top of page

ఆషాఢంలో మైదాకు



'Ashadamlo Maidaku' - New Telugu Story Written By Lakshmi Madan

'ఆషాఢంలో మైదాకు' తెలుగు కథ

రచన: లక్ష్మి మదన్


🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿


ఆషాఢ మాసం వచ్చింది మొదలు మా నాయనమ్మ సనుగుడు మొదలయ్యేది.. "వానలు వడుతున్నయి, మైదాకు ( గోరింటాకు ) వెట్కొండి ఓ పిల్లలూ " అనేది. వానలు పడుతుంటే గోళ్లకు చేతులకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది మైదాకు. మాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అని చూసే వాళ్ళము.


ఇక మా పాట్లు మొదలయ్యేవి.. మా ఇంటికి దూరంగా ముస్లిం ఇళ్ళు ఉండేవి. రెండు ఇళ్లలో చెట్లు ఉండేవి. ఇద్దరం ముగ్గురం పిల్లలం కలిసి వాళ్ళింటికి పోయే వాళ్ళము. పాత ఇళ్లు.. కులి పోయేలా ఉన్న గోడల నడుమ చెట్లు. తలుపులు గట్టిగా గొళ్ళెం పెట్టి ఉంచే వాళ్ళు.


మెల్లిగా తలుపు కొడితే తీసి "మీకి ఏమి కావాలి.. ఎందుకు తలుపు కొట్టినయి" అని అడిగితే.. భయం భయంగా "కొంచెం మైదాకు తెంపుకుంటాము" అని అడిగితే.. “నయి నయ్” అని ధడెలున దర్వాజా పెట్టుకునే వాళ్ళు.


ఇక బిక్క మొహాలు పెట్టుకుని మరో ఇంట్లో మా అదృష్టం పరీక్షించుకునేందుకు పోయే వాళ్ళము. దేవుడి దయ వాళ్ళ ఆ ఇంట్లో అనుమతి దొరికింది.. మెల్లగ ముల్లు గుచ్చు కోకుండా కొంచెం తెంపుకుని సంబరంగా ఇళ్ళకి పోయే వాళ్ళము.


ఇంటికి వెళ్ళాక అమ్మని పోరు పెట్టి ఇప్పుడే రుబ్బు అని రుబ్బించుకుని తొందరగా అన్నాలు తిని రెడీ అయ్యే వాళ్ళము. అమ్మ చామంతి ఆకులు లేదా బంతి ఆకులు కొడుకొచ్చి చేతి మధ్యలో పరచి రెండు చేతుల నిండా గోరింటాకు పెట్టి బట్టలకి అంటే కుండా చిన్న బట్టలు కట్టేది. ఓ పక్క పెద్ద వర్షం పడుతుంటే విపరీతంగా చలి పెట్టేది.. ఈ ఆకు ముద్దలు మరింత చలి పెట్టేది. అయినా ఆకు మీద మక్కువతో అలాగే ఉంచుకునే వాళ్ళము. రాత్రంతా కలలే.. ఎర్రగా పండి నట్లు..


తెల్ల వారి లేవగానే చేతులు విప్పి చూసుకుని ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఎంత మురిసి పోయే వాళ్ళము. తర్వాత చేతులు కడిగి కొబ్బరి నూనె రాసి అందమైన చేతులను అందరికీ చూపెట్టి సంబర పడే వాళ్ళము. స్కూల్ కి వెళ్ళాక పెద్ద చర్చలు జరిగేవి.. అన్ని తరగతుల వాళ్ళము ఒకరికి ఒకరం చూపించుకుని నెమళ్ళ లా నర్తించే వాళ్ళము.


చిన్న చిన్న సరదాలు ఎంత బాగుండేవి. ఎన్ని కోట్లు పెట్టినా అంత సంతోషం ఈ నాడు దొరకదు.. ఇప్పుడు కోన్లు తెచ్చి పెట్టుకుని మమ అనిపించు కుంటున్నాము.

***


లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు


47 views0 comments

Comments


bottom of page