అర్ధనారీశ్వరులు
- Varanasi Venkata Vijayalakshmi

- Oct 31
- 8 min read
#Vijayasundar, #విజయాసుందర్, #Arthanareeswarulu, #అర్ధనారీశ్వరులు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Arthanareeswarulu - New Telugu Story Written By Vijayasundar
Published In manatelugukathalu.com On 31/10/2025
అర్ధనారీశ్వరులు - తెలుగు కథ
రచన: విజయా సుందర్
"అబ్బా "అలా దూరంగా కూర్చుంటే వల్ల కాదమ్మా బుజ్జీ. అసలే మా హైదరాబాదు గుంతలకు పెట్టింది పేరు.. ఆనక మీ గోదారోళ్లు మా అమ్మాయిని పడేసావంటూ గోలేట్టేస్తే నాది కాదు పూచి" కొంటెగా మేలమాడుతున్న భర్త, విరించి మాటలకు వాగ్దేవి ముసిముసిగా నవ్వుకుంటూ, అతని నడుంచుట్టూ చెయ్యి వేసింది.
"ఆ అదీ అలా " అంటూ అతను స్కూటర్ స్పీడ్ పెంచాడు. గతుకుల్లో తనకు తగుల్తున్న భార్యమేని స్పర్శను, సుగంధాలను ఆస్వాదిస్తున్న విరించి, 'అమ్మ కారులో వెళ్ళండిరా లక్షణంగా అంటే కూడా ఈ స్కూటర్ తెచ్చింది ఇందుకేగా' అనుకున్నాడు. మైమరుపులో ఎదురుగా వస్తున్న వాహనము పైన తన భర్త దృష్టి పెట్టడము లేదని గమనించిన ఆమె, "కన్నా! జాగ్రత్త! ముందు చూసుకో" అన్నది గాభరాగా.
ఎర్రనిఎండలో ఓ గంట పిలుపులకే వడ లిపోయినట్లున్న భార్యని చూసి విరించి, "అయ్యో అలా ఉన్నావేమిటి బుజ్జీ?" అంటూనే స్కూటర్ని ఓ కూల్డ్రింక్షాప్ దగ్గర ఆపాడు.
అయ్యో బుజ్జీ ఎంత వడలిపోయావో.. ప్చ్ అమ్మ అందుకే కారులో వెళ్ళమన్నది. ప్చ్.. నేనే.. సారీరా "
భర్త చేతిమీద చెయ్యి వేసి, "మనిద్దరం ఎంజాయ్ చేసాము కదా.. నో రిగ్రీట్స్ " అన్నది చిలిపిగా చూస్తూ..
ఆర్డర్ చేసిన ఐస్క్రీమ్ తింటూ, "పోనీ వెళ్ళిపోదామా.. మిగిలినవి సాయంత్రం చూసుకోవచ్చు " అన్నాడు.
"అయ్యో వద్దు వద్దు బాగుండదు, పిలుపులు మధ్యలో ఆపేస్తే. మళ్ళీ ఈ ఏరియాకి రెండుమార్లు అవు తుంది ట్రిప్. అసలే అత్తయ్య కంగారు పడుతున్నారు పెళ్లి దగ్గరకొచ్చేసింది, ఇంకా చాలా పనులున్నాయి అంటూ"
"ఏమి పిలుపులో బాబూ ఈ రోజుల్లో కూడా.. అందరూ వాట్సాప్ ల్లోనే కానిచ్చేస్తుంటే అమ్మకు చాదస్తం"
భర్త మాటలకు వాగ్దేవి, "మనింట్లో కూడా చాలా మందికి అలాగే చేశారు. వీళ్ళు అతి ముఖ్యల్లన్నమాట. సరే ఇంకలే. పూర్తి చేసేద్దాము" వాగ్దేవి తొందరపెట్టింది.
