అపూర్వ సహోదరులు
- Nallabati Raghavendra Rao
- Sep 4
- 9 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #అపూర్వసహోదరులు, #ApurvaSahodarulu, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Apurva Sahodarulu - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao
Published In manatelugukathalu.com On 04/09/2025
అపూర్వ సహోదరులు - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
అప్పుడు భయంకర రాకాసి కోవిడ్ అంటువ్యాధి తగ్గు ముఖం పట్టాక ధైర్యంగా కొందరు మాస్కులు తీసి తిరగడం మొదలు పెట్టినప్పుడు ఆ పల్లెటూర్లో ఏం జరిగింది అంటే.. అంటే..
''హలో హలో.. సిలకలపూడి సింగినాదం. బాగున్నావా. బొత్తిగా నల్లపూసైపోయావ్" అప్పుడే వచ్చిన సింగినాదాన్ని పలకరించాడు కొబ్బరిమట్టల గోపాలయ్య.
"తమరు ఫీజు తీసుకోకుండా మా సమస్యలు పరిష్క రిస్తా ఉంటే అప్పుడు ఇంకా బాగుంటాం. కళకళలాడి పోతాo. ".. కళకళలాడుతున్నట్టుగానే అన్నాడు సిలకలపూడి సింగినాదం.
"ఏడిసనట్టుంది.. ఫీజు తీసుకోకుండా పనిసేస్తే నా బాధ ఏమో గాని నువ్వు మాత్రం నా ఉసురు తగిలి కడుపు మాడి సస్తావు. ఎప్పుడూ నాకు పడే ఏడుస్తావ్. అట్టాగ కాదు కానీ ఇలా కూకో.. నువ్వు బాగుండాల నేను బాగుండాల. ఆ రకంగా ఏమైనా ఇసయాలు అంటే సంగతులు ఉంటే సెప్పు? '' కొబ్బరిమట్టల గోపాలయ్య సింగినాదంని తనే కూర్చో పెడుతూ అడిగాడు.
''అయ్యా గోపాలయ్యగారు.. మా ఊరులో ఇద్దరు అన్న దమ్ములు ఉన్నారు. పెదగంటయ్య, చినగంటయ్య. పెళ్లిళ్లు అయ్యాయి.. పిల్లలు పుట్టారు''
''ఓసోస్.. అదే నీతో వచ్చిన ఎదవ సోది. పెళ్లి అయితే పిల్లలు పుట్టరేoటి. ఆ పనికిరాని సోది ఆపి కథ సెప్పు.
ఇదిగో సేట భారతం లాగా సెప్పకుండా సింపుల్ గా సెప్పు'. నువ్వు సెప్పావంటే నా పక్కన ఉన్నోడికి కూడా అర్థం కావాల ఇప్పుడు సెప్పు. ''
'' అయ్యా వాళ్ళిద్దరూ ఆస్తులు పంచేసుకున్నారు. ఎదురెదురు ఇళ్ళు వాటాలుగా వచ్చాయి. నిక్కర్లు వేసుకునేటప్పుడు నుండి ఒకడిని వదిలి ఒకడు ఉండ లేరు. జీడిపాకం లాగా అంటుకుపోయే ఉండేవారు.
ఇంతకీ.. సంగతేంటంటే ఇప్పటికీ 6 నెలలనుండి వింటు న్నారా.. కచ్చితంగా 6 నెలల కాలం నుండి మాత్రమే అక్షరాలా ఆరు నెలల కాలం నుండి మాత్రమే.. ఈ చినగంటయ్య ఆ పెదగంటయ్య తో సడన్ గా మొత్తం మాట్లాడడం మానేసాడు. మొత్తం అంటే మొత్తం అన్న మాట ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. ఇక్కడి తో సినిమాకు విశ్రాంతి. కట్ చేస్తే..
పెదగంటయ్య రోజు తమ్ముడికి కనిపిస్తున్నా.. నవ్వు తున్నా.. మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా.. చివరకు మాటలు కలిపినప్పటికీ ఈ చినగంటయ్యగాడు.. ఆ పెద గంటయ్య గాడిని చూస్తే భయంకర జంతువు ని చూసి నట్టు ముఖం మాడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు.. ఇదీ సమస్య. !
