ఆరాటం
ఆరాటం కథ, డా గాదిరాజు మధుసూదన రాజు, తల్లి ప్రేమ కథ, విదేశాల్లో ఉద్యోగం, కుటుంబ బంధాలు, emotional Telugu story, mother and son story, elderly parents loneliness, family values Telugu, Dubai family story, heart touching Telugu story, Telugu short story, motherhood, Telugu literature, ఉగాది షడ్రుచుల కథల పోటీ

Aratam - Telugu Emotional Family Story | Dr. Gadiraju Madhusudana Raju
ఆరాటం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | డా. గాదిరాజు మధుసూదనరాజు
Published in manatelugukathalu.com on 17/06/2026
ప్రపంచీకరణ కాలంలో ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే పిల్లలు, స్వదేశంలో ఒంటరిగా మిగిలిపోయే తల్లిదండ్రులు అనేక కుటుంబాల వాస్తవం. "ఆరాటం" కథలో సావిత్రమ్మ అనే తల్లి తన కొడుకు కుటుంబంతో కలిసి జీవించాలనే ఒక్క కోరికతో సంవత్సరాల తరబడి ఎదురు చూస్తుంది. కొడుకు దుబాయ్‌లో, కోడలు-మనవళ్లు హైదరాబాద్‌లో, తాను మధ్యలో ఆశల ఊయల ఊగుతూ గడిపిన జీవితం చివరకు ఒక విషాదాంతానికి దారి తీస్తుంది. తల్లి ప్రేమ, కుటుంబ అనుబంధాలు, వృద్ధాప్య ఒంటరితనం, విదేశీ ఉద్యోగాల వెనుక దాగి ఉన్న మానవీయ వేదనలను హృద్యంగా ఆవిష్కరించే కథ ఇది.
"పోదాం!" అని కొడుకు చెప్పినప్పటినుంచి పుట్టి పెరిగిన దేశాన్ని వదిలిపెట్టి, ఏదో పరాయి దేశంలో బతికేందుకు పోవాలని తలచుకుంటేనే అల్లకల్లోలంగా అయిపోతూ ఉంది మనస్సు.
"అడపా దడపా వచ్చి పలకరించి హత్తుకునే వారిని, ఆత్మీయులైన అన్నతమ్ములను, బంధువులను,నా వాళ్ళను కలుసుకోకుండా ఉండగలనా?"
"అమ్మమ్మా!" అంటూ అల్లుకుపోయే మనుమరాళ్లకూ,మనుమళ్లకూ దూరమై బతగ్గలనా?
"నాతో నా ఇంట్లో ఉండవే!" అని నా కూతురు కులుకుతోంది గోముగా.
"అలా అని కొడుకు ఉండగా, కూతురితో అల్లుని ఇంట్లో ఉండటం మర్యాదగా ఉండదు కదా! ఏమి నిర్ణయించుకోవాలో? ఇవన్నీ ఎలా భరించాలో?" అనుకుంటూ ఊగిసలాడుతూ, ఊహలలో సందేహపు ఉయ్యాల ఊగుతోంది సావిత్రమ్మ మనస్సు!
**
స్కూల్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. యాజమాన్యం వారి ప్రోత్సాహంతో
ప్రతి సంవత్సరం పిల్లలతో రకరకాల ఈవెంట్లు చేయిస్తూ ఉంటారు టీచర్లు.
తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి స్కూల్ కి వచ్చి, కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటారు.
"డాడీ వస్తానన్నాడా మమ్మీ? డాడీ, నువ్వూ ఇద్దరూ కలిసి మా స్కూల్ సెలబ్రేషన్స్ కి ఈ సారైనా వస్తున్నారా? లేదా?" అంటూ తల్లిని అడిగింది మృదుల.
"లేదంటే! మనమే దుబాయ్ పోదాం. అక్కడే మేమూ చదువు కొంటాం." కొడుకు చైతన్య బుంగమూతి పెట్టాడు.
"ఎంతకాలం ఈ ఒంటరి జీవితం?
జీవితం మీద విరక్తి వస్తోంది అత్తయ్యా!" అరచింది మాధురి చిరాగ్గా, పిల్లలకి జవాబు చెప్పలేక.