ఆడబడుచు స్వాతి పెళ్లి లో బొంగరములాగా అత్తగారి కూడా కూడా తిరగుతూ అన్ని పనులు చక్కపెడుతున్న, కొత్తకోడలు వాగ్దేవి అందరికీ తల్లో నాలుక అయింది. విరించి తల్లి సుమిత్ర అక్కయ్య, సుజాత, "సుమీ! నువ్వు చాలా అదృష్టవంతురాలవే, చక్కగా తీరూ, బారూ తెలిసిన పిల్లని తెచ్చుకున్నావు. " అని చెల్లెల్ని పొగిడి, విరించి వైపు తిరిగి, "ఒరేయ్ విరీ!, నువ్వు భలే తెలివిగల పని చేశావురా.. పెద్ద చదువులు, పెద్ద కొలువులు అని ఎగబడకుండా చక్కగా డిగ్రీ చదువుకున్న అమ్మాయిని చేసుకుని". అంటూ ప్రశంసించింది.
విరించి, " అవును పెద్దమ్మా.. కానీ ఈ పిల్ల పదిహేనురోజులనుండి నా ఆదుపాజ్ఞలు. తప్పింది. అందుకు ఇప్పుడు నా కాళ్ళు నొక్కమంటే శిక్ష సరిపోతుంటావా?" అన్నాడు.
అనుభవశాలి అయిన ఆవిడ, అర్థం చేసుకుని, "అవునురా అదే సరైన శిక్ష, వెంటనే అమలు చెయ్యి". అన్నది, తను కూడా సరదాగా. విరించి తనవైపు కొరకొరా చూస్తున్న వాగ్దేవిని, "ఏయ్ పిల్లా ఇలా వచ్చి కాళ్లు నొక్కు" అన్నాడు.
ఇంతలో అందరికీ అరసెలు, బూందీ తెస్తున్న సుమిత్ర, "చెప్పవే కోడలా, మర్యాదగా పిలిచి, మన్ననగా చెప్తేనే ఏదన్నా చేసేది అని. బొత్తిగా నోట్లో నాలిక లేదేమీ నీకు " అంటూ కోడలి వైపు వకాల్తా తీసుకున్నది.
అందరి మధ్యలో పడుకుని కబుర్లు చెప్తున్న విరించిని, కాళ్లు నొక్కుతున్న కోడల్ని చూసి అటువైపు వచ్చిన అతని తండ్రి రామారావు, వస్తున్న నవ్వు తొక్కిపెట్టి, గుంభనగా, " ఏమిట్రా ఇది? " అన్నాడు. తండ్రి రాకతో దిగ్గున లేచి కూర్చున్న్నాడు విరించి.
గదిలోకి వెళ్లిన విరించికి, వాగ్దేవికి కోపం వచ్చిందేమో అనిపించింది.
"దేవీ! నా ఆఫీస్ ఫైల్ కనపడట్లేదు తీసావా? ఒకసారి వచ్చి ఇచ్చిపో" అని పెద్దగా పిలిచాడు. ఆ ఆఫీస్ ఫైల్ ఏమిటో తెలిసిన వాగ్దేవి, "ఆ వస్తున్నా" అన్నదే కానీ చేస్తోన్న పని ఆపి అరంగుళం కూడా కదల్లేదు. నాలుగు పిలుపులు అయ్యాక, విరించి సంగతి తెలిసిన సుమిత్ర కోడలిని వెళ్ళమని చెప్పింది.
గదిలోకి రాగానే, చప్పుడు కాకుండా తలుపు ఘడియ వేసేసి, తన పరిష్వంగంలో ఆమెని బిగించి, ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు విరించి.
బుంగమూతితో వాగ్దేవి, " ఎన్నిసార్లు చెప్పినా నువ్వింతేనా కన్నా.. నలుగురిలో అల్లరి వద్దంటే వినవేమి? "
"ఏయ్ ముసలమ్మా! మన వాళ్ళు అంత తెలివితక్కువ వాళ్ళు, అంత సంస్కారము లేనివాళ్లు కాదులేవోయ్. మా పిల్లలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అని మురిసి పోతున్నారులే. "
"నువ్వు బానే చెప్తావు తియ్యతియ్యగా.. మామయ్య ముందు ఎంత సిగ్గేసిందో తెలుసా? "
"మరి నువ్వు గదిలోకి రావట్లేదాయే.. అందుకే గదినే తెచ్చేసా"
"ఛీ పో పోకిరీ".