అక్కడికి.. ఊరంతా చెప్పి చూశాం. ఇదేమి బాగోలేదు చిన్నగంటయ్య. నీకు ఆస్తిలో భాగం కూడా ఎక్కువ ఇచ్చాడు కదా మీఅన్న. ఇదివరల మామూలుగా ఉండు.. అంటూ గడ్డమే కాదుమిగిలిన శాల్తీలు అన్ని పట్టుకు బతిమలాడాo. మాట్లాడడు పిచ్చోడిలా చూస్తాడు''. ఊపిరి పీల్చుకోవడం కూడా ఆపుకొని చెప్పాడు సింగినాదం.
''ఏ ఈ సిన్నోడుకి ఏమైనా దెయ్యం పట్టింద. నువ్వు
సెప్పేదంతా ఇoటూ ఉంటే ఇదేదో పప్పు లేకుండా ఉప్పుతోనే కూర వండినట్టుగా ఉంది. నోరు మండితే నోట్లో బెల్లం ముక్క బదులు పచ్చి మిరపకాయ పెట్టి నట్టుంది. ఇంతకీ ఆళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములే నంటావా. ఏదైనా సీక్రెట్ లిటిగేషన్ ఉందా. కూతంత ఇవరంగా సెప్పుమరి' అనుమానంగా అడిగాడు కొబ్బరి మట్టల గోపాలయ్య
'' రామ రామ వాళ్ల పుట్టుకలో అలాంటి దోషం ఏ మాత్రం లేదు. కీడు శంకించాల్సిన మనుషులు కాదు. ఎందుకంటే నా కళ్లెదుటే పుట్టి పెరిగిన వాళ్లు. '' బల్ల గుద్దినట్టు కచ్చితంగా చెప్పాడు సింగినాదం.
'' సరే.. నువ్వు సెప్పిన దాన్ని బట్టి ఈ సిన్నోడుని గది లో పెట్టి 4 మొట్టికాయలు ఏస్తే సెట్ అయిపోద్దoటావా.
'' అద్గదీ.. ఆది తేలుస్తారు అనే కదా ఇక్కడకు వచ్చా ను. ఇప్పుడు మీరు అక్కడకు వచ్చినా పర్వాలేదు. వాళ్ళనే ఇక్కడకు తీసుకురమ్మన్న పర్వాలేదు. ఫోను ద్వారా సెట్ చేసినా పర్వాలేదు.. పోలీసుస్టేషన్ ద్వారా
పరిష్కరించిన పరవాలేదు. దీనికిదానికి.. దానికిదీనికి కలిపి.. ఓల్ మొత్తం ఖర్చు చెప్పేయండి ''. అడిగాడు
సింగినాదం.
'''ఓసోస్.. నీ మాడా తెలివితేటలు పక్కన ఎట్టు ఆలో సిత్తా ఉంటే ఇది సానా పెద్ద సమస్య.. ఓ లకారం వసూలు సేయి. '' అడిగాడు కొబ్బరిమట్టల గోపాలయ్య.
''అబ్బే అంత ఇచ్చుకోలేరు.. మనకు బాగా కావలసిన వాళ్ళు. చిన్నోడికి తెలియకుండా పెద్దోడు.. పెద్దోడికి తెలియకుండా చిన్నోడు ఈ తగువు మీ దగ్గరే పెట్టమ న్నారు. ఆళ్లు ఇద్దరికీ మనస్ఫూర్తిగా కలిసిపోవాలని ఉంది. చెరొక 116 రూపాయలు మించి ఇవ్వలేరు. అది కూడా నేను బతిమలాడి బామాడితే ఇవ్వగలరు ''.. పైకిలేచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సింగి నాదం.
''ఏడిసినట్టుoది.. నువ్వు సెప్పిన దానికి నేను సెప్పిన దానికి అరటిపండు కి ఆనపకాయకి ఉన్నంత తేడా ఉంది. పోనీ 50 వేలు.. '' బేరం పెట్టాడు పెద్దమనిషి.
''పని జరగదు. '' పైకి లేచిపోయాడు సింగినాదం.
