top of page

లక్ష్య సాధనలో


'Lakshya Sadhanalo' - New Telugu Story

Written By Singaraju Sreenivasa Rao

'లక్ష్య సాధనలో' తెలుగు కథ

రచన : సింగరాజు శ్రీనివాస రావువినమ్రకు మెదడు మొద్దుబారిపోతున్నది. ఎంత ఆలోచించినా గుణ మనసేమిటో అంతుపట్టడం లేదు. తనంటే ఇష్టమో, లేదో ఎన్నిరకాలుగా అడిగినా, మాట దాటవేస్తున్నాడే గానీ, తన మనసులో మాట చెప్పడు. కారణం ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు'.... ఇలా వినమ్ర, గుణ విషయంలో తర్జన భర్జన పడడం ఇది తొలిసారి కాదు. గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉన్నది.


గుణ, వినమ్ర ఇద్దరూ మెడికల్ కాలేజి విద్యార్థులే. గుణ మెరిట్ లో సీటు సాధిస్తే, వినమ్ర మేనేజిమెంటు కోటాలో సీటు పొందింది. గుణ తండ్రిది ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగం. కానీ సంప్రదాయమైన కుటుంబం. తన కష్టాన్ని తప్ప, ఇక దేనినీ నమ్ముకోని వ్యక్తి అతను. తండ్రి వాసుదేవరావు మనస్తత్వమే గుణది కూడ. ఉన్నంతలోనే సర్దుకుపోవాలనే మధ్యతరగతి మనస్తత్వం. వినమ్ర తండ్రి పెద్ద వ్యాపారవేత్త. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాన్ని శాసించగలిగేటంత పలుకుబడివున్న వ్యాపారవేత్త. అటువంటి ప్రభాకరానికి ఒక్కగానొక్క కూతురు వినమ్ర. తెలివితేటలలో ఒకరికొకరు తీసిపోరు వినమ్ర, గుణలు. కాకపోతే వినమ్ర కంటే గుణ ఒక వీసమెత్తు మేధావి. ఆ స్వల్ప తేడా చాలు కదా వేల ర్యాంకులు వెనుకబడడానికి. అదే జరిగింది వినమ్ర విషయంలో. ఆమెకు వేరే కాలేజిలో ఉచిత సీటు వచ్చినా, మంచి కాలేజి అని డొనేషను కట్టి మరీ ఈ కాలేజిలో చేర్పించాడు ప్రభాకరం.


మొదటి రెండు సంవత్సరాలు ఎటువంటి ఆకర్షణలకు లోనుకాకుండా చదువే ధ్యాసగా సాగింది వినమ్ర చదువు. తరువాత ఎందుకో ఆమెకు తెలియకుండానే గుణ మీద ఒక రకమైన అభిమానాన్ని పెంచుకుంది. ఇద్దరి మధ్య చదువుకు సంబంధించిన చర్చలు జరిగేవి. ఒకరి సందేహాలు మరొకరు తీర్చుకోవడం, క్రమేపీ కలసి పోటీలలో పాల్గొనడం జరిగేది. ఆ అభిమానమే ప్రేమగా మారింది వినమ్రలో. ఎంత చనువుగా వున్నా, హద్దులు దాటని గుణ వ్యక్తిత్వం ఆమెను అతని మీద ప్రేమను పెంచుకునేలా చేసింది.


తనే ఎపుడైనా ఒక అడుగు ముందుకు వేసినా, వెంటనే ' సారీ వినమ్రా. అలాంటి మాటలు మాట్లాడుకునే వయసుకాదు. ముందు మన లక్ష్యం డాక్టరు పట్టా పుచ్చుకోవడం' అని లేచి వెళ్ళిపోయేవాడే తప్ప, కొంచెంకూడ అవకాశమిచ్చేవాడు కాదు.


'అసలీమనిషేమిటిలా' అని అనుకోని రోజు లేదు వినమ్రకు. అతని మీద ధ్యాస పెరిగేకొద్దీ చదువు మీద శ్రద్ద తగ్గిపోసాగింది వినమ్రకు. ఫలితంగా పదిర్యాంకులు వెనక్కు పడిపోయింది క్లాసులో. అయినా బాధగా లేదామెకు. ఆమె తపనల్లా గుణకు తనమీద వున్న అభిప్రాయం తెలుసుకోవాలనే ఆరాటం తప్ప.


గుణ ఆలోచనలు మరొకరకంగా ఉన్నాయి. 'ఎప్పుడూ తనకు పోటాపోటీగా వుండే వినమ్ర ఈసారి పది ర్యాంకులు వెనుకబడిపోవడం అతనికి నచ్చలేదు. ఎందుకిలా జరిగింది. వినమ్రకు చదువు మీద ధ్యాస పడిపోవడానికి కారణం ఏమిటి? ఏమైనా సందేహముంటే తనను అడగవచ్చు కదా. కొంపదీసి ఆమె మనసును, వయసు అదుపు తప్పించిందా? వీల్లేదు. అలా జరుగకూడదు. ఒక మేధావి తాత్కాలికమైన వ్యామోహంలో పడి విజ్ఞానాన్ని పణంగా పెట్టకూడదు. ఎందరి జీవితాలకో వెలుగునివ్వగలిగే అవకాశమున్న వృత్తి ఇది. నేలమీద నడిచే దైవమే వైద్యుడంటే. అలాంటి వ్యక్తి అర్థంలేని బంధాలలో ఇరుక్కోకూడదు. వినమ్రతో మాట్లాడాలి. ఆమె ఎందుకిలా వెనుకబడిందో కనుక్కోవాలి. వీలైనంత వరకు ఆమె మరల గతంలా చదువు మీద శ్రద్ధ పెట్టేలా చూడాలి'.

ఆలోచనలను పక్కనబెట్టి వినమ్రకు ఫోను చేసి ఒకసారి నీతో మాట్లాడాలని అడిగాడు. అందుకోసమే ఎదురుచూస్తున్న వినమ్ర వెంటనే సరేనంది.


********


" ఎందుకు కలవాలన్నావు " లాన్ లో గుణ ఎదురుగా కూర్చుంటూ అడిగింది వినమ్ర.


"నీతో మాట్లాడాలనిపించింది. ఈ మధ్య మనం ఫోన్లలో తప్ప, విడిగా కలవడం తగ్గిపోయింది కదా"


" అవును. పరీక్షలొకవైపు, కోవిడ్ మరోవైపు మనమధ్య దూరాన్ని పెంచాయనే చెప్పాలి "


" నిజమే. అదంతా తాత్కాలికమేగా. అదీ ఒకందుకు మేలే. మనం చదువు మీద ధ్యాసపెట్టే అవకాశం వచ్చింది. అందుకేనేమో ఎక్కడో వుండే వినయ్ ఏకంగా మూడవ ర్యాంకు తెచ్చుకున్నాడు

"

చిన్న నవ్వు పారేసింది వినమ్ర. మరల గుణ అడిగాడు.


" మరి నువ్వేమిటి ఉన్నపళంగా పదవ ర్యాంకుకు పడిపోయావు. ఇంట్లో ఏమైనా సమస్యా"

మౌనంగా ఉండిపోయింది వినమ్ర. తనకు తెలుసు అసలు సమస్య గుణేనని. కానీ చెప్పే ధైర్యం చాలలేదు.


" వినమ్రా. తెలివిగలదానివి. నువ్విలా వెనుకబడితే ఎలా? ఒక్కసారి పరుగులో వెనుకబడితే, మరొకరు నీ స్థానాన్ని ఆక్రమిస్తారు. తిరిగి మనస్థానం మనం దక్కించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఈ విషయం నీకు తెలియనిది కాదు. మరెందుకు వెనకడుగు వేశావు" అనునయంగా అడిగాడు.


" మనసు నిలపలేకపోతున్నాను గుణ"


" అదే ఎందుకని"


" ఏమో "


" కొంపదీసి అందరికీ అంటుకున్నట్లే ప్రేమజాడ్యం నీకూ అంటుకోలేదు కదా "


ఉలిక్కిపడింది. ఏమిటిది ప్రేమంటే పవిత్రమంటారంతా. ఇతనేమిటి జాడ్యం అంటున్నాడు.


" అదేమిటి అలా అంటావు. ప్రేమ నీకు జాడ్యంలా కనిపిస్తున్నదా" కోపమొచ్చింది వినమ్రకు.


" ఖచ్చితంగా. చదువుకునే వయసులో ప్రేమలో పడటం నా దృష్టిలో జాడ్యమే. దానివలన ఎంత కెరీర్ నాశనమవుతుందో తెలుసా నీకు. ఏం సాధించగలవు దానితోటి. పదిమంది ప్రాణాలు నిలుపగలవా. పోనీ కనీసం డాక్టరు పట్టాను కష్టపడకుండా సాధించగలవా? చదువు సన్నగిల్లిపోవడం, లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం, కుటుంబాల మధ్య విబేధాలు, కక్ష్యలు, కార్పణ్యాలు. ఇవన్నీ అవసరమా? మనం కాలేజీలో అడుగుపెట్టిన ధ్యేయమేమిటి? మంచి మార్కులతో డాక్టరు పట్టా పుచ్చుకోవడం. మన భవిష్యత్తు మీద నమ్మకాలు పెట్టుకున్న తల్లిదండ్రులకు, ప్రయోజకులమయ్యామని నిరూపించడం. అంతవరకే పరిమితం కావాలి మన ఆలోచనలు" తన మనసు బయటపెట్టాడు గుణ.


ఊహించని అతని మాటలకు తలతిరిగింది వినమ్రకు. ఇతనికి ప్రేమంటే ఇలాంటి అభిప్రాయముందా. తేల్చుకోవాలి. అసలు ప్రేమ మీద నమ్మకముందో, లేదో అడగాలి.


" అంటే నీకు తొలిచూపులో ప్రేమన్నా, ఇద్దరి మధ్య ఉదయించే ప్రేమన్నా నమ్మకం లేదా" సూటిగానే అడిగింది వినమ్ర.


" తొలిచూపులో ప్రేమంటే అసలు నమ్మకం లేదు. కర్తవ్యాన్ని మరచి ప్రేమలతో కాలక్షేపం చేయడం అసలు ఇష్టం లేదు. అసలు నాకు బంధం ఏర్పడకుండా ప్రేమంటూ వెంటపడడం అసలు నచ్చదు" తేల్చిపారేశాడు గుణ.


" అంటే ప్రేమించడం నీకు నచ్చదా "


" వినమ్రా. ప్రేమంటే ఏమిటో తెలుసా నీకు. ఒక మనిషి నిస్వార్థంతో ఎదుటిమనిషి మీద చూపించే అనురాగమే ప్రేమ. ఎదుటివారు అందంగా ఉన్నారనో, మన మీద శ్రద్ధ చూపిస్తున్నారని అపోహపడో, గుణగణాలు నచ్చాయనో, వెనుకముందు చూడకుండా ఆ ఆకర్షణనే ప్రేమనుకుని, విచక్షణకోల్పోయి కన్నవారిని ఎదిరించో, వారు అంగీకరించకపోతే వారితో వీడిపోయో, ప్రాణాలను బలిచేసుకునో, తల్లిదండ్రులచేత పరువు పేరిట చంపబడో, జీవితాన్ని సర్వనాశనం చేసుకునే యువత మధ్య ఏర్పడే అర్ధంలేని ప్రేమంటే నాకు జుగుప్స, అసహ్యం. వినమ్రా ఒక్కమాట చెప్పు. చదువుకునే వయసులో ప్రేమ అవసరమా? ప్రేమ పేరుతో ఆడపిల్లలు మోసపోయి, వారు నరకం అనుభవిస్తూ, తల్లిదండ్రులను క్షోభకు గురిచేస్తూ క్షణక్షణం చిత్రహింసకు గురికావడం ఎంతవరకు సమంజసం" ఆవేశంగా మాట్లాడుతున్న గుణను చూసి బిత్తరపోయింది వినమ్ర.


ఏం మాట్లాడాలో అర్థంకాలేదు ఆమెకు. ఇతనికి ప్రేమంటే నమ్మకం లేదా లేక ప్రేమంటే అసహ్యమా లేక ఈసరికే ఎవరినైనా ప్రేమించి మోసపోయాడా? సవాలక్ష ప్రశ్నలు ఆమె మెదడులో.


" సారీ. నేనేమన్నా తొందరపడి మాట్లాడి మీ మనసు నొప్పించానా?" మరల అతనే అడిగాడు.


" అబ్బే. అదేంలేదు గుణ. మీ అభిప్రాయం మీరు చెప్పారు అంటే దీన్ని బట్టి మీకు ప్రేమ మీద సదభిప్రాయం లేదనిపిస్తున్నది" నొచ్చుకున్నట్లుగా అడిగింది వినమ్ర.


" నా దృష్టిలో ప్రేమంటే దైవం. ఒక తల్లి, బిడ్డతో బంధం ఏర్పడిన తరువాత ప్రేమిస్తుంది. ఆమె ప్రేమలో స్వార్థం ఉండదు. బిడ్డకోసం తనకుతాను కాలిపోవడానికైనా సిద్ధపడుతుంది. అలాగే తోడబుట్టిన వారి మధ్య ప్రేమ, అనుబంధంతో పాటు ఉదయిస్తుంది. అలాగే ప్రతి రక్తసంబంధం మధ్య ప్రేమలు ఏర్పడుతుంటాయి. వీటన్నిటిలో ఎక్కడా ఎవరి అభ్యంతరం ఉండదు. ఏ లక్ష్యసాధనకు ఇవి అడ్డుకావు. కానీ టీనేజిలో ఉన్న యువతీ యువకుల మధ్య ఉదయించిన ప్రేమ అనే ఒక వయసు ఆకర్షణ వారి భవితను, జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నది. ఎంతో పురోగతి సాధించవలసిన మనిషిని తప్పుదారి పట్టించి బలహీనులను చేసి, బ్రతుకును అంధకారం చేస్తున్నది. బిడ్డల మీద తల్లిదండ్రులు పెంచుకున్న ఆశలను నిలువునా కాల్చేస్తున్నది. అంతదాక ఎందుకు. నువ్వు, నన్ను ప్రేమిస్తే మీ నాన్న ఒప్పుకుంటాడా? ఒక పేదవాడితో సంబంధం అతనికి పరువుచేటు కాదా? దీని పర్యవసానాన్ని ఊహించగలవా?


అది పక్కనపెట్టు. ఎంతో తెలివితేటలున్న నువ్వు నా ఆలోచనలో పడి, చదువులో ఎంత వెనుకబడిపోయావో తెలుసుకున్నావా. సమాజానికి మేలు చేయవలసిన వృత్తికి సంబంధించిన చదువు మనది. పదిమంది జీవితాలను కాపాడవలసిన విద్య మనది. దాన్ని పక్కకునెట్టి, ప్రేమలోకంలో విహరిస్తూ బంగారమంటి భవితను చేజేతులా నాశనం చేసుకోవడం ముఖ్యమా? పెళ్ళయిన తరువాత ప్రేమించుకుని పవిత్రబంధాన్ని ఏర్పరచుకున్నవారు ఎంతమంది లేరు. ఈరోజులలో బాయ్ ఫ్రెండు ఉండడం, చదువుకునేటప్పుడే ప్రేమలో పడడం ఒక పెద్ద ఫ్యాషనయిపోయింది నేటి యువతకు. అలాంటి తప్పు మనమధ్య జరుగకూడదని నా ఉద్దేశ్యం. దయచేసి ఈ టాపిక్ ను ఇంతటితో ముగిద్దాం. మన చదువు మీద మనం ధ్యాసపెడదాం. పక్క ఆలోచనలు వద్దు. నువ్వు మరల పాత వినమ్రవు కావాలి. మనం మంచి స్నేహితులం అంతే. నామాటలలో వాస్తవాన్ని గ్రహించు" ఊపిరి తీసుకున్నాడు గుణ.


ప్రేమ మైకంలో కూరుకుపోయిన ఆమె మెదడును వాషింగుమిషనులో వేసి కడిగినట్లనిపించింది. ఎంత వాస్తవికత దాగివుంది అతని మాటలలో. వద్దు ఈ ప్రేమ, దోమ వద్దు. గుణ చెప్పినది నిజం. ముందు నేను మంచి డాక్టరును కావాలి. స్పెషలైజేషన్ చేయాలి. గుణతో ప్రేమలో కాదు, చదువులో పోటీపడాలి. అందం, చదువు, డబ్బు ఉన్న ఆడపిల్ల ప్రేమిస్తున్నానంటే చాలు వెనుక, ముందు చూడకుండా ఆమెతో తిరిగి, పెద్దలను ఎదిరించి పెళ్ళికి సిద్ధమయి, వాళ్ళు అంగీకరించకపోతే చెప్పకుండా పారిపోయి, ఎలా బ్రతకాలో తెలియక ఆత్మహత్యలు చేసుకునే నేటి యువతలా తాము కాకూడదు అనుకుంది వినమ్ర.


" సారీ గుణ, నేను చేసింది పొరపాటే. వయసు మనసును వంచించి, నా లక్ష్యాన్ని దారి తప్పేటట్టు చేసింది. మనలోమాట నా మీద నీ అభిప్రాయం ఏమిటి? నీమీద నా ప్రేమ తప్పంటావా?" అడిగింది వినమ్ర.


" వినమ్రా నాకిప్పుడు ఉన్నది ఒకటే లక్ష్యం. చదువు సక్రమంగా పూర్తి చేయాలి. ఏదైనా స్పెషలైజేషన్ చేసి ప్రభుత్వ వైద్యాధికారిని కావాలి. నాకు స్కాలర్ షిప్ ఇచ్చి చదివించిన ప్రభుత్వ ఋణం తీర్చుకోవాలి. అంటే ప్రజలసొమ్ముతో చదువుకున్న నేను, ఆ ప్రజల సేవకే అంకితం కావాలి. మారుమూల ప్రాంతాలలో వైద్యసదుపాయాలు లేక అల్లాడే పేద ప్రజలకు నావంతు సహకారం అందించాలి. నా లక్ష్యాన్ని ఇష్టపడి, నాతో కష్టాన్ని పంచుకునే ఆడపిల్లనే పెళ్ళి చేసుకుంటాను. పెళ్ళయిన తరువాత ఆమెను మాత్రమే ప్రేమిస్తాను. అంతవరకు నా లక్ష్యం చదువే" మనసులో మాట చెప్పాడు గుణ.


ఒకింత బాధకు గురయింది వినమ్ర. మరొకసారి ప్రయత్నం చేద్దామనుకుంది.


" పోనీ అంతవరకు నేను నీకోసం వేచిచూస్తే నీకు అంగీకారమేనా"


" నా అంగీకారం తరువాత, నీ ప్రేమ గురించి మీ ఇంట్లో తెలుసా?"


" చెప్పలేదు "


" ఎందుకని "


" నీ మనసు తెలియకుండా ఎలా చెప్పను "


" అసలు మీవాళ్ళు ఒప్పుకుంటారా"


" ఒప్పుకోకపోయినా, నువ్వు ఒప్పుకుంటే చాలు నాకు. వాళ్ళను ఎదిరించయినా నీతో వచ్చేస్తాను"


" ఇంతసేపు చెప్పింది ఈమాట కోసమేనా. చూడు వినమ్రా. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాకూడదు. ప్రేమ రెండు మనసుల పొంగు, కానీ పెళ్ళి రెండు కుటుంబాల మధ్య ఏర్పడే విడదీయలేని బంధం. తమ మనసుకేది తోస్తే అది చేస్తూ, ప్రేమ మత్తులో కన్నవారిని క్షోభ కలిగిస్తూ, అదే ఘనకార్యంగా భావిస్తున్నారు అంతా. అది తప్పు. మనకు ఉనికిని ఇచ్చింది తల్లి. మనకు సంస్కారాన్ని నేర్పి, నలుగురికి పరిచయం చేసింది తండ్రి. ఆ ఇరువురికి నచ్చచెప్పి, వారిని మెప్పించి, ప్రేమించుకున్న వారు ఒకటైతే, అది వారికి, వారి కుటుంబానికి మేలు. అంతేగానీ, పెద్దలను ఎదిరించి వెళ్ళిపోతే ఎన్ని బాధలను ఎదుర్కొనవలసి వస్తుందో, తెలియచెప్పిన అనుభవాలు కోకొల్లలు.


అందుకే వినమ్రా, మన ప్రేమ విషయం పక్కనపెట్టు. సమయం వచ్చినపుడు అందరూ అంగీకరిస్తే అప్పుడు చూద్దాం. అంతవరకు మనం సహచరులం మాత్రమే. మన గమ్యం ఒక్కటే. పదిమందికి ప్రాణం పోసే మంచి డాక్టర్లం కావాలి. అందుకోసం శ్రమిద్దాం. నా మాటల వల్ల నీ మనసు నొచ్చుకునివుంటే నన్ను క్షమించు"


గుణ మాటలలో వాస్తవికతకు అబ్బురపడింది వినమ్ర.


" ఇంత క్లారిటీ ఇచ్చాక ఇంకా నీమీద నాకు కొరవ ఎందుకుంటుంది. మన లక్ష్యాన్ని నిర్దేశించావు. అన్నీ మరచిపోతాను. యువత పడవలసినది ప్రేమలో కాదని, పోటీ పడవలసినది లక్ష్యసాధనలోనని స్పష్టంగా చెప్పావు. నీలాంటి మిత్రుడు దొరకడం నిజంగా నా అదృష్టం. ఇకనుంచి మన ఇద్దరి లక్ష్యం ఒకటే. ఒకటిగానే సాగుదాం. విజయం సాధించేవరకు మనం పోటీపడుతూనే గమ్యాన్ని చేరుదాం" తన సమ్మతిని తెలిపింది వినమ్ర.


" థాంక్యూ వినమ్రా. మనమిప్పుడు మంచి స్నేహితులం అంతే. ఉంటాను " అని లేచి హాస్టలు వైపు నడిచాడు గుణ.


అతను వెళుతున్న వైపే చూస్తుండిపోయింది వినమ్ర. అందరు యువత ఇదే విధంగా ఆలోచిస్తే 'ఇన్ని అకృత్యాలు ఈ దేశంలో జరగవుకదా' అనుకుంది మనసులో.


****************


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసంమేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

42 views0 comments

Comments


bottom of page