ఆపరేషన్ – ఆనియన్
- Karlapalem Hanumantha Rao

- 22 hours ago
- 4 min read
ఆపరేషన్ ఆనియన్, Operation Onion, Telugu satire story, onion price satire, కర్లపాలెం హనుమంతరావు, Telugu humorous story, political satire Telugu, vegetable price inflation, onion crisis story, Telugu social satire, Telugu comedy satire, contemporary Telugu fiction, satirical short story Telugu, inflation humor

Operation - Onion - Telugu Humorous Satirical Story | Karlapalem Hanumantha Rao
ఆపరేషన్ – ఆనియన్ - తెలుగు హాస్య వ్యంగ్య కథ | కర్లపాలెం హనుమంతరావు
Published In manatelugukathalu.com On 11/06/2026
ఏటా దసరా పండక్కి మా ఊళ్ళో రివాజుగా జరిగే జాతరలో ముఖ్య ఆకర్షణ తిండిపోతుల పోటీ. చెయ్యి ఆపకుండా.. అరగంటలో ఎవరెక్కువ ఇడ్డెన్లు చట్నీల్లేకుండా లాగిస్తాడో వాడు 'భీముడు'. వంద కొబ్బరికాయలను ఒంటి చేత్తో పగలేసి లోపలి గుజ్జు, నీళ్ళతో సహా స్వాహా చేసినవాడు 'బకాసురుడు'. తొక్క వలవకుండా అరటి పండ్లు తినడం, పెంకు తీయకుండా కోడిగుడ్లు నమలడం లాంటి విన్యాసాలన్నీ మా దగ్గర ప్రోత్సహించే విద్యలు. ఐఐటీలో దేశంలోనే మొదటి ర్యాంకొచ్చినా, నెలకి రెండు కోట్లొచ్చే ఉద్యోగం సాధించినా మేం పెద్దగా పట్టించుకోం. కానీ జాతర తిండిపోతుల పోటీలో విజేతలైతే మాత్రం బ్రహ్మరథం పట్టాల్సిందే. ఎంత పెద్ద నాయకుడైనా ఎన్నికల ప్రచారానికి మా ఊరొస్తే తమ వెంట స్టార్ క్యాంపెయినర్లను కాకుండా, మా ఊరి భీమయ్యనో, బకాసురుణ్ణో పక్కన పెట్టుకోవాలని చూస్తారు. వాళ్ళు పక్కనుండి చెయ్యూపితే చాలు, ఓట్లు వాటంతట అవే రాలతాయని గట్టి నమ్మకం.
"మీ బకాసురుణ్ణి, భీముణ్ణి ఒక్క నెలరోజులు మా వైపుకి వచ్చి పొమ్మనండి, బక్కాసురులుగా మారడం ఖాయం!" అన్నాడు పక్కూరి మిత్రుడు.
"ఇన్ని కరవులొచ్చాయి, తుఫానులొచ్చాయి. ఐనా మా ఊరి తిండిపోతుల జిహ్వపుష్టిని అవేమీ చెయ్యలేకపోయాయయ్యా!" అన్నాను గర్వంగా.
"ఆహాఁ! మా రైతుబజారు పక్కన మొన్నీమధ్య నడిరోడ్డు మీద సగం తెరిచిన చేతి సంచీ ఒకటి పడి ఉందన్న వార్త పెద్ద సంచలనం సృష్టించింది. ఆ కథ మీదాకా వచ్చినట్లు లేదు. అందుకే ఈ దసరా సోదంతా!"
"ఆ సంచీలో బాంబులేవో ఉండుంటాయిలేవయ్యా! దానికీ మా తిండిపోతుల కథకీ సంబంధమేముంది?"
"ఉంది కాబట్టే ఇప్పుడీ ముచ్చట. అది తెలుసుకోవాలంటే ముందుగా ఆ సంచీలో దొరికిన 'తొక్క సందేశం' ఏంటో ఓపిగ్గా వినాలి!"
"మధ్యలో ఈ తొక్క సందేశం ఏమిటి మహానుభావా?"
