top of page
Original_edited.jpg

అశ్రువు

  • M K Kumar
  • Nov 3
  • 7 min read

#MKKumar, #ఎంకెకుమార్, #Asruvu, #అశ్రువు, #TeluguHeartTouchingStories

ree

Asruvu - New Telugu Story Written By - M K Kumar

Published In manatelugukathalu.com On 03/11/2025

అశ్రువు - తెలుగు కథ

రచన: ఎం. కె. కుమార్


దోరణపాల గ్రామపు పొలిమేరల్లో, ఆ సాయంకాలపు గాలిలో బరువైన నిశ్శబ్దం గడ్డకట్టుకుపోయింది. 


అది చలికాలపు పొగమంచు మాత్రమే కాదు. అది దశాబ్దాల పోరాటం తర్వాత మిగిలిన అలసట, ఓటమిని అంగీకరించలేని నిస్సహాయత. 


ఎర్రమట్టి దుమ్మును లేపుతూ వస్తున్న ప్రభుత్వ వాహనాల కాన్వాయ్, ఒక శవయాత్రలా అనిపించింది రవికి. 


ఇది తన పాత జీవితానికి అంత్యక్రియలు. తనలోని 'కామ్రేడ్ రవి' అనే ఆత్మకు శాంతి కర్మ.


ఊరేగింపు ముందు నడుస్తున్న ప్రతి అడుగు, అతని గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంటోంది. 


ఈ నేల, ఈ గాలి, ఈ చెట్లు... అన్నీ అతనివే. వాటి కోసమే అతను బతికాడు, చంపాడు, చావడానికి సిద్ధపడ్డాడు. 


కానీ ఇప్పుడు, అవేవీ తనవి కావన్నట్టు, ఒక అపరిచితుడిలా, ఓడిపోయిన సైనికుడిలా నడుస్తున్నాడు. 


దండకారణ్యంలో దశాబ్దాలుగా వేలాది ఆదివాసీల గుండెల్లో ధైర్యాన్ని నింపిన ఆ పేరు కామ్రేడ్ రవి ఇప్పుడు గాలిలో కలిసిపోతోంది. నిజానికి అతని పేరు నరసింహులు. 


ఆ పేరును ఎప్పుడో అడవిలో సమాధి చేశాడు. తుపాకీ పట్టిన రోజే నరసింహులు చనిపోయాడు, రవి పుట్టాడు. 


ఇప్పుడు రవి చనిపోతున్నాడు, మరి నరసింహులు తిరిగి బతుకుతాడా? లేక ఇద్దరూ ఈ ఎర్రమట్టిలో కలిసిపోతారా?


అతని చేతిలో ఏకే-47 లేదు. ఆ బరువు, ఆ చల్లని స్పర్శ, ఆ భద్రత ఇప్పుడు లేవు. అది కేవలం ఆయుధం కాదు, అది అతని శరీరంలో ఒక భాగం, అతని ఉనికికి ప్రతిరూపం. 


దాని స్థానంలో ఇప్పుడు ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిన రాజ్యాంగ ప్రతి ఉంది. అది తేలికగా, నిర్జీవంగా, అతని చేతులకు కొత్తగా అనిపించింది. 


ఒకప్పుడు తుపాకీ గొట్టం శత్రువు గుండెల్లోకి సూటిగా చూసేది. ఇప్పుడు ఈ పుస్తకంలోని అక్షరాలు ఎవరికి దారి చూపిస్తాయి? అతని ప్రజల ఆకలిని తీరుస్తాయా? వారి ఆత్మగౌరవాన్ని కాపాడతాయా?


వేదికపై నిలబడ్డ ముఖ్యమంత్రి రఘురామ్ ముఖంలో విజేతకు ఉండే దర్పం, ఎగతాళి స్పష్టంగా కనిపించాయి. 


అతని వెనుక బ్యానర్‌పై ఉన్న 'ప్రజాస్వామ్య విజయం – అభివృద్ధికి నాంది' అనే నినాదం రవిని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. 


