top of page

అరుంధతి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి

'Arundhathi' New Telugu Story


Written By: Ch. C. S. Sarma
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"నాన్నగారూ!... పరమేశ్వర మామయ్య, విశ్వం వాళ్ళు ఎలా వున్నారు?..." అడిగాడు శ్రీనివాస్.

శ్రీనివాస్ తండ్రి నారాయణమూర్తి. తల్లి సావిత్రి. యీ దంపతుల ప్రథమ సంతానం శ్రీనివాస్. ఐదేళ్ళు అమెరికాలో వుండి స్వదేశానికి వచ్చి చెన్నై లో యల్&టి కంపెనీలో జి.యం గా పని చేస్తున్నారు. పది రోజుల శలవు మీద తల్లిదండ్రులను చూడాలని, భార్య రేవతి, ఐదేళ్ళ కొడుకు రఘురామ్, రెండేళ్ళ కూతురు స్వాతితో ఆంధ్రాలోని సొంత వూరికి వచ్చాడు.

అతనికి ఒక చెల్లెలు, పేరు కుసుమ, ఆమె వివాహం, ఇతని వివాహానికి ముందు మూడేళ్ళ క్రితం జరిగింది. ఆమె భర్త విజయవాడలో ఆంధ్రా బ్యాక్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప... శశి, ఒక బాబు కార్తీక్. వయస్సు ఎనిమిది, ఏడు... కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు.

మహాశివరాత్రి నాడు అంటే ... మాఘమాసపు కృష్ణ పక్షంలో వచ్చే మహాశివరాత్రి నాడు, వీరి కుటుంబం ఆవూరి శివాలయంలో, నమక చమక రుద్రాభిషేకం... రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించడం ఆనవాయితీ, ఆకారణంగా చెల్లెలు కుమమ... భర్త, పిల్లలతో అమ్మ గారింటికి వచ్చింది.

డెబ్బై ఐదేళ్ళ పరమేశ్వర శాస్త్రి, నారాయణ మూర్తి బావగారు... అన్నీ కార్యక్రమాలనూ జరిపిస్తారు. సిద్ధాంతి "వారికేం తక్కువ ఆ పార్వతీపరమేశ్వరుల కటాక్షంతో మీరు హాయిగా వున్నారు. పెద్దవాడు సోము డాక్టరాయె. చిన్న వాడు విశ్వం మామయ్య దగ్గర అన్నీ నేర్చుకొని శాస్తుర్లు అయినాడు. మంచి వాక్ శుద్ధి వున్నవాడు. యీ చుట్టుప్రక్కల గ్రామవాసులు అందరూ వచ్చి, ముహూర్తాలు, శంకుస్థాపనలు, వివాహాలు వీరిచేత జరిపించుకొంటారు. వీరి మాట అంటే అందరికీ గురి... మంచి నమ్మకం.

మన సనాతన ధర్మాన్ని నమ్మి... దానికి సంబందించిన విద్వత్తును తండ్రి దగ్గర అభ్యసించి, ఆచరిస్తూ యీ నవనాగరికతకు అతీతంగా... బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు... జన్మను సార్థకతను చేసికొనే దిశలో పయనిస్తున్నాడు విశ్వం. యిలాంటి వారు కొంతమందన్నా లేకపోతే... నీలాంటి వారికి మన సంస్కృతి, సాంప్రదాయాలను గురించి చెప్పేవారెవరు?... వాడి యిల్లాలు కుసుమ వాడికి అన్నివిధాలా తగింది. వీరికి ఒక కొడుకు ఐదేళ్ళ వాడు బాలసుబ్రహ్మణ్యం.


పెద్దవాడు సోమసుందర్ గుంటూర్లో వుంటున్నాడు. వాడి అత్తగారి వూరూ అదే. వాడి భార్యా డాక్టరే, తెలుసుగా!... వారికి ఒక ఆడ ఒక మగ. కాన్వెంట్ స్కూల్ చదువుతున్నారు. వాళ్ళ వయస్సు ఐదు, ఏడు.

'ఏమిటి బావా.'... ఒకణ్ణి డాక్టర్‌ని చేశావు... ఒకణ్ణి పురోహితుణ్ణి చేశావు అని మా మామయ్యను అడిగితే... వారు యిచ్చే సమాధానం...