''కూకో.. ఈ బేరం పిత్తపరిగెలు, బొమ్మిడాయిలు, మట్ట గడసలు కలిపి వండినట్టుoది.. సరేగాని పదివేల యినా ఇవ్వగలరా.. ?'' కొసరి కొసరి అడిగాడు కొబ్బరి మట్టల గోపాలయ్య
''ఫైనల్ గా 2000 సెటిల్ చేద్దాం. 1000 నాకు వెయ్యి మీకు.. కాదనకండి. ఇవి కాళ్ళు కాదు''
''అవే కదా పట్టుకున్నావ్.. సిన్నప్పుడు నుంచి నీకు ఏది పడితే అది అట్టుకోవడం అలవాటయిపోయింది. సరే వదిలిపెట్టు. సాయంత్రం వస్తాను.. మీ వూరు రామా లయం అరుగు మీద మీటింగ్. ముందు సినగంట య్యని తీసుకురా. పెద్దోడిని ఓ పక్క కూకోపెట్టు''
''మీ తీర్పు అరకాసు లో తిరకాసు అని నాకు తెలుసు కదా. పెద్దగంటయ్యను గుడికి బాగా చివర పెద్ద స్తంభం వెనుక దాచిపెట్టి ముందుగా చినగంటయ్యను తీసు కొచ్చి మీ ఎదురుగా కూర్చో పెట్టే బాధ్యత నాది.. ''.. అంటూ పంచె పైకి ఎగ తోసుకుంటూ వెళ్ళిపోయాడు సింగినాదం.
**
తెల్లపంచె.. ఆసనం వేసుక్కూర్చున్నాడు. కొబ్బరిమట్టల గోపాలయ్య రామాలయం అరుగుమీద.
చుట్టూరా ఊరిజనం. అక్కడకు చేరిన 100 మందిలో అరడజను తప్పించి ఎవ్వరూ మాస్కులు పెట్టుకోలేదు. చిన గంటయ్య మాత్రం మాస్కు పెట్టుకునే వచ్చాడు.
''సినగంటయ్యా.. 6 నెలల నుంచి కోవిడ్ తగ్గు ముఖం పట్టినట్టు సెబుతున్నారు. ఇక్కడ. నాతో సహా ఎవరు మాస్కులు ఎట్టుకోలేదు. ఓ అరడజను మంది
మాత్రం సాదస్తంగా ఎట్టుకున్నారు అందులో నువ్వు ఒకడివి. అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు ఇంకా ఎందుకు మాస్కు ఎట్టుకుంటున్నావు?.'' గంభీ రంగా అడిగాడు కొబ్బరిమట్టల గోపాలయ్య.
''అది నా ఇష్టం అండి.. నా జాగ్రత్తలో నేనున్నాను అయినా ఇక్కడ తగువుకి దీనికి సంబంధం ఏమిటి అంట.. ? '' ప్రశ్నించాడు చినగంటయ్య.
''సరే.. మీ అన్నయ్యతో నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు..” ప్రశ్నించాడు గోపాలయ్య.
''అదేమిటి గోపాలయ్యగారు.. నేను మాట్లాడక పోవడం ఏమిటి. అసలు 6 నెలల నుండి మా అన్నయ్య నాకు కనిపించడం లేదు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. లేదా ఎవరైనా దాచేసి ఉంటారు మా ఎదురు ఇల్లే మా అన్నయ్యది. ఆ దేవుని కన్నా మా అన్నయ్యే నాకు గొప్ప.
మా అన్నగారి ఇంట్లో ఎవరో కొత్తవ్యక్తి దిగేడు.. 6 నెలల నుండి అక్కడే పాగా వేసాడు. ప్రతిరోజు ఆ ఇంట్లో నుంచి వస్తున్నాడు వెళ్తున్నాడు. బావురు పిల్లి ముఖం వాడును. నన్ను బుట్టలో వేసి నాతో మాట్లాడడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. మా అన్నయ్య లాగే బిల్డప్ ఇస్తున్నాడు. అతను మా అన్నయ్య కాదు. ఖచ్చితంగా కాదు.
ఈ విషయా లన్నీ ఊరoదరికీ చెబితే అల్లరి అవుతుంది.. మా అన్నయ్య వచ్చేస్తాడు కదా అని నేను ప్రశాంతంగా ఉన్నాను. ప్రతిరోజు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. ఈ విషయం మా వదిన గారితో తేల్చుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు.. ఎందుకు అంటే.. అసలు మాఅన్నయ్యను దాచేయవలసి వచ్చినoత అవసరం ఏముంది అని నా బాధ.. అర్థంచేసుకోండి. ''.. ఇంచుమించు ఏడుస్తున్నట్టు తన బాధనంతా చెప్పాడు చినగంటయ్య.
అక్కడ పోగుపడ్డ జనం అందరూ చినగంటయ్య
కు మదపిచ్చి పట్టిందని నిర్ణయించేసుకున్నారు.