ఏ ప్రజాస్వామ్యం? ఓట్లు దొంగిలించి గెలిచిన వాడిదా? ఏ అభివృద్ధి? తమ అడవులను కార్పొరేట్లకు అప్పగించడమా?


రవి మెట్లు ఎక్కి, తన భుజాన వేలాడుతున్న చివరి ఆయుధాన్ని ఒక పాత తుపాకీ, ఉద్యమంలో అతను కోల్పోయిన మిత్రుడి జ్ఞాపకం ముఖ్యమంత్రికి అందించాడు. 


ఆ క్షణంలో, అతను కేవలం ఒక వస్తువును ఇవ్వడం లేదు. తన యవ్వనాన్ని, తన ఆశయాలను, తన సహచరుల త్యాగాలను, తన ఆత్మలోని ఒక భాగాన్ని అప్పగిస్తున్నాడు. 


రఘురామ్ ఆ తుపాకీని ఒక ట్రోఫీలా అందుకుని, కెమెరాల వైపు చూసి నవ్వాడు. 


ఆ నవ్వు రవి గుండెల్లో మంటలు రేపింది. ఒక అధికారి వచ్చి రవి చేతిలో రాజ్యాంగ ప్రతిని ఉంచాడు. దాని చల్లని స్పర్శ అతని చేతుల్ని తిమ్మిరెక్కిచింది.


"ప్రజాస్వామ్య వ్యవస్థలోకి స్వాగతం, రవి గారు. ఇకపై మీ ఆయుధం – రాజ్యాంగం!" అని ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు, కింద నిలబడ్డ ప్రజల కళ్ళల్లో రవి ఒక వింత భావాన్ని చూశాడు. 


అది గౌరవం కాదు, సానుభూతి కాదు. అదొక ప్రశ్న. 'కామ్రేడ్, మమ్మల్ని ఎవరి చేతుల్లో పెట్టి వెళ్తున్నావు?' అన్న నిశ్శబ్ద ఆక్రందన అది. 


ఆ చూపులకు సమాధానం చెప్పలేక, రవి తలదించుకున్నాడు.


దూరంగా నిలబడ్డ సురేష్ కుమార్ ముఖంలోని నిట్టూర్పును గమనించాడు. అవును, ఆ రాజ్యాంగం తనకన్నా ఆ ముఖ్యమంత్రికే ఎక్కువ అవసరం. 


కానీ చట్టాన్ని చేతిలో ఉంచుకుని అన్యాయం చేసేవాడికి, దాని విలువ ఎలా తెలుస్తుంది? రెండు నెలల క్రితం ఈవీఎం మోసాలపై నిరసన తెలిపిన ఆదివాసీలపై లాఠీచార్జ్ చేయించిన దృశ్యం రవి కళ్ళముందు మెదిలింది. 


అప్పుడు కూడా వారి చేతుల్లో రాజ్యాంగబద్ధమైన హక్కులే ఉన్నాయి. కానీ ప్రభుత్వం లాఠీలతో, కేసులతో సమాధానం చెప్పింది. 


ఇప్పుడు తన చేతిలోని ఈ పుస్తకం మాత్రం ఏం అద్భుతం చేస్తుంది? రవి మనసులో ఒక దశాబ్దం కిందట జరిగిన సంభాషణ ప్రతిధ్వనించింది.


పదేళ్ల క్రితం, దండకారణ్యంలోని ఒక చీకటి రాత్రి. గుడారంలో కిరసనాయిల్ దీపం వెలుగు నీడల్లో రవి, సురేష్ కుమార్ ముఖాలు తీవ్రమైన భావోద్వేగాలతో మెరుస్తున్నాయి. 


బయట చిరుజల్లు, అడవి పురుగుల సంగీతం. లోపల మాత్రం ఇద్దరి మధ్య సైద్ధాంతిక తుఫాను.


