ఆటగదరా శివా..!
- Srinivasarao Jeedigunta

- Nov 9
- 4 min read
#AtagadaraSiva, #ఆటగదరాశివా, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguHeartTouchingStories

Atagadara Siva - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 09/11/2025
ఆటగదరా శివా - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
సోమసుందరం, సుష్మలకి ఇద్దరు మగ పిల్లలు. సోమసుందరం యాభై ఎకరాల వ్యవసాయం చేసుకునే పొలం ఉండటంతో తణుకు దగ్గరలో ఉన్న గ్రామంలో వుంటున్నాడు. పెద్ద రైతు అవ్వడం వలన ఊర్లో ఏ అవసరం పడినా గ్రామస్తులు సోమసుందరం దగ్గరికి వచ్చే వాళ్లు.
తన పిల్లలు చదివే స్కూల్‌కి చాలా డబ్బులు ఖర్చు చేసి ఎన్నో సౌకర్యాలు కల్పించాడు. సోమసుందరం “తను ఆస్తిపరుడిని కదా” అని అశ్రద్ధ చేయకుండా పిల్లలిద్దరినీ బాగా చదివించేవాడు — తణుకు నుంచి ట్యూషన్ టీచర్లని రప్పించి.
“మీకేమండి! మీ పిల్లలు బంగారం లాంటి వాళ్లు — చక్కగా చదువుకుంటున్నారు. సరస్వతి దేవి, లక్ష్మీ దేవి ఒక్కచోట ఉండటం మీ దగ్గరే చూస్తున్నాం,” అని ఊర్లో వాళ్లు అంటున్నప్పుడు, “అంతా ఆ దేవుడి దయ, మనదేమి వుంది!” అనేవాడు నవ్వుతూ సోమసుందరం.
పిల్లలు ఇద్దరూ కవలలు అవ్వడంతో చదువులో కూడా ఇద్దరూ ఒకే క్లాస్‌లో వుండే వాళ్లు.
బాగా పల్లెటూరు అవ్వడం వలన రవాణా సౌకర్యం చాలా తక్కువగా ఉండేది. తణుకు వెళ్ళాలి అంటే ఒక రోజు అంతా వృధా అయ్యేది. సోమసుందరం తన పలుకుబడి ఉపయోగించి రోజుకు రెండు సార్లు ఆర్టీసీ బస్సులు వచ్చేటట్లు చేసాడు. “ఈ ఊర్లో ఏ పనిజరిగినా అది ఒక్క సోమసుందరం గారి వల్లే జరుగుతుంది,” అని రచ్చబండ దగ్గర సర్పంచ్ అనేవాడు.
యింట్లో ఆ విషయం చెప్పినప్పుడు సుష్మ — “పాపిష్టి కళ్ళు అన్ని మన కుటుంబం మీదే ఉన్నాయి. చేసే సహాయం చేస్తూనే ఉన్నాం, అయినా మనమీద పడి ఏదో ఏడుస్తున్నారు,” అంది. “వాళ్లు దేవుళ్లా అంటే అయిపోవడానికి ఎందుకు కంగారు పడతావు! అయినా నువ్వు మాంత్రికురాలివి కదా, నీ పిల్లలకు ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీసేయి,” అన్నాడు నవ్వుతూ సోమసుందరం.
పిల్లలు ఇద్దరూ టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఇంటర్‌మీడియట్ తణుకు కాలేజీలో చదివించాలి అనుకున్నాడు సోమసుందరం. కానీ వచ్చిన చిక్కేమిటంటే — కాలేజీ టైమ్‌కి తమ ఊరు నుంచి బస్సు లేకపోవడం. పిల్లలకు మోటార్ సైకిల్ కొనిచ్చి పంపడం సోమసుందరంకి ఇష్టం లేదు.
భార్య సుష్మని అడిగాడు — “తణుకులో ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో నువ్వు వుంటావా? వారం లో ఒకరోజు నేను వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తాను,” అన్నాడు. “బాగానే వుంది, కానీ ఇక్కడ మిమ్మల్ని ఒక్కడినే వదిలి నేను వెళ్తే మీ ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకుంటారు? మనకి కారు వుంది కదా. డ్రైవర్‌కి జీతం ఇస్తున్నాం కాబట్టి, పిల్లలను రోజూ కారులో తణుకు కాలేజీకి పంపించండి. మీరు ధర్మరాజు కాబట్టి ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నా, వాళ్లను కూడా మన కారులో పంపిస్తాం,” అంది సుష్మ. “అంతేనా! సరే, రేపు డ్రైవర్ రాముడిని కారు తణుకు తీసుకెళ్లి సర్వీస్ చేయించుకుని రమ్మంటాను,” అన్నాడు.
డ్రైవింగ్ నేర్చుకున్నప్పటి నుండి రాముడు సోమసుందరం గారి యింట్లోనే పని చేస్తున్నాడు. పేరుకి డ్రైవర్ కానీ, అసలు బాడీగార్డ్‌లా ఆయన వెంటే తిరుగుతాడు. “ఎప్పుడూ నా వెంట తిరగకపోతే నీకు పెళ్లి అయ్యింది కదరా! పనిలేనప్పుడైనా ఇంటికి పోయి భార్య, బిడ్డతో గడపు రా,” అనేవాడు నవ్వుతూ సోమసుందరం. “మీరు శివుడు, ఎప్పుడు నందిలా మీ వెంటేనే ఉంటారు,” అంది సుష్మ నవ్వుతూ.
రాముడి పని — పిల్లలను కాలేజీకి తీసుకెళ్లడం, అక్కడ ఉండి తిరిగి సాయంత్రం తీసుకుని రావడం.
ఒక శనివారం పిల్లలిద్దరూ, “నాన్నా! తణుకులో కొత్త సినిమా వచ్చింది. రేపు ఆదివారం వెళ్ళామా?” అని అడిగారు.
“వారం లో ఆరు రోజులు తణుకు వెళ్తున్నారు కదరా, హాయిగా మన తోటలో విశ్రాంతి తీసుకోండి,” అన్నాడు సోమసుందరం.
“పోనీ, ఎప్పుడూ చదువేనా? ఈ ఒక్కసారి వెళ్లనివ్వండి,” అంది సుష్మ.
“రాముడిని అడుగు — వాడికి ఖాళీ ఉందో లేదో. వారం లో ఒక్కరోజు అయినా వాడిని ఇంటిపట్టున ఉండనివ్వకపోతే, వాళ్ల ఆవిడ తిట్టుకుంటుంది,” అన్నాడు నవ్వుతూ.
“ఒరేయ్ రాముడు! రేపు పిల్లలు మహేష్ సినిమా కి వెళ్తున్నారు. రెండు గంటల ఆటకు తీసుకెళ్ళు,” అంది సుష్మ.
“అలాగే అమ్మా! మీరు ఒప్పుకుంటే మా బుడ్డాడు, మా ఆవిడ కూడా ఆ సినిమా చూడాలంటున్నారు. వాళ్లని కూడా తీసుకెళ్ళమంటారా?” అని నసుగుతూ అన్నాడు రాముడు.
“దానికేముంది రా, అలాగే తీసుకెళ్ళు,” అంటూ చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి, “నీ పిల్లాడికి, నీ భార్యకి ఏమైనా తినిపించు,” అంది సుష్మ.
పన్నెండు గంటలకల్లా భోజనాలు చేసేశారు సోమసుందరం గారి పిల్లలు, డ్రైవర్ రాముడి కుటుంబం. “ఒరేయ్ రాముడు! పెళ్ళాంతో కబుర్లు చెప్పుతూ కారు నడుపకుండా జాగ్రత్తగా నడుపు. సినిమా అయిపోయాక బయలుదేరి ఫోన్ చెయ్యాలి, తెలిసిందా?” అని జాగ్రత్తలు చెప్పి పంపాడు సోమసుందరం.
ముందుగానే టిక్కెట్లు తీసుకోవడంతో కారు మెల్లగా డ్రైవ్ చేస్తున్నాడు రాముడు. యజమాని, అమ్మగారు మంచి వాళ్లు కాబట్టి, మా కుటుంబం కూడా కారులో కూర్చుని వెళ్ళడానికి అంగీకారం ఇచ్చారు. అతని భార్య కారులో కూర్చుని తెగ మురిసిపోయి పిల్లలతో నవ్వులు పూస్తోంది.
“అయ్యగారు కొత్త కారు కొంటే ఈ కారుని నాకు ఇవ్వమని మీ నాన్నగారికి చెప్పాలి,” అని అంటోంది.
ఆమాట విని రాముడు వెనక్కి చూసి, “నీకు ఏం మాట్లాడాలో తెలియదా!” అన్నాడు.
ఇంకో పదినిమిషాల్లో తణుకు రోడ్డుపైకి వచ్చేస్తున్నాం అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో మృత్యుదేవత — వాటర్ ట్యాంకర్ రూపంలో వేగంగా వచ్చి రాముడు నడుపుతున్న కారుని ఢీకొట్టింది!
ఆ వేగానికి కారు నాలుగు పల్టీలు కొట్టింది. “అయ్యో! ట్యాంకర్ కారుని కొట్టేసింది!” అంటూ జనం చేరి, కారులోనుండి నెత్తురు మడుగులో చలనం లేకుండా పడి ఉన్న రాముడు, రాముడి భార్య, సోమసుందరం గారి పిల్లలను బయటకు తీశారు.
కొంచెం ఊపిరితో ఉన్న రాముడి కొడుకును 108లో హాస్పిటల్‌కి తరలించారు పోలీసులు.
“పెద్ద ఆక్సిడెంట్ — నలుగురు చనిపోయారు. ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు,” అని సమాచారం వచ్చింది. కారులో ఉన్న ఐడి కార్డును బట్టి సోమసుందరం గారికి ఫోన్ చేసి, “ఆక్సిడెంట్ జరిగింది, వెంటనే రండి,” అన్నారు పోలీసులు.
గుండెల్లో దడతో సర్పంచ్ మోటార్‌సైకిల్‌పై సోమసుందరం బయలుదేరాడు, భార్యకి విషయం చెప్పకుండా. “దేవుడా! కారు దెబ్బతిన్నా పర్వాలేదు, మా వాళ్లకి ఏమి జరగకుండా చూడు,” అనుకుంటూ ఘటనాస్థలికి చేరుకున్నాడు.
రోడ్డు పక్కన తుక్కు అయిన కారు, వాటర్ ట్యాంకర్ చూసి వణికిపోయాడు. “మా పిల్లలు?” అని అడిగాడు. “ఒక్కడు తప్ప అందరూ చనిపోయారు. చూడండి,” అంటూ ముసుగులు తీసి చూపించారు పోలీసులు.
తన ఇద్దరు పిల్లలు, రాముడు, అతని భార్య — నెత్తురుమడుగులో పడి కనిపించగానే కుప్పకూలిపోయాడు సోమసుందరం. “దురదృష్టంలో అదృష్టం” అన్నట్లు — ఒక్క పిల్లాడు బ్రతికాడు అని పోలీస్ తెలిపాడు.
ఉరిలో పెద్దలకి సర్పంచ్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఊరు మొత్తం ఏడుస్తూ బయలుదేరింది — ఒక్క సుష్మ తప్ప. ఆమె కొడుకుల మరణవార్త విని సృహ కోల్పోయింది.
పంచనామా మొదలై అర్ధరాత్రికి అంబులెన్సులో ఇంటికి చేరుకున్నారు. పిల్లలను చూసి తల్లిదండ్రుల శోకానికి అంతులేకపోయింది. రాముడికి ఎవ్వరూ లేకపోవడంతో అతనిపై పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఏడ్చి అలసిపోయిన సోమసుందరం రెండు దండలు పట్టుకుని నడుచుకుంటూ రాముడు, రాముడి భార్యలకి వేసి దణ్ణం పెట్టాడు. “వాళ్లు నా పిల్లలు లాంటి వాళ్లు. నా చేతుల మీదుగా కానివ్వండి,” అన్నాడు కళ్ల నీళ్లు తుడుచుకుంటూ.
ఇన్స్పెక్టర్ వచ్చి — “హాస్పిటల్‌లో వున్న పిల్లాడికి వైద్యం గురించి…” అని అడిగాడు. “ఎంత డబ్బు అయినా నేను ఇస్తాను, వైద్యం చేయండి. వీలు చూసుకుని హాస్పిటల్‌కి వస్తాను. కొద్దిగా మీరే సహాయం చెయ్యాలి,” అన్నాడు సోమసుందరం.
“పాపిష్టి నేను.. సినిమాకి వెళ్ళద్దు అని మీరు అన్నా, నేనే మిమ్మల్ని ఒప్పించి పంపించాను. మనం ఏం పాపం చేసాం? కన్న ఇద్దరూ ఇలా దూరమయ్యారు…” అంటూ ఏడుస్తున్న సుష్మ తలపై చెయ్యి వేసి — “ఋణం వుంది, అది తీర్చుకుని వెళ్లిపోయారు.
మనకి జరగబోయేది తెలిస్తే వెళ్ళనిచ్చేవాళ్లమా? ఇది అంతా ఆ శివుడి లీలా వినోదం. మనలాంటి వాళ్లతో దేవుడు రోజూ ఆటలాడుతూనే ఉంటాడు. కొన్ని ఇళ్లలో ఆనందం, కొన్ని ఇళ్లలో దుఃఖం. అన్నిటినీ భరించి ముందుకు సాగాలి. ఎప్పుడో మళ్ళీ మన జీవితానికి వెలుగు ఇస్తాడు అంతే…” అన్నాడు సోమసుందరం.
టాక్సీ వచ్చింది. “హాస్పిటల్‌కి వెళ్లి రాముడి కొడుకు ఎలా ఉన్నాడో చూసి, బిల్లు కట్టి వస్తాను,” అన్నాడు.
“వుండండి, నేను వస్తాను. వాడికి తల్లి లేదు, నాకు పిల్లలు లేరు. ఇక మనం వాడిని మనతోనే ఉంచుకుందాం,” అని అన్న భార్య వైపు చూసి — “ఆటకదరా శివా! లేకపోతే నీ లీలా ఏమిటి? ఎవ్వరిని ఎవరి దగ్గరకి చేరుస్తున్నావు?” అనుకున్నాడు.
సర్వేజనా సుఖీభవ
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments