top of page
Original.png

అసూయ

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

అసూయ, రోహిణి భైరవజోశ్యులు, తెలుగు కథ, jealousy story Telugu, family drama Telugu, emotional Telugu story, marriage alliance story, Telugu literature, inspirational Telugu story, human emotions, jealousy and envy, Telugu short story, moral story Telugu, relationship story

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అసూయ' కథలో అసూయతో మంచి పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాలని ప్రయత్నించిన వారి మధ్య, నిజం మరియు మంచితనం విజయం సాధించిన కథను ప్రతిబింబించే దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అసూయ' కథలో అసూయతో మంచి పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాలని ప్రయత్నించిన వారి మధ్య, నిజం మరియు మంచితనం విజయం సాధించిన కథను ప్రతిబింబించే దృశ్యం.

Asuya - Telugu family Emotional Story | Rohini bhairavajosyulu

అసూయ తెలుగు కుటుంబ భావోద్వేగ కథ | రోహిణి భైరవజోశ్యులు

Published in manatelugukathalu.com on 18/06/2026


అసూయ మనిషిని ఎంత దిగజార్చగలదో, ఒక మంచి సంబంధాన్ని కూడా ఎలా చెడగొట్టాలని ప్రేరేపిస్తుందో చూపించే కథ "అసూయ". సుప్రజ అనే మంచితనంతో నిండిన యువతికి కుదిరిన డాక్టర్ సంబంధాన్ని చూసి పక్కింటి పంకజాక్షి కుటుంబం ఈర్ష్యతో చేసిన కుట్రలు, అబద్ధాలు, వాటి ఫలితంగా జరిగిన సంఘటనలు కథలో ఆసక్తికరంగా మలిచబడ్డాయి. అయితే నిజం, మంచితనం, వివేకం చివరికి ఎలా విజయం సాధించాయో రచయిత్రి హృద్యంగా చిత్రించారు. కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, అసూయ వల్ల కలిగే దుష్పరిణామాలను ఆలోచింపజేసే చక్కని కథ.


“ఈ సంవత్సరంతో అమ్మాయి చదువు అయిపోతుంది. ఇక దానికి పెళ్లి సంబంధాలు చూడండి. కుదిరితే ఈ శ్రావణ మాసంలోనే చేసేద్దాం. ” ఆనందరావుతో అన్నది కమల. 


“ఈ మాటే మీ అన్నయ్య అవధాని చెవిలో వేశాను. ఏవో సంబంధాలు ఉన్నాయి బావగారూ, రేపో ఎల్లుండో ఇంటికి వచ్చి అన్నీ వివరాలు మాట్లాడుతాను అన్నాడే!” చెప్పాడు ఆనందరావు. 


లోపలి గదిలో ఉన్న సుప్రజ సిగ్గుపడిపోయింది. 

******

"అమ్మాయి కమలా! ఆనందరావు ఉన్నాడా?" అంటూ లోపలికి వచ్చాడు అవధాని. 


"రండి అన్నయ్యగారూ! మీకోసమే ఎదురు చూస్తున్నాము. ఏమండీ! ఎవరొచ్చారో చూడండి" అంటూ గదిలో ఉన్న భర్త ఆనందరావును పిలిచింది. 


ఇద్దరికీ నిమ్మకాయ నీళ్ళు ఇచ్చింది. 


"మనమ్మాయి సుప్రజకు ఎన్నో సంబంధాలు వసున్నాయి. అన్నిట్లోనూ చాలా మంచి సంబంధం ఇది. అబ్బాయి డాక్టర్. పేరు సురేష్. అబ్బాయి తండ్రి పేరు విష్ణువర్ధనరావు. ఆయన మంచి హోదా గల ఉద్యోగంలో ఉన్నాడు. మంచి ఆస్తిపాస్తులున్నవాళ్ళు. వాళ్ళకు ఈ అబ్బాయి ఒక్కడే. వాళ్ళకు కట్నాలమీద ఆశ లేదు. ఏదో సంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి అయితే చాలట. మీకు ఎలాగూ నచ్చుతుంది కదా అని నేను ఇద్దరి జాతకాలు చూశాను. బ్రహ్మాండంగా సరిపోయింది. ఇదిగో అబ్బాయి ఫోటో. " అంటూ వాళ్ల వివరాలు అన్నీ చెప్పాడు. 


"బావగారూ! ఎంత మంచి వార్త చెప్పారండీ! ఎంతైనా మన సుప్రజ అదృష్టవంతురాలు. మంచి సంబంధం. వెంటనే పెళ్ళిచూపులు ఏర్పాట్లు చేసేయండి. ఈ సంబంధం కుదిరితే నాకూ నిశ్చింత. అమ్మాయికి త్వరగా పెళ్లి చేయాలని నాకూ ఉంది. " అన్నాడు ఆనందరావు. 


“మన సుప్రజకేం తక్కువ ఆనందం! మంచి కళ అయిన మొహంతో అచ్చు లక్ష్మీదేవిలా ఉంటుంది. ఇక చదువు విషయమంటావా! సరస్వతీ దేవే! అన్నిట్లోనూ ఫస్టు మార్కులతో ఎమ్మెస్సీ పాస్ అయింది. ఇంతకీ ఈ సంబంధం సుప్రజకిష్టమో లేదో కనుక్కోండి. పెళ్లిచూపులకు పిలిచాక, నాకిష్టంలేదూ అంటే కష్టం కదా!” గట్టిగా నవ్వేస్తూ అన్నాడు అవధాని. 


“మా అమ్మాయని చెప్పుకోవడం కాదు కానీ అన్నయ్యా! అది ఈ కాలం పిల్లల్లాంటిది కాదు. దానికి మేమెంత చెప్తే అంత. ఇంత మంచి సంబంధాన్ని కాలదన్నుకుంటుందా! ఉండండి ఈ ఫోటో అమ్మాయికిచ్చేసి వస్తాను. ” లోపలికి వెళ్ళి, అబ్బాయి ఫోటో సుప్రజకు ఇచ్చింది కమల. 


అందంగా, తీర్చిదిద్దినట్టుగా ఉన్న ఆ అబ్బాయి ఫోటో చూస్తూనే సుప్రజ మొహం వికసించింది. అంతలోనే సిగ్గు దొంతరలు మొగ్గ వేసింది. 


“అన్నయ్యా! అమ్మాయికీ సంబంధం ఇష్టమే. ఇక వాళ్ళను వచ్చి అమ్మాయిని చూసుకోమని చెప్పండి. ” ఆత్రపడుతూ అన్నది కమల. 

********

“విష్ణువర్ధనరావుగారూ! మీరడిగినట్టు మంచి సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయి సంబంధం తెచ్చానండి. ఇదిగో ఆ అమ్మాయి ఫోటో. చూడ చక్కని పిల్ల. ఎమ్మెస్సీ చేసిందన్న మాటే కానీ ఈనాటికీ తల్లితండ్రులు ఏం చెప్తే అదే. 


ఈనాటి అమ్మాయిలలాగా ఆధునిక పోకడలు లేవు. పూజాలూ, పునస్కారాలూ చేస్తుంది. మనబ్బాయికి మంచి ఈడూ జోడూ. ” అంటూ సుప్రజ ఫోటో ఇచ్చాడు. 


విష్ణువర్ధనరావు, సుప్రజ ఫోటో చూసి తృప్తిగా తల ఆడించాడు. 

“సాయంత్రం హాస్పిటల్ నుంచి వచ్చాక మా అబ్బాయికి చూపించి, ఏ మాటో మీకు ఫోన్ చేస్తాను. ” అన్నాడాయన. 


విష్ణువర్ధనరావు భార్య గిరిజకు కూడా ఈ సంబంధం వివరాలు విన్నాక తృప్తిగా అనిపించింది. 


“ఇదిగో సురేష్! ఈ అమ్మాయి ఫోటో చూడు. నీకు నచ్చితే పెళ్లి చూపులకు వస్తామని వాళ్ళకు అవధానిగారి ద్వారా కబురు పెడదాము. ” అన్నాడు విష్ణువర్ధనరావు ఆ సాయంత్రం హాస్పిటల్ నుంచి వచ్చిన కొడుకుతో. అన్ని వివరాలూ చెప్పాడు. 


ఫోటోలో సుప్రజ అమాయకంగా, ఎంతో అందంగా కనిపించింది. తనకు నచ్చినట్టు తండ్రికి తన ఇష్టం చెప్పాడు. 


ఈ విషయం వెంటనే అవధానికి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన సంతోషంగా ఆనందరావుకు ఈ విషయం చెప్పాడు. 


“ఆనందూ! ఆ డాక్టర్ సంబంధం వాళ్ళకు మనమ్మాయి ఫోటో తెగ నచ్చిందనుకో. వచ్చే ఆదివారం పెళ్లిచూపులకు వస్తామని, మీకు కబురు చేయమన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందిరా!” అన్నాడు. 

 *******

ఆరోజు అవధాని తోడు రాగా విష్ణువర్ధనరావు, అతని భార్య గిరిజ, కొడుకు సురేష్.. అందరూ పెళ్లి చూపులకు వచ్చారు. సుప్రజ వాళ్ళకు బాగా నచ్చింది. 


“అమ్మాయి సంగీతం కూడా నేర్చుకుంది. ” అవధాని, విష్ణువర్ధనరావుతో అని, “అమ్మాయ్! మంచి కీర్తన ఒకటి అందుకోమ్మా!” అని సుప్రజతో అన్నాడు. 


ఎక్కువ బ్రతిమాలించుకోకుండా త్యాగరాయ కీర్తన పాడింది. అద్భుతమైన ఆమె కంఠానికి అందరూ ముగ్ధులై చూస్తున్నారు. 


వాళ్ళకు ఈ సంబంధం నచ్చిందని అక్కడే చెప్పేశారు. కట్నకానుకల మీద ఆశలేదని చెప్పేశారు. 


“ఇక వస్తామండీ! ముహూర్తం నిర్ణయించుకున్నాక కలుద్దాం. ” అని వీడ్కోలు తీసుకొని బయటికి వచ్చారు. 


సరిగ్గా అదే సమయంలో కమలతో ఏదో పనిమీద బయటకు వచ్చిన పక్కింటి పంకజాక్షికి, ఆనందరావు ఇంటి నుంచి బయటికి వస్తున్న విష్ణువర్ధనరావు కుటుంబం, వాళ్ళతో పాటు ఉన్న అవధాని కనబడే సరికి అనుమానం వచ్చింది. 


‘ఈ అవధాని కమలకు అన్న వరుస అవుతాడు. ఈయన సంబంధాలు కుదిర్చే పని కూడా చేస్తాడని ఒక సారి కమల చెప్పినట్టు గుర్తు. ఠీవిగా కనిపిస్తున్న యువకుడు పెళ్లికొడుకు కాబోలు. ’ అనుకుని, అందరూ వెళ్లిపోయాక కమల ఇంట్లోకి అడుగు పెట్టింది. 


“మన సుప్రజ ఎంత అదృష్టవంతురాలండీ. లేకపోతే ఏ కట్నమూ ఆశించకుండా డాక్టర్ సంబంధం కుదరడమేమిటి. ” భర్తతో అంటున్న కమల మాటలు వినబడ్డాయి. 


అప్పుడే లోపలికి అడుగుపెట్టిన పంకజాక్షిని చూసి, “రా! పంకజం. ” అని లోనికాహ్వానించింది కమల. 


“కమలా! ఎవరో చుట్టాలు వచ్చినట్టుంది. వీళ్ళను ఇది వరకూ చూసిన గుర్తు లేదు. ఎవరబ్బా?” అడిగింది పంకజాక్షి. 


“అయ్యో నీకు చెప్పకుండానా పంకజం. ఇప్పుడే సుప్రజకు డాక్టర్ సంబంధం కుదిరింది. కట్నం ఒక్క రూపాయి కూడా అక్కర్లేదన్నారు. ఎంత మంచివాళ్ళో కదా. ” అమాయకంగా అన్ని వివరాలూ చెప్పసాగింది. 


కడుపులో అసూయ తన్నుకు రాగా, పైకి నవ్వుతూ లేని సంతోషాన్ని వెలిబుచ్చింది పంకజాక్షి. 

*****

"ఇదిగో చూడండి. మన అమ్మాయికి రావాల్సిన సంబంధం పక్కింటి సుప్రజకు వచ్చింది. ఎలాగైనా సరే మన అమ్మాయికి ఈ డాక్టర్ సంబంధం కుదిరేటట్టు గట్టి ప్రయత్నం చేయాల్సిందే. " పంకజాక్షి భర్త శ్రీనివాసరావుకు పక్కింట్లో కమల చెప్పిన విశేషాలు చెప్పింది. 


“అమ్మా! ఇది అన్యాయమమ్మా! సుప్రజ నా స్నేహితురాలు. చాలా అమాయకురాలు. అలా చేయకండి. అయినా మొన్న నాకోసం వచ్చిన సంబంధాన్ని ఒప్పుకున్నారు కదా! ఇప్పుడు వాళ్ళకేం చెప్తారు? మాట తప్పిన వాళ్ళం అవుతాం కదా!” అన్నది హాసిని. 


“నీకేం తెలీదు ఊరుకో! మొన్న వచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్ సంబంధం. కానీ ఇది డాక్టర్ సంబంధమే! దానికన్నా ఇది గొప్ప సంబంధం కదా! ఇది కుదరాలే కానీ, ఆ సంబంధాన్ని కాన్సిల్ చేసెయ్యడం ఎంత పని.” 


ఈ మాటలు అంటున్న తల్లిని అసహ్యించుకుని, లోపలికి వెళ్ళిపోయింది. 


మరుసటి రోజు శ్రీనివాసరావు, అదే ఊళ్లో ఉంటున్న తన బావమరిది రంగనాథాన్ని తీసుకుని విష్ణువర్ధనరావు ఊరికి వెళ్ళాడు. 


"మీ అబ్బాయి పెళ్ళికి ఉన్నాడని తెలిసి మా అమ్మాయికోసం వచ్చాను. " శ్రీనివాసరావు అతి వినయంగా అన్నాడు. 

"క్షమించండి! మేము మీ ఊరి అమ్మాయితో సంబంధం కలుపుకోవాలని కబురు పెట్టాం. పెళ్ళికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. "


"ఎవరి గురించి మాట్లాడుతున్నారండి?"


"ఆనందరావుగారి అమ్మాయి సుప్రజతో అండి. " విష్ణువర్ధనరావు ఆ వివరాలు చెప్పాడు. 


"ఆ అమ్మాయికా!" ఆశ్చర్యంగా శ్రీనివాసరావు, బావమరిదితో గుసగుసలాడడం చూసి, "ఏంటండీ? ఏమైనా సమస్యా?" అన్నాడు విష్ణువర్ధనరావు కాస్త కుతూహలంగా. 


"ఎందుకులేండి. సంబంధం కూడా కుదుర్చుకున్నారు. ఈ విషయాలు చెప్తే బాగుండదు" అన్నాడు కాస్త జంకినట్టుగా. 


"ఇంకా పెళ్లి ఏర్పాట్లే జరుగుతున్నాయి. అసలేం జరిగిందో చెప్పండి" నిలదీశాడు. 


"సుప్రజ అన్యమతస్తుడిని పెళ్లి చేసుకోబోతున్నట్టు విన్నాము. ఈ పెళ్లికి వాళ్ల నాన్న ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నదట. అందుకేనేమో ఆనందరావు ఆ అమ్మాయి పెళ్ళికి తొందర పడుతున్నాడు. మరి ఆ అమ్మాయి తండ్రి మాటలు విని మీ సంబంధానికి ఒప్పుకోవచ్చునేమోలెండి" విషాన్ని చిందించి, విష్ణువర్ధనరావు మొహంలో మారుతున్న భావాలు చూసి లోలోపల ఆనందపడసాగాడు. 


"అనవసరంగా మీతో నోరు జారాను. ఈ విషయాలు ఇంకెక్కడా అనకండి. పాపం ఆడపిల్ల అభాసుపాలౌతుంది. మరి మీకిష్టమైతే మా సంబంధం గురించి ఆలోచించి కబురు చేయండి. " తృప్తిగా బయటికి నడిచారు ఇద్దరూ. 


సాయంత్రం హాస్పిటల్ నుండి వచ్చిన కొడుకుతో జరిగిన విషయాలు చెప్పాడు విష్ణువర్ధనరావు. 


“నాన్నా! ముందు వెనక ఆలోచించకుండా ఎవరో అన్న చెప్పుడు మాటలు నమ్మకండి. అవధానిగారిని నిలదీసి అడిగితే ఆయనే చెప్తాడు. అనవసరంగా ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం బాగుండదు. ” అన్నాడు సురేష్. 

*

"అదేమిటి విష్ణువర్ధనరావుగారూ! సుప్రజ సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అసలేం జరిగింది?" ఆశ్చర్యంగా అడిగాడు అవధాని. 


శ్రీనివాసరావు వచ్చి, సుప్రజ గురించి చెప్పిన విషయాలు చెప్పాడు. 


"అయ్యో! ఎన్ని అబద్ధాలు ఆడాడండి మీతో. ఆ అమ్మాయి నిప్పులాంటిది. నా మాట విని మనసు మార్చుకోండి. సుప్రజను మీ కొడుకుకు చేసుకోండి" ప్రాధేయపడ్డాడు. 


 "మీరు చెప్పింది నిజమే! ఒక విషయం మాత్రం చెప్పగలను. ఇంత విషం చిందించిన శ్రీనివాసరావు సంబంధం మాత్రం చేసుకోము. మాకూ ఆ సుప్రజ సంబంధం చేసుకోవాలనే ఉంది. ఇంకా నయం తొందరపడి ఆనందరావుగారితో సంబంధం కాన్సిల్ చేసుకున్నట్టు చెప్పలేదు. ” అన్నాడు. 


"ఆ మాటన్నారు, బాగుంది. మీరు సుప్రజ సంబంధం కాన్సిల్ చేసుకున్నట్టు వాళ్ళకింకా చెప్పలేదు కదా! కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. ఈ వివాహం జరిపించే పూచీ నాది. " అన్నాడు అవధాని. 


మరో నెలలో సుప్రజ వివాహం డాక్టర్ తో జరగడం చూసి నోరెళ్ళబెట్టారు శ్రీనివాసరావు దంపతులు. 


***

రోహిణి భైరవజోశ్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: రోహిణి భైరవజోశ్యులు

నా పేరు రోహిణి భైరవజోశ్యులు. మా ఊరు అనంతపురం. 

ప్రస్తుత నివాసం హైదరాబాద్.

పెళ్ళి తరువాత నేను M.Com., M.A ( ఇంగ్లీష్) చేశాను. 

20 సంవత్సరాలు కామర్స్ లెక్చరర్ గా వివిధ కళాశాలల్లో పని చేశాను.

మా వారు బ్యాంక్ లో Assistant General manager గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగ రీత్యా మేము

 Asansol (West Bengal), Faridabad (Haryana) near Delhi, Kannur ( Kerala) తిరిగాము. 

అలాగే ఆదోని ( కర్నూలు), నిజామాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్ళాము.

నేను 3 1/2 సంవత్సరాల నుంచి కథలు రాస్తున్నాను. 

నేను ఎక్కువగా కుటుంబ కథలు రాస్తుంటాను. అప్పుడప్పుడు హారర్ కథలు, హాస్య కథలు కూడా రాస్తుంటాను.

ఈనాడు ఆదివారం పత్రికలో రెండుకథలు పబ్లిష్ అయ్యాయి. 

సంచిక, విశాలాక్షి, విశాఖ, ఉషా, సుమతి, సహరి, తిరుపతి రచయితల పోటీ, విజయనగరం జిల్లా రచయితల సంఘం మొదలగు పత్రికలు నిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. ఇప్పుడు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page