"సురేష్ గారు, మీ అహింస, మీ గాంధేయవాదం ఏం సాధించాయి? నర్మదా ఆనకట్టను ఆపగలిగారా? వేలాది ఆదివాసీ కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. మీ చేతిలో ఉపవాస దీక్ష ఉంటే, మా చేతిలో తుపాకీ ఉంది. చెప్పండి, ఏది బలమైన ఆయుధం?" రవి గొంతులో ఆగ్రహం కంటే ఎక్కువ ఆవేదన ఉంది. 


అతను చూసిన ప్రతి నిర్వాసిత కుటుంబం, ప్రతి ఆకలిచావు అతని ప్రశ్నలో జీవం పోసుకుంది.


సురేష్ కళ్ళల్లో నిప్పులు చెరిగాయి. 


"మరి మీ తుపాకీ ఏం సాధించింది, రవి? కొన్ని దాడులు, కొన్ని హత్యలు, అంతేనా? మీరు భూస్వాములను చంపారు, వారి స్థానంలో కొత్త భూస్వాములు పుట్టుకొచ్చారు. పీడన రూపం మార్చుకుంది, కానీ అది పోలేదు. దళితులపై అత్యాచారాలు ఆగాయా? అడవిని దోచుకోవడం ఆగిందా? మీ హింస ప్రభుత్వానికి మరింత హింసను ప్రయోగించడానికి ఒక కారణం ఇచ్చింది, అంతే."


రవి గుండెలో సురేష్ మాటలు బాణాల్లా గుచ్చుకున్నాయి. అవును, నిజమే. తాము చంపిన ప్రతి అధికారి స్థానంలో మరింత క్రూరుడైనవాడు వచ్చాడు. 


తాము పేల్చేసిన ప్రతి పోలీస్ స్టేషన్, మరింత పెద్ద సైనిక శిబిరంగా మారింది. 


కానీ... "కనీసం మేం భయాన్ని సృష్టించాం, సురేష్ గారు. మా వల్లనే భూస్వామి పేదవాడి పొలం వైపు చూడాలంటే భయపడ్డాడు. ప్రభుత్వం కనీసం భూసంస్కరణల గురించి చర్చించాల్సి వచ్చింది. మీ అహింస తేలేని మార్పు అది."


ఆ రాత్రంతా వారు వాదించుకున్నారు. తెల్లవారుజామున, దీపం కొడిగడుతున్న వేళ, వారిద్దరి గొంతులు అలసిపోయాయి. 


ఆవేశం చల్లారి, ఒకరినొకరు అర్థం చేసుకునే నిశ్శబ్దం ఆవరించింది. సురేష్, రవి భుజంపై చేయి వేశాడు. 


"నేను ఒప్పుకుంటాను, రవి. నర్మదా ప్రవాహాన్ని మేం పూర్తిగా ఆపలేకపోయాం. కానీ, మా పోరాటం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆనకట్టల విధ్వంసంపై చర్చ మొదలైంది. అది కూడా ఒక మార్పే. అలాగే, నీ పోరాటం వల్ల భూస్వామ్య వ్యవస్థ పునాదులు కదిలాయి. అది నీ విజయం కాదా?"


రవి దీపం వైపు చూస్తూ నిట్టూర్చాడు.


 "బహుశా మన ఇద్దరి మార్గాలు వేరు కావచ్చు, కానీ మన గమ్యం ఒకటే. మన ఇద్దరి పోరాటాలు మన నిస్పృహలను, మన ఆశలను ప్రపంచానికి చూపించడానికే జరిగాయేమో. సామాజిక మార్పు అనేది ఒక రాత్రిలో జరిగే అద్భుతం కాదు. అది తరాల త్యాగాలతో, ఎర్రబారిన కళ్ళతో, నెత్తురోడిన పాదాలతో చేసే ఒక సుదీర్ఘ ప్రయాణం."


ఆ రోజు సురేష్‌లో ఒక మిత్రుడిని చూశాడు రవి. ఈ రోజు, వేదిక కింద నిలబడ్డ సురేష్ ముఖంలో అదే నిస్పృహ, అదే సుదీర్ఘ ప్రయాణం అలసట కనిపించాయి.