'ఎవడి యోగం వాడిది. అది నిర్ణయించేది ఆ సర్వేశ్వరుడు. దాన్ని మార్చ కలిగిన శక్తి మనచేతుల్లో లేదు నారాయణా!... అంతా ఆ పైవాడి లీల...' నవ్వుతూ వారు ఇచ్చే సమాధానం యిది.

నారాయణ ముర్తి గారి మాటల్లో, వారి బావగారైన పరమేశ్వర శాస్త్రి గారి పట్ల వారికి వున్న గౌరవాభిమానాలు శ్రీనివాస్ కు అర్థం అయినాయి.

"నాన్నా... నేను వెళ్ళి మామయ్యను విశ్వాన్ని కలసి మాట్లాడి వస్తాను. యిప్పుడు రాత్రి ఎనిమిది గంటలు. యిరువురూ యింట్లో విశ్రాంతిగా వుంటారుగా?..."

"అవును. యిది వారి భోజనాల సమయం. నిన్ను తినమంటే తినిరా!... వద్దని బెట్టు చేయకు. మా బావగారు బాధ పడతారు..." నవ్వుతూ చెప్పాడు నారాయణ మూర్తి.

"అలాగే నాన్నా!..." చెప్పి, శ్రీనివాస్... విశ్వం యింటి వైపుకు బయలుదేరాడు. ఆకాశం వైపు చూచాడు.

ఆ రోజు కృష్ణ పక్ష సప్తమి, చంద్రోదయం. రాత్రి పన్నిండు గంటల తర్వాతే అవుతుంది. ఆకాశం.... నిర్మలంగా లేత నీలిరంగు తివాసీలా గోచరిస్తూవుంది. ఎన్నో నక్షత్రాలు, అవి భూమి నుంచి వున్న దూరాన్ని బట్టి వాటి సహజ కాంతితో ప్రకాశిస్తున్నాయి. 'జన్మరాహిత్యం చెందిన వ్యక్తి మరణానంతరం తారగా ఆకాశాన నిలిచిపోతాడు శీనీ'. ఏనాడో తన నాయనమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. 'అది గొప్ప యోగం' అనుకొన్నాడు శ్రీనివాస్. *** శ్రీనివాస్ ఆస్థికుడు. దైవం మీద నమ్మిక, పెద్దలయందు గౌరవం కలవాడు. ఖర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు. విశ్వం యింటిని సమీపించాడు.

వరండాలో కూర్చొని పిల్లలతో మాట్లాడుతుండిన విశ్వం... శ్రీనివాస్ రాకను గమనించారు. ఎదురుగా వెళ్ళి, సాదరంగా పలకరించి శ్రీనీ చేతిని తన చేతిలోకి నవ్వుతూ తీసుకున్నాడు. యిరువురూ యింట్లోకి ప్రవేశించారు. అందరినీ ప్రీతిగా పలకరించాడు శ్రీనివాస్.

పరమేశ్వర శాస్త్రి గారు... శ్రీనివాస్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలను గురించి పేరుపేరునా అడిగాడు. నవ్వుతూ 'అంతా క్షేమం మామయ్యా!...' సమాధానం చెప్పాడు శ్రీనివాస్.

ఆ కుటుంబ సభ్యులతో కలసి భోంచేశాడు. భోజనానంతరం యిరువురూ యింటి టెర్రస్ మీదికి వెళ్ళారు.

శ్రీనివాస్ ఆకాశం వైపుకు చూచాడు. తన నాయనమ్మ మాట గుర్తుకు వచ్చింది. అది నిజమా కాదా అని విశ్వాన్ని అడిగి తెలుసుకోవాలనుకొన్నాడు "బావా!..." "చెప్పు శ్రీనీ"

"మంచి మనుషులు చచ్చిపోయిన తర్వాత మరుజన్మ లేకుండా ఆకాశంలో తారలుగా నిలిచిపోతారని నాయనమ్మ చెప్పేది. అది నిజమేనా?..."

"ఆస్థికతను నమ్మితే నిజం. నాస్థికతను నమ్మితే అబద్ధం." నవ్యాడు విశ్వం. క్షణం తర్వాత "అవును యీ విచారం నీలో యిప్పుడు ఎందుకు కలిగింది?..." అడిగాడు విశ్వం.