"ఓపిక పట్టమ్మా! ఈ కష్టాలూ దిగుళ్లూ ఇక నాలుగు నెలలేలే..." అంటూ కోడలిని ఓదార్చింది సావిత్రి మృదువుగా, ఆమె చుబుకాన్ని స్పృశిస్తూ.
అత్తయ్య కళ్ళలోని నీటిపొరలు గమనించి, ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్నదానల్లే ఆమె వైపు వాలుగంట ప్రేమగా చూసి స్కూటర్ స్టార్ట్ చేసి రోడ్డెక్కి హైదరాబాద్ ట్రాఫిక్ లో లీనమయ్యింది మాధురి.
ఈసారి ఎలాగైనా... తన కొడుకు దుబాయ్ నుండి వచ్చి, కుటుంబం తోపాటు తనను తీసుకెళతాడని ఆమె నమ్మకం. భర్తకు దూరంగా ఉండి అవస్థలు పడుతున్న మాధురికి ధైర్యం చెబుతూనే ఉందామె.
అంతే కాదు.
ఆమె తన ఆఫీసుకు వెళ్ళే వరకూ హడావిడిగా, ఇంటిపని చేస్తూ, వంటలు సిద్ధం చేసి, కాచుకొని, చూసుకొని, పిల్లల్ని రెడీ చేసి స్కూల్ బస్సు ఎక్కించటం వరకూ ఏదో తనచేతనైన సాయం చేస్తూనే ఉంది.
కోడలిని ఒక అత్తలా కాదు. కన్నతల్లిలా చూసుకుంటూ ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటోంది, శక్తికి మించిన ప్రయాసపడుతూ, అది తన బాధ్యతగా భావిస్తూ...
**
"పాపం! రాజేష్! అత్తయ్యకి అబద్ధం ఎందుకు చెప్పారు?"
"ఏమి మాట్లాడుతున్నావ్ మాధురీ!"
" ఇండియా వచ్చి మమ్మల్ని దుబాయ్ కి..."
"ఓ.. అదా? నీవు ఏదో ఇబ్బంది పడుతున్నావనీ, పిల్లలు తండ్రి ప్రేమకు దూరం అవుతున్నారనీ ఏవేవో ఊరికే తనకు తాను ఊహించుకొని నస పెడుతోంది. ఆ డిప్రెషన్ తో ఆమెకి పిచ్చి పట్టకుండా అలా చెప్పాను. అంతే! ఓ నాలుగు నెలలు ఆ ఆశతో హుషారుగా ఉంటుంది లే!" అంటున్న రాజేష్ జవాబుతో సంతోషపడింది మాధురి. ఎందుకంటే ఆమెకి ఉద్యోగం మానేసి దుబాయ్ కి వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి.
**
"డాడీ వస్తాడన్నావు కదా! రాలేదే మరి?" చైతన్య కోపంగా చూశాడు నాన్నమ్మ సావిత్రమ్మ వైపు.
"పాపం! డాడీకి వాళ్ళ మాస్టర్ పర్మిషన్ ఇవ్వలేదటరా నాన్నా!" ఓదార్చింది బుగ్గల పై ముద్దుపెట్టి .
కన్నీళ్ళు మిలమిలా మెరుస్తూ...
ఆమెకూ పిల్లలకూ బుగ్గల మీదనుంచి జారి వచ్చి త్రివేణీ సంగమం సృష్టించి ముగ్గురి ముఖాల పై ఏవేవో రంగులను అద్దాయి, ఫంక్షన్ లైట్ల కాంతులతో రాజీ పడుతూ.
**
"మా సాఫ్ట్ వేర్ కంపెనీ లో .. మా ఇంజనీర్లకూ, పిల్లలకు మాత్రమే టూర్ ప్యాకేజీ. పిల్లలను తీసుకొని వెళ్ళిరానా అత్తయ్యా?" అంటున్న మాధురి తో
"క్షేమంగా వెళ్ళి ఆనందంగా రా తల్లీ!" అంది సావిత్రమ్మ,
పిల్లలు, కోడలి ఆనందం కన్నా తనకు కావలసింది వేరే ఏముంది? అనుకుంటూ.
"ఇండియాలో ఉండి ఉంటే హాయిగా కుటుంబం మొత్తం సరదాగా వెళ్ళేవారు కదా!
ఈ డబ్బు సంపాదనల పిచ్చిలో పడి, అసలైన సుఖ సంతోషాలకు దూరమై పోతున్నారు పాపం!" అనుకుంటూ...
