top of page

అతిథి



'Athidhi' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 14/04/2024

'అతిథి' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



వసుధకు.. పెళ్లిచూపులు. అసలు పెళ్లి చేసుకోవద్దనుకున్నా తల్లితండ్రి, పోరు పడలేక ఒప్పుకుంది. మరీ అందగత్తె, కాకపోయినా చూడగానే కంట్లో పడే రకమే, వసుధ. పెళ్లి మీద మటుకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో అమ్మా.. నాన్నతో పడిన కష్టాలు చూసిన తర్వాత, మగవాళ్ళు ఇంతే.. అనే అభిప్రాయంలో ఉంది.


 తర్వాత, అక్కకు పెళ్లయి బావను చూసిన తర్వాత, పెళ్లి తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతాయనే.. నమ్మకం బలపడింది వసుధలో. అందుకని ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకుంది వసుధ. మనం అనుకున్నవి జరిగితే, జీవితం ఎందుకు.

 

 అందుకని వసుధ, డిగ్రీ చదివి, బ్యాంక్ ఎగ్జామ్స్ కు రాస్తున్నది తన కాళ్ల మీద తను నిలబడాలని. వసుధ నాన్న ఫ్రెండ్ వీరయ్య.., తన కొడుకుకు చేసుకోవాలని వసుధను అడిగాడు. అతని పేరు మోహన్, బ్యాంక్ లో ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాడు. ఆస్థి కూడా ఉండటం వల్ల వసుధ నాన్న ఈ సంబంధం గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.


 వసుధ ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి వద్దంది. 


"నీకు ఉద్యోగం వచ్చేదాకా, వాళ్ళు ఆగుతారా" రంగయ్య కొప్పడినాడు. 


"ముందు నేను అతనితో మాట్లాడాలి" అంది వసుధ. 

అటు మోహన్ కూడా, వసుధను చూడాలంటే, పెళ్లిచూపులు ఏర్పాటు చేసారు.


 మోహన్, వసుధను "నేను నచ్చానా? నువ్వు నాకు నచ్చావు. నువ్వు అవునంటే...నేను లక్కీ" నవ్వుతూ అన్నాడు. 


మోహన్ అలా మాట్లాడటంతో సిగ్గుపడుతూ "నాకు కొన్ని డ్రీమ్స్ వున్నాయి. అవి నెరవేరేలా మీరు చూస్తానని చెపితే, నాకేం అభ్యంతరం లేదు" అంది.


 "ఏంటో, ఆ కోరికలు" అన్నాడు మోహన్. 


"నాకు ఉద్యోగం చేయాలని ఉంది. పెళ్లైన తర్వాత నేను చేయవచ్చా" అన్న వసుధతో తప్పకుండా అన్నాడు. 


అపుడు మీరు మాట తప్పరుగా."


 "అసలు తప్పను, మీ మాట జవ దాటను" అన్నాడు నాటక ఫక్కీలో. 


ఆ నవ్వులో శ్రుతి కలిపి "అయితే ఓకే" అంది వసుధ. 


పెళ్లయి అత్తవారింటికి వచ్చింది. అత్తగారు వాళ్ళు వసుధను బాగా చూసుకుంటున్నారు. తర్వాత, మోహన్ పనిచేసే ఊరిలో కాపురం పెట్టారు.

 

 వసుధను ఎంతో అపురూపంగా కాలు కిందపెట్టనీకుండా చూసుకుంటున్నాడు మోహన్. వసుధ కూడా మోహన్ లాంటి మంచి భర్త దొరకటం తన అదృష్టం అనుకుంది.


 ఇంతలో కడుపుతో ఉండటంతో ఎంతో హ్యాపీగా వుంది. ఇక ఉద్యోగం గురించి అడిగే ప్రశ్న కూడా తలెత్తలేదు వసుధలో. అబ్బాయి పుట్టటంతో ఇటు అత్తింటిలో అటు పుట్టింట్లో ఆనందపడ్డారు. మూడోనెల రాగానే మోహన్ భోజనానికి ఇబ్బందనీ వచ్చేసింది తనింటికి.


 వసుధకు వంటపనిలో కూడా సాయం చేసి బ్యాంక్ వెళ్లేవాడు మోహన్. బాబుకు మూడో ఏడు రాగానే, స్కూల్ లో జాయిన్ చేసారు. ఎన్నో కబుర్లు చెపుతూ ముద్దుగా ఉన్నాడు బాబు. మోహన్ సాయంతో, బ్యాంక్ ఎగ్జామ్స్ రాద్దామని అనుకుంది, కానీ మళ్ళీ కడుపుతో ఉండటంతో మోహన్ "ఈసారి రాద్దువులే" అన్నాడు. మళ్ళీ పిల్లాడిని చూసుకోవటం, ఇల్లు చక్కదిద్దు కోవటంలో పని సరిపోయింది వసుధకు.


 పాప పుట్టడంతో మళ్ళీ బిజీ అయింది. ఇక జాబ్ గురించి ఆలోచించటం మానేసింది. అలా పిల్లాడికి పదో ఏడు వచ్చింది. పాపకు ఏడో యేడు వచ్చింది. ఇపుడు పిల్లలు పెద్ద అవటంతో జాబ్ చేయాలనుకుంది. రేపు ఇంటర్వ్యు వుండటంతో ఆ హడావుడిలో వుంది.


 బాగా వర్షాలు పడటంతో, పైకి వెళ్లి బట్టలు తెద్దామని వెళ్ళి, అక్కడ నీళ్ళు ఉండటంతో చూసుకోకుండా కింద జారి పడింది. లేవలేక అక్కడే కూర్చుండి పోయింది. కేకలు పెట్టింది, ఆ కేకలకు పైకి వచ్చి మోహన్ చూస్తే, వసుధ కింద పడి వుంది.


 అయ్యో అంటూ, హాస్పిటల్ లో జాయిన్ చేసాడు మోహన్. స్పైనల్ కార్డ్ మీద బలంగా దెబ్బ తగలటంతో తను ఇక లేచి తిరిగే పని లేదని చెప్పారు డాక్టర్స్. ఇక మంచానికి పరిమితమైంది వసుధ.


 అప్పటివరకు బాగున్న జీవితం తలకిందులు అయినట్లు ఉంది. పిల్లలను రెడీ చేసి స్కూల్ కు పంపటం వీటితో చాలా సఫర్ అవుతున్నాడు మోహన్. ఇదంతా చూస్తూ పక్క మీద కుమిలిపోతూ ఉంది వసుధ.


 వసుధకు దూరపు చుట్టాల పిల్ల నీరజని ఇంటిలో పనికి పెట్టారు. వంట పని పిల్లలను స్కూల్ కు రెడీ చేసి పంపటం చేస్తున్నది. ఇది చూసి వసుధ కొంచం కుదుట పడింది.


 రోజులు గడుస్తున్నాయి, పిల్లలు నీరజకు దగ్గరయ్యారు. రోజు స్కూల్ అవ్వగానే, వసుధ రూంలోకి వచ్చే పిల్లలు, ఇపుడు నీరజ దగ్గరే గడుపుతున్నారు. పిలిచినా "అబ్బా, ఏంటమ్మా ఏమి కావాలి?" అని అడిగి ఇచ్చేసి వెంటనే వెళ్తున్నారు.


 మోహన్ రాత్రి బ్యాంక్ నుండి వచ్చేసరికి ఏ తొమ్మిదో అవుతుంది. ఇక అన్నం తినీ రూంలో పడుకుంటున్నాడు. పొద్దున వెళుతూ, రూంలోకి వచ్చి "మందులేసుకున్నావా టైము లేదు వెళ్ళాలి, రెస్ట్ తీసుకో" అంటూ వెళతాడు.


 'రెస్ట్ కాక ఇదేంటనుకునీ' తన పరిస్థితికి కన్నీళ్లు పెట్టుకుంది. టివికి పరిమితమైంది వసుధ. భోజనం పెట్టీ కాసేపు మాట్లాడి, ఇక ఇంట్లో పని చూసుకోవటానికి వెళ్ళింది నీరజ. 


 ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది వసుదకు. మోహన్ కు ఈ నీరజని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా వుంటుందనే? ఐడియా వచ్చింది.


 ఆ ఈవెనింగ్ మోహన్ తో ఆ విషయం మాట్లాడింది. 


"వద్దు వసుధా. అట్లాంటి పిచ్చి పనులు చేయకు. ఇపుడు అందరం బాగానే ఉన్నాము, నేను పెళ్లి చేసుకో”నని తన నిర్ణయం తెగేసి చెప్పాడు.


 నీరజ తనకు వూళ్ళో పని వుంది వెళ్తానని అడిగింది. అపుడే వసుధ నీరజను "నువ్వు మా ఆయన్ని పెళ్లి చేసుకుంటావా" అని అడిగింది.


 ఆ మాటకు ఒక్కసారిగా ఉలిక్కిపడింది, నీరజ. 


"అక్కా నా పరిస్థితి నీకు తెల్సుగా" అంది.


 "అంతా తెల్సు, ఏమైందీ, నీకు ఇది రెండో పెళ్లి, మీ ఆయన నిన్ను వదిలేసాడు, అంతేగా" అంది వసుధ.


 "వూళ్ళో మా అమ్మ వాళ్ల దగ్గర మా అబ్బాయి పెరుగుతున్నాడు. వాడిని కూడా నేను చూసుకోవాలి" అంది నీరజ. 

 

 "అదంతా నాకు వదిలి పెట్టు, మీ ఊరెళ్ళి మీ అమ్మా వాళ్లతో మాట్లాడిరా" అని పంపింది. వసుధ వాళ్ల అమ్మా వాళ్లకు చెపితే వద్దని తిట్టారు. అయినా వసుధ ఊరుకోకుండా, మోహన్ ను, నీరజని ఒప్పించింది.


 అందరూ నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అని చెప్పినా.. వినలేదు. నా భర్తకు, పిల్లలకు న్యాయం చేయలేనప్పుడు, నేనెందుకు? అని అందరికీ విడమర్చి చెప్పి పెళ్లి జరిగేదాకా నిద్ర పోలేదు వసుధ.


 గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చారు, నీరజ, మోహన్ లు. ఇపుడు తృప్తిగా 'నేను ఏమైనా పర్లేదు' అనుకుంది వసుధ. వసుధకు, దణ్ణం పెట్టీ "నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావక్క.. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను"అంది నీరజ.


 "మా ఆయన్ను, పిల్లలను, నీ చేతిలో పెడుతున్నా వాళ్ళను చూసుకుంటే, నా ఋణం తీర్చుకున్నట్లే.." అంది వసుధ.


 నీరజ తన పిల్లాడిని కూడా, తన దగ్గరికి తెచ్చుకుని స్కూల్ లో వేసింది. ఇపుడు పిల్లలు, మోహన్, వసుధ గదిలోకి రావటం లేదు.


 నీరజలో కూడా మార్పు వచ్చింది, ఏదో భోజనం ఇచ్చెప్పుడు, ఒక రెండుసార్లు వచ్చి వెళ్తుంది. ఇదివరకటి లాగా, వసుధ రూంలోకి వచ్చి కూర్చోవటం లేదు.


 వసుధకు, పిచ్చెక్కుతుందీ ఎంతసేపని, టీవీ చూస్తుంది. ఫోన్లో కాసేపు, అమ్మ, అక్కతో మాట్లాడుతుంది. మాటల మధ్యలో వసుధ అమ్మ "మనింటి పక్కనే వృద్ధాశ్రమం కట్టారే మంచంలో వున్న వాళ్ళనీ ప్రత్యేకంగా చూస్తారు" అంది.


 ఒక రోజు మోహన్, నీరజ పిల్లలను తీసుకుని బయటకు వెళ్లారు, సాయంత్రం వస్తామని చెప్పి వెళ్ళారు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఇంటికి తాళం వేసి ఉంది. పక్కన కిటికీలో చిన్న కాగితం పెట్టీ వుంటే తీసి చూసాడు మోహన్.


 నేను మా వూర్లో వున్న ఆశ్రమంలో చేరటానికి వెళ్తున్నా, నా ఇంటిలో నేనే.. అతిథిగా ఉండటం నచ్చ లేదు. ఇక ఎప్పటికీ రాను కాబట్టి వెళ్తున్నా. పిల్లలు, మీరు జాగ్రత్తా ఎపుడైనా పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే, బావుంటుంది. ఎంతైనా వాళ్లకు కన్నతల్లిని కదా.. తాళం, షూలో ఉంది.


 మీకు ఏమి కాలేని 

 వసుధ


 "ఏంటి" అడిగిన నీరజకి, ఆ కాగితం ఇచ్చి కన్నీరు తుడుచుకున్నాడు మోహన్. 


అపుడే పక్కింట్లో టీవీలో నుండి మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా 

నీ సహనానికి...సరిహద్దులు కలవా... అన్న పాట వినబడుతూ ఉంది.

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


 


62 views0 comments
bottom of page