గోస
- M K Kumar
- Nov 8
- 8 min read
#MKKumar, #ఎంకెకుమార్, #Gosa, #గోస, #TeluguHorrorStories

గోస - దయ్యాల ఘోష
Gosa - New Telugu Story Written By - M K Kumar
Published In manatelugukathalu.com On 08/11/2025
గోస - తెలుగు కథ
రచన: ఎం. కె. కుమార్
తిరుపతికి ఒక యిరవై మైళ్ళ దూరంలో, శేషాచలం కొండల కింద ఒదిగినట్టు వుండేది మల్లవరం అనే వూరు.
ఆ వూరి చివరన, పొలాల మధ్యలో, ఒక పాతకాలపు బంగ్లా వుండేది. దాన్ని జనాలు "గాయత్రి సదనం" అని పిలిచేటోళ్లు.
నూరేళ్ళ కింద, 1925లో, ఆ యింట్లో పెదకాపు రెడ్డి అనే పెద్దమనిషి, ఆయన పెళ్ళాం, నలుగురు బిడ్డలు, యిద్దరు చుట్టాలతో కాపురం వుండేవాడు.
ఒక అమావాస్య నాడు, రాత్రికి రాత్రే యెవడో ఆ యింట్లోని యెనిమిది మందినీ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపేశాడంట. ఆ నెత్తుటి మరకలు యిప్పటికీ ఆ గోడల మీద యెండిపోయి, నల్లగా కనిపిస్తాయని చెప్పుకునేటోళ్లు.
ఆ హత్యలు యెవరు చేశారో, యెందుకు చేశారో యెవురికీ తెలీదు. ఆ దెబ్బకి ఆ మేడలోకి అడుగు పెట్టాలంటేనే జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జంకేటోళ్లు.
ఆ దరిదాపులకు పోయిన పశువులు కూడా తిరిగి రాలేదని, పొరపాటున పోయిన మనుషులు పిచ్చోళ్ళయి పోయారని కథలు కథలుగా చెప్పుకునేటోళ్లు.
యీ గాయత్రి సదనం గుట్టు విప్పాలని మన శివగాడు, "సీమలో దెయ్యాలు" టీం అనుకున్నారు.
శివకు యిట్టాంటి పాడుబడ్డ కొంపలంటే యెక్కడ లేని యిట్టం. వాళ్ళ యూట్యూబ్ ఛానెల్ కోసం యిట్టాంటి యెన్నో చోట్లకు పోయి వచ్చాడు.
లచ్చికి చిన్నప్పటినుంచే కంటికి కనపడనివి కనపడేవి, వినిపించనివి వినిపించేవి. ఆమె వాళ్ళ అమ్మమ్మతో గుడికి పోయినప్పుడు, మొదటిసారిగా గుడిలోపల వున్న ఒక పాత స్తంభం దగ్గర నిలబడితే, యెవరో మాట్లాడుతున్నట్టు అనిపించి, ఆ మాటలు యెవరివో కాదు, నూరేళ్ళ కిందట ఆ గుడి కట్టించిన రాజువని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
సూరి, వాళ్ళకు టెక్నికల్ సపోర్ట్. వాడు కొంచెం అలుసుగాడే అయినా, కెమెరాల విషయంలో వాణ్ణి మించినోడు లేడు.
ఇక రెడ్డిగారు, ఆ వూరికే చెందిన పెద్దాయన, ఆయనకు ఆ మేడ కథ అణువణువూ తెలుసు.
ఆ నలుగురూ కలిసి ఆ మేడలో ఒక రాత్రి గడపాలని బయలుదేరారు.
కెమెరాలు, లైట్లు, దెయ్యాలను పట్టే మిషన్లు (EMF మీటర్లు), రాత్రిపూట సూడటానికి వాడే కెమెరాలు అన్నీ సర్దుకుని మల్లవరం చేరుకున్నారు.
వాళ్ళ కారు వూరిలోకి తిరుగుతుండగానే, జనాలు వింతగా సూడటం మొదలుపెట్టారు.
రెడ్డిగారు వాళ్ళతో, "మనం పోయేది గాయత్రి సదనంకే అని తెలిసిపోయిందట్టుంది. ఆ చూపుల్లోనే భయం కనపడతాంది, " అన్నాడు.