ఆడవారి మాటలకు అర్థాలు వేరుట కదా.. వాగ్దేవి ఒక్క ఉదుటున తప్పించుకు పారిపోయింది.
***-
విరించి వాగ్దేవుల పెళ్లిపుస్తకం అందమైన రంగురంగుల కొత్త చిత్రాలతో నిండి శోభాయమానంగా కాంతులీ నుతున్నది. 'మేమిద్దరము, మాకిద్దరు' అన్నట్లు ఒకమగపిల్లవాడు, ఒకఆడపిల్ల వారి ప్రేమఫలాలుగా పెరుగుతున్నారు..
పిల్లవాడు విభవ్ కి అయిదేళ్లు, పిల్ల మనోజ్ఞకి మూడేళ్లు. ఇటు తాత, నాన్నమ్మ అటు అమ్మమ్మ తాతయ్యల గారాబాల్లో హాయిగా బాల్యన్ని ఆనందంగా గడిపేస్తున్నారు.. అమ్మా నాన్నల ప్రేమ అంతా వాళ్లదే.
కాలానికి ఋతువుల మార్పులు అనివార్యం! ఎంత తట్టుకోలేకపోయినా ఎర్రని ఎండ తట్టుకోవాల్సిందే, గడ్డకట్టే చలినుండీ ఎవరూ తప్పించుకోలేరు. నానుడు వానలైనా కుంభవృష్టి అయినా, ఎంత చికాకుపడినా తప్పదుగా.
కిటికీ దగ్గరగా కూర్చుని మూడు రోజులనుంఢీ ముసురుపట్టి ఆగిఆగి కురుస్తున్న వానని తిట్టుకుంటూ, టైం చూసి ఉలిక్కిపడ్డది వాగ్దేవి. మూడు రోజుల బట్టలన్నీ అరవేస్తూ విరించి ఎనిమిదైనా ఇంకా రాలేదే బ్యాంకునుండి అని ఆలోచనలోపడింది. వెంటనే ఫోన్ చేసింది. నాలుగు కాల్స్ కి ఎత్తి, "నేను బిజీగా ఉన్నాను" అని ఫోన్ పెట్టేసాడు. వాగ్దేవి నిట్రాట అయింది!
పెళ్లి అయిన ఈ అయిదేళ్లలో అసలు ఈ రకమైన పొడిపొడి మాట విననేలేదు. "ఏదో నిజంగానే బిజీగా ఉన్నాడేమో.. పై అధికారులెవరన్నా ఉన్నారేమో" ఎన్ని రకాలుగా మనసుని ఊరుకోబెడుతున్నా అది మొరాయిస్తోంది. 'అసలు మీరిద్దరూ తీరికగా మాట్లాడుకుని ఎన్నాళ్లయింది? కలిసి భోజనం చేసి? అసలు తామిద్దరూ ఒక్కటై?' వాగ్దేవి ఒకొక్క ఆలోచనకు విచలితురాలవుతున్నది!
"అవును విభూకి వారంరోజులనుండి ఎడతెగని జ్వరం. తను ఆఫీసులో బిజీగా ఉన్నాడని మామయ్యే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. తను పిల్లవాడితో ఆవస్థపడుతుంటే, అత్తయ్య మనూని చూస్తున్నారు.
అదివరకు ఎప్పుడూ లేనిది ఇంటికి కూడా ఏదో పని తెచ్చుకుంటున్నాడు. మొన్ననోరోజు హాల్లో టేబిల్ మీద పెన్ పెట్టి వెళ్ళిపోయి, పాపాయి ఆ పెన్నుతో గోడమీద రాసేస్తే దాన్ని విసుక్కుని, తనమీద అరిచాడు.