ఆయుధాలు వదిలి బహిరంగ జీవితంలోకి వచ్చిన కొన్ని వారాల తర్వాత, రవి తన పాత సహచరుడు శివయ్యను ఒక పాడుబడిన టీ కొట్టు దగ్గర కలిశాడు. 


శివయ్య ఒకప్పుడు దళిత ఉద్యమంలో పనిచేసి, వ్యవస్థపై నమ్మకం కోల్పోయి దళంలో చేరాడు. 


అతని కళ్ళల్లో అణచివేతపై ఎప్పటికీ ఆరని అగ్ని ఉండేది.


శివయ్య, రవిని పైనుంచి కిందకు చూశాడు. అతని చూపుల్లో ఎగతాళి, కోపం, నిరాశ కలగలిసి ఉన్నాయి. 


"రవి, నువ్వు ఆయుధాలు వదిలేశావా? అంటే మనం గెలిచినట్టా? నాకు అలా కనిపించడం లేదు. మన గ్రామాల్లో ఇప్పటికీ అవే ఆకలి కేకలు. మన ఆడపిల్లల మానానికి ఇప్పటికీ రక్షణ లేదు." అతని గొంతులో చేదు స్పష్టంగా ఉంది.


"యుద్ధం ముగియలేదు, శివయ్య. పోరాట రూపాన్ని మార్చాం. ఇప్పుడు ప్రజల మధ్య ఉండి, రాజ్యాంగ మార్గంలో పోరాడాలి. సురేష్ గారు చెప్పినట్టు, అహింస కూడా ఒక ఆయుధమే, " అన్నాడు రవి, తన గొంతులోని బలహీనతను దాచుకోవడానికి ప్రయత్నిస్తూ.


శివయ్య పెద్దగా నవ్వాడు. ఆ నవ్వులో వేల ఏళ్ల అవమానం ఉంది.


 "రాజ్యాంగమా? దళితులను మోసం చేసిన చరిత్ర మనది. ప్రతి ప్రభుత్వం అదే చేసింది, చేస్తోంది. ఆ పుస్తకంలోని హక్కులు మనకు ఎప్పుడైనా అందాయా? దేశంలో 80% దళితులకు ఇప్పటికీ సొంత భూమి లేదు. పీడకులు మారలేదు. వారు మారనప్పుడు, మనం ఆయుధం వదలడం ఆత్మహత్యతో సమానం కాదా?"


శివయ్య మాటలు రవిని నిలదీశాయి. అతని మనసులో 1950ల నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు, కిష్టాగౌడ్, భూమయ్యల ముఖాలు మెదిలాయి. 


భూస్వామిని చంపి, భూమిని పేదలకు పంచినందుకు వారిని ఉరితీసింది ఈ రాజ్యమే. శివయ్య చెప్పింది నిజమే. వ్యవస్థ మారనప్పుడు, ఆయుధం మారితే ఏం లాభం?


"నాకు తెలుసు శివయ్య. నీ ఆవేదన నాకు అర్థమైంది. కానీ తుపాకీతో మనం ఇంకా ఎంతమందిని కోల్పోవాలి? మన పిల్లలు కూడా అడవుల్లోనే బతకాలా? ఈ మార్గం విఫలమైతే, మరో మార్గం గురించి ఆలోచిద్దాం. కానీ ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం, " అన్నాడు రవి, తనలోని సందిగ్ధాన్ని దాచుకుంటూ.


శివయ్య అతని వైపు జాలిగా చూశాడు. 


"ప్రయత్నించు, రవి. కానీ గుర్తుంచుకో, ఈ వ్యవస్థ నిన్ను తనలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. నిన్ను నిర్వీర్యం చేస్తుంది. అప్పుడు నీకు ఆయుధం విలువ తెలుస్తుంది. కానీ అప్పటికి సమయం మించిపోతుంది." శివయ్య వెళ్ళిపోయాడు. 


అతని నీడ, రవి మనసుపై ఒక చీకటి మేఘంలా కమ్ముకుంది.