ఆరాటం పెరగటంతో గుండెల్లో నొప్పి మొదలైంది సావిత్రమ్మకి.
అయినా బయటకు కనబడనీయకుండా నవ్వుతూ టాటా చెప్పి పంపింది వాళ్ళకి.
తన నొప్పి గురించి చెబితే… టూర్ కి వెళ్లకుండా మానేస్తారేమో?
పాపం! వాళ్ళయినా ఆనందంగా వెళ్ళి ఎంజాయ్ చెయ్యనీ అనుకుంటూ.
**
తమని దుబాయ్ తీసుకెళ్ళే నిర్ణయం గురించి అడిగితే,
వాయిదాల మీద వాయిదాలు వేస్తూ,
నెలలు, సంవత్సరాలు గడిపేస్తున్నాడు కొడుకు.
అయినా ...
ఆమె ఆరాటపడేది తన సుఖం కోసం కాదు.
ఆత్మీయంగా అందరూ ఒక చోట కలిసి ఉండటం తన కళ్లారా చూడటం కోసం.
**
"ఈసారి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి,
రాక పోతే..
నేను నీ అమ్మని చచ్చినంత ఒట్టు!" అంటూ
తన మీదనే ఒట్టు వేయించుకుంది సావిత్రమ్మ.
అందుకే కొండంత ధైర్యంతో గడిపింది ఈ నాలుగు నెలలు.
అర్థరాత్రి వీడియో కాల్ రావటంతో,
కోడలు పిల్లల్ని నిద్రలేపి మరీ సంతోషపడింది.
"అమ్మా! దుబాయ్ లో మా కంపెనీ వాళ్ళతో కలిసి హాయిగా గడిపాను చూడవే!" అంటూ
వీడియోలు, ఫోటోలు చూపెట్టాడు కొడుకు రాజేష్ ఆన్ లైన్ వీడియో లో
"నీవు నీ భార్యాపిల్లలతో హాయిగా ఇలా గడపడం నేను చూడాలిరా, వస్తున్నావు కదా! రా రా!"
అంది ధీమాగా.
"ఇంకో నాలుగు నెలలు......" అంటున్న కొడుకు రాజేష్ మాటలు పూర్తి కాకముందే...
"ఈ జన్మ లో నేను బతికి ఉండగా నీవు వస్తావా?" అంటూ కన్నీరు పెట్టుకుంది సావిత్రమ్మ.
"అబ్బ! ఏడ్చి నా మూడ్ పాడు చేయకు. నాలుగు నెలలు ఓపికపట్టు, వచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తా. అప్పుడు మన పిల్లలతో, కోడలితో, మాతో వీడియోలు, ఫోటోలు తీసుకుందువు గానీ, అన్నీ చూద్దువు గానీ!"
అంటూ వీడియో కాల్ కట్ చేశాడు రాజేష్, ఎప్పటిలాగానే మళ్ళీ.
***
సావిత్రమ్మ మృత దేహాన్ని చూస్తూనే బావురుమన్నాడు కొడుకు రాజేష్.
'కొడుకుతో పాటు దుబాయ్ కి పోలేక, వదిలి ఇక్కడ ఉండలేక పదేళ్లుగా డోలాయమానంగా ఎదురు చూసింది పాపం!' అంటూ అంగలార్చాడు ఒకాయన ,చుట్టూ మూగిన బంధువులను చూస్తూ.
"అదేం కాదు.. ఆ ఊగిసలాటతో ఉత్కంఠను తట్టుకోలేక గుండె పగిలి చచ్చిపోయింది పాపం!!"
అంటూ నిట్టూర్చింది మరో బంధువురాలు, ఆమెతో పంచుకున్న భావోద్వేగాల్ని నెమరువేసుకుంటూ.
***
డా. గాదిరాజు మధుసూదనరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: గాదిరాజు మధుసూదన రాజు
కృతజ్ఞతలు నమస్సులు
నేను సూర్య వంశ క్షత్రియ వంశస్థుడను. ప్రభుత్వ నేత్ర వైద్య అధికారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పనిచేసి రిటైర్ అయ్యాను.
నా కథలు దశాబ్దాల క్రితమే " కధా నిలయం" లో కూడా చోటు చేసుకున్నాయి. సాహిత్యం నా ఊపిరి.







Comments