ఇదేమిటీ అసలు ఇంత జరుగుతుంటే తనసలు ఏమీ పట్టించుకోవట్లేదు'
ఆలోచనల్లో విరించి లోపలకు రావటం గమనించనే లేదు వాగ్దేవి.
తనను పిలవకుండా లుంగీ తీసుకుని కట్టేసుకున్న భర్త వైపు అర్థకానట్లు చూసింది. అతను అదేమీ పట్టించుకోకుండా, "దేవీ! తొందరగా అన్నాలు తినేద్దాము. నువ్వు నీ పని తొందరగా తెముల్చుకుని రా.. దగ్గరగా వచ్చి, "బుజ్జీ! తొంధర గా వస్తావు కదూ"
గోముగా అడుగుతున్న తన 'కన్నాని అక్కడికిక్కడే.. అనిపించింది వాగ్దేవికి మనసంతా దూదిపింజలాగా తేలిపోగా!
కూర్చుని తీరికగా తన ముంగురులు సవరిస్తూ, కబుర్లు చెప్తున్న భర్తని చూసి, ఊరికే బేంబేలుపడ్డ తనను తాను తిట్టుకున్నది. ఉన్నట్లుండి విరించి సరిగ్గా కూర్చుని, "నేను మా ఫ్రెండ్ తో కలిసి వ్యాపారంలోకి దిగాను. " అన్నాడు.
అదేదో ఆషామాషీ వ్యవహారం అన్నట్లు, "హు, నువ్వు వ్యాపారం.. నీకు రావాల్సిన డబ్బు అయినా అడగలేని మొహమాటస్తుడివి, నీకు వ్యాపారమేమిటి కన్నా ? నేనే దొరికానా నీకు జోక్ చేయడానికి? " భర్త చెవి మెలిపెడుతూ అన్నది.
అప్పటికే మొహమంతా ఎర్రగా చేసుకుని విరించి, "నేనేదైనా అనుకుంటే చెయ్యగలను. నీకేం తెలుసు నా సంగతి? ఆల్రెడీ డబ్బు ఇవ్వటం, సరుకు తీసుకురావటం జరిగిపోయాయి. ఆఫీస్ కూడా చూసాము. "
అతని ఒకొక్కమాట ఒక సమ్మెటపోటు లాగా, నెత్తి మీద మోదుతుంటే, 'తన కన్నా తనకు తెలియని ఈ మనిషా?' వాగ్దేవికి నోటమాట రాలేదు.
ఒక్క రెండునిమిషాల్లో తనను తాను నిలవరించుకుని, "అసలు మనకి ఈ వ్యాపారాలవీ ఎందుకు చెప్పు? హాయిగా బ్యాంకు ఆఫీసరుగా దర్జాగా ఉన్నావు" తనకు ముందు ఏమీ చెప్పలేదని, అసలు ఇంట్లో పెద్ద వాళ్ళ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడమేమిటన్న ఎన్నో ఆలోచనలు వేధిస్తున్నా, విరించి మాట్లాడుతున్న తీరు గమనించి ఎంతో అనునయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే, "అంటే ఎప్పుడూ ఆ గొర్రెతోకతోనే తృప్తి పడాలా? ఎదిగే ఆలోచన పాపమా?"
ఒకటి కాదు వందరకాలుగా ప్రయత్నం చేసింది అతని ధోరణి మార్చడానికి. ఊహు.. కొరకరానికొయ్యలాగా అడ్డదిడ్డంగా వాదిస్తున్న అతన్ని ఆపలేక ఒక్కుఉదుటన లేచి తలుపుతెరిచి అత్తగార్ని మామగార్ని తీసుకురావటానికి వెళ్ళింది.
