. ముందుగానే కబురు
అందుకున్న అమ్మాయి తండ్రి అన్నీఏర్పాట్లు చేశాడు.
కాఫీలు గట్రా ముగిసిన తర్వాత తనని పిలవటంతో శ్రీదేవి వీళ్ళున్న గదిలోకి
వచ్చింది. అమ్మాయి వస్తున్నప్పుడే ఆమె ఎలా నడుస్తోంది తలకట్టు లాంటి శల్యపరీక్షలు
చేశారు, సుభద్ర, ఆమె కూతుళ్ళు.
తల్లిదండ్రుల మామూలు ప్రశ్నల అనంతరం రవి మాట్లాడటం ప్రారంభించాడు.
“ఏం చదువుకున్నారండి మీరు?.
“అమ్మా చూడమ్మా అక్కయ్య గిచ్చుతోంది” అంటూ ఫిర్యాదు చేసింది రమ
రెండోకూతురు తల్లితో.
“ఎందుకే దాన్ని గిచ్చావు?” అమ్మమ్మ ఆరా.
“చూడమ్మా వాళ్ళిచ్చిన కాఫీ ఎలా పారబోసిందో, సోఫా అంతా ఖరాబయిపోయింది.”
“పోస్తే ఏం. తుడిచేశానుగా.”
“ ఏమిటర్రా ఎక్కడికొచ్చినా అల్లరి చేయటమే. అసలు మిమ్మల్ని ఇంకెక్కడికి
తీసుకురాను”
“చూడండమ్మా అత్త మాట్లాడుతుంది వినండి” అని సర్దిచెప్పింది శ్రీదేవి తల్లి.
తను అడిగిన ప్రశ్నే మళ్ళీ అడిగాడు.
"టెన్త్ పాసయ్యానండి.”
“మరి తర్వాత ఆపేశారేం?”
“అది పాసయ్యేటప్పటికే మూడేళ్లు పట్టింది. దానితో చదువు మీద విసుగు పుట్టింది.
టి.వి.లు సినిమాలు కాలక్షేపం. అన్ని ప్రోగ్రాములు చూస్తాను. అన్నట్టు మీ ఫేవరెట్ హీరో
ఎవరండి. నా కయితే పవన్ కళ్యాణ్. మరి మీకు?”
ఈ ధోరణిని చూసి అంతా విస్తుపోయారు. అమాయకురాలో, గడుసుదో అర్ధం కావటం
లేదు. అర్ధమయింది ఒకరికే రాఘవరావుకు. సినిమాల విషయంలో తండ్రి పొలికే
వచ్చిందనుకున్నాడు.
రవి మాత్రం” మీకెవరిష్టమయితే నాకు వాళ్ళే ఇష్టమండి” అన్నాడు నవ్వుతూ.
“అలాగంటే ఎలా. ఒకరి ఇష్టం గురించి రెండోవాళ్ళ ఇష్టం మార్చుకుంటారా. అవును..
మీరు సిగరెట్లు తాగుతారా? పొగ తాగే వాళ్ళంటే నాకు అసహ్యం . ఆ వాసన నాకు పడదు.”
ఇక ఈ వ్యవహారం ఆపుదామని , ”మనం బయలుదేరదాం పద” అంటూ రాఘవరావు
అందర్నీ బయలుదేరదీశాడు..
రవి, శ్రీదేవి కళ్ళతోనే వీడ్కోలు చెప్పుకున్నారు
రవి నడవడి, ప్రవర్తన పరంధామయ్య దంపతులకు నచ్చాయి. ముఖ్యంగా
శ్రీదేవికి. అతనికి సినిమాల గురించి పట్టింపు లేదు.
పరంధామయ్య కూడా తన స్నేహితుల ద్వారా రవి గురించి ఆరా తీసి వాళ్ళది
మంచి సంబంధమే అని నిర్ధారించుకున్న తర్వాత ‘మీకు అమ్మాయి నచ్చితే నేను వచ్చి
మిగతా విషయాలు మాట్లాడతానని’ రాఘవరావుకు చెప్పాడు.
రవి ఇంట్లో మాత్రం ఈ విషయంలో మూడు అహోరాత్రాలు తర్జనభర్జనలు
జరిగాయి.
“ఆ పిల్ల మరీ గయ్యాళిలా ఉందిరా. సిగ్గూశరం లేకుండా అన్ని ప్రశ్నలు వేసింది.
అటువంటి మనిషితో వేగటం చాలా కష్టం రా” అన్నది సుభద్ర
“అవునవును చాలా కష్టం” అన్నాడు రాఘవరావు స్వానుభవంతో.
సుభద్ర ఉరిమురిమి చూసింది.
“అంటే నేను గయ్యాళినా?"
“పెళ్ళయిన తర్వాత మీ ఇంటి ఛాయలకు కూడా రానివ్వదేమో రా ఈ అమ్మాయి”
అన్నది రమ,
సుశీల మద్దతుగా తల ఊపింది.
“నేను మాత్రం ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నాన్నా” అన్నాడు రవి.
రాఘవరావు సరే అన్నాడు. ఎందుకంటే అమ్మాయి తండ్రి తను చెప్పిన
షరతులన్నిటికి ఒప్పుకున్నాడు. ఈ పెళ్లి జరిగితే వచ్చే డబ్బులతో రెండో అమ్మాయి పెళ్లి
నిశ్చింతగా చెయ్యొచ్చు అనేది ఆయన ఆశ.
******
“ పెళ్లికూతుర్ని తీసుకురండి.”
“వాయించండోయ్ భజంత్రీలు.”
. ఇటువంటి హడావుడిల మధ్య రవి, శ్రీదేవిల పెళ్లి జరుగుతోంది.
పెళ్లి ఘనంగానే మగపెళ్ళివారికి ఎటువంటి లోపం జరగకుండానే జరుగుతోందని
చెప్పవచ్చు.
పెళ్లి మంటపం లో పొగల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, వధూవరులు.
“ఎందుకమ్మా ఇంత కష్టపెడుతున్నావు. ఇదంతా అయ్యేసరికి నా కళ్ళు
పోయేట్టున్నాయి “అన్నాడు రవి ముక్కెగబీలుస్తూ.
“ఇంత మాత్రానికే కష్టమనుకుంటే ఎలాగండి. మన ఆచారాలు వదిలేయలేం కదా.
అసలు సినిమాల్లో హీరోలకయితే ఎందరినో తంతే కానీ హీరోయిన్ తో పెళ్లి కాదు. మీరయితే
ఎవరినీ కొట్టకుండానే మన పెళ్లయిపోతోంది. ఇంకెంతసేపు లెండి. తర్వాత మనం హాయిగా
పాటలు పాడుకుంటూ తిరగొచ్చు” అని తాపీగా సమాధానం చెప్పింది శ్రీదేవి , తను కూడా
ముక్కెగబీలుస్తూ.
ఆమె సమాధానం రవిని ఖంగారు పెట్టింది. ఈ అమ్మాయికి సినిమా పిచ్చి ఎక్కువే
అనుకున్నాడు.
పెళ్లి లో తుది ఘట్టం అప్పగింతలు మొదలయినాయి.
ఈ అప్పగింతలనేవి పెద్ద ప్రహసనం. ఎక్కడెక్కడివాళ్లు వంతులేసుకుని మరీ
ఏడుస్తారు. తల్లి, తండ్రి బాధ పడి ఏడ్చారంటే అర్ధం ఉంది. చిన్నప్పట్నుంచి పెంచి
పెద్ద చేసిన కూతురు తమని వదిలి వెళ్లిపోతోందని దు:ఖపడటం సహజం. కానీ పెళ్ళికి
వచ్చిన బంధువులు ?
“అమ్మా” అంటూ బావురుమంది, తల్లిని వాటేసుకుని శ్రీదేవి.
రవి నాయనమ్మకు శ్రీదేవిని అప్పగించారు. ఇంతలో ఏడుపు ఆపుకుంటున్న శబ్దం
వినిపించింది. ‘ఎవరా’ అని చూస్తే పరంధామయ్య.
“ఊరుకోండి అన్నీ తెలిసిన మీరే ఇలా బెంబేలు పడిపోతే. ఎలా నవ్వుతూ
సాగనంపండి అమ్మాయిని “అని సర్దిచెప్పబోయారు.
“కూతుర్ని గురించి కాదండీ నా బాధ. అది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. కానీ
అమ్మాయి పెళ్లి కయిన ఖర్చుతలుచుకుంటే ఏడుపాగటం లేదు” అన్నాడాయన.
అందరూ నవ్వుకున్నారు.
ఇంకొక వైపు నుంచి పెద్దగా ఏడుపు, ఎవరో పోయినట్టుగా.
సుభద్ర ఏడుస్తోంది. అందరూ ఆవిడ చుట్టూ చేరారు.
“ ఏమయ్యిందే” అన్న భర్త ప్రశ్నకు
“అంతా అయిపోయిందండి . మన కొడుకు చెయ్యి దాటి పోతున్నాడు. మనకా ఒక్క
కొడుకు. ఆ అమ్మాయి మన వాళ్ళని సరిగా చూస్తుందో ఆడపడుచుల్ని ఆదరిస్తుందా .
అమ్మాయితో మనవాడు ఎలా వేగుతాడోనని తలచుకుంటే భయమేస్తోంది.”
సుభద్ర ఏడుపాగటంలేదు.
“చూడు సుబ్బూ, కొడుకయినా కూతురయినా రెక్కలు రాగానే ఎగిరిపోయేవారే. ఎక్కడున్నా
వాళ్ళ మంచి కోరుకోవాలి కానీ ఇలా ఏడవటం తప్పు. పద కొత్త జంటని మనింటికి తీసుకెళదాం.
మనబ్బాయి ఒక ఇంటివాడయ్యాడని ఆనందించక ఇలా ఏడుస్తావా, పిచ్చిదానా” అంటూ
భార్యను సముయిదాయించాడు రాఘవరావు.
అంతా నవ్వుకున్నారు, ఆవిడ అమాయకత్వానికి. కానీ ఆవిడ బాధలో అర్ధముంది
కదా.
@@ @@.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
Comments