"మనిషిగా పుట్టిన వాడు ఏదో ఒక నాడు చావవలసిందే కదా బావా!..." "అందుకని?..." "అ తరువాత ఏంజరుగుతుందో తెలిసికోవాలన్నదే నా కోరిక"

"మనం ఖర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం. ఎన్నో కోట్ల జీవరాసులు వున్న యీ విశ్వంలో మనిషి మహాన్నతుడు. మిగతా ఏజీవరానికీ లేని జ్ఞాపక శక్తిని ఆ సర్వేశ్వరుడు మనిషికి ప్రసాదించాడు. ఆశక్తి నుండి వెలువడినవే... ఆలోచన, జ్ఞాపకం, ఆచరణ... యుక్తాయుక్త విచక్షణతో యీ శక్తులను వాడుకున్నవాడే వుత్తముడౌతాడు. స్వార్ధతో, స్వాతిశయంతో తన్ను మరచి.. వ్యవహారించేవాడు అధముడౌతాడు. మంచి వారికి మరణానంతరం సద్గతులు సంప్రాప్తిస్తాయి. చెడ్డ వాడికి పునరపిజననం... పునరపి మరణం... తథ్యం. జన్మ రాహిత్యమే మోక్షం ఇదే నీ ప్రశ్నకు నాకు తెలిసిన సమాధానం. ఆకాశంలో ఆవైపు చూడు... ఎక్కువ కాంతితో వెలుగుతున్న ఎనిమిది నక్షత్రాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి.


ఆ నక్షత్రాలకు సప్త ఋషి మండలం అని పేరు. సప్త అంటే ఏడు. ఆ ఎనిమదవ నక్షత్రం అరుంధతి. వివాహానంతరం వధూవరులకు పురోహితుడు ఆ దిశలో అరుంధతి నక్షతం వున్నట్లు చూపుతాడు. వధూవరుల చేత నమస్కారం చేయిస్తాడు. కారణం ఆ వధూవరులను ఆ సప్త ఋషులు అరుంధతిమాత కాచి రక్షిస్తారనేది మన నమ్మకం. పగటిపూట మనకు నక్షత్ర దర్శనం కాకపోయినా తరతరాలుగా మన పెద్దలు నమ్మి, మనకు నేర్పి మనం ఆచరించే విధానం ఇది. మరోమాట ఆరు నెలలలోపల గతించే వారికి సప్తఋషి మండలంలో వున్న అరుంధతి నక్షత్రం రాత్రి పూట చూచినప్పుడు కనపించదు. యిది నిజం. నా స్వానుభవం.

అమ్మ చివరి రోజుల్లో ఒకనాడు నేను, అమ్మా మేడ మీదికి వచ్చిన అమ్మకు ఆ నక్షత్ర మండల విషయం బాగా తెలుసు. నా చిన్నతనంలో అమ్మే నాకు ఆ నక్షత్ర మండలాన్ని చూపించి, అరుంధతి మాతను గురించి చెప్పింది. అప్పటి నుండి... నేను రాత్రి సమయంలో మేడ మీదికి ప్రతిసారి... ఆ నక్షత్రాలను చూస్తూ వుండేవాణ్ణి.

అమ్మ ఆరు నెలల్లో చనిపోబోతుందనగా ఒకనాడు... మేమిద్దరం మేడ మీదికి వచ్చాము. చైత్ర కృష్ణ పక్ష అమావాస్య. వినువీధిలో నక్షత్రాలు ఎంతో శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి నేను నక్షత్ర మండలాన్ని అరుంధతి నక్షత్రాన్ని చూచాను.

"అమ్మా!... నక్షత్ర మండలాన్ని చూడు. ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతూ వుందో!..." అన్నాను నవ్వుతూ.

అమ్మ పరీక్షగా ఆకాశాన్ని చూచింది ఆమె నోటి నుంచి ఏ మాటా రాలేదు. కొద్ది క్షణాల తర్వాత... నవ్వుతూ...

"అ... అ... అవునవును ఎంతో బాగుంది" పేలవంగా నవ్వునూ అమ్మ, "నాయనా!... విశ్వా!... నేను క్రిందికి వెళుతున్నా!..." వేగంగా అమ్మ క్రిందికి పోయింది. నేను మౌనంగా అమ్మను అనుసరించాను.

