top of page

అయ్యవారిని చెయ్యబోతే కోతి అయింది'Ayyavarini Cheyyabothe Kothi ayindi' - New Telugu Story Written By Madduri Bindumadhavi 

Published In manatelugukathalu.com On 20/01/2024

'అయ్యవారిని చెయ్యబోతే కోతి అయింది' తెలుగు కథ

రచన: మద్దూరి బిందుమాధవి 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


పుస్తకాలు, వార్తా పత్రికలు బాగా చదివే అలవాటున్న అలివేలమ్మ.. బాగా వెలుతురు వచ్చే చోట కూర్చుని కూడా పుస్తకాన్ని రక రకాల భంగిమలోకి మార్చి.. కంటికి బాగా దగ్గరగా తెచ్చి అటు వంగి.. ఇటు వంగి ప్రింట్ కనపడక చదవటానికి అవస్థ పడుతున్నది. 


అటుగా వచ్చిన కూతురు శాంత.. "ఏంటమ్మా అంత కష్టపడుతున్నావ్? పుస్తకం ప్రింట్ బాగా లేదా.. లేక నీ కళ్ళ జోడు పవర్ మారిందా" అన్నది. 


"అయినా అంత కష్టపడి చదవకపోతే.. హాయిగా కాసేపు పడుకోరాదూ" అన్నది. 


"పగలు పడుకుంటే రాత్రికి నిద్ర పట్టదు. అయినా.. చదవటం అనేది లేకపోతే నాకు వెలితిగా ఉంటుంది" అన్నది. 


"నేను చూశాను కాబట్టి తెలిసింది. రోజూ ఇలాగే చదువుతున్నావా?" అని విసుక్కుని "ఈ మధ్య నిన్ను కళ్ళ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి చాలా కాలం అయింది. క్యాటరాక్ట్ పెరిగిందేమో. ఆపరేషన్ చేయిద్దాం. వచ్చే శని వారం మాకు సెలవు. కళ్ళ డాక్టర్ దగ్గరకి వెళదాం" అని చెప్పి ఆఫీసుకి బయలు దేరింది. 


@@@@

"అమ్మ గారికి శుక్లాలు పెరిగాయమ్మా. వెంటనే సర్జరీ చెయ్యాలి. అమ్మగారికి డయాబెటిస్ లేదు కదా? అయినా బ్లడ్ టెస్ట్ చేసి.. ఇతర పారామీటర్స్ కూడా ఒక్క సారి చెక్ చేసి వచ్చే వారం చేసేస్తాను" అన్నారు అలివేలమ్మని చూసిన కళ్ళ డాక్టర్ వివేక్. 


"ఆపరేషన్ చెయ్యక తప్పదా? నాకు భయం. ఇంక పుస్తకాలు చదవనులే. రేడియో వింటూ కాలక్షేపం చేస్తాను" అన్నది అలివేలమ్మ కూతురితో.. చిన్న పిల్ల లాగా. 


"అమ్మా.. నీ చిన్నప్పుడు కాలిలో ముల్లు తీసినట్టు.. ఈ రోజుల్లో శుక్లాల ఆపరేషన్ చేసేస్తున్నారు. అయినా.. సమస్య చదవటం, చదవకపోవటం కాదు. శుక్లం అనేది అదనంగా నీ కంట్లో పెరిగే ఒక పొర. అది ఆపరేషన్ ద్వారా తియ్యకపోతే.. అది చిరిగి కంట్లో వేరే భాగాల్లోకి ఆ ముక్కలు వెళ్ళి సెప్టిక్ అవుతుంది. "


"ఆపరేషన్ అంటే ఏదో కత్తులతో కోసేస్తారనుకుంటున్నావు. కానీ లేజర్ విధానంతో తేలికగా అరగంటలో ఆ పొర తీసేస్తారు. గంటలో ఇంటికొచ్చెయ్యచ్చు" అని చిన్న పిల్లని లాగా బుజ్జగించి.. ఆపరేషన్ కి తల్లిని సమాయత్తం చేసింది.. శాంత. 


@@@@

"అమ్మా నీ బ్లడ్ షుగర్.. ఇతర రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చాయిట. రేపు ఆపరేషన్ చేస్తానని, ఉదయం 7. 00 కల్లా వచ్చెయ్యమని డాక్టర్ గారు చెప్పారు" అన్నది శాంత సాయంత్రం ఆఫీసు నించి వచ్చి. 


భయంతో ఆ రోజు రాత్రి అలివేలమ్మకి కంటి మీద కునుకు లేదు. 


ఉదయమే లేచి.. స్నానం చేసి.. దేవుడికి దీపం పెట్టుకుని "పరమేశ్వరా.. నీకు తెలుసు కదా నాకు ఆపరేషన్ అంటే భయమని. ఏ సమస్యా లేకుండా ఇంటికి వచ్చేట్లు ఆశీర్వదించు. అన్నీ సవ్యంగా జరిగితే.. ఇక నించి సోమవారాలు కూడా రాత్రి ఉపవాసం ఉంటాను" అని దేవుడికి ఒక అర్జీ పెట్టుకుని వచ్చింది. 


7 గం లు అయ్యే సరికి హాస్పిటల్లో ఉన్నారు. 

ఆ రోజు చెయ్యబోయే ఆపరేషన్ల లిస్టులో అలివేలమ్మది నాలుగో నంబర్. 

ఒక నర్స్ వచ్చి అలివేలమ్మకి కంట్లో డ్రాప్స్ వేసి.. ఆమె రికార్డ్ అంతా డాక్టర్కి అందజేసి.. హాస్పిటల్ వారి గౌన్ ధరింపజేసి.. లోపలికి తీసుకెళ్ళింది. 


అనస్థీషియా ఇచ్చి "పడుకోండమ్మా.. నేను మళ్ళీ వచ్చి థియేటర్ లోకి తీసుకెళతాను" అని చెప్పింది. 


ఎనిమిది అయింది.. తొమ్మిది దాటింది.. పది.. పదకొండో గంట కూడా కొట్టింది. నర్స్ కానీ, మరి ఏ ఇతర సిబ్బంది కానీ అలివేలమ్మని పట్టించుకోలేదు. ఆ వైపుకి రాలేదు. 

అలివేలమ్మలో భయంతో కూడిన అసహనంతో గుండె కొట్టుకునే వేగం పెరిగింది. 


"అమ్మా ఇక్కడెవరైనా ఉన్నారా? ఓ నర్సమ్మ.. నా కంటికి మూడు గంటల క్రితం మత్తు మందు ఇచ్చి ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళింది. ఇంత వరకూ అజ పజ లేదు" అని గట్టిగా అరిచి పిలిచింది. 


ఓ ల్యాబ్ అటెండర్ లాంటి వ్యక్తి వచ్చి "మామ్మ గారూ.. ఇక్కడ ఎవరూ లేరు. ఎవరో అర్జెంట్ కేసుట.. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. కొంచెం ఓపిక పట్టండి.. వచ్చేస్తారు" అని చెప్పి వెళ్ళాడు. 


బయట శాంతకి టెన్షన్ పెరిగిపోతోంది. అమ్మని ఏడున్నరకే లోపలికి తీసుకెళ్ళారు. ఏ ఆరోగ్య సమస్యా లేని వ్యక్తికి ఆపరేషన్ చెయ్యటానికి ఇంత సేపు పడుతున్నదేమిటి? అసలే ఆవిడకి భయం! రానంటుంటే నేనే బలవంతంగా తీసుకొచ్చాను. దానికి తగ్గట్టే ఇంత సేపు చేస్తున్నారేమిటి" అని ఒకటే గాభరాతో పైకి చూసి "దేవుడా ఏమిటి ఈ పరీక్ష? పెద్దావిడని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి" అని రెండు చేతులు ఎత్తి మొక్కింది. 


ఇక లాభం లేదని.. అక్కడ కౌంటర్ దగ్గరకి వెళ్ళి.. "నేను పేషెంట్ అలివేలమ్మ గారి అమ్మాయిని. మా అమ్మగారిని ఏడున్నరకి లోపలికి తీసుకెళ్ళారు. ఇంత వరకు రాలేదు. ఏమయిందో కనుక్కుని చెప్పండి" అన్నది దిగులుగా. 

లోపలి కి ఫోన్ చేసి విషయం తెలుసుకున్న కౌంటర్లోని ఆవిడ శాంతని దగ్గరగా పిలిచి "అమ్మా.. మీ అమ్మగారికి ఈ రోజు ఆపరేషన్ చెయ్యట్లేదుట. ఆమెని బయటికి తీసుకు రాగానే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు" అన్నది నెమ్మదిగా. 


"అదేమిటి.. ఆమెని ఉదయమే అనస్థీషియా ఇచ్చి రెడీ చేశారు కదా! ఆపరేషన్ ఎందుకు చెయ్యరు" అన్నది శాంత గట్టిగా. 


"మీ అమ్మగారిని సరిగా థియేటర్ లోకి తీసుకెళ్ళే టైం కి మినిస్టర్ గారి భార్య వచ్చారు. ఆమెకి నిన్న చెయ్యాల్సి ఉన్నది. కానీ ఆమె ఏదో ఫంక్షన్ కి వెళ్ళాలని నిన్న రాలేదు. ఈ రోజు వచ్చి.. నా ఆపరేషన్ నిన్ననే చెయ్యటానికి నిర్ణయించారు కాబట్టి.. ఎలా అయినా నాది ముందు చెయ్యాలి అని పట్టుబట్టారు. "


"అటు చూస్తే మినిస్టర్.. ఏం గొడవలు అవుతాయో.. ఇటు మీ అమ్మగారికి అనస్థీషియా ఇచ్చి రెండు గంటలు అయింది. పెద్దావిడ ఈమెని ఇంకా కూర్చోబెడితే అనస్థీషియా పవర్ ఉండదు.. అని ఈ రోజు పంపేస్తానన్నారు. డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. మీతో ఫోన్ లో మాట్లాడతానన్నారు. పది నిముషాలు కూర్చోండి. బయటికి రాగానే అమ్మగారిని తీసుకెళ్ళచ్చు" అని బుజ్జగింపుగా చెప్పి తన పని అయిపోయిందని ఆవిడ వెళ్ళిపోయింది. 


అనస్థీషియా ఇచ్చి.. ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళాక ఆపరేషన్ చెయ్యకుండా వెనక్కి పంపటం ఏమిటి అని ఈ పరిస్థితి శాంతకి.. కొత్తగా.. వింతగా ఉండి కొంత అయోమయానికి లోనయింది. 


"హమ్మయ్యా బతుకు జీవుడా.. ఆపరేషన్ ఆగిపోయింది. దేవుడు నా మొర విన్నాడే అమ్మాయ్" అన్నది బయటికి వచ్చిన అలివేలమ్మ.. గుండెల నిండా గాలి పీల్చుకుని. 


"ఏడ్చినట్టుంది.. వాళ్ళు మన చేత డబ్బు కట్టించుకుని, నీకు అనస్థీషియా ఇచ్చి లోపలి దాక తీసుకెళ్ళి.. వెనక్కి పంపిస్తే.. నీ కంటికి ఏం సమస్య వస్తుందో అని నేను దిగులు పడుతుంటే.. నువ్వు ఆపరేషన్ అవలేదని సంతోషిస్తున్నావా" అని తల్లిని విసుక్కుంది. 

@@@@

మళ్ళీ నిర్ణయించిన ప్రకారం నాలుగు రోజుల్లో అలివేలమ్మకి క్యాటరాక్ట్ ఆపరేషన్. 

ఆ రోజు.. షరా.. ఆలివేలమ్మ దేవుడికి దండం పెట్టుకుని కూతురితో హాస్పిటల్ కి బయలు దేరింది. 

అనుకున్న ప్రకారం అలివేలమ్మ క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది. 


వాడాల్సిన మందుల లిస్ట్.. వాడ వలసిన విధానం చెప్పి ఆమెని ఇంటికి పంపించారు. 


మూడో రోజు హాస్పిటల్ కి సమీక్షకి రమ్మన్నారు. 

"రోజంతా మందులు వేస్తూ ఉండటం వల్లనేమో.. చూపు ఇంకా సరిగా రాలేదు" అన్నది అలివేలమ్మా గారు శాంతతో. 

ఆ మాటే డాక్టర్ తో అన్నది శాంత. 


"మీరు మందులు పూర్తిగా వాడి.. వారం తరువాత రండమ్మా" అని జరిగిన తప్పు అర్ధమైన డాక్టర్ పైకి ఏమి అనకుండా.. వారిని పంపించేశాడు. 


వారం అయ్యాక కళ్ళు పరీక్షించి.. "అమ్మగారి కంటి నరాలు దెబ్బ తిన్నాయమ్మా. ఇంతకంటే ఆమె చూపు మెరుగవదు. చెయ్యగలిగింది కూడా ఏమి లేదు" అని చెప్పి "పది రోజుల తరువాత వచ్చి కళ్ళజోడు వేయించుకోండి" అని చెప్పాడు. 

@@@@

అలివేలమ్మలో అదివరకటి హుషారు తగ్గింది. 

ఎక్కువ సేపు పడుకుని ఉంటోంది. 

పుస్తకాలు చదివే పరిస్థితే లేదు. 

ఒక రోజు అలివేలమ్మని చూడటానికి అక్క కొడుకు సారధి వచ్చాడు. 


"పిన్నీ.. ఏంటి అదివరకంత హుషారుగా లేవు. ఒంట్లో బావుంటోందా"అని అడిగాడు. 


శాంత.. అలివేలమ్మ కంటి ఆపరేషన్ ప్రహసనం అంతా పూస గుచ్చినట్టు సారధి తో చెప్పింది. 

"నా ఫ్రెండ్ ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు. అక్కడికి తీసుకెళ్ళి చూపిద్దాం" అన్నాడు. 


అలాగే నాలుగు రోజుల తరువాత సారధి ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళారు. 

అతను చూసి "పిన్ని గారికి ముందు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చెయ్యకుండా వదిలేసి.. నాలుగు రోజుల్లో మళ్ళీ అనస్థీషియా ఇచ్చినందువల్ల కంటి నరాలు దెబ్బ తిన్నాయి. ఆమె చూపు కి సంబంధించి ఇప్పుడు చెయ్యగలిగేది ఏమి లేదు" అన్నాడు. 


"శాంతా.. జరిగిన దుర్మార్గం తెలిసింది కదా! కావాలంటే మనం ఆ హాస్పిటల్ వాళ్ళ మీద కేస్ వెయ్యచ్చు" అన్నాడు. 


"కేసు మాట దేవుడెరుగు. ఇప్పుడు అమ్మ పని 'అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లుంది'. 


"పాపం ఆవిడ ఆపరేషన్ వద్దు అంటుంటే నేనే బలవంత పెట్టి తీసుకెళ్ళాను. క్యాటరాక్ట్ కి ఆపరేషన్ చెయ్యక తప్పదనుకో! కానీ ఆవిడ భయానికి తగ్గట్టే ఇలా అయింది. పాపం ఎప్పటికీ సరి దిద్దలేని తప్పు జరిగింది. ఇందులో నా తప్పేం లేకపోయినా గిల్టీ గా ఉంది అన్నయ్యా" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. 


"అలాంటి తప్పు చెయ్యటానికి సిద్ధపడిన హాస్పిటల్ వాళ్ళు తాము తప్పు చేశామని ఒప్పుకుంటారా? అవతలి పార్టీ రాజకీయ నాయకుడు. అతని జులుం ని వీళ్ళు నిరూపించలేక మననే ఇబ్బంది పెడతారు. కేసులు పెడితే.. ఏళ్ళూ.. పూళ్ళూ గడుస్తుంది. కోర్టుల చుట్టూ తిప్పుతారు. మన పనులు మానుకుని తిరగాలి. మన దుంప తెగుతుంది" అన్నది. 

"మధ్యతరగతి వాళ్ళు ఇలా చూసీ చూడనట్టు పోతూ.. తమకి ఎంత నష్టం జరిగినా కంప్లెయింట్ ఇవ్వలేనందువల్లే రాజకీయ నాయకుల ఆగడాలకి అంతు ఉండట్లేదు. సరే నీ ఇష్టం.. ఏదైనా సహాయం కావాలంటే మాత్రం ఫోన్ చెయ్యి" అని చెప్పి వెళ్ళాడు సారధి. 

@@@@

పిండి తో కానీ, మట్టితో కానీ.. ఆ బొమ్మకి సంబంధించిన అచ్చు అందుబాటులో లేకపోతే.. కొందరు చేతితో అవలీలగా బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. 


అలా చేసేటప్పుడు.. ఒక షేప్ అనుకుని మొదలు పెట్టి.. తయారయ్యాక చూస్తే 'అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి' జరుగుతూ ఉంటుంది ఒక్క్కోసారి. 


అలాంటప్పుడు ఈ సామెత వాడుతూ ఉంటారు. 


***

మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
106 views0 comments

Comments


bottom of page