అత్తగారు - అత్తగారి వియ్యంకురాలు
- LV Jaya

- Oct 31
- 6 min read

Atthagaru Atthagari Viyyankuralu - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 31/10/2025
అత్తగారు - అత్తగారి వియ్యంకురాలు - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 16)
రచన: L. V. జయ
రాధకి, రాధ వియ్యంకురాలు లక్ష్మికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. లక్ష్మికి డబ్బు, బంగారం ఉన్నాయన్న గర్వమని, తన కూతురు పావనిని లక్ష్మి చిన్నచూపు చూస్తుందని రాధ అందరికీ చెప్తుంది. రాధ ఆడే అబద్దాలు, ఆవిడ తయారయ్యే విధానం, స్వార్ధం, నంగనాచితనం, అందరి మీద నోరువేసుకుని పడిపోవడం అంటే లక్ష్మికి చిరాకు. రాధ మొహం చూడడానికి కూడా లక్ష్మి ఇష్టపడదు.
రాధ కొడుకు సమర్థ్ పెళ్ళికి పిలిచినా లక్ష్మి వెళ్ళలేదు. కానీ, రాధలాంటి గయ్యాళికి, ఎలాంటి అమ్మాయి కోడలుగా వచ్చి ఉంటుందా అన్న ఆలోచనతో, 'కొత్తదంపతులని చూడాలనుంద'ని తన కోడలు పావనికి చెప్పింది. ఈ విషయం తెలిసిన రాధ, తన కోడలు జాగృతి గురించి లక్ష్మికి తెలిస్తే, తనని, తన కూతుర్ని ఇంకా తక్కువ చేస్తుందనుకుని, అలా కాకుండా ఉండాలంటే ఏంచెయ్యాలని అలోచించి, ఒక నిర్ణయానికి వచ్చింది.
సమర్థ్ ని, జాగృతిని పిలిచి, "మా వియ్యంకురాలు, పెళ్ళికి కూడా రాలేకపోయింది కదా. మిమ్మల్ని చూడాలనుకుంటోంది. ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. " అని చెప్పింది రాధ.
పెళ్ళి తరువాత మొదటిసారి సమర్థ్ కి, జాగృతికి కలిసి బయటకి వెళ్ళే అవకాశం వచ్చినందుకు ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. సరదాగా షికారుకు వెళ్ళివద్దామనుకున్నారు.
జాగృతి తయారయిన విధానం చూసి రాధ కోపముగా, "ఈ పిల్లకి తయారవ్వడం కూడా రాదు. నా కూతురైతే ఎంత చక్కగా తయారవుతుందో. నా ఖర్మ ఇలాంటి కోడలు దొరికింది నాకు. ఇలా బోసిగా మా వియ్యంకురాలు దగ్గరికి వెళ్తే, మేము నీకేమీ పెట్టలేదనుకుంటుంది ఆవిడ.
అసలే ఆవిడవి డేగకళ్ళు, పైగా బంగారం పిచ్చి. నిన్ను పైనుంచి కిందవరకు చూస్తుంది. పెళ్ళిచీరల్లోంచి మంచి పట్టుచీరొకటి కట్టుకుని, నీకున్న బంగారమంతా పెట్టుకుని రా. నేను నిన్ను తయారుచేస్తాను. " అంది.
'ఎవరో చూస్తారని వాళ్ళ కోసం ఇంతలా తయారవ్వాలా? ఇంత బంగారం పెట్టుకోవాలా?' అనుకుంటూ, రాధ కోపాన్ని చూసి, ఆవిడతో చెప్పలేక, రాధ చెప్పినట్టు చేసింది జాగృతి.
అయినా రాధ, జాగృతి తయారైన విధానం బాగులేదంటూ, జాగృతి తలకి నూనె రాసి, గట్టిగా జడ వేసి, జడగంటలు పెట్టి, "పువ్వులు పెట్టద్దు. నాకు వాటి వాసన పడదు. ఎలర్జీ ఉంది. తుమ్ములు వస్తాయి" అని జాగృతి చెప్తున్నా వినకుండా, బలవంతంగా జడంతా నిండిపోయినట్టు మల్లెపువ్వులు, కనకాంబరాలు పెట్టి, వాటి మీద బంతిపువ్వుని పెట్టి, కళ్ళకి దట్టంగా కాటుక, నుదిటికి పెద్ద బొట్టుపెట్టి, "ఇలా తయారవ్వాలి ఆడపిల్లలంటే, ఎప్పుడూ మొగుడికి, చూసేవాళ్ళకి అందంగా కనపడాలి. " అని చెప్పింది రాధ.
అప్పుడే అక్కడికి వచ్చిన సమర్థ్, జాగృతిని చూసి చిరాకుగా, "ఇలా తయారయ్యావేమిటి వింతగా. నిన్నిలా చూడలేక పోతున్నాను. నీకస్సలు నప్పలేదు ఈ అవతారం. వెళ్ళి మార్చుకో. " అన్నాడు. 'హమ్మయ్య సమర్థ్ వద్దన్నాడు. మార్చుకుని మాములుగా వద్దాం' అనుకుంది జాగృతి.
రాధ, సమర్థ్ మీద గట్టిగా అరుస్తూ, "నువ్వు నోరు మూసుకో. పావని అత్తగారి గురించి నీకేం తెలియదు. మీకు నచ్చినట్టు బోసిగా వెళ్ళిపోతే, మనం ఏమీ లేనివాళ్ళం అనుకుంటుంది ఆవిడ. ఇప్పటికే నా కూతుర్ని ఎంత తక్కువచేస్తోందో. ఎన్ని బాధలు పడుతోందో నా కూతురు ఆ ఇంట్లో. అందుకని నేను చెప్పింది చెయ్యి. నీ పెళ్ళాన్ని తీసుకుని, ఆ స్కూటర్ మీద బయలుదేరు ఇంక. " అని ఇంటిబయట ఉన్న పాత స్కూటర్ ని చూపించింది రాధ.
రాధమాటని ఎదిరిస్తే ఏంజరుగుతుందో తెలిసిన సమర్థ్, మారు మాట్లాడకుండా, బయటకి వెళ్ళి, స్కూటర్ మీద దుమ్ముదులిపి, స్టార్ట్ చెయ్యటానికి ప్రయత్నించాడు.
'ఏమిటీ ఈ పాత స్కూటర్ మీద ఈ అవతారంలో, ఈ ఎండలో వేరే ఊరు వెళ్ళాలా?' అని జాగృతి అనుకుంది జాగృతి. జాగృతి సింపుల్గా, హుందాగా ఉంటుంది. అందరితోనూ నెమ్మదిగా, గౌరవంగా మాట్లాడుతుంది. రాధ జాగృతిని తయారుచేసిన విధానం గాని, ఆవిడ మాటతీరు గాని జాగృతికి నచ్చలేదు.
'పెళ్ళికి కూడా ఇంతలా తయారవ్వలేదు నేను. నన్ను చూసుకుంటుంటే నాకే చిరాకుగా ఉంది. ఎవరో చూస్తారని ఇలా తయారవ్వడమేమిటి? సమర్థ్ అయినా రాధకి చెప్పి, తన అవతారాన్ని మారుస్తాడేమో అనుకుంటే, ఆవిడకి భయపడి, మూలనపడున్న పాత స్కూటర్ దుమ్ము దులుపుకుంటున్నాడు. ఈవిడని చూసి కొడుకే ఇంత భయపడుతుంటే, ఇంక నేనేం మాట్లాడను!!
‘నీ పెళ్ళాం’ అంటోందేమిటి ఈవిడ నా గురించి సమర్థ్ తో !! మీ ఆవిడ అనో, లేకపోతే నీ భార్య అనో అనచ్చు కదా. ' అనుకుంది. అన్నీ మనసులో అనుకోవడమేతప్ప, రాధ కోపానికి భయపడి ఆవిడకి ఏమీ చెప్పలేకపోయింది.
చాలాసేపటి తరువాత స్కూటర్స స్టార్ట్ చెయ్యగలిశాడు సమర్థ్. జాగృతి దాని మీద ఎక్కి కూర్చోగానే, జాగృతి ఒళ్ళో ఒక పెద్దమూటని తెచ్చి పెట్టింది రాధ.
"ఇది ఇలానే జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళు. పెళ్ళికి మా అత్తగారు అందరికీ ఇచ్చారని చెప్పి ఆవిడకి ఇవ్వు. " అని చెప్పింది.
'నా అవతారం ఇప్పటికే ఏదోలా ఉందంటే, ఒళ్ళో ఈ మూట కూడానా? ఈవిడ మాట వింటూపోతుంటే కొన్నాళ్ళు పోయాక నన్ను నేను గుర్తుపట్టలేనేమో!! అనుకుంది జాగృతి.
"నీకు పెళ్ళికి మేమేం బంగారం పెట్టామని అడుగుతుంది ఆవిడ. నువ్వు వేసుకున్నవన్నీ మేము పెట్టినవే అని చెప్పు. నీ చదువు, ఉద్యోగాల గురించి ఆవిడకేమి చెప్పనక్కరలేదు. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టేస్తుందావిడ.
తెలిసీతెలియకుండా మాట్లాడి, మా వియ్యంకురాలి ముందు నా పరువు తీయకు. " అని జాగృతికి జాగ్రత్తలు చెప్పింది రాధ.
రాధకి, లక్ష్మికి ఉన్న వైరం గురించి తెలియని జాగృతి, 'బంగారం గురించి అబద్ధమెందుకు చెప్పాలి? నా చదువు గురించి, ఉద్యోగాల గురించి ఎందుకు చెప్పకూడదు!! ఈవిడే ఇలా ఉంటే ఈవిడే చెప్తున్నదాన్నిబట్టి చూస్తే, ఈవిడ వియ్యంకురాలు ఇంకెలా ఉంటుందో!!' అనుకుంది జాగృతి.
మొదటిసారి కలిసి సంతోషంగా షికార్లు కొట్టాల్సిన కొత్తదంపతులు, ఎండలో, చమటలు కారుతూ, పాత డొక్కు బండి మీద సమర్థ్ నడుపుతుంటే, వెనక పట్టుచీరలో, ఒంటినిండా బంగారంతో, పెళ్ళికూతురుకంటే ఎక్కువగా తయారై, ఒళ్ళో మూటతో జాగృతి, లక్ష్మివాళ్ళ ఊరికి బయలుదేరారు.
దారిలో స్కూటర్ బ్రేక్ వెయ్యడానికి ప్రయత్నించాడు సమర్థ్. అవి పనిచెయ్యలేదు. బెల్ నొక్కాడు. అదీ పనిచేయలేదు. భయపడుతూ, నెమ్మదిగా జాగ్రత్తగా బండి నడుపుతూ లక్ష్మివాళ్ళ ఊరికి చేరారు. వాళ్ళ ఇల్లున్న రోడ్డులో, అడ్డుగ్గా వస్తున్న మనుషుల్ని తప్పించుకుంటూ, పనిచెయ్యని బ్రేక్ ని, బెల్ ని పదేపదే నొక్కుతూ, "తప్పుకోండి, తప్పుకోండి" అని అరుస్తూ నడిపాడు సమర్థ్.
లక్ష్మి ఇంటి దగ్గర, ఎంత ప్రయత్నించినా బండి ఆగకపోవడంతో, వాళ్ళ ఇంటిముందున్న చెట్టుని గుద్ది బండిని ఆపాడు సమర్థ్. జాగృతి ఒక్కసారిగా తుళ్ళిపడి, ఒళ్ళో ఉన్న మూటతో సహా కిందపడింది.
ఇదంతా దూరమునుండి చూసిన లక్ష్మి, గబగబా బయటకి వచ్చి, పడిపోయిన జాగృతిని లేపి, "దెబ్బలేమీ తగలలేదు కదా" అని అడిగి, లేదని చెప్పాక, ఇద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్ళి, తాగటానికి చల్లటి నీళ్లు ఇచ్చింది.
జాగృతి రాధ ఇచ్చిన మూటని లక్ష్మికి ఇస్తూ, "పెళ్ళికి వచ్చిన వాళ్లందరికీ ఇవి ఇచ్చారండి. మీకు ఇవ్వమని మా అత్తగారు మాతో పంపించారు. " అని చెప్పింది.
"ఇలా మూటలో పంపకపోతే, చక్కగా బ్యాగ్లో పెట్టి ఇవ్వచ్చు కదా? ఏవిటో ఆవిడ పల్లెటూరి పద్దతులు !! ఆవిడ మారదు. " అనుకుని, "మీ అత్తగారేనా అమ్మా నిన్నిలా తయారు చేసింది?" అని జాగృతిని అడిగింది లక్ష్మి. జాగృతి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది.
"నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. చదువుకుని, ఉద్యోగం చేస్తున్న పిల్లలెవరూ ఇలా ఉండరు. ఉండనక్కరలేదు కూడా. నువ్వు మామూలుగానే చక్కగా ఉన్నావు. ఎవరినో ఇంప్రెస్స్ చెయ్యటం కోసం మొత్తం మారిపోతామా చెప్పు. " అంది లక్ష్మి నవ్వుతూ.
లక్ష్మి చక్కటి కట్టు, బొట్టుతో, హుందాగా ఉంది. పేరుకు తగ్గట్టు, ఆవిడ మోహంలో, ఇంట్లో లక్ష్మీకళ కనపడుతోంది. ఆవిడ మాటతీరు, ఆప్యాయత నచ్చాయి జాగృతికి. 'ఇలాంటివిడ గురించి మా అత్తగారెందుకు వేరేలా చెప్పింది!!' అనుకుంది.
"అమ్మా జాగృతీ. నీ గురించి చెప్పు. నాకు వినాలని ఉంది. ఏం చదువుకున్నావ్ నువ్వు? ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా?" అని అడిగింది లక్ష్మి.
"ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసానండి. ఇప్పటివరకూ US లో ఉద్యోగం చేశాను. ఇప్పుడు బెంగుళూరులో ఒక పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. అక్కడ జాయిన్ అవ్వాలి. ' అని చెప్పింది జాగృతి.
"ఏమిటీ? అంత చదువుకుని, పెద్ద ఉద్యోగం చేస్తున్న నిన్ను, ఈ రకంగా తయారుచేసిందా మీ అత్తగారు!! మీ ఆడపడుచుకి పెద్దగా చదువులేదు కదా. అందుకని నీ చదువు, ఉద్యోగం గురించి నాకు తెలియకుండా ఉండడం కోసం నిన్నిలా తయారుచేసిందన్న మాట. " అంది లక్ష్మి ఆశ్చర్యపోతూ.
'చదువు గురించి, ఉద్యోగం గురించి చెప్పద్దు. ' అన్న రాధ మాటలు గుర్తుకొచ్చాయి జాగృతికి.
"నువ్వు వేసుకున్న బంగారం వాళ్ళే పెట్టారని చెప్పమనుంటుంది. ఆవిడ హారం మాత్రమే పెట్టింది. మిగతావన్నీ మీ అమ్మావాళ్ళు పెట్టినవే. అవునా?" అని అడిగింది లక్ష్మి జాగృతిని.
లక్ష్మి మాటలకి ఆశ్చర్యపోతూ చూస్తున్న జాగృతితో, "ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? మీ దగ్గర తీసుకున్న ఆడపడుచు కట్నంతో, పావనికి కూడా ఇలాంటి హారమే చేయించి, కొడుకు పెళ్ళికి, కూతురికి గిఫ్ట్ ఇచ్చానని చెప్పింది. అన్నట్టు కట్నం గురించి కూడా చెప్పద్దని అనుంటుంది. ఎందుకంటే మీరిచ్చిన కట్నంతో, ఆవిడ వడ్డాణం కొనుక్కుంది కదా మరి. " అంది లక్ష్మి.
'బంగారం గురించి, కట్నం గురించి మాట్లాడద్దు. ' అన్న రాధ మాటలు గుర్తుకొచ్చాయి జాగృతికి.
"మా అమ్మ కట్నమేమి తీసుకోలేదండి. తన డబ్బుతోనే అన్నీ కొంది. " అన్నాడు సమర్థ్.
"మీ అమ్మ గురించి నాకంతా తెలుసునయ్యా. వడ్డాణం ఎందుకు కొందో, ఎప్పుడు కొందో కూడా తెలుసు. మీ పెళ్ళి ఫొటోల్లో చూసాను. అచ్చమ్ నాకున్న వడ్డాణం లాంటిదే కొనుక్కుంది. మేము మీ దగ్గర కట్నం తీసుకోలేదుకదా. మరి మీరు మాత్రం కట్నం తీసుకోవచ్చా? అది కూడా చక్కగా చదువుకుని, సంపాదిస్తున్న అమ్మాయి దగ్గర. కట్నం తీసుకోవడం తప్పు కదూ. పోనీ తీసుకుని మీకేమైనా కొనిచ్చిందా అంటే అదీలేదు. నాతొ పోటీగా, ఆవిడ కోసం వడ్డాణం కొనుక్కుంది. నాది నేను నా కోడలికి ఎప్పుడో ఇచ్చేసాను. మీ అమ్మ స్వార్ధపరురాలు. కోడలికి ఇవ్వదు. " అని ఆగకుండా రాధ గురించి చెప్పింది లక్ష్మి.
సమర్థ్ కి నిజం అర్ధమై, తలదించుకున్నాడు. జాగృతికి కూడా అప్పటివరకూ సమర్థ్ వాళ్ళ అమ్మ కట్నం అడిగి తీసుకుందని, దానితో అమ్మాకూతుర్లిద్దరూ వడ్డాణం, హారం కొనుక్కున్నారని తెలియదు. అన్నీ చూసినట్టు చెప్తున్న లక్ష్మిని చూసి ఆశ్చర్యపోయింది జాగృతి.
లక్ష్మి జాగృతిని చూసి, "ఈవిడేంటి ఇలా మాట్లాడుతోంది అనుకోకమ్మా జాగృతి. నాకు నువ్వన్నా, సమర్థ్ అన్నా కోపమేమిలేదు. మీ అత్తగారంటేనే నాకు పడదు. మా వాడు ఇంజనీరింగ్ చదివాడు. అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చాడు. ఇంట్లోనే ఉండే అమ్మాయిని, సంప్రదాయమైన అమ్మాయిని చేసుకుందామనుకున్నాడు.
తన భార్య పెద్దగా చదువుకోకపోయినా పర్వాలేదన్నాడు. వాడి ఇష్టప్రకారమే పెళ్ళిచేద్దాం అనుకున్నాం మేము. అప్పుడొచ్చింది వీళ్ళ అక్క సంబంధం మాకు. మా అమ్మాయి చాలా సంప్రదాయంగా ఉంటుందని చెప్పి పెళ్ళి చేసింది వీళ్ళ అమ్మ.
కానీ పెళ్ళైనప్పటినుండి చూస్తున్నాను పావనిని. ఏ పని రాదు ఆ అమ్మాయికి. రోజూ ఉదయాన్నే లేచి, హీరోయిన్ లా తయారయ్యి కూర్చునేది. మీ అత్తగారు కూడా అంతే. నాకు అలాంటివి అస్సలు నచ్చవు. సంప్రదాయంగా ఉండే పిల్ల కావాలనుకున్నాంగానీ, సంప్రదాయం అంతే తయారవ్వటంలో మాత్రమే చూపించేవాళ్ళని కాదు మేము కావాలనుకున్నది.
పావనిని మారమని, పనులు నేర్చుకోమని, ఈ షోకులు వద్దని చెప్పాను. నేను నా కోడలిని బాధపెట్టేస్తున్నట్టు, తక్కువ చేస్తున్నట్టు అందరికీ నా గురించి చెడుగా చెప్పింది మీ అత్తగారు. అందుకే, నేను ఆవిడ మొహం చూడడానికి కూడా ఇష్టపడను. మీ పెళ్ళికి కూడా అందుకే రాలేదు. " అని చెప్పింది లక్ష్మి. ఎన్నో రోజులనుండి, రాధ గురించి లక్ష్మి మనసులో దాచిపెట్టుకున్నదంతా బయటకొచ్చింది. రాధ బండారం మొత్తం బయటపెట్టింది లక్ష్మి.
లక్ష్మి తన గురించి, ఇలా చెప్తుందని రాధ అసలు ఊహించి ఉండదు. ఊహించి ఉండిఉంటే, జాగృతిని వీళ్ళ ఇంటికి పంపేది కాదు. ఈ వియ్యంకురాళ్ళిద్దరూ భిన్నధృవాలని, వారిద్దరికీ పడదన్న విషయం జాగృతికి తెలియటంతోపాటు, రాధ ఎలాంటిదో, తనని ఎందుకు ఇలా తయారుచేసిందో, ఎందుకు అబద్దాలు చెప్పమందో, లక్ష్మి గురించి ఎందుకు చెడుగా చెప్పిందో కూడా అర్ధమయ్యింది.
'ఈ ప్రయాణం మాకు సంతోషమైన షికారు కాకపోయినా, నాకు కనువిప్పు కలిగించింది. లక్ష్మిగారిని కలవడం నా మంచికే జరిగింది. రాధ గురించి నిజాలన్నీ బయటపడ్డాయి. బహుశా రాధ గురించి చెప్పటానికే, లక్ష్మిగారు నన్ను కలవాలనుకున్నారేమో!!
సమర్థ్ తో పెళ్ళై, ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. దాన్ని ఎవరూ మార్చలేం. సమర్థ్ మంచివాడు, పాపం తనకి కూడా ఇవన్నీ తెలిసి ఉండవు. అందరినీ భయపెడుతూ, చెప్పుచేతల్లో ఉంచుకుంటూ, తన స్వార్థం మాత్రమే చూసుకునే అత్తగారితో ఎలా ప్రవర్తించాలి అన్నది ఇక ఆలోచించాలి. నా తెలివితేటలు అత్తగారి దగ్గర ప్రయోగించాలి. ' అనుకుంది జాగృతి.
***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు



Comments