అప్పుడే రేడియోలో సంగీత కచేరి అయిపోగానే, కట్టేసి పడుకోవడానికి లేవబోతున్నారు రామారావు, సుమిత్రలు. ఆ టైములో కోడలు కోపంగా తమ దగ్గరకు రావటం చూసి ముందు సుమిత్ర గాభరాగా లేచి నిలబడి, "ఏమైందమ్మా" అంటూ దగ్గరకు వచ్చింది.
తల్లితండ్రి ముందు అనునయంగా చెప్పారు, మన లాంటి వాళ్ళు వ్యాపారాలు చెయ్యలేరని, ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం మీద దృష్టిపెట్టడం అసాధ్యమని, ఎన్నో కష్టనష్టాలను చూపారు. నమ్మించి మోసం చేస్తారు అన్నారు. ఎన్ని చెప్పినా విరించి మొండివాడిలాగా వాదించాడే కానీ అందరి మాటలూ పెడచెవిన పెట్టాడు.
***
రోజులు గడచిపోతున్నాయి. మృదుమధురమైన సంగీతంలాగా సాగిపోతున్న ఆ సంసారంలో, చికాకులు, పోట్లాటలు అపశృతులై నిలిచాయి. విరించి ఒక్కోరోజు ఇంటికి కూడా రాకుండా వ్యాపార పనులమీద తిరుగుతున్నాడు. వాగ్దేవి మాటలు మరచిపోయినట్లు మౌనంగా అన్ని పనులు యాంత్రికంగా చేసుకుంటూ పోతున్నది.
పోనీ అందరి మంచి కోసం అంటున్నాడు, నేనేమన్నా తాగి తందానాలాడుతున్నానా అంటున్నాడు కదా అని ఏదన్నా అడగబోతే తమకి ఏమీ తెలియదంటాడు. అందరికీ అర్థమయింది ఆ ఫ్రెండ్ ఇతనికి ఏమీ చెప్పట్లేదని, ఏదో చీకటి వ్యాపారమే జరుగుతున్నదని. అతనొక్కడికే తను మోసపోతున్నాడని అర్థంకావట్లేదు.
***
రెండురోజుల తరవాత ఇంటికి వచ్చిన విరించి ఎంతో ఉత్సాహముగా, అందర్నీ పేరుపేరునా పిలుస్తూ వచ్చాడు లోపలికి. ముగ్గురూ సంభ్రమంగా హాల్లోకి వచ్చారు.
"ఒకటే వెనక్కి లాగారు అందరూ.. చూడండి ఒక్కనెలలో నావంతు లాభం లక్షరూపాయలు. ఏ ఉద్యోగంలో వస్తాయి, ?" అంటూ పేరుపేరునా అందరికీ బోలెడ్సన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు ఒక్క పసివాళ్లు తప్ప, అందరూ విరించిని ఎగాదిగా చూసారు బోలెడన్ని భయాలు, ప్రశ్నలు మససుల్లో మెదులుతుండగా.
అందరి భావసలు గుచ్చుకుంటున్నట్లు, ఎక్కడో తనకికూడా ఉన్న భయాలను భూతద్దంలో చూపిస్తునట్లు చికాకు పెట్టేసాయి. అంతే చివ్వున లేచి వెళ్ళిపోయాడు.
ఈ సంఘటన తరవాత పదిహేనురోజుల్లో ఇంకో లక్ష రూపాయలు వచ్చాయని చెప్పాడు విరించి. అక్కడ్నించి మనిషి వారంరోజులు లాపతా. ఆరోజు వస్తూనే గదిలో తలుపులేసుకుని ఎవర్నో ఫోన్ లో తిడ్తున్నాడు. ఒక రెండు గంటలు అయాకా తలుపు తీసాడు. కళ్లన్నీ లోతుకుపోయి, చుట్టూనల్లని వలయాలతో, పిల్లలు అన్నట్లు బూచాడిలా ఉన్నాడు.
