top of page

అవగాహన


'Avagahana' written by Lakshmi Madan

రచన : లక్ష్మి మదన్

తొలి సంధ్య కాంతులు పరుచుకుని ప్రకృతి పరవశిస్తుంది. పన్నెండు గంటల విరహానికి చరమ గీతం పాడి పులకిస్తున్న వేళ.


సూర్యుడి కన్నా ముందే మేల్కొన్న ధరణి వంటింట్లో చాయ్ పెడుతుంది. సూర్యోదయం కొంచెం ఆలస్యం అవుతుందేమో! ధరణి సమయంలో మార్పు ఉండదు. అన్ని పనులు అందరకీ సమకూర్చడం నిత్య కృత్యం. మరుగుతున్న నీటిలో చాయ్ పొడి, శక్కరి వేసి పాలు పోసి ఇంకాసేపు మరిగించి కప్పుల్లో పోసే లోగా..


" ధరణీ! ఓ ధరణి ! నా వైపు కన్నెత్తి కూడా చూడవు..నాకు చాయ్ ఇవ్వాలని ధ్యాసే లేదు..మొహం కడుక్కుని కూల పడ్డా" అని గొనుక్కో సాగింది.


" తెస్తున్నా నత్తయ్య" అంటూ తొందరగా స్టీల్ గ్లాస్ లో చాయ్ వొంపేసి నాలుగు చక్కెర గోలీలు వేసి పట్టుకెళ్ళింది. " ఇదిగో తాగండి అత్తయ్యా" అంటూ టీపాయ్ మీద పెట్టింది.


హాల్ లో దిన పత్రిక పట్టుకున్న పతి దేవులు ఒక్క చూపు చూసాడు. ఇంకా చాయ్ రాలేదనే సంకేతం అందుకున్న ధరణి కప్పు తీసుకెళ్ళి దానితో పాటు బిస్కెట్స్ అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళే సరికి తన చాయ్ చప్పున చల్లారి పోయింది. ఇంకా వేడి చేసుకునే సమయం ఓపికా రెండూ లేక గబ గబ తాగేసి స్నానానికి వెళ్ళింది.


కళ్ళ ముందున్న పనులు గుర్తొచ్చి స్నానం తొందరగా కానిచ్చి బయటకి వచ్చింది. అందులో రాత్రి నుండి కడుపు నొప్పి, నెలసరి వచ్చినప్పుడ ల్లా శులాలతో గ్రుచ్చినట్లు నొప్పి. రాత్రి నుండి టాబ్లెట్స్ వేసుకుంటున్నా నొప్పి బాధిస్తూ ఉంది. ఆ రోజుల్లో కనీసం పనులు లేకుండా దూరంగా కూర్చో పెట్టు విశ్రాంతి నిచ్చే వారు.


ఒక పక్క వంట చేస్తూ ఆలోచనల్లో పడింది. ఈ కడుపు నొప్పి చిన్నప్పటి నుండి వేధిస్తుంది. కడుపు నొప్పి తో మెలికలు తిరుగుతూ ఏడుస్తుంటే తన చుట్టూ కూర్చునే వాళ్ళు అమ్మా నాన్న అన్నయ్య మరియు అక్క.నాయనమ్మ ఏవో చిట్కా వైద్యం చేసేది అయినా తగ్గేది కాదు. తర్వాత ఇంగ్లీష్ మందులు వాడుతుంటే కాస్త ఉపశమనం కలిగేది. ఇంట్లో నే పడుకుని విశ్రాంతి తీసుకునేది. అన్ని అమర్చే అమ్మ ఇల్లు అది.ఇంకేం కావాలి. శానిటరీ నాప్కిన్స్ వాడకం ఇంకా రాలేదు..బయటకి వెళ్ళడానికి ఇబ్బాందిగా నే ఉండేది నాటి ఆడ పిల్లలకు.


ఆలోచన ల నుండి బయటకి వచ్చి మామ గారు గదిలో నుండి రావడం చూసి ట్రే లో చాయ్ కప్పు బిస్కెట్స్ పెట్టీ పట్టుకుని రాబోయే అంతలో ఆయన అరవడం మొదలు పెట్టాడు. ఇంకా చాయ్ ఇచ్చే దిక్కు లేదు అనుకుంటూ...తెచ్చాను మామయ్యా! అంటూ నెమ్మదిగా కప్పు టేబుల్ మీద పెట్టి వంటింట్లోకి వెళ్ళింది.


మనసంతా బాధ తో నిండి పోయింది. తనకు కూడా 50 ఏళ్లు వస్తున్నాయి. ఇంకా అర్ధం చేసుకోకుండా సూటి పోటి మాటలు అంటూనే ఉన్నారు. ధరణి పెళ్లి అయి అతగారింట్లో అడుగు పెట్టినప్పుడు అత్త గారి వయసు 40 సంవత్సరాలు. అప్పటినుండీ ఆవిడ వయసు మీరి పోయింది అంటూ కూర్చుని చేయించుకుంటున్నారు. అయినా పరవాలేదు .. కానీ రోజూ ఏదో ఒకటి అనడం బాధ పెట్టడం. భర్త కి ఇవేమీ పట్టవు ." ఓ మాట పెడితే ఏమయింది...పెద్ద మనిషి ఆ మాత్రం ఓర్చుకో లేవా " అని అరుస్తారు. ఆయనే అలా అంటే ఇంకా విలువ ఏముంది .


ఆడ వాళ్లకు నెలసరి ఎంత బాధగా ఉంటుందో మెనోపాజ్ ఇంకా భయంకరంగా ఉంటుంది. చాలా మంది మహిళలు రక రకాలుగా బాధ పడతారు. కొందరికి కోపం ఎక్కువగా వస్తుంది...కొందరికి ఏడుపు వస్తుంది...కొంత మందికి పిచ్చి కూడా పడుతుంది. ఇంట్లో భర్త సహకారం ఉంటే దీని నుండి బయట పడతారు. ధరణి కి ఈ మధ్య ఊరికే ఏడుపు రావడం..చేతిలో వస్తువులు విసిరి వేయాలని అనిపించడం... వేడి సెగలు ఒంట్లో రావడం జరుగుతుంది. ఆడ జన్మ నరకం అనిపిస్తుంది కొన్ని విషయాలలో.

ఇద్దరు కూతుళ్లు బెంగుళూర్ లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరికీ తల్లి అంటే వల్ల మాలిన ప్రేమ.


" ఇంకా ఎన్నేళ్లు మాటలు భరిస్తావు..తిరిగి జవాబు చెప్పు " అంటారు. కానీ అలా చేయడం సంస్కారం కాదని నవ్వి ఊరుకుంటుంది.


అందరి భోజనాలు అయ్యాక కొంచెం తీరిక దొరుకుతుంది

. అత్త మామలు నిద్ర పోతున్నారు . కడుపు నొప్పి కొంచెం తగ్గింది. పేపర్ తీసి చదువుతుంటే ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో ఉన్న కొత్త జంట గుర్తొచ్చారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ కలిసి పనులు చేసుకుని ఆఫీస్ కి వెళతారు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు ఉన్న వెంటనే రాజీ పడతారు. ఎపుడైనా ఒకసారి ధరణి వాళ్ళని పలకరిస్తుంది. వాళ్ల ప్రైవసీని డిస్టర్బ్ చేయడం తనకి ఇష్టం ఉండదు. వాళ్లు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి మాట్లాడి వెళతారు. వాళ్ళు వచ్చి రెండు నెలలు అవుతుంది. ఒక ఆదివారం రోజు గట్టి గట్టిగా వాళ్ల గొడవ వినిపించింది వెళ్లి తలుపు తట్టాలంటే అనుకుంది కానీ కానీ అలా చేయడం సంస్కారం కాదని ఊరుకుంది. మళ్లీ అలాంటి అరుపులే ఈరోజు వినిపిస్తున్నాయని ధరణి వింటుంది కాసేపయ్యాక అరుపులు పెద్దవయ్యాయి అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది ఇంకా ఆగలేక వెళ్లి తలుపు తట్టింది. ఆ అబ్బాయి తలుపు తీశాడు. ధరణి అడిగింది "లోపలికి రావచ్చా బాబు" అని,


"రండి అమ్మ "అని పిలిచాడు కానీ మొహం చిన్నబోయింది అమ్మాయి మాత్రం లోపల గదిలో తలుపు వేసుకుని ఉంది


"భోజనం చేసారా బాబు" అని అడిగింది


"ఆ చేసాము అమ్మ "అన్నాడు


"అమ్మాయి ఏం చేస్తుంది" అని అడిగింది


"కాస్త తలనొప్పిగా ఉంటే పడుకుంది "అన్నాడు


కానీ అది అబద్ధం అని తెలుస్తుంది. ఒక ఐదు నిమిషాలు కూర్చుని లోపలికి వచ్చేసింది ధరణి. కానీ మనసులో మాత్రం వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని ఆలోచిస్తుంది. తెల్లవారి ఎదురింటి కొత్తజంట ఆఫీస్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు, ఆ అమ్మాయి బయటికి వచ్చి కుండీలో మొక్కలకు నీళ్ళు పోస్తుంది. వెంటనే ధరణి వెళ్లి


"ఏమ్మా! తలనొప్పి తగ్గిందా" అని అడిగింది


"తగ్గిందా అమ్మ "అని చెప్పింది


"మరి ఇంకా నీరసంగా ఉన్నావ్ ఏంటి?" అని అడిగింది ధరణి


ఆ అమ్మాయి కొంచెం సంకోచిస్తూ" పీరియడ్స్ వచ్చాయి అమ్మ" అంది.


"అలాగా రెస్ట్ తీసుకోమ్మా! పనులు ఎక్కువ చేయకు" అని చెప్పింది.


"సరే "అని ఆ అమ్మాయి చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోయింది


ఇంట్లోకి వచ్చాక ధరణికి అర్థమైంది వాళ్ళ గొడవకి కారణమేంటో


సాయంత్రం కూరగాయల కోసం బయటకు వెళ్లిన ధరణికి ఆ ఎదురింటి అబ్బాయి కనిపించాడు వెంటనే" బాబూ సాయంత్రం ఒకసారి డాబా పైకి రాగలవా "అని అడిగింది,


"ఎందుకు "అనే సందేహం అతని మొహం లో కనిపించింది


వెంటనే ధరణి" నాకు ఒక చిన్న సహాయం కావాలి అందుకోసం పిలుస్తున్నాను ఏమీ అనుకోకు" అని చెప్పింది


"సరే అమ్మా" అని అతను వెళ్ళిపోయాడు.


సాయంత్రం కొంచెం ముందుగానే డాబా పైకి వెళ్ళింది అప్పటికే ఎదురింటి అబ్బాయి అక్కడ నిలబడి ఉన్నాడు


"ఓ వచ్చేసావా!" అని నవ్వుతూ వెళ్ళింది అక్కడ ఉన్న సిమెంటు బెంచీ మీద కూర్చుని అబ్బాయిని కూర్చోమని చెప్పింది.


కూర్చున్నాక మొదలు పెట్టింది ముందుగా వారి ఇంటి విషయాలు అడిగింది నెమ్మది నెమ్మదిగా అతనికి వాళ్ళిద్దరి మధ్య వచ్చే గొడవ గురించి మాట్లాడింది అతను అన్నాడు "ఒక్కసారి గట్టి గట్టిగా అరుస్తుంది అప్పుడు చాలా కోపం వస్తుంది నాకు" అని అన్నాడు "మిగతా సమయాల్లో బాగానే ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు అప్పుడప్పుడు అరుస్తుంది అది తప్ప తనలో ఎలాంటి తప్పు లేదు" అని అన్నాడు.


అప్పుడు ధరణి చెప్పింది "ఆడవాళ్లలో శారీరకమైన మార్పులు చాలా వస్తాయి అది నెలసరి సమయంలో వాళ్ల లో ఎన్నో ఇబ్బందులు వస్తాయి అలాంటప్పుడు కొందరికి కోపం కొందరికి దుఃఖం కొందరికి ఆవేశం ఇలా రకరకాలుగా మార్పు వస్తుంది ఇది ఇంట్లో భర్త సహకారం ఉంటే దానిని అధిగమించి మెల్లగా మార్పు చెందుతారు . మా రోజుల్లో అర్థం చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు కాదు కాబట్టి మేము ఇబ్బందులు పడ్డాము పడుతున్నాము. కానీ మీరు మీరు చదువుకున్న వాళ్లుఅన్నింట్లో అవగాహన ఉన్న వాళ్ళు కాబట్టి ఇది అర్థం చేసుకుంటే మీరు సంతోషంగా ఉండగలుగుతారు "అని చెప్పింది.


వెంటనే ఆ అబ్బాయికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

" మీరు చెప్పింది నిజమే నేను అర్థం చేసుకోలేకపోయాను నెలలో ఒకసారి మాత్రం ఇలా జరుగుతుంది కొంచెం నేను ఆలోచించి ఉంటే ఇలా అయ్యేది కాదు ఇకనుండి ఆ సమయంలో తనను నేను సంతోషంగా ఉంచుతాను అని ధరణి చేతులు పట్టుకుని థాంక్స్ అమ్మా! అన్నాడు.


ధరణి చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది ఇద్దరూ ఎవరి ఇళ్లల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లో కి వెళ్ళాక అనుకుంది నాలా మరొక స్త్రీ బాధపడకూడదు సంతోషంగా ఉండాలి కొందరైనా తన వల్ల సంతోషంగా ఉంటే తనకు ఎంతో తృప్తిగా ఉంటుంది .

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.



88 views0 comments

Comments


bottom of page