ఈసారి చినగంటయ్యను.. దూరంగా కూర్చోబెట్టి పెద గంటయ్యను తీసుకొచ్చాడు.. సింగినాదం.
పెద్ద గంటయ్య ను కూడా ఈ విషయం ఏమిటి అని అడిగాడు పెద్ద మనిషి గా వచ్చిన కొబ్బరి మట్టల గోపాలయ్య.
పెదగంటయ్య.. '' నా తమ్ముడు చాలా కాలం నుండి నన్ను చూసి పారిపోతున్నాడు గోపాలయ్య గారు.. అర్థం కావడం లేదు. ఒరేయ్ తమ్ముడు అని ఒకసారి పలకరిస్తే.. ఎవడ్రా నువ్వు.. అంటూ పళ్ళు పటపట కొరికాడు. ఈసారి మళ్లీ నన్ను పలకరిస్తే కత్తితో నరికేస్తా నీ పీక అన్నట్టు చూశాడు.
దాంతో వాడికి ఏదో గాలి పట్టుకుంది అనుకుని ఎప్పుడో ఒకప్పుడు వాడే మాట్లాడుతాడు కదాని ఎదురు చూస్తున్నాను. ఈ విష యమే మన సింగినాదం గారికి చెప్పి మీకు కబురు పెట్టాను అన్నమాట. మా తమ్ముడు కూడా మీకు నా విషయం ఏమిటో తేల్చమని కబురు పెట్టాడటకదా.. తొందరగా తేల్చండి గోపాలయ్యగారు.. నా తమ్ముడు మనసు మార్పించి నాకు అప్ప చెప్పండి.'' అంటూ
తన బాధ అంతా వివరంగా చెప్పి తనే నిజమైన అన్న గారిని అని ఏడుపు ముఖం పెట్టాడు.. గోపా లయ్య ఎదురుగా.. పెదగంటయ్య.
గోపాలయ్య కింద మీద ఆలోచించాడు. భూమి మీద తలకాయ బెట్టి గాలిలో కాళ్లు పెట్టినట్టు ఫీలవుతూ కూడా.. చాలాసేపు ఆలోచించాడు. తనకు తాను నెత్తి మీద మొట్టికాయలు వేసుకొని తలకాయ విదిలించు కుని మరి ఆలోచించాడు. చివరికి ఏదో తట్టిన వాడిగా.
''పెదగంటయ్యా.. బాగా ఆలోచించుకొని సెప్పు.. నువ్వు మాస్కు ఎప్పటినుండి పెట్టుకోవడం మానే
సావు''. ఏదో లా పాయింట్లు లాగినట్టు అడిగాడు గోపాలయ్య.
''సరిగ్గా 6 నెలల నుండి గోపాలయ్యగారు.. కోవిడ్ కాస్త తగ్గినట్టు కనిపించాక చాలామంది మాస్కులు తీసేసారు కదా అని నా మటుక్కి నేను మాస్కు తీసేసి తిరగడం మొదలుపెట్టాను'' చెప్పాడు పెద్దగంటయ్య.
'' హుర్రెహుర్రె.. యురేకా.. ''
పరిష్కారం దొరికినట్టు భరతనాట్యం చేశాడు పెద్ద మనిషి గా వచ్చిన కొబ్బరిమట్టల గోపాలయ్య.
డీల్ కుదిర్చిన సింగినాదం.. తన బొజ్జ నిమురు కున్నాడు ఆనందo తో.
అంతే.. వెంటనే పెదగంటయ్య చెవిని గట్టిగా లాగి చెవి ముక్కలు ముక్కలుగా కొరికేసినట్టు ఏదో ఏదో.. ఏదేదో చెప్పాడు.. గోపాలయ్య.
పరుగున ఇంటికెళ్ళి ఒక్కనిమిషంలో గోపాలయ్య చెప్పి నట్టు చేసుకుని వచ్చాడు పెదగంటయ్య.
ఈ సారి గోపాలయ్య పెదగంటయ్యను రామాలయం అరుగుమీద కూర్చోబెట్టి దూరంగా మూలన కూర్చో బెట్టిన చినగంటయ్యను ప్రవేశ పెట్టించి కరెక్టుగా అన్న గారి ఎదురుగా కూర్చో పెట్టించాడు.
అన్నను చూడగానే చినగంటయ్య.. చిత్రంగా విచిత్రంగా.. ప్రేమగా మీదకు పడిపోయి గట్టిగా కౌగిలించు కొని.. ఎక్కి ఎక్కి ఏడ్చాడు.