వాగ్దేవికి ప్రేమ, జాలి పొంగుకు వచ్చి, దగ్గర కూర్చుని కాఫీ తాగిస్తూ, "ఎందుకు కన్నా నిన్ను నువ్వు ఇంత హింసించుకుని సంపాదించటం"? అన్నదోలేదో, "అంతే మరి ఇంట్లోవాళ్ళు ఏడుస్తూ ఉంటే వచ్చే విజయాలు జారిపోతాయి" అని జుట్టులో వేళ్ళు కదుపుతున్న ఆమె చెయ్యి విదిలించేశాడు
ఆరోజు విరించి ఇంట్లో లేని సమయంలో బ్యాంకుమానేజర్ రవి ఫోన్ చేసాడు. అతను సుమిత్రకి బాబాయి కొడుకు. ఫోన్ తీసిన వాగ్దేవితో, ", నాకు అన్నీ తెలుసు. నీకు తెలియనివి చెప్పి హెచ్చరించాలని చేసాను. పదిహేనురోజులైంది, విరించి ఉద్యోగానికి రిజైన్ చేసి. కంగారే్మీ లేదు.. నేను ఇప్పుడప్పుడే ఫార్వార్డ్ చెయ్యను. నువ్వు చెయ్యాల్సిందే ఉన్నది.. విను " అని విచలితురాలవుతున్న ఆమెకు కర్తవ్యం నిర్దేశించాడు.
తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకుని వాగ్దేవి అత్తగారు మావగారికి విషయాలన్నీ చెప్పి వాళ్ళ అనుమతి తీసుకుని పిల్లలతో గడపదాటింది
అటకమీదనుండి ఎంబియ్యే సర్టిఫికెట్ తీసుకున్నది.. న్యూస్ పేపర్ ముందు పెట్టుకున్నది. ఇంక అన్నీ చకచకా జరిగిపోయాయి.. వాగ్దేవి టాలెంట్ కి వాక్ ఇన్ ఇంట్రవ్యూ లో సెలెక్ట్ అయింది. ఇల్లు తీసుకున్నది పుట్టినింటికి దగ్గర్లో పిల్లల్ని తల్లిదగ్గర వదలటానికి వీలుగా. నిండుకునే కళ్ళు తుడుచుకుంటూ, "ఛీ నేను ఏడవను నా భర్త కళ్ళు తెరవడానికి అంతే అంతే' అనుకుని పెదాలమీదుకు నవ్వు తెచ్చుకునేది.
తను వచ్చి మూడు గంటలయినా భార్య, పిల్లలు కనపడక పిచ్చెత్తిపోతున్నది విరించికి.
ఉండబట్టలెక తల్లిని అడిగాడు.. ఆవిడ ముభావసంగా పుట్టింటికి వెళ్లిందని చెప్పింది. షాక్ తిన్నాడు, "అదేమిటి నాకు చెప్పకుండానే.. మధ్యలోనే మనసు నిలేసింది.. 'నువ్వు అన్నీ చెప్తున్నావా? ఇంకా మీ మధ్య అలాంటి సంబంధాలున్నాయనుకుంటున్నావా? అయితే లేవా?',
విరించి బుర్ర తిరిగిపోయింది.
'తనెంత ఘోరంగా మోసపోయాడో చెప్పుకుని సేద తీరాలని వస్తే వాగ్దేవి లేదు. ఆమె చెప్పింది కానీ, నేను తల్లిదండ్రులు చెప్పింది కానీ ఒక్కటైనా విన్నాడా తాను, ఇప్పుడు అంగలారిస్తే ఏమి లాభం, ?. అసలు తను ఉద్యోగం రిజైన్ చేసినట్లు ఎవ్వరికీ చెప్పలేదు.
ఎలా చెప్పాలో తోచడంలేదు. ఇప్పుడు వీడు నన్ను ఘోరంగా మోసం చేసాడు. భగవంతుడా! ఎంత తప్పు చేసాను ఎవరి మాటా వినకుండా. '
'అసలు జరిగిందంతా తలుచుకుంటే ఎవతో గ్రాఫ్ గీసినట్లు అన్నీ ఇలా ఎలా జరిగాయో అనిపిస్తుంది. దేవి అసలు నన్ను పటించుకోవడం మానేసింది ఆ మధ్య ఎంతసేపు పిల్లల పని, పిల్లల అవసరాలు అంటూ రోజులు రోజులు ఒకసరదా లేదు, ఫ్రీగా కూర్చుని మాట్లాడుకోవడం లేదు. ఎన్నడూ లేనిది తమిద్దరి మధ్యా గత ఆరునెలులుగా ఎప్పుడూ ఏదో వాదన.
ఆ అసంతృప్తిలో తనుండగా, ఎప్పుడో ఇంటర్ దాకా కలిసి చదువుకున్న గోపి కలిసి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లి వాడి వైభవమంతా చూపించి నన్ను టెంప్ట్ చేసాడు. నాలో ఎప్పటినించి ఉన్నదో ఈ ధనదాహం? ఎండమావుల వెంట పరిగెత్తాను. ఇప్పుడు.. మంచి ఉద్యోగం పోయింది, మధ్యలో వచ్చిన, నరం మీద పుండులాంటి ఐశ్వర్యమూ పోయింది. నేను వెళ్లి పిలిస్తే నా దేవి వస్తుందా, పిల్లలు నాన్నా అని మళ్ళీ పిలిచి చుట్టూ చుట్టూ తిరిగే రోజులు ఉన్నాయా నాకు?
పాలకుండలాంటి సంసారంలో విషం గుమ్మరించుకున్నాను. నాకు శిక్ష చావు ఒక్కటే.. అదే పరిష్కారం" హిస్టిరికల్ గా ఏడ వడం మొదలెట్టాడు.
పెద్ద బల్లని ఫ్యాన్ దగ్గరకి జరిపే ప్రయత్నం చేసాడు. విరించిని నిమిషానికోసారి వచ్చి చూస్తున్న రామారావు విరించి ప్రయత్నం చూసి, దగ్గరకు వెళ్లి లాగి ఒక్క లెంపకాయ వేసాడు. కదిలి కదిలి ఏడుస్తున్న కొడుకుని పొదువుకున్నాడు. అంతలో సుమిత్ర కూడా వచ్చి అక్కున చేర్చుకున్నది.
ఆరోజు ఆఫీసునుండి వచ్చిన వాగ్దేవి ఇంట్లో అత్తమామలను చూసి ఇంకెవరికోసమో వెతుక్కోసాగింది. ఆమెకి అన్ని సంగతులూ రవి, అతగార్ల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. రవి ఆ గోపిని వదలద్దు అంతు చూద్దామంటే, రామారావు, సుమిత్ర, "మన బంగారం మంచిది కానప్పుడు మనం ఏమి మాట్లాడగలం. వద్దు.. పిల్లవాడికి ఏ అలవాట్లు మప్పలేదు. అంతమటుకు చాలా అదృష్టవంతులం కదా " అని అక్కడికి ఆ దరిద్రం వదిలింది అదే పదివేలు అనుకున్నారు.
విరించి కారు గుర్తుపట్టిన విభవ్ తాతని వదిలించేసుకుని, "నాన్న నాన్న” అని గదులన్నీ కలియతిరిగి అమ్మ పడుకునే మంచం మీద నాన్నని కనుక్కున్నాడు. విజయగర్వంతో పొట్టమీదకు ఎక్కి అలకలు, గారాబాలు ఇన్ని రోజుల బాకీలు చెల్లించుకున్నాడు. వాడి చెల్లి కూడా పోటీకి వెళ్ళింది. ఒక్క మాట లేకుండా, కోల్పోయిన బిడ్డల పరిశ్వాంగాన్ని తనివితీరా అనుభభిస్తున్నాడు.