ఆ మేడను దూరం నుంచి సూత్తేనే గుండె జల్లుమంది. రెండు అంతస్తుల ఆ భవంతి, నల్లగా, చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కల మధ్య ఒక రాక్షసిలా నిలబడి వుంది.
ఒకప్పటి అందమైన తోటంతా కంపచెట్లతో నిండిపోయింది. గేటు సగం విరిగి, తుప్పు పట్టి వేలాడుతోంది.
మేడ ముందు వున్న పాలరాతి దేవత విగ్రహం తల విరిగిపోయి కిందపడి వుంది. దాన్ని సూత్తేనే యెదో అపశకునంలా అనిపించింది.
"శివా, యీడ గాలిలోనే యెదో కీడు వుందిరా. మనం రావడం దానికి నచ్చలేదట్టుంది. మనల్ని యెవరో సూస్తున్నట్టే వుంది, " అంది లచ్చి, కళ్ళు మూసుకుని, చుట్టూ వున్న వాతావరణాన్ని పసిగడుతూ.
ఆమె గొంతులో భయం స్పష్టంగా పలుకుతోంది.
"యేం కాదులే లచ్చి, మనం వచ్చింది దానికే గదా. యీ రాత్రికి దీని సంగతి తేల్చాలంతే. ధైర్యంగా వుండు, " అన్నాడు శివ, కానీ అతని గుండెల్లో కూడా ఒక తెలియని ఆందోళన మొదలైంది.
సూరిగాడు, "నాకెందుకో మంచిదిగా అనిపించలేదు బావా, వెనక్కి పోదామా?" అన్నాడు భయంగా.
"ఒరేయ్, సూరీ, యింత దూరం వచ్చినాక వెనక్కి పోవడమా? ముందు పని సూడు, " అని గదమాయించాడు శివ.
వాళ్ళు మెల్లగా గేటు తోసుకుని లోపలికి అడుగుపెట్టారు.
వాళ్ళు లోపలికి రాగానే, ఆ గేటు దానికదే "కీ..ర్" మని శబ్దం చేస్తూ మూసుకుంది. అందరూ ఉలిక్కిపడి వెనక్కి సూశారు.
రాత్రి తొమ్మిది కావొచ్చింది. అందరూ నడి హాలులో వాళ్ళ సామానంతా పెట్టుకున్నారు.
చుట్టూ కెమెరాలు, మానిటర్లతో ఆ గది ఒక పోలీస్ కంట్రోల్ రూంలా మారిపోయింది.
దుమ్ము, బూజు పట్టిన ఆ హాలులో, గోడల మీద పాత ఫోటోలు వేలాడుతున్నాయి.
వాటిని సూత్తేనే ఒళ్ళు జలదరించింది. రెడ్డిగారు ఆ మేడ కథ, పెదకాపు రెడ్డి కుటుంబం గురించి తాను విన్నది చెప్పడం మొదలుపెట్టాడు.
"పెదకాపు రెడ్డి యీ సీమలోనే పెద్ద పేరున్న మనిషి. ఆయన మాటంటే శాసనం. కానీ, ఆస్తి విషయంలో ఆయన సొంత తమ్ముడు నరసింహా రెడ్డితో పెద్ద తగువు వుండేది. పోలీసులోళ్లు వాడి మీదే అనుమానపడ్డా, సాక్ష్యం దొరకలే. యెందుకంటే, హత్య జరిగిన రాత్రి, ఆ హంతకుడు యెట్టా లోపలికి వచ్చాడో యెవురికీ తెలీదు. అన్ని తలుపులు, కిటికీలు లోపలినుంచి గొళ్ళెం పెట్టి వున్నాయంట. ఆ తర్వాత, నరసింహా రెడ్డి కూడా యేడాది తిరిగేలోపే పాముకాటుతో చచ్చిపోయాడు. అది దేవుడి శిక్ష అని జనాలు అనుకున్నారు, " అని చెప్పాడు రెడ్డి.
ఆయన అట్టా చెప్తుండగానే, పై అంతస్తు నుంచి "ఢబేల్" మని ఒక పెద్ద శబ్దం వచ్చింది.
అందరూ అదిరిపడి పైకి సూశారు. సూరి వెంటనే ఆ గది కెమెరాను మానిటర్‌లో పెట్టాడు.
అక్కడ, పిల్లలు ఆడుకునే గదిలో, ఒక పాత చెక్క ఊయల అదే పనిగా, లయబద్ధంగా ఊగుతోంది.
