top of page
Original.png

నేనో సమిధనై

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #నేనోసమిధనై, #NenoSamidhanai, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు


Neno Samidhanai - New Telugu Story Written By Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 09/01/2026

నేనో సమిధనై - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


ఏ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం నాడు పిల్లలకు ఏదోక పోటీ పెట్టడం నాకు పరిపాటి. నేటి బాలలే రేపటి పౌరులు కదా!. పిల్లల ఆలోచనలు సన్మార్గంలో వుండాలన్నదే నా ఆలోచన. అందుకే వాళ్లలో వున్న ప్రతిభ బయటకు తీయడానికి వాళ్లకు ఏదోక పోటీ పెట్టి బహుమతులు ఇస్తుంటాను. ఏ అంశం మీద పోటీ పెట్టాలని ఆలోచనల్లో పడ్డాను. ప్రతి రోజూ వార్త పత్రిక చదవడం నా దినచర్య లో భాగం, రోజూ ఉదయాన్నే పత్రిక తెరిచి చూస్తే మానవత్వం, అనుబంధాలు మంట కలిసిపోతున్నాయని స్పష్టమౌతుంది. మనిషిలో ప్రత్యేకత ఏమిటి? మానవత్వమే కదా!, అనుబంధాలు ఆప్యాయతలు ఇవన్నీ అవసరమే.


బాగా ఆలోచించి ఈ సారి అమ్మానాన్న గురించి తమకు వున్న అనుబంధం గురించి రాయాలని వ్యాస పోటీ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాను. ఆ సంవత్సరం ఉత్తమ పాఠశాల బహుమతి పొందిన పాఠశాల ను ఎంపిక చేసుకున్నాను. విషయం ఆ పాఠశాల హెడ్ మాస్టారు తో మాట్లాడాను. ఒక జిల్లా కలెక్టర్ గా కాకుండా సాధారణ పౌరుడిగా ఆ పోటీ నిర్వహించాలనుకున్నాను. నా మాటకు హెడ్ మాస్టారు గారు చాలా సంతోషించారు. అనుకున్నట్టు గానే పోటీ నిర్వహించడం జరిగింది. హెడ్ మాస్టరునే న్యాయ నిర్ణేత గా ఉండమని అడిగాను. కానీ అతను ఒప్పుకోలేదు. 


"సర్, మీరైతే బాగుంటుంది. మీరే వాళ్ళు రాసిన వ్యాసాల్ని చదివి ఉత్తమమైనది ఎంపిక చేయండి. " అని నాతో అన్నారు. సరే అని ఒప్పుకోవాల్సి వచ్చింది. 


ముఖ్యమైన విధులు ఉండటం కారణంగా పోటీ ఫలితాలు ఇవ్వడం కాస్త ఆలస్యం అయింది. రోజుకు కొన్ని వ్యాసాలు తీసుకొని చదువుతూ వున్నాను. కానీ, ఏ వ్యాసం కూడా నా మనస్సును తాకడం లేదు. కొన్ని కొన్ని కృత్రిమంగా అనిపిస్తున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. నాకు నచ్చిన మార్క్స్ వేసుకుంటూ పోతున్నాను. 

రోజూ ఇదే సాగుతుంది. విధులు ముగించుకొని అలసట తో రావడం, ఫ్రెష్ అయిన తర్వాత వాటిని పరిశీలించడం. రెండు రోజుల తర్వాత వ్యాసాలన్నీ చదవడం చివరకి చేరుకుంది. ఏవో కొన్ని మిగిలి వున్నాయి. కానీ అప్పటి వరకు ఏ వ్యాసం నా మనస్సును తాకలేదు. మిగిలి వున్న వాటిని చూస్తూ వాటిలో అయినా నాకు నచ్చిన వ్యాసం వుంటుందేమో అని ఆశ పడ్డాను. ఒకవేళ లేకపోతే ఏం చేయాలన్న ప్రశ్న కూడా లేవనెత్తింది నా అంతరంగం. 


 కాసేపు విశ్రాంతి కోసం కూర్చున్న కుర్చీలోనే మెల్లగా వెనక్కి తల వాల్చాను. చిన్ననాటి జ్ఞాపకాలు తెరలు తెరలుగా గుర్తుకు వస్తున్నాయి. వాటిని నెమరు వేసుకుంటున్నాను. 


"రఘు! ఎందుకు రా ఆ దిగులు, పైగా నిన్న మీ నాన్న తో గొడవ పడ్డావంటా. " నన్ను దగ్గరకు తీసుకుంటూ అడిగింది రామవ్వ. మా ఊరిలో ఉండే చిన్న రామ మందిరం దగ్గర రాముడికి సేవలు చేస్తూ కాలం వెళ్లదీసేది. ఆమెకున్న ఒక్కగానొక్క కొడుకు అనారోగ్యం తో మరణించాడు. అప్పటి నుండి ఆమె ఆ ఊరంతా తన కుటుంబమే అని భావనతో గడిపేది. 


ఊరిలో ఉన్న ప్రజలు కూడా ఆమె ను ఆప్యాయంగా చూసే వాళ్ళు. నాన్న ఇసుక లోడ్లు ఎత్తే పనికి పోయే వాడు. ఉదయాన్నే వెళ్లి ఏ రాత్రికో ఇంటికి చేరేవాడు. ఇంటికి వచ్చినప్పుడు బాగా తాగేసి వచ్చేవాడు. నాన్న తో మాట్లాడుదామని చూసినా ఉలుకూ పలుకూ లేకుండా నిద్రపోయేవాడు. నాకు కోపం వచ్చి రోజూ ఉదయాన్నే నాన్న తో గొడవ పడే వాడిని.


నన్ను బుజ్జగిస్తూ, "రేయ్ రఘు, నాకు మందు తాగడం వ్యసనం కాదు రా, అది లేకపోతే వొళ్ళు నొప్పులకు తట్టుకోలేను రా. ఏం చేయమంటావు ఆ పని మానేద్దాం అంటే, దానిలో వచ్చిన గిట్టు బాటు మరి దేనిలో ఉండదు రా, వేరే పని ఇప్పుడు దొరకడం కూడా కష్టమే. మన బువ్వకు, బట్టకి డబ్బులు కావాలి కదా. " అని చెప్తూ ఉండే వాడు. కానీ నాకు అవేవీ అర్థమయ్యేవి కావు. నాన్న నాతో గడపడం లేదని నా బాధ, కోపం. రోజూ ఇలానే సాగేది. నాన్న వెళ్లిపోయిన తర్వాత రామవ్వ నన్ను చేరదీసి, తిండి పెట్టేది. ఆమెకు చదువు రాకపోయినా రామాయణ, భాగవత కథలు చక్కగా చెప్పేది. 


"రేయ్ రఘు! ఆ రాముల వారిని చూసావా అతనిలా వుండాలి రా, తండ్రి అడవులకు వెళ్లిపో అంటే, మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తండ్రిని ఎదిరించలేదు, నాకు ఆస్తి పంపకం చేసి ఇవ్వు అని అడుగలేదు. అతని నుండి మనం చాలా నేర్చుకోవాలి రా. తల్లి తండ్రుల కష్టం గుర్తించాలి. వాళ్లకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదు. " అని అంటూ రాముడి గురించి చెప్పేది. ఆమె మాటలు ప్రభావమో, ఆ రాముడి ప్రభావమో తెలియదు కానీ తర్వాత నాన్నను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడిని కాదు. పెద్దవుతూ ఉంటే ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేవి,


"అవ్వ! ఆ రాముడి కి నువ్వు ఉన్నావు కాబట్టి సేవ చేస్తున్నావు. తర్వాత అతను ఒంటరి అయిపోతాడు కదా, అతని ఆలనా పాలనా ఎవరు చూసుకుంటారు?. " ఇలాంటి ప్రశ్నలు వేసే వాడిని.


నా ప్రశ్నలకు నవ్వుతూ, "అతను ఒంటరి అవ్వడం ఏమిటి రఘు! అతన్ని విడిచి పెడితే మనమే ఒంటరి అవుతాం. చూడు ఇతని దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని అక్కడ కొంత సేపు కూర్చొని ప్రశాంతతతో వెళుతున్నాను. అర్థం అవుతుందా ఇతని ప్రత్యేకత. దేవుడంటే మనుష్యుల్ని సన్మార్గం వైపుకు నడిపించే మార్గదర్శనం అంతే. ఇక కొలవడం కొలవక పోవడం మన ఇష్టం. మన అవసరం కోసమే అతన్ని పూజిస్తున్నాం కదా!. " చెప్పేది రామవ్వ. 


ఇంకా ఆ సంఘటనలు కనుల ముందు కదలాడుతూ వున్నాయి. 

ఏదో అలికిడి అవ్వడం తో నా ఆలోచనల్లో నుండి బయటకు వచ్చాను. నిజంగా రామవ్వ తో ఉండే రోజులు అద్భుతం. ఆమెకు చదువు రాక పోయినా ఎన్నో విషయాలు మాట్లాడేది. నాకు ఆశ్చర్యం వేసేది ఆమె అంత జ్ఞానం ఎలా సంపాదించిందా అని!. నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేసేది. ఎప్పుడైనా నిరాశ పడినప్పుడు ఏవో పురాణ కథలు చెప్పి నన్ను ఉత్తేజపరిచేది. ఆమె మాటలు ద్వారానే నాకు చదువు అంటే ఇష్టం పెరిగింది. చదువు ద్వారా నా బ్రతుకునే కాక, ఈ సమాజాన్ని కూడా మార్చవచ్చని తెలుసుకున్నాను.


అప్పటి నుండి క్రమశిక్షణగా మెలగడం అలవాటు చేసుకున్నాను. అలాంటి మనిషి నాకు దొరకడం నా పూర్వ జన్మ సుకృతం. ఆ సంఘటనలు తలుచుకుంటూ, మళ్ళీ ఆశతో ఆ వ్యాసాలు తీసి చదవడం ప్రారంభించాను. అన్నీ పూర్తి కావచ్చాయి, చివరికి ఒకటి మిగిలింది. ఇదైనా నా ఆశ తీరుస్తుందేమో అని తీసి చదివాను. ఎంతో ఆనందం కలిగింది. నేను అనుకున్న విధంగా వుంది. ఆ అబ్బాయి పేరేమిటో చూడడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు గుర్తు వచ్చింది పారదర్శకత కోసం నేను నంబర్స్ వేయించి మాత్రమే నా దగ్గరకు తీసుకొచ్చాను. పేరులు, వివరాలు హెడ్ మాస్టారు దగ్గర వున్నాయి. 


రెండు రోజుల తర్వాత వివరాలు హెడ్ మాస్టారుకు ఇచ్చి విజేతలకు పిలిపించి బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. అనుకున్నట్టు గానే విజేతలను పిలిపించి బహుమతి ఇచ్చాను. వాళ్ళ వివరాలు తెలుసుకున్నాను. ప్రత్యేకంగా నా మనసుకు నచ్చిన వ్యాసం రాసిన మొదటి విజేత అయిన రాము తో మాట్లాడాను. చాలా ముచ్చట వేసింది. అతన్ని అంత బాగా తీర్చి దిద్దిన అతని అమ్మ గారిని, నాన్న గారిని చూడాలనుకున్నాను. ఆ విషయమే రాముకు చెప్పాను. "నాన్న గారు లేరు సర్, ప్రమాదంలో మరణించారు. అమ్మే నా బాగోగులు చూసుకుంటుంది. " అని చెప్పాడు రాము. 


"అవునా" అని ఒక నిట్టూర్పు తీసి, అయితే మీ అమ్మగారిని రేపు పాఠశాలకు తీసుకు రా నేను మాట్లాడుతానని చెప్పాను. తలాడించాడు రాము. మరుసటి రోజు నేను చెప్పినట్టు గానే అతని తల్లితో నాకోసం ఎదురుచూస్తూ వున్నాడు. అతని తల్లిని చూసి నాకు చాలా బాధేసింది. ఆమెకు ఒక కాలు సరిగ్గా లేదు, కర్ర సహాయం తో నిలబడి ఉంది. ఆమెను చూస్తుంటే ఆమెను ఎక్కడో చూసాను అని భావన కలుగుతుంది. 

అయ్యో ఆమె ను ఇబ్బంది పెట్టాను కదా, నేను వెళ్ళి ఆమెను కలవాల్సింది అని నాలో అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాను. చేతులు జోడిస్తూ నమస్కారం పెట్టింది.


"మీలాంటి తల్లితండ్రులు ఈ సమాజానికి అవసరం. మీకు కష్టమైన మీ బిడ్డను మంచి మార్గం లో నడిపిస్తున్నారు. " అని ఆమెతో అంటూ "రాము చెప్పు నీకు నేనేమి సహాయం చేయాలి?. " అని అడిగాను. 


"సర్, మా అమ్మకు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి సర్, నా కోసం చాలా కష్ట పడుతుంది. " అని అడిగాడు రాము.


రాము కోరిక ఎలా కాదనగలను. అవసరాల కోసం నేను కాస్త సొమ్మును పక్కన పెట్టాను. ఇప్పుడు అందులో కొంత సొమ్ము రాముకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. దాంతో వాళ్లకు గిట్టుబాటు అయ్యే వ్యాపారం పెట్టించాలనుకున్నాను. ఆమె తో మాట్లాడుతూ ఆమె వివరాలు అడిగాను. ఆమె తన గురించి చెప్పింది. ఆస్తి తగాథల్లో తన భర్త పోయాడు అని, తన కాలు పోవడానికి కారణం కూడా ఆ గొడవే అని ఆమె చెప్పింది. సొంత మరిదే బంధాలు మరిచి ఇలా క్రూరంగా ప్రవర్తించి తన బ్రతుకు ఇలా అయ్యేలా చేశాడు అని చెప్తూ బాధపడింది. 


ఆమె పేరు చామంతి అని చెప్పి, తన వివరాలు పూర్తిగా చెప్పింది. అప్పుడు ఆమె ఎవరన్నది నాకు గుర్తుకు వచ్చింది.. తాను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు చామంతి పదవ తరగతి చదువుతుండేది. చాలా తెలివి గల అమ్మాయి. ఏ పోటీలో అయినా విజేతగా ఆమె పేరే మొదటగా ఉండేది. ఆమెను చూసినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కానీ తర్వాత ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆమెను గుర్తు పట్టగలిగాను. ఆమె మళ్ళీ కనిపించినందుకు సంతోషం కలిగింది. కానీ ఈ విధంగా ఆమెను చూడటం మనస్సు తరుక్కుపోతుంది.


కానీ తన బిడ్డల పట్ల ఆమె తీసుకున్న నిర్ణయం నాలో ప్రేరణ నింపింది. ఆమె పెంపకం లో పెరిగిన రాము ఏదో ఒక రూపంగా తిరిగి సమాజానికి సహాయం చేస్తారని నమ్మకం కలిగింది. నాకు వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి సామాజిక స్పృహ కలిగించాలని నా కోరిక ఇంకా బలపడింది. నేనో సమిధనై మంచి సమాజం కోసం ప్రయత్నం చేస్తానని మళ్ళీ సంకల్పం చేసుకున్నాను. 


 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page