రామారావు లోపలికి వచ్చి, పిల్లని ఎత్తుకుని వాణ్ని మంచం మీదనుండి దింపి, " అమ్మతాత ఐస్క్రీమ్ తెచ్చాడుట. రా మరి తొందరగా వెళ్ళాలి కరిగిపోతుంది. "
ఐస్క్రీమ్ మీద ఎంత వ్యామోహమున్నా తండ్రి వెళ్ళిపోతాడేమోనన్న భయం వాణ్ని కదలనివ్వడం లేదు. ఆఖరికి వ్యామోహనికి, బంధానికి మధ్య వాడు బంధానికే విలువనిచ్చి రానంటే రానన్నాడు. విరించికి ఎవరో చెళ్ళున చరచినట్లునిపించింది, చిన్నపిల్లవాడు బంధానికిచ్చే విలువ చూసి!ఆయనే వెళ్లి ఐస్క్రీమ్ తెచ్చాక ఎన్నో విధాల వాడికి తండ్రి ఎక్కడికీ వెళ్లడని నమ్మకం కుదిరాక ముందుగదిలో ఐస్క్రీమ్ తినేందుకు వెళ్ళాడు.
వాగ్దేవి గదిలోకి వచ్చింది. ఘోరమైన తన తప్పు. భారంతో క్రుంగిపోతున్న విరించి కూర్చున్న చోటనే కన్నీరుమున్నీరు ఔతున్నాడు. అర్థం చేసుకున్న వాగ్దేవి పరుగున వచ్చి ఎదకు హత్తుకుని చిన్నపిల్లవాడినిలాగా లాలించింది.
అన్ని తప్పులూ ఒప్పుకుని, తాను మూసిన పుస్తకంలోని విషయాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆమె కూడా తాను దాచిన విషయాలన్నీ చెప్పింది.
"నువ్వు అనుకున్నట్లు ప్రతి చదువుకుని ఉద్యోగం చేసే ఆడపిల్లా సంసారాన్ని పాడు చేసుకోదు కన్నా. అసలు భార్యాభర్తల బంధంలో దాపరికాల వలన ఎన్నో అనర్ధాలు, ఇచ్చి పుచ్చుకోక ఇంకా కొన్ని, త్యాగం అనే మాటేలేక ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు నీ దృష్టికోణం మార్చుకోవాలి. నా చదువు నీ దగ్గర దాచి నేను ఎంత అవస్థపడ్డానో ఆ భగవానుడికే ఎరుక!
దేవీ! ఇప్పుడు తమరి ఉద్యోగమే మనకి ఫుడ్ పెట్టేది. మరి ఇంకా నా ఆలోచన తప్పుకాదని అనగలనా?. నువ్వు ఎంత ఇస్తావో నీ దయ దేవీ" నాటకీయంగా. అంటున్న భర్త చెయ్యి చెంపకి ఆనించుకుని, " నిన్ను ఎప్పుడూ అగ్రాన నిలబెడతాము మేమందరమూ. నీ తొందరపాటు కాగితం, చెత్తబుట్ట దాఖలు చేసారు మా రవిబాబాయి. "
అవునా అని తెగ ఉత్సాహపడిపోతున్న రవిని ఆపుతూ వాగ్దేవి, " కొన్ని షరతులున్నాయి బాబూ.. ముందులాగా రోజూ అలకలు ఒప్పుకోబడవు.. వారానికి ఒక్కసారే అనుమతి. పిల్లలతోనే నా సమయం గడిచి పోతున్నదని వగచకపోవడమే కాక వాళ్ళ పనులు తమరు కూడా పంచుకోవాలి ప్రేమగా".
ఇద్దరూ తమమనసుల మాలిన్యాన్ని మాపుకుని, మల్లెల సౌరభాన్ని నింపుకున్నారు!
భార్యా భర్తలు పోట్లాటలు చిటపట చినుకుల్లా కాసేపే ఉంటే ఆ సొగసుతో ఎస్ అప్పుడు వాళ్ళు ఒకరికి ఒకరై ఇద్దరూ ఒక్కటే అవుతారు!
********************************
సమాప్తం.
విజయా సుందర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar
నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.
'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!




Comments