"గాలికి ఊగుతుండాదిలే, " అన్నాడు సూరి, కానీ అతని గొంతు వణికింది. ఆ గది కిటికీలు మూసి వున్నాయి, గాలి వచ్చే దారే లేదు.
శివ, లచ్చి ధైర్యం చేసి ఆ గదిలోకి పోయారు. ఆ గది గోడల మీద చిన్నపిల్లలు గీసిన చిత్రాలు కనపడుతున్నాయి.
గది మధ్యలో వున్న ఆ ఊయల వాళ్ళు లోపలికి రాగానే ఆగిపోయింది. లచ్చి మెల్లగా ఆ ఊయలను ముట్టుకోగానే, ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
"ఒక పాప.. సుమారు ఆరేళ్ళుంటాయి.. తెల్ల గౌను వేసుకుని, రెండు జడలతో.. యిక్కడే ఆడుకుంటాంది. తన పేరు చిన్ని అంట. నన్ను సూసి నవ్వుతాంది, " అంది లచ్చి, గాలిలో యెవరినో సూస్తున్నట్టు. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
శివ తన చేతిలోని మిషన్‌ను ఆన్ చేయగా, అది ఒక్కసారిగా "కీ..కీ..కీ.." మని గట్టిగా మోగడం మొదలుపెట్టింది.
ఆ గదిలో దెయ్యాల శక్తి అమాంతం పెరిగిపోయిందని ఆ మిషన్ చెప్పింది. ఇంతలో, గది మూల నుండి ఒక చిన్న పాప నవ్వుతున్న శబ్దం వినిపించింది.
సూరి, రెడ్డి కింద హాలులోనే భయంతో వణికిపోతున్నారు. ఆ రాత్రి వాళ్ళకు యెదురైన మొదటి, స్పష్టమైన భయానక అనుభవం అది.
పొద్దు పోయే కొద్దీ, ఆ మేడలో దెయ్యాల చేష్టలు యెక్కువయ్యాయి.
గదుల్లో చలి పెరగడం, గాలిలో గుసగుసలు వినిపించడం, నీడలు కదలడం మొదలయ్యాయి.
ఒకసారి, వంటగదిలోనుంచి సామాన్లు కింద పడ్డ శబ్దం వస్తే, పోయి సూసేసరికి అన్నీ సర్దినట్టే వున్నాయి.
మరోసారి, వాళ్ళు నడుస్తుంటే, యెవరో వెనకాలే నడుస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించేది, కానీ తిరిగి సూస్తే యెవరూ వుండేటోళ్లు కాదు.
అర్ధరాత్రి దాటిన తర్వాత, లచ్చి ఒక్కసారిగా నిద్రలోంచి లేచి గట్టిగా అరిచింది.
ఆమెకు ఒక భయంకరమైన కలలాంటిది వచ్చింది. ఆ రాత్రి జరిగిన ఘోరం అంతా ఆమె కళ్ళ ముందు, ఆమె ఆ ఘోరంలో భాగమైనట్టు కదిలింది.
"గొడ్డలి.. ఒక నల్లని నీడ.. ఆ నీడ మెట్ల కింద దాక్కుని వుంది.. అందరూ నిద్రపోయాక, మెల్లగా పైకి వచ్చింది.. మొదట పెదకాపు రెడ్డి గదిలోకి పోయింది.. ఆయన నిద్రలేచి పోరాడాడు.. కానీ, ఆ నీడ ఆయన్ని.. తర్వాత ఆయన పెళ్ళాన్ని.. పిల్లలు.. వాళ్ళు భయంతో అరుస్తున్నారు.. నెత్తురు.. గోడలంతా నెత్తురు.." లచ్చి భయంతో గజగజా వణుకుతూ, యేడుస్తూ చెప్పింది.
ఆమె ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా సూసినట్టు చెప్తోంది.
శివ ఆమెను పట్టుకుని, "లచ్చి, లచ్చి, కళ్ళు తెరువు. అది కలే. ఆ నీడ యెట్టా వుంది? యేమన్నా కనపడిందా?" అని అడిగాడు.
"లేదురా.. అంతా చీకటిగా వుంది. కానీ.. వాడి చేతికి ఒక పాత ఉంగరం వుంది. అది మెరుస్తాంది.. పాము రూపంలో, " అంది లచ్చి, శ్వాస అందక.
