'Avunu Nenu Transgendre Ne'- New Telugu Story Written By Sheik Najeer
'అవును నేను ట్రాన్స్ జెండర్ నే' - తెలుగు కథ
రచన : షేక్ నజీర్
‘హలో కుమార్! ఏంట్రా బాబూ ఫోన్ చేస్తూనే ఉన్నావు? వస్తున్నాను రా. ఇదిగో ఇప్పుడే సికింద్రాబాద్ స్టేషన్ లో ఉన్నాను. ట్రైన్ టైం అవుతుంది.. వస్తున్నాను. ట్రైన్ కదిలిన తర్వాత మెసేజ్ పెడతాను. వుంటాను రా. ‘
అవును మీకు చెప్పలేదు కదూ... నా పేరు అశోక్. నేను విజయవాడ వెళుతున్నాను. నా ఫ్రెండ్ కుమార్ అక్కడ ఉంటాడు . చాలా సంవత్సరాలు అవుతుంది వాడు, నేను కలుసుకొని. చిన్నప్పుడు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నాం.
వాళ్ళ నాన్నకు గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల ట్రాన్స్ఫర్ అయి అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. వాడు దూరమైన ఆరోజు నా మనసును ఎవరో వేరు చేస్తున్నట్టుగా ఏవో పిచ్చి ఆలోచనలతో ఆరోజు చాలా బాధపడి ఏడ్చాను కూడా. నన్ను చూసి వాడు కూడా ఏడ్చాడు పిచ్చి వెధవ.
సరేలెండి, మా రామాయణమంతా చెప్పే టైం లేదు కానీ చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ కుమార్ ని కలవడానికి వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా సంతోషం వెలకట్టలేనంత ఉప్పొంగి పోతున్నాను.
అక్కడ వాడు కూడా నేను వస్తున్నాను అంటే వంద సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు . మళ్లీ ఏదో మెసేజ్ పంపించాడు, చూస్తాను ఉండండి.
'జాగ్రత్తగా రారా బాబు…. ముందే కరోనా.. ముఖానికి మాస్క్, శానిటైజర్ దగ్గర పెట్టుకో.
( చూసారు కదండీ నా జాగ్రత్తలు కూడా వాడే చెప్పేస్తున్నాడు. )
సరేనండి, ట్రైన్ వచ్చింది . అందరికీ చెప్తున్నాను . నేను విజయవాడ వెళ్లి వస్తాను. బై, నమస్కారమండీ.
“హలో కుమార్, ట్రైన్ వచ్చింది. సీట్ లో కూర్చుని ఫోన్ చేస్తున్నాను”.
“సరే రా అశోక్ .జాగ్రత్తగా రా. వుంటాను.” అని వాడు ఫోన్ పెట్టేశాడు.
ట్రైన్ కదిలింది నా పక్క సీట్ లోనే ఒక పెద్దాయన దువ్వెనతో మీసాలు దువ్వుతూ ఉన్నాడు.
పక్క సీట్లో ఎవరినో చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ మురిసిపోతున్నాడు.
వెనకాల సీట్లోనుంచి ఎవరో రంగస్థలం సినిమా నుండి పాట పెట్టారు(ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే ) అనే పాట వినిపిస్తుంది. ఆ పాటలో లీనమైపోయాడు ఆ పెద్దాయన. కొంత సమయం కాగానే ఈ ముసలాడు అంతగా చూస్తున్నాడు ఎవర్ని అని తిరిగి చూశాను.
లేత గులాబీ రంగు చీర కట్టుకుని నుదుటి పై కుంకుమ పెట్టుకోని జడలో మల్లెపూల మాలను పేర్చుకోని, పాదాలకు పారాణి పూసుకుని నిండు ముత్తైదువులా మేరిసిపోతుంది.
ఆమె నన్ను చూసేసరికి, అర్థం చేసుకొని ఏదో నవల చదువుకుంటూ ఉండిపోయాను.
నెక్స్ట్ స్టేషన్ రాగానే ఆమె స్నేహితురాళ్ళు ఎవరో వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.
మాటలు పూర్తవ్వగానే నేరుగా వాళ్ళిద్దరూ ఆ ముసలాయన దగ్గరికి వస్తున్నారు. ఆ ముసలాయన నీళ్లు మింగుతూ భయపడుతూ ఉన్నాడు .
ఆ పెద్దాయనను చూసిన ఆమె దగ్గరకు వచ్చి రెండు చేతులతో చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతుంది.
అది చూసిన ఆ ముసలాయన షాక్ అయిపోయి కొద్దిసేపు మాట రాలేదు.
ముసలాయన మత్తు వదిలిపోయి ‘నువ్వు... నువ్వు ….’అని మూలుగుతున్నాడు.
ఆమెకు కోపం వచ్చి ‘నువ్వు నువ్వు ఏంటి ?’ అని అంది.
మీరు ట్రాన్స్ జెండరా అన్నాడు పెద్దాయన.
"అవును. నేను ట్రాన్స్ జెండర్ నే.." అని తిరిగి సమాధానం చెప్పింది.
పాపం ముసలాయన ఏం చేయాలో తోచక ఆమె చేతిలో 20 రూపాయల నోటు పెట్టి తలపై తుండు గుడ్డ కప్పుకొని ముఖానికి మాస్క్ వేసుకొని నీరసంగా కూర్చుండిపోయాడు పాపం.
నీరసపడి పోయిన ఆ ముసలాయన ముఖాన్ని చూడలేక, నవ్వు ఆపుకోలేక, బాత్రూంలోకి వెళ్లి నవ్వుకొని వచ్చాను.
కొంత సమయం తర్వాత ఒక ఆడ కూతురు ఏడుపు వినిపిస్తోంది. అందరూ చూస్తున్నారు. కరోనా భయంతో ఎవరూ దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించడం లేదు.
నేను లేచి చూశాను. నిండు గర్భవతి. నొప్పులను తట్టుకోలేక, తన భర్త ని పట్టుకొని ఏడుస్తూ ఉంది.
వాళ్ళ తోడు ఎవరూ లేరు . భార్యాభర్తలే ఉన్నారు. భర్త లేచి తన భార్యను సీట్లో పడుకోబెట్టి, అందర్నీ కాళ్లావేళ్లా పడుతున్నాడు.
“అమ్మా ! మాకు కరోనా ఏమీ లేదు . కాస్త సహాయం చెయ్యండి” అని బతిమిలాడుతూ ఏడుస్తున్నాడు పాపం. కానీ ఎవరూ దగ్గరికి రానివ్వటం లేదు.
హిజ్రాలు ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి అందులో ఉన్న జనాలను తిట్టేస్తూ 'మీ చెల్లో,అక్కో,ఇలాంటి పరిస్థితిలో వుంటే యిలాగే చేస్తారా? ‘ అని నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. కాని ఎవరూ తిరిగి సమాధానం చెప్పటం లేదు.
హిజ్రాలు ఇద్దరూ గర్భవతిని బాత్ రూమ్ దగ్గరకు తీసుకొచ్చి, రెండు దారులను దుప్పటి చాటువేసి ఆమెకు ధైర్యం చెప్తున్నారు “నీకేం కాదు చెల్లెమ్మా! మేమున్నాము “ అని అక్కడ పడుకో బెట్టారు.
ఆమె భర్త ఏడుస్తూ ఎందరో దేవుళ్లను వేడుకుంటున్నాడు, నా భార్యకు ఏమీ కాకూడదు, నీదే భారం స్వామీ అని.
కొంత సమయం అవ్వగానే పసి పాప ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు స్వరం విన్న తండ్రికి ధైర్యం వచ్చి కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు.
ఆమె పసి బిడ్డను ఎత్తుకుని వచ్చి ‘బావా ! , ఇదిగో అక్కకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. అక్కడ తను అక్కకు చీరమార్చి తీసుకొని వస్తుంది’ అని అనేసరికి అతను హిజ్రా కాళ్లపై పడి ‘ మీరు లేకుంటే నా భార్య ఏమైఉండేదో, మీరు దేవతలా వచ్చి తన ప్రాణం కాపాడి, మరో ప్రాణాన్ని నిలబెట్టారు. మీకేమిచ్చి రుణం తీర్చుకోమంటావు?’ అని జేబులో నుంచి ఐదు వేల రూపాయలు వాళ్ల చేతిలో పెట్టాడు.
‘బావా ! నువ్విచ్చే ఆ డబ్బు కోసం ఆశించలేదు. అక్క ఏడుస్తుంటే మా మనసు కరిగిపోయి సాటి స్త్రీగా మరో అబలకు కాన్పు బోసినందుకు చాలా సంతోషంగా ఉంది. డబ్బుతో మాత్రం ముడి పెట్టకండి బావగారూ. ‘
ధైర్యసాహసాలతో ఇద్దరి ప్రాణాలను కాపాడిన హిజ్రాలను ట్రైన్ లో ఉన్న జనాలందరూ చప్పట్లతో ప్రోత్సహిస్తున్నారు.
ఆ ప్రోత్సాహ ప్రశంసలో విజయవాడ రానే వచ్చింది. ట్రైన్ దిగి నడుచుకుంటూ వస్తుంటే నా స్నేహితుడు కుమార్ నాకు ఎదురుగా నిల్చొని ‘ఏంట్రా అశోక్ ‘అని నా భుజంపై చెయ్యి వేసేసరికి వాడిని చూసిన నా కళ్ళు ఆనందంతో పరవశించి పోయాయి.
|
***
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
Comments