"ఆ సంచీలో ఒక ఉల్లిగడ్డ ఉంది. దాని మీద రాసున్న సందేశంలే అది. విను ముందు... పెళ్ళిళ్ళ జోరు ప్రారంభమైంది, అసలే మండిపోతున్న కూరగాయలకి మరిన్ని కొత్త రెక్కలు మొలిచాయి. పోయిన ఏడాది మా నాయన ఆకలి జబ్బుతో పోయాడు. పోయే ముందు మా అయ్య అలమటించింది తులసి తీర్థం కోసం కాదు, ఇన్ని ఉల్లిచారు నీళ్ళ కోసం. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కన్నతండ్రి కడసారి కోరికను తీర్చడం కన్నబిడ్డగా నా ధర్మం కాదా? మొదటి వర్ధంతి రోజునైనా సరే ఎట్లాగైనా నాయన చివరి కోరిక తీర్చాలనుకుని, కొంప తాకట్టు పెట్టిన సొమ్ము, బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఊడ్చుకునొచ్చి వారం బట్టీ రైతుబజార్ల చుట్టూ తిరుగుతున్నా."
“అయితే?"
"కూరగాయల ధరలు ఎలా మండిపోతున్నాయో తెలుసుకుంటే గుండె ఆగిపోతుంది. పచ్చిమిర్చి కిలో వంద దాటింది. చిక్కుడు, బెండకాయల ధరలు వింటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. క్యారెట్ రేట్ చూస్తే గుండె మండుతోంది. కాలీఫ్లవర్, బీరకాయల ధరలు ఆకాశాన్నంటాయి. బంగారం ధర పెరిగితే కంగారు కొద్దిమందికే. కానీ రేపటికి పుచ్చిపోయే వంకాయలకీ, ఎల్లుండికల్లా కుళ్ళిపోయే టమోటాలకీ లగ్జరీ కార్ల రేట్లతో పోటీనా? పర్యావరణ సూచీల్లో, డిజిటల్ రేటింగుల్లో మన ప్రాంతాలు మొదటి స్థానాల్లో ఉన్నాయని చట్టసభల్లో చప్పట్లు కొట్టుకోవడానికి బాగానే ఉంటుంది కానీ, లోకల్ మార్కెట్లలో ముదురు మునక్కాడలు కూడా చేతికి అందడం లేదు!"
"పాలకులు పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పిస్తుంటే నాలిక మీద రుచికి రాసుకునే నిమ్మబద్ద ధర విన్నా గుండె బద్దలైపోవాలి. పండుగ వస్తే సంచీ నిండా ఉచిత బియ్యం ఇస్తే సరిపోతుందా? నిన్నటి దాకా నేలను తవ్వుకు తిన్న దుంపలను కూడా దళారులు ఆకాశానికి వేళ్లాడేస్తున్నారు. ఆకలి వేసే వాళ్లంతా రోడ్లెక్కి కేకలు వేయలేరు కానీ, నోరు మూసుకుని మాత్రం కూర్చోరు. కుర్చీలు ఎక్కిన తర్వాత జనాలంటే లెక్కే లేనట్లు సొంత కక్షలు, రాజకీయ ప్రతీకారాల మీదనే పూర్తి సమయం పెడుతున్న నాయకులకు బుద్ధి చెప్పాలనే ఒక బక్కజీవి ఆ పని చేశాడు..."
"ఏ పనయ్యా బాబూ? ఇంతకీ ఆ సంచీలో బాంబులున్నట్లా? లేనట్లా?"
"ఉన్నాయ్ బావా! కిలో బాంబులు.. సంచీకి నిండుగా ఉన్నాయి. కానీ నిజమైన సంచలనం అది కాదు. ఆ బాంబుల అడుగున తొక్కల మధ్యన ఓ ఉల్లిగడ్డ ఉంది. దానికి చుట్టిన కాగితం మీద సందేశం ఏంటంటే... 'నా స్థిర, చరాస్తులన్నీ అమ్ముకున్నా కొనగలిగింది కేవలం ఈ ముష్టి ఉల్లిపాయ మాత్రమే. పాత నోట్లు పారవేసినా ఈ చేతిసంచి నిండా బాంబులు వచ్చేసాయి కానీ ఉల్లిపాయ రాలేదు. తెల్లారే సరికల్లా మార్కెట్లలో కూరగాయల ధరలు ఠకీమని పడితీరాలి. పేదలందరికీ ఉల్లిగడ్డలు తక్షణమే అందాలి. పండుగ రోజుల్లో ఉల్లిని వంటగది వైపుకే రానివ్వద్దంటే కుదరదు. ఉల్లి వెంటనే అందుబాటులోకి రాకపోతే రెండు ప్రాంతాలూ ఈ ఉల్లిబాంబులతో మరుభూమిగా మారడం ఖాయం'.. అదీ ఆ తొక్క సందేశం."