రాత్రుళ్లు రవికి నిద్ర పట్టేది కాదు. కళ్ళు మూస్తే చాలు, 2005 నాటి సాల్వా జుడుం భయానక దృశ్యాలు కళ్ళముందు కదిలేవి. 


ప్రభుత్వ మద్దతుతో, తమ సొంత ప్రజలే తమపై దాడి చేసిన ఆ నరమేధం, అతని ఆత్మపై చెరగని గాయం చేసింది.


అతను కళ్ళు మూసుకుంటే, తగలబడుతున్న గుడిసెల వాసన, గాలిలో కలిసిపోతున్న ఆర్తనాదాలు, అత్యాచారానికి గురైన మహిళల నిస్సహాయపు చూపులు... అన్నీ సజీవంగా వెంటాడేవి. 


అప్పుడు అతను దళంలో కీలక నాయకుడు. ప్రజలను కాపాడతామని మాట ఇచ్చాడు. 


కానీ వందలాది సైనికులు, సాల్వా జుడుం మూకల ముందు వారి శక్తి సరిపోలేదు. 


ఒక గ్రామంలో, కమలి అనే పదిహేనేళ్ల అమ్మాయిని అతని కళ్ళ ముందే ఎత్తుకెళ్లారు. అతను ఏమీ చేయలేకపోయాడు. ఆ అమ్మాయి ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఆ అపరాధభావన అతన్ని ప్రతిక్షణం దహించివేస్తోంది.


"ప్రజలను కాపాడటానికే ఆయుధాలు పట్టాం. కానీ మా కళ్ళముందే మా ప్రజలు చంపబడుతుంటే నిస్సహాయంగా చూడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆ జుడుమ్‌ను రాజ్యాంగ విరుద్ధమని చెప్పినా, ప్రభుత్వం దాన్ని మరో రూపంలో కొనసాగించింది. ఇప్పుడు ఆయుధాలు వదిలేస్తే, మా ప్రజల బతుకులకు భద్రత ఏది?" రవి తనలో తాను కుమిలిపోయేవాడు.


2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలు గుర్తుకొచ్చాయి. భూమి పునఃపంపిణీ ప్రధాన డిమాండ్‌గా వారు ముందుకు వెళ్లారు.


కానీ ప్రభుత్వం అంగీకరించలేదు. చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాతే పోరాటం మరింత తీవ్రమైంది. 


ఇన్నేళ్ల పోరాటం, ఇన్ని త్యాగాలు... అన్నీ జల్, జంగల్, జమీన్ కోసమే. ఇప్పుడు, ఆయుధాలు వదిలేశాక, అదే ప్రభుత్వం అవే అడవులను అదానీకి అప్పగించడానికి సిద్ధమవుతోంది.


"మేం పోరాడితే తునికాకు కూలీ రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఆ చట్టాలు నిలబడతాయా? మా పోరాటంతో భయపడిన మైనింగ్ కంపెనీలు, ఇప్పుడు ప్రభుత్వ అండతో మళ్ళీ రావా? మా త్యాగాలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా?" ఈ ప్రశ్నలు అతని మెదడును తొలిచేసేవి. 


అతను ఆయుధాలు వదిలిపెట్టింది, ప్రజల భవిష్యత్తును కార్పొరేట్ల చేతిలో పెట్టడానికేనా? ఈ ఆలోచన అతనికి ఊపిరాడకుండా చేసేది.


తనలోని సంఘర్షణను పక్కనపెట్టి, రవి పనిలో మునిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. 


తన పాత సహచరులతో కలిసి, స్థానిక ఆదివాసీల సమస్యలపై దృష్టి పెట్టాడు. ఒక మైనింగ్ కంపెనీకి వ్యతిరేకంగా, భూమి కోల్పోతున్న ప్రజలతో కలిసి ఒక శాంతియుత ర్యాలీ నిర్వహించాడు.


ప్రభుత్వం వెంటనే స్పందించింది. వందలాది పోలీసులు వచ్చి ర్యాలీని చుట్టుముట్టారు. డీఎస్పీ నేరుగా రవి దగ్గరకు వచ్చాడు.


 "రవి, నువ్వు ఆయుధాలు వదిలేశావు, సంతోషం. కానీ నీ భావజాలం ఇంకా ప్రభుత్వ వ్యతిరేకమే. ఇలాంటివి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం."


రవికి నవ్వొచ్చింది. 


"ఇప్పుడు మా చేతిలో తుపాకీ లేదు, సార్. రాజ్యాంగం ఉంది. మా హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు మాకు లేదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో భాగం కాదా?"


ఆ అధికారి కళ్ళల్లో అధికార మదం కనిపించింది. 


"ఆ పాఠాలు మాకు చెప్పకు. నువ్వు మా దృష్టిలో ఇప్పటికీ ఒక నక్సలైట్‌వే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి."


రవి కదలలేదు. "మా భూములు మాకు దక్కేవరకు ఇక్కడి నుంచి కదలం."


ఆ మాటతో పోలీసులు లాఠీచార్జ్ మొదలుపెట్టారు. రవిని, అతని అనుచరులను చితకబాదారు. రవిని అరెస్టు చేసి, జీపులోకి తోశారు. 


"నీపై 'అర్బన్ నక్సల్' కేసు పెడతాం. ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోతావు. ప్రభుత్వానికి ప్రతిపక్షం లేని భారతదేశం కావాలి. ఆయుధం పడితేనే కాదు, మాట పలికినా, ప్రశ్నించినా దేశద్రోహమే, " అని డీఎస్పీ హెచ్చరించాడు.


రవికి అంతా అర్థమైపోయింది. వారు కోరుకుంది శాంతి కాదు, సంపూర్ణ లొంగుబాటు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడమే వారి ప్రజాస్వామ్యం.


కొన్ని రోజుల తర్వాత, సురేష్ కుమార్ అతన్ని జైల్లో కలవడానికి వచ్చాడు. 


ఇద్దరూ ఇనుప ఊచల మధ్య నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు.


"చూశావా రవి? నువ్వు ఎంచుకున్న ప్రేమ మార్గంలో కూడా ముళ్ళే ఉన్నాయి. అణచివేత రూపం మార్చుకుంది, అంతే. దళితులు, ఆదివాసులు, కార్మికులు, మహిళలు... వీరి కోసం పోరాడిన ఉద్యమం ఓడిపోతే, వీరంతా మళ్లీ అనాథలవుతారు. వారికి రెండే మార్గాలుంటాయి. అంతరించిపోవడం, లేదా మళ్ళీ ఆయుధాలు పట్టడం, " సురేష్ గొంతులో ఓటమి అంగీకరించిన నిస్సహాయత ఉంది.


రవి జైలు గదిలోని చల్లని గోడ వైపు చూస్తూ నెమ్మదిగా జవాబిచ్చాడు. అతని గొంతులో ఇప్పుడు ఆవేశం లేదు, అలసట లేదు. ఒక స్పష్టత ఉంది. 


"నక్సల్స్ ఓడిపోయారు, సురేష్. కానీ పార్టీ పోరాటం ఆపలేదు. కానీ ప్రజాస్వామ్యం గెలవలేదు. ఓట్లు దొంగిలించే వాళ్ళు గెలిచారు. భూమిని, అడవులను, నీటిని లూటీ చేసే పెట్టుబడిదారులు గెలిచారు. అణచివేత శక్తులు గెలిచాయి. అందుకే, పోరాటం ఎప్పటికీ ఆగదు. అది కేవలం రూపాన్ని మార్చుకుంటుంది, అంతే. ఈ రోజు యుద్ధం చేయాల్సిన అవసరం దేశంలోని ఎన్నో సమూహాలకు ఉంది."


ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన రవి, గతం కన్నా మరింత నిశ్శబ్దంగా, మరింత దృఢంగా మారాడు. 


అతను నేరుగా తన గ్రామానికి సమీపంలోని నది ఒడ్డుకు వెళ్ళాడు. ప్రవహిస్తున్న నీటిని చూస్తూ గంటల తరబడి నిలబడ్డాడు. 


అతని మనసులో వినోబా భావే మాటలు మెదిలాయి.


'ఒక సమస్యను పరిష్కరించడానికి మూడు మార్గాలుంటాయి. చట్టపరమైన మార్గం, ప్రేమమయమైన మార్గం, ప్రత్యర్థిని సంహరించే మార్గం. 


చట్టం న్యాయం ఇవ్వనప్పుడు, సమాజంలోని ప్రేమ, కరుణ మేల్కొననప్పుడు, పీడిత ప్రజలు తప్పనిసరిగా మూడో మార్గాన్ని, సంహార మార్గాన్ని ఎంచుకుంటారు.'


తాను ఆయుధాలు వదిలిపెట్టి తప్పు చేయలేదని అతనికి ఇప్పుడు అనిపించింది. అది ఒక ప్రయోగం. 


ఆ ప్రయోగం విఫలమైంది. కానీ ఆ వైఫల్యం ఒక కొత్త సత్యాన్ని నేర్పింది. ఆయుధం అనేది సమస్య కాదు, అది లక్షణం మాత్రమే. 


అసలైన సమస్య వ్యవస్థలో ఉంది. ఆ వ్యవస్థను మార్చడానికి కేవలం తుపాకీ సరిపోదు.


రవి ఒక కొత్త పోరాటానికి సిద్ధమయ్యాడు. అతను శివయ్య లాంటి పాత సహచరులను కలిశాడు. 


ఈసారి వారి మధ్య వాదనలు లేవు. ఒకరినొకరు అర్థం చేసుకున్న నిశ్శబ్దం మాత్రమే ఉంది. రవి తన ప్రణాళికను వివరించాడు.


 "తుపాకీ కాదు శివయ్య, మన ఆయుధం ఇప్పుడు ఐక్యత. రైతు సంఘాలను, దళిత సంఘాలను, మహిళా సంఘాలను, కార్మిక సంఘాలను... అణచివేతకు గురవుతున్న ప్రతి ఒక్కరినీ ఏకం చేయాలి. లక్షలాది నిరాయుధ ప్రజల గొంతుకను ఒక్కటిగా వినిపించాలి. వారి ఓటు హక్కును, వారి నిరసన హక్కును ఒక ఆయుధంగా మార్చాలి."


శివయ్య కళ్ళల్లో మొదటిసారి ఒక ఆశ మెరిసింది. అదొక నిరంతర యుద్ధం. సుదీర్ఘమైనది. అలసట కలిగించేది. 


కానీ మరో మార్గం లేదు. ఏ ఒక్కరి విజయమూ అంతిమం కాదు, ఏ ఒక్కరి ఓటమీ శాశ్వతం కాదు. ప్రజల గొంతును అణచివేస్తున్నంత కాలం, యుద్ధం ముగియదు.


రవి ఆకాశం వైపు చూసి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. అడవి గాలి అతని ఊపిరితిత్తులను తాకినప్పుడు, అతనిలో కొత్త శక్తి ప్రవహించింది. 


పోరాటం మళ్ళీ మొదలైంది. ఈసారి ఆయుధం మారింది, వ్యూహం మారింది. కానీ శత్రువు ఒక్కడే. లక్ష్యం కూడా ఒక్కటే. మావోయిస్టు పార్టీ ఒక్కటే విప్లవం తీసుకురాలేదు. అన్ని సమూహాలు కలిసే చేయాలి.


ఎర్రమట్టిపై ఆకుపచ్చ అశ్రువులు కారడం ఆగలేదు. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లు నిస్సహాయతకు చిహ్నం కాదు. అవి ఒక కొత్త పోరాటానికి నాంది పలుకుతున్న విత్తనాలు. 


అవి మళ్ళీ రక్తాశ్రువులుగా మారకుండా చూడటమే అతని జీవితధ్యేయం.


సమాప్తం


ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: ఎం. కె. కుమార్


నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.


🙏





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page