''అన్నయ్యా.. అన్నయ్యా.. ఈ 6 నెలలు ఎక్కడికి వెళ్ళి పోయావు. నీ తమ్ముడికి చెప్పాపెట్టకుండ ఇలా వెళ్ళి పోవడం నీకు ధర్మమేనా.. అసలు ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు.. ? నాకు ఒక ఉత్తరం ముక్క రాయాలనిపించ లేదా? నువ్వు లేకుండా ఊరవతలకు చెంబుతో నీళ్ళు పట్టుకుని ఎప్పు డైనా వెళ్లానా.. ? అలాంటి తమ్ముడుతో నీకు ఎలా దూరంగా ఉండాలనిపించింది అన్నయ్యా ''
అంటూ భయంకరంగా ఏడ్చాడు చినగంటయ్య.
చుట్టూ చూస్తున్న జనమంతా పిచ్చెక్కినట్టు అయి పోయారు. అసలేం జరుగుతుందో వాళ్లకి కొంచెం కూడా అర్థం కాలేదు. సముద్రం మధ్యలో చిక్కుకు పోయిన గుడ్డివాళ్ళులాగా అయిపోయింది అక్కడ చేరిన ప్రజల పరిస్థితి.
ఇందాకటి పెద్దగంటయ్య ఇప్పటి పెదగంటయ్య ఒక్కరే కదా. ఈ పెదగంటయ్య ఇందాక మాస్కు లేకుండా వచ్చాడు.. ఇప్పుడు గోపాలయ్యగారు చెప్పగా పరుగున ఇంటికి వెళ్ళి మాస్కు పెట్టుకొని వచ్చాడు. అంతే కదా తేడా. తస్సాదియ్య.. ఇద్దరూ ఒక్కరే కదా. మరి ఈ చిన్నగంటయ్య గాడు ఓవర్యాక్షన్ ఏమిటి?'' అను కుంటూ అక్కడ చుట్టూ చేరిన జనం అందరూ. అర్థం కాక ఒళ్ళంతా గీరుకుంటున్నారు.
పెదగంటయ్య తమ్ముడుని ఇంకా గట్టిగా కౌగలించు కున్నాడు.. ''తప్పంతా నాదే తమ్ముడు. నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను. పిచ్చి వెధవను. సొంత తమ్ముడికి రక్తం పంచుకుపుట్టిన నా గారాల తమ్ముడిని అనవసరంగా 6 నెలలు బాధ పెట్టాను..
కోవిడ్.. కొంచెం తగ్గింది కదా అని.. నీకు చెప్పా పెట్టకుండా మాస్కు తీసేశాను 6 నెలల క్రితం.
ఏకంగా.. ''రెండు సంవత్సరాలు అంటే సుదీర్ఘ కాలం.. 24 నెలల పాటు.. మాస్కుతో నన్ను చూడటం అలవాటయి.. అలాగే ప్రేమ పెంచుకున్న నువ్వు.. నీకు చెప్పకుండా నేను మాస్కు తీసేయడంతో ఒక్కసారిగా మాస్కులేని నాముఖాన్ని గుర్తుపట్టలేకపోయావు.
తప్పంతా నాదేతమ్ముడు తప్పంతా నాదే. ఆరు నెలల క్రితమే నాతోపాటు నీ చేత కూడా మాస్క్ తీయిoచేసి ఉంటే ఇంత సస్పెన్సు సినిమా నడిచి ఉండేది కాదు.
ఇప్పుడు గోపాలయ్యగారు చెప్పగా.. ఇంటికెళ్లి మాస్కు పెట్టుకుని వస్తే వెంటనే గుర్తు పట్టావు. పూర్తిగా తప్పు నాదే తమ్ముడు. '' అంటూ తల బాదుకుంటూ ఏడ్చాడు పెదగంటయ్య.
అన్నదమ్ములు ఇద్దరూ కౌగలించుకునే రామాలయం అరుగు మీదపడి దొర్లేస్తున్నారు. అదీ వాళ్ళ ప్రేమ!!
అర్థం అయన ప్రజలు ముక్కు మీద వేలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.
అర్థం కాని వాళ్ళు.. తమ తలనే కాదు పక్కనున్న వాడి తలనుకూడా గోక్కుంటూ వెళ్ళిపోతున్నారు.
***
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments