ఆత్మగౌరవం
- Veluri Sarada

- 1 day ago
- 4 min read
#ఆత్మగౌరవం, #Athmagouravam, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Athmagouravam - New Telugu Story Written By Mayukha
Published in manatelugukathalu.com on 18/01/2026
ఆత్మగౌరవం - తెలుగు కథ
రచన: మయూఖ
కిరణ్, రమేష్, వంశీ... ముగ్గురూ ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.
వంశీ డ్రాయింగ్ బాగా వేస్తాడు. హ్యాండ్ రైటింగ్ ముత్యాల్లా ఉంటుంది.
వంశీ హాస్టల్‌లో ఉంటాడు. కిరణ్, రమేష్ డే-స్కాలర్స్.
వంశీకి వాళ్ల నాన్న పంపే డబ్బు సరిపోయేది కాదు.
దాంతో హ్యాండ్ రైటింగ్ బాగుండడంతో ఫ్రెండ్స్ అందరికీ రికార్డులు రాసి డబ్బు సంపాదించేవాడు. దాంతో జల్సాలు చేసేవాడు. కిరణ్ 'జల్సాలు వద్దని' మందలించినా వినేవాడు కాదు.
ఫైనల్ ఇయర్ కావడంతో ఎవరి టార్గెట్‌లు వాళ్ళు రీచ్ అవ్వడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. వంశీ ముందే ప్లాన్ చేసుకున్నాడు, యూఎస్ వెళ్లాలని. దానికి తగ్గట్టే యూనివర్సిటీలకు అప్లై చేసుకుంటున్నాడు. కిరణ్ ది మధ్యతరగతి కుటుంబం అవడంతో ఉద్యోగం చేయక తప్పదు. రమేష్ అయితే ముందే ఫిక్స్ చేసుకున్నాడు. "ఈ చదువు చదవడమే ఎక్కువ. ఇంకా ఎమ్మెస్ కూడానా! మా నాన్న బిజినెస్ చూసుకుంటాను" అనేవాడు. అందుకే చదువు మీద శ్రద్ధ పెట్టేవాడు కాదు.
ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి. కిరణ్‌కు జాబ్ రాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఒకరోజు కిరణ్ తల్లిదండ్రులు చుట్టాల అబ్బాయి పెళ్లికి అమలాపురం వెళ్లారు. పెళ్లి నుంచి వస్తూనే కిరణ్ తండ్రి రామారావు ధుమధుమలాడుతూ వచ్చాడు.
"పెళ్లిలో అందరూ నన్ను అడగడమే, 'మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా?' అని! చెప్పలేక చచ్చాను. దానికి తగ్గట్టే మా మామయ్య మనవడికి క్యాంపస్ సెలక్షన్స్ లో జాబ్ వచ్చిందట. 10 లక్షల ప్యాకేజ్. మా మామయ్య అందరితో గొప్పగా చెబుతున్నాడు. నేను నీవల్లే తలెత్తుకోలేకపోయాను" అన్నాడు కోపంగా.
"క్యాంపస్ సెలక్షన్స్ లేని కాలేజీలో జాయిన్ చేసి నన్ను అంటారే? నేను నా ప్రయత్నాలు చేస్తున్నాను, నేను ఖాళీగా ఉన్నానా! మీకు ముందే చెప్పాను జావా, పైథాన్ కోర్సులు నేర్చుకుంటాను అంటే మీరు ఏమన్నారు? 'చదువు అయిన తర్వాత చూద్దాం' అన్నారు. ఇప్పుడు అనుకుని ఏం లాభం? వాళ్లకొచ్చింది, వీళ్ళకొచ్చింది అంటే వాళ్ళు ఏం కోర్సు నేర్చుకున్నారో, ఏ కాలేజీలో చదివారో మీకు తెలుసా? ఉద్యోగం రాక నేనే బాధపడుతుంటే, మళ్లీ మీరూ నన్నే అంటున్నారు." అని విసురుగా వెళ్ళిపోయాడు కిరణ్.
"ఇప్పుడు నేను ఏమన్నానని? వాడు అంత చదువుతున్నాడు."
"మీరు ఏం అనలేదు? వచ్చి రాగానే మొదలెట్టలేదా? ఉద్యోగం రాక వాడు బాధలో ఉంటే పుండు మీద కారం జల్లినట్టు వేరే వాళ్ళతో పోలిక తెస్తే, కోపంగా ఉండదా! మీ మావయ్య గొప్ప చెప్పాడు కానీ, మీ అత్తయ్య చెప్పింది రికమండేషన్ వలన వాడికి ఉద్యోగం వచ్చిందట. అది తెలుసా మీకు. ఇంకెప్పుడు వాడిని అనకండి." అని రామారావు భార్య సీత అనడంతో మరి మాట్లాడలేకపోయాడు.
రామారావు ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు. ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేవు. కొడుక్కి ఉద్యోగం ఇప్పించే అంత పలుకుబడి లేదు, లంచాలు ఇచ్చే అంత డబ్బు లేదు. మధ్యతరగతి జీవితాలు పైకి ఎదగలేక, కిందకి దిగలేక త్రిశంకు స్వర్గంలా ఉంటాయి.
ఒక రోజు కిరణ్ ఫేస్‌బుక్‌లో చూశాడు. "70 ఏళ్ల వ్యక్తికి హార్ట్ ఆపరేషన్. ఏబీ నెగటివ్ గ్రూప్ బ్లడ్ కావలెను."
ఈ ప్రకటన చూసిన వెంటనే తనది అదే అవడంతో అడ్రస్ వెతుక్కుంటూ హాస్పిటల్‌కు వెళ్లి డొనేట్ చేశాడు. అక్కడ ఒక వ్యక్తి విజిటింగ్ కార్డు ఇచ్చి, "ఏదైనా అవసరమైతే మా సార్‌ని కలవండి. మీరు బ్లడ్ ఇచ్చింది మా సార్‌కే. మా సార్ చెప్పమన్నారు" అని కార్డు ఇచ్చాడు.
కిరణ్ ఇంటికి వచ్చి తల్లితో విషయం చెప్పాడు. "పోనీలే మనం ఒకరికి సహాయం చేస్తే, ఆ భగవంతుడు మనకి ఇంకొక రకంగా సహాయం చేస్తాడు" అంది.
రోజులు గడుస్తున్నాయి కానీ కిరణ్‌కు ఉద్యోగం రాలేదు.
ఒకరోజు ఏవో సర్దుతుంటే ఆ విజిటింగ్ కార్డు కనిపించింది. దాంతో ఆశ పుట్టింది. పోనీలే ఒకసారి ఆ పెద్దాయన్ని కలిస్తే బాగుంటుంది అనుకుని ఆ అడ్రస్‌లో ఉన్న ఆఫీస్‌కి వెళ్ళాడు.
"ఎవరు నువ్వు? ఎవరు కావాలి?" అని గేటు దగ్గర సెక్యూరిటీ గార్డు అడ్డం కొట్టాడు.
"తను ఫలానా అని, ఆరోజు పెద్ద సార్‌కి బ్లడ్ ఇచ్చానని" చెప్పాడు విజిటింగ్ కార్డు చూపిస్తూ.
"ఓ! ఆ సార్ లేరుగా! అమెరికా వెళ్ళిపోయారు బిడ్డ దగ్గరికి."
"అయ్యో! నేను ఆయన్ని కలవడానికి వచ్చాను. నాకు జాబ్ లేదు. ఆ సార్ ఏదైనా ఇప్పిస్తారేమోనని వచ్చాను. పోనీ వాళ్ల అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా?" అన్నాడు ఆశతో.
"సరే వెళ్ళు!" అని లోపలికి పంపాడు. బెరుగ్గా లోపలికి వెళ్లిన కిరణ్‌కు తిరస్కారం ఎదురైంది. "ప్రతి వాళ్లు విజిటింగ్ కార్డు తీసుకుని వచ్చేవాళ్లే. ఇక్కడ ఉద్యోగాలు ఏమీ లేవు. అయినా ఇటువంటి వాళ్ళని ఎందుకు లోపలికి పంపుతున్నారు?" అంటూ కిరణ్ని ఎగాదిగా చూసి పంపించేశాడు పెద్ద సార్ కొడుకు అజయ్.
ఉసురుమంటూ బయటకు వస్తున్న కిరణ్ని చూసి సెక్యూరిటీ గార్డ్, "ఇలాగే జరుగుతుందని ముందే అనుకున్నాను తమ్ముడూ! పెద్ద సార్ మంచి ఆయనే కానీ, వాళ్ళ అబ్బాయి అటువంటి మనిషి కాదు. నీకు ఉద్యోగం కావాలి కదా! మా ఇంటి దగ్గర ఒక సార్ ఉన్నాడు. ఆయనకి చెబుతాను. ఆయన మా అబ్బాయికి కూడా ఉద్యోగం ఇప్పించారు" అని ఆ సాయంత్రం ఆయన దగ్గరికి తీసుకువెళ్లాడు సెక్యూరిటీ గార్డు.
నాలుగు రోజుల తర్వాత కిరణ్ ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లడం, ఉద్యోగం రావడం జరిగింది.
కిరణ్ ఆనందానికి అవధులు లేవు. కిరణ్ తల్లి సీత అంది "నువ్వు ఒకరికి మంచి చేస్తే, దేవుడు మనకి మంచి చేస్తాడు అన్నా! చూసావా!"
"నేను బ్లడ్ ఇచ్చిన ఆయన చేశారా! ఆయన కొడుకు చేశాడా!" అన్నాడు కిరణ్.
"మనం ఒకరికి సహాయం చేస్తే దేవుడు మరొకరి రూపంలో సహాయం చేస్తాడు" అంది సీత.
కిరణ్‌కు కష్టపడే మనస్తత్వం ఉండడంతో పనిలో నైపుణ్యం సంపాదించి మంచి వర్కర్ అనిపించుకున్నాడు. కిరణ్ పనిచేసే ఆఫీస్ మేనేజర్‌కు కిరణ్ అంటే చాలా ఇష్టం. ఆఫీస్ అన్నా, ఉద్యోగం అన్నా, ఎంతో బాధ్యతతో ఉంటాడని ఇష్టపడుతూ ఉంటాడు.
ఒకరోజు మేనేజర్ గారు పిలుస్తున్నారని ప్యూను చెబితే మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. మేనేజర్‌తో పాటు ఉన్న వ్యక్తిని చూసి కిరణ్ ఆశ్చర్యపోయాడు.
మేనేజర్ కిరణ్ ని చూపిస్తూ, "ఇతను కొత్తగా మా ఆఫీస్‌కు వచ్చాడు, చాలా బాగా వర్క్ చేస్తాడు. ఇతని యొక్క డెడికేషన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఇంటెలిజెంట్. ఒకసారి చెబితే అల్లుకుపోతాడు.." అని చెబుతున్నాడు.
అవతలి వ్యక్తి ఎవరో కాదు, అతనే అజయ్. అజయ్ ఈ కంపెనీ మేనేజర్ రఘుకి ఫ్రెండ్. రఘు నాన్నగారు కంపెనీకి ఎండీ. ఎక్స్‌పీరియన్స్ కోసం రఘు కంపెనీలో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
రఘు అందర్నీ కలుపుకుంటూ, అందరితో కలిసి పోతూ, ఫ్రెండ్లీగా ఉండడంతో ఆఫీసు వాతావరణం హొమ్లీగా ఉంటుంది.
అజయ్‌కి కిరణ్ ని చూసిన వెంటనే తను ఆరోజు తిరస్కారంగా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అలాగే కిరణ్‌కు ఇబ్బందిగా అనిపించి నమస్కారం చేసి బయటకు వచ్చేసాడు.
అజయ్‌కి అనిపించింది, "నష్టాల్లో ఉన్న తన కంపెనీకి ఇటువంటి వాళ్లు ఉంటే బాగుంటుంది కదా!" అనుకున్నాడు.
రఘుకి 'బై' చెప్పి బయటకు వచ్చాడు అజయ్.
ఒకరోజు కిరణ్‌కు ఫోన్ వచ్చింది. ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీ కంటే ఎక్కువ ఆఫర్ చేస్తూ వచ్చిన కాల్ అది.
కిరణ్‌కు అర్థమైపోయింది ఎక్కడి నుంచి వచ్చిందో. "సారీ! నేను రాలేను. ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తుల్ని మనుషులుగా చూస్తారు. సొంత కుటుంబం లాంటి కంపెనీని వదిలేసి పరాయిచోటకి రాలేను. ఆత్మగౌరవం ఉన్నవాళ్లు ఎవరు ఇటువంటి చోటుని వదిలి రాలేరు. సారీ!" అని ఫోన్ పెట్టేసాడు.
అజయ్‌కి చెళ్ళున కొట్టినట్టు అయింది.
అజయ్ అనుకున్నాడు, "ఆరోజు అహంకారంతో కిరణ్ ని చూసి తిరస్కారంగా మాట్లాడాను. కానీ, కిరణ్ లాంటి వాళ్ళు ఇద్దరు, ముగ్గురు ఉన్నా చాలు. వాళ్లే బాధ్యత అంతా తమ భుజాన వేసుకుని ఆఫీస్ పని అంతా చేసి, ఆఫీస్‌ని ముందుకు నడిపిస్తారు. చాలా పొరపాటు చేశాను. మంచి వర్కర్‌ని వదులుకున్నాను" అనుకున్నాడు.
ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వలేనప్పుడు ఎంత సంపాదిస్తేనేం, ఎంత చదువుకుంటేనేం.
******శుభం *******
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.




Comments