"మరే! ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా!"
"ఆ ఉల్లి ముద్దకూ కన్నీళ్లు పెట్టుకునే ఘోరకలి దాపురిస్తే, బక్కోడు బాంబులు కాక మరేం కొంటాడు భయ్యా? ఇంత కరువు కాలంలో కూడా నువ్వొచ్చి మీ ఊరి తిండిపోతుల స్టోరీలు వినిపిస్తున్నావ్!" అన్నాడు మిత్రుడు.
నేను నవ్వి, "ఎన్ని ఘోర కరవులొచ్చినా మా వైపు తిండిపోతులకు ఢోకా లేదన్నానే తప్ప, వాళ్ళు మెక్కేది సన్న బియ్యం అన్నమనో, తాజా కాయగూరలనో అన్నానా సామీ? మా ప్రాంతంవాళ్లం సాంప్రదాయక ఆహార విధానాలకు ఎప్పుడో స్వస్తి చెప్పేసాం. ప్రత్యామ్నాయ తిండి విధానాలను ఆవిష్కరించుకున్నాం. చెడిపోయిన ట్యూబ్ లైట్లు, తుప్పు పట్టిన ఇనుప సామాన్లు, తుక్కు ప్లాస్టిక్, దిబ్బల మీద గిరాటేసిన మేకులు, గ్లాసు పలకలు... ఇవే సామీ మాకిప్పుడు ప్రాణాలు నిలబెట్టే ప్రధాన సంపూర్ణాహారం! అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా పిలవబడే ఈ నేలల్లో దొరికే ఇసుక, బొగ్గు, సున్నం, మట్టి మాకు పంచభక్ష్య పరమాన్నాలు! ఇప్పుడిప్పుడే కేవలం గాలి మాత్రమే పీల్చి జీవించే 'వాయుభక్షణం' యోగా విధానాన్ని మా పిల్లల చేత అభ్యాసం చేయిస్తున్నాం. ఇందాక నేను చెప్పిన తిండిపోతుల పోటీల విజేతలే ఇప్పుడు మా పిల్లలకి ఈ వాయుభక్షణ లాంటి 'స్టేట్ ఆఫ్ ఆర్ట్ కేటరింగ్' విద్యల్లో శిక్షణ ఇచ్చే గురువులు!" అన్నాను.
"ముందు ముందు ఆ గాలిలో కూడా కాలుష్యం పెరిగి విషకారకాలు కలిసే ప్రమాదముందని సైంటిస్టులు మొత్తుకుంటున్నారు కదా సామీ! మీ వాయు భక్షణ విద్యలన్నీ కొరగాకుండా పోవా మరి?" అని అడిగాడు మిత్రుడు ఆందోళనగా.
"డోంట్ వరీ! ఫాస్ట్ ఫుడ్స్ వంకతో పిల్లలకు తినిపించే చెత్తాచెదారానికి వంటి నరాలు అలవాటు పడ్డ తర్వాత, రేపు గాలిలో విషం కలిసినా ఆ హాలాహలాన్ని సైతం హాయిగా మనం సంపూర్ణాహారం కింద తీసేసుకోవచ్చు. ఏమీ కాదు!" అని ముగించాను.
మిత్రుడు కళ్ళు తేలేస్తూ, "ఆహాఁ! హాలాహలం తయారీలో ఉల్లిపాయల అవసరం అస్సలు ఉండదు కదా. భలే ఉపాయం! ఉల్లి పరేషాన్ కు భలే సొల్యూషన్ కనిపెట్టారు. థాంక్యూ బ్రదర్ ఫర్ యువర్ ఆపరేషన్- ఆనియన్!" అంటూ గట్టిగా ఈల వేశాడు.
***
సమాప్తం.
కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.










Comments