తర్వాత... ఆరునెలల్లో ఆమె ఆరోగ్యం కేన్సర్ రీత్యా పాడయింది. ఆఖరిక్షణాల్లో అమ్మ నన్ను దగ్గరకు రమ్మని పిలిచింది.

"ఆరునెలల క్రిందట మనం మేడ మీదికి వెళ్ళాము. నీకు గుర్తుందా!... ఆ రోజు నాకు అరుంధతీ మాత కనిపించలేదు. నేను వచ్చిన పనులన్నీ పూర్తయినాయి. వెళ్ళిపోతున్నాను. నాన్నగారిని జాగ్రత్తగా చూచుకొంటానని నాకు మాట యివ్వు..." కన్నీటితో అమ్మ చేయిజాచింది. నేను నా కుడి చేతిని ఆమె చేతిలో వుంచాను. ఆనందంగా ఆమె నవ్వింది. ఆ పై క్షణంలో ఆమె కన్ను మూసింది. అప్పటి నుంచి యిప్పటి వరకూ నేను మా అమ్మను ఆ అరుంధతి నక్షత్రంలో చూడగలుగుతున్నాను..." వేగంగా చెప్పుకొచ్చిన విశ్వం ఆగిపోయాడు. ఆశ్చర్యంగా శ్రీనివాస్ అతన్ని సమీపించి కళ్ళల్లోకి చూచాడు. విశ్వం చెక్కిళ్ళపై జారిన కన్నీటిని చూచాడు. మనస్సులో ఏదో బాధ. యిరువురూ కొద్ది క్షణాలు శిలా ప్రతిమల్లా నిలబడి పోయారు.

కన్నీటిని పై పంచతో తుడుచుకుంటూ... "పద శీనూ!... క్రిందికి వెళదాం" అన్నాడు విశ్వం. యిరువురూ క్రిందికి నడిచారు. శీను అందరికి చెప్పి తన యింటికి వెళ్లిపోయాడు. అమరుసటి దినం రాత్రి భోజనానంతరం... తండ్రి చేతిని పట్టుకొని నారాయణమూర్తి యింటి ముందటి వున్న ఖాళీస్థలంలోకి తీసికొని వచ్చాడు శ్రీనివాస్.

ఆనాటి భోజనాల సమయంలో తన మేనత్త చివరి రోజుల చర్చ జరిగింది ఆ కుటుంబ సభ్యుల మధ్యన. తనయుడు తన్ను ఎందుకు బయటికి తీసుకుని వచ్చాడో ఎరిగిన నారాయణమూర్తి నవ్వుతూ... "శీనీ! అదిగో ఆ దేదీప్యమానంగా సప్తఋషి మండలంలో ప్రకాశించేదే... అరుంధతి. యీ ఉదయం నేను వ్రాసిన వీలునామాను మనస్సున ఉంచుకొని నాకు అరుంధతి మాత కనబడుతుందో లేదో తెలిసి కోవాలనే కదా నన్ను బయటికి లాక్కొచ్చావు?..." నవ్వాడు నారాయణమూర్తి. "ఒరేయ్ నేను ఇప్పుడప్పుడే చావను. నా నిర్యాణం నా మనవరాలు స్వాతి వివాహానంతరమే!... మరి వీలునామా ఎందుకు వ్రాశారంటావా!... మీ మీ ఆస్తులను మీరు కోరిన విధంగా మీ అభివృద్ధికి వాడుకోగలరని... వాడుకోవాలని నా ఆశ" కొడుకు భుజం తట్టి చెప్పాడు. నారాయణమూర్తి నవ్వుతూ ఇంట్లోకి వెళ్లిపోయాడు.

ఆకాశంలో దేదేప్యనంగా ప్రకాశిస్తున్న సప్త ఋషి మండలానికి, అరుంధతీ నక్షత్రానికి చేతులు జోడించి నమస్కరించి, "దేవతలారా!... అందరిని చల్లగా కాచి రక్షించండి" భక్తితో కోరుకున్నాడు శ్రీనివాస్. ***-సమాప్తం-***

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.46 views0 comments
bottom of page