యీ మాట వినగానే రెడ్డిగారు అదిరిపడ్డాడు.
"పాము రూపంలో ఉంగరమా! అయ్యో, సర్వనాశనం. అది పెదకాపు రెడ్డి తమ్ముడు, నరసింహా రెడ్డి వేసుకునేటోడు. అది వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే ఉంగరం, " అన్నాడు రెడ్డి, అతని మొఖంలో భయం కొట్టొచ్చినట్టు కనపడింది.
అదే టయానికి, సూరి అటక మీద పెట్టిన కెమెరాలో యెదో కదలికను సూశాడు.
"బావా, యిటు సూడు, " అని అరిచాడు. అందరూ మానిటర్ వైపు సూశారు.
అటక మీద, దుమ్ము పట్టిన సామాన్ల మధ్య, ఒక పాత చెక్క పెట్టె దానంతట అదే "టక్" మని తెరుచుకుంది.
ఆ పెట్టెలోంచి ఒక వెలుగు వస్తోంది. శివ, సూరి ధైర్యం చేసి, చేతిలో టార్చ్ లైట్లు పట్టుకుని అటక మీదికి పోయారు.
అక్కడ దుమ్ము, బూజు పట్టిన ఆ పెట్టెలో, ఒక పాత తోలు డబ్బాలో, ఒక డైరీ దొరికింది. అది పెదకాపు రెడ్డి పెళ్ళాం, గౌరమ్మ రాసిన డైరీ.
శివ ఆ డైరీని కిందకు తెచ్చి, లాంతరు వెలుగులో చదవడం మొదలుపెట్టాడు.
ఆ పాత తెలుగు అక్షరాలు మసకబారి వున్నాయి. అందులో గౌరమ్మ తన మరిది నరసింహా రెడ్డి గురించి రాసిన విషయాలు చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది.
"..నా మరిది నరసింహారెడ్డి చూపులు నాకు నచ్చడం లేదు. ఆస్తిలో సగం పంచిమ్మని నా భర్తను అడుగుతున్నాడు. ఆయన ఒప్పుకోకపోవడంతో, మా మీద కక్ష పెంచుకున్నాడు. వాడు రాత్రుళ్ళు యెక్కడికో పోయి, క్షుద్ర పూజలు చేస్తాడని వూరిలో అనుకుంటున్నారు. ఈ మధ్య తరచూ మన యింటికి వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా పిల్లల్ని వింతగా సూస్తున్నాడు. వాడి కళ్ళలో ఏదో తెలియని క్రూరత్వం కనిపిస్తోంది.."
మరో పేజీలో..
"..ఈ రోజు రాత్రి వాడు మళ్ళీ వస్తున్నాడు. యీసారి వాడితో పాటు యిద్దరు కొత్త మనుషులు కూడా వచ్చారు. వాళ్ళను మన పశువుల పాకలో దాచిపెట్టాడు. ఏదో కీడు జరగబోతోందని నా మనసు చెప్తోంది. య్యా వెంకన్న, మమ్మల్ని కాపాడు తండ్రీ.." అని రాసి వుంది.
ఆ డైరీ చదివాక, అందరికీ అసలు హంతకుడు యెవరో, ఆ ఘోరం యెలా జరిగిందో అర్థమైంది.
నరసింహా రెడ్డి ఆస్తి కోసం, చేతబడి, క్షుద్ర శక్తులను ఉపయోగించి, తన అన్న కుటుంబాన్ని అంతం చేశాడని స్పష్టమైంది.
వాడు బయటి నుండి రాలేదు. ఆ రోజు రాత్రి వాడు చుట్టంలాగా ఆ యింట్లోనే వున్నాడు. అందుకే తలుపులన్నీ లోపలి నుండి గొళ్ళెం పెట్టి వున్నాయి.
యీ నిజం బయటపడగానే, మేడలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
సామాన్లు గాలిలో యెగరడం మొదలయ్యాయి. కిటికీలు, తలుపులు అవే అదురుతూ, కొట్టుకోసాగాయి.
గోడల మీద నెత్తుటి మరకలు మళ్ళీ కొత్తగా పూసినట్టు కనపడ్డాయి. పిల్లల యెడుపులు, ఆర్తనాదాలు గట్టిగా, చెవులు చిల్లులు పడేలా వినిపించసాగాయి.
నరసింహా రెడ్డి దుష్టాత్మ, తన రహస్యం బయటపడిందని, కోపంతో ఊగిపోతోంది.
హఠాత్తుగా, పెదకాపు రెడ్డి గది నుండి ఒక పెద్ద గాజు పగిలిన శబ్దం వచ్చింది.
అందరూ అటు పక్కకు పరుగెత్తారు. అక్కడ, గోడకు తగిలించి వున్న పెదకాపు రెడ్డి పాత ఫోటో కింద, ఒక నల్లని, పొగలాంటి నీడ రూపం గట్టిపడి, ఒక మనిషి ఆకారంలోకి మారింది.
దాని చేతిలో ఒక గొడ్డలి మెరుస్తోంది. దాని కళ్ళు నిప్పు కణాల్లా యెర్రగా వున్నాయి. అది నరసింహా రెడ్డి దుష్టాత్మ.
"యీ యిల్లు నాది! యీ ఆస్తి నాది! నా రహస్యాన్ని బయటపెట్టడానికి వచ్చిన మీ అందరినీ యీ రోజు యిక్కడే సమాధి చేస్తా!" అని ఒక భయంకరమైన, కర్కశమైన గొంతు హాలంతా ప్రతిధ్వనించింది.
ఆ దుష్టాత్మ వాళ్ళ వైపు గొడ్డలితో దూసుకురాబోయింది. సూరి భయంతో కిందపడిపోయాడు.
రెడ్డిగారు "గోవిందా, గోవిందా" అని అరుస్తున్నాడు. శివ, లచ్చిని వెనక్కి లాగాడు. కానీ లచ్చి ధైర్యం చేసి ముందుకు వచ్చింది.
"నరసింహా రెడ్డి, నీ పాపం పండింది. నువ్వు చేసిన ఘోరం యీ రోజు లోకానికి తెలిసింది. యీ అమాయక ఆత్మలకు విముక్తి కలిగించు. నువ్వు యీ యిల్లు వదిలి పో, " అని గట్టిగా అరిచింది.
ఆ మాటలకు ఆ దుష్టాత్మ మరింత రెచ్చిపోయి, ఒక పెద్ద అరుపుతో లచ్చి మీదికి దూకింది.
కానీ అదే టయానికి, మేడలోని గదుల నుండి తెల్లని వెలుగులు ప్రసరించాయి.
పెదకాపు రెడ్డి, గౌరమ్మ, వాళ్ళ నలుగురు పిల్లల ఆత్మలు.. అందరూ తెల్లని కాంతి రూపంలో మయ్యాయి. అవి నరసింహా రెడ్డి దుష్టాత్మను చుట్టుముట్టాయి.
"ఇగ చాలు, తమ్ముడూ. నీ కక్ష, నీ ఆశ యింతటితో సమాప్తం. మాతో పాటు నువ్వు కూడా యీ బంధనం నుండి బయటపడాలి, " అని పెదకాపు రెడ్డి ఆత్మ శాంతంగా పలికింది.
ఆ గొంతులో కోపం లేదు, జాలి మాత్రమే వుంది.
..లచ్చి నుదుటి మీద శివ తన గంగమ్మ తాయెత్తును పెట్టగానే, నరసింహా రెడ్డి ఆత్మ భయంకరంగా అరిచింది. కానీ, అది ఓడిపోలేదు.
"ఓరి వెర్రి నాయాలా! యీ తాయెత్తు నన్ను కొంచెం సేపు ఆపగలదేమో గానీ, నా ప్రతీకారాన్ని ఆపలేదురా!" అని అరుస్తూ, అది పక్కకు తప్పుకుంది.
అప్పుడే, యింతసేపూ భయంతో వణికిపోతున్నట్టు నటిస్తున్న రెడ్డిగారు ఒక్కసారిగా నవ్వాడు. ఆ నవ్వు శానా క్రూరంగా, వికృతంగా వుంది.
ఆయన జేబులోంచి ఒక పాతకాలపు కత్తి తీసి, శివ మెడ మీద పెట్టాడు.
"రెడ్డిగారూ! మీరేంటి?" అన్నాడు శివ, నమ్మలేనట్టు.
సూరి అదిరిపడ్డాడు."నేనా? నేను నరసింహా రెడ్డి మునిమనుమడినిరా, నా పేరు కూడా నరసింహా రెడ్డే. యీ ఆస్తి మాది. యీ రోజుతో, మా ముత్తాత ఆత్మకు శాశ్వతమైన శరీరాన్ని యిచ్చి, యీ రాష్ట్రాన్నే ఏలబోతున్నాం. దానికి కావాల్సింది యీ అమ్మాయి బలి, " అన్నాడు రెడ్డి, లచ్చి వైపు కత్తి చూపిస్తూ.
అందరికీ ఒక్కసారిగా అసలు కథ అర్థమైంది. వాళ్ళని యిక్కడికి తెచ్చింది, డైరీలో కొన్ని పేజీలు చించి, వాళ్ళను తప్పుదారి పట్టించింది, అంతా రెడ్డిగారే.
పెదకాపు రెడ్డి కుటుంబం ఆత్మలు వాళ్ళను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే, రెడ్డిగారు చదివిన మంత్రాలకు అవి కూడా కట్టబడిపోయి బలహీనపడ్డాయి.
"లచ్చి!" అని శివ అరిచాడు.
కానీ, రెడ్డిగారు లచ్చిని పట్టుకుని, హాలు మధ్యలో గీసి వున్న ఒక భయంకరమైన ముగ్గు మధ్యలో నిలబెట్టాడు.
నరసింహా రెడ్డి దుష్టాత్మ ఆ ముగ్గు చుట్టూ తిరుగుతూ, లచ్చిలోకి ప్రవేశించడానికి సిద్ధంగా వుంది.
అంతా అయిపోయిందనుకున్న సమయంలో, శివకు డైరీలో చించకముందు, ఒక మూలన చిన్న అక్షరాలతో రాసి వున్న వాక్యం గుర్తొచ్చింది
"పునాదిలోని గంగమ్మ చెంబు.. అదే ఆఖరి ఆశ.""సూరీ!" అని అరిచాడు శివ.
"నేలమాళిగ! యెట్టైనా అక్కడికి పోవాలి!"రెడ్డిగారు నవ్వుతూ, "అక్కడికేరా పోయేది, నీ శవాన్ని పాతిపెట్టడానికి!" అని శివ మీదకు దూకాడు.
ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం మొదలైంది. ఒక పక్క శివ, రెడ్డిగారితో ప్రాణాల కోసం పోరాడుతుంటే, మరోపక్క నరసింహా రెడ్డి ఆత్మ లచ్చిని ఆవహించడం మొదలుపెట్టింది.
లచ్చి గట్టిగా అరుస్తోంది, ఆమె అరుపు నెమ్మదిగా నరసింహా రెడ్డి నవ్వుగా మారుతోంది.
సూరి, ధైర్యం చేసి, విరిగిపడిన షాండ్లియర్ ఇనుప ముక్క తీసుకుని, రెడ్డిగారి కాళ్ళ మీద బలంగా కొట్టాడు.
రెడ్డి కిందపడగానే, శివ నేలమాళిగ వైపు పరిగెత్తాడు. ఆ దారి మూసివుంది.
"తొందరగా!" అని అరిచింది పెదకాపు రెడ్డి ఆత్మ, క్షణకాలం పాటు రెడ్డి మంత్రపు కట్టు నుండి బయటపడి.
శివ తన సర్వశక్తులూ ఉపయోగించి ఆ తలుపును బద్దలు కొట్టాడు. లోపలంతా చిమ్మచీకటి.
వాడు తన ఫోన్ లైట్ వేసి, పునాదుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా, ఒక మూల గోడ మీద, నీటితో తడిసినట్టు ఒక గుర్తు కనపడింది.
వాడు గోడను పగలగొట్టగా, లోపల ఒక పాత రాగి చెంబు కనపడింది.అది తీసుకుని పైకి వచ్చేసరికి, లచ్చి పూర్తిగా నరసింహా రెడ్డి ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోయింది.
ఆమె కళ్ళు యెర్రగా మెరుస్తున్నాయి. ఆమె చేతిలో రెడ్డిగారిచ్చిన కత్తి వుంది. ఆమె శివను చంపడానికి ముందుకు దూకింది.
"లచ్చి, నేను శివని!" అని అరుస్తూ, శివ ఆ చెంబులోని పవిత్ర జలాన్ని ఆమె మీద చల్లాడు.
"ఆఆఆఆఆఆ!" అని ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు అరిచింది లచ్చి లోపలున్న ఆత్మ. ఆమెలోంచి నరసింహా రెడ్డి ఆత్మ పొగలు కక్కుతూ బయటకు వచ్చింది.
అదే సమయంలో, శివ మిగిలిన నీళ్ళను రెడ్డిగారి మీద, ఆ భయంకరమైన ముగ్గు మీద చల్లాడు.
ఆ ముగ్గు మంటల్లో కాలిపోవడం మొదలైంది. రెడ్డిగారు కూడా మంటల్లో చిక్కుకుని అరుస్తున్నాడు.
నరసింహా రెడ్డి ఆత్మ, తన బలం మొత్తం కోల్పోయి, పెదకాపు రెడ్డి కుటుంబం ఆత్మల చేతిలో బందీ అయ్యింది.
"నీ వంశం యింతటితో అంతం, " అని పెదకాపు రెడ్డి ఆత్మ చెప్పి, ఆ దుష్టాత్మను, మంటల్లో కాలుతున్న రెడ్డిగారి ఆత్మను కూడా తనతో పాటు తీసుకుని, ఒక పెద్ద వెలుగు రూపంలో అదృశ్యమయ్యాయి.
ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారింది. లచ్చి స్పృహ తప్పి కిందపడిపోయింది. మేడ మొత్తం కదలడం మొదలైంది.
అది కూలిపోతోంది. శివ, సూరిని లేపి, లచ్చిని భుజం మీద వేసుకుని, కూలిపోతున్న ఆ మేడలోంచి బయటకు పరుగెత్తారు.
వాళ్ళు బయటపడగానే, గాయత్రి సదనం మొత్తం ఒక పెద్ద శబ్దంతో నేలమట్టమైంది.
దుమ్ము తగ్గాక, ఆ శిథిలాల మీద ఉదయిస్తున్న సూర్యుడి వెలుగు పడింది.
ఒక శతాబ్దపు పీడకల ఆ రోజుతో అంతమైంది.
తెల్లని వెలుగు పెరిగి, ఆ నల్లని నీడను తనలో కలిపేసుకుంది. నరసింహా రెడ్డి ఆత్మ భయంకరంగా అరుస్తూ, ఆ వెలుగులో కరిగిపోయింది.
ఒక పెద్ద మెరుపు తర్వాత, అంతా నిశ్శబ్దంగా మారింది. మేడలోని భయంకరమైన గాలి మాయమై, ఒకరకమైన ప్రశాంతత వచ్చింది.
శతాబ్దాల పాటు ఆ యింటిని పట్టిపీడించిన చీకటి తొలిగిపోయింది.
తెల్లారింది. సూర్యుడి మొదటి కిరణాలు ఆ పగిలిన కిటికీల గుండా లోపలికి వచ్చాయి.
శివ, లచ్చి, సూరి, రెడ్డి అలసిపోయి, కానీ ఒక పనిని పూర్తి చేశామన్న తృప్తితో మేడ నుండి బయటకు వచ్చారు.
వాళ్ళు ఆ రాత్రి జరిగిన దాన్ని, గాయత్రి సదనం గోసను తమ కెమెరాలలో బంధించారు.
వాళ్ళ యూట్యూబ్ వీడియో లక్షల మంది సూశారు. గాయత్రి సదనం వెనకున్న నిజం అందరికీ తెలిసింది.
ఆ తర్వాత, పెదకాపు రెడ్డి దూరపు బంధువులు ముందుకు వచ్చి, ఆ మేడను పడగొట్టి, ఆ స్థలంలో ఒక అనాథ పిల్లల కోసం బడి కట్టించారు.
ఆ అమాయక ఆత్మలకు శాంతి దొరికిందని, అందుకే ఆ చోటు ఇప్పుడు పిల్లల నవ్వులతో ప్రశాంతంగా మారిందని జనాలు అనుకుంటారు.
కానీ ఆ రాత్రి "సీమలో దెయ్యాలు" టీం సూసిన భయం, వాళ్ళు కనుక్కున్న నిజం, ఆ సీమ కథలలో ఒక మరుపురాని ఘటనగా మిగిలిపోయింది.
సమాప్తం
ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: ఎం. కె. కుమార్
నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.
🙏




Comments