top of page

ఆత్మ.. పరమాత్మ


'Athma Paramathma' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'ఆత్మ.. పరమాత్మ' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


చెప్పులు కుట్టి బ్రతికే పేదవాడు చెప్పినా.. సత్యము సత్యమే.. అడ్డదారుల ధనార్జనా కాంక్ష ఒక నాడు.. మనిషిని నిలువునా నట్టేట ముంచుతుంది. తమ ఇండియన్ బ్యాంకు ప్రక్కన వున్న వేపచెట్టు క్రింద చెప్పులను బాగుచేసి.. బూట్లకు పాలిష్ చేసే చంచయ్యను సమీపించారు ప్రత్యగాత్మ.. పరమాత్మ. ఇనప దిమ్మె మీద కాలుంచాడు ఆత్మ. అతని ప్రక్కనే నిలబడ్డాడు పరమాత్మ. వారిరువురూ.. చాలా కాలంగా చంచయ్య దగ్గర బూట్ పాలిష్ చేయించుకొంటున్నారు.. ఆ కారణంగా వారు చంచయ్యకు బాగా పరిచయం. ఆత్మ ముఖంలోకి చూచి అతని బూట్లను తుడిచి పాలిష్ రాచి బ్రష్ తో మిలమిలా మెరిసేలా చేసాడు. ఆత్మా బూట్ల పని అయిపోగానే.. పరమాత్మ ఆత్మా స్థానంలోకి.. ఆత్మ పరమాత్మ స్థానంలోకి మారారు. “రేయ్!.. పరం.. నిన్నటి మన సక్సెస్ గ్రేట్ కదూ!.. ” నవ్వుతూ అన్నాడు ఆత్మ.. “నా మాటను నమ్మినోడు ఇంతవరకు చెడిపోయింది లేదు. బెట్టింగ్ కాలుక్యులేషన్ లో నన్ను బీట్ చేయాలంటే.. మరొకడు పుట్టి రావాలి.. ” అని సగర్వంగా నవ్వాడు పరమాత్మ. ఆ ఇరువురు మిత్రులు, ఒక ఊరివారు.. కలసి చదువుకొన్నారు. దైవకృపతో.. వారు ఒకే బ్యాంకు లో పని చేస్తున్నారు. ఇరువురూ అవివాహితులు. ఒకే రూమ్ లో వుంటున్నారు. అక్రమ మార్గాల్లో ఒంటికి చెమట పట్ట కుండా రూపాయికి పది రూపాయిలు సంపాదించాలి. లక్షలు సంపాదించాలి. సొంత బిజినెస్ ప్రారంభించాలి. ఖరీదైన కార్లు, బంగళాలు కొనాలి. సమాజంలో తాము సెలబ్రిటీస్ కావాలి.. అన్నవి వారు కనే పగటి కలలు. అత్యాశ.. మనుష్యులలోని వివేకాన్ని హరించి.. అడ్డదారుల్లో ఆర్జనను చేసేటందుకు సహకరిస్తుంది. అలాంటి స్వార్ధచింతన కలవారికి ఎదుటివారు ఎవరైనా మంచి మాటలు చెబితే.. వారికి అర్ధం కావు. ఈ ఇరు వురు మిత్రులూ.. ఆ కోవకు చెందినవారే. వారిరువురి మాటలు విన్న చంచయ్య వారితో బాగా పరిచయం ఉన్నందున చిరునవ్వుతో.. “ఏం బాబూ!.. నిన్న మీకు లాటరరీ వచ్చిందా!.. ’ అమాయకంగా అడిగాడు. “చంచాన్న!.. లాటరీ కాదు.. క్రికెట్ బెట్టింగ్. ఇండియా గెలుస్తుందని రెండు లక్షలు కట్టాము. పది లక్షలు గెలుచుకొ న్నాము.. ” నవ్వుతూ చెప్పాడు ఆత్మ. వారి మాటలకు చంచన్న ఆశ్చర్యపోయాడు. ఇరువురి ముఖాలనూ మార్చి మార్చి చూచాడు. వారి కళ్ళల్లో విజయగర్వం ఆ అరవై ఏళ్ళ చంచన్నకు గోచరించింది. వారు నడిచేదారి సరైనది కాదని అతనికి తోచింది. జీవన గమనానికి సంబంధించిన ఒక మంచి మాట చెప్పాలనుకొన్నాడు. “బాబులూ!.. నాకు మీకు ఓ మాట చెప్పాలని వుంది.. చెప్పనా.. ” అడిగాడు చంచయ్య. “చెప్పు.. ” అన్నాడు పరం. “జూదం ఆడటం మంచిది కాదయ్యా!.. మహా భారతంలో ధర్మరాజు జూదం ఆడి ఏమైపోయినాడో మీకు తెలవదా!.. ” అనునయంగా ఆ ఆలోచన తగదని చెప్పాడు చంచయ్య. “ఆ జూదంలో.. దుర్యోధనుడు గెలిచాడు.. అది నీకు తెలుసా!.. ” వ్యంగ్యంగా అడిగాడు ఆత్మ. “ఆ.. ఆ ఇసయం కూడా తెలుసు బాబూ!.. మోసంతో గెలిచాడు.. అదీ ఒక గెలుపేనా!.. ” ఆవేశంగా చెప్పాడు చంచన్న. “చంచన్నా!.. మీరోజులకూ మారోజులకూ ఎంతో తేడా!.. నేటి ప్రపంచం అంతా నడిచేది డబ్బు.. డబ్బు తోనే.. నిజం చెప్పాలంటే పైసాయే.. పరమాత్మా.. మనముందున్న అవకాశాలతో డబ్బును సంపాదించాలి. గొప్పవాళ్ళం కావాలి.. ” వికటంగా నవ్వుతూ చెప్పాడు పరం. వారు ఇక తన మాటలను గౌరవించ బోరని చంచన్నకు వారి మాటల ద్వారాఅర్ధమయింది.. విరక్తి గా నవ్వుకొంటూ పరమాత్మ బూట్ పాలిష్ ను పూర్తిచేసాడు. ఆత్మ.. వందరూపాయల నోటును జేబునుంచి తీసి చంచన్న ముందు పడేసాడు. నోటును చేతికి తీసుకొని.. “చిల్లర లేదు బాబు.. ఇరవై రూపాయ లుంటే ఇవ్వండి. ” చేతిని ఆత్మ వైపుకు సాచాడు. “మా దగ్గరా చిల్లర లేదు. ఉంచుకో.. ” అన్నాడు ఆత్మ. “పండగ చేసుకో!.. ” వికటంగా నవ్వుతూ చెప్పాడు పరం. ఆ ఇరువురూ.. బ్యాంకు వైపుకు నడిచారు. చేతిలోని నోటును.. వెళుతున్న ఇరువురు మిత్రులను వింతగా చూచాడు చంచయ్య. &&&&&&& జీవిత విధానంలో.. మనుషుల మనస్తత్వాలు రెండు విధాలు. మొదటిది ఇలాగే బ్రతకాలనేది.. రెండవది.. ఎలాగైనా బ్రతకాలనేది. మొదటిది నిస్వార్ధపూరితం.. రెండవది స్వార్ధ పూరితం. వారిని మెచ్చేవారు కొందరే. వీరిని మెచ్చేవారు ఎందరో!.. &&&&& ఆ రాత్రి ఇరువురు మిత్రులు క్లబ్ లో చుక్కకు యిరవై రూపాయలు చొప్పున ‘రమ్మీ’ చీట్ల పేక ఆటను రాత్రి ఎనిమిదిన్నర నుంచి.. పదకొండున్నర వరకూ సాగించారు. ఆట ముగింపు సమయానికి రెండు లక్షలు పోగొట్టున్నారు. ఆ ఆటగాళ్ళలో జి. గోవిందు ఒకడు. ఆ రోజు చాలా మొత్తం అతనే గెలుచుకొన్నాడు. అతని పూర్తి పేరు.. గుర్రాల గోవిందు. అతను రేస్ జాకీ.. “రేపు నా గుర్రం విజయడంకాను మ్రోగిస్తూ పరుగుతీసి గెలవబోతూవుంది. దాని పేరు కల్యాణి. ఆడగుర్రం రేస్ కోర్సుకు వచ్చి.. కల్యాణి మీద పందెం కాస్తే.. ఈరోజు మీరు పోగొట్టుకున్నదానికి పదింతలు సంపాదించగలరు. మీ లక్ ను పరీక్షించుకోండి. ఆలసించిన ఆశాభంగం.. మంచి తరుణం.. చేయి జార విడువకండి.. ” నవ్వుతూ తన ప్రతాపాన్ని.. కన్యగా వున్న కల్యాణి ప్రతిభనూ ప్రకటించాడు. గుఱ్ఱాల గోవిందు మాటలు ఆత్మకు.. పరమాత్మకు ఆపై.. పరంధాముని పలుకుల్లా విని పించాయి. పోగొట్టుకొన్న డబ్బు విషయాన్ని మరచి.. రేపు రేస్ లో పాల్గొని.. కల్యాణి మీద పందెం కాయాలని నిర్ణయించుకొన్నారు ఆ ఇరువురు మిత్రులు. ఇరువురు మిత్రులు.. నీట్ గా డ్రస్స్ చేసుకొని టైలు కట్టుకొని.. తమ దగ్గర వున్నఎనిమిది లక్షల్లో ఏడు లక్షలు హ్యాండ్ బాగ్ లో పెట్టుకొని రేస్ కోర్సు ఆవరణలో ప్రవేశించారు. వారికి ఒక వ్యక్తి తటస్థ పడ్డాడు. వినయంగా నవ్వుతూ విష్ చేసాడు. “సార్!.. విక్టోరియా ఆరవ నెంబర్ హార్సు. ఈ రోజు గెలుపు దానిదే. నామాట నమ్మండి. ఇప్పటికి విక్టోరియా పదిహేను రేసులు గెలిచివుంది.. ” “కళ్యాణీ!.. ” ఆత్రంగా అడిగాడు ఆత్మ, “అది ఇంతవరకూ ఒక్క రేస్ కూడా గెలవలేదు. , విక్టోరియా చరిత్ర.. అంటే.. తల్లి ఎవరు?.. తండ్రి ఎవరు.. ఏ ఏ రేసుల్లో పాల్గొంది ?.. ఎన్ని గెలిచింది?.. అన్ని వివరాలు ఇందులో వున్నాయి. ఈ పుస్తకాన్ని చూడండి సార్!” తన చేతిలోని పుస్తకాన్ని చూపించాడు. పరమాత్మ అతని చేతిలో వున్న పుస్తకాన్ని తన చేతికి తీసుకొని అతనికి వంద రూపాయలు యిచ్చాడు. అతనను.. లోనికి వచ్చిన మరికొందరి వ్యక్తులని చూచి.. వారివైపుకు వెళ్ళాడు. ఇరువురు మిత్రులు ఆ పుస్తకంలోని పేజీలను తిరగేసారు. ఆ వ్యక్తి చెప్పినట్లుగానే ప్రతి గుర్రం యొక్క తల్లి తండ్రుల పేర్లు.. పాల్గొన్న, గెలిచిన రేస్ వివరాలు వున్నాయి. అతని మాటల మీద వారికి విశ్వాసం కలిగింది. కల్యాణి మీద మూడున్నర లక్ష.. విక్టోరియా మీద మూడున్నర లక్ష కట్టాలని నిర్ణయించుకొన్నారు. కౌంటర్లో అలాగే చేసి.. టికెట్స్ కొని.. రేస్ కోర్స్ గ్యాలరీలో ప్రవేశించారు. ఒకటి పోయినా మరొకటి గెలుస్తుందనే నమ్మకంతో. ఆశకు విచక్షణ వుండదు. బైనాక్యులర్ కొన్నారు. పరమాత్మ మెడలో వేసికొన్నాడు. విజిల్ వేయబడింది. పన్నెండు గుర్రాలు జాకీలతో రేస్ కోర్స్ లో పరుగును ప్రారంభించాయి. క్షణ క్షణానికి.. గుర్రాల వేగం హెచ్చి దూరం పెరిగింది. గ్ల్యాలరీలో వున్నవారి హృదయ కంపన వేగం కూడా పెరిగింది. కొందరు గుర్రాల పరుగును బైనాక్యులర్స్ లో చూస్తున్నారు. కొంతసేపు పరమాత్మ చూచి.. ఆత్మకు అందించాడు బైనాక్యులర్. కోడిగ్రుడ్డు ఆకారంలో వున్న ఆ రేస్ కోర్స్ ఉత్తరం వైపు నుంచి ప్రారంభమైన గుర్రాల పరుగు తూర్పు వైపు దాటి దక్షిణపు వైపుకు సాగింది. జాకీలు తమ ప్రతిభను చూపుతూ గుర్రాల వేగాన్ని పెంచు తున్నారు. ఆ రేస్.. బెస్ట్ ఆఫ్ త్రీ.. దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం వున్న ఆ కోర్టులో.. మూడు సార్లు గుర్రాలు క్రమంగా జాకీల్ ఆదేశానుసారంగా పరుగెత్తి ఆటను ముగించాలి. ముందుగా బయలుదేరిన ప్రాంతానికి చేరి గెలవాలి. రెండు రౌండ్లలో కల్యాణి.. విక్టోరియాలు అన్నింటికన్నా ముందు పరుగులు తీసాయి. మిత్రు లిరువురు పరమానందంతో గుర్రాల పేర్లను అరుస్తూ గెలుపు వారిదేనని సంబర పడ్డారు. చేతులు కలిపారు. మూడవ రౌండులో దక్షిణ వైపుకు వచ్చేసరికి కల్యాణి, విక్టోరియాలు.. వెనుక పడ్డాయి. వేరే మూడు గుర్రాలు ముందుకు రామభాణంలా దూసుకు పోయాయి. కొన్ని అడుగుల దూరం వ్యత్యాసంతో ఆ మూడు గుర్రాలు గమ్యాన్ని చేరాయి. ఆత్మ పరమాత్మలకు గుండెలు ఆగిపోయి నట్లని పించింది. బిక్కముఖాలతో ఒకరినొకరు చూచు కొన్నారు. “ఆ.. గోవిందు గాడు కల్యాణిని సరిగా నడపలేదు. ఫ్రాడ్ ఫెలో.. ” ఆవేశంగా అన్నాడు పరమాత్మ. “ఆ.. బ్రోకర్ ఫెలో విక్టోరియ గెలుస్తుందని అన్నాడే!.. వాడూ పరమ ఫ్రాడ్.. ” విచారంగా చెప్పాడు ఆత్మ. ఇరువురికీ ఏడు లక్షలు.. పోయినందుకు ఎంతో విచారం.. కళ్ళల్లో నీళ్ళు. గెలిచినవారు.. ఆనందంగా గ్యాలరి దిగి కౌంటర్ వైపుకు వెళ్ళారు. ఓడినవారు.. ఆత్మా పరమాత్మలు మెల్లగా గ్యాలరీ దిగి రేస్ కోర్సు బయటకు విచారవదనాలతో వచ్చారు. ఇరువురి మనస్సులో.. ఒకే రకమైన బాధ. ఆవేదనతో.. ఆటో ఎక్కి గదికి చేరారు. పరమాత్మ విస్కీ బాటిల్.. గ్లాసులు.. ఐస్ వాటర్ టీపాయి పై ఉంచాడు. లుంగీలు చుట్టుకొని ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని రెండు రౌండ్లు మందును వేగంగా సేవించారు. “ఒరేయ్!.. ఆత్మా.. బాధ పడుతున్నావా.. ” అడిగాడు పరమాత్మ. “నో.. లక్ష్మీదేవి చంచలమయింది. నిన్న మన దగ్గర వుంది. ఈరోజు మరొకరి దగ్గరికి చేరింది. రేపు మరలా మనదగ్గరికి రావచ్చుగా!.. ” పేలవంగా నవ్వాడు ఆత్మా. “వెరీగుడ్ రా!.. నీ నమ్మకానికి నా జోహార్లు.. మన దగ్గర ఇప్పుడు ఓ లక్ష వుంది కదూ! ” “వుంది.. రేపు ఆస్ట్రేలియా.. ఇండియా క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచ్.. ” నవ్వుతూ చెప్పాడు ఆత్మ. “రేపు మనకు జీతాలు కూడా వస్తాయి. ” “అంటే.. మొత్తం మన చేతిలో రేపు రెండు లక్షలు ఉంటాయన్న మాట. ” “ఎస్.. యాభై వేలు దగ్గర వుంచుకొని.. ఒకటిన్నర లక్షతో బెట్టింగ్ ఆడుదాం.. కసిగా చెప్పాడు పరమాత్మ. “ఆ మ్యాచ్ లో గెలవబోయేది ఎవరంటావ్ పరం?.. ” “ఇంకెవరు?.. ఇండియానే.. ఈసారి ఆస్ట్రేలియా తో వరల్డ్ కప్ విజేతలం మనమే!.. ” గలగలా నవ్వుతూ చెప్పాడు పరమాత్మ. “ఎస్.. గెలుపు మందే.. నో డౌట్.. ” ఆనందంగా నవ్వుతూ పరమాత్మతో వంతపాడాడు ఆత్మ. ప్రతి వ్యక్తి జీవితంలో.. స్నేహానికి ఎంతో ప్రాధా న్యత వుంది. ఆ హితుడు మంచివాడైతే.. అతని సహ చర్యంతో.. ఇతనిలోనూ మార్పులు.. మంచీ. జరుగు తుంది. ఆ హితుడు పరమాత్మలాంటి వాడయితే !.. ఆత్మ పరిస్థితి ఏమిటి?.. &&&&& సెమీఫైనల్స్ లో ఇండియా ఆస్ట్రేలియాతో ఓడి పోయింది. ఆత్మా, పరమాత్మ ల ఒకటిన్నర లక్ష “నదీనం సాగరే గతిహి’ అయింది. ఇరువురి పరిస్థితీ.. వారు ఊహించని రీతిలో.. హీనంగా మారిపోయింది. ఉదయాన్నే.. ఇంటి ఓనర్ వచ్చి అద్దె డబ్బులు అడిగాడు. వారివద్ద ఖర్చులకు పోను వున్న నలభై ఐదు వేలల్లో పదిహేనువేలు ఇంటిఅద్దె చెల్లించారు. చేతిలో మిగిలింది ముప్పై వేలు. ఆఫీస్ కు బయలు దేరేముందు పరమాత్మ రెండు కాగిత ముక్కలమీద వారి ఇరువురి పేర్లను వ్రాసి చుట్టి.. టీపాయి పై వేసి, పరమాత్మ.. ఆత్మను ఒక చీటీ తియ్య మన్నాడు. “ఏమిట్రా ఇదీ!.. ” ఆశ్చర్యంతో అడిగాడు ఆత్మ. “ఈ రెండు చీట్లలో మన ఇరువురి పేర్లు వున్నాయి. రేపు ఆదివారం. బ్యాంకుకి లీవ్. ఈ సాయంత్రం బ్యాంకు మూసే సమయంలో ఓ లక్ష రూపాయలు తీసుకొని వచ్చి.. ఈ రాత్రి ఇంటర్నేషనల్ రమ్మీని క్లబ్ లో ఆడుదాం. మనం బెట్టింగ్ లో పోగొట్టుకొన్న డబ్బును గెలుచుకొందాం. మనలో ఎవరి పేరు వస్తే.. వారే ఆపని చేయాలి. నా పేరు వస్తే నేను.. నీ పేరు వస్తే నీవు.. ఆ లక్ష్మీదేవిని తలచుకొని ఒక చీటీని తియ్యి ఆత్మా!.. ” అన్నాడు పరమాత్మ. ఆత్మా.. ఆశ్చర్యంతో పరమాత్మ ముఖంలోకి చూచాడు. “ఏమిట్రా.. ఆ వెర్రి చూపు.. ధైర్యే సాహసే లక్ష్మీ!.. ఒక చీటీని తీసుకొని విప్పి అందులో ఎవరిపేరు వుందో చూడు.. ” చిరునవ్వుతో చెప్పాడు పరమాత్మ. “ఒరేయ్!.. పరం.. అది చాలా రిస్క్ రా!.. ” ఆందోళనగా అన్నాడు ఆత్మ. “రిస్క్ లేనిదే రంజు లేదు.. ధైర్యంగా ఓ చీటీని తియ్యి. ఈ పరమాత్మ నీకు అండగా వుండగా.. నీ కెందుకురా భయం?.. ” ఆత్మ భుజంపై తన అభయహస్తంతో తట్టాడు పరమాత్మ. బెదురు చూపులతో ఆత్మా.. ఒక చీటీని తీసి పరమాత్మ చేతికి అందించాడు. పరమాత్మ.. చీటీని విప్పాడు. ఆత్మా చేతికి అందించాడు. ఆ చీటీలో వున్నా తన పేరును చూచి.. ఆత్మా అదిరిపోయాడు.. బెదిరి పోయాడు. “ఆత్మా.. భయపడకు.. మనమిద్దరం క్యాష్ కౌంటర్ లో పనిచేసేవాళ్ళ మేగా!.. నీవు తీసినా, నేను తీసినట్లే.. నేను తీసినా నీవు తీసినట్లే.. పద పద.. ఆఫీస్ కు టైం అవుతోంది.. ” అన్నాడు పరమాత్మ. ఇరువురు ఆటోలో బయలుదేరి బ్యాంకుకు చేరారు. ఆరు గంటలకు బ్యాంకు మూసే సమయం. కొంతమంది వెళ్ళిపోయారు. పరమాత్మ ఆదేశానుసారం లక్షరూపాయలను బాక్స్ నుంచి తీసి జేబులో పెట్టుకొన్నాడు ఆత్మ. క్యాష్ బాక్స్ కు తాళం వేసి.. వాటిని ఉంచవలసిన స్థానం లో వుంచి.. బ్యాంకు నుంచి మెల్లగా బయటికి నడిచాడు. ముందుగా బయటికి వచ్చిన పరమాత్మతో కలసి ఆటోలో రూమ్ కు బయలు దేరాడు ఆత్మ. ఆ బ్రాంచ్ మేనేజర్ పాండురంగారావు ఆత్మకు దూరపు బంధువు. అతనికి ఆత్మా అంటే ఎంతో నమ్మకం.. అభిమానం. ఆ రాత్రి మూడు ముక్కల ఆటలో లక్షాపాతిక వేలు ఆత్మా.. పరమాత్మల జేబులనుండి.. వేరేవారి జేబులకు చేరాయి. జీవచ్చవాల్లా.. రాత్రి పన్నెండు గంటలకు రూముకు చేరారు. ఆదివారం అంతా.. భయం.. భయం.. బ్రతుకు భయం.. అని వాపోతూ ఇరువురూ మాటా పలుకు తిండీ నీళ్ళు లేకుండా కన్నీరు కార్చారు. అమ్మకు బాగాలేదని వూరినుంచి వచ్చిన ఫోన్ కాల్ తో పరమాత్మ బాస్ కు ఫోన్ చేసి చెప్పి.. వూరికి జంప్ చేసాడు. ఆ రెండు చీట్లలో పరమాత్మ.. ఆత్మా పేరునే వ్రాసాడనే విషయం.. ఆత్మకు తెలియదు. ఆత్మ.. ఒంటరివాడైపోయాడు. ఏడ్చి ఏడ్చి కడకు.. చావాలనే నిర్ణయానికి వచ్చాడు. కాలింగ్ బెల్ మ్రోగింది. భయపడుతూ వెళ్లి తలుపు తెరిచాడు. పాండురంగా రావు ఎదురుగా నిలబడివున్నాడు. ఆత్మా తలపై పిడుగు పడినట్లు అయింది. “నీవు చేసిన పనిని నేను చూచాను. నీ తండ్రి.. నా బంధువు. ఇలాంటి బుద్ధి తక్కువ పనిని మరోసారి చేస్తే నీ జీవితం నాశనం అవుతుంది. జాగ్రత్త.. ” ఒక కవర్ ను ఆత్మకు అందించి వెళ్ళిపోయాడు. ఆత్మ.. కవరు తెరచి చూస్తే.. అందులో లక్ష రూపాయలు వున్నాయి. &&&&&&

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
42 views0 